bhuvanollasam.PNG
srinivyasavani.PNG

సంపుటి  6   సంచిక  1

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

కవితా  మధురాలు

నిర్వహణ 

విన్నకోట రవి శంకర్ | మధు పెమ్మరాజు

kavita@madhuravani.com 

దేవీప్రియ

సంపాదకుల ప్రత్యేక ఎంపిక

శీతల బిందువులు

( ("ఇం..కొకప్పుడు" కవితా సంపుటి నుండి )

ఎందుకో ఈ రోజు

నేనున్న చోట

లౌకికం అలౌకికంగా మారిపోతోంది.

 

ఎందుకో ఈ చోటు

ఇంతకుముందెప్పుడో

చూసిన గులాబీ తోటలా గుబాళిస్తోంది.

 

వెల్లకిలా పడుకుని

దేహాన్ని పదునుకత్తుల కప్పగించిన ఈ క్షణం

రక్షణగోడ యేదో ఒకవైపు లేస్తూ మరొక వైపు

కూలుతున్నట్టనిపిస్తోంది.

 

ఎందుకో ఇప్పుడు

ఎప్పుడూ చప్పుడు చేయని మడుగు అడుగు

చేప ఏదో చెంగున యెగిరినట్టు ఉలిక్కిపడినట్టనిపిస్తోంది.

 

అనుక్షణచలనాలు మధ్య

ఎన్నడూ లేనిది ఏదో చల్లగా

గడ్డ కట్టినట్టనిపిస్తోంది.

 

 

ఎవరితోనూ పంచుకోలేని

క్షణం ఒకటి అనంతంలా వ్యాపిస్తున్నట్టు

ఏనాడూ యెరగని కొత్త వ్యాకులత ఏదో తీగసాగుతోంది.

 

ఎందుకో ఈ ప్రయాణం

ఎక్కడికో ఇంకా కొనసాగుతున్నట్టు

తిరిగి సుడులుతిరిగి నాలోకే పురోగమించి

తిరోగమిస్తున్నట్టు, ఏమిటో కనుకొలకుల్లో

రెండు అతిశీతల సూక్ష్మ బిందువులు..!

devipriya.JPG

అంజలి

 డిటాక్స్

 

ఇక పరుగెత్తలేక

కాలం నది ఒడ్డున

'చింత'చెట్టు నీడలో

ప్రవాహంలోకి కాళ్ళు దించి ఆడిస్తూ

ఆవృతపునరావృత వలయపరంపరగా

కదలిపోతోన్న ధారని చూస్తూ కూర్చున్నాను

 

నేను చూస్తున్నకొద్దీ

ఆ యేటి హోరు నెమ్మదిస్తూ పోయి

కాసేపటికి నా శ్వాసవేగంలో కదలసాగింది

ఆ సహజగతిలో సాగిన సమయసరిత లోతుల్లో

కొన్ని ఇంపైన దృశ్యాలు కనిపించాయి

 

ఒక మందార కొమ్మ

తన ఒడిలోని పసిమొగ్గని

పిల్లగాలి ఉయ్యాలలో వేసి జోలపాడటం చూశాను

నిదురలో పాపాయి అరనవ్వు నవ్వినట్టు

ఆ మొగ్గకి ఒక రేకు కొంచెంగా విచ్చుకోవడం చూశాను

 

అందీ అందినట్టే అందకుండా ఒక సొగసరి పిట్ట

అందుకునీ అందుకోకుండా దాన్ని వలచిన పిట్ట

ముందుకూ పక్కకూ కిందకూ వెనకకూ పక్కకూ..

ఆ పిట్టలజంట ప్రదర్శించిన ప్రణయవిన్యాసాలు చూశాను

 

ఆకాశం వ్రాసి పంపిన

లక్షలాది ప్రేమలేఖలు అందుకుని

పులకించిన పుడమికన్య ఎదలో

సంగమగంధం నిండిపోవడం చూశాను

 

ఇంతలో

కుంభవృష్టిగా నిశ్శబ్దం కురవసాగింది

ఆ ఘోషలో

భీమన్న గొంతులో మియాఁ కీ మల్హార్ ప్రతిధ్వనించింది

నా గుండెచప్పుళ్ళు ఆ స్వరస్మరణలో ఉండగా

నాలోని మలినాన్ని కొంత తొలగిస్తూ

రెండు కన్నీటిబొట్లు కాలం నదిలో కలిసిపోయాయి

 

వాన వెలిసింది

మళ్ళీ అలసిపోయేవరకూ

ఇక పరుగెత్తాలి!

social logo.JPG
dasaraju.JPG

దాసరాజు రామారావు

ఉగాది వేళ

గీతానికి,

పేర్చిన బతుకమ్మ లాంటి నిండు అక్షరాలను 

శిశిర రాత్రుళ్ళను చీల్చుకొచ్చే సూర్యారుణ

కిరణ చరణాలను

పర్వత శ్రేణుల జాలువారే సలిల ధారల మధురాంబువుల

లాంటి భావాలను

కూర్చాలి

 

అది వసంతగీతం-


 

నాట్యానికి,

 

మలయానిల మందగమన లయ గతులను

మయూరపింఛాల నీలి కన్నుల  సోయగాలను

మృదంగ తరంగ డోలికల భంగిమలను

తరుపచ్చ లేతాకుల సౌకుమార్య విన్యాసాలను

ఒనగూర్చాలి

 

అది వసంతనాట్యం-


 

గానానికి,

 

పుష్ప ఆఘ్రాణిత తుమ్మెద సల్లాప ఆలాపనలను

మబ్బుల దోబూచుల చిలిపి పిలుపుల కవ్వింతలను

నారద తుంబుర నాద జలపాత ప్రబోధ ఝరులను

ఎల కోయిల కల కూజిత ఆహ్లాద రాగ రంజితాలను

సమకూర్చాలి

 

అది వసంతగానం-


 

రూపానికి,

 

చిరుజల్లుల విప్పారిన వన శోభల మిరుమిట్లను

ఆకాశపు మేలిముసుగులోంచి  హరివిల్లు రంగుల

చిలకరింతలను

నేల పచ్చదనాల పడుచుదనాల అందచందాలను

తీర్చిదిద్దాలి

 

అది వసంతరూపం-


 

కాలానికి,

 

చేదకు తగిలే జలరాశుల కనువిందులను

మనిషి, కుడి ఎడమల నడిచే  ధర్మ ప్రభల

జిలుగులను

ఆకలి తీరిన గుడిసె కడుపు నెమరేసే వొగ్గు

పదనిసలను

లే చివుళ్ళ, పూత మావిళ్ళ,పుడమి వేవిళ్ళ

ఆనందానందాలను

గుది గుచ్చాలి

 

అది వసంతకాలం-


 

వసంతాగమనం

కవికీ

భువికీ

ఎదురు చూపు…!

జాని తక్కెడశిల

కొలత

బరువుగా ఉంటోంది

కొన్నింటిని నిర్దారించుకొని,

మరికొన్నింటిని తప్పుగా అంచనా వేసుకొని

తీసుకోడానికి, అంగీకరించడానికి

             ఆకులా ప్రాణం రాలుతుంది.

 

చిత్తు కాగితాలు

పెదవులపై నుండి విసరడం

విసిరిన తర్వాత

భయంగా, బెదురుగా నటించడం

                నీ అలవాటు….

 

బాధ హేళనగా మారిన చోట,

మృదువైన మనిషి కటువుగా

వ్యంగ్యాస్త్రాలు సంధిస్తే…

గుండె పక్క గులకరాయి శబ్దం

      మౌనానికి మించిన మిత్రుడు ఎక్కడ?

 

అతిగా ఎగిరితే

ఒడ్డున బడ్డ నురుగులా

భూమిలో ఇంకని నీటిలా

ఆకాశం నుండి రాలే చుక్కలా

 

పాదాల ప్రవాహానికి…

చూపుల చురుకుదనానికి…

ఆలోచనల వేగానికి…

 

కొలతలు సాధ్యమా…?

johny.JPG

మద్దుకూరి విజయచంద్రహాస్

పాట వెలదులు

(పాట గురించిన పాట మకుటపు స్వేఛ్చాటవెలదులు)

 

పాట వ్రాయు కవికి పాండిత్యమేకాదు

పాట పొసగవలయు పదిలముగను

పాట అల్లిక మురిపాలు సగముపాలు

పాట సిరులపేట బతుకు బాట

 

 పాట హృదయ సుధల ప్రతిబింబమగునట  

 పాట జీవితానుభవపు తేట

పాట రాగ తాళ భావాల కలయిక

పాట సిరులపేట బతుకు బాట

 

 పాట అన్నమయ్య పదకైత విలసిల్లె

పాట క్షేత్రయ కవి పదము ఘనత

పాట త్యాగరాజు పలుకు వినుతి కెక్కె

పాట సిరులపేట బతుకు బాట

 

పాట ఒదిగి పోయె పరమాత్మ మురళిని

పాట వాణి వీణ మీటు చుండు

పాట నటన సేయు పార్వతీ శంకరుల్

పాట సిరులపేట బతుకు బాట

 

పాట పైకి తెచ్చు పసినాటి చిరునవ్వు

పాట సేద తీర్చు బాధ మాన్పు

పాట నిదుర బుచ్చు బంగరు పాపాయి

పాట సిరులపేట బతుకు బాట

 

పాట మామ్మ తాత నోటిముత్యములగు

పాట అమ్మనాన్న పాడ వినుము  

పాట చిట్టి పలుకు పన్నీటి మూటలు 

పాట సిరులపేట బతుకు బాట

 

పాట నేర్ప వలయు పసివయసులనుండి

పాట ముద్దులార పంచు ఆస్తి

పాట మనసునున్న పరదేశమున తోడు

పాట సిరులపేట బతుకు బాట

 

 

పాట రసన పైన పారాడు ప్రతిరోజు

పాట అలుపు సొలుపు పార త్రోలు

పాట తోడువున్న పనిలోన శ్రమ సున్న 

పాట సిరులపేట బతుకు బాట

 

 

 

పాట మెదలు మదిని ప్రతి ఉషోదయ వేళ

పాట స్వప్న వీధి పలుకరించు

పాట అనవరతము ప్రవహించు తనువెల్ల

పాట సిరులపేట బతుకు బాట 

Vijan Chandrahas