top of page
bhuvanollasam.PNG
srinivyasavani.PNG

సంపుటి  6   సంచిక  1

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

burugupalli.PNG
7th telugu sahiti sadassu -2020 .JPG

తెలుగు పత్రికలు - మారుతున్న భాషా ధోరణులు

డా. బూరుగుపల్లి వ్యాస కృష్ణ

ఆధునిక జీవితాల్లో పత్రికలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది. మనిషి ఆలోచనా విధానాన్ని, జీవిత గమనాన్ని మార్చగలిగిన శక్తి పత్రికలకు ఉన్నదని అనటంలో అతిశయోక్తి లేదు. పత్రికా రంగాన్ని ఫోర్త్ ఎస్టేట్ గా, నిరంతర సమావేశాలు జరిగే ప్రజా పార్లమెంటుగా అభివర్ణిస్తారు.  

పత్రికలకు సంబంధించిన చరిత్రను పరిశీలిస్తే, బ్రిటిష్‌వారు తమ వలస ప్రాంతాల్లో పత్రికలపట్ల ఉదారంగా ఉన్నట్లు కన్పించినా , తమను విమర్శించే పత్రికలపై ​కొంత కక్షపూరితంగానే ​ వ్యవహరించేవారు. సంస్థానాలలో మాత్రం ఇందుకు భిన్నంగా పత్రికల స్థాపనకు అవకాశం ఇవ్వటం జరుగలేదనే చెప్పవచ్చు. కొన్నిసంస్థానాలలో సాహిత్య పోషణ జరిగినా అది పత్రికా పోషణగా చెప్పలేము. ​

తొలినాట పత్రికలు స్వాతంత్రోద్యమ స్ఫూర్తిగా సాగినట్లు చెప్పవచ్చు. సాహిత్య  కోణంలో మాత్రమే కాదు, భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రజలలో జాతీయ భావాలను మేల్కొల్పటానికే అధికశాతం  పత్రికలు పనిచేశాయి. భాష విషయానికి వస్తే, అప్పటికీ  యిప్పటికీ తెలుగు  పత్రికా భాషలో తేడాలు గమనించవచ్చు.  సీనియర్ జర్నలిస్టు శ్రీ  పొత్తూరి వెంకటేశ్వరరావుగారు ​చెప్పినట్లు, "పత్రికలలో వార్తలను చెప్పిన తీరు, వ్యాస రచన శైలి, మారాయి. గ్రాంధికం నుంచి వ్యవహారికంలోకి మారటం ఒక దశ కాగా, వ్యవహారికంలోనూ పరిణామం చెందటం మరొక దశ". సంస్కరణోద్యమానికి సహాయకారిగా సాహిత్యాన్ని వాడుకున్న శ్రీ కందుకూరి వీరేశలింగంగారు తెలుగు పత్రికా రచనపై   ప్రభావం చూపారు. కందుకూరి వారి రచనలలో ముఖ్యంగా గమనించవలసినది వారి భాషా శైలి. వారు తమ ప్రహసనాలలో వ్యావహారిక భాష వాడినప్పటికీ, తన పత్రికలో మాత్రం గ్రాంధిక భాషనే వాడారు.

పత్రికా భాష విషయంలో, గ్రాంధిక భాషనుండి వ్యావహారిక భాషకు మార్చటంలోనూ, వ్యావహారిక భాషకు ప్రాచుర్యం తెచ్చి, ​గౌరవస్థానం కల్పించటంలోనూ శ్రీ గిడుగు వేంకట రామమూర్తిగారిని, శ్రీ గురజాడ అప్పారావుగారిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే, శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు తెలుగు పత్రికల గ్రాంధిక భాషను వ్యవహార శైలికి మళ్ళించడంలో గొప్ప వారధిగా నిలిచారు. ఇక్కడ ఒక సంఘటనను ప్రస్తావించుకోవాలి. ప్రబుద్ధాంధ్ర (సంపుటం 5, సంచిక 4) పత్రికలో (1934 ఏప్రిల్) "తెనుగు పత్రికల సంపాదకులకు" – అంటూ శ్రీ గిడుగు వేంకట రామమూర్తిగారు వ్యాసాన్ని వ్రాసారు. నాటి పత్రికా సంపాదకులు  శ్రీ ​శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు దానిని సమర్ధించి ప్రచురించటమే కాక, దానిపై విపులమైన సంపాదకీయాన్ని కూడా వ్రాసారు. తన సంపాదకీయంలో పత్రికలు ఎవరి కొరకు ఉఉద్దేశించబడ్డాయో,  వాటిలోని భాష ఏ విధంగా ఉండాలో వివరంగా వ్రాసారు. ​దీని ప్రభావం శ్రీ గూడవల్లి రామబ్రహ్మంగారిపై బాగా కనిపిస్తుంది. వారు తమ ‘ప్రజామత’ మాసపత్రికను వ్యావహారిక భాషలోకి మళ్లించటం గమనించవచ్చు. అయితే, శ్రీ కందుకూరివారి, శ్రీ గురజాడవారి  రచనలు  సమాజంలోని నూతన భావాలను పత్రికలలోనూ, సాహిత్యంలోనూ ప్రతిబింబించేందుకు పునాది వేశాయని చెప్పవచ్చు.

ప్రజల మధ్య ఐక్యతను నెలకొల్పగలిగే అనేక అంశాల్లో భాష కూడా ఒకటి. భాష అనగానే మొదట స్ఫురించేవి వ్యాకరణరీత్యా భాషాభాగాలు. క్రియలూ, నామవాచకాలూ, సర్వనామాలూ, అవ్యయాలూ, విశేషణాలూ. కానీ, నేటి సమాజంలో ​అన్ని అంశాలలోనూ ​ అనేక మార్పులు సంభవిస్తున్నాయి. వాటి ప్రభావం దిన పత్రికల మీద పడింది. నేటి దిన పత్రికలు అన్ని వయసుల వారినీ ఆకర్షించటానికి వీలుగా విషయ వైవిధ్యాన్ని చూపటమే కాకుండా, భాషా శైలిలో అనేక మార్పులు తీసుకు వచ్చింది. పాఠకులకు ఆసక్తి కలిగించటమే ధ్యేయంగా, అతి సామాన్యులకు కూడా అర్ధం కావటమే లక్ష్యంగా పత్రికల భాష మార్పు చెందింది. ఈ ఆధునిక యుగంలో క్లుప్తతకి ప్రాధాన్యం యిస్తూ, వాడుక భాషతో పాఠకుల మెదళ్లను తాకి కదిలింపజేసి, ఆలోచనలలో ముంచెత్తే భాషను వాడుతున్నారు. 

భాష అనేది సమాచార ప్రసారానికి, ప్రచారానికే కాక మానవుడు తనని తాను వ్యక్తం చేసుకోవడానికి ఉపయోగపడేది. నేటి సమాజం ఎప్పుడూ లేనంత వేగంగా మారిపోతున్నది. ఆధునిక ఆవిష్కరణలు ప్రజలకు ​చేరవేసే క్రమంలో పత్రికల మీద కొత్త బాధ్యత పడుతున్నది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆధునిక సమాచార, సాంకేతిక రంగం ప్రాంతీయ భాషలకు ప్రతి నిత్యం కొత్త సవాళ్ళను విసురుతోంది. దీనివల్ల, పత్రికలు తాము అందించే సమాచారాన్ని ప్రజలకు లేదా పాఠకులకు అర్థమయ్యే సులభమైన రీతిలో అందించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. పాఠక ఆదరణతో తమ పత్రిక ఆదరణ ముడిపడి ఉండటం వల్ల భాషను ఆధునికంగానూ, సరళంగానూ ఉండేలా పత్రికలు కసరత్తు చేస్తున్నాయి. సమాచారాన్ని తక్షణం అందించాల్సిన కారణంగా భాషలో   నిరర్థకాలు, అపార్థకాలు రాకుండా జాగ్రత్తపడటం తప్పనిసరి. అది ఏ మేరకు పత్రికలు చేయగలుగుతున్నాయో చెప్పలేము.

శాస్త్ర, సాంకేతికాభివృద్ధి, ఆర్ధిక సంస్కరణల ఫలితంగా అనేక కొత్త భావనలు వెల్లువలా ముంచెత్తుతున్నాయి. వీటికి తెలుగులో సరైన   పదాలు లేదా సమానమైన పదాలను రూపొందించే బాధ్యతను పత్రికలు కొంతవరకు పోషిస్తున్నాయి. కొత్త  పదాలను పత్రికలు సృష్టించటం అనేది పూర్వంనుండీ ఉన్నదే. ఉదాహరణకు: ‘నాన్  ​ఎలైన్డ్ మూమెంట్’ అంటే ‘అలీనోద్యమం’ అనీ, ‘యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజషన్’ అంటే ‘ఐక్యరాజ్య సమితి’ అనీ, ‘లెజిస్లేటివ్ అసెంబ్లీ’ అంటే ‘శాసన సభ’ అనీ, ‘లెజిస్లేటివ్ కౌన్సిల్’ అంటే ‘శాసన మండలి’ అనీ పత్రికలు  తెలుగులో నిర్ధారణ చేయగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన పదాలు.       

మారుతున్న అవసరాలకు అనుగుణంగా మారుతున్న పత్రికా భాష కారణంగా మన భాషకు ముప్పు వాటిల్లుతుందనే వాదన సంపూర్ణంగా నిజమని చెప్పలేం. ఇప్పుడు ప్రపంచం ఒక తెరిచిన పుస్తకం. సమాచారం శరవేగంగా విస్తరిస్తోంది. భాషకు విజ్ఞానశాస్త్రం తోడైతే అది మరింతగా విస్తరిస్తుంది. నేడు అంతర్జాలం ద్వారా తెలుగు భాషకు మేలు జరిగిందనే భావించాలి. అంతర్జాలం వలన తెలుగు బాగా విస్తరిస్తోంది. అప్పట్లో జాతీయ పత్రికలకు కొన్ని ప్రాంతీయ ముద్రణలు మాత్రమే ఉండేవి. ప్రతి పత్రికకూ జిల్లా ముద్రణను కూడా ప్రారంభించి మారుమూల గ్రామాలలోని విశేషాలను ప్రచురించటం ద్వారా పత్రికలు అధిక ప్రాచుర్యం పొందుతున్నట్లు గమనించవచ్చు. ఇప్పుడు తెలుగులో అంతర్జాలంలో కానీ, ప్రచురించిన ప్రతులు కానీ  40 లక్షల పైచిలుకు ​ దినపత్రికలు అమ్ముడుపోతున్నాయి. దాదాపు నాలుగు కోట్లమంది వాటిని చదువుతున్నారు. ప్రఖ్యాతి పొందిన గూగుల్‌ లాంటి సంస్థలు సైతం తెలుగులో సేవలందిస్తున్నాయంటే మన భాష విశ్వవ్యాప్తమైందనే భావించాలి.

ఈరోజు పత్రికలు కూడా ప్రపంచంలోని ఏ మూలకైనా తక్షణం చేరిపోతున్నాయి. గతంలో ఇతర దేశాలలో ఉన్న తెలుగువారు ఏ పత్రికకైనా చందా కడితే, ఆ పత్రిక చాలా కాలం తర్వాత కానీ చేరేది కాదు. కానీ, యీరోజు, సాంకేతికత కారణంగా పత్రిక తయారై అంతర్జాలంలో ఉంచిన మరుక్షణమే ప్రపంచం నలుమూలలా చేరుతున్నది. తెలుగు భాషా పత్రికలు యితర దేశాలలో వేటికవే ప్రత్యేకత చూపుతూ తమ ప్రాచుర్యాన్ని పెంచుకుంటున్నాయి. ఆ ప్రత్యేకత విషయ వివరణతో పాటు, భాషలోనూ కనిపిస్తోంది. అందువల్లనే ఇతర దేశాలలో తెలుగు పత్రికలను ఆదరించటం జరుగుతున్నదని చెప్పవచ్చు.

సాహిత్యం విషయంలో ప్రజలు విషయానికే ప్రాధాన్యత ఇస్తారు కానీ, భాషకు కాదు. ఉదాహరణకు యిప్పటికీ ఎంతో ఆదరింపబడుతున్న కవిసామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి ‘వేయిపడగలు’ (1934) నవలలోని భాష వ్యవహారికం కాదు. అలాగే, దీనికి 10 సంవత్సరాల ముందు వ్రాయబడి, ఇప్పటికీ ఆదరింపబడుతున్న శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి రచన, ‘బారిస్టర్ పార్వతీశం’ (1924) లోని భాష గ్రాంధికం కాదు. ఇందుకు భిన్నంగా పత్రికలలో ఉపయోగించే భాష    ప్రజల ఆదరణ​పై ప్రభావం చూపిస్తుంది. కారణం పత్రికలు చదవటం ప్రాధమికంగా విషయం సేకరణ కోసమే. అందువల్ల   సులువుగా అర్ధమ​య్యే వ్యావహారిక భాష వాడటం వలన   పత్రికలు  జన బాహుళ్యంలోకి చేరగలుగుతాయి ​.

విలువలతో కూడిన సాహిత్యం వేరు. ప్రచార సాహిత్యం వేరు. పత్రికా సాహిత్యం వేరు. ఎలా ఉండాలో చెప్పడమే సాహిత్యానికి పరమావధి అయితే, ఎలా ఉన్నారో చెప్పటం పత్రికా సాహిత్యం. పత్రికలలో ఏది రాసినా పఠనీయత ఉండాలి. ప్రజల జీవితం కనిపించాలి. ఏం జరిగింది, ఎందుకు జరిగింది, అనే విషయాలు ఉండాలి. అవి వాస్తవాలు అయి ఉండాలి. కనీసం వాస్తవానికి దగ్గరగానైనా ఉండాలి. ప్రజాభిప్రాయాలని సరళమైన భాషలో అందించాలి. పత్రిక చదివే పాఠకులు ఇది తమ మనసును, అభిప్రాయాలను ప్రతిబింబించే పత్రిక అని భావించే విధంగా విషయాలు మరియు భాష ఉండాలి. విషయాలను అందించటం పట్ల నిజాయితీ, భాష విషయంలో సానుకూల దృక్పథం పత్రికలకు అవసరం. కానీ, ఇవాళ తెలుగు పత్రికలలో జరపబడుతున్న చర్చల ప్రమాణాల స్థాయి ఏ  విధంగా ఉన్నదో ​​ ​ ప్రజలకు స్పష్టంగా అర్ధం అవుతున్నది. పత్రికలు ఈ విషయం గ్రహించటం చాలా  అవసరం.

ఇక్కడ మరో అంశాన్ని ప్రస్తావించాలి. భాషకీ, నైతికతకీ సంబంధం ఉన్నదని నిరూపించే పరిశోధనలు ఎన్నో జరిగాయి. అందువల్ల జన సామాన్యం వాడే భాషలో పత్రికలు ఇచ్చే విషయాలు, అవి ఏ రంగానికి చెందినవైనా, వాస్తవాలని ఇవ్వాలి. ​దానికి ​కారణం అవి ప్రజల నైతికతపై ప్రభావం చూపుతాయి . ఈ సందర్భంలో వార్తా పత్రికలను గురించి ఉదహరించాలి. సాధారణంగా అక్షరాలు వచ్చిన ప్రతి ఒక్కరికి  వార్తా పత్రిక చదివే అలవాటు సహజం. ఒకే వార్తని ఒక్కో వార్తాపత్రిక ఒక్కో కోణం నుండి ఒక్కోరకంగా ప్రచురిస్తుంది. ఒకే వార్త పలురకాలుగా మనల్ని చేరుతుంది. అందులో ఏది నిజమో ఎంత నిజమో తెలియదు. నిజానిజాలను తెలుసుకునే ఆసక్తి, సమయమూ అందరికీ ఉండవు. అందుకే వార్తలను ప్రజలకు అర్ధం అయేలా సులభ శైలిలో ఇవ్వటం, ప్రజల నైతికత దెబ్బతినకుండా వాస్తవాలను ఇవ్వటం అత్యంత ఆవశ్యకం.

కాలం గడిచే కొద్దీ పాతవి కొన్ని మరుగున పడిపోతుంటాయి. అలానే కొత్తవి మన జీవితాల్లో భాగమైపోతుంటాయి. ఇవి సహజంగా జరిగే​దే. భాష కూడా దీనికి అతీతమేమీ కాదు. జన వ్యవహారంలో భాష నిత్య పరిణామం చెందుతోంది. ఈ సందర్భంలో మనం తప్పక ప్రస్తావించవలసిన అంశం ఒకటి ఉన్నది. అది తెలుగు భాషాభిమానులకు ఒకింత ఆందోళన కలిగించే అంశం కూడా. ​ ​ఒకప్పటి తెలుగు వాడుక భాషతో పోలిస్తే, ఇప్పటి తెలుగులో ఆంగ్లం ప్రభావం ఎక్కువ. ఫలితంగా మనవైన కొన్ని పదాలు వాడుకలోంచి కనుమరుగవుతున్నాయి. ​​ తెలుగులో ఇంగ్లీషు పదాల వినియోగం విరివిగా ​జరుగుతోంది. ​

ఈ కాలంలో  సమాచారం చేరవేసేందుకు దృశ్య శ్రవణ మాధ్యమాలు కూడా అత్యంత పాచుర్యంలో ఉన్నాయి . వీటిలోని భాష గురించి తప్పక చెప్పుకోవాలి. దృశ్య మాధ్యమం అయిన కారణంగా సమాచారం అందించే / చదివే / చెప్పే వ్యక్తుల భాష గురించి కాక వారి బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది.  ప్రజా జీవితంలో దృశ్య ​మాధ్యమం పెద్ద స్థానాన్ని ఆక్రమించింది అనటంలో సందేహం లేదు. అటువంటి దృశ్య సాధనంలో వాడుతున్న భాష, ఉచ్ఛారణా దోషాలతో, అభ్యంతరకర పదాలతో, కొన్నిమార్లు గూడార్ధాలతో, అశ్లీల పదాలతో నిండి ఉంటోందని భాషాభిమానులు వాపోతున్నారు.  ​ప్రజల జీవితాలపై అత్యంత ప్రభావంచూపే ఈ దృశ్య సాధనాలు నడిపే వారు భాషా విషయంగా జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. 

దినపత్రికల అవసరాలు ఎప్పటికప్పుడు పెరుగుతుంటాయి. ప్రతి రోజు  కొత్త సంఘటనో, ఆవిష్కరణో వస్తూంటుంది.  సాధారణంగా ​ఆంగ్లంలో అందుకునే వార్తలను తెలుగులోకి అనువదించి ప్రచురిస్తారు. అయితే సమయం తక్కువగా ఉండటం వల్ల, ఒక పద్ధతికి అలవాటు పడటం వల్ల, పత్రికలలో భాష క్లిష్టమైన పదాలతో ​ ఉండే అవకాశం ఉంది. ​అందువలన అనువాదాన్ని సరళతరం చేసి, సహజమైన, సులభమైన భాషలో వార్తలనందించటం  కోసం పత్రికా రంగం కొత్త పదాలను వెతుక్కుంటూ ఉంటుంది. అవసరమైన పదాల్ని సృష్టించుకుంటూ ఉంటుంది. అనువాదం చేసుకుంటుంది. ఈ విధంగా వెతుక్కున్న లేదా సృష్టించబడ్డ పదాలు సరళంగా ఉం​డి  ప్రజలకు అర్ధమయ్యే   రీతిలో ఉండటం అవసరం. అంతే కాకుండా ​​విపరీతార్ధాలు ​ ​యి​వ్వనివై ఉండాలన్న నిబంధనను దూరం పెట్టకుండా పత్రికలు ​ఇతర భాషా పదాలను అనువాదం చెయ్యాలి. ​​గ్రామీణ ప్రాంతాల వారికి ​​తేలికగా అర్ధమయ్యే పదాలు ​​ఉపయోగించటంలో పత్రికలు  తమదైన పాత్ర పోషించాలి. సమాస దోషాలు , అక్షర దోషాలు , ప్రయోగాలూ లేకుండా వాక్య నిర్మాణం చేయాలి. ఈ వాక్య నిర్మాణంలో ఇతర భాషా పద ప్రయోగాలు నివారించటానికి ప్రయత్నం చేయాలి. మన సంప్రదాయాలకి, మన వ్యాకరణానికి అనుకూలంగా ఉండే ​ పదజాలాన్ని సమకూర్చుకోవాలి. కొత్త పదాలను సృష్టించి మెరుగైన రూపాన్ని నిర్ణయించటానికి పత్రికలలో ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ​అన్ని పత్రికలలోనూ ఒకే రీతిలో పదాలను వాడేందుకు కృషి జరగాల్సిన అవసరం ఉంది. ​

ఒకప్పుడు భాషలో మార్పులు రావటానికి కొన్ని తరాలు పట్టేది. కానీ ఇప్పుడు ఒక తరంలోనే ఎన్నో మార్పులు చూస్తున్నాం. ఈ రెండు దశాబ్దాల్లో పత్రికాభాషలో చాలా పరిణామం జరిగింది. కొన్ని వందల ఆంగ్లభాషా   పదాలు నేరుగా వాడుకలోకి వచ్చాయి. అయితే, మాతృభాషలో కూడా ​ ​సులభమైన పదాలతో చెబితే సులువుగా అర్ధమవటం వల్ల ఎక్కువ రోజులు జ్ఞాపకం ఉంటుంది. ​ ‘‘ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోగల భాషలో మాట్లాడితే విషయం అతని మెదడులోకి చేరుతుంది. అదే మనం అతని మాతృభాషలో చెబితే అది అతని హృదయాన్ని తాకుతుంది’’ అంటారు నెల్సన్‌ మండేలా. ​

కాలం నిరంతరం పరిణామాన్ని కోరుకుంటుంది.  కాలానుగుణంగా భాషలో కూడా మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. పాత పదాలు, ​వాటిని వ్యక్తపరిచే ధోరణులు ​ మారిపోయి సామాన్య జన భాష వాడుకలోకి వస్తూ ఉంటుంది. సంస్కృతి, సంప్రదాయం, వస్తువు, ప్రక్రియ, భాష, సాహిత్యం, ఆలోచనలు ఎప్పటికప్పుడు ఆధునికత్వాన్ని ఆహ్వానిస్తాయి. ఒక కవిగారు అన్నట్టు, "మాండలికం సహజమైంది. సజీవమైంది. మనం మాట్లాడుకునే భాష అక్షరీకరణ అద్భుతంగా ఉంటుంది. దానిని తమ ఆత్మగౌరవంగా ప్రజలు భావిస్తుంటారు." అందుకే కావచ్చు నేడు ప్రజలు మాట్లాడుకునే భాష పత్రికలలో కూడా కనిపిస్తోంది. మౌలికంగా, భాష ఉద్దేశ్యం పదిమందికి అర్ధం కావటం. పత్రికల ఉద్దేశ్యం, పదిమందికి విషయ పరిజ్ఞానం అందించటం. పత్రికలలో వాడుక భాష రావటం వల్ల ప్రజలకు విషయ జ్ఞానం, సమాచారం అందుబాటులోకి వచ్చాయి.  కాబట్టి మారుతున్న పత్రికా భాష సమాచారం అందించటంలో  ప్రజలకు ఉపయోగకరంగానే ఉన్నదని నిస్సందేహంగా చెప్పవచ్చు. అయినప్పటికీ నిరర్థక పదాలు రాకుండా, తెలుగు భాష స్వరూప స్వభావాలను దెబ్బతీసేలా పత్రికా భాష మారకుండా జాగ్రత్త పడవలసిన అవసరం యెంతైనా ఉన్నది. పత్రికలు సమాచార సేకరణ చేసి  , నిష్పక్షపాతంగా ఉండే భాషలో వ్యక్తీకరించాలి.  అలా కాకుండా ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశిస్తూ, తమ భావ జాలంతో వాక్య నిర్మాణం చేసి అంతర్లీనంగా పాఠకుని మనస్సును ప్రభావితం చేయాలనుకుంటే, ఆ పత్రికలు  వారి భావజాలాన్ని తెలియజేసే కరపత్రికలుగా మిగిలిపోతాయి. ఈ విషయంలో  పాఠకులే పత్రికల నిబద్ధతకు కొలబద్ద

***

bottom of page