MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
వ్యాస మధురాలు
కవిత్వం - కొన్ని అవసరాలు
విన్నకోట రవిశంకర్
కవిత్వం - అవసరాలు అన్న అంశాన్ని అనేక కోణాల నుండి పరిశీలించవలసి ఉంటుంది. ముందుగా, సమాజానికి లేదా వ్యక్తులకి కవిత్వం అవసరం ఏమిటి అన్నది చూద్దాం. కవిత్వం మన మనసుల్ని మెత్తబరిచి, మనలో చేతనా సౌకుమార్యం పెంపొందిస్తుంది కాబట్టి, అది చాలా అవసరమైన ప్రక్రియ అన్నది ఒక వాదన. ఐతే, దీనినొక ప్రతిబంధకంగా చూసేవారు కూడా లేకపోలేదు. ఎందుకంటే, అటువంటి సున్నితత్వం, లేదా త్వరగా స్పందించే గుణం కర్తవ్య నిర్వహణలో, కఠిన నిర్ణయాలు తీసుకోవటంలో అవరోధం కల్పిస్తుందని వారు భావిస్తారు. ప్రారంభ యూవనంలో ఉన్న రోజుల్లో బాధ్యతల్లేని బలం వల్ల, వర్తమానం మీద ప్రేమతో, భవిష్యత్తు మీద ఆశతో ఒక స్వప్నలోకంలో విహరించే అవకాశం వల్ల అటువంటి సున్నితత్వం సహజంగా ఆకర్షిస్తుంది. కానీ, ఒక పరిణత వయసు వచ్చాక అనే మానసిక స్థితి ఉంటుందా అన్నది సందేహమే. మన సాధారణంగా చూస్తూ ఉంటాం - పదహారేళ్ళ వయస్సులో చాలా మంది కవిత్వం రాయటంగాని, కనీసం కవిత్వం మీద అభిమానం చూపించటంగాని చేస్తూ ఉంటారు. అసలు, ఒక థీరీ ప్రకారం మనుషులందరూ పుట్టినప్పుడు కవులుగానే పుడతారు. చిన్న పిల్లలు తమ నిరంతర సృజనాత్మక శక్తివల్ల, యువతీ యువకులు వారిలో ఉప్పొంగే ఆవేశం లేదా ప్రేమభావం వల్ల దానిని ప్రదర్శించగలుగుతారు. ఆ తరువాత క్రమంగా అది దూరమైపోతుంది. నలభై సంవత్సరాలు వచ్చాక కూడా ఇంకా కవిత్వం రాస్తున్నానని ఎవరైనా అంటే, ఒకప్పటి మిత్రులు విచిత్రంగా చూస్తారు - నీకింకా రియల్ జాబ్ ఏదీ దొరకలేదా అన్నది వాళ్ళ సందేహం కావచ్చు. ఈ సందర్భంలో ప్రసిద్ధి చెందిన ఒక కొటేషన్ గుర్తుకు వస్తుంది. If a man is not a socialist at 20, he has no heart. If he is still a socialist at 40 he has no brain అని. కవిత్వం రాయటం కూడా అలాంటిదేనని అటువంటివాళ్ళ ఉద్దేశం.
చేతనా సౌకుమార్యాన్ని, సున్నితత్వాన్ని మించిన మరొక ముఖ్యమైన అవసరమేదో కవిత్వం తీరుస్తుంది. బహుశా, అదే దానిని శాశ్వతంగా నిలబెడుతుంది. ఎప్పుడైనా చూడండి, సమిష్టి మానవ విజయాల్ని ప్రస్తుతించే కవితలు కొన్ని ఉన్నా - శ్రీశ్రీ మ”నవుడా! మానవుడా! “వంటివి - వ్యక్తిగతమైన మానవ వైఫల్యాలను చిత్రిచే కవితలే ఎక్కువగా ఉంటాయి. ఆవిధంగా అవి మనిషికి, మానవ యత్నానికి ఉన్న పరిమితుల్ని గుర్తుచేస్తాయి. మన భక్తి సాహిత్యంలోను, ప్రత్యేకించి తత్వాల వంటి వాటిలో కనిపించేది ఇటువంటి భావమే కదా! అవి చదివినప్పుడు, కష్టాలలో ఉన్న, వైఫల్యాల వల్ల బాధపడుతున్న మనిషికి ఒక ఊరట వంటిది లభిస్తుంది. కష్టకాలంలో ఒక నమ్మకమైన తోడుగా ఇటువంటి కవిత్వం నిలుస్తుంది. దానితో సరైన సంబంధాన్ని ఏర్పరుచుకొనే నేర్పు ఉండాలేగాని, కవిత్వాన్ని మించిన నేస్తం మరెక్కడా దొరకదు. హిబ్రూ మహాకవి యహోదా అమీచాయి గురించి ఒక విషయం చెబుతారు. అరవైల్లో అరబ్బులతో జరిగిన యుద్ధంలో పాల్గొన్న ఇజ్రాయిల్ సైనికులు రణభూమికి వెళుతూ ఆయన కవితా సంపుటాలు తమతో తీసుకువెళ్ళేవారట. ఒక విషాదకరమైన, భయావహమైన ఒంటరితనంలో కవిత్వం తోడుగా నిలుస్తుందనటానికి ఇదొక గొప్ప తార్కాణం. చాలా ఏళ్ళ క్రితం ఘంటసాల ప్రత్యేకంగా సమర్పించిన జనరంజని కార్యక్రమాన్ని ఇటీవల విన్నాను. అందులో ఆయన, తన జీవితానికి దగ్గరగా ఉండటంవల్ల పాడినప్పుడు సంతృప్తిని, ఊరటని ఇచ్చిన పాటలుగా రెండిటిని పేర్కొన్నారు. అవి -ఒకటి దేవదాసులో “జగమే మాయ”, మరొకటి ప్రేమనగర్ లో “మనసుగతి ఇంతే”". ఇవి రెండూ వైఫల్యానికి సంబంధించినవే అని వేరుగా చెప్పనక్కర్లేదు. అయినా, అవే ఆయనకు ఊరటనిచ్చాయంటే అది ఆ సాహిత్యంలో ఉన్న గొప్పదనం.
సమాజానికి, మనుషులకి కవిత్వం అవసరం గురించి చెప్పుకున్నాక ఆలోచించవలసిన మరొక విషయం అసలు కవికి కవిత్వం రాయవలసిన అవసరం ఏముందన్నది. దానివల్ల పేరు రావటం, గౌరవం పెరగటం వంటివి తరువాత కాలానుగతంగా జరిగే అంశాలు. అలా జరుగుతుందని హామీ కూడా ఏమీ లేదు. ఇక్కడ జరిగే ప్రక్రియ ఏమిటంటే, ఒక ప్రేరణ కలిగినప్పుడు ఆ ప్రేరణకు పదాలతో రూపం ఇచ్చే నేర్పు కలిగిన కవికి కవిత రాయటం అనివార్యమౌతుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం చెప్పుకోవాలి. వివిధ సంస్కృతులలో కవులపై వచ్చిన కథలు చదివినప్పుడు, కొన్ని సందర్భాలలో ఇటువంటి ప్రేరణ, ప్రతిభ ఏర్పడటంలో దైవానుగ్రహం ఉన్నట్టుగా భావించటం మనం చూడవచ్చు. ఉదాహరణకి, ఇంగ్లీషులో పేరు తెలిసిన మొదటి కవిగా చెప్పబడే Caedmon గురించి ఒక కథ ఇటీవల చదివాను. (ఇది Venerable Bede రచించిన Ecclesiastical History of England లో ఉంటుంది.) Caedmon ఒక పశువులకాపరి. అతనికి పాటలు పాడటం రాదు. వాళ్ళలో విందులు, వినోదాలు జరిగినపుడు, ఒక జంత్ర వాయిద్యాన్ని ఒకరి నుంచి ఒకరికి అందిస్తూ, అది అందుకున్న వారిని పాడమంటూ ఉంటారు. ఒకసారి అలా జరుగుతున్నప్పుడు, తన వంతు వచ్చే సూచన ఉందని గమనించిన అతను అక్కడినుంచి గబగబా బయటకి వెళ్ళిపోయి గుర్రపుశాలలో దాక్కుంటాడు. అప్పుడతని దగ్గరికి ఒక పెద్దాయన వస్తాడు. ఆయన బహుశా భగవంతుడే కావచ్చు. ఆయన Caedmon ని తనకోసం పాడమని అడుగుతాడు. ఇతను తనకు పాట రాదు, పాడలేనంటాడు. ఎన్నిసార్లు చెప్పినా ఆయన వినకపోవడంతో చివరికి ఏమి పాడమంటావని అడుగుతాడు. దానికాయన, సృష్టి మొదలు గురించి పాడమంటాడు. Caedmon పాడటానికి నోరు తెరవగానే, ఒక గంగా ప్రవాహంలా కవిత్వం ధారగా అతని నోటి నుండి వెలువడుతుంది. దేవుణ్ణి స్తుతిస్తూ అతనొక గొప్ప స్తోత్రం చదువుతాడు. ఆ తరువాత అతను monk గా కూడా మారతాడు . ఈ కథకి, మన కాళిదాసు కథకి సామ్యం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇతర కళల విషయంలో ఇటువంటి కథలు ప్రచారంలోకి రావటం అరుదు. ఉదాహరణకి, ఏ సంగీతకారుడో, శిల్పి లేదా చిత్రకారుడో దైవానుగ్రహం వల్ల రాత్రికి రాత్రే గొప్ప ప్రతిభావంతుడైన కళాకారునిగా మారిన కథలు మనం ఎక్కడా చదవం. వారు తమ ప్రతిభతో దైవానుగ్రహం పొంది ఉండవచ్చు. కానీ, దైవానుగ్రహంతో ప్రతిభను పొందే గౌరవం ఒక్క కవికే దక్కిందనుకుంటాను.
కవిత రాయటమన్నది రాయక తప్పని పరిస్థితి వల్ల అన్నది నిజమే కావచ్చు. ఐతే, కవిత్వం రాయటం కవికి నిజంగా ఆనందకరమైన అనుభవమా లేక బాధను కలిగించేదా? ఒక గొప్ప అందాన్ని చూసినప్పుడు, జీవితోత్సవంలోని వైభవాన్ని మనసుతీరా అనుభవించినప్పుడు కవి ఆనందంతో తన కవిత ద్వారా స్పందించే అవకాశాలుండటం సహజమే. కానీ, ఎక్కువ సందర్భాల్లో కవి తాను కవిత రాస్తున్నప్పుడు తన అంతరంగాన్ని, ఇందాక చెప్పుకున్నట్టు వైఫల్యాన్ని తరచి చూస్తూ ఆ ప్రక్రియలో ఉండే బాధను అనుభవించాల్సి ఉంటుంది. నేనొక పద్యంలో రాసాను .. "పద్యం రాయాలని ఉండదు / అంతరంగ వధ్య శిలపై మరొకమారు తలవంచాలని ఉండదు." అని. త్రిపుర కూడా ఒకచోట "confession లేని కవిత్వాన్ని నేను అంగీకరించలేన"ని అన్నారని విన్నాను.
పానుగంటివారి నాటకంలో, బహుశా కంఠాభరణం అనుకుంటాను, ఒక పాత్ర "కవులొచ్చారు, కర్ర పట్రా" అంటుంది. దీనిని ఉటంకిస్తూ ఇస్మాయిల్ గారు ఒక ముందుమాటలో ఇలా అంటారు - "పాపం కవుల్ని తన్నఖ్ఖర్లేదు. కవిత్వం రాయటమే అన్నిటికన్నా పెద్ద శిక్ష. కవికి జీవితమే ముడిసరుకు అంతరాంతరాళల్లోకి తవ్వుకు వెళ్ళి భయంకరమైన సత్యాలను కనుక్కోవటం, నువ్వు నువ్వు కానంతగా నీ తాదాత్మ్యాన్ని కోల్పోవటం, నీ పునాదుల్ని వెలికితీయటానికి నువ్వు పడే బాధా, వేదనా - నీ సర్వస్వమూ, అంటే నీ పంచేంద్రియాల్నీ, నీ మనస్సునీ ఎరువుగా వేస్తేగాని కవిత్వవృక్షం మొలవదు. “
ఆనందకరమైన అనుభవమా లేక బాధాకరమా అన్న ప్రశ్నకు అనుబంధ ప్రశ్నగా మరొకటి కూడా అడగవచ్చు. అదేమిటంటే, కవిత్వం రాయటం అనే దానిని పనిగా పరిగణించాలా లేక విరామంగానా అని. పూర్తికాలం కవులుగా ఉన్న ప్రబంధ కవులు కూడా దానిని "నిరుపహతి స్థలంబు, రమణీ ప్రియదూతిక యిచ్చు కప్పురపు విడెంబు"తో ముడిపెట్టారు కాబట్టి, దానిని వారు విశ్రాంతి గానే భావించారని చెప్పుకోవాలి. ఇప్పటి రోజుల్లో పూర్తి కాలం కవులు దాదాపుగా లేరనే చెప్పాలి. ఎక్కువమంది ఇతర రంగాల్లో పనిచేస్తూ కవిత్వం రాస్తున్నవాళ్ళే. వారి విషయంలో విరామమే, అది బాధాకరమైన సరే. కవికి కవిత రాయటమంటే ఒక విధమైన home coming వంటిది. అది తనను తాను తిరిగి చేరుకోవటం. mundane productive day job తో పోల్చి చూస్తే తప్పకుండా అది విశ్రాంతి వంటిదే అవుతుంది.
కవిత్వంలో భాష అవసరం గురించి కూడా రెండు మాటలు చెప్పుకోవాలి. ప్రతి భాషకీ తనదైన అందం ఒకటి ఉంటుంది. అది తెలిసేలా, భాషకు ప్రాధాన్యతనిస్తూ పదసౌందర్యంతో కవిత ఆకట్టుకోవాలని భావించేవారు కొందరు. అలా కాకుండా, కవిత్వమనేది భాషకు అతీతంగా ఉండాలని, ఒక కవిత అంతస్సౌందర్యాన్ని గ్రహించి, ఆస్వాదించటంలో భాష ప్రతిబంధకంగా నిలవకూడదని భావించేవారు మరికొందరు. ఇటువంటి కవిత్వం అనువాదానికి కూడా సులభంగా లొంగుతుంది. ఐతే, ఇలా రాసినప్పటికీ, అందులో పదాడంబరం ఉండదుగాని , ఒక సందర్భానికి, చెప్పదలుచుకున్న అనుభూతికి సరిపోయే పదం వాడటంతో కవి ప్రతిభ కనిపిస్తుంది. కవిత్వమంటే కేవలం good word in good place కాదు కదా, perfect word in perfect place . ఆ విధంగా చూసినప్పుడు, సరళమైన పదాలతో కవిత్వం రాయటమే కొంత కష్ట సాధ్యమైన పనిగా మనం భావించవలసి ఉంటుంది.
పదాల గురించి చర్చకు కొనసాగింపుగా పదచిత్రాల గురించి కూడా ఒకటి రెండు విషయాలు చెప్పుకోవచ్చు. ఒక దృశ్యాయాన్నిగాని, అనుభవాన్నిగాని వర్ణించేటప్పుడు కేవలం మాటలతో మాత్రమే కాకుండా అందుకు తగిన పోలికలు, రూపకాలతో చెప్పగలిగితే అది పాఠకుడికి మరింత ప్రభావవంతంగా చేరుతుంది. కవి, సైంటిస్టు ఒక ప్రత్యేకమైన ప్రతిభ కలిగి ఉంటారు. వారు పైకి ఏమాత్రమూ సంబంధం లేని రెండు అంశాల మధ్య సంబంధం చూడగలుగుతారు. కవులకి మరొక ప్రత్యేకత కూడా ఉంటుంది. ఒకే విధంగా కనిపించే రెండు పాదాల మధ్య, పదచిత్రాల మధ్య భేదాన్ని కవి చూడగలుగుతాడు. అదే సంగీతకారుడైతే వేరేవారికి ఒకేరకంగా వినిపించే రెండు స్వరాల మధ్య, చిత్రకారుడైతే ఒకే రకంగా కనిపించే రెండు రంగుల మధ్య భేదాన్ని చూడగలుగుతారు. కవితలో పదచిత్రాలు వాడినంత మాత్రాన సరిపోదు. సరైన చోట సరైన పదం వాడినట్టే, పోలిక కూడా సరిపోవాలి. అలాగే, పదాల విషయంలో పొదుపరితనం ఎంత అవసరమో పదచిత్రాలు విషయంలో అదే పొదుపరితనం అవసరమౌతుంది. ఎక్కువ పదచిత్రాలు వాడితే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందని అనుకోవటం పొరపాటు. సరిగా నప్పని పోలికలు, ఒకదానితో మరొకటి పొసగని పదచిత్రాలు వాడినప్పుడు, సంగీతంలో అపస్వరం ధ్వనించినట్టుగా వ్యతిరేక భావం తలెత్తుతుంది.
కవిత్వం ఒక అరుదైన, కష్టసాధ్యమైన కల. అది సమకూరటం ఒక వరంగానే భావించాలి. ఐతే, ఒకసారి అది లభించిన తరువాత ఆ జల ఆవిరై పోకుండా, ఆ జ్వాలా ఆరిపోకుండా ఉండటానికి కవి నిరంతరం తనదైన కృషి కొనసాగిస్తూ ఉండటం తప్పనిసరి.
*****
(మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు & 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో చేసిన ప్రసంగవ్యాసం.)