MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
ఉత్పాదక భాషగా తెలుగు
కన్నిగంటి అనూరాధ
వెయ్యి సంవత్సరాలకు పైగా పురాతనమైన తెలుగు సాహిత్యప్రకాశాన్ని గౌరవించడానికి ఈ రోజు సమావేశమయ్యాము. అనేక రూపాలూ, శైలులలో అభివృద్ధి చెందుతూనే ఉంది ఈ పరంపర. ప్రత్యేకంగా ప్రవాసాంధ్రులు ఈ సాహిత్య చరిత్ర గొప్పతనాన్ని తమ సాంస్కృతిక వారసత్వంగా చాటుకుంటారు. కానీ భాషకు మరొక కోణం ఉంది - దీని గురించి మనం కొంచెం అరుదుగానే మాట్లాడతాము, శ్రద్ధ వహిస్తాము. ఇటువంటి వేడుకలలో భాష గురించి మాట్లాడేటపుడు సాధారణంగా మనం సాహిత్య సాంస్కృతిక రంగాలపై దృష్టి సారించి, వాటి వెలుపల భాష ఏమి చేస్తుందో అనే వాస్తవానికి గుడ్డిగా ఉంటున్నాము అనే అనాలి.
నేను ఇక్కడ ముందు ఉంచాలనుకుంటున్నది ఏమిటంటే, తెలుగు సాంస్కృతిక భాష మాత్రమే కాదు, కార్యసాధక భాష కూడా.
మెరిసే సాంస్కృతిక వేషధారణ మాత్రమే కాకుండా, మన భాష పని దుస్తులను ధరించినప్పుడు ఎలా ఉంటుందో; ఆ ప్రయోజనం కోసం ఉత్పాదక, వృత్తి భాషగా, ఒక ఉన్నత సాధనంగా పూర్తి సామర్థ్యాలనూ, గుర్తింపునూ పెంపొందించటం భాష మనుగడకి ఎంత ముఖ్యమో - ఈ విషయాలపై ఈ విలువైన వేదిక ద్వారా, దృష్టి సారించాలని నా చిన్న ప్రయత్నం ఇది. తెలుగు రాష్ట్రాలలో విద్యావ్యవస్థలో భాషాపరంగా జరుగుతున్న ప్రమాదకరమైన మార్పుల గురించి మనమందరం ఆందోళన చెందుతున్న సమయంలో, ఇది చాలా ముఖ్యమని అనిపించింది.
సాంఘిక, సాంస్కృతిక జీవితంలోని అన్ని పనులకు ఒకే భాష ఉపయోగించినప్పుడు ఈ ప్రశ్నలు ప్రత్యేకంగా తలెత్తవు.
కానీ మన ద్విభాషావ్యవస్థలో ఒక భాషకి మాత్రమే ఆర్ధిక విలువా, ప్రాముఖ్యత, ఇంకా వేరే ఘనతలూ ఆపాదించబడినవి; రెండవ స్థాయి భాషగా పరిగణింపబడుతున్నతెలుగుకు నిజానికి సమాజ వ్యవాహారాలలో మాధ్యమంగా కీలక పాత్ర ఉన్నా, ఈ సోపానక్రమాన్ని అధిగమించడానికి ఈ విషయంపై తగిన అవగాహనా, మూల్యాంకనమూ, గుర్తింపూ, వికాసమూ లోపిస్తున్నాయి అని తోస్తుంది.
ఈ భాషా వైఖరి మనలో చాలా లోతుగా ఉంది, కానీ ఇది ఒక హ్రస్వ దృష్టి అనాలి. దశాబ్దాల క్రితం ఆర్ధికశాస్త్ర నోబెల్ గ్రహీత అయిన గున్నార్ మిర్డాల్ అనే ఆయన, ఆసియా భాషల గురించి ఈ ప్రకటన చేశారు: ‘ఈ భాషలు పురాణాలు చెప్పటానికి మాత్రమే పనికొస్తాయి’ అని. మన భాష అప్పటి నుంచి చాలా దూరం వచ్చింది. అత్యున్నత మేధోపరమైన భావనలనూ సంభాషణలనూ వ్యక్తీకరించడానికీ, రూపొందించడానికీ వీలుగా చాలా అభివృద్ధి చెందింది. కానీ మనలో చాలా మందికి, ముఖ్యంగా ఆంగ్ల విద్య ద్వారా అత్యున్నత సామాజిక-ఆర్ధిక స్థాయికి ఎదిగినవారిలో, భాష గురించిన దృష్టి, మిర్డాల్ చెప్పినదానికి ఇంకా అనుగుణంగానే ఉంది అనిపిస్తుంది.
సమకాలీన దృక్పథం భాషను ఒక వనరు (resource )గా చూస్తున్నది, ఇది యునెస్కో సంస్థ అంగీకరించిన భావన కూడా. భాష అనేది వ్యవహరం యొక్క మాధ్యమం అనేది వాస్తవం - సాంఘిక, రాజకీయ ఆర్ధిక జీవితంలో, రోజువారీ వ్యవహారాలూ సమాచార వినిమయాలలోనూ. సమాజాన్ని నిలబెట్టే పనిని, భాష ఈ రంగాలలో నిరంతరం చేస్తుంది, ఒక పనిముట్టుగా.
ఇతర పని సాధనాల మాదిరిగానే భాషకీ ఉత్పత్తి రంగాలలో అభివృద్ధి అవసరం. అనేక దశాబ్దాల క్రితం ప్రముఖ భాషా శాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి గారు వివిధ సాంప్రదాయ వృత్తులలో వృత్తి పదకోశాల మీద సర్వేలను ప్రారంభించి పర్యవేక్షించారు. అప్పుడు తయారు చేసిన పదకోశాలు విలువైన రికార్డు, పరిశోధనాసాధనాలుగా ఉన్నాయి ఈ రోజున. అవి ఆచరణాత్మకంగా ఉపయోగపడ్డాయో లేదో తెలుసుకొనే ప్రయత్నం చేయవలసి ఉంది.
ఆ తరువాత, తెలుగు అకాడమీ కొన్ని ప్రత్యేకమైన పదకోశాలను తయారు చేసింది. మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నకొద్దీ వృత్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ వృత్తులలో సాంకేతిక పరిజ్ఞానం, పరిభాషలు ఉంటాయి . ఈ పని రంగాలకు తెలుగులో పదకోశాలు, విజ్ఞాన వనరులూ ఏ మేరకు లభిస్తున్నాయి, అందుబాటులో ఉన్నాయి? భారతదేశం, "సమాచార సమాజం" లేక "జ్ఞాన సమాజం" స్థాయి వైపు పయనించాల్సి ఉందని వక్కాణిస్తూ ఉంటారు ప్రభుత్వమూ, మేధావి వర్గమూ. యునెస్కో యొక్క "అందరికీ సమాచారం" ప్రోగ్రాం, "సమాచార ప్రాప్యత", "సమాచార అక్షరాస్యత"ల ఆవశ్యకతను వక్కాణించి చెప్తున్నది. మన శ్రమశక్తి ( labor force) లో అధికభాగం "blue collar" వృత్తులలో పనిచేస్తుందని మనకు తెలుసు. వారికి, అంటే కోట్లజనానికి, తెలుగే "పని భాష". మరి తెలుగులో పనిచేసే శ్రామికశక్తిలో ఎక్కువమందికి, వారి వృత్తి-ఆర్ధిక జీవితాలకు ఉపయోగపడే సమాచారానికి, విజ్ఞానానికి ప్రాప్యత ఉందా?
వాస్తవానికి చాలావరకు వైజ్ఞానిక, సమాచార వనరులూ, సాధనాలూ ఇప్పటికీ ఆంగ్లంలోనే ఉన్నాయి. ప్రస్తుత కాలంలో ప్రభుత్వము వృత్తి నైపుణ్యాల విషయంలో కొన్ని విజ్ఞాన వనరులను తయారు చేస్తోంది, భారతీయ భాషలలో. కానీ వాస్తవ అవసరాలతో పోలిస్తే, ఈ ప్రయత్నాలు ప్రారంభదశలో ఉన్నాయని చెప్పాలి. అభివృద్ధి ప్రణాళికలలో దీనికి వ్యూహాత్మకంగా ప్రాధాన్యత ఇవ్వటం ఎంతయినా అవసరం.
తెలుగు వారి సాంస్కృతిక పరాకాష్ఠల గురించి ఎంతో గర్వపడే మనకి, ఆ కోట్ల శ్రామికుల వృత్తులలో భాష ఎలా ఇమిడి ఉందో, దాని పరిస్థితి ఏమిటో అనే అంశాలు, మన "రాడార్" మీదికి రావు.
కానీ ఇవి భాష భవిష్యత్తుకి కీలక ప్రశలు.
తెలుగు పని భాషగా ఉన్న రంగాల మీద "aspirational" యువతకి చిన్న చూపు అనేది వాస్తవం. వాటిలో 'కెరీర్' తలపెట్టాలనే ఆసక్తి ఉండదు. ఈ వాస్తవానికీ, పైన పేర్కొన్న భాష బలహీనతలకూ ప్రత్యక్ష సంబంధం ఉంది. ఆ వృత్తులలో అవకాశాలు ఉండవనే కాదు, ఆ రంగాలలో తగినంత ఆధునీకరణ రాలేదనీ, వెనుకబడి ఉన్నాయనీ, ప్రతిష్ట తక్కువనీ బలమైన భావన ఉంది. ఆంగ్ల మాధ్యమ విద్య వైపు భారీగా మారడం, ఈ దృఢమైన అభిప్రాయంతో ముడిపడి ఉంది.
అయితే నిజానికి మన ఆర్ధిక వ్యవస్థలో "ఇంగ్లీషు ఉద్యోగాల" సంఖ్య అంత ఎక్కువేమీ కాదు, కోట్ల యువతకు ఉపాధి కలిగించేటంతగా. అది కేవలం అపోహ అని కార్మిక గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. ఇది మన సమాజానికీ భాషకూ చాలా నష్టం కలిగిస్తున్న అపోహ. ఈ నమ్మకం, వివిధ ఆర్ధిక రంగాలలో భాషల వాస్తవ పాత్రలను ప్రతిబింబించదు. భాషకీ, ఆర్ధిక వ్యవస్థకీ, వృత్తులకీ, ఉపాధికీ ఉన్నసంబంధాలను శాస్త్రీయంగా పరిశీలిస్తే తప్ప ఈ విషయమై సరయిన అవగాహన రాదు. నేను కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రశ్న మీద అధ్యయనం చేస్తున్నాను. ఇది భాషాశాస్త్రం లో ఒక కొత్త కోణం.
భాషా, జీవనోపాధి, ఆకాంక్ష (aspiration), ఈ మూడింటి త్రికోణానికి ఒక తెలుగు చిత్రంలోని సన్నివేశం చక్కటి ఉదాహరణ. చిన్నతనంలో ఒక చిన్న ఊరిలో తెలుగులోనే చదువుకొని పెరిగిన హీరోని, "పెద్దయ్యాక ఏమి చేయాలనుకుంటున్నా"వని అడుగుతారు. అతను "ఇంజనీర్ లేదా డాక్టర్ అవ్వాలని" కోరుకుంటాడని అనుకుంటారు, కానీ అతను, "సైకిల్ మెకానిక్ ని అవ్వాలని ఉంది" అని చెప్పినప్పుడు షాక్ తింటారు. ఈ సన్నివేశం సమాజంలో వృత్తుల స్తరీకరణని ప్రతిబింబిస్తుంది. దీనిలో భాషాపరమయిన ఆర్ధిక వ్యత్యాసాలు ఇమిడి ఉన్నవి. ఈ అసమానతను ఎదురుకోవాలంటే, "డాక్టర్ ఇంజనీర్ చదువులను తెలుగులో అందించటం" అనే 'పరిష్కారం' మాట అటు ఉంచి (నిజానికి ఆ వృత్తులలోకి ఎంత మంది వెళ్ళగలరు?), "సైకిల్ మెకానిక్" వంటి ఉపాధులు (లక్షల కోట్లమందికి సంబంధించినవి) ఆకర్షణీయం అయ్యే పరిస్థితులను సృష్టించడం ముఖ్యం. వీటిని ఆధునిక వృత్తులుగా, ప్రామాణికంగా బోధించే సంస్థలే కాకుండా, తెలుగులో వాటి అభ్యాసానికీ అభివృద్ధికీ తోడ్పడే సాహిత్యం, జ్ఞానవనరులూ, నిఘంటువులూ వగైరా ఉంటే, లాభదాయకమైన జీవనోపాదులను వెతుక్కోవడానికి ఇంగ్లీష్ అనే కట్టు (hoop) ద్వారా వెళ్ళవలసిన అవసరం తగ్గుతుంది. మన భాషను నాశనం చేస్తూ ఇంగ్లీషు మీడియం విద్యను కోట్లమందికి విస్తరించడానికి సమాజం పెద్ద ఎత్తున పెట్టుబడి చెల్లించాల్సిన అవసరమూ తగ్గుతుంది. తెలుగు మీడియం విద్య, ఇంగ్లీష్ విద్య వీలుగాని వారికి 'డిఫాల్ట్ ' లేక 'నెగటివ్' ఎంపికగా ఉండవలసిన అవసరం లేదు - చక్కటి అవకాశాలూ వనరులూ ఉన్న భాషగా , నిశ్చయమయిన ఎంపికగా ఉండేటట్టు తీర్చిదిద్దితే, దిద్ద వచ్చును కూడా. "అందరికీ ఆంగ్లం" కంటే ఇదేమీ క్లిష్టమయిన సవాలు కాదు.
ప్రత్యేకించి మనము, "ప్రివిలెజ్డ్" వర్గాలము, భాషను సంస్కృతికి వాహనంగా మాత్రమే విలువకట్టే దృక్పథాన్ని మార్చుకోవాలి. సాంస్కృతిక కార్యకలాపాలకూ, మన సరూపత (identity) గుర్తింపు భావాన్ని పెంపొందించుకునేందుకూ మనం అంకితం చేసే సమయమునూ, వనరులలో కొంత శాతాన్ని అయినా, తెలుగును ఆధునిక ఆర్థిక వ్యవస్థకి అనుగుణంగా అభివృద్ధి చేయడానికి కేటాయించవచ్చు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలవలెనె, తెలుగును సంపదా, ఉపాధి కల్పనలలో మెరుగైన సాధనంగా మలచటానికి అవసరమయిన మౌలిక సదుపాయాల కల్పనకు నడుం కట్టుకోవాలి. ఈ రోజు మన వద్ద ఉన్న సాంకేతిక, నిర్వాహణ (organisational , managerial) సాధనాలు ఈ విషయంలో కార్యాచరణకు అపారమైన సామర్థ్యాలను సమకూరుస్తున్నాయి. అటువంటి పురోగతి ఎంత వేగంగా సాధించబడితే అంత తెలుగు స్థానం మెరుగుపడే అవకాశం ఉంది.
ఇవాళ్టి 'భాషాసంక్షోభ' పరిస్థితులలో ఇదే మనం చేయగలిగే ప్రభావవంతమైన "భాషాసేవ". ఏమో! కోట్లాది ప్రజలు తెలుగును వదిలేసి ఇంగ్లీషు వైపు పరుగెత్తవలసిన అవసరాన్ని తగ్గించడమే సరి అయిన ప్రయోగాత్మకమైన "భాషా పరిరక్షణ తంత్రం"!
భాష మనుగడకు ఉపయోగ పడాలి. అప్పుడే అది సంస్కృతికి పునాదిగా కొనసాగగలదు.
***
శ్రీమతి కన్నిగంటి అనూరాధ ఐరోపాలోని ప్రాన్స్ వాస్తవ్యులు, తెలుగు సాహిత్యాభిమాని, అనువాదకురాలు, రచయిత్రి. స్వస్థలం హైదరాబాదు. ఉత్తర అమెరికాలో విద్యాభ్యాసం గావించి గణితంలో ఉన్నత డిగ్రీలు సాధించారు. పారిస్‌లోని INALCO సంస్థలో తెలుగు భాష బోధిస్తున్నారు మరియు యునెస్కోలో బహుభాషత్వం మీద వర్కింగ్ గ్రూపులో సభ్యురాలుగా పనిచేస్తున్నారు. భారతదేశం వంటి బహుభాషా దేశాలలో "భాష, అభివృద్ధి, పరిశ్రమ, ఆర్థిక వ్యవస్థ" ల మధ్య ఉన్న సంబంధాలపై ఆమె ఒక పుస్తకం రాస్తున్నారు. ప్రస్తుతం 'అమరావతి కథలు' పుస్తకం యొక్క అనువాదం ప్రచురిస్తున్నారు.