top of page
bhuvanollasam.PNG

సంపుటి  6   సంచిక  4

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

కథా​ మధురాలు

దృశ్యాదృశ్యం

 

మణి వడ్లమాని

mani-vadlamani.JPG

నిత్యకృత్యాలు జరిగిపోతున్నాయి. మధ్యాహ్నం గడిచి,  సాయంత్రంలోకి నడిచి,  రాత్రి లోకి వెళుతూ  రోజు భయంగా నా వైపు చూసింది. నేను రేపనేది చూడనని దానికీ తెలిసిందేమో. తప్పదని తెలిసి కళ్ళు మూసుకుని భయపడసాగింది.

భయం. భయం. భయం.

సందడి లేకపోవడం, దిగులుతో  పాటు, ఇల్లు వీధులు కూడా  నిశ్శబ్దంగా ఉండటంతో  తెలియని, గుబులు. రేపు  అన్నది  ఇంక   నా జీవితంలో  ఉండదు.

జీవించి ఉంటే, మళ్ళీ మళ్ళీ దాన్నే చూడాలి. అది వద్దు. చాలు ఈ జీవితం.

హమ్మయ్య!  ఇంకెంత సేపు?  మహా అయితే  ఒక ఇరవయి నిముషాలు. ఆ తరువాత  అంతా ప్రశాంతతే.

నాకు ఇష్టమయిన పాట  .. “ఆప్ కీ యాద్ ఆతీ రహీ రాత్ భర్”. ఆ...  గొంతులో విషాదం   వింటూ శాశ్వత  నిద్రలోకి  వెళ్లిపోవాలి. అదే  నా ఆఖరి కోరిక.

సెల్ ఫోన్  అదే పనిగా మోగుతుంటే  శాస్త్రి  గారి  కవితలో  ఒక పదం మార్చుకుని 'మనసారా  చావనీయరు” అనుకుంటూ    లేచి వెళ్లి   ఫోన్  తీసా...   

 

‘నేను  పంపిన మెసేజ్ ని   చూడు  అంటూ రాజు గాడి నుంచి ఫోన్. ఆ మాట చెప్పేసిన మరుక్షణంలో ఆ వైపు నుంచి ఫోన్ కట్ అయింది.

చావు కన్నా  కుతూహలం  ఇంకా పవర్  ఫుల్  లా ఉందే? అదేమిటో చూడమని మనసు ఆత్రుత  పెడుతోంది.

 

కొంత సేపు  ఈ లోకం నుంచి వీడ్కోలు తీసుకునే కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేశాను.

 

ఫోన్ తీసి  మెసేజ్ చూసాను.  అందులో ఇలా “ఈ లింక్ ఓపెన్ చేసే ముందు  ఇది  చదువు.  ఒక ఫోన్  నెంబర్, మెయిల్ id ఉన్నాయి .  ఇందులో   వాళ్ళిచ్చిన  వివరాల  ప్రకారం చూస్తే  ముందర  మెంబెర్స్ గా చేసుకుంటారు. అయితే ఎవరైనా  రాయవలిసిన అనుభవాలు మాత్రం వాళ్ళిచ్చిన మెయిల్ ఐడికి  మాత్రమే పంపాలి. వాటిని వాళ్ళు పేరు మెయిల్ ఐడి, ఫోన్ కూడా లేకుండా, మేటర్  ఒక్కటే  పబ్లిష్  చేస్తారు. దానికి కూడా  టైమింగ్స్ ఉన్నాయి. అవన్నీ గ్రూప్ నిబంధనలు. అందుకు  సమ్మతమయిన వాళ్లనే కొనసాగించనిస్తారు. ఏమాత్రం  విరుద్ధంగా అనిపించినా  వెంటనే  గ్రూప్ నుంచి తొలగిస్తారు. అందుకు  ఇష్టమయిన వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వాలి.  అంతేకాదు ఈ  గ్రూప్  లో అడ్మిన్స్ తప్ప వేరెవరు పోస్ట్ చెయ్యరు/చెయ్యలేరు. ఇందులో బాధలే కాదు, సలహాలు, పరిష్కారాలు కూడా ఇయ్యవచ్చు. అవతలి వాళ్ళ బాధ, ప్రాబ్లంకి నువ్వే పరిష్కారం ఇవ్వొచ్చేమో? నీకు ఇలాంటివి ఇష్టమే  కదా! అందుకే నీకు పంపిస్తున్నాను. నాకు తెలిసి ఇది కొంతమంది NGOలు చేస్తున్నట్లున్నారు. నీకు ఈ పాటికే అర్ధమయిందనుకుంటాను. దేనిగురించో ? అదే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికీ కంటికి కనిపించని  భయంకరమైన శత్రువు అయిన కరోనా గురించి అని”.

 

ఇంటరెస్టింగ్  గా ఉందే!  అనుకుంటూ వాడు చెప్పినట్లు చేశాను. వెంటనే. ఆడ్  అయినట్లు  నోటిఫికేషన్ వచ్చింది. ఎప్పుడయితే గ్రూప్ లో కలుపుకున్నారో వెంటనే అందులో ఉన్న పోస్ట్ చూడగలిగాను.

 

అది ఆ రోజు  పోస్ట్ చేసిన  అనుభవం.కేవలం కంటెంట్  మాత్రమే ఉంటుంది. ఎవరు రాసారో తెలిసే అవకాశం లేదు. కళ్ళు అక్షరాలను వెంబడించాయి.

దృశ్యాలు దృశ్యాలుగా కథలు కనిపిస్తున్నాయి

 

* * *

 

 దృశ్యం 1

“నీ టెస్ట్  రిజల్ట్స్  వచ్చాయి.  "కరోనా" అని తేలింది. నువ్వు ధైర్యంగానే ఉన్నావు.  కానీ, నాకే  భయం  పట్టుకుంది.

నన్ను క్షమించు, నా ప్రవర్తనకు నేనే సిగ్గు పడుతున్నాను. నీకు పోసిటివ్ అని తెలిసినప్పుడు నీ పట్ల నేను చూపిన నిరాదరణ. నీ   వ్యక్తిత్వం ముందు  నే మరుగుజ్జునయ్యాను.   నీ కళ్ళలో మటుకు అదే ఆరాధన అదే ప్రేమ అభిమానాలు కనిపించాయి. నా బలహీనతను చూసి నవ్వుకున్నావా? నిజమే, మానసికంగా నువ్వు దృఢంగా ఉన్నావు. జీవితాన్ని చాలా ప్రాక్టికల్ గా తీసుకున్నావు. భయపడితే ఆగేది ఏది లేదని తెలుసు. అయినా ఉష్ట్రపక్షి లాంటి మనస్తత్వం నాది. అందరి ఉండగా పెద్ద ధైర్య వంతుడిలా పోజ్ కొట్టే నేను. ఒక్కడిని ఉన్నప్పుడు మటుకు చాల భయపడతాను. నిజానికి పైకి కనిపించేది డాంబికం లోపల వట్టి డొల్ల. అది  ఈ  ప్రపంచానికి  శాశ్వతంగా  దూరం అవుతాం అనే   దానికన్నా, పక్కనున్న మన మనిషి  మనవాళ్ళు  అనుకునే వాళ్లు  చేసే  దూరం భరించలేనిది అని తెలిసి  కూడా  నీకు ఒక మాట  నేనున్నాను  అని,  ఏం పర్వాలేదు  అని చెప్పలేకపోయాను. ఎక్కడ  నీ మాట  విన్నా కూడా అంటుకు పోతుందేమో అనే ఆలోచన నన్ను వదల లేదు. నీకు తగ్గి ఇంటికి వచ్చాక  నీ కళ్ళలోకి  చూసే  శక్తి, ధైర్యం లేకపోయింది. అయినా వాటినిండా  కనిపించే దయ, కరుణ నన్ను విచలితుడిని చేస్తున్నాయి. అది తట్టుకోలేకపోతున్నాను. శక్తిని కోల్పోతున్నాను. నన్ను క్షమించు.

చావే దూరం చేయాలి కాని బతికి ఉండగా ఏ బంధంలోనూ దూరం పెంచుకోగూడదు. ఇదే నేను తెలుసుకున్న సత్యం”

ఇది  ఓ భర్త  అంతరంగం  అని  ఉంది.

ఫోన్ పక్కన పెట్టాను.

హు! భలే మనిషిలా ఉన్నాడే, అయినా అందరిలో ఎన్నోన్నో కబుర్లు  చెప్పే  ఆ  భర్త   ఒంటరిగా  ఉంటే  మహ భయస్తుడు, ఆలోచించటానికి భయపడే  భీరువు అని ఊరికే అనలేదు. అదే తనకి వచ్చి ఉంటే  భార్య అతన్ని ఇలాగే ట్రీట్ చేసేదా? హు.స్వార్ధం. కరడుకట్టిన స్వార్ధం. అవునూ? అరె! అదేంటి?  నేను పోవాలి  కదా! మధ్యలో  ఈ పిట్ట కథలేంటి? 

ఛ... ఛ...  అలా అనుకోకూడదు. అవి కథలు  కాదు. మానసిక వ్యధలు!

మనసు ద్వైదీభావంతో ఊగిసలాడింది.

నిజమే  మరి నువ్వు చచ్చిపోదామని డిసైడ్  అయ్యావు కదా? మనసు ప్రశ్న వేసింది.

అవుననుకో  అవి చదివేసాక ... అని జవాబు అదే ఇచ్చింది. 

ఆ పక్కనే  టెస్ట్  రిజల్ట్  కవర్  లోంచి రిపోర్ట్  గాలికి ఎగురుతోంది.

ఎదురుగా ఉన్న గడియారం లో పెద్దముల్లు చిన్నముల్లు వాటిపని చేసుకుపోతున్నాయి.

***

 

 దృశ్యం-2

ఇదో వ్యథ. సారీ! కథ. అనాలి కాబోలు.

“The battle has just begun. You tell me I'm not the only one”

నిజం కదా!

లేకపోతే ఎంతో ఆనందంగా సాగవలసిన ఈ జీవితం ఇప్పుడే ఓ సమస్యతో, కాస్త సందిగ్ధతతో మొదలు కాబోతోందా? అన్ని అయ్యాకా శుభలేఖలు అచ్చు వేసాక  అమ్మా, నాన్నా  పోనీలే  బ్రేక్ చేసేద్దాము ఈ సంబంధం అంటారేమిటి? అతను డాక్టర్, రోజు కొన్ని వేలమందికి ప్రాణాలు పోస్తున్నాడు. ఎవరో పాజిటివ్ పేషెంట్ల ద్వారానే ఇతనికి  వైరస్ సోకినట్లు తెలిసింది. అందుకు అతను నన్ను కలవడానికి రావద్దని చెప్పేసాడు. పెళ్ళికూడా  వాయిదా వేసాడు. దీంతో అమ్మ వాళ్ళు  ఓ నిర్ణయానికి వచ్చేసారు. కానీ నాకు అది చాల తప్పుగా అనిపించింది. అతను  యెంత  డాక్టర్ అయినప్పటికి  లోలోపల  ఎక్కడో తెలియని చిన్న భయం అనేది ఉంటుంది. ఒక మనిషిగా అతనికి నేనున్నాను  అనే కాన్ఫిడెన్సు  ఇవ్వడం కనీస ధర్మం. అలాంటి అతన్ని కష్టపెట్టటం  నా వల్ల కాదు. అతను రోజూ తనతో మాట్లాడందే ఉండలేడే? నాకు  మమ్మీ డాడీల ఆలోచన అస్సలు నచ్చలేదు. అసలు అంత ఘోరంగా  ఎలా అనుకుంటున్నారు” అని తల్లి తండ్రుల  ప్రవర్తన గురించి రాసుకుంది.

చదవడం ఆపి ..ఒక్కక్షణం ఆలోచించాను. ఇది రాసింది ఒక అమ్మాయి అని తెలుస్తోంది. కళ్ళముందు  ఓ రూపాన్ని నిలిపే ప్రయత్నం చేశాను.అబ్బే.. కుదరటం లేదు. అస్పష్టమైన ఆ రూపం  చెదిరిపోతోంది.

వెంటనే లేఖ గుర్తుకి వచ్చి మనసంతా హాయిగా నిండిపోయింది.

పత్రలేఖ... ఇలాగే ఆలోచిస్తుందా?  నా సంగతి  తెలిసింది కదా. అసలు తన ఆలోచనల లోపల రూపం ఎలా ఉంటుందో? పైకి కనిపించేదే నిజమని ఎలా నమ్మగలం.

అందుకే ఊరికే అవతల వాళ్ళని అంచనా వేసేసి జడ్జిమెంటల్ అయిపోకూడదు.

ఇక నా  ఆలోచనలకి అడ్డుకట్ట వేసి చదవడం కొనసాగించాను.

***

దృశ్యం-3

ఓ వలసకూలి తల్లి చెప్పిన తనకి చెప్పిన కన్నీటి కథని ఓ జర్నలిస్టు, ఆ తల్లి మాటల్లోనే పంపాడట.  పోస్ట్ చేసారు.

“పట్నం  నుంచి తిరిగి వచ్చిన పోలాయి నీరసంతో అలిసిపోయి మంచాన పడ్డాడు .

వాడు అలా దగ్గుతూ, నీరసంగా పడుంటే  నూకాలుకి  బాధ వేసింది. పైగా వాడిని అలా కుక్కి మంచంలో చూస్తుంటే, వాడి తండ్రి పడుకున్న తీరే గుర్తుకు వస్తోంది. ఆ తరువాత ఆడు పోయాడు  కూడా.

అప్పుడు  ఆడిది అంటే ముసలి ప్రాణం, వీడు చిన్నపిల్లాడే కందా  ఏదో పట్నం పోయి నాలుగు డబ్బులు సంపాదించి  తెద్దామని వెళ్ళాడు.

పైడితల్లి  సంపాదన అంతా వాడి తాగుడికే సరిపోతుంది. నూకాలు కేమో ఉబ్బసం, ఆయాసంతో దగ్గి దగ్గి ఊపిరి ఆగిపోయేటట్లు ఉంటుంది.

వెళ్ళిన రెండు నెలలకే ఫోన్ చేసి, అమ్మా అందరు ఊరుకి పోతున్నారే నేను కూడా వచ్చేస్తాను అని చెప్పినాడు. ఎవరో ధర్మాత్ముల పుణ్యమా అని ఇరవయి రోజుల తరువాత గాని చేరుకోలేకపోయాడు. దారిలో నానా కష్టాలు పడి వచ్చాడు. వచ్చిన కాడి నుంచి  దగ్గు, జలుబుతో  బాధపడుతున్నాడు.

అప్పట్లో అందరూ ఇక్కడ నుంచి  పొలోమని కాంట్రాక్టు కూలీలుగా ఆ పెద్ద పట్నం పోయారు. వద్దన్నా వినకుండా పోయాడు. ఆ బిల్డింగ్స్ కట్టేకాడ  బోలెడు పని ఉంటుంది. డబ్బులు బాగా వస్తాయి అనుకున్నాడు. తీరా అక్కడ  బోలెడు పని  చేయించి, డబ్బులు ఈయాల్సిన టయానికి, పోలాయిని తీసుకెళ్ళిన కాంట్రాక్టర్ వీడికి  వచ్చే జీతంలో మూడొంతులు తీసేసుకునే వాడు. పైగా  అలా ఎందుకు చేస్తున్నావని అడిగితే ! దొంగ నాకొడకా!  నేను గానీ ఈ పని చూపించక పొతే  పస్తులుండేవాడివిరా, అంటూ  నానా బూతులు తిట్టి డబ్బులు లాక్కునేవాడు.

అంతలో  ఈ మాయదారి  రోగం మహమ్మారి  లా వచ్చి మా నోళ్ళు , కడుపు కొట్టేసినాది ఇక అక్కడ పనిలేక పోయే, డబ్బు లేక పోయే, తిండికి కూడా కరువచ్చే పడే, అందుకే విడిచి పెట్టమని వాళ్ళని బతిమాలి బతి మాలి  నడుచుకుంటూ వచ్చేసాడు ఆ రావడంలో  చాల కష్టాలు పడ్డాడు. పిల్లడు యెంత దుఃఖ పడ్డాడో? ఆ దేవుడికే ఎరుక.

“అమ్మా! నేను  ఇంకా పట్నం పోనే పోను. ఇక్కడే పని చేస్తా” అని ఏడిచాడు.

ఇది ఇంకా ఘోరం.

చదువుతున్న నా  గుండె చెరువయి పోయింది.

కళ్ళు చెమర్చాయి. చప్పున కళ్ళు తుడుచుకున్నాను.ఈ మధ్యనే వలస కూలీల మీద రాసిన ఒక పాట గుర్తొచ్చింది.

***

మెలకువ వచ్చింది. క్షణ కాలం ఎక్కడున్నానో తెలియలేదు. చెయ్యి చాచి  సెల్ అందుకున్నాను. టైం ఐదున్నర  అవుతోంది. కొంతసేపు ఆగి మంచం మీద నుంచి లేచాను. బయట అంతా నిశ్శబ్దంగా ఉంది. అందులో మాది గేటేడ్ కమ్యూనిటీ కావటం వల్ల పెద్దగా శబ్దాలు ఉండవు. నా ఫ్లాట్ ఆరవ అంతస్తులో ఉండటం వల్ల బయట రోడ్, దానికి అనుకున్న పార్క్ కనిపిస్తున్నాయి. అక్కడ చెట్లమీద నుంచి వినిపించే పక్షుల కిలకిల రావాలు, గుత్తులుగుత్తులుగా పూసిన ఎరుపు, పసుపు రంగుల  తురాయి పూలు, ఆ పూలు కింద పడి పసుపు కుంకుమలతో అందమైన ముగ్గుపెట్టినట్లుగ ఉంది. ఈ ఫ్లాట్ ఆఫీస్ కోసం పెట్టుకున్నది, దానికి తగ్గట్టుగా అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నది. ఇది గో ఇలా  పనికి వచ్చింది.

శకలాలు గా వచ్చిన ఆ  కలని గుర్తుకు తెచ్చుకున్నాను. అబ్బ యెంత దీర్ఘంగా ఉంది. 

 

తను చనిపోవాలని అనుకోవడం? తలుచుకుంటే నవ్వు వస్తోంది.

 

బట్… అసలు  ఆ ఆలోచనే  తనలోలేదు  అయినా కలలో వచ్చింది. కలలో మా రాజు నుంచి మెసేజ్  రావటం, దాని మూలాన కొంతమంది జీవిత కథలు తెలుసుకోవడం, తలచుకుంటే భలే  వింతగా ఉంది.

నిజానికి కరోన పాజిటివ్ వచ్చిందని తెలిసి హోం క్వారంటైన్  లోనే  ఉంటున్నాను... రాత్రి   ఆఫీస్ పని వత్తిడితో చాల అలిసిపోయి తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను. సబ్ కాన్షస్ లో తుట్టలా ఉన్న భావాలన్నీ ఇలా వరుసపెట్టి  దృశ్యాదృశ్యంగా అదీ ఓ  దీర్ఘకల రూపంలో రావడం విచిత్రంగా ఉంది.

వయసు మళ్ళిన భర్త స్వగతం, ఆ తరువాత  పెళ్లి చేసుకోబోయే యువతి సంఘర్షణ, ఆ తరువాత  వలస కూలీ తల్లి బాధ కూడా  ఇంకా కళ్ళ ముందే ఉన్నాయి.

 

ఇవన్నీ కల అంటే నమ్మబుద్ది కావటం లేదు. కానీ అవి ఎందుకు యదార్ధంగా అనిపిస్తున్నాయి?

 

కానీ ఒక్కటి అర్ధం కాలేదు కల అయినంత మాత్రాన అది నిజమని నమ్మకూడదా! అంటే మెదడులో  నరాల పొరల అరల్లో దాగిన ఆలోచన శకలాలే ఇలా కలలుగా రూపాంతరం చెందుతాయా? సుప్తచేతనావస్థలో మెదడు  తనలో దాచుకున్న వాటిని బయటకు తీస్తుందా ? ఏమో?

మొన్న టీవీ లో చూసిన ఓ సంఘటన, ఓ ముప్పయేళ్ళ యువకుడి కరోనా పాజిటివ్  వచ్చిందని  తెలిసి  ఆత్మహత్యా  ప్రయత్నం చేయడం, మరో కథలో  ఓ భార్యకి కరోనాసోకితే  ఇంట్లో వాళ్ళే దూరం పెట్టేయడం అన్నిటికంటే ఓ తల్లి పడే మనోవేదన ఇవన్నీకలిపి  నాకు తెలియకుండానే  బయటకు వచ్చాయా ?

అబ్బ యెంత దీర్ఘంగా ఉంది.

ఇంతలో ఫోన్ మోగింది. పత్రలేఖ ఫోన్ చేసింది. “లేచారా ? ఆరవ్ మాట్లాడుతాడట” అని వాడికి ఇచ్చింది. “డాడీ ఎలా ఉన్నావు ? ఎప్పుడు వస్తావు టూర్ నుంచి అని” అడిగాడు  ఆ చిన్ని బుర్రలో అన్ని ప్రశ్నలే ? వాడికి నచ్చ చెప్పి “మమ్మీకి ఇయ్యి” అన్నాను. అప్పుడు చెప్పాను లేఖకు  రాత్రి వచ్చిన కల గురించి? అంతా విని “ఎక్కువ ఆలోచించకు ప్లీజ్”  అంది. తన భయాలు, తన కన్సర్న్, ప్రేమ, అభిమానం అన్నీ ఆ చిన్న మాటలో ఇమిడిపోయాయి. “అలాగే లేఖా, నో వర్రీస్, ఐ యామ్ ఆల్రైట్”  అని చెప్పేంత వరకు వదలలేదు.

ఫోన్ పెట్టేసి కిచెన్ లోకి వెళ్లి కాఫీ కలుపుకుని తెచ్చుకున్నాను. తాగుతూ ఫోన్ తీసి చూస్తున్నాను. నిజంగా  నేను అదృష్టవంతుడినే. కరోనా కేవ‌లం మ‌నుషుల‌నే కాదు. మాన‌వ‌త్వాన్ని కూడా చంపేస్తోంది. బంధాలు, అనుబంధాలు, స్నేహాలు క‌రోనా ముందు క‌కావిక‌ల‌మ‌వుతున్నాయి.

అన్నీ బాగుంటేనే అందరూ... ప్రాణాల మీద‌కు వ‌స్తుంద‌నుకుంటే ఏ ఒక్క‌రూ మిగ‌ల‌రే అనే న‌గ్న స‌త్యాన్ని క‌రోనా నిరూపిస్తోంది.

వంద‌లాది మంది ఆప్తులు, బంధువులు, స్నేహితులు ఉన్న‌ప్ప‌టికీ... ఎవ‌రూ లేని అనాథ‌లా మిగిలిపోతు న్నామా ? ఏమో?  అవే  ఇలా కలలరూపం లో వచ్చాయా ? ఆలోచనలో ముణిగిపోయిన నాకు ఫోన్ మోగటంతో తీసి చూసాను. రాజు  దగ్గర్ నుంచి “గుడ్ మార్నింగ్  రా శేఖరా. ఎలా ఉన్నావు  ఇంకెంత  ఇంకో ఆరు రోజులు. హ్యాపీ గా వచ్చేస్తావు.  ఓపిక పట్టు.  బై ది వే   నేను పంపిన  మెసేజ్  చూడు దాని గురించి వివరాలు  అన్ని అందులో  ఉన్నాయి. నీకు ఇలాంటివి  ఇష్టమే  కదా! అందుకే నీకు పంపిస్తున్నాను. నాకు తెలిసి ఇది కొంతమంది NGOలు  చేస్తున్నట్లున్నారు అని ఫోన్ పెట్టేసాడు.

దాదాపు ఇవే  మాటలు కదా రాత్రి కలలో వినిపించాయి? ఆశ్చర్యం వేసింది.

ఆత్రుతగా  మెసేజ్  ఏమి పంపించాడో అనుకుంటూ ఓపెన్ చేసి చూసాను.

విభ్రాంతి, విస్మయం కలిగాయి. ఈ ప్రపంచంలో లాజిక్‌ అందని కొన్ని సంగతులు జరుగుతూనే ఉంటాయని నమ్మాల్సి వచ్చింది.

ఇంతకూ రాజు పంపిన మెసేజ్లో ఉన్నది, నిన్నరాత్రి  నా కలలో వచ్చిన మెసేజ్ ఒకటే! ఆ వాట్సప్ గ్రూప్.. డీటెయిల్స్… అన్నీ… అన్నీ... అవే... అవే… అచ్చుగుద్దినట్లుగా!

ఆ పోస్టుల్లోని వ్యధల్లో కథలు సైతం సరిగ్గా రాత్రి కలలో చూసిన దృశ్యాలే అవటం మాత్రం నాకు పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఎందుకంటే, ఆ పోస్టుల్లో ఉన్నవి ఎన్నో వేల వ్యధలు. నేను చూసినవి మూడేగా?

*****

bottom of page