MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కవిత్వం – వైయక్తికత, సామాజికత
డా. వైదేహి శశిధర్
సాహిత్యం, ముఖ్యంగా కవిత్వం ప్రస్తావన వచ్చినపుడు తరచుగా వినబడే చర్చ “కవిత్వంలో వైయక్తికత ప్రధానమా లేక సామాజికత ప్రధానమా” అని.
నా వరకూ ఇది చాలా అనవసరమైన చర్చగా అనిపిస్తుంది. ఎందుకంటే కవిత్వంలో రెండూ ఉంటాయి ఉండవచ్చు. They are not mutually exclusive.
అయితే కవిత్వంలో తప్పనిసరిగా ఉండాల్సింది ఆకట్టుకునే కవిత్వీకరణ. ఈ కవిత్వీకరణను సమర్ధవంతంగా సాధించడానికి అవసరమైనది శిల్పం.
నా ఉద్దేశ్యంలో కవిత్వం ఎప్పుడూ మొదట వైయక్తికమే. తరువాత అది సామాజికంగా పరిణమించవచ్చు. సామాజికత లేని కవిత్వం ఉంటుందేమో కానీ వైయక్తికత లేని కవిత్వం ఉండదు. కవి ప్రధానంగా ఒక వ్యక్తి. కవి సమాజం కాదు. కవిత్వం వ్రాస్తున్నది కవి, సమాజం కాదు. వ్యవస్థీకృత వ్యక్తుల సముదాయం సమాజం. అప్పుడు వ్యక్తి అనుభవంలో లేనిదేదీ సమాజంలో లేదు. నిజానికి వ్యక్తి సమాజం పరస్పరాశ్రయాలు. కవి తన వైయక్తిక అనుభవాలను, అనుభూతులను కవితావస్తువుగా తీసుకున్నా సమాజాన్ని, సామాజిక పరిస్థితులను కవితావస్తువుగా తీసుకున్నా ఆవిష్కరణ జరిగేది మాత్రం కవి వైయక్తిక దృష్టి కోణం లోంచి మాత్రమే. అంటే సామాజిక వస్తు ప్రధాన కవిత్వం కూడా వైయక్తిక కవిత్వంలాగా తన ప్రత్యక్ష లేదా పరోక్ష అనుభవంలోంచి కవి సారించిన దృష్టి మాత్రమే.
అయితే కవితా వస్తువు వైయక్తికం లేదా సామాజికం అవవచ్చు. తన కవిత వస్తువుని ఎన్నుకునే స్వేచ్ఛ కవికి ఎప్పుడూ ఉంటుంది. ఉండాలి. ఆ స్వేచ్ఛ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నియంత్రింపబడినపుడు, నిర్దిష్ట వస్తువు పైన వచ్చే కవిత్వాలే ఆదర్శ కవిత్వంగా సాహిత్యావరణంలో విమర్శకుల చేత లేదా ఇతర కవి సమూహాల చేత పరిగణించబడినపుడు, కవి ఆలోచనా పరిధి అభివ్యక్తి ఆవిష్కరణ కుంచింపబడుతుంది. దానివల్ల కవిత్వానికి జరిగే మేలు ఏ మాత్రమూ ఉండదు. పైపెచ్చు ఒకే రకమైన మూస కవిత్వాలు, అరువు తెచ్చుకున్న ఆలోచనలు పేలవమైన అనుకరణలు కవిత్వంలో చోటు చేసుకునే ప్రమాదం ఉంది.
కవితా వస్తువుని ఎన్నుకునే స్వేచ్ఛ కవికి ఎంత ఉంటుందో అంతగానూ కవికి బాధ్యత కూడా ఉంటుంది, ఉండాలి. ఆలోచనలలో ఉదాత్తత, అభివ్యక్తిలో సంయమనం పాటించాల్సిన తప్పనిసరి బాధ్యత ప్రతి కవికీ ఉంటుంది, ఉండాలి కూడా.
కవిత్వం ప్రధానంగా హృదయసంబంధి. అది మనల్ని తాకేది భావ తీవ్రత ద్వారానే. అందుకనే వస్తువు సామాజికమైనా వైయక్తికమైనా గాఢమైన అభివ్యక్తి లేని కవిత్వం హృదయాన్ని ఆకట్టుకోదు. వస్తువు ఏదైనా, ఒక బలమైన, వ్యక్తిగతమైన ఆర్తి లేని కవిత్వం పాఠకుడిని కదిలించదు, అతని అనుభవంలోకి చేరదు. పాఠకుడి అనుభవంలోకి చేరని కవిత్వానికి సార్వజనీనత లేదు. సార్వజనీనం కానీ కవిత్వానికి మనుగడ లేదు. ఎందుకంటే వస్తువు వైయక్తికమైనా, సామాజికమైనా, ఏదైనా కవిత్వపు గమ్యం మాత్రం సార్వజనీనత-universality.
అయితే ఈ సార్వజనీనతను గొప్ప కవులుగా సంవత్సరాలుగా మనం తల్చుకుంటున్న రచయితలు ఎలా సాధించారు? నా ఉద్దేశ్యంలో ఈ సార్వజనీనతను సాధించే ప్రక్రియే కవిత్వీకరణ. ఈ కవిత్వీకరణ సాధించడానికి కావలసిన రసవిద్య తెలిసిన కవుల కవితలు చదివిన అనుభవంతో కొంతవరకూ మనం ప్రతిపాదనలు చేయవచ్చు. అయితే ప్రతిపాదనలు చేయడం మాత్రమే సులభమైన పని, అటువంటి సార్వజనీనమైన కవిత్వం వ్రాయడం మాత్రం చాలా కష్టం.
ఈ సార్వజనీనత సాధించిన కవులను చూస్తే వీరి కవిత్వంలో ప్రతిభతో పాటు ప్రధానంగా కనిపించేది ఆ బలమైన భావ సాంద్రత, కవిత్వీకరణ కు మాధ్యమమైన శిల్పం. వ్యక్తులుగా వీరికి కావలసినది కరుణ, నిబద్ధత నా ఉద్దేశ్యంలో కరుణ లేనిది రసస్పందన లేదు. స్పందనలేని కవిత్వంలో చిత్తశుద్ధి మాత్రమే కాదు సౌందర్యం కూడా లోపిస్తుంది.
సామాజికప్రధాన వస్తువుగా వున్న కొన్ని గొప్ప కవితలు తిలక్, శ్రీశ్రీ, అజంతా తదితరులు వ్రాసిన కవితలు చూస్తే మనకు ప్రస్ఫుటంగా కనిపించేది కవి తాలూకు కరుణ. సమాజంలోని దుస్థితిని దుఃఖాన్ని వేదనను చూసి ఆర్తితో కవి హృదయం చిన్నాభిన్నమవవనిదే కదిలించే కవిత్వం ఆవిర్భవించదు.
ఉదా: అదృష్టాధ్వగమనం కవితలో తిలక్ అంటారు.
“నా లోపల నాబాధలు/నా వెలుపల క్షతజగత్తు ఆక్రోశించిన కరుణా భీభత్స రవాలు/నిరంతర పరిణామ పరిణాహ జగత్కతాహమ్ లో సలసల కాగే మానవాశృ జలాలు” అని.
ఇందులో ఎంతటి వైయక్తికత ఉందో అంతటి సామాజికత ఉందని మీరు గమనించే ఉంటారు. కేవలం పాప్యులారిటీ కోసం సమాజాన్ని వస్తువుగా తీసుకునే కవిత్వంలో లోపించేది ఇటువంటి ఆర్తి. ఆర్తి లేని కవిత్వం పాఠకుడిలో ఆర్ద్రత కలిగించలేదు.
కవి తన కవిత్వంలో ఆవిష్కరించే ఆదర్శాలకు అతని వ్యక్తిత్వానికి తప్పనిసరిగా పొంతన ఉండాలి. ఎటువంటి వైరుధ్యాలు ఉండకూడదు. వైరుధ్యాలు ఉంటే అది నిజాయితీ లేని కవిత్వంగా పరిగణించాల్సి ఉంటుంది.
ఒక వ్యక్తి రాసే కవిత్వానికి అతని జీవన యానం, ఆలోచనలు, అనుభూతులు ఆకాంక్షలు, ఆవేదన, ప్రకృతితో అతని అనుబంధం, సమాజంతో అతని అనుభవాలు, వ్యవస్థల పట్ల అతని స్పందనలు అన్నీ బలమైన ప్రేరణలే. ఇది సహజం, అనివార్యం.
కవిత్వ విమర్శలో ప్రధానం కవిత్వావిష్కరణలోని ప్రతిభను, సాంద్రతను అంచనా వేయడం. వస్తువు వైయక్తికమా సామాజికమా అన్న చర్చ కాదు.
చివరగా, కవిత్వానికి కావలసినది అద్వితీయమైన శిల్పం, ఆవిష్కరణలో సౌందర్యం, రీతిలో నవ్యత, ఆకట్టుకునే కవిత్వీకరణ వెరసి పాఠకుల హృదయాల్ని హత్తుకునే సార్వజనీనత.
*****
శ్రీమతి వైదేహి శశిధర్ గారు అమెరికాలోని న్యూజెర్సీ వాస్తవ్యులు. వృత్తిరీత్యా వైద్య నిపుణులు. స్వస్థలం గుంటూరు జిల్లా. విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కళాశాలనుండి విద్యాభ్యాసం పూర్తిచేశారు. తెలుగు ఆంగ్ల భాషలలో కవితలు వ్యాసాలు వ్రాయడం వీరి ప్రవృత్తి. ‘నిద్రితనగరం’, ‘పునశ్చరణం’ అనే తెలుగు కవితా సంకలనాలను వెలువరించారు. నిద్రితనగరం పుస్తకానికి ఇస్మాయిల్ పురస్కారాన్ని అందుకున్నారు.