MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కవిత్వం - వ్యక్తిత్వం
విన్నకోట రవిశంకర్
కవిత్వం, సాహిత్యం వంటివి దేశాన్నో సమాజాన్నో సమూలంగా మార్చుతాయనే వాదం మీద నాకు నమ్మకం లేదుగాని, సమాజంలోని కొంతమంది వ్యక్తుల జీవితాన్ని ప్రభావితంచేసి, వారి వ్యక్తిత్వాన్ని రూపొందించడంలో అవి పాత్ర వహించటానికి అవకాశం ఉందని మాత్రం అంగీకరిస్తాను. “సాహిత్యం అవసరమా?” అన్న వ్యాసంలో ఇస్మాయిల్ గారు ఒక సంఘటన గురించి చెబుతారు. ఒకసారి ఒక చురుకైన కుర్రాడు ఆయన్ని అడుగుతాడు “ఈ సాహిత్యం ఇవన్నీ ఎందుకండీ? ఇవి లేకుండా ప్రపంచం నడవదా?” అని. దానికాయన “నిరభ్యంతరంగా, నడుస్తుంది. కాని ఇప్పుడు నడుస్తున్న విధంగా కాదు. అప్పుడు జనం ఇలా ఉండరు. వారి మధ్య అవగాహన ఇంత నిశితంగా ఉండదు. జీవితాన్ని అనుభవించి, ఆనందించే శక్తి కూడా క్షీణిస్తుంది.” అని. కవిత్వం ప్రధానంగాచేసే పని మన హృదయాల్ని మెత్తబరచటం, మనిషిలో సహజంగావుండే సౌందర్యదృష్టి, చేతనాసౌకుమార్యం వంటివాటిని పెంపొందించటం.
అలాగే, మన పరిసరాల్ని, నిత్యజీవితంలో ఎదురయ్యే అనుభవాల్ని మనకు కొత్తగా పరిచయం చెయ్యటం.. ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచాన్ని వేరే కళ్లతో చూసే శక్తిని కవిత్వం పాఠకునికి ప్రసాదిస్తుంది. ఆ మధ్య Netflix లో “The Violinist” అనే చిత్రం చూసాను. సినిమా పెద్దగా అర్థం కాకపోయినా, చివర ఇచ్చిన పికాసో కొటేషన్ ఒకటి నన్నాకర్షించింది. అది “Art washes away from the soul the dust of everyday life” అని. యాదృచ్చికంగా నేను చాలా సంవత్సరాల క్రితం రాసిన ఒక కవితలో దాదాపు ఇటువంటి భావమే వ్యక్తమౌతుంది.
“ఎంత సంగీతంతో కడిగితే ఈ ఆత్మ దీపం
బాహ్యప్రపంచపు మసి వదిలి
మళ్ళీ తళతళ లాడుతుంది.”
వేమనగారు కూడా “ఆత్మ శుద్ధిలేని ఆచారమదియేల” అన్నాడు కదా! ఇలా పరిశుభ్రపరుచుకోవటమనేది ఒక నిరంతర ప్రక్రియ. దానికి కళలు, కవిత్వము ఉపయోగపడతాయి. ఒక విధంగా చెప్పాలంటే, మన మనసుని, అంతఃప్రపంచాన్ని శుభ్రపరిచే డిటర్జంట్లలాగా అవి పనిచేస్తాయి. ఇదంతా మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దటానికి, మనలో మంచి గుణాల్ని పెంపొందించటానికి చేసే ప్రయత్నమే.
శతకాల విషయం వచ్చింది కాబట్టి మరొక విషయం ఇక్కడ చెప్పుకోవాలి. చిన్నతనంలో మంచిని బోధించే పరికరంగా పద్యం ఉపయోగపడటమనేది శతక సాహిత్యంతో మనకు అనుభవంలోకి వచ్చిన విషయమే. అది పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దటంలో దోహదపడుతుందనే నమ్మకం ఉండేది. ఐతే, నైతిక విలువలన్నవి కాలాన్నిబట్టి, ప్రదేశాన్నిబట్టి కూడా మారుతూ ఉండవచ్చు. కానీ, ఇటువంటి పద్యాలు చదవటంవల్ల ఏర్పడే విజ్ఞత, మానవ స్వభావం మీద అవగాహన తరువాతి జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా వృత్తిపరమైన జీవితంలో మనుషుల్ని అవగాహన చేసుకోవటంలో, నిర్ణయాలు తీసుకోవటంలో వీటి ప్రభావం ఉంటుంది. వచన కవిత్వం ప్రాచుర్యంలోకి వచ్చాక ప్రధాన స్రవంతి కవిత్వం అనేక ఇతర విషయాలకి విస్తరించటం వల్ల, బోధనాత్మకమైన అంశం అందులో బాగా తగ్గిపోయింది. ఇటీవలికాలంలో మళ్ళీ బివివి ప్రసాద్ వంటివారి కవిత్వంలో ఇలా ప్రీచ్ చేసే అంశాలు కొన్ని కనిపిస్తాయి. ఈ మధ్యనే విహారి రాసిన “చేవ్రాలు” అనే దీర్ఘ కవిత ఒకటి చదివాను. దానిని ఆయన వ్యక్తి లేదా వ్యక్తిత్వ వికాస గ్రంథంగా ఉద్దేశించినట్టు దాని టాగ్ లైన్‌ని బట్టి తెలుస్తూ ఉంటుంది. ఇందులో అనేక బోధనాత్మకమైన, సందేశాత్మకమైన వాక్యాలు ఎదురౌతాయి.
ఐతే ఇటువంటివాటితో ఒక ఇబ్బంది లేకపోలేదు. సందేశం వాచ్యమైనప్పుడు అది కవిత్వంగా రాణించదు. ఆధునిక కవితా శిల్ప దృష్ట్యా చూసినప్పుడు కవిత్వమంటే కేవలం సుభాషితం కాదు. అదింకా సున్నితంగా, లోతుగా, గాఢంగా ఉండాలి. మనిషిలో ఉన్న finer sensibilities కి appeal చెయ్యటం ద్వారా ఉన్నతీకరించాలి గాని, ప్రీచ్ చెయ్యాలని ప్రయత్నిస్తే రక్తికట్టదు.
ప్రారంభ యౌవనంలో ఉన్న యువతీయువకుల్లో సౌందర్యకాంక్ష, త్వరగా స్పందించే గుణం, ఆవేశం వంటివి అధికంగా ఉండటంవల్ల కవిత్వం వారిపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఆ వయసులో చాలామంది యువతీయువకులు కవిత్వం, కథలు రాయటానికి ప్రయత్నించటం సహజంగా జరుగుతుంది. వారిలో చాలామంది తదుపరి కాలంలో ఆ ఆసక్తిని నిలుపుకోలేకపోయినా, ఆ కొద్దిపాటి అనుభవంవల్ల వల్ల కలిగిన ప్రభావం వారి తరువాతి జీవితాన్ని సుసంపన్నం చేస్తూనే ఉంటుంది. ఇంగువ కట్టిన గుడ్డలాగా దాని పరిమళం వారి మనసు మూలల్లో ఎక్కడో గుబాళిస్తూనే ఉంటుంది. ఐతే, వారిలో ఆవేశం ఎక్కువగా ఉండటంతో బలమైన కవిత్వం, ముఖ్యంగా ఒక సైద్దాంతిక భూమికతో చెప్పింది వారి వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చివేసి, కార్యాచరణ వైపు తీసుకుపోయే ప్రమాదం కూడా లేకపోలేదు.
“మీ కవిత్వం ప్రజల్లోకి వెళ్ళిందా?” అన్న ప్రశ్నకు జవాబుగా శ్రీశ్రీ “నా కవిత్వం వెళ్ళినా వెళ్లకపోయినా నా కవిత్వం చదివినవాళ్ళు ప్రజల్లోకి వెళ్ళారు” అని చెప్పారు. REC వరంగల్ పూర్వ విద్యార్థిగా నేను చూసినంతవరకు చాలా తెలివైన, సున్నితమనస్కులైన విద్యార్థులే విప్లవ రాజకీయాలకి ఆకర్షితులై ఆ మార్గంలో వెళ్ళేవారు. వారిని ప్రభావితం చేసిన వాటిలో ప్రధానమైనది కవిత్వం, పాటలతో కూడిన విప్లవ సాహిత్యమే. విరసం మాజీ సభ్యుడు, ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న ప్రముఖ కవి వెంకటయోగి నారాయణస్వామి తన అనుభవాలను వివరిస్తూ రచించిన “నడిసొచ్చిన తొవ్వ” అనే పుస్తకంలో ఇటువంటి ఉదాహరణలు దొరుకుతాయి. ప్రారంభ యౌవనంలో ఉండి, కవిత్వం చదువుతూ, రాస్తూ వృద్ధిలోకి వస్తున్న, అతనికి తెలిసిన యువకులు కొందరు విప్లవ రాజకీయాల్లోకి వెళ్ళి ఆ తరువాత బూటకపు ఎన్‌కౌంటర్లలో మరణిస్తారు. అది చదివినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. నేను స్వామిని ఆ విషయమై ప్రశ్నించాను కూడా. “తెలిసీతెలియని వయసులో ఉన్న యువకులు ఆవేశంతో ప్రమాదకరమైన మార్గంలో పోవటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, దాని ఫలితాల గురించి ముందుగా హెచ్చరించవలసిన బాధ్యత విరసం పెద్దలకు లేదా?” అని. దానికతను “విరసం ఎప్పుడూ ఉద్దేశపూర్వకంగా వారిని ప్రోత్సహించలే”దని సమాధానం చెప్పాడుగాని, నాకది అంతగా సంతృప్తి కలిగించలేదు. మొత్తానికి, కవిత్వం యువకుల మీద చూపించే ప్రభావం రెండంచుల కత్తివంటిదని గుర్తించటం మంచిది.
కవిత్వం-వ్యక్తిత్వం అన్నప్పుడు కవి వ్యక్తిత్వం గురించి కూడా రెండు ముక్కలు చెప్పుకోవాలి. కవితలు చదివి మనం ఊహించుకున్నంత ఉన్నతంగా అతని వ్యక్తిత్వం ఉంటుందా అన్నది ప్రశ్నార్ధకమే. ఉండవచ్చు, ఉండకపోవచ్చు.
“దిగులు నేలకి జీవం ప్రసాదించే సస్య ఋతువులాగా
పారిజాతాలకు పరిమళాన్ని పంచిపెట్టే వెన్నెలరాత్రిలాగా
కవిత్వం మా ప్రేద బ్రతుకుల్ని అప్పుడప్పుడు కటాక్షిస్తుంది.”
అన్నట్టు సృజనాత్మక ప్రక్రియలో నిమగ్నమైనప్పుడు మనసు తాత్కాలికంగా ఉన్నత స్థితినిపొంది, అది ముగియగానే మామూలు స్థితికి రావచ్చు. కవి ఎల్లప్పుడూ అదే స్థితిలో ఉండాలని ఆశించటం సమంజసం కాదు. ఉండగలిగితే మంచిదేగానీ, అవకాశం తక్కువ. ఐతే, సిద్దాంతపరమైన, లేదా ఇందాక చెప్పినట్టు బోధనాత్మకమైన కవిత్వం రాసినప్పుడు, కనీసం దానికి విరుద్ధమైన వ్యక్తిత్వం, ప్రవర్తన ఉండకూడదని మనం ఆశించటంలో తప్పులేదు.
వ్యక్తిత్వాన్ని రూపొందించే అనేక అంశాలలో కవిత్వ రచన, పఠనం వంటివి కూడా తప్పక చేర్చవచ్చు. ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది, రచనైతే ఆ రచన పట్ల కవికున్న నిజాయితీ, పఠనమైతే దానిపట్ల పాఠకునికున్న నిమగ్నత మొదలైన వాటిమీద ఆధారపడివుంటుంది.
*****
శ్రీ విన్నకోట రవిశంకర్ గారు గత 22 సంవత్సరాలుగా అమెరికా వాస్తవ్యులు మరియు ప్రముఖ రచయిత, ఇస్మాయిల్ పురస్కార గ్రహీత. వీరి స్వస్థలం పిఠాపురం. REC వరంగల్ నుండి ఇంజనీరింగ్ పట్టా అందుకున్నారు. ‘కుండీలో మర్రి చెట్టు’ ‘వేసవి వాన’ ‘రెండో పాత్ర’ అనేక కవితా సంకలనాలు, ‘కవిత్వంలో నేను’ అనే వ్యాస సంకలనం ప్రచురించారు.