top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
pustaka-parichayaalu.jpg
alanati.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
paatasanchikalu.jpg
maagurinchi.jpg

సంపుటి 8  సంచిక  1

జనవరి-మార్చి 2023 సంచిక

rachanalu.jpg

“దీప్తి” ముచ్చట్లు

మనోవైరి

Deepthi Pendyala.jpg

దీప్తి పెండ్యాల

"నిన్ను నువ్వు చూసుకోవాలని నీకెప్పుడూ అనిపించలేదా, ఛాయా?" ఉన్నట్టుండి ఎరికా అడిగిన ప్రశ్న విని, ఎరికా వైపు చూసాను.

ఈ వారం వంట బాధ్యత ఎరికాదే. వంటగదిలో నచ్చిన పాటలు వింటూ భోజనం సిద్ధం చేస్తున్నదల్లా, పని ఆపి మరీ అడిగింది.

"చూసుకుంటూనే ఉంటాము కదా? అద్దంలోనూ, ఫోటోల్లోనూ, సెల్ఫీల్లోనూ?" చెబుతూనే, తిరిగి పరీక్షలకై చదువుతున్న పుస్తకాల్లోకి తల దూర్చాను.

"అహా. అలా కాదు. నీ నుంచి నువ్వు వేరుబడి, నువ్వెలా ఉంటావో చూసుకోగలిగితే?" ఎరికా రెట్టించింది. ఆమె మొహం గంభీరంగా ఉండటంతో తమాషాకి అడగట్లేదని అర్థమయింది.

"నేను పోయాకే సాధ్యం కదా అది?" విచిత్రంగా ఎరికా వైపు చూస్తూ అన్నాను.

"జీవించి ఉండగానే చూసుకోవటం సాధ్యమే అయితేనో?"

ఎరికా ప్రశ్నకి నా వద్ద జవాబు లేదు. కానీ, ఎరికాకి ఈ కొత్త ఆలోచన ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలనిపించింది. మేమిద్దరం యూనివర్శిటీ ఆఫ్ టెక్సస్, శాన్ ఆంటోనియా లో మూడవ సంవత్సరం చదువుతూ, కాలేజీకి దగ్గర్లోని ఈ అపార్ట్మెంట్ ని మరో స్నేహితురాలు రుద్రాణి తో కలిసి షేర్ చేసుకుని ఉంటున్నాము. ఒకే వీధిలో ఉంటూ, ఒకే హైస్కూల్ లో చదివి, ప్రస్తుతం ఒకే కాలేజీలో చదువుతున్న మా ముగ్గురి మధ్యే కాక మా కుటుంబాల మధ్య స్నేహమూ అరమరికలు లేనిదే. అందుకే ఎరికాకి వచ్చిన ఈ కొత్త ఆలోచన మూలాలూ నాకు కాస్త తెలిసినట్టనిపించినప్పటికీ, పూర్తిగా కనుక్కోవాలనే ఆసక్తి కలిగింది.

 

పుస్తకం మూసేసి, ఎరికాని చనువుగా అద్దం వద్దకి తీసుకెళ్ళాను. అద్దంలో ఎరికాని చూపుడు వేలితో చూపిస్తూ అన్నాను. "ఆ ఎరికా, నా ముందున్న ఎరికా ఒకేలా ఉన్నారు. నువ్వలాగే ఉన్నావు" అని రూఢీగా అన్నాను.

ఎరికా పెదవి విరిచింది. "ఉహూ, నేనెక్కడయినా ఉన్నప్పుడు, ఎవరితోనయినా మాట్లాడుతున్నప్పుడు వేరేవారి కళ్ళలో నుంచి లైవ్ గా ఎలా కనబడతానో చూడాలని ఉంది."

 

"దానికేం, నువ్వు ఏ కోణంలో అడిగితే ఆ కోణంలో వీడియో తీస్తాను. అందులో చూసుకోవచ్చు." అదో పెద్ద సమస్య కాదన్నట్టుగా చెప్పాను.

"అది కాదు ఛాయా, నీకు అర్థం కావట్లేదు. వీడియోల్లో, ఫోటోల్లో, అద్దాల్లో నేను చూసుకునే రూపంతో నన్ను నేను పోల్చుకోలేకపోతున్నాను. నేనెవరు? ఎలా కనబడతాను? ఎలా ప్రవర్తిస్తాను? ఇదంతా నా కళ్ళలోంచి నన్ను నిజరూపంగా చూసుకోవాలనుంది. వీలయితే వేరెవరి కళ్ళనుంచయినా చూసుకోగలిగితే మరీ బాగుండనిపిస్తుంది." ఎరికా మాటలు అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. ఎరికా మాత్రం తిరిగి వంటగదిలోకి వెళ్ళి అప్పటికే చక్కగా ఉడికిన పాస్టాని కాలాండర్ లో వేస్తూ, మరో పక్క సాస్ తయారు చేస్తూ ఉంది.

 

"కానీ, అదెలా సాధ్యం, ఎరికా?" ప్రశ్నలా అడిగినప్పటికీ, సాధ్యపడదన్న విషయం ఆమె గుర్తించిందన్న విషయాన్ని ధృవపరుచుకోవాలనుకున్నాను.

 

"సాధ్యమే. నీకు రుద్రాణి క్లాస్ లో ఉండే బ్రాడీ గుర్తున్నాడా? ఆ అబ్బాయి గత వేసవిలో న్యూ ఆర్లీన్స్ లో సైకిక్ గా పార్ట్ టైం ఉద్యోగం చేసాడు. అతను పనిచేసిన చేసిన చోటే సైకిక్ మీడియం ఎక్స్పర్ట్ ఉందట." ఎరికా అప్పటికే కనుక్కున్న విషయాలు చెబుతూంటే తను వెళ్తున్న దిశ అర్థమై అక్కడికి ఆపాను.

"సైకిక్ మీడియం ఎక్స్పర్ట్” అంటే దయ్యాలతో మాట్లాడేవారేగా?" సన్నగా భయం ఆవరిస్తుంటే అడిగాను.

 

"నో ఛాయా. దయ్యాలతో కాదు. ఆత్మలతో సంభాషిస్తారు. మనం భయపడేందుకేమీ లేదిందులో. ఆ సైకిక్ మీడియం ఎక్స్పర్ట్ నాకు సాయపడతానందిట. బ్రాడీ చెప్పాడు. న్యూ ఆర్లీన్స్ వెళదామనుకుంటున్నాను. వస్తావా?" అడిగింది ఎరికా.

 

అంటే ఎరికా అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాకే, అక్కడికి వెళ్ళాలనుకున్నాకే నాకు చెప్పింది. ఇపుడు ఆ నిర్ణయాన్ని మార్చటం అంత సులువు కాదని అర్థమవుతుంది. ఇపుడు నేను చేయాల్సిందల్లా కనీసం దగ్గరే ఉండటం. ఈ లోపు రుద్రాణితోనూ మాట్లాడాల్సి ఉంది.

 

అంగీకారంగా తలూపాను. "వెళదాము. అదేదో చూడాలని నాకూ ఉంది. వారాంతమే కదా?"  నిర్ధారించుకునేందుకు అడిగాను.

 

"ఈ వారాంతమే" అంటూ ఎరికా లంచ్ ని టేబుల్ పై సర్దుతుంటే క్లీనింగ్ కి ఉపక్రమించాను. ఈ వారం కిచెన్ క్లీనింగ్ నా డ్యూటీ.

 రుద్రాణి వచ్చేవరకూ ఎదురు చూసి, కలిసి మాట్లాడుతూ లంచ్ చేస్తున్న సమయంలో రుద్రాణి ఎరికాని అడిగింది - "ఇంతకీ బ్రాడీ ఏమన్నాడు. కలిసావా?" అని.

నేను ఆశ్చర్యపోయాను. "ఇదంతా నీ ప్రోత్సాహమేనా?" అని రుద్రాణి వైపు చూస్తూ అడిగాను. నన్ను చూసి నవ్వింది రుద్రాణి. ఆ తరువాత చెప్పింది. "రెండు నెలలనుంచీ తనని తాను బయట నుంచి చూసుకోవాలనుందని అంటూంది ఎరికా. మనకి చెప్పకుండా ఒక సైకిక్ మీడియం ని కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకుందని చెప్పింది. ఆ విషయం స్నేహితులతో మాట్లాడుతుంటే బ్రాడీ చెప్పాడు - తాను ఇంతకు మునుపు సైకిక్ గా చేసాననీ, సరైన అనుభవమున్నవారయితే మేలని, తాను సాయపడగలననీ. అందుకే ఎరికాని బ్రాడీతో మాట్లాడమన్నాను. మీ ఇద్దరికీ పరిచయమే కదా బ్రాడీ?" అన్నది మామూలు విషయం చెబుతున్నట్టుగా.

 

దానికి ఎరికా కూడా "థ్యాంక్స్ రుడ్రా. నిజమే, ఇక్కడి సైకిక్ మీడియం చెప్పిన పద్ధతి కాస్త భయాన్ని కలిపించింది. శరీరం నుంచి ఆత్మని కాసేపు వేరు చేసే ఏదో ప్రక్రియ ద్వారా నన్ను నాకు చూపిస్తానంది. నీకు చెప్పినట్టే బ్రాడీకీ వివరించాను. అతను న్యూ ఆర్లీన్స్ లో తనకి బాగా పరిచయమున్న సైకిక్ మీడియం ఎక్స్పర్ట్ ద్వారా ప్రయత్నిద్దామన్నాడు. ఇందాకే ఛాయనీ అడిగాను, తానూ వస్తానంది. నువ్వూ వస్తావా?" అంది సంతోషంగా.

రుద్రాణి తాను కూడా వస్తానని చెప్పింది. వాళ్ళ మాటలు వింటూ మౌనంగా కూర్చున్న నాకు నేనేం తిన్నానో కూడా అర్థమవలేదు. ఎరికా చేసే వంట ఏదయినా రుచిగా ఉంటుంది. ఆస్వాదిస్తూ తింటాను. ఈ పూట నోరు చేదుగా అనిపించిందెందుకో. వారి సంభాషణా అంతే. ఎపుడూ ఆసక్తిగా ఉంటుంది. ఈ రోజు వింటున్నది ఏం వింటున్నానో సరిగ్గా అర్థమవుతున్నట్టూ లేదు. చిన్న ఆలోచన పుట్టటమేంటీ? అదింత తీవ్రతరం దాల్చటమేంటీ? ఆత్మలతో సంభాషించేవారి సాయం కోరటమేంటీ? ఎంతెంత దూరం వెళతాయో ఈ ఆలోచనలు. ఎక్కడివక్కడ తెంపకపోతే.

 

నేను నిజానికి ఈ విషయంలో ఎరికా దృష్టి మరల్చేందుకు రుద్రాణి సాయం తీసుకోవాలనుకున్నాను. కానీ, సైకాలజీ, ఫిలాసఫీ చదివే రుద్రాణి ఇలాంటి ఆలోచనలని సమర్థించటం, అలాంటి ప్రదేశాలని సూచించటమే ఎక్కువ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నాకు. అందునా, ఎరికా కుటుంబం గురించి నాకెంత తెలుసో రుద్రాణీకీ అంతే తెలుసు. ఎరికాది సాంప్రదాయక క్రిస్టియన్ కుటుంబం. వాళ్ళ నాన్నగారు ఇలాంటి సైకిక్ విజిట్లని అస్సలు సమర్థించరని మాకు చాలా బాగా తెలిసిన విషయమే. ఎరికా వాళ్ళ నానమ్మ మిసెస్ ఎమర్సన్ కూడా రిటైరయ్యాక టేరో కార్డులు [Tarot Reading]  చదివే వ్యాపకాన్ని కల్పించుకుని బానే పేరు గడించింది. ఎరికా తండ్రి మాత్రం, ఆయన తల్లి మిసెస్ ఎమర్సన్, జీసస్ కి ఇష్టం లేని పనులుగా బైబిల్ లో నిర్వచించబడిన పనులని చేస్తోందని భావిస్తూ, తల్లిని బలంగా వ్యతిరేకిస్తూ ఉంటాడు. కన్న తల్లైన ఆవిడనే ఇంటికి దూరంగా ఉంచుతాడు. అపుడపుడూ ఆమెని చూసేందుకు తానే వెళతాడు, వెళ్ళినప్పుడల్లా గొడవపడి తిరిగొచ్చేస్తాడు. ఎరికా తల్లి మాత్రం ఆవిడ వృత్తి, ఆవిడ అభీష్టమని ఆవిడని గౌరవంగానే చూస్తుంది. పిల్లలతో అపుడపుడూ వెళ్ళి గడిపి వస్తూంటుంది. ఆ విషయంలో భర్తతో నిక్కచ్చిగా ఉంటుంది. ఇవన్నీ మాకు తెలిసిన విషయాలే. ఇపుడు ఎరికా ఇలాంటి విషయాల పట్ల ఆసక్తి చూపటం, తాను చదువుకునే సైన్స్ పరిధిలో లేని మాటలు మాట్లాడటం జీన్స్ ప్రభావమో, లేక మనవరాలిపై మిసెస్ ఎమర్సన్ ప్రత్యక్ష ప్రభావమో అయుంటుందనే నా భావన కూడా. ఆ ఆలోచనలు అందుకే నన్ను కలవరపెట్టాయి. ఇదంతా తెలిసీ సైకిక్ ని కలిసేందుకు వెళతానంటున్న ఎరికాని ఆ దిశగా ప్రోత్సహించటం వాళ్ళ కుటుంబంలో ఎలాంటి మార్పులు తెస్తుందో, ముఖ్యంగా ఎరికా తండ్రి ఎంత కలతపడతాడో, ఎలా దూరం పెడతాడో చిన్నపిల్లాడైనా ఊహించగలడు. అన్నీ తెలిసీ రుద్రాణీ ఎందుకు సమర్థిస్తుందనేది అర్థం చేసుకోలేకున్నాను.

భోజనమవుతూనే తన రూం లోకి వెళుతూ సాయంత్రం రివర్ వాక్ కి వెళదామని, ఆలోపు ఏవో అసైన్మెంట్లు పూర్తి చేసుకోవాలని తన గదిలోకి వెళ్ళిపోయింది రుద్రాణి. వీలున్నప్పుడు సరదాగా ముగ్గురమూ వెళ్ళి, రివర్ వాక్ అని పిలవబడే  నదీతీరంపై గడుపుతూంటాము. 15మైళ్ళ పొడవునా ఉండే ఆ నదికిరువైపులా అందమైన ల్యాండ్ స్కేపింగ్ తో వ్యాహ్యళికి, షాపింగ్ కి, డైనింగ్ కి అనువుగా తీర్చిదిద్దారు.  కాసేపయినా ఎప్పుడూ ఉండే చదువులు, అసైన్మెంట్లు, పరీక్షలు, లౌడ్ పార్టీలు వీటన్నిటి నుంచీ తప్పించుకునేందుకు ఈ ప్రదేశం ఒక ప్రశాంతమైన ఆటవిడుపు మాకు.

ఎరికా కాస్త దూరంలో ఏదో కొనేందుకని ఆగినపుడు మాత్రం రుద్రాణి తెలుగులో చెప్పింది నాకు. "కంగారు పడకు. తనంతట తాను వెళ్ళబోయిన మార్గమే ప్రమాదకరమైనది. దాన్నుంచి మళ్ళించాక గానీ మనం ఎరికాతో ఈ విషయం చర్చించలేము. బ్రాడీ చేసింది ఆ ప్రయత్నమే" అని. ఇంకేదో చెప్పేంతలో ఎరికా దగ్గరవటంతో సంభాషణ వేరే వైపుకి మళ్ళించింది రుద్రాణి.

ఆ వారాంతమే బయల్దేరాము న్యూ ఆర్లీన్స్ కి. మాతో పాటే రుద్రాణి క్లాస్ మేట్ బ్రాడీ కూడా. అతను భలే సరదా మనిషి. దాదాపు ఏడున్నర గంటల డ్రైవ్ మొత్తం యేళ్ళుగా పరిచయమున్న వ్యక్తిలాగే అనిపించాడు . అంతవరకూ అపుడపుడూ హాయ్ చెప్పేంత పరిచయమే ఉన్నప్పటికీ.

కారుని వసతి దగ్గర ఆపి, కాస్త తిని ఫ్రెష్ అయ్యాక, ఎపాయింట్మెంట్ సమయానికి రేఛెల్ ఆఫీసు ఉన్న జాక్సన్ స్క్వేర్ ప్రాంతానికి వెళ్ళాము. అక్కడన్నీ సైకిక్ సెంటర్లే. గతం చెబుతామని కొందరు, భవిష్యత్తు చూపుతామని కొందరు, ఆత్మలతో సంభాషింపజేస్తామని కొందరు, ఎన్నో బోర్డులు వేలాడదీసి ఉన్నాయి ఆ వీధంతా. తమ వంతుకై వేచి చూస్తున్న విజిటర్స్ తో, పర్యాటకులతో ఆ ప్రదేశం కాసింత రద్దీగానే ఉంది. బ్రాడీ మమ్మల్ని సరాసరి రేఛెల్ వద్దకే తీసుకెళ్ళాడు. ఛాంబరు బయట కాసేపు వేచి చూస్తున్నంతలో గమనించాను ఎరికా మొహంలో ఉద్విగ్నత. ఉత్సాహంగానూ ఉంది. నా మొహంలోని అయోమయం మిగతా ఇద్దరి మొహాల్లో కనబడలేదు. రుద్రాణి, బ్రాడీ చిరకాల పరిచిత ప్రదేశంలో కూర్చున్నట్టు స్థిమితంగా కూర్చుని ఉన్నారు. కొన్ని నిమిషాలు అయ్యాక, బయటకి వచ్చినామెని పరిచయం చేసాడు బ్రాడీ, రేఛెల్ గా. 

 

కేశపోషణపై నిర్లక్ష్యాన్ని పట్టిచ్చే రింగురింగుల ఒత్తైన జుట్టు, మసకబారిన దళసరి కళ్ళద్దాల వెనకాల కనబడే లోతైన కళ్ళు, అగాధాల నుంచి వినబడుతున్నట్టు తోచే ఒకానొక మిస్టిక్ గొంతుక- ఇలాంటి నేను ఊహించుకున్న లక్షణాలేవీ లేని, ఒక భలే చలాకీ అమ్మాయి రేఛెల్, నన్ను పరిచయం చేయగానే షేక్ హ్యాండుకై చేయి చాచింది. తడబడుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాను. పరిచయాలయ్యాక, ఎరికాని ఛాంబర్ లోకి తీసుకెళ్ళింది రేఛెల్. తీసి ఉన్న తలుపులోంచి కనబడుతున్న ఛాంబర్ లోకి చూసీ చూడనట్టుగా చూసాను. ఒక పెద్ద మేజా బల్ల, దానిపై ఒక గాజు గోళం అయినా ఊహించాను. అవి మటుకూ కనబడ్డాయి. కానీ, అవి కూడా చక్కటి ఈస్థటిక్ సెన్స్ తో తళతళలాడుతూ మోడర్న్ గా అమర్చబడి ఉన్నాయి . ఇక, పాశ్చాత్య సినిమాల్లో చూపించినట్టుగా బల్ల మీద ఆత్మలు, భూతాలతో సంభాషించేందుకు ఉపకరించే వీజీ బోర్డులు[Ouija boards) లాంటి మాధ్యమాలు, భవిష్యత్తుని ఊహించే టేరో కార్డులు [Tarot cards] అయితే ఎక్కడా కనబడలేదు. బహుశా పక్కనే ఉన్న కబోర్డుల్లో సర్దబడ్డాయేమో. ఎరికా, రేఛెల్ ఆ ఛాంబర్లోని సీట్లలో కూర్చోగానే, అసిస్టంటనుకుంటా ఒక అమ్మాయి వచ్చి, తలుపు దగ్గరగా వేసింది. నేనూ తలపులు కట్టిబెట్టి, రుద్రాణి మరియు బ్రాడీతో మాటల్లో పడ్డాను.

ఒక గంట తరువాత ఎరికా బయటకి వచ్చింది. అదే ఉత్సాహం మొహంలో. బయటకి వెళుతూంటే రుద్రాణి అడిగింది. "చూసుకున్నావా నిన్ను నువ్వు?"

నవ్వింది ఎరికా. "ఇంకా లేదు. నా ఆలోచనలని మొదట గమనించమంది. వాటిని కట్టడి చేయగలిగాకే ఆ ప్రయోగం చేయవచ్చట. లేదంటే ఒక్క శాతం అవకాశం కూడా ఉండదట నా ఆత్మని వెలికితెచ్చి నన్ను చూపించే ప్రయోగం విజయవంతమవటానికి. మొదట సైకియాట్రిస్టుతో మాట్లాడి ఆలోచనలని నియంత్రించమంటూ రిఫరెన్సుని అందించింది." సానుకూలంగా చెబుతున్న ఎరికా మాటలు విన్నాక మనసు నెమ్మదించింది.

ఆ రోజు అక్కడే ఉండి, చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూసుకుని తిరిగి శాన్ ఏంటోనియాకి బయల్దేరాము. నాకు మిగిలిపోయిన ఒక సందేహాన్ని రుద్రాణిని అడిగేందుకు మరో వారం పట్టింది.

"ఒకవేళ రేఛెల్ కూడా మొదటి మీడియం చెప్పినట్టే, ఆత్మని వేరు చేయటం లాంటి ఏవో సైన్సుకందని ప్రయోగాలు చేసేందుకు ప్రయత్నించి ఉంటే ఏమయ్యేది? ఎరికా ఒప్పుకునేది కూడా? ఎందుకలా ఎరికాని ప్రోత్సహించావు?" అడిగాను రుద్రాణీని.

"రేఛెల్ మీడియం అయితే కదా అలా చెప్పేందుకు? మొదట ఒక మంచి సైకియాట్రిస్టు ఆ అమ్మాయి." అంది రుద్రాణి నవ్వుతూ.

"అంటే?" పొరలు విప్పినట్టుగా అర్థమవుతూంటే, నిర్ధారించుకునేందుకు అడిగాను.

"ఎరికాకి కావాల్సింది ఒక మంచి సైకియాట్రిస్టు. మొదట అలా తనంతట తాను అక్కడే ఓ సైకిక్ మీడియంతో మాట్లాడటం నన్ను కంగారు పెట్టింది, అంత బలీయంగా తనని తాను చూడాలనుకోవటం ఆలోచనల్లోని ఏదో డిజార్డర్ ని సూచించింది. ఒక మంచి సైకియాట్రిస్ట్ మాత్రమే మాటల ద్వారా పరీక్షించి కావల్సిన సైకో థెరపీ ఇవ్వగలరు. కానీ, ఎరికా మాత్రం తనకి థెరపీ,  కౌన్సిలింగ్ లంటివేవీ అవసరం లేదనీ, కేవలం తనని తాను చూసుకోగలిగితే సరిపోతుందంది. ఈ విషయమే నా క్లాస్మేట్స్ తో మాట్లాడుతుంటే బ్రాడీ తన కజిన్ సాయపడగలదని అన్నాడు. రేఛెల్ మంచి సైకియాట్రిస్టు. సైకిక్ మీడియమ్షిప్ కోర్సులు చేసి వాటిలో సైన్సు పాళ్ళెంత అన్న విషయాన్నీ రీసెర్చ్ చేసింది కనుక సైకిక్ మీడియం లానూ మాట్లాడుతూ అవసరమైన కౌన్సిలింగ్ ఇవ్వగలదని చెప్పాడు బ్రాడీ. ఆ విధంగా ఎరికాకి జరిగింది ఒక కన్సల్టేషన్ మాత్రమే." అంది.

మెచ్చుకోలుగా చూసాను రుద్రాణి వైపు. "హమ్మయ్య. నాకు తెలుసు. నువ్వేదోలా పరిష్కరించగలవని. సంక్లిష్టం చేస్తున్నట్టనిపించి కంగారు పడ్డాను." తేలికపడ్డ మనసుతో అన్నాను.

రుద్రాణి మాత్రం ఆ మెచ్చుకోలుని ఒప్పుకోలేదు. "కానీ, ఓ ప్రమాదం నుంచి తప్పించామేమో కానీ, ఎరికా తండ్రికి కలగబోయే కలవరాన్ని ఇంకా తప్పించలేకపోయామేమో. ఇపుడు ఎరికాకి సైకిక్ ఆసక్తులు మరింతగా పెరిగే అవకాశాలని, పరిచయాలని కలిపించినట్టున్నాను కూడా. తనూ ఈసారి బ్రాడీతో కలిసి వచ్చే సమ్మర్ లో న్యూ ఆర్లీన్స్ కి వెళ్ళాలనుకుంటోందిపుడు.  టేరో రీడింగ్[Tarot Reading]  ఎలా చేస్తారంటూ బ్రాడీని ఆసక్తిగా అడగటం గమనించావా?" అనటంతో నా ఆలోచన తిరిగి ఒకటో గడికే చేరింది.

మౌనాన్ని ఆశ్రయించాను. అమ్మ ధ్యానమందిరంలో ఉండే రమణ మహర్షి కోట్ గుర్తొచ్చి.

Whatever is destined not to happen will not happen, try as you may. Whatever is destined to happen will happen, do what you may to prevent it. This is certain. The best course, therefore, is to remain silent.”

*****

bottom of page