top of page
Anchor 1

సంపుటి 2  సంచిక 2

కథా మధురాలు

మలిసంధ్య పిలుస్తోంది

Hitesh Kollipera

గంగాధర్ వీర్ల

పరిపూర్ణమైన సాయంత్రానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. అది చెప్పడానికే అన్నట్టు పడమటి  దిక్కునుంచి విప్పారిన కళ్లతో శరీరాన్ని వేడిగా తాకుతున్న భానుడి కిరణా స్పర్ష. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత ఒళ్ళు విరుచుకుని పనికి సిద్ధమైనట్టుగా నాలుగు రోడ్ల కూడలిలో జన సందడి. 

 

పగటి పూట  పనిభారం నుంచి విముక్తి పొంది ఎప్పుడెప్పుడు ఇంటికి చేరదామా? అని రోడ్డుపైకొచ్చిన వారికి ఆసరాగా బస్సు రణగొణ ధ్వనులు జోరందుకున్నాయి.  

 

ఆధునిక జీవితానికి ప్రతిబింబంగా ఓ పక్కగా కాఫీషాప్‌. పగటిపూటకు వీడ్కోలు చెప్పడానికి. ముందస్తుగానే రంగు రంగు దీపాలతో కాంతులీనుతోంది. అప్పుడే నిద్ర లేచి, అందంగా ముస్తాబై కబుర్ల సాయంత్రానికి స్వాగతం పలికినట్టుగా యువతీయువకుల కోలాహలం.

 

స్కూల్‌ వ్యాన్‌లోంచి బిలబిలమంటూ పిల్లలు దిగుతున్నారు. కొందరు ఉరుకు పరుగు పెడుతుంటే, ఇంకొందరు చెట్టాపట్టాలేసుకుని కబుర్లలోపడి నడకసాగిస్తున్నారు. పిల్లలందరి ముఖాల్లో ఇళ్లకు చేరిపోతున్నామనే సంతోషపు మెగు స్పష్టంగా కనపడుతోంది. అప్పటిదాకా స్కూల్లో పాఠాల మదింపుతో అలసిన  శరీరాలు, మనసూ గాల్లో తేలుతున్నట్టుగా వారి కేరింతలు చెబుతున్నాయి. అలా స్కూల్‌ యూనిఫామ్‌లో పిల్లల్ని చూస్తుంటే.. గుడి గోపురంపై గుంపు గుంపులుగా వాలిన తెల్లపావురాలు ఏదో చప్పుడై ఒక్కసారిగా గాల్లో  లేచి సందడి చేసినట్టుగా ఉందా దృశ్యం.

  

బస్‌స్టాప్‌కి అభిముఖంగా విశాలమైన పార్క్‌. అక్కడ సిమెంట్‌ బల్లపై ఒంటరిగా కూర్చున్న రఘురాం కళ్లు ఇనుప చువ్వల సందుల్లోంచి బాహ్యప్రపంచాన్ని ఆత్రంగా చూస్తున్నాయి. ఆ స్కూల్‌ పిల్లల్లో చాలా మంది అచ్చం తన మనవరాలు, మనవడులానే కనిపిస్తున్నారు. అందులో ఒకరిద్దరు.. దూరం నుంచే ‘హాయ్‌ తాతయ్య’’ అని చేతులు ఊపినట్టుగా చిన్నపాటి ఊహ. అది ఊహే అని తెలిశాక రఘురాం కళ్లల్లో సన్నని చెమ్మగిల్లిన నిట్టూర్పు.

 

 000

 

సాయంత్రం అంతకంతకు చిక్కనవుతోంది. ‘‘ఈపాటికి పరంధామయ్య రావాలే.. ఇంకా రాలేదెందుకో? వస్తాడు.. వస్తాడు..’’ అని మనసులోనే తన స్నేహితుడిని తలచుకుంటూ పార్క్‌ గేట్‌ వైపుగా చూస్తున్నాడు రఘురామ్‌. 

 

‘హల్లో మాష్టారూ.. మీ ఫ్రెండ్‌ ఇంకా రాలేదా.. ఒక్కరే ఉన్నారు?’’ సాయంకాలపు నడక సాగిస్తూ అడిగాడు పరిచయస్తుడు. ఇంకా రాలేదు.. అన్నట్టుగా కళ్ళతోనే నవ్వాడు రఘురామ్‌. 

 

 పరంధామయ్య రాకపోయేసరికి రఘురాం ఆలోచనలు పరిపరివిధాలుగా పోతున్నాయి.

 

‘‘ ఏమైంది హిట్లర్‌కీ?’’ అని మనసులోనే అనుకున్నాడు. 

 

పరంధామయ్యకు తన పెట్టుకున్న ముద్దుపేరు హిట్లర్‌. సమయపాలన దగ్గర నుంచి మాట్లాడే విషయంలోనూ ఎంతో కచ్ఛితంగా ఉండే వ్యక్తి. సమాజంలోని మంచిచెడుల దగ్గర నుంచి అంతర్జాతీయ రాజకీయాల వరకూ ఏ విషయం గురించైనా సూటిగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తాడనే తన స్నేహితుడు పరంధామయ్యకు హిట్లర్‌ అని పేరుపెట్టాడు. 

 

‘‘ పార్క్‌ మూసేయడానికి ఇంకా అర్ధగంటే సమయముంది. హిట్లర్‌ ఇంకా రాకపోవడమేంటి? ఏదైనా ఇంట్లో పనుంటే.. ‘‘రేపు నిన్ను కలవలేనోయ్‌.. మిష్టర్‌ రఘురాం.. ’’ అంటూ గట్టిగా షేక్‌హ్యాండ్‌ ఇచ్చి మరీ చెప్పేవాడు. అలాంటిది హిట్లర్‌ ఇవ్వాళ చెప్పాపెట్టకుండా రాకపోవడానికి కారణమేంటి?

 

ఆరోగ్యం బాగోలేదా?! అలా అయ్యుండదులే..’’ మనసుని సముదాయించుకున్నాడు రఘురాం. 

 

నిజానికి రఘురాంకి, పరంధామయ్యకు మధ్య ఏడాది క్రితమే స్నేహం ఏర్పడిరది. ఇద్దరికీ స్నేహం కుదిరింది కూడా ఈ పార్కులోనే. పరిచయమైన ఆరోజుని మరోసారి గుర్తు చేసుకున్నాడు రఘురాం. 

 

‘‘ఏవండోయ్‌ మాష్టారు! అలా నెమ్మదిగా నడిస్తే .. లాభంలేదు. ఇలా నాలా చకచకా నడవాలి మరి.. ’’

 

నింపాదిగా నడుస్తున్న రఘురాంతో మొదటిసారిగా మాటు కలిపాడు పరంధామయ్య. అలా ఆరోజు నుంచి.. పరంధామయ్య కారణంగా రఘురాం నడకలో బాగా వేగం పెరిగింది. ఇద్దరి మధ్యా స్నేహం కూడా పెరుగుతూ వచ్చింది. సాయంత్రం పూట నడక ఎలా ఉన్నా.. ఒకర్ని ఒకరు కలుసుకుని, కబుర్లు చెప్పుకోవడం కోసమే ప్రతిరోజూ ఠంచనుగా పార్క్‌లో కలవడం ఇద్దరికీ ఓ అవాటుగా మారింది. ఎప్పుడైనా వర్షం అడ్డుపడితే మరసటి రోజున వరుణుడిపై శాపనార్థాలతో విరుచుకుపడేవారు.  

 

పార్క్‌ గేట్‌ మూసేశారు. రఘురాం భారంగానే ఇంటికి బయుదేరాడు.

 

 0000

 

రఘరాంకి అన్నం సహించడంలేదు. కోడలి తెచ్చిపెట్టిన భోజనాన్ని సున్నితంగానే వద్దని చెప్పేశాడు. కడుపునిండా మంచినీళ్లు తాగి మంచంపై వాలినా కళ్లు మూతపడ్డంలేదు. వారం క్రితం పరంధామయ్య అన్నమాటలు చెవిలో మారుమోగుతున్నాయ్‌. 

 

‘‘నిన్న రాత్రి ఛాతీ నొప్పిగా అనిపించిందోయ్‌.. రఘురాం. కొంపదీసి గుండెపోటంటావా? నిద్రలోనే వస్తే ఏ గొడవాలేదు. ఎంచక్కా డాక్టర్లు, హాస్పిటళ్లతో పనిలేకుండా హాయిగా టపా కట్టేయొచ్చు.. హహ్హ’’ అని చాలా క్యాజువల్‌ గా అన్నమాట రఘురాంకి గుర్తొచ్చింది.

   

 ‘‘నో..నో.. అలా జరిగుండదు.. హిట్లర్‌ చాలా గట్టిపిండం. నాకంటే బలమైన బాడీ. పైగా సిగరెట్టు, మందులాంటి అలవాట్లుకూడా లేవు. నో..నో అలాంటిది అయ్యుండదు.. అయ్యుండదు’’ అని మనసుకు నచ్చజెప్పుకుంటున్నాగానీ ఆలోచనలు మాత్రం పరంధామయ్య చుట్టే తిరుగుతున్నాయ్‌. రాత్రి పదకొండు దాటింది. నిద్ర రావడంలేదు. 

 

 ‘‘ అయినా,  నా చాదస్తం కాకపోతే.. ఒక్కరోజు పార్క్‌కి రానంత మాత్రాన.. ఏదో అయిపోయింది.. ఏదో జరిగిపోయుంటుందని భయపడిపోతే ఎలా.. తన ఇంట్లో ఏదో పని ఉండి రాలేదేమో.. ఆ విషయం చెప్పడానికి హిట్లర్‌ దగ్గర ఫోన్‌ కూడా లేదుకదా.. రేపు వస్తాడులే..వచ్చినప్పుడు.. ‘‘ ఏవయ్యా హిట్లర్‌ ఎందుకురాలేదయ్యా?’’  అని అడిగితే అన్ని విషయాలు తెలుస్తాయి.’’ అనుకుంటూ తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు రఘురాం. అలా మనసుకి దిగులుగా ఉన్నపుడు ఆ మధ్య ఏదో సందర్భంలో పరంధామయ్య అన్నమాటలు గుర్తొచ్చాయి.

 

‘‘ఏవోయ్‌..రఘురాం! ఈమధ్య ఏంటో మళ్లీ పెళ్లి చేసుకోవానిపిస్తుందోయ్‌. దీనిపై నీ అభిప్రాయం ఏంటీ’’ అని పాతికేళ్ళ పడుచుపిల్లాడిలా అనేటప్పటికీ పరంధామయ్య నొసలు చిట్లించడం తప్ప నోటమాటరాలేదు.

 

‘‘మా మహాలక్ష్మి నన్ను వదిలి చాలా రోజులైంది కదా..అందుకేనేమో ఈమధ్య మనసు పెళ్లి మీదకు లాగుతోంది.’’ అని కొత్తగా హిట్లర్‌ అంటుంటే రఘురాంకి ఏం చెప్పాలో తోచలేదు. 

 

“‘మరేంలేదోయ్‌.. ఇవ్వాళ మా ఆవిడ పుట్టినరోజు. పొద్దున్నుంచీ బాగా గుర్తుకొచ్చేస్తుందనుకో.. మరేం చెయ్యను. ఈ హిట్లర్ని ఒంటరిగా వదిలేసి ఆమె మానాన ఆమె ప్రశాంతంగా వెళ్ళిపోయింది. ఇక్కడ తన లవర్ బోయ్‌ ఎన్ని కస్టాలు పడుతున్నాడు. టైమ్‌కి తింటున్నాడో లేదో.. చూడొద్దు. అందుకే. వేరే అమ్మాయిని చూసి మళ్లీ పెళ్లి చేసుకోవానుకుంటున్నానోయ్‌’’ అని ఫకాలున నవ్వాడు పరంధామయ్య. 

 

స్నేహితుడి పెళ్లిమాటల్లో ఏమాత్రం నిజం లేదని రఘురాంకి అర్ధంకావడానికి ఎంతో సమయం పట్టలేదు. పరంధామయ్య మళ్లీ పెళ్లి అని ఏదో హుషారుగా అన్నట్టు నటించాడేగానీ పక్కకు తిరిగిన అతడి మొఖంలో.. అంతే వేగంగా కళ్లు చెమ్మగిల్లిన సంగతి రఘురాం ఇట్టే పసిగట్టేశాడు. 

 

భార్య జ్ఞాపకాలు గుర్తొచ్చిన పరంధామయ్య.. ‘‘ఈరోజు నా భార్య పుట్టిన రోజయ్యా.. ’’ అని చెప్పడానికి మొహమాటపడి రెండో పెళ్లని కొత్తగా అల్లి గుండెల్లో నిలిచి వున్న భార్యను ఆ పూట.. అలా ఎంతో గంభీరంగా తలచుకున్నాడని రఘురాంకి అర్ధం అయ్యింది. కాసేపు ఇద్దరి మధ్యా మౌనం.  

 

“ఊరుకోవోయ్‌ హిట్లర్‌.. పెళ్లంట పెళ్లి.. ముసలాడికి దసరా పండగన్నట్టు’’ వాతావరణాన్ని తేలికపరచడం కోసం ప్రయత్నం చేశాడు పరంధామయ్య.

 

‘ఇదిగో రఘురాం. ఏదైనా అంటే అనుగానీ.. ముసలాడనమాక..కాలేజీ అమ్మాయిలు నన్ను చూసి.. ‘హాయ్‌ స్మార్ట్‌’ అంటారు తెలుసా..!’’ అని పగలబడి నవ్వేశాడు పరంధామయ్య.  ఇలా అప్పుడప్పుడు స్నేహితుడు మాట్లాడిన మాటలు ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయ్‌. 

 

 ‘‘ఎంత హుషారైన వ్యక్తి.  అవతవాళ్లు కాస్త ఢీలాపడినట్టు కనిపిస్తే చాలు.. ఉన్నపళంగా తన మాటతో వారిలో ఆక్సిజన్‌ నింపేయగల మనిషి. పాజిటివ్‌గా మాట్లాడ్డమే తప్ప, ఎప్పుడూ జీవితం గురించి నిరాశగా మాట్లాడింది లేదు. అలాంటి స్నేహితుడిని తలుచుకుంటూ ఆ రాత్రంగా రఘురాంకి నిద్రలేమిగానే సాగింది. 

 

 0000

 

రోజూ వచ్చే సమయం కంటే ఓ అర్ధగంట ముందే పార్క్‌కి చేరుకున్నాడు రఘురాం. వచ్చిన దగ్గర నుంచీ స్నేహితుడు గురించే ఎదురుచూపు. రాత్రి నుంచి నోటికి ఏదీ సహించడంలేదు. పెట్టింది తినకపోతే, ‘ఈ ముసలాయన ఎందుకు తినడంలేదు..’ అని ఇంట్లోవాళ్లు అనుకునే ప్రమాదం ఉందని భయపడి, మధ్యాహ్నం పూట నాలుగు మెతుకులు బలవంతంగా గొంతులో వేసుకున్నాడు. 

 

ఇంతలో వడివడిగా అడుగు వేసుకుంటూ తనవైపే వస్తున్నాడు పరంధామయ్య. స్నేహితుడ్ని చూసిన రఘురాం ‘“హిట్లర్‌ వస్తున్నాడోచ్‌..’’ అని గట్టిగా అరవాలన్నంతగా మనసులో ఆనందం కలిగింది. స్నేహితుడు దగ్గరకు రాగానే.. 

 

‘‘ఏవోయ్‌.. రఘురాం.. రోజూ నీట్‌ షేవింగ్‌తో హీరో దేవానంద్‌లా ఉండేవాడివి ఇవాళేంటి? సడన్‌గా ముసలాడివైపోయావ్‌? ఏంటీ పార్క్‌లో ఎవర్నైనా చూసి లవ్ లో పడ్డావా.. హహ్హహ్హా’’ అని గంభీరంగా నవ్వుతూ స్నేహితుడి భుజంపై చేయి వేశాడు పరంధామయ్య.

 

స్నేహితుడి చేతి స్పర్శకు ఉలిక్కిపడ్డాడు రఘురాం. ‘‘ఇదేంటి హిట్లర్‌!నీ ఒళ్లిలా కాలిపోతుంది.. ఏమైందీ.. ఒంట్లో బాలేదా’’ కంగారు పడుతూ అడుగుతుంటే “మరేంలేదోయ్‌. వైరల్‌ ఫీవరట.. రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుందిటలే. నిన్నమాత్రం, దీని తస్సాదియ్యా.. టెంపరేచర్‌ అదిరిపోయిందనుకో..’’ చాలా క్యాజువల్‌గా అనేశాడు పరంధామయ్య.

 

‘‘ఇంత జ్వరంతో పార్క్‌కి ఎందుకొచ్చావయ్యా.. తగ్గాక వద్దువుకదా..ఏం.. రెండు రోజు నడక తీయకపోతే.. కాళ్ళు సచ్చుబడిపోతాయా?’’ కాస్తంత కోపంగానే అన్నాడు రఘురాం. స్నేహితుడి మాటల్లోని తీవ్రత ఏమిటో తెలుసుకోలేనివాడు కాదు హిట్లర్‌.

 

 ‘‘ నామీద ఎంత ప్రేమయ్యానీకు..’’ అని మనసులోనే అనుకుని..

 

 ‘‘భలేవాడివే రఘూ.. జ్వరం వచ్చిందికదా.. అని.. ఊరెళ్లడం కూడా మానేయమంటావా ఏందీ? ఈ హిట్లర్‌కి టైమ్‌ అంటే టైమే..  జ్వరంలేదు.. గిరంలేదు. ఎట్టిపరిస్థితుల్లో రేపు మధ్యాహ్నమే ఇక్కడ నుంచి బయలుదేరాలి. బస్‌ టిక్కెట్‌ కూడా ఖరారైంది. ఆ మాట చెప్పడానికే పనిగట్టుకొచ్చా.. హహ్హాహ్హా..’’ కడుపులోంచి రాని నవ్వును మొఖంపై పులుముకుని నవ్వుతూ చెప్తున్న స్నేహితుడిలోకి తొంగిచూశాడు రఘురాం.

 

 ‘‘ అంటే వెళ్లక తప్పదంటావా.. హిట్లర్‌?’’ అడిగాడు రఘురాం.

 

‘‘రెండునెలలు నన్ను ఒంటరిగా వదిలేసి పోతావా హిట్లర్‌?’’  అన్నట్టుగా రఘురాం స్వరంలోని భావన. 

 

‘‘హేయ్‌.. నాటీబోయ్‌.. రెండు నెలలు ఎంతసేపటికి తిరుగొస్తాయి చెప్పు. నువ్వు కూడా నాలాగా పదిరోజుల్లో ఊరెళ్లాల్సినోడివేకదా.. ఏదో పెద్ద నేను లేకుండా ఈ పార్క్‌లో నువ్వుక్కడివే షికార్లు కొట్టేవాడిలా చెప్తున్నావ్‌?’’ అడిగాడు పరంధామయ్య. ‘‘ అవును..’’ అని కళ్లతోనే సమాధానం చెప్పాడు రఘురాం. 

 

 0000 

 

రఘురాం, పరంధామయ్య మధ్య రక్త సంబంధమేమీలేదు. ఒకచోట కలిసి పనిచేసిందీ లేదు. ఒకేఊరు వాళ్లు అంతకన్నాకాదు. ఇద్దరి జీవితాల్లోనూ పోలికలు మాత్రం ఒకటే. ఇద్దరూ తమ బిడ్డ బాగు కోసం జీవితకాం కష్టపడ్డారు. ఉన్నదంతా వాళ్ళకే అప్పజెప్పారు. తమకంటూ ఏమీ ఉంచుకోకుండా ఆస్తుల్నీ పంచిపెట్టారు. కానీ మలివయసు జీవితంలో మాత్రం  ఇద్దరిదీ నెలవారి వాయిదాలుగా గడపాల్సిన పరిస్థితే.  

 

‘‘ఒక్కొక్కరి దగ్గర రెండేసి నెలలు ఉండండి. అప్పుడు ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు.’’ అని పేగుపంచుకుని పుట్టిన బిడ్డలే తమను వాటాుగా వేసుకున్నారు. అలా రెండేసి నెలు చొప్పున కన్నబిడ్డ దగ్గర కాలం వెళ్ళదీయడంలో ఇంచుమించు ఇద్దరిదీ ఒకేదారి అయ్యింది.

 

రఘురాంకి ఇద్దరు కొడుకులు. ఒకరు హైదరాబాద్‌, మరొకరు ముంబయ్‌లో ఉద్యోగం. పరంధామయ్య కొడుకు బెంగళూర్‌లో పని. కూతురు హైదరాబాద్‌లో ఉంటుంది. సంపాదించిన ఆస్థులని కొడుకుతోపాటు కూతురుకి కూడా సమానంగా పంచడం వలన, అన్నయ్యలాగే అతని కూతురు కూడా రెండు నెలలు నాన్నను పంచుకోవడానికి  ఒప్పుకుంది.  

 

ఇలా తలోదారి నుంచి వచ్చి,  పచ్చని పార్క్‌లో యాదృచ్ఛికంగా స్నేహితులయ్యారు. కలిసిన ప్రతిపూటా.. మలిసంధ్యను ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తున్నారు.

 

 0000

 

అలా కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకుని.. ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. ఇద్దరు మనసులో ఇన్నాళ్లూ గూడుకట్టుకున్న భారం దిగిపోయినట్టయ్యింది. మానవ బంధాలు పంపకం ఊబిలోంచి బయటకొస్తున్న సంతోషం ఇద్దరినీ గాల్లో తేలియాడేలా చేస్తోంది. రేపట్నుంచి సాయంకాలాలే కాదు.. వేకువ జాముల్లోనూ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని హాయిగా తిరగొచ్చు. పొద్దువాలేదాకా బ్డోన్ని కబుర్లు చెప్పుకొవచ్చు.. ఇలా అనేక విషయాను ఊహించుకుంటూ.. ఇద్దరూ ఆ రాత్రి హాయిగా నిద్రపోయారు. 

 

 0000

 

వారం రోజుల తర్వాత.. హ్యేపీ హోమ్‌. 

 

ఓల్డేజ్‌ హోమ్‌ అనో వృద్ధాశ్రమం అనో పేరు పెట్టడం ఇష్టంలేక.. నిర్వాహకులు అలా అందమైన, అర్ధవంతమైన పేరు పెట్టుకున్నారేమో. పచ్చని ప్రాంగణంలో పసిపిల్లల్లా నవ్వుతూ తుళ్ళుతున్న పెద్దలు అటూ ఇటూ తిరుగుతున్నారు. కొందరు క్యారమ్స్‌ ఆటలో నిమగ్నమయిపోయారు. ఇంకొందరు కబుర్లలో మునిగితేలుతున్నారు. ఇద్దరు మాత్రం పూలమొక్కలకు నీళ్లుపోయడం మానేసి ఒకరి ఒంటిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ తెగ ఆనందపడిపోతున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు  హిట్లర్‌, మరొకరు రఘురాం.  ఇద్దరిలోనూ..మలిసంధ్య వెలుగులో కొత్త ఉదయాన్ని చూస్తున్నామనే ఆనందం స్పష్టంగా కనపడుతోంది. ఒకటే చిన్నపిల్లల కేరింతలు, తుళ్లింతలు. ఇద్దర్నీ చూస్తున్నవాళ్లూ అంతే సంబరపడుతున్నారు. 

***

Bio

గంగాధర్ వీర్ల

వృత్తి జర్నలిజం. గత పద్దెనిమిదేళ్ళుగా సుప్రభాతం, ప్రజాశక్తి, ఈనాడు, సాక్షి, హెచ్ఎంటీవి, టెన్ టీవి, 99టీవి వంటి పత్రిక, ఎలక్ట్రానిక్ ఛానళ్ళలో పొలిటికల్ కార్టూనిస్ట్, రిపోర్టర్, చీఫ్ రిపోర్టర్, సబ్ ఎడిటర్, చీఫ్ సబ్ ఎడిటర్, సీనియర్ ప్రొడ్యూసర్,  ఫీచర్స్ ఇన్ ఛార్జి వంటి  వివిధ హోదాల్లో్ విధులు నిర్వహించారు. సాహిత్యపరంగా ‘‘యమా.. ఐయామ్ సారీ’’ అనే నాటిక 2006 నంది నాటకోత్సవాల్లో ప్రదర్శితమయ్యింది. నాటక ప్రక్రియలో ‘‘అనగనగా సామాన్యుడు’’, ‘‘ఊరు రమ్మంటోంది’’, ‘‘ యమలోకంలో భూలోకం’’ వంటి రచనలు చేశారు. ఇప్పటిదాకా… సుమారు పదిహేను కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో రాజు-బంటు, అంకురం మొలకెత్తిన వేళ, అనగనగా కూరలమ్మ, షేరింగ్ ఆటో వంటి కథలు వివిధ పోటీల్లో బహుమతులు దక్కించుకున్నాయి. కథ, నాటకరచన, కార్టూనింగ్ వంటి ప్రక్రియలతోపాటు వచన కవిత్వంలో ప్రవేశముంది. కార్టూనిస్ట్ గా దాదాపు అన్ని తెలుగు పత్రికల్లో వెయ్యికిపైగా కార్టూన్స్ అచ్చయ్యాయి. చిత్రకారుడుగా ఇప్పటిదాకా రెండు సోలో పెయింటింగ్ ప్రదర్శనలు నిర్వహించారు. పాటలు, గిటార్ వాదన ఇతర అభిరుచులు.

***

Mani vadlamani
Comments
bottom of page