top of page
bhuvanollasam.PNG
srinivyasavani.PNG

సంపుటి  6   సంచిక  1

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

chintalapati mohana murali krishna
7th telugu sahiti sadassu -2020 .JPG

డా.చింతలపాటి మోహనమురళీకృష్ణ

వెయ్యేళ్ళనాటి“తిక్కన తెలుగు- నేటిమన తెలుగు

ఆదికవి నన్నయభట్టు తరువాత తిక్కన సోమయాజి మహాభారతంలో మిగిలిన 15 పర్వాలను ఆంధ్రీకరించాడు. తిక్కన తాను “జాను తెనుగు”లో వ్రాశానని చెప్పుకున్నాడు. అది ఇంచుమించుగా మనం ఇప్పటికీ వాడుతున్న సరళ గ్రాంథికమైన తెలుగే. ఆయన భారతాంధ్రీకరణ జరిగి ఇప్పటికి రమారమి వెయ్యి సంవత్సరాలు గడిచాయి. ఈ వెయ్యి సంవత్సరాల్లో తెలుగు భాషలో ఎన్నెన్నో మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. రకరకాల ఉద్యమాలు, సంస్కరణలపేరుతో, విప్లవాల పేరుతో, అభ్యుదయ భావాలపేరుతో తెలుగు భాషా స్వరూపాన్ని చాలావరకు మార్చివేశాయి.పూర్వం ఉండే కావ్యభాష స్థానంలో శిష్టవ్యావహారికం,ఆతరువాత పూర్తి వ్యావహారికం చోటుచేసుకుంది. రాను రాను వ్యాకరణాన్ని పట్టించుకోని  శబ్దప్రయోగాలు సరళవ్యావహారికం పేరుతో అన్ని రకాల రచనల్లోనూ చోటు చేసుకుంటున్నాయి. రచయితలందరు పాఠకులకు కించిత్తు శ్రమలేకుండా అర్ధం కావాలనే తపనతో పూర్తి వ్యావహారికానికి తమరచనల్లో స్థానాన్ని కల్పిస్తున్నారు. అందువల్ల వెయ్యేళ్ళనాటి కావ్యభాషయైన  ఆనాటి తెలుగుభాష నేటి కాలానికి  చాలా దూరంగా నిలిచిపోయింది. ఫలితంగా రమారమి వెయ్యేళ్ళనాటి తెలుగు ఇవాళ్టి పాఠకులకు అర్ధంకాని భాషగా ముద్రవేసుకుని దూరమైపోతోంది. దాని పర్యవసానంగా ప్రజాబాహుళ్యంలో ఉన్న తెలుగు భాషకు చెప్పుకోదగిన స్థాయి లేకుండాపోయింది. ఎందుకంటే ఇది తెలుగు అనటానికి వీలు లేకుండా ఎన్నెన్నో ఆంగ్లపదాలు, ఇంకా ఇతర భాషా పదాలూ ఇందులో చేరిపోయి తెలుగుభాషా సంప్రదాయాలనూ, లక్షణాలనూవిడిచిపెట్టేసే పరిస్థితివచ్చింది. సగానికి సగం ఆంగ్ల పదాలు తెలుగు వ్యవహారికంలో చేరిపోయి, వాటికి ప్రత్యామ్నాయ పదాలు తెలుగులో లేవనే భావం ప్రజలలో వ్యాప్తమైంది. ఇది తెలుగు భాష తిరోగమనానికి, అన్యభాషాభివృద్ధికి మార్గాన్ని సుగమం చేస్తోంది. సంస్కరణ వాదులు ఇదంతా భాషాసౌలభ్యం కోసం చేస్తున్న కృషిగా పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో నిజంగా భాషా సౌలభ్యం కోసమే ఈ మార్పులు అనే మాట నిజమో కాదో నిరూపించే ప్రయత్నంగా వంగూరి ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో ఈ వ్యాసాన్ని అందిస్తున్నాను.

 

నన్నయభట్టారకునికి ముందు తెలుగు కావ్యాలు లేవనీ, నన్నపార్యుని ఆంధ్ర మహాభారతమే తెలుగులో ఆదికావ్యమనీ విమర్శకులు ఒక సిద్ధాంతాన్ని స్థాపించి ఉన్నారు. ఆ విమర్శ జోలికి నేను పోవటం లేదు కానీ ఆ తరువాత వచ్చిన తిక్కన మనకందించిన మహాభారతం పదునేను పర్వాలలో ఉన్న తెలుగు ఈనాటికీ నవజీవంతో తొణికిసలాడుతూ ఉంది. తిక్కనభారతం చదువుతూ ఉంటే  తెలుగంటే ఏమిటో , తెలుగు ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో అర్ధం అవుతుంది. చాలావరకు- అంటే తొంభై శాతం వరకు ఈనాటికీ సామాన్య పాఠకుడు నిఘంటువు జోలికి పోకుండా భారతాన్ని అర్ధం చేసుకోవచ్చుననిపిస్తుంది. కొన్ని చోట్ల సన్నివేశ సందర్భానుసారం, రసపోషణకోసం, పాత్రచిత్రీకరణ కోసం , ఆ యా పాత్రల స్వభావ నిరూపణకోసం తత్సమశబ్దాలను తిక్కన వాడినమాట యథార్ధమే. ఆ సందర్భంలోకూడా పాఠకుడు ఆ శబ్దార్ధాలను సులభంగా ఆకళింపు చేసుకుని ముందుకు పోగలుగుతాడు కానీ, అర్ధం కావటంలేదని, నిఘంటువు సహాయం కావాలని ఎదురుచూసే పరిస్థితి చాలా సందర్భాలలో ఉండదు. అందుకు కారణం ఆయన వ్రాసిన జాను తెనుగు. ఇన్ని ఉద్యమాలతరువాత కూడా, ఇన్ని మార్పుల తరువాత కూడా మనం వాడుతున్న తెలుగు వెయ్యేళ్ళనాటి తిక్కన తెలుగు వలెనే ఉందంటే తిక్కన వాడిన తెలుగు భాష పదును, దాని శక్తి ఎలాంటిదో కళ్ళకు కనిపిస్తుంది. తిక్కన వాడిన చాలా పదాలు ఇప్పటికీ మన వాడుకలో కనిపిస్తుండటం తెలుగు సహజత్వానికి నిదర్శనం. తిక్కన భారతాంధ్రీకరణ చేసేముందు హరిహరనాధుణ్ణి నుతించాడు. ఆ సందర్భంలో హరిహరనాధుడు తిక్కనకు ఇచ్చిన వరమేమిటంటే :

తే.గీ. “జనన మరణాదులైన సంసార దురిత-ములకు నగపడకుండంగ దొలగు తెరువు

గను వెలుంగు నీ కిచ్చితి ననిన లేచి -నిలిచి సంతోష మెదనిండ నెలవు కొనగ !”

 

అద్భుతమైన వరం కదా! తిక్కనకు ఒక వెలుగును ఇచ్చానన్నాడు. జనన మరణాదులనే సంసారపరమైన పాపాలకు దొరకకుండా తప్పించుకునే దారిని  చూడగల వెలుగును ఇచ్చానన్నాడు. వినడానికి బహు సులభంగా ఉంది. కానీ దీని లోతు ఎంత ఉందో ఆలోచిస్తే తెలుస్తుంది. ఈ అర్ధాన్ని స్ఫురింపజేయటానికి తరువాతి కవులు ఎన్నో  తిప్పలుపడినప్పటికీ ఇంత స్పష్టంగా చెప్పలేకపోయారు. నీకు జనన మరణాలు లేకుండా తప్పించుకోగల స్థితి అంటే మోక్షమార్గం ప్రసాదించా అన్నాడు. సంసారదురితములకు అగుపడకుండా  తొలగి వెళ్ళే వెలుగు ఇచ్చానన్నాడు. కధాప్రారంభంలో తిక్కన చెబుతాడు  “ఏను విన్నపంబు సేయు తెఱంగుగా నంతస్సన్నిధిన్ గలిగించుకొని యమ్మహాకావ్యంబు నర్ధంబు సంగతంబు చేసెద” అంటాడు. అంతస్సన్నిధి అనేది కేవలం ఋషులు మాత్రమే చేయగల పని.       

 

తిక్కన విరాటపర్వం నుంచీ మొదలుపెట్టాడు. సభాపర్వానంతరం పాండవులు పన్నెండేళ్లు అరణ్యవాసం చేశారు. అటు తరువాత అజ్ఞాతంలోఉన్న పాండవుల్ని ఏ ఒక్కరిని కౌరవులు గుర్తించినా పాండవులందరూ తిరిగి అరణ్యఅజ్ఞాత వాసాలు చేయాలి. అందువల్ల పాండవులైదుగురు, ద్రౌపది, పురోహితుడు ధౌమ్యుడు, రహస్యంగా సమావేశమైనారు. అప్పుడు పాండవుల పురోహితుడు ధౌమ్యుడు ఒక ధర్మ సూక్ష్మాన్ని చెబుతాడు. అది సంస్కృత మూలంలో :

“విదితేచాపి వక్తవ్యం సుహృద్భిరానురాగతః

ఏష ధర్మశ్చ కామశ్చ అర్ధశ్చైవ సనాతనః”

సనాతన ధర్మాన్నీ అర్ధ, కామాల్నీ అవకాశం వచ్చినప్పుడల్లా లోకులకు జ్ఞాపకం చేయటం ఋషులకు, ప్రవక్తలకు, ఆచార్యులకు, కవులకు సహజధర్మం అంటాడు. అందుకనే కవులు తమ కావ్యాల్లో సూక్తులను చెబుతూంటారు.

 

ఈ విషయాన్ని తిక్కన ఒక కందపద్యంలో చెప్పినతీరు చాలా సహజంగా సులభగ్రాహ్యంగా కనిపిస్తుంది:

కం. ఎఱిగెడి వారికి నైనను-గఱపక తక్క రుచిత ప్రకారము శుభముం

గొఱలు హితు లట్లగుట నం-దఱకును జెప్పంగ వలయు దగియెడు బుద్ధుల్ (విరా.1.116)

అంటాడు. అలా అందరకు తగిన విధంగా బుద్ధులు చెప్పాలి అని ఎంతో సులువైన పదాలలో చెప్పాడు.  అజ్ఞాతవాసాన్ని ఎలా గడపాలి అని ధర్మరాజు విచారగ్రస్తుడై ఇలా అంటాడు :

                                               

కం.“మనమొక యేవురమీ యం - గనయున్ తో నరుగుదేరగా నెయ్యెడబో

యిన నెఱుగకుండుదురె యి – ద్దినములు గడపంగ నెద్ది తెరగయ్యెడినో !

మనం ఐదుగురం ద్రౌపదితో కలిసి బయలుదేరితే మనం ఎక్కడకు వెళ్ళినా జనం మనల్ని గుర్తుపట్టేస్తారు. కనుక మనం ఈ అజ్ఞాతవాస సమయాన్ని గడిపే దారేమిటి? అంటాడు. అప్పుడు అర్జునుడు ధైర్యవచనాలు చెబుతూ :

తే.గీ. “ధర్మదేవత నీదు సత్కర్మమునకు -మెచ్చి యెంతయు బ్రీతిమై నిచ్చినట్టి

వరము గలుగంగ మనమేమి వర్తనమున -నెచటనున్నను నొరులకు నెరుగనగునె?” అంటాడు.

 

ఈ పద్యాలలో చెప్పిన తెలుగు   ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న భాషే కదా! ఇలాంటి ఉదాహరణలు తిక్కన భారతం లోని 15 పర్వాలలోనూ మనం చూడవచ్చు. ధర్మరాజు విరటుని కొలువునకు పోదామని చెప్పినప్పుడు అర్జునుడు కొంత విషాదాన్ని ప్రకటిస్తాడు. ధర్మరాజు దాన్ని పట్టించుకోకుండా చెప్పిన పద్యం గమనించండి:

కం “సన్యాసి వేషమున రా-జన్యుని గని యెపుడు గెలిచి సభ్యత్వమునన్

మాన్యుడనై పుణ్యకధా -విన్యాసమొనర్తు నతని వేడుకకు తగన్”

ఎంత స్పష్టంగా ఉంది ఈ పద్యం! ఇందులో తెలుగు సజీవంగా ఉంది. ఈ తెలుగే ఇప్పటికీ మనచేత వాడబడుతోంది.

   

ఇక భీముణ్ణి దాచటం చాలా కష్టం అని ధర్మరాజు అనుకుంటుంటే భీముడు ఇలా చెబుతాడు :

తే.గీ. ఏను వంటలవాడనై ఆ నరేంద్రు - గొలిచి గరగరగా కూడు కూర చిత్త

మునకు నచ్చిన చందమున యొనర్చి నేర్చి మెలగుదు కారము వినీతి మెరసి”.. అంటాడు. ఇంకా ..

ఉ. ఆఱు రసంబులం జవులయందలి క్రొత్తలు వుట్ట నిచ్చలున్

వేఱొకభంగి పాకములు విన్ననువొప్పగ జేసిచేసి న

న్మీఱగ బానిసీని నొకనింబురి గాననియట్లు గాగ మేన్

గాఱియ వెట్టియైన నొడికంబుగ వండుదు కూడు కూరలన్!”

అంటాడు. తాను వంటలవాడుగా కుదురుతానని చెబుతాడు. ఇక్కడ ప్రయోగించిన పదాలు షడ్రుచుల్నీ వడ్డించాయి.  నిజమైన జానుతెనుగు అంటే ఇదేనని అర్ధమవుతుంది.

 

భీముడు ఇంకా ఇలా అంటాడు :

తే.గీ. “పఱియవాపంగ తునియగా విఱువవలయు -నెడల గాళుల చేతుల తొడలబట్టి

కడగి యనువుగజేసి ప్రొయ్యిడుదు గాని -కత్తి గొడ్డలి యడుగ నే కట్టియలకు”

కట్టెలను చీల్చేటప్పుడు నేనునా కాళ్ళతోనూ, చేతులతోనూ, తొడలతోనూ పట్టుకుని విఱిచి తగినవిధంగా పొయ్యిని వెలిగిస్తాను కానీ కత్తి, గొడ్డలి ఇమ్మని అడగను అంటూ సహజమైన తెలుగుపదాలలో అర్ధగాంభీర్యాన్ని నింపాడు.

కం. “పెక్కండ్ర నొక్కపోరను -నుక్కర భంజించి చంపు తుడుగుదు; రాజుం

దక్కటి చూపఱులెంతయు- వెక్కసపడ చిత్ర గతుల విహరింతు తగన్”

పలువురిని ఒకేదెబ్బకు చంపే విధానాన్ని మానుకుంటాను. రాజు, మిగతా సభాసదులు ఆశ్చర్యపడేట్లుగా చిత్రగతులతో విహరిస్తాను అని స్పష్టమైన తేట మాటలలో నేర్పుగా చెబుతాడు. 

 

అర్జునుడు తనసంగతిని ఇలా చెబుతాడు :

కం. ఉత్తమ కన్యా జనులకు -నృత్తము గరపంగ నాకు నేర్పు గలదు త

ద్వృత్తమునకు నన్నేలుము -చిత్తమునకు నెక్క పనులు చేసెద నందున్”

అని తనకు గల నాట్యకౌశలాన్ని గురించి చెబుతాడు. నకులుడు తన మాఱువేషాన్ని గురించి చెబుతూ :

ఆ.వె. అశ్వశిక్షకుండనై మత్స్య భూవిభు-గొలుచువాడ గుఱ్ఱములకు వలయు

తెఱగులెల్ల జాల నెఱుగుదురూపుగా -నరయనేర్తు వాని ననుదినంబు”

అని తన అశ్వశిక్షణా ప్రావీణ్యాన్ని గురించి చెప్పి తాను విరటుని కొలువులో అశ్వశిక్షకునిగా చేరతానంటాడు.

 

ఇక అసలు ముగ్ధరాలు ద్రౌపది. ఆమెను ఎలా మరుగు పరచాలి అన్నప్పుడు  ద్రౌపదిని గురించి ధర్మరాజు ఇలా అంటాడు:

చం.“ఇది కడు ముద్దరాలు పనులేమియు జేయగ నేర దెంతయున్                                                      

మృదు వొక కీడుపాటునకు మేకొనజాల దుదాత్త చిత్త...”  -అంటాడు

ముద్దరాలు అనేమాట ఇప్పటికీ మన పూర్వీకులు వాడుతూనే ఉన్నారు. కీడుపాటు అనేదికూడా అలాంటిదే.   ధర్మరాజు చెప్పిన భావానికి ద్రౌపది తన మారురూపు పద్ధతిని వివరించింది:

కం. సైరంధ్రీ వేషంబున - జేరుదునంతఃపురంబు చెంతకు నన్నా

భూరమణు దేవి యెంతయు - గారవమున బిలువ నంపగా వినయమునన్                

చిన్నచిన్న పదాలతో లోతైన అర్ధాన్ని సమకూర్చే   శైలీ విశేషం తిక్కన రచనలోని ప్రతి అక్షరంలోను కనిపిస్తుంది. ప్రతి పద్యము జానుతెనుగు విశేషంతో   నేటివరకు సజీవ శిల్పంతో మనకు సాక్షాత్కరిస్తున్నాయి.

 

మారు రూపులు నిశ్చయమైన వెనుక విరాటపర్వంలో తదుపరి అంకంలో ఎవరికి వారు విరాటరాజు కొలువునకు బయలుదేరిన  సందర్భంలో ద్రౌపది పలికిన మాటలు:

ఉ.“డప్పి జనించె వ్రేళుల పుటంబులు పొక్క దొడంగె గోళ్ళలో

చిప్పిలజొచ్చె నెత్తురులు  ...

యిప్పటి భంగి నొక్కడుగు నేగెడుదానికి నోర్వ నెమ్మెయిన్”

అంటుంది. తెలుగుదనానికి సజీవ సాక్ష్యం ఇంతకన్నా ఇంకేం కావాలి. వాడుక తెలుగు ఇక్కడ ఆడుకొన్నది కదా .. ఏమా పదాల సౌకర్యం ! ఏ మా ప్రసన్న భావావిష్కరణ ! అజ్ఞాతవాసాన్ని ఎవరెవరు ఎలా గడపాలో నిర్ణయించుకున్నాక పురోహితుడు ధౌమ్యుడు తన అభిప్రాయాన్ని ఇలా వివరిస్తాడు : 

కం. “ఊరక యుండక పలువుర-తో రవమెసంగగబలుక తొడరకయు మదిం

జేరువగల నాగరికులు -దారు గలసి పలుకవలయు ధరణీశు కడన్” అంటూ ఇంకా

కం . “మన్నన కుబ్బక యవమతి -తన్నొందిన స్రుక్కబడక ధరణీశుకడన్

మున్నున్నయట్ల మెలగిన -యన్నరునకు శుభము లొదవు నాపదలడగున్”

రాజు కొలువులో మాట్లాడకుండా కూర్చోవటం కాక అందరితో మాటలు కలిపి మాట్లాడుతూ ఉండాలి. రాజుతో కూడా కల్పించుకుని మాట్లాడుతూ ఉండాలి. పొగడ్తలకు ఉబ్బిపోకుండా , అవమానాలు తనకు ఎదురైనా బాధపడకుండా రాజు ఎదుట ఇదివరకు ఎలా ఉండేవాడో అలానే మెలగుతూ వ్యవహరించేవారికి శుభం కలుగుతుంది. ఆపదలు రావు అని చెబుతాడు.

అలాగే:

ఆ.వె “ వసుమతీశు పాల వసియించునేనుంగు-తోడనైన దోమతోడనైన

వైరమగు తెఱంగు వలవదు తానెంత -పూజ్యుడైన జనుల పొందు లెస్స”

రాజుతోపాటుగా ఉండే ఏనుగుతోనైనా దోమతోనైనా విరోధం పెట్టుకోకూడదు. తానెంత పూజనీయుడైనా జనంతో కలిసి ఉండటం మంచిది అంటాడు. ఈ పదాలకు మళ్ళీ అర్ధం చెప్పాల్సిన పనిలేదు కదా! ఈ పదాలేవీ ఇప్పటికీ మరుగున పడలేదు. అదీ జాను తెనుగంటే .

విరటుడు ధర్మరాజును ఆహ్వానిస్తూ :                  

ఉ. “ ఎయ్యది జన్మభూమి?కుల మెయ్యది?యెయ్యెది యున్న చోటు పే

రెయ్యది? మీరలిందులకు నిప్పుడు వచ్చిన దానికిం గతం

బెయ్యది? నాకు నింతయును నేర్పడగా నెఱిగింపుడన్న రూ

పెయ్యెది నావుడున్ నరవరాగ్రణి కయ్యతి ముఖ్యు డిట్లనున్”

ఈ మాటలు సాధారణంగా మనం పలకరించుకున్నట్లుగా ఉన్నాయి కదా ! తిరుపతి వెంకట కవుల ఉద్యోగవిజయాలు నాటకానికి ఈ రకమైన సంభాషణలే ప్రేరణనిచ్చాయి .

 

కీచకుడు విరహవేదన పడుతూ ఇలా అనుకుంటాడు :

కం.“మాయరవి యేల గ్రుంకడొ-కో యను; నిట్టేల తడసెనోయను ;గ్రుంకం

బోయెడు జూ యిప్పుడయను;- దాయపఱిచె నను; మనోజ తాపము పేర్మిన్!”

కీచకవధ కోసమై వచ్చిన భీముడు తొలుత తన ముఖాన్ని చూపించకుండా ద్రౌపది కంఠంతో ఇలా అంటాడు :

కం. “నాయొడలు సేర్చినప్పుడ -నీ యొడలెట్లగునొ దాని నీ వెఱిగెదు;న

న్నే యబలల తోడిదిగా- జేయదలంచితివి తప్పు సేసితి కంటే” అంటూ

కం. “నను ముట్టి నీవు వెండియు -వనితల సంగతికి బోవు వాడవె? యైనం

దనువే బడసిన ఫలమే? -కనియెదవిదె చిత్తభవ వికారములెల్లన్”

అని గూఢంగా కుళ్ళబొడుస్తాడు.

 

భీమ-కీచకుల పోరాటాన్ని వర్ణిస్తూ తిక్కన :

కం. “కదియుచు బాయుచు బట్టుచు -నదలుచుచుం బడుచు లేచు చడగుచు వడిగొం

చొదవెడు కినుకం గడు బె-ట్టిదముగ బెనగిరి చలంబు డింపక కడిమిన్”  అని వర్ణిస్తూ...

తే.గీ. “కరములెయ్యవి?శిరమేది?కాళులెచట-జొచ్చె గంధర్వులగు చేత జచ్చువార

లెల్ల నిట్టులయగుదురో? యితని తోడి -యలుక జేసిరొ?యిది కడు నక్కజంబు! 

అని జాను తెనుగున వర్ణిస్తాడు. శబ్ద పటాటోపం లేకుండా తిన్నగా దిగబడేటట్లు పొదిగిన ఈ పదజాలం తెలుగు పదునుకు సరియైన ప్రతీక. విజేతయైన భీముణ్ణి చూసి ఉపకీచకులు పరుగెత్తిన సంఘటన హాస్యంతోపాటు అద్భుతరసాన్ని రంగరించిపెట్టింది:                      

మ. ఇదె గంధర్వులు వచ్చి ముట్టికొని రింకెట్లొక్కొ యంచున్ భయం

బొదవం బల్లములందు డాగియు సమీపోర్వీజముల్ ప్రాకియుం

జెదరం బారియు నీరు సొచ్చియును నిశ్చేష్టన్ బదద్వంద్వముల్

గుదివడ్డం బెగడొందియున్ భరిత సంక్షోభాత్ములై రత్తరిన్”

ఇదిగో గంధర్వులు వచ్చేశారు. మనల్ని చంపటానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకెలా తప్పించుకోవటం? అంటూ ప్రాణభయంతో ఉపకీచకులు పల్లపుప్రాంతాల్లో దాగుతూ, దగ్గరలో ఉన్న చెట్లపైకి ప్రాకుతూ, తలొకదారిగా చెల్లాచెదరవుతూ, నీటి మడుగుల్లో నక్కుతూ, బిక్కచచ్చినవారిలా కాళ్ళు బిగుసుకుపోయి భయభ్రాంతులయ్యారు. ఇక్కడ పదప్రయోగంలో స్వచ్చమైన తెలుగు నాట్యం చేసింది కదా! 

 

ఉద్యోగ పర్వంలో కొన్ని ఉదాహరణలు చూడండి –

సంజయుడు ధృతరాష్ట్రుని సభలో తాను జరిపిన సంధికార్య విశేషాల్ని తెలిపే సందర్భంలో ధృతరాష్ట్రుడు పాండవ కౌరవ బలాబలాలను గురించి తరచి తరచి అడుగుతాడు. అప్పుడు సంజయుడు ఇలా తేల్చి చెబుతాడు:

కం. “ఆ సేనకు నీసేనకు -వాసి యడిగె దీవు నన్ను;వసుదేవ సుతుం

డాసేన గలడు; తత్సము -నీ సేనం జూపుమా నరేశ్వర నాకున్”

అని తూట్లు పొడిచాడు.

 

ఉత్తరాభిమాన్యుల వివాహానంతరం రాజన్యులను జూచి శ్రీకృష్ణుడు ప్రసంగించిన సందర్భంలో :

కం. “పదపడి దుస్తరమగు నీ-పదమూడగునేడు గడవబడుట యరిది; త

మ్మెదు రెఱుగమికై యాపద-లొదవిన సైరించి ;రిట్టి యునికియు గలదే?

తే.గీ. “ధర్మ మార్గంబు దప్పక తలపుడొక్క-తెఱగు; ధర్మువు దప్పి యుధిష్టిరుండు

పడయనొడబడ డయ్యింద్రపదవియైన-నుచితగతి నెంత వడసిన నుల్లసిల్లు”

పాండవులుపడిన కష్టాలను, ధర్మరాజు నీతినియమాలను ప్రసంశిస్తాడు. వీటిలో ఎక్కడా క్లిష్టాన్వయం గానీ, డొంకతిరుగుడు గానీ కనిపించవు. శ్రీకృష్ణుని మాటలకు బలరాముడు జోక్యం చేసుకుని దుర్యోధనుని వైపుకూడా  న్యాయం ఉందంటాడు. అప్పుడు సాత్యకి కలగజేసుకుని

ఆ.వె.“ఇట్టులాడదగునె? ఇది నీక పోలు ని-న్నేమనంగ నేర్తు? నిత్తెరంగు

పాడిగాగబూని పలుకంగ జెవియొడ్డి-యాదరించువారి -నందుగాక!”

అని బలరాముని మాటలను ఖండిస్తాడు. అంతతో ఆగక -

కం.“వేడుకపుట్టిన జూదం-బాడెనె ధర్మజుడు? వారలందఱు తమలో

కూడుకొని పిలిచి బలిమిన- యాడి కపట జయము గొనుట యది తగవగునే?

అని పాండవపక్షాన్ని సమర్ధిస్తాడు. అర్జున దుర్యోధనులిద్దరూ శ్రీకృష్ణుని దర్శనార్ధమై వచ్చినపుడు శ్రీకృష్ణుడు పలికిన మాటలు నేటి కాలంలో తిరుపతి వెంకటకవుల ఉద్యోగవిజయాలు నాటకం ద్వారా మరింత ప్రాచుర్యాన్ని పొందాయి:                                                           

ఉ. “నీవిట మున్న వచ్చితిది నిక్కము; పార్ధుని దొల్త గాంచితిన్

గావున మీకు నిద్దరకు గౌరవమొప్పగ తోడుపాటు స

ద్భావము; దీనికిం దెఱగు దప్పకయుండగ నేర్పరించెదన్

మీ వలపెట్టు లట్ల తగ నీవును నీతడు కోరికొండొగిన్!” అని చెబుతూ ఇంకా ..

కం. “ వారొకతల;యేనొకతల-యీ రెండు తెఱంగులందు నెయ్యది ప్రియమె

వ్వారికి జెప్పుడు;దొలితొలి గోరికొనన్ బాలునికి తగన్ పాడిమెయిన్”

అంటాడు. ఈ సందర్భమంతా తెలుగువారినోట కొట్టినపిండిగా కొన్ని దశాబ్దాలు నిలిచింది. కౌరవుల వద్దకు రాయబారానికి వెళ్ళేటప్పుడు ధర్మరాజు చెప్పిన సందేశం :

కం.“ఇచ్చటి బంధులు నీవును- అచ్చెరువడి వినుచునుండ నయిదూళ్ళును మాకిచ్చినను జాలునంటిని.” అంటూ 

చం.“పగ యడగించుటెంతయు శుభం బది లెస్స;అడంగునే పగన్ పగ !”అంటాడు మరోచోట ;

వీటన్నిటిలోనూ  తెలుగుపదాల ప్రయోజకత్వం, పౌరుషత్వం అడుగడుగునా ధ్వనిస్తూ, వేయి సంవత్సరాలుగా నినదిస్తున్నది.

 

ఉలూకుని రాయబారంలో దుర్యోధనుడు ప్రగల్భాలు పలికాడు. ముఖ్యంగా పార్ధశ్రీకృష్ణుల్ని ఆక్షేపించాడు. అప్పుడు శ్రీకృష్ణుడిలా అంటాడు:

తే.గీ. “బవర మెల్లియ; బిరుదవై బరవసంబు-గలిగి చావుము; చావక తొలగరాదు

కృష్ణ సారధికం బగు జిష్ణురథము -తొడరి నీవెందు జొచ్చిన తోన జొచ్చు”

అని జరగబోయే కురుపాండవ సంగ్రామాన్ని , దాని ఫలితాలను స్పష్టమైన తేట తెలుగులో సూటిగా నాటి చెప్పాడు.    

భీష్మపర్వంలో భీష్ముని ప్రతాపజ్వాలకు పాండవసైన్యం కకావికలై పోతుంటే భరించలేక శ్రీకృష్ణుడు చక్రధారియై భీష్ముని సంహరించటానికి రధం దిగి లంఘించినప్పటి సంఘటనలో :

“పులి పొడగన్న లేళ్ళగమి వోలె సుయోధను నగ్ర సైనికుల్

దలకి కలంగి నివ్వెఱగు దక్కిన చేష్టలు దక్కి చిత్ర రూపుల క్రియ నుండిరి”

అని వర్ణిస్తాడు. సంస్కృతంలో రఘువంశంలోనూ, కుమారసంభవంలోను కాళిదాసు చిత్రించిన అంశం “చిత్రార్పితారంభ మివావతస్థే” అన్న పదబంధానికి స్వచ్చమైన తెలుగు నుడికారంగా -చిత్రరూపుల క్రియ నుండిరి-అన్నాడు. తెలుగు వాడి, వేడి తెలిసిన కవిబ్రహ్మ తిక్కన సోమయాజి. 

 

ద్రోణపర్వంలో బ్రహ్మదేవుడు మృత్యుదేవతకు కొన్నిబాధ్యతల్ని అప్పజెప్తాడు. వాటికి మృత్యుదేవత బాధపడుతుంది  అటువంటి క్రూర కర్మలకు తాను బాధ్యతవహించటం ఏమిటని మొరపెట్టుకొన్న సందర్భంలో :

తే.గీ.“నీవు సృజియించితటే నన్ను దేవదేవ -యేను క్రూరకర్మములకు నెట్టులోర్తు

బంధుమరణ శోకాప్తులై పనవు జనుల -వివిధ భంగుల యెలుగులు వినగజాల”

అంటుంది. స్పష్టమైన తేటతెలుగు పదాలలో మృత్యుదేవత భావనను తిక్కన ఇక్కడ వెల్లడించాడు. ఇలాంటి పదాలే భాష జాతీయతను నిలబెడతాయి. కర్ణపర్వంలో ఒక సందర్భంలో తిక్కన ఒక కధ చెప్పాడు. అర్జునుడు కర్ణుని ఆక్షేపిస్తూ చెప్పిన కధ ఇది.

 

పూర్వం ధర్మాత్ముడైన ఒక వైశ్యుడుండేవాడు. ఆయనకు నలుగురు కొడుకులు. వారంతా ధర్మాత్ములే. ప్రతి రోజు వాళ్ళు తిని పారేసిన ఎంగిలి మెతుకులు తినడానికి ఒక కాకి వచ్చేది. వాళ్ళు దాన్ని ప్రేమతో ఇంకొంచెం పెట్టి తినిపిస్తూ పెంచసాగారు. కొన్నాళ్ళకు అది బాగా బలిసింది. అప్పుడు తోటి కాకులతో అది బీరాలు పలికేదట:

కం.“ఎంగిళులు గుడిచి క్రొవ్వున-పొంగిన మెయితోడ గర్వమున దిరుగుచు నా     

కుంగలదె యెందు నెదురు వి -హంగమపతినైన గెలుతునని మును దలతున్ !

ఎంగిలిమెతుకులు తిన్నప్పటికిన్నీ పప్పు, నెయ్యి కలిపి తినటం వలన కొవ్వు బలిసిదేహం పెరగటం వలన నాకు ఎదురులేదు. రాజహంసలనైనా గెలువగలిగిన బలం నాకుంది అని అహంకరించి ఒకరోజున ఒక హంసతో సముద్రం మీద ఎగరటానికి పోటీపడి ఎగరలేక చావుతప్పి కన్నులొట్టపోయిన పరిస్థితిని వర్ణించిన కధ ఇది. కర్ణునిపద్ధతి అలా ఉంది అని అర్జునుడు ఆక్షేపిస్తాడు.   ఇక్కడ ఎంగిలి పదప్రయోగవిశేషాన్ని మనం గమనించాలి.

 

సౌప్తికపర్వంలో అశ్వత్థామ ఉపపాండవుల్ని-నిద్రపోతున్నవారిని- కుత్తుకలుకోసి చంపటం చూసి ద్రౌపది:                      

కం.“భూరమణ గాఢనిద్రన్ – గూరిన సమయమున ముట్టికొని నా సుతులన్

క్రూరత తెగటార్చెను పా -పా రంభుడు గురుతనూజు డక్రమ లీలన్”

అని విన్నవారి గుండెలు తరుక్కుపోయేట్లుగా బాధపడుతుంది. 

శాంతిపర్వంలో భీష్ముడు ధర్మరాజుకు కొన్ని సూక్తులను చెప్తాడు. అవి ధర్మరాజుకేకాక ప్రజలందరకు శాంతివచనాలే.

“రోషము శోకము రాగ-ద్వేషము లభిమాన దర్ప వేగాలస్యా

శ్లేషము లజ్ఞానమని మ – నీషి జనము సెప్పు....”అంటాడు.             

                    

ఇలా చెబుతూపోతే మహాభారతం అంతటినీ మళ్ళీ వ్రాయటమే జరుగుతుంది. కనుక స్థాలీపులాకన్యాయంగా అక్కడక్కడా కొన్ని మేలిబంతుల్ని ఎత్తిచూపి నా వ్యాసానికి గుదిగుచ్చుకుని ప్రదర్శించాను. ఇలా చిన్నచిన్న పదాలతో నిగూఢమైన అర్ధాలు తీస్తూ, వేల పద్యాలను వినసొంపుగా తెలుగు జాతీయతకు ఎత్తిన పతాకగా తిక్కన సోమయాజి మనకందించిన మహాభారతం వేయి సంవత్సరాలు దాటినా తెలుగు పదాల ముద్దు మురిపాలను తరతరాలుగా అందిస్తూ నవతరాన్ని కదిలిస్తూ తెలుగుతేజాన్ని దిగంతాలుగా ప్రసరిస్తూ, తెలుగు భాషా మాధుర్యాన్ని తనివితీరేలా పంచుతూ రసానందాన్ని కొనసాగిస్తూ మనల్ని కదిలిస్తున్న భాషాభావలహరీ ఝరి -తిక్కన జానుతెనుగు వైఖరి. అందుకనే తిక్కన తెనుగును మన తెలుగును ప్రశంసిస్తూ ఇలా పేర్కొంటున్నాను :

మత్తకోకిల: తేటతేనెల నొల్కు తీయనిదివ్యభాష తెలుంగురా!

నీటుగాండ్ర వచో విధానము నిర్మలంబగు తెల్గురా!

పాటపాడగ గీతినల్లగ పల్లవించెడి భాషరా!

మేటి సుస్వర రంజితంబగు మేల్మి భాష తెలుంగురా!

తరలము : తెలుగు వద్దను మూర్ఖభావము తెల్వి కాదు గ్రహితెలుంగుర

వెలుగుదారిని బోవజాలని వెఱ్ఱిబుద్ధిని మానరా!                                             

పలకరించుము తెల్గులోన శబాసటంచు నుతింపగా!

విలువగల్గిన భాషరా యిది వేడ్కయౌ నెట పల్కినన్

మత్తకోకిల: జన్మజన్మల పుణ్యభోగ విశాల సంపద తెల్గురా!

మన్మనోమాయమౌనగీతికి మాటరూపము తెల్గురా!

తన్మయత్వము గూర్చు భాష యథార్ధమౌ తెలుగేనురా

విన్ముసోదర! ధన్యజీవుల వెల్గుభాష తెలుంగురా!!

***

bottom of page