top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
adhyatmika.jpg
pustaka-parichayaalu.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
alanati.jpg
paatasanchikalu.jpg

సంపుటి 7  సంచిక  4

అక్టోబరు-డిసెంబరు 2022 సంచిక

maagurinchi.jpg
rachanalu.jpg

కథా​ మధురాలు

నవరాత్రి- 1

 

గిరిజా హరి కరణం

girija hari.PNG

స్టేషన్ బయటికొచ్చి గుర్రబ్బండి పిలిచి, అన్నపూర్ణమ్మ, లలిత బిడ్డతోబాటు యెక్కాక, "పోనీరా బాబూ!" అంటూ నడవటం మొదలు పెట్టారు మల్లప్ప శాస్త్రిగారు.

 

 "నాయనగారూ మీరూ యెక్కండి “ అని లలిత పిలుస్తోంది కంగారుగా.

”ఫరవాలేదు తల్లీ, నాకలవాటే. అపర్ణ ను జాగ్రత్తగా పట్టుకోమ్మా”

“అరమైలన్నా నడవలేదు, అప్పుడే ఆయాసంగా వుందేవిటీ " అనుకుంటూ చెమటలు తుడుచుకుంటూ రోడ్ ప్రక్కగా నిలబడ్డారు శాస్త్రిగారు.

 

ఆయన ఆయాసపడుతూ మెల్లగా తడబడుతూ నడవటం వెనకాతలే సైకిలు మీదొస్తూ గమనించిన శంకర్, శాస్త్రి గారివద్దకొచ్చి ఆగి “పంతులుగారూ, యెండనపడి నడవలేరు నా సైకిలెక్కండి, వూళ్ళోకేగా” అడిగాడు శంకర్ “అవును నాయనా” అంటూ సైకిలెక్కారు శాస్త్రిగారు. యెదురింటిముందు కొత్తవాళ్ళు బండి దిగటంచూసి యెదురింటి అమ్మాయి లక్ష్మి, వాళ్ళమ్మా బయటికొచ్చారు.

శాస్త్రిగారి గొంతువిని రామయ్యకూడా -"నమస్కారమయ్యా యిన్నాళ్ళకు వూరు గుర్తొచ్చిందాయ్యా?" అంటూ దగ్గరకొచ్చాడు.

“వొరే రాముడూ, నువ్వట్రా? బాగున్నావా, మీ నాయనా నేనూ కలిసి చదువుకున్నాం జతగా తిరిగేవాళ్ళం, యెలావున్నాడురా, చాలాకాలమైంది చూసి, శ్రీశైలం వచ్చినప్పుడల్లా కలిసేవాడు. యీమధ్యన రావటంలేదు?” అన్నారాయన ఆప్యాయంగా.

“కాలమై పోయినాడయ్యా రెండేళ్ళైంది, మిమ్మల్ని తలుచుకుంటుండేవాడు. వీడు నా కొడుకు శంకర్. మా నాయన పేరే పెట్టుకున్నా, కూతురు లక్ష్మి, నాభార్య” అనిచెప్పాడు.

వాళ్ళింట్లోనుంచి నులకమంచాలు, కుంపటి, కంచు పాత్రలూ తెచ్చిచ్చి యివి మీరు వూరొదిలి వెళ్ళేటప్పుడు మాకిచ్చినవేనయ్యా” అని చెప్పాడు, ఆ తర్వాత వూర్లో పెద్ద రైతుల వద్దకు తీసుకెళ్ళి వాళ్ళనడిగి రెండుమూడిళ్ళలో పూజలూ నామకరణాలకు కుదిర్చాడు రామయ్య. వూర్లో కొందరు పెద్ద రైతులు బియ్యం కూరగాయలూ పంపుతున్నారు అభిమానంగా.

ఆరోజు రాత్రి భోజనం చేసి అరుగుమీద కూర్చుని “బంటురీతి కొలువు యియ్యవయ్యరామా,“ పాడుతున్నారు మల్లప్పశాస్త్రి.

కొట్టుకెళ్ళి ఆకు వక్క సున్నం తెచ్చిచ్చి కూర్చున్నాడు రామయ్య.

“అయ్యా నేను డ్రైవర్ గా పనిచేసే కలెక్టర్ గారు కొత్తగా బదిలీ అయ్యి వచ్చారు. ప్రతి సంవత్సరం విజయదశమికి ఇంట్లో పూజలు చేయిస్తారంట. “వూరు కొత్త కదా! ఎవరైనా మంచి పురోహితుడు నీకు తెలుసా” అని అడిగారు. నేను మీ గురించి చెప్తే తీసుకు రమ్మన్నారు. వస్తారా అయ్యా” అని అడిగాడు.

“తల్లి సేవకు నేనెప్పుడూ సిద్ధమేరా రామయ్యా" అన్నారు శాస్త్రిగారు.

కాసేపు అలా కూర్చుని “ఒరే రాముడు నా కథంతా చెప్పాల్రా నీకు, మీ నాయన పోతాడనుకోలేదురా ఇంత తొందరగా, వాడితో చెప్పాలనుకున్న నా గతమంతా చెప్తా విను. ఒక రోజుతో అయ్యేది కాదు కానీ రోజు కొంచెం చెప్తా, రేపటినుంచీ రాత్రయ్యాక కాసేపు నా దగ్గర కూర్చోగలవా" అని అన్నారు.

“అయ్యా! అంతకంటేనా! రేపు పొద్దున్నే రెడీగా వుండండయ్యా, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దాము."అడిగాడు రామయ్య .

“సరే రా,   రేపటినుంచీ నా కథ కూడా మొదలుపెడతానురా” అన్నారు శాస్త్రి గారు సంతోషంగా.

**

ఆశ్వయుజ మాసం శుద్ద పాడ్యమి.

శరన్నవరాత్రులు! కలెక్టరుగారింట్లో తొలిరోజు తల్లిని “శైలపుత్రి”గా నిలిపి పూజపూర్తిచేశారు శాస్త్రిగారు, కలక్టరు రమణమూర్తి ఆయన భార్య, మల్లప్పశాస్త్రి తో కలిసి బయటికి రావటం చూసి కారుపక్క కొచ్చి నిలబడ్డాడు రామయ్య.

“పూజారి గారిని వాళ్ళింట్లో దింపి కారు వుంచుకుని మళ్ళీ ఆయన్ని పొద్దున తీసుకురా రామప్పా” అన్నారు కలెక్టరు గారు.

“చిత్తం దొరా!” శాస్త్రి గారి చేతిలోని సంచి అందుకుని వెనక డోర్ తెరుస్తూ అన్నాడు రామయ్య.

ఆ రాత్రి భోజనమయ్యాక యధావిదిగా రామయ్య వచ్చి కూర్చున్నాడు.

లలిత, అన్నపూర్ణమ్మ కూడా పాపతో వచ్చి అవతలరుగుమీద చాపపరుచుకుని కూర్చున్నారు.

మరచెంబు లోని నీళ్ళు కాసిని నోట్లో పోసుకుని గొంతు సవరించుకున్నారు, యెనభై సంవత్సరాల ఆయన కంఠం ఖంగు మంటోంది. “నా జీవితం లో జరిగిన సంఘటనలను ఈ నవరాత్రి పూజలు చేస్తూ యీ నవరాత్రులలోనూ నీకు తెలియ జేస్తాను. ముందుగా నాకు లభించిన అద్భుతమైన దివ్యానుభవం తెలియ జేస్తాను.

శ్రీ శైలం దేవాలయంలో శ్రీ భ్రమరాంబికా మాత వద్ద సేవ చేసే భాగ్యం లభించింది నాకు!

 

తొలిసారి ఆలయంలో ప్రవేశించి తల్లి ముఖం చూడగానే “అమ్మా! ఇక్కడున్నావా?యిన్నాళ్ళూ తల్లి కోసం అల్లాడిపోయాను, యిన్నాళ్ళకు కనిపించావా తల్లీ, అంటూ ఆమె దివ్యపాదములకు ప్రణిపాతం చేశాను. ఆనాటినుండీ నాతల్లిని తలుచుకుంటే గుళ్ళోని అమ్మ ముఖమే కనిపిస్తుంది నాకు. పూజారులకై కేటాయించినక్వార్టర్స్ లో వుండే వాళ్ళం.

తెల్లవారి నాలుగ్గంటలకే లేచి శుచిగా వెళ్ళి గుడి శుభ్రంచేసి ప్రాతః కాల పూజలూ అభిషేకమూ అమ్మవారి అలంకారమూ నైవేద్యాలూ భక్తిగా సమర్పించి, దర్శనానికొచ్చిన భక్తులకు అర్చనా హారతీ తీర్ధప్రసాదాలూ యిచ్చి రాత్రివరకూ తల్లి సేవలోనే వుండేవాడిని.

యిలా జరుగుతుండగా వొకనాడు మధ్యాహ్నం, భక్తులు యిక సాయంత్రందాకా రారు కనుక, యింత ప్రసాదం నోట్లో వేసుకుని మంచినీళ్ళుతాగి బయటికొచ్చి గుడి గడపవద్ద కూర్చున్నాను, రోహిణీకార్తె, రోళ్ళు పగిలే యెండ, ఆకు కదలడం లేదు కాసేపలా కూర్చుని మెల్లిగా నడుంవాల్చాను గడప ముందు, ఎప్పుడు నిద్రపట్టిందో యేమో!

యేదో మెత్తని చల్లని వస్త్రం సువాసనలీనుతూ నా వొంటిమీద జీరాడింది, గడప మీద నుండి నన్ను దాటుతుండగా మెత్తని పాదపు స్పర్శ.తొమ్మిది సంవత్సరాల పసిడిబాల.

"యెక్కడికమ్మా? యెండకదా." అన్నాను.

యెర్రంచు పసుపు పచ్చటి పావడా కుచ్చెళ్ళు రెండు చేతులతోనూ కాస్తంత పైకి పట్టుకుని, గర్భ గుడి ద్వారం మీదనుండి నన్ను దాటి వొక్క అంగవేసి పరుగెత్తబోతూ, వెనక్కి తిరిగి నావైపు చిరు కోపంతో చూసింది, ముక్కుకున్న ముక్కెరా, చెవులజుంకాలు పాపట కిరువైపులా సూర్య చంద్రులూ, పాపటబొట్టూ అన్నీ వొక్కసారిగా ధగద్ధగాయమానంగా మెరిశాయి.

“నేనాడుకోవద్దా? యెంతసేపూ గుళ్ళోనే వుంటే యెలా ?” అంటూ కాలి గజ్జెలు ఘల్లు ఘల్లు మంటూండగా మెట్లుదిగి పరుగెత్తుకెళ్తూంది పూల తోట లోకి, లేచి కూర్చున్నాను నా వొళ్ళంతా పులకరింతలు, మహా అద్భుతాన్ని కళ్ళారా చూశాను. ఆనందంతో నా కళ్ళు నిండాయి, చిన్ని మహరాణి మేల్పట్టు పావడా కుచ్చెళ్ళ స్పర్శ, పాదపు మునివేళ్ళు సున్నితంగా తాకిన గుర్తులు, నిశ్చేష్టుడనై చూస్తున్నాను.

ఎక్కడున్నదో మరి నల్లటి మబ్బొకటి వచ్చి, మా గుడిపై ఛత్రం పట్టింది. ఏ పెత్తనాల కెళ్ళిందో ఏమో చల్లటి పిల్లగాలి పరుగున వచ్చి వీవనతో విసరుతూంది. సన్న సన్నటి చిరు జల్లులు భూమిని తాకుతూ- “తల్లి వచ్చిందని“ తట్టి చెబుతున్నాయి, తోటలోని పూలమొక్కలు యోగనిద్రనుండి మేల్కొని, స్నేహితురాలితో ఆటకు సిద్ధమవుతూ రెమ్మలూగిస్తూ ఆకులు రెపరెపలాడిస్తూ కేరింతలు కొడుతున్నాయి, అలా చూస్తూ ఎంతసేపున్నానో ఏమో...” భక్తులరాకతో నాలోని మహదానందానుభూతికి అంతరాయం కలిగింది.

యాంత్రికంగా పూజా విధులు నిర్వర్తిస్తున్నానే గానీ నా మనసు ఆ మహా సౌందర్య నిధి నుండి మరలి రావడంలేదు .ఈనాటికీ తలచగానే ఆనాటి స్పర్శ, నాచిన్ని తల్లి వెనుదిరిగి నన్ను చూసిన చూపు, మెట్లుదిగి పరుగెత్తి వెళ్తూంటే పసుపుకుంకుమలూ గంధాక్షతలూ కలిసిన సువాసనా... నాలో తన్మయమయి నిలిచి వున్నవి.

“అయిగిరి నందిని నందిత మేదిని“ అని భక్తిగా ఆర్తినిండిన గొంతుకతో తల్లిని స్తుతించి ఆ రోజుకు ముగించారు మల్లప్ప శాస్త్రిగారు.

*****

 

(వచ్చే సంచికలో మరో దర్శనం )

bottom of page