top of page
bhuvanollasam.PNG
srinivyasavani.PNG

సంపుటి  6   సంచిక  1

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

వ్యాస​ మధురాలు

     

 క్షేత్రయ్య పదములు - సంగీత ప్రాధాన్యత

KrishnaKumari_edited.jpg

డా. వై.  కృష్ణ కుమారి

 ఏ విద్యకైనా రెండు సోపానాలుంటాయి.

 

చదువుల తల్లిని మనసులో భావించి, నిల్పుకొని, ఆరాధించడం మొదటి సోపానమైతే అయితే కరుణించిన ఆ తల్లి ప్రసన్న కటాక్షం రెండవ సోపానం.

 

అయితే ఇది లోక సామాన్యమైన చదువుల వల్ల రాదు. ఇది తపఫలం. దైవ సమానుడైన గురు ముఖతః అభ్యసించి,  ఆ విద్యను ఒక తపస్సులాగా ఆరాధిస్తే, అంతరంగం  నుండి ఒక వెలుగులా వెలువడి అనిర్వచనీయ దివ్యానుభూతి కళాకృతి గా దర్శనీయ మవుతుంది. ఈ అనుభూతి ఒక్కొక్క కళాకారునిలో ఒక్కొక్క విధంగా  ఆవిష్కరింప బడుతుంది. ఈ కళాకారులు భగవంతుని సృష్టికి అందమైన నిర్వచనాలీయ గలిగిన సమర్ధులు. అటువంటి ఒక  నిర్వచనం –ఏవో లోకాలకు తీసుకెళ్ళి, మైమరపింప చేయగల సంగీతంగా మారింది క్షేత్రయ్యకు  సంబంధించినంతవరకు.  ఇది భాషకు  అందని అలౌకికానుభూతి.   క్షేత్రయ్య  సంగీత రచన నభూతో నభవిష్యతి. సంగీత రచనకు సంబంధించినంతవరకు ఇతనికంటే ముందు సాహిత్యానికి ఉన్న విశిష్టత సంగీతానికి లేదు. 

ఒక్కొక్క రాగం, అది పలికే  తీరు, ఆ స్వరాలకున్న శక్తి, ఆ స్వర సమూహం వలన కలిగే  మధురిమ, ఆ  స్వరచిత్రం వలన ఏర్పడే ఆనందం, మన కళ్ళముందు సజీవంగా కదలాడే ఆ పాత్రలు. ఇట్లా ఒకదాని తరువాత ఒకటి చకచకా కళ్ళముందుంచుతుంది ఈతని సంగీత బాణీ. 

ఏ రాగం ఉపయోగించడం వలన ఆ రచన మనోజ్ఞంగా భాసిస్తుందో, ఆ రచన మరింత భావ భరితంగా రూపుదిద్దుకుంటుందో క్షేత్రయ్య కు బాగా తెలుసు. రస నిర్వహణకు కావలసిన అంగ నిరూపణలో సున్నితమైన, సుకుమారమైన భేదములను కల్పించడమే కాకుండా వాటిని చిత్రించడానికి కావలసిన భాష,   సంగీత రచన ఇతనికి కరతలామలకం . ఏ స్వర సంగతుల వలన రాగములో భావోద్రేకం కలగడానికి వీలవుతుందో తెలిసిన ప్రౌఢ కవి కాబట్టి దానికి తగిన సాహిత్యం కూడా అప్రయ్నతంగా సుకుమారమైన తీగలుగా సాగించాడు. ఆయా రసభావాల తీవ్రతలోని వ్యత్యాసాలు, దానికి ఉపయోగించిన రాగ వైవిధ్య ప్రయోగ జ్ఞానం క్షేత్రయ్య ను ఒక సంగీతకారులలో ఒక ప్రత్యేక స్థానంలో నిల్పింది. ముఖ్యంగా విరహం, విషాదం వంటి సందర్భాలలో ఇతను ఉపయోగించిన పున్నాగవరాళి, కాంభోజి, ముఖారి, ఘంట, నవరోజ్ వంటి రాగాలలోని బహుసూక్ష్మ ప్రయోగాలు  విన్నప్పుడు మన కళ్ళు చెమర్చక పోవు. 

సంగీతజ్ఞానంతో  పాటు అపారమైన లయ జ్ఞానం, అభినయవిద్య  ఈతని మరొక ప్రత్యేకత.   ఈతని పదాలు నృత్య కళాకారులకే నడకలు  నేర్పాయి. ముఖ్యంగా మిశ్రచాపు తాళం విశిష్టత బాగా తెలిసినవాడు కాబట్టి దాదాపుగా తన రచనలన్నీ మిశ్రచాపులో రచించాడు. ఆ ఏడు అక్షరాల తాళం లోని గతిని, విన్యాసాన్ని అతి రమ్యంగా ప్రదర్శించాడు. నాయిక సూక్ష్మాతి భావాలు కూడా ఈ తాళం లో ఒదిగిపోయి అత్యంత రమ్యంగా ప్రకటించబడ్డాయి. రాగాలకి ఇంతటి సమ్మోహన దీప్తి, తాళాలకు ఇంతటి మహత్తర శక్తి ఉంటాయనడానికి ఈతని పదాలే చక్కటి తార్కాణాలు. ముఖ్యంగా ఈతని పదాలు విలంబ కాలంలో ఉండడంతో అనేక భావాల ప్రకటనకు వీలు కల్గింది కూడా. అయితే పదాల సంగీతం  అనేక గమకాలతో కొంత సంక్లిష్టత ఉండండం వలన తర్వాతికాలంలో ఎందఱో ఆ రకమైన విద్వత్తును గానంలో గాని, అభినయంలో గాని ప్రదర్శించ లేక పోయారు. 

కేవలం సంగీత సాహిత్యాలలో అపరిమితమైన జ్ఞానం  ఉండటమే కాదు,  మౌలికంగా కృష్ణ భక్తుడు కూడా కావడంతో ఈతని రచనలైన  మువ్వ గోపాల పదాలు మధురభరితాలై సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిల్పుకున్నాయి. హిందుస్థానీ సంగీతంలో టుమ్రీ అనే ప్రక్రియ ఉంది. రాగభావాన్ని పలికించడానికి ప్రత్యేక సాధన చేయడమే కాకుండా ఆయా రాగాలలోని జీవస్వరం,  రాగచ్చాయ గొంతులో స్పష్టంగా, శ్రావ్యంగా పలికేందుకు కృషి చేస్తారు హిందుస్థానీ సంగీతకారులు. క్షేత్రయ్య పదాలలోని సంగీత విశేషాలు గమనించినట్లయితే  అటువంటి ప్రత్యేక సాధన ఇతనికి పరిచయం ఉందా అని సందేహం కలుగుతుంది. 

కాంభోజి, సావేరి, మోహన, ఆనందభైరవి, సౌరాష్ట్ర, హిందోళ, ఉస్సేని మొదలైన  రాగాలలో సంపూర్ణమైన జ్ఞానం కావాలంటే క్షేత్రయ్య పదాలు అభ్యాసం చేయక తప్పదు. ముఖ్యంగా కాంభోజి, తోడి రాగాలు రెండు ఈతనికి సంబంధించినంతవరకు  సంగీత శబ్దకోశాలని చెప్పాలి. ఈ నాటి వరకు ఎంత ప్రజ్ఞావంతుడైన వాగ్గేయ కారుడు కూడా ఈ రెండు రాగాలకు  క్షేత్రయ్య ను మించి స్వరకల్పన చేయలేక పోయారు. ఈ పదాలు క్షేత్రయ్య మనోప్రేరణ వల్ల రూపుదిద్దుకున్నవే.  అందుకే ఇటువంటి రచనలు  అంతకుముందు కానీ ఆ తర్వాత  కానీ  కన్పించవు.  అంతేకాదు,  క్షేత్రయ్య పదాలు ఆడిపాడటానికి ఎంతటి రసజ్ఞత కావాలో వినడానికి, చూడటానికి కూడా అంతటి రసజ్ఞత కావాలి. 

 ఆతని మాటలలోనే క్షేత్రయ్య కు సంగీతం పట్ల గల అభిప్రాయంతో ముగిస్తాను. 

”వెన్నెల బైట సంగీతము విననట్టి వేడుకేటి వేడుకే?

చిన్నెలు మెరయించి, చిరునవ్వు నవ్వని చిత్తమేటి చిత్తమే?

సన్నుతాంగిరో! కనుసైగ సేయని  యట్టి పదములేటి పదములే?”

అక్షరసత్యాలు కావంటారా?

*****

bottom of page