top of page
bhuvanollasam.PNG
srinivyasavani.PNG

సంపుటి  6   సంచిక  1

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

వ్యాస​ మధురాలు

అప్పిచ్చివాడు -వైద్యుడు- 2 

భ్రమాంగ సంలక్షణం 

[Phantom Limb Syndrome]

girja sankar.JPG

 చింతపల్లి గిరిజా శంకర్

ఒకానొక యుద్ధం. నవీన మర మారణాయుధాలు రాని, కత్తులూ, గుర్రాలూ, రధాలూ, గదల యుద్ధ కాలం. 

"ఆ" రాజ్య సైనికుడు కత్తి దూసి, "ఈ” రాజ్య  సైనికుడిమీదికి పరుగెట్టుకుని వస్తున్నాడు, వాణ్ణి పొడవటానికి. ఇంతలో వెనకనించి ఒక బాణం వచ్చి వాడి తల నరికేసింది. ఆ తలతెగిన మొండెం, అదే వేగంతో ముందుకి నడిచి, ఎదుటి సైన్యం వీరుణ్ణి పొడిచి, ఆ తరవాత కింద పడింది. అక్కడ చచ్చి పడిఉన్న కొన్ని తలల్లో ఇంకా కోపంతో బిగబట్టిన పెదవులు, అలాగే కరుచుకుని ఉన్నాయి.  

 నమ్మశక్యం కావటంలేదు కదూ.  మీరు నమ్మాల్సిందే ఇది నిజం. 

మన మెదడు [Brain] లో ఉండే పదార్థాలు రెండు 1. న్యూరాన్.   2. న్యూరొగ్లియ. ముట్టుకుంటే టోఫూ లాగా ఉంటుంది. పట్టుకుంటే నొప్పి ఉండదు. 100 బిల్లియన్ కణాలుంటాయి అని అంచనా. కానీ ఆ కణాలు ఒకదానితో ఒకటి అనేకరకాలుగా కలుసుకుని కొన్ని కోటానుకోట్ల కన్నెక్షన్లు ఏర్పడతాయి. అవి ఎన్ని అంటే, మన పాలపుంతలో ఉన్న నక్షత్రాల సంఖ్య కంటే ఎక్కువ. కానీ ఇందులో  మనం  20 శాతమే  వాడతామని నమ్మిక. అదీ బాగా తెలివిగలవాళ్ళని పేరున్నవారు. మరి నూటికి నూరు పాళ్ళూ వాడితే  వారి శక్తికి అంచనా కట్టగలమా?  

 

ENCYCLOPEDIA BRITANNICA మొదటి 10 వాల్యూంస్ కొన్నాట్ట వివేకానందుడు వాళ్ళ బేలూర్ మఠానికి. ఒక వారం అయిన తరవాత  శిష్యులతో సరదాగా పందెం వేసుకుని, అందులో ఉన్న విషయాలన్నీ చెప్పాట్ట!   అందుకనే ఆయన ఎప్పుడూ "విద్య” అంటే బయటినుంచి లోపలికి ప్రవేశపెట్టేది కాదు; లోపలున్నదాన్ని బయటకి రాబట్టడం విద్య"   అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం ఇంకొంచెం అర్థమైనట్టుందికదా!! మెదడు అంత గొప్పదిగనకే అది అప్పుడప్పుడు  మన మీద మాయలు ప్రయోగిస్తే మనం ఆశ్చర్యపడిపోరాదు!  

మహాకవి శ్రీశ్రీ ఈ అద్భుతాలకి ఇలా స్పందించారు

"చావు బ్రతుకుల సంధ్యాకాలంలో  కన్నులుమూసిన రోగార్తుని రక్తనాళ స్పందన" " ఉరి తీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం. ఉన్మాది మనస్సినీవాలిలో ఘూకం కాకా, భేకం బాకా" ఊహించి రాసిన కవిత కాదండీ. ఆయన అనుభవాలివన్నీ.   

 

**

 

60 యేళ్ళ మాట. పల్లెటూరి రైతు, రోడ్డు ప్రమాదం లో కాలు విరిగింది. పల్లెటూరినించి గుంటూరు పెద్ద ఆస్పత్రికి రావటానికి, కొన్ని రోజులు పట్టింది. ఈ ఆలస్యం వల్ల కాలు ఇన్ఫెక్ట్ అయింది. గాంగ్రీన్ వచ్చింది. [అంటే గాయం కుళ్ళిపోయిందన్నమాట] "కాలు తీసెయ్యాలి". అన్నారు డాక్టర్లు. పాతరోజులు. ప్రజలు ఇంకా "వైద్యో నారాయణో హరి" అని నమ్మిన నిష్కపటులు. "మాదేముందయ్యా? మీరే మా దేముళ్ళయ్యా. అంతా మీదయ" అని ఆ భారమంతా ఆ డాక్టర్ల నెత్తి మీద పెట్టారు. 

 

ఆపరేషన్ బాగా జరిగింది. ఎక్కువ కష్టం లేకుండా కుళ్ళిన కాలు మోకాలి దగ్గర్నించి కింద భాగం తీసేశారు. "ప్రాణాపాయం తప్పింది" అని ధైర్యం చెప్పారు వైద్యులు. రెండు వారాలు ఆస్పత్రిలో ఉంచి, ఆంటీబయటిక్స్, కట్లూ, నడక నేర్పించడాలూ... డిస్చార్జ్ చేశారు. క్రచెస్ మీద నడవడం నేర్పారు. అతడి భార్య, పిల్లలూ చావుదప్పి కాలితోపోయిందని సంతోషించి వేయి దేముళ్ళకి ధన్యవాదాలు చెప్పుకున్నారు. ఇంటికి వెళ్ళిన 4 రోజులకి సూరయ్య మంచం మీంచి లేస్తూ కింద బడ్డాడు. భార్య సుబ్బమ్మ వచ్చి కోప్పడింది. "కర్రెందుకట్టుకోలేదు? నన్నెందుకు బిలవలా?" 

అప్పుడు గుర్తొచ్చింది సూరయ్యకి, తన కుడికాలు లేదని. ఆవిషయం మెదడులో ఉన్న అతని కాలుని సూచించే చోట  జ్ఞాపిక [REPRESENTATION]  ఇంకా చెరిగిపోలేదు. అదే మనం చెప్పుకుంటున్న "భ్రమాంగ సంలక్షణం" లేక,  PHANTOM LIMB SYNDROME

 

మరో నాలుగు రోజులకి, రాత్రి నిద్రలో గావుకేకపెట్టి, ఇంటిల్లిపాదినీ లేపాడు, సూరయ్య.

 "ఏమయ్యా! ఏమయిందీ?" అని ఆదుర్దాగా వచ్చింది సుబ్బమ్మ. 

"చూడే యిక్కడ తేళ్ళు కుడతన్నాయ్" అని కుడికాలు చూపించాడు. 

అక్కడ తేళ్ళూ లేవు, జెర్రులూ లేవు, కుడికాలూ లేదు. సుబ్బమ్మ తెల్లపోయి కొంచె విసుక్కుంది. మరోరోజు కాంత కాళ్ళత్తవే. బాగా నెప్పిగా వుంది" అని కుడికాలువేపు చూపించాడు. 

"ఏళాకోళంగా ఉందా? ఏంపిసకాలే?" అని కుడికాలు ఖాళీని చూపించింది. 

ఇలాగే రోజూ ఏదో నొప్పనో, దురదనో పిల్చేవాడు, భార్యని, పిల్లల్ని. ఆ కథ ఎలా తెల్లవారిందో నాకు గుర్తు లేదు. బహుశా ఊళ్ళో ఆచారి వైద్యుడు వచ్చుంటాడు. అవీ ఇవీ రసాయనాలిచ్చి, ఆ తర్వాత ఓ సారి భూతవైద్యుణ్ణి పిలిపించీ ఉంటారు.

ఈ గత 60 యేళ్ళలో ఇటువంటి జబ్బులగురించి, డాక్టర్ల అవగాహన పెరిగింది. పూర్వం మన మెదడు లో ఉన్న కణాలు చచ్చిపోతే, మళ్ళీ పుట్టవని అనుకునేవారు. ఇప్పుడలాకాదు. కొత్త కణాలు పుడతాయి. పక్క కణాల్తో కొత్తగా కనెక్షన్స్ ఏర్పరుచుకుంటాయి. అంతేకాకుండా, ఎవరికయినా, అంగ వైకల్యం ఉంటే పక్కన ఉండే కొన్ని కేంద్రాలు వాటికి అండగా ఉండి కొంచం సహాయం చేస్తాయి. ఉదాహరణకి, గుడ్డివాడున్నడనుకొండి, వాడికి, స్పర్శ, వినికిడి జ్ఞానాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది అంధులు, కొత్తచోట్లో కొన్ని రోజులుంటే వాళ్ళకి ఆ ప్రదేశం కొలతలూ, సెన్స్ ఆఫ్ స్పేస్  త్వరగా గ్రహిస్తారు.  వస్తువులకి కొట్టుకోకుండా, కింద పడకుండా నడుస్తారు గదా!

అందువల్ల ఎలాగయితే మెదడు లేనిది ఉన్నదని రోగుల్ని బాధిస్తున్నదో, అదే మెదడుని మనం రోగి "ఉన్నది అనుకునే నమ్మకాన్ని, లేదు అనే ఒక మాయ ద్వారా  మాయం చేయగలిగితే”. అదేగదా రోగికి కావలసింది.     

ఇరవయ్యో శతాబ్దపు ఉత్తరార్థంలో  డాక్టర్ పెన్ ఫీల్డ్ అనే కెనడా దేశ వాస్తవ్యుడు మూర్చరోగుల వైద్యం చేస్తూ, బ్రెయిన్ ఓపెన్ చెశాక, మత్తుమందు లేకుండా వాళ్ళతో మాట్లాడేవాడు.  ఆశ్చర్యం ఏమిటంటే, బ్రెయిన్ లో ఒక చోట , మన దేహంలో ఎక్కడ నొప్పిపుట్టిందో తెలియజెప్పే సెంటర్ ఉన్నది. కాని, బ్రెయిన్ లో మాత్రం నొప్పి ఉండదు. అంటే, నాకు కాల్లో ముల్లుగుచ్చుకుంటే, ఆ నొప్పి నాకు ఎక్కడుందో, ఏఏరకమయిన నొప్పో చెప్పేది బ్రెయిన్ లో ఒక చోటు,  హైపోథలమస్. [HYPOTHALAMAS] అయితే మెదడు ని పట్టుకుని పిసికితే నొప్పి ఉండదు. ఆ విధంగా పెన్ ఫీల్ద్ తన పేషంట్ బ్రెయిన్, ఎలెక్ట్రోడ్ తో ముట్టుకుని, వాళ్ళనడిగేవాడు, వాళ్ళ అనుభూతి ఏమిటో. 

అదేవిధంగా, చలనాత్మక సెంటర్ లో [MOTOR AREA] ఎలెక్ట్రోడ్ పెట్టి, ఎక్కడతాకితే, ఏ అవయవం స్పందిస్తుందో ఇవన్నీ గుర్తు చేసి, ఒక బ్రెయిన్ మాప్ తయారు చేశాడు.

 ఇతడి పరిశోధనలవల్ల, ముఖ్యంగా, మన మెదడులో ఎక్కడెక్కడ ఏమేమి కేంద్రాలుంటాయో. ఎక్కడ ముట్టుకుంటే ఏ కండరాలు కదులుతాయో, ఏ ఆలోచనలొస్తాయో, వేయేల? మామూలుగా ఉండే స్థితిలో, నీ మెదడు ఎంత సమాచారాన్ని సేకరించి, దాన్ని విమర్శించి, 30 సెకన్లలో అర్థం చెబుతుందో, అది హబుల్ టెలెస్కోప్ చెయ్యడానికి పాతిక సంవత్సరాలు పడుతుంది!! ముఖ్యంగా, బ్రెయిన్ కణాలు, ఒకసారి దెబ్బతిన్నాక, మళ్ళీ లేచి కొత్త మిగిలిన కణాలతో సంధి చేసుకుని, కొత్త కేంద్రాలు స్థాపించగలవు. అంటే ముసలి తాతకి కొత్త విద్యలు చెప్పవచ్చు. ఈసారి ఎవరయినా, "అరే యీడు ముసలోడురా. యీడేం నేర్చుకుంటడూ" అని అంటే ఈ వ్యాసం చదవమనండి. 

 

ఇంతకుముందు, లేని కాలు ఉన్నదనే భ్రమ [భ్రమాంగ సంస్లేషణ] ఎలా వస్తుందో తెలుసుకున్నాం. కాలు లేకపోయినా, మెదడులో ఆ కాలి "ముద్ర "ఇంకా చెరిగిపోలేదు గాబట్టి. మరి ఆ ముద్రని మెదడులోనించి చెరిపేస్తే? బింగో! అదేకదా మనకి కావల్సింది. అంటే, కొన్నాళ్ళకి, ఆ "ఖాళీ" ప్రదేశంలోకి, పక్కనున్న ఇంకో ప్రదేశం ఆక్రమిస్తుందన్నమాట. చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవయినయట్ట్లు.

 

 

 

 

 

 

 

 

ఇక్కడ మనం ఒక మహానుభావుడి గురించి చెప్పుకోవాలి. ప్రపంచంలోని టాప్ 100 సైంటిస్ట్స్ లో ఈయన్ని ఒకడిగా పరిగణిస్తారు. పెద్ద అంతర్జ్జాతీయ విశ్వవిద్యాలయాలకి  ఈయన్ని పిలుస్తారు, ప్రసంగాలకి. ఆయనకి, అర్థరాత్రి అపరాత్రి అని లేకుండా టెలీఫోన్ కాల్స్ వస్తుంటాయి.  ప్రపంచవ్యాప్తంగా. ప్రస్తుతం ఈయన శాన్ డియేగో లో ప్రొఫెసర్. ఈయన మన భారతీయుడే. పేరు విలయనూర్ రామచంద్రన్. ఈయనకి నోబెల్ ప్రైజ్ ఎందుకు రాలేదో మరి? ఈయన ప్రత్యేకత  ఏమిటంటే, చాలా ఖరీదయిన వైద్యాలు కాకుండా, భారత దేశంలాంటి బీద దేశాల్లో, బీద ప్రజలకి అందుబాటులో ఉండే  విధంగా, ట్రీట్మెంట్ కనిబెట్టడం. ఉదాహరణకి, PHANTOM LIMB SYNDROME  తీసుకోండి అసలు లేకపోయినా, బ్రెయిన్ లో ఆ గుర్తు చెరిగిపోనందువల్లేగదా, లేని కాలికీ, చెయ్యికీ, దురదా, నొప్పీ? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం...మాయని మాయతోనే జయించాలి. కార్డ్ బోర్డ్ బాక్స్లు తీసుకుని, అద్దం ముందు ఎడమచేతిని కుడిపక్క, కుడిచేతిని ఎడంపక్క పెట్టి అద్దం ముందు [అద్దంలో ఎడమ కుడిగా , కుడి ఎడమగా ఉంటుంది కదా] తీసేసిన చేతికి దురద పుట్టినప్పుడు, అద్దంలో రెండో చేతిని గోకుతాడు రోగి. మరి అద్దంలో బొమ్మలు తారుమారుగదా. అందుచేత కొన్నాళ్ళకి బ్రెయిన్ ఈ మాయా మంత్రం తెలుసుకోలేక, డా. రామచండ్రుడికి  దణ్ణం పెట్టి రెండు చంపలూ వాయించుకుంటాడు, ఆ ఒక్క చేత్తోనే.

 

అంటే మన బొమ్మలో చెయ్యి [హాండ్]   తీసేశారనుకొండి. కొన్నాళ్ళకి, ఆ పక్కనున్న, నాలుక స్థలానికి తెలుస్తుంది. పక్కవాటా ఖాళీ అని. అద్దెలేకుండా హాయిగా ఆక్రమించవచ్చు. అని దుర్మార్గం చేసినా, గుడ్డిలో మెల్ల అని అది మనకి మేలే చేసింది . ఇప్పుడు "లేని" చెయ్యికి దురదపెడితే , ఆ "ఉన్న" నాలుకని గోకితే ఆ చేతి  దురద తీరునుకదా! నిజంగా ఈ వ్యాధులకి వైద్యం చెయ్యడం ఇంత తేలిక కాదు. అయితే, వంద సంవత్సరాల కిందట, బ్రెయిన్ కి ఏమయినా రోగం వస్తే, బ్రెయిన్ కణాలు REGENERATE  కావు కాబట్టి, బ్రెయిన్ కి ఏ జబ్బు వచ్చినా, మనం ఏమీ చెయ్యలేము. అనే స్వస్తి వాచకానికి స్వస్తి చెప్పి, ఇంక ఏ ఇతర అవయవానికి జబ్బు వచ్చినా, ఓటమి ఒప్పుకోకుండా పోరాడి గెలుస్తున్నట్లే, మెదడురోగాలకి గూడా వైద్యమున్నదని తెలుసుకున్నాం.  

ఈ డాక్టర్ రామచంద్రన్ ఒక పుస్తకం రాశాడు PHANTOMS IN THE BRAIN.   అందులో ఇల్లాటి  బాధలనెన్నో విశదీకరించి, వాటికి ఉపశమన మార్గాలు తను ఎల్లా ఇంట్లో అట్టపెట్టెలతో 10 డాలర్ల ఖర్చుకి ఎక్కువకాకుండా కనిపెడుతున్నాడొ గ్రహించవచ్చు. 

డా. రామచంద్రన్ లా "ఈ వైద్యాన్ని బీదలకి అందుబాటుగా ఉండాలనే” ఉద్యమంలో ఎంతో కృషి చేస్తున్న శాస్త్రకారులెంతోమందికి మనం ఋణపడున్నాం.

 *****

 

మెదడు, మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారం ఈ పదాలకి నిర్వచనం ఏమిటీ? భగవద్గీతలో పార్థసారథి బొమ్మ చూపిస్తూ, గుర్రాలు ఇంద్రియాలు, కళ్ళెం మనసు, బుద్ధి కృష్ణుడు, అర్జునుడు జీవుడు, రధం శరీరం అని చెప్తే ఓహో అనిపిస్తుంది. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవి ఎక్కడుంటాయ్ మన మెదడులో? అహంకారం అంటే కర్తృత్వం అన్నారు సరే! చిత్తము అంటే -"మీ చిత్తం  మా భాగ్యం" లో లాగా...చిత్తం అంటే తలంపు, కోరిక అనే వస్తుంది అర్థం  వేదాంత నిఘంటువుల్లో చూస్తే, తరతరాలుగా మన మెదడులో ఉండే కోరికల గుంపుట. వాటినే సంస్కారాలు CAUSAL BODY అన్నారు. బ్రెయిన్ కోసి చూస్తే ఇవేవీ కనబడవుగదా! మోక్షం అంటే నిశ్చలత్వం అనీ మెదడు పూర్తిగా ఆలోచనారహితం అని, అప్పటి అనుభూతి మాత్రమే మోక్షం అనీ చెప్తారు. మరి మన పాలపుంతలో ఎన్ని నక్షత్రాలున్నాయో వాటికంటే ఎక్కువ కనెక్షన్లున్న మన మెదడుని ఎలా అరికట్టడం?  రామక్రిష్ణ పరమహంసకి కాళికాదేవి రోజూ కనబడి మాట్లాడేదిట. మొదట్లో వివేకానందుడు గూడా అవి హలూసినేషన్స్ అన్నాడు? వీటన్నిటికీ సమాధానాలు కావాలంటే ఈ శీర్షిక ని క్రమం తప్పకుండా చదవండి.  

 

ఒకానొక వెంగళరావు మెంటల్ హాస్పిటల్ కి వచ్చి,” నేనూ హేమామాలినీ [లేదా ఇంకో సెలిబ్రిటీ ] రహస్యంగా రేపో మాపో పెళ్ళిచేసుకుంటాము. ఎవరికీ చెప్పకండి. నన్ను హాస్పిటల్లో చేర్చుకొండి" అని అడిగాడనుకొండి. పెళ్ళిచేసుకునేవాడు పిచ్చాసుపత్రికి ఎందుకు వచ్చాడు [అయిన తరవాతంటే పోనీ ఒక అర్థముండేది]  ఈ వింత కథ ఏమిటో తెలుసుకోవాలంటే వచ్చే సంచిక దాకా ఆగుదాము.   

 

Appichivaadu
bottom of page