top of page
bhuvanollasam.PNG
srinivyasavani.PNG

సంపుటి  6   సంచిక  1

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

పుస్త​క పరిచయాలు

నిర్వహణ: శాయి రాచకొండ  |  శ్రీనివాస్ పెండ్యాల

sahityam@madhuravani.com

పుస్తక విశ్లేషణ

మేము ఎంపిక చేసుకున్న కొన్ని  పుస్తకాలు ఈ ‘పుస్తక పరిచయాలు’ శీర్షికలో విశ్లేషించబడతాయి.

సంక్షిప్త పుస్తక పరిచయం

పుస్తక రచయితలకి ఉచితంగా ప్రచారం కలిగించడంకోసం మరియు పాఠకులకి కొత్త పుస్తకాల అందుబాటు గురించి క్లుప్తంగా పరిచయం చేయుట కొరకు "సంక్షిప్త పుస్తక పరిచయం" శీర్షిక ఉద్ధేశ్యింపబడింది. ఈ శీర్షిక లో తమ సరికొత్త గ్రంధాలని పరిచయం చెయ్యదల్చుకున్న వారు, ప్రచురించబడ్డ కొత్త పుస్తకాల ముఖ చిత్రం (స్కాన్ చేసిన ఫ్రంట్ కవర్), రచయిత వివరాలు, పుస్తకం గురించి ఐదు వాక్యాలు మించకుండా సంక్షిప్త సమీక్ష, కొనుగోలు వివరాలు మాకు పంపగలరు.

పంపించవలసిన చిరునామా:

sahityam@madhuravani.com

 పుస్తక పరిచయం విషయాలలో అంతిమ నిర్ణయం మధురవాణి నిర్వాహకులదే. 

parijata.JPG
panduranga.JPG
charlie.JPG
book2.JPG
america.jpg
super-visionaries30.jpg

పాండురంగ మాహాత్మ్యం – పరిచయం & నంది తిమ్మనార్య విరచిత పారిజాతాపహరణము – పరిచయం

సంవత్సరం ఇదే సమయంలో అంటే మధురవాణి.కాం ఏప్రిల్-జూన్ సంచికలో బాలాంత్రపు వేంకటరమణ గారు రాసిన గ్రంధం ‘మనుచరిత్రము – పరిచయం’ ఈ శీర్షికలో పరిచయం చేయడం జరిగింది.  ఏడాది తిరగక మునుపే రమణ గారు తెలుగులో పంచకావ్యాలు లేదా పంచ ప్రబంధాలు అనబడే గ్రంధాలను సామాన్య పాఠకుడికి అందుబాటులోకి తేవాలనే ఆకాంక్షతో పూనుకుని, మరో రెండు గ్రంధాలను ప్రచురించారు.  ఆ రెండూ, తెనాలి రామకృష్ణ  రాసిన పాండురంగ మహాత్మ్యం – పరిచయం మరియు నంది తిమ్మనార్య విరచిత పారిజాతాపహరణము – పరిచయం.  మొదటి పుస్తకం ఆగస్టు 2020లో విడుదలయితే, పారిజాతాపహరణ పరిచయం నవంబరు 2020లో విడుదలయింది.  

ఇదివరలో వేంకటరమణ గారి ఆశయం, తెలుగులో రచింపబడిన పద్యగ్రంధాలను సులభ శైలిలో సామాన్య, ఆధునిక పాఠకుడిని దృష్టిలో పెట్టుకుని పరిచయం చేస్తూ, ఆయా గ్రంధాలలోని విశేషాలను, గొప్పదనాన్ని విశదీకరించి క్లుప్తంగా చెప్పడం.  ఈ ప్రయత్నానికి భేతవోలు రామబ్రహ్మం గారు చేబట్టిన “పాఠక మిత్ర” పద్ధతిని అనుసరించారని రమణ గారు చెబుతారు.  

డా. అద్దంకి శ్రీనివాస్ గారు పాండురంగ మాహాత్మ్యం పుస్తకానికి తన మాట (కమ్మచ్చు తీగె) రాస్తూ రచయితను ఉద్దేశించి, “...తాను ఎంచుకున్న పుస్తకాలను తన మనసు అనే కార్ఖానాలో కరిగించి పోతపోశారు.  దానినుంచి తీసిన కమ్మచ్చుతీగె ఈ పరిచయగ్రంథం అని చదివితే తెలుస్తుంది.” అంటారు.  నిజమైన మాట.  

పారిజాతాపహరణానికి ముందుమాట (రమణీయ పారిజాతం) రాస్తూ, మధుర భారతి బ్రహ్మశ్రీ ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు రచయిత గురించి చెబుతూ “నేపథ్యాన్ని అవగాహన చేసుకుంటూ, కావ్యంలోని పూర్వాపరాలను సమీక్షించుకుంటూ, చిన్న చిన్న వాక్యాలలో లోతైన అర్థాలను గుబాళింప చేస్తున్నది బాలాంత్రపు వారి వ్యాఖ్యాన సరళి.” అంటారు.  ఇంకో సందర్భంలో “శ్రీ వేంకటరమణ సహజంగానే రసహృదయులు.  భావకులు.  తెలుగు భాష సాహిత్యాల విషయంలో ‘డిగ్రీలు లేని పాండిత్యం’ వీరిది.  డిగ్రీలున్నవారు, పాండిత్యం ఉన్నదని అనుకుంటున్నవారు చాల మంది చేయ(లే)ని పనిని నిర్వహించడానికి పూనుకున్నారు.  పాండిత్యానికి భావుకత తోడైతే వెలువడే వ్యాఖ్యాన సౌరభాన్ని సహృదయ పాఠకులకు పంచుతున్నారు.”

వెంకటరమణ గారు తెలుగు సాహిత్యానికి మకుటంలా భాసించిన పద్యసాహిత్య  మధుర రసాన్ని సామాన్య తెలుగు పాఠకులకు అందించే ఈ గొప్ప ప్రయత్నానికి అద్దంకి వారు, మల్లాప్రగడ వారు ఇచ్చిన పై యోగ్యతా పత్రాల కంటే ఇంకేం కావాలి?  

ప్రతి ప్రబంధ గ్రంధానికి వేరే వేరే లక్షణాలుంటాయి – కవి ఎంచుకున్న మార్గాన్ని బట్టి, కథను బట్టి.  పంచ కావ్యాలూ అంతే.  ఆయా కవుల్ని, కావ్య లక్షణాల్ని పూర్తిగా మధించి, జీర్ణం చేసుకుని, పద్యాలలో కవులు వేసిన ముఖ్య సమాసాలను వివరిస్తూ, సందర్భాను సారంగా ప్రతి సొగసునీ, ప్రతి గాంభీర్యాన్నీ, అంతకు ముందు పండితులు చేసిన వ్యాఖ్యలను అతి సులభ శైలిలో అందరికీ తెలిసేలా, అర్థమయేలా మన ముందుంచారు వేంకటరమణ గారు.  

పాఠకులకు ముందు కవిని, కథను పరిచయం చేసే తీరు బాగుంది.  ఉదాహరణకు నంది తిమ్మన ముక్కు తిమ్మనగా ఎందుకు ప్రసిద్ధి కలిగిందో విపులంగా పాఠకులకు ఎంతో ఉత్సుకత కలిగించే రీతిలో వివరిస్తారు రమణ గారు.  ఏవి నిజాలో, ఏవి కట్టు కథలో వివరించి చెబుతారు.  

మనలో చాలా మందికి పద్య కావ్యాలలోని పద్యాలు ఎలా అర్థం చేసుకోవాలో తెలియక చదివే ఆలోచనను పక్కకు పెట్టి కథ ఒక్కటీ ఒక మొత్తంగా తెలుసుకుని వదిలేయడం పరిపాటి.  అలా చేయడం వల్ల పద్యాలలోని సొగసు, సొబగు, అలంకారాలు, ఆయా సమాసాలను ఉపయోగించిన సందర్భాలు, అన్నీ పక్కకు తోసి ఆ కవికి, కావ్యానికి అన్యాయం చేయడమవడమే కాక మనం అజ్ణానులంగా మిగుల్తాము.  రమణ గారు మనలాంటి వాళ్ళ చేతులు పట్టుకుని పద్యంలోని అందాలను కళ్ళకు కట్టినట్లు వివరిస్తూ పద్యం మనం ఎలా అర్థం చేసుకోవాలో నేర్పించడమే కాకుండా కొత్త భావజాలాన్ని మన నిఘంటువులలోకి చొప్పిస్తారు.  

ఈ రెండు గ్రంధాలూ తప్పక చదవవలసినవే – ముఖ్యంగా పద్యం ఎలా అర్థం చేసుకోవాలనే జీజ్ణాస కలవారు.  రెండూ, ‘అచ్చంగా తెలుగు’ ప్రచురణలే.  పాండురంగమాహాత్మ్యం వెల రూ. 200, పారిజాతాపహరణము వెల రూ. 150.  ప్రతులకు acchamgatelugu@gmail.com (+91 8558899478) కి వ్రాసి సంప్రదించండి.  

త్వరలోనే రామరాజ భూషణుడు వ్రాసిన వసు చరిత్రము, శ్రీకృష్ణ దేవరాయలు వ్రాసిన ఆముక్తమాల్యదల పరిచయాలు కూడా రమణ గారి కలం నుండి వెలువడతాయని ఆశిద్దాం.  

 

***

 

నా హాలీవుడ్ డైరీ – మొదటి భాగం శ్రీదేవి మురళీధర్ గారు రాసిన హాలీవుడ్ క్లాసిక్ చిత్రాల సమీక్షణం.  శ్రీదేవి గారు పుస్తకం పంపిస్తానన్నప్పుడు ఏ పుస్తకమో రానీలే అనుకున్నాను.  అట్టమీది బొమ్మ బాగుందే అనుకున్నాను.  పేజీలు తిరగేస్తున్నప్పుడు నాకు తెలిసిన సినిమాల గురించి కూడా వుందిలే ఈ పుస్తకంలో అనుకున్నాను.  నలుపు, తెలుపు (black and white) ఆయా సినీ చిత్రపటాలతో నిండిపోయి వున్న పుస్తకం తప్పక చదవాలి అనుకున్నాను.  చదవడం మొదలు పెట్టాను – నాకిష్టమైన చార్లీ చాప్లిన్ సినిమా.  ‘ద కిడ్’ తో మొదలుపెట్టి.  మొట్టమొదటి సమీక్షే అది.  ఎప్పుడో చూసిన సినిమా.  చాలా బాగుందనుకొన్న సినిమా.  1921లో వచ్చిన సినిమా అంటే  సుమారు వంద సంవత్సరాల క్రితం అన్నమాట.  

మొదటి పేజీ చార్లీ చాప్లిన్ గురించి.  తరవాత క్లుప్తంగా కథ.  కథలో ఏ ముఖ్య భాగాన్నీ రచయిత్రి వదిలేయలేదు.  దాని తరవాత ఆ సినిమాలోని/ సినిమా తియ్యడంలోని విశేషాలు.  ‘కిడ్’ గా నటించిన జాకీ కూగన్ జీవిత విశేషాలు.  అంతా చదివి, ఇంకో సారి యూట్యూబ్ లో ఆ సినిమా చూశాను.  మొదటి సారి చూసిన దానికన్నా రెండో సారి, అనుభవం ఎన్నో రెట్లైంది.  వందేళ్ళ క్రితం వచ్చిన ఆ సినిమాని ఇంకా అభిమానించేటట్లు చేసింది. 

శాశ్వతమైన విలువలు కలిగి, కాలానికి, సామాజిక మార్పులకి అతీతంగా ఒక ప్రత్యేకత సంతరించుకుని అనిర్వచనీయమైన నాణ్యత (అన్ని విభాగాల్లోనూ) కలిగినవి ‘క్లాసిక్’ సినిమాలు.  అంటే సినిమా చరిత్రలో ఇవి మైలు రాళ్లు, సినిమా క్వాలిటీకి ఇవి ముఖ్య సూచికలు.  ఎన్నిసార్లు ఈ సినిమాలు విడుదలైనా అవి కొత్తగా కనబడి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేవి.  ఈ రకమైన సినిమాలు హాలీవుడ్ కి మాత్రమే పరిమితం కాకపోయినా సుమారు నూట ముప్ఫై ఏళ్ళ క్రితం మొదలయిన ఆ సినిమా పరిశ్రమలో ఈ ‘క్లాసిక్ సినిమా’ అనిపించబడ్డ హోదా ఒక  కొలబద్దగా స్థిరపడి పోయింది.  

సినిమాల గురించి తెలుసుకోవడానికి ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉండాలి.  ఒక్కో ప్రేక్షకుడిది, ఒక్కో రుచి.  కొంత ‘సినిమా పిచ్చి’ కూడా కావాలి – చూడటానికే కాదు, సినిమా తియ్యడానికి కూడా.  ఏదో తపన – కేవలం డబ్బులు సంపాదించాలని కోరుకునేందుకే కాదు.  సినిమాను ఒక కళగా, తమ మనసులో భావనలను వ్యక్తం చేసుకునే ఒక సాధనంగా నిలిచే ప్రతి మనిషికీ.  చార్లీ చాప్లిన్ సినిమాలలో ఆయన మనలను నవ్విస్తున్నా, ఆ నవ్వించడంలో తన మనసులో అప్పటి సమాజ పరిస్థితులు, బీదరికం, పారిశ్రామికవేత్తలు సామాన్య ప్రజలను చేసిన దోపిడీ, ఇవన్నీ కలిగించిన ఆక్రోశం, ఆవేదనా మనలను సూదుల్లా గుచ్చుతాయి.  ఇదీ కళాత్మత్మకమైన సృష్టి.  అందుకే అవి వందేళ్ళయినా మన మనసుల్లో నిలిచి పోయాయి.  శ్రీదేవి గారు చేసిన ఈ ప్రయత్నం మనకు తిరిగి గుర్తు చేయడమే.  రావి కొండలరావు గారు చెప్పినట్లు కొన్ని అనుభూతులకు మళ్ళే తిరగమోత పెట్టినట్లే.  

శ్రీదేవి గారు రాసిన ఈ హాలీవుడ్ క్లాసిక్ సినిమాల పరిచయాలు ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ఒక ఏడాది పాటు ధారావాహికంగా ‘సినిమా చూద్దాం రండి’ శీర్షికలో ప్రచురించబడ్డాయి.  అలా వచ్చిన ఒక యాభై అయిదు పరిచయాలు ఒక సంకలనంగా ‘నా హాలీవుడ్ డైరీ’ పుస్తకంగా పునర్ముదృతమయ్యాయి.  

2011లో వచ్చిన ‘హ్యూగో’ చిత్రం నుంచి 2013లో వచ్చిన ‘సేవింగ్ మిస్టర్ బ్యాంక్స్’ వరకూ ఈ సంకలనంలో వున్నాయి.  2013 కొంచెం దూరమైన సంవత్సరం ఎందుకంటే సుమారు యాభై సినిమాలకు పైగా ముప్ఫైలనుంచి అరవైల వరకు వున్నాయి.  1921 లో విడుదలైన ‘ది కిడ్’ తో మొదలై 1960 లో వచ్చిన ‘సైకో’ వరకు యాభై అయిదు సినిమాల పరిచయాలున్నా అవి ఒక సంవత్సర క్రమంలో లేవు.  వుంటే బాగుండేదనిపించింది.  బహుసా ఆవిడ పత్రికలో ప్రచురించిన క్రమమే పుస్తకంలో కూడా అనుసరించారేమో.   అలా చేయకపోవడం వల్ల సినిమా చరిత్ర తెలుసుకోవాలనుకునే వారికి కాలానుగుణంలో వచ్చిన మార్పులు పరిశీలించడానికి కొంచెం అటూ, ఇటూ వెళ్ళాల్సి వస్తుంది.  అంతే.  

శ్రీదేవి గారిది సులభ శైలి.  ఆవిడ కథలు నేను చదవలేదు ఇదివరలో.  ఈ పుస్తకం మొదటిది.  సినిమా కథలన్నీ సూక్ష్మంగా, అందరికీ అర్థమయే రీతిలో, ముఖ్యమైన వివరాలేవీ వదిలేయకుండా రాయడం అంత సులభమైన విషమేమీ కాదు.  సినిమా కథలు చాలా క్లిష్టమైనవి, ఎన్నో మలుపులతో వుంటాయి.  మళ్ళీ మళ్ళీ చూస్తేనే కాని ఓపికతో రాయడం కష్టం.  అదే విధంగా సినిమాల అంతర్యాలు, అందులో నటించిన కళాకారుల గురించి, దర్శక నిర్మాతల గురించి, సినిమా నిర్మాణం గురించి రాయాలంటే ఎన్ని మూలాలనుంచో సేకరించాలి.  శ్రీదేవి గారే చెప్పినట్లు ఆంగ్లభాష మన మాతృభాష కాకపోవడం, ఇంకో దేశ కాల పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం కష్టతరమే.  శ్రీదేవి గారు అన్నికష్టాలు పడి, ఎంతో రుచికరమైన ఒక ‘డిష్’ మనకు ఈ పుస్తక రూపంలో అందించారు.  ఈ సినిమా గురించిన సందర్భంలో ఆసినిమా బొమ్మలు మనకు సినిమాని ఊహించుకోడానికి వీలుగా వున్నాయి.  అవీ, black and white లో వెయ్యడం వల్ల (అట్టమీది బొమ్మతో సహా) క్లాసిక్ లుక్ వచ్చింది పుస్తకానికి కూడా.  

సినిమా కథలు దేనికవే కాబట్టి, మనకు పరిచయమున్న వాటితో మొదలు పెట్టి హాయిగా చదువుకోవచ్చు.  

ఏది క్లాసిక్ సినిమానో చెప్పడం కొంచెం వివాదాంశమే.  చాలా సినిమాలను నేను గుర్తించగలిగాను – నాకున్న మిడి మిడి జ్ణానంతో, కాని కొన్ని పుస్తకంలోనివి ఏ లిస్ట్ లలోనూ, కనబడలేదు.  మరికొన్ని నాకు తెల్సిన క్లాసిక్ సినిమాలు, ద మోడర్న్ టైమ్స్, గాన్ విత్ ద విండ్ లాంటివి కనబడలేదు.  తన హాలీవుడ్ డైరీకి ఇది మొదటి భాగమే అన్నారు రచయిత్రి.  అందుచేత రెండో భాగంలో ఇంకా ఎన్నో ఎన్నెన్నో క్లాసిక్ సినిమాల గురించి చదువుదామని ఆశిద్దాం.  

 

***

‘నడిచిన పుస్తకం’ చిర్రావూరి సర్వేశ్వరశర్మ గారి నూరవ జయంతి సందర్భంలో వారి పిల్లలు ఆయన జ్ఞాపకార్ధం ప్రచురించిన స్మృతి చిహ్నం.  శర్మ గారి గురించి నాకు తెలిసినంత మటుకు అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.  ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన సాహితీ పిపాస గురించి, సాహితీ కారుడుగా ఆయన చేసిన రచనల గురించి ఎక్కువ మందికి తెలీదు.  శర్మ గారి సంతానం ఈ విధంగా ఆయన శత జయంతి జరుపుకుంటూ ఒక తండ్రిగా ఆయనకు నివాళులర్పించడం ఒక ఎత్తైతే, ఆయనను సాహితీ ప్రపంచానికి పరిచయం చెయ్యడం మరో ఎత్తు.  ఎంతో మెచ్చుకోదగ్గ విషయం.  

అందరి గురించీ అందరూ తెలుసుకోనక్కరలేదు.  ఏ కుటుంబ సభ్యులో వారి తల్లి తండ్రుల జ్నాపకార్థం ఒక పుస్తకాన్ని ప్రచురిస్తే అది ఇక్కడ పరిచయం చేయవలసిన పని లేదు.  అయితే శర్మ గారు సాధారణ వ్యక్తిగా ఇక్కడ పరిచయం చెయ్యడం లేదు.  సాహిత్య పరంగానూ, వ్యక్తిగతంగా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంనుండి వచ్చిన వ్యక్తి ఎంత విలక్షణమైన, ఆదర్శమైన అభిప్రాయాలు, ఆచరణ కలిగి వుండవచ్చో అని తెలుసుకోవాలనుకునేవారికి ఈ పుస్తకం తప్పక ఒక ముఖ్య సాధనం. 

ఈ పుస్తకావిష్కరణ సభను ఆయన సంతానం మొన్నీమధ్యే జరిపి దానిని వారి యూట్యూబు చానెల్ అయిన Chirravoori vari logili అన్న పేరుతో ఈ క్రింది లింకులో పదిలం చేశారు అందరూ చూసుకునే వీలు కల్పిస్తూ.    

https://www.youtube.com/watch?v=C9CD1ybt9HY&t=267s

పుస్తకంలో శర్మ గారి సంతానం, మనుమలు వారి వారి ఆప్యాయత, అనుభవాలు వివరిస్తూ రాసిన వ్యాసాలే కాక, డా. రెంటాల వేంకటేశ్వరరావు, బోడపాటి ప్రతాప్, చాగంటి తులసి, ద్వారం దుర్గాప్రసాదరావు, డా. వాడపల్లి శ్రీనాథ్, యర్రమిల్లి జగత్పతి, డా. వి.వి.బి.రామారావు, శ్రీ విహారి మున్నగు వారి వ్యాసాలు కూడా వున్నాయి.  శర్మ గారి వ్యక్తిత్వం, సాహితీ పిపాస గురించి తెలుసుకోవాలంటే ఈ వ్యాసాలు తప్పక చదవాలి. 

శర్మ గారు రాసిన కొన్ని కథలూ, కవితలూ, ఫిలిమ్ రివ్యూలూ (క్రిటిక్ అంటే బావుండేది), పిల్లలకు వ్రాసిన లేఖలూ, వ్యాసాలూ కూడా ఈ పుస్తకంలో చేర్చబడ్డాయి.  శర్మ గారి రచనలకు ఇవి మచ్చుతునకలు మాత్రమే. అప్పట్లో ఆయన ప్రచురించబడిన/ బడని రచనాలెన్నో ఇప్పుడు ఎక్కడున్నాయో కూడా తెలియదు.   

శర్మ గారు ఆయన రోజుల్లో తెలుగు, ఇంగ్లీషు సాహిత్య ప్రపంచాల్లో ఒక నడుస్తున్న ఎన్సైక్లోపీడియా అనడం, చదవని పుస్తకం లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఏరోజైనా ఒకటో రెండో కొత్త పుస్తకాలు కొనుక్కుని చదవాల్సిందే.  మాటలతో గారడీలు చేయడం ఆయనకు ఇష్టమైన ప్రక్రియ – తన పిల్లల పేర్లు కూడా ఆప్రక్రియకు అతీతులు కావు.  సమకాలీకులైన ఆరుద్ర, రోణంకి అప్పలస్వామి, చాసో మొదలైన వారితో స్నేహం.  గుడిపాటి వెంకట చలం లాంటి ఎంతమందితోనో ఉత్తర పత్యుత్తరాలు.  పంతొమ్మిది వందల ముప్ఫై, నలభై ప్రాంతాలలో ఆయన రాసిన రచనలు చిత్రగుప్త, వినోదిని, ఆంధ్రప్రభ మున్నగు ఎన్నో పత్రికలలో ప్రచురితమయ్యాయి.  ఆయన రాసిన కవితలు కొన్ని చదివితే శ్రీశ్రీ కి ముందే అదే భావాలతో, శక్తిమంతమైన అతి చిన్న పదాలతో శర్మ గారు రాసినట్లు కనిపిస్తుంది.  ఉదాహరణకు 1940, జనవరిలో చిత్రగుప్తలో ప్రచురింపబడ్డ ‘నా కవనం’ చూడండి:

ఆకలీ, చీకటీ, చిమ్మటా, కన్నీరూ, 

కావాలయ్య నా కావనానికి 

చల్లని చుక్కలు, చుక్కల నవ్వులు, నవ్వుల పువ్వులు, పువ్వుల పాటలు, పాటల తోటలు

కావాలయ్య నా కావనానికి

ఎడారి వొంటెలు, వొంటెల గంటలు, గంటల మంటలు, మంటల పంటలు,  పంటల నెత్తురు 

కావాలయ్య నా కావనానికి 

పన్నీరూ, వెన్నెలా, కోయిలా, ప్రేయసీ 

కావాలయ్య నా కావనానికి 

 

ఇలా సాగుతుంది.  ఇంకొకటి – ‘జీవన పథం’ లో...

ఆకలితో,

ఓపికతో,

చిచ్చులనీ,

చీల్చుకునీ,

ఒంటరిగా,

గబగబా,

పోతాన్, పోతాన్ పైపైకి 

 

పై కవితలను శర్మ గారు ఎప్పుడు రాశారో తెలియదు.  శ్రీశ్రీ రాసిన మహా ప్రస్థానానికి సమకాలీక ఆలోచన, ఆవేశం అని మాత్రం చెప్పవచ్చు.  శర్మ గారికి శ్రీశ్రీ గారు కూడా మంచి స్నేహితుడే. శ్రీశ్రీ తన కవితలను చదివి వినిపించేవారట శర్మ గారికి.  బహుసా ఇద్దరికీ భావావేశం ఒకే సమాజపు పరిస్థితి గురించిన అవగాహన నుండి కలిగి వుండవచ్చు.  

అతి నిరాడంబరమైన, అమాయక జీవితం ఆయనది.  తను నమ్మిన నిజాన్ని పాటించడం ఆయన తత్వం.  అబద్ధం చెప్పడం తెలీదు.  టోపీ పెట్టుకుని పుస్తకాన్ని చంకలో పెట్టుకుని విజయనగరం వీధుల్లో పక్కన రోణంకి గారితో కొన్నిసార్లు చూసినట్లు గుర్తు.  హైస్కూల్ లో చదివే రోజుల్లో శ్యామ్ వాళ్లింటికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఆయనను చూశాను.  అయితే పలకరించడం తప్ప ఎక్కువగా మాట్లాడిన గుర్తు లేదు.  

ఈ పుస్తకానికి హైలైట్ డా. శ్యామ్ (మెడికో శ్యామ్), శర్మ గారి పెద్ద కుమారుడు వ్రాసిన నివాళి.  “జీవితం అత్యంత విలువైనదా? సాహిత్యం జీవితం కంటే విలువైనదా? .... కానీ మా నాన్నగారు సాహిత్యాన్ని జీవితం కంటే విలువైనదిగా భావించినట్లు తోస్తుంది” అంటారు వ్యాసం మొదలు పెడుతూనే.  “చదివిన తన చదువుతో, సంపాదించిన అపరిమిత జ్ణానంతో అత్యంత ఆనందాన్ని అనుభవించిన అదృష్టవంతుడు ఆయన.  ఆర్థికపరమైన సమస్యలు ఆయన్ని వేధించినా, అవి తాత్కాలికాలే” అంటారు ఇంకో చోట.  

పై వ్యాసంలో సాహిత్యపరంగా తన తండ్రితో పెంచుకున్న అనుబంధం, శర్మ గారి ప్రచురితమైన, కాని, రచనల recollections, శర్మ గారికి, సమకాలీన రచయితలు, కవులతో సాహచర్యపు విశేషాలు, చిన్న, పెద్ద తనతో, మిగిలిన వారితో జరిగిన సంఘటనలు, ఆయన తన స్నేహితులకిచ్చిన విలువ, ఆప్యాయత, అత్యంత సిన్సియారిటీతో, అతి చిన్నవారినైనా ఆయన గౌరవించే తీరు, కళ్ళకు కట్టినట్లు చెప్పారు శ్యామ్.  చివరగా “నిజంగానే మా నాన్నగారు అందమైన రెమినిసెన్స్” అంటారు.  

శ్యామ్ రాసిన నివాళి కేవలం నివాళి కాదు.  ఒక రకంగా సాహిత్య చరిత్ర పుట.  వాళ్ళ నాన్నగారి గురించే చెప్పినా, ఎందరో ప్రముఖుల విశేషాలు తనదైన రచనా పద్ధతిలో చెప్పడం వల్ల అది సాహితీ వ్యాసమై ఎల్లలు లేకుండా అయింది.  

పుస్తకం శర్మ గారి పిల్లలు చాలా భక్తితో, శ్రద్ధతో కూర్చారు.  ఎందరి నుంచో శర్మ గారి గురించిన వ్యాసాలు సేకరించారు.  ఆయన శత జయంతి సభలో ఎందరిచేతనో మాట్లాడించారు.  అయితే పుస్తకం కూర్పు ఎవరైనా నిపుణుల సహాయంతో చేసి వుంటే బాగుండేదనిపించింది.  శర్మ గారి రచనలు ఒరిజినల్ ప్రచురణలను యథాతథంగా పిడిఎఫ్ రూపంలో వుంచడం వల్ల చదవడం కష్టమయింది.  వ్యాసాలు, నివాళులు, శర్మగారి రచనలు, వీటి క్రమం ఇంకా చదువరిని దృష్టిలో వుంచుకొని చేసివుండి వుండవచ్చు.  అయితే శర్మ గారి గురించి చదువుతున్నప్పుడు, ఆయన వ్యక్తిత్వం, సాహితీ పిపాస గురించి తెలుసుకుంటున్నప్పుడు, ఈ చిన్న విషయాలు అడ్డురానీకూడదేమో.  

పుస్తకానికి ధర లేదు.  వేల లేనిదనే చెప్పాలి.  పుస్తకం చదవాలనుకునేవారు ఈ క్రింది వారిని సంప్రదించండి:

శ్రీమతి సి. వల్లీశ్యామల, హైదరాబాదు, ఇండియా, సెల్ నంబరు: +91 9346821416

***

 

అమెరి’కెవ్వు కేక’ల కథలూ – కమామీషులూ అమెరికా హాస్యబ్రహ్మ వంగూరి చిట్టెన్ రాజు గారు రాసిన మెరికల్లాంటి అమెరికథల సంకలనం.  ఇది వంగూరి ఫౌండేషన్, అమెరికా వారు ప్రచురించిన పుస్తకాలలో 91వది.  అమెరికథల సీరీస్ లో ఇది పదకొండో పుస్తకం.  

చిట్టెన్ రాజు గారి హాస్యం గురించి వివరించడం అనవసరమేమో.  ఆయన రచనల గురించి తెలియని వారు తక్కువే మరి.  అసలు రాజు గారు రాసేవి కథలేనా అని అనిపిస్తుంది.  ఆయనే అంటారు “ఎప్పటిలాగానే ఈ పుస్తకంలో కూడా ఉన్నవి కొన్ని ‘కథలు’ మోసం చేస్తాయి.  ఎందుకంటే అవి నిజానికి కరోనా మీదా, ట్రంప్ గారి మీదా, ఆ ‘కథ’ వ్రాస్తున్నప్పుడు టీవీలో చూస్తున్న తాజా వార్తల మీదా నా సరదా స్పందనలు.”  ఇందులో కథలన్నీ గత కొన్నేళ్ళుగా అంతర్జాల పత్రికలు కౌముది, మధురవాణి. కాం లలో ప్రచురింపబడినవే.  సమకాలీన కథలు కాబట్టి కథలకు కాలదోషం పట్టచ్చేమో అనే అనుమానం రాజు గారు వ్యక్తం చేసినా, రాసిన విధానం వల్ల అవి పది కాలాల పాటు వుంటాయనడంలో సందేహం లేదు.  

పుస్తకంలో ఇరవై రెండు ‘కథ’లున్నాయి.  ‘సెల్ఫీ పిచ్చి’తో మొదలైన కథలు అటు ఆంధ్రా గవర్నరు ప్రసంగాలూ, హౌడీ మోడీ సభలో ట్రంపు, మోడీ గార్ల విన్యాసం, ప్రపంచాన్ని గత సంవత్సరం నుండి విసిగిస్తున్న కరోనా, అమెరిక్యూపన్లూ ,  అమెరికా వారోత్సవాలూ, సాహిత్యం-చందాలూ, ఇలా రచయిత కలానికి (అదే, ‘కొట్టుడు యంత్రం’ అనబడే కంపూటర్) ఏ విషయమూ అడ్డు రాదు.  అదుగో అందుకే, అమెరికా ట్రంపు అయినా, ఇండియా మోడీ అయినా రాలేరెవరూ రాజు గారి కథకు అడ్డం.  

కథల్లోంచి కొన్ని మచ్చుతునకలు:

మా మేయరు గారినీ గభాల్న వేదిక నించి దింపేసి ప్రధాని మోడీ అధ్యక్షుడు ట్రంప్ గారిని వేదికమీదకి ఆహ్వానించి, తనదే అయిన పద్ధతిలో కావిలించుకుని ఉబ్బితబ్బిబ్బు అయ్యారు.  ఇలాంటిది ఇదివరలోనే కొంచెం ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఈసారి ట్రంప్ గారు అన్నింటికీ సిద్ధపడి, తన వంతు మోడీగారి నడుం మీద చెయ్యి వేద్దాం అనుకోగా ఇద్దరికీ ఉన్న ఎత్తు పల్లాల తేడా వలన ట్రంప్ గారి చేతులు మోడీగారి పీకకి చుట్టుకోబోయాయి”

“చంద్రన్న హయాంలో చప్పుడు చేయకుండా తవ్విన గోతిని జగనన్న హయాంలో పూడ్చి, పైన సిమెంటూ, కాంక్రీటూ వేసేసి తెలుగు భాష సమాధిని పూర్తి చేసి చరితార్ధులు అయ్యారు.  అమరావతిలో పూర్తి అయిన శాశ్వత కట్టడం బహుశా ఇదొక్కటే!”

“...ఢిల్లీలో ‘ఆలింగన శిక్షణ శిబిరం’, ‘గాలిలో కరచాలన శిబిరం’ మొదలయ్యాయి.  ఇందులో చిన్న చిన్న ఆలింగన ఎముకలు విరిగే కావలింత, ఆలింగిస్తూనే వీపు గోకుడు, మగాడిని మగాడే వాటేసుకోవడం,  మామూలు కరచాలనం, అమెరికా వాడి చేతిని పోలోమని నవ్వేస్తూ ఊపేసి ఆనందించడం, చేతిలో చెయ్యి వేశాక ఆ రెండు చేతులనీ అలా గాలిలోకి లేపేసి అక్కడ ఊపేయడం,....”

ఇక కొత్త పద ప్రయోగాల సంగతి చెప్పనక్కరలేదు.  ‘సంకర సెల్ఫీ’, ‘స్వగోకుడు’, ‘ఆలింగన శిక్షణ శిబిరం’, ‘విషజ్వల పీడ హర యాగం’, ‘స్వయం ప్రకటిత వెలివేత’, ‘హగ్గడం’, లాంటివి కోకొల్లలు.  

ఇక తన మీద తానే వేసుకునే జోకులు, విక్టోరియా రాణి గారిచ్చే టెంకీ జెల్లలూ, లెక్కబెట్ట లేనివి.  మూడో ‘జులపాల కథ' కూడా ఇందులో ఉంది.  హాయిగా చదువుకోండి.  

పుస్తకం వెల రూ. 100.  ప్రతులకు నవోదయ బుక్ హౌస్, విశాలాంధ్ర, నవచేతన మరియు ఏ ఇతర పెద్ద పుస్తక విక్రేత దగ్గరయినా దొరుకుతుంది.  ఉత్తర అమెరికాలో అయితే వంగూరి ఫౌండేషన్ కి రాసి తెప్పించుకోవచ్చు.  

*****

సూపర్ 30 విజనరీస్

ఈ పుస్తకంలో వ్రాసిన వ్యాపార దార్శనికులలో అధిక శాతం జీరో నుండి హీరో అయినవారే. నిరుపేదలు నేడు కుబేరులవ్వడం వెనుక వారి వ్యాపార వ్యూహాలు, కష్టాలు, అంకితభావం, పట్టుదల, దార్శనికత, సానుకూల దృక్పధం - ఆలోచనా సరళి వంటి అంశాలను వారి జీవిత ప్రయాణం ద్వారా రచయిత తనదైన శైలిలో వ్రాసి పాఠకులలో ప్రొత్సాహం, స్ఫూర్తి, ప్రేరణ కలిపిస్తారు. స్వయం ఉపాధి ఉన్నవారు, వ్యాపారస్తులు, మహిళలు, విద్యార్థులు వయోభేధం లేకుండా అందరికీ స్ఫూర్తి, ప్రేరణ, మార్గదర్శకం చూపే "సూపర్ 30 విజనరీస్". నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్, రిలయన్స్ మీడియా పూర్వ వైస్ ప్రెసిడెంట్ సునీల్ ధవళ తేట తెలుగులో వ్రాసిన 30 మంది వ్యాపార దార్శనికుల ప్రేరణాత్మక, స్ఫూర్తిదాయకమైన జీవిత చరిత్రలు ఈ *సూపర్ 30 విజనరీస్* పుస్తకం Amazon లో లభ్యం. Rs.250/- (డెలివరీ ఉచితం )

https://www.amazon.in/gp/product/8194449901

 

 రచయిత : సునీల్ ధవళ 

ఈ  "సూపర్ 30 విజనరీస్" పుస్తకంపై పలువురు ప్రముఖుల అభిప్రాయాలు వారి మాటల్లోనే అందిస్తున్నాము.

డాక్టర్ మోహన్ కందా,  పూర్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్,  జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సభ్యులు, గౌరవ ప్రొఫెసర్, ఇండో-జర్మన్ సెంటర్ ఫర్ సస్టైనబిలిటీ  గారి అభినందనలు వారి మాటల్లోనే - అర్దెషీర్ గోద్రెజ్, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, సి.పి. కృష్ణన్ నాయర్,  టివిఎస్ వంటి గొప్ప వ్యక్తుల గురించి వ్రాయడం ఒక ముదావహమైన కార్యం. ఇంత ముఖ్యమైన, గొప్ప పనిని చేపట్టినందుకు సునీల్ ధవళను  హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. 'సూపర్ 30 విజనరీస్' పుస్తకంలో ఉన్న ప్రతీ కథ ఎంతో విలువైనదని ఈ తరం యువతకు మార్గదర్శకత్వం కలిగిస్తుందని విశ్వసిస్తున్నాను. అటువంటి దార్శనికుల దూరదృష్టి, సంకల్పం, నిబద్ధత, అంకితభావం, సాహస స్ఫూర్తి లక్షణాలు అందరకూ గొప్ప ప్రేరణ మరియు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయని నాకు గట్టి నమ్మకం. 

అత్యంత సులభ శైలిలో జీవిత చరిత్ర వ్రాసిన తీరు ప్రశంసనీయం. నిశితమైన పరిశీలనతో లోతైన అధ్యయనం చేయడం కోసం జరిపిన కృషి మెచ్చతగినది. పాఠకులకు అనేక ఆసక్తికరమైన వివరాలను అందించాలనే తపన, పాటించిన ఖచ్చితత్వం, వ్రాయడంలో వహించిన శ్రద్ధ ఈ పుస్తకాన్ని సుసంపన్నం చేశాయనడంలో సందేహం లేదు. హృదయపూర్వక ప్రశంసలు తెలియజేస్తున్నాను.

డాక్టర్ ఎన్.ఎస్. రాజన్, టాటా గ్రూప్ పూర్వ ముఖ్య మానవ వనరుల అధికారి, టాటా సన్స్ పాలక మండలి సభ్యులు గారి అభిప్రాయంలో - ఫైండ్ యువర్ నార్త్ స్టార్: ప్రాచీన కాలంలో నావికులు ధృవ నక్షత్రాన్ని(పోలారీస్ లేదా నార్త్ స్టార్) దిశా నిర్దేశంగా చేసుకొని గమ్యాన్ని చేరుకొనేవారు. కోట్ల నక్షత్రాలుండే నీలాకాశంలో ఉత్తరాన వెలిసే ధృవనక్షత్రం మాత్రం ఆకాశంలో స్థిరంగా కనిపిస్తుంది, స్థానం మారని ఏకైక ప్రకాశవంతమైన నక్షత్రం ఇది. ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరికీ తమ జీవితంలో గమ్యాన్ని చేరుకోడానికి, లక్ష్యాన్ని సాధించడానికి మార్గదర్శిగా ఒక మానవీయ ధృవతార ఉండాల్సిందే. ప్రతి ఒక్కరికీ ఈ పుస్తకం చదివాక ఆత్మ విశ్వాసం, అంతశ్శక్తి, ఆలోచనా శక్తి, సంకల్పబలం లభిస్తుంది.  లెర్న్ టు స్టాండ్ టాల్ : "ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం నిలువెత్తుగా తల ఎత్తడం నేర్పెందుకు అది తొలి పాఠం.... కునికే మన కనురెప్పలో వెలిగిద్దాం రంగుల స్వప్నం...  జాగొరే జాగొ"  అంటూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అత్యద్భుతంగా వ్రాసారు. 

నేనెవరు, నా ధ్యేయం ఏమిటి, నాకున్న శక్తి సామర్ధ్యాలు ఎంత, ఎందుకు సాధించలేను? అని ఈ ముప్పై మంది క్రాంతదర్శిలు ప్రశ్న వేసుకొన్నారు. స్వయం అభివృద్ధికి మనల్ని మనం ప్రశ్నించుకోవడం అత్యవసరం. ఆలోచన, జ్ఞానం, అనుభవం ఆచరణలో పెడితే జయం మనదే.                                                                                                                       

 డాక్టర్ పార్థసారథి కొమాండూరి, ఫార్మర్ సైంటిస్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, యుఎస్ఏ  గారి మాటల్లో -

రచయిత సునీల్ ధవళ ఎంతో పరిశ్రమించి, పరిశోధించి , తన విలువైన రచనలను యువత కోసమే గాక ఇతర వర్గాలకు కూడా ఉపయోగకరంగా మలిచారు. స్ఫూర్తిదాయకమైన పలు రచనలను పాఠకులకు కానుక చేశారు.' సూపర్ 30 విజనరీస్ ' పేరు గల ఈ చక్కని పుస్తకం ఆ కోవకు చెందినదే.  సమాజ శ్రేయస్సు కోసం గొప్ప ముందడుగులు వేసిన దార్శనికులను శ్రీ సునీల్ ఆసక్తికరంగా పరిచయం చేశారు. కేవలం అరుదైన ముందుచూపుతో, సూక్ష్మ గ్రాహ్యతతో విజయపథాన్ని  అందుకున్న  మహామహుల ప్రస్థానం ఈ పుస్తకం దర్శింపజేస్తుంది. ఇక్కడ సునీల్ గారు యువతరానికి ఇలాంటి జీవితచరిత్రలు ఎంత ఉత్తేజాన్ని, స్ఫూర్తిని కలిగిస్తాయో చక్కగా అంచనా వేసుకుని తమ వ్యాసాలను తీర్చిదిద్దారు. తమ తమ రంగాలలో యువతీయువకులు ఎలా సాగాలో ఈ విజనరీస్ కథలు చెప్పకనే చెబుతాయి. ఈ పుస్తకం తప్పక అందరూ చదివి తెలుసుకోవలసిన గొప్ప పుస్తకం. ఒక విధంగా కనువిప్పు కాగలదు కూడా . ప్రత్యేకించి యువత సమాజ హితకార్యాలను , సంక్షేమ కార్యక్రమాలను తాము ఎన్నుకున్న వృత్తి/ వ్యాపార రంగాలలో భాగంగా మలిచే అవకాశాలను ఈ విజనరీస్ కథలు  ముందుంచుతాయి.                                                                


 

 -పి. అనసూయ రిటైర్డ్ సూపరింటెండెంట్, ఐఐటి మద్రాస్ గారి మాటల్లో-   ప్రతి జీవితచరిత్రా మధ్యలో ఆపకుండా చదివించింది. ప్రుస్తకంలో పొందుపరచిన ప్రతి ఒక్కరి జీవితం ఒక్కో పాఠం నేర్పుతుంది. ' సూపర్ 30 విజనరీస్ ' వంటి పుస్తకాలు చదివాకా వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ తప్పక ప్రేరణ పొందుతారు. ప్రతి ఇంట్లోనూ, అందర్నీ చదివించే విధంగా రాసిన శ్రీ సునీల్ ధవళ నిశిత పరిశీలన అవగతమౌతుంది. లైబ్రరీలోనూ తప్పక ఉండవలసిన పుస్తకమిది. వేడుకలప్పుడు బహుమతిగా ఈ పుస్తకాన్ని ఎంచుకొంటే  ఓ విలువైన బహుమానము ఇచ్చినట్టు అవుతుంది.       

                                           

 దార్శనికులపై సమగ్ర పరిశోధనలు చేసి రచించిన ఈ పుస్తకం Madhuravani.com పాఠకులనీ అలరిస్తుందని ఆశిస్తున్నాము.

*****

Anchor 1
Anchor 2
Anchor 3
Anchor 4
Anchor 5
Anchor 6
Anchor 7
bottom of page