top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
adhyatmika.jpg
pustaka-parichayaalu.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
alanati.jpg
paatasanchikalu.jpg

సంపుటి 7  సంచిక  4

అక్టోబరు-డిసెంబరు 2022 సంచిక

maagurinchi.jpg
rachanalu.jpg

కథా​ మధురాలు

ఊబర్ డ్రైవర్  (Uber Driver)

 

- నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్)

nirmaladitya_edited.jpg
Uber-Driver-Telugu with Title-Final.jpg

"దేశం బయటకి ఏవైనా  డిక్లేర్  చేయాల్సిన వస్తువులు తీసుకెళ్తున్నారా?", కస్టమ్స్ ఆఫీసర్ ప్రశ్న నాకు కొంచెం ఆశ్చర్యం, చాలా ఆదుర్ద, త్రొట్టు బాటు కలుగజేశాయి. 

 

"అబ్బే. ఏమి లేదు", అప్రయత్నంగా అన్నాను. ఉన్నట్లుండి శరీరమంతా చెమటలు పట్టుతున్నట్టు అనిపించింది. వీపు మీద, చెంపల పైన సూదులు వేసి గుచ్చినట్లుంది.

 

నా శని దశ ముగిసే సూచనలు లేవా? ఏది పట్టినా రాళ్లు, మట్టి బెడ్డలు అవుతున్నాయేంటి? 

 

ఎన్ని సార్లు ఇండియాకి ప్రయాణం చేయలేదు? ఇండియా నుండి తిరిగి వచ్చేటప్పుడు, చెక్ ఇన్ అయ్యిన తరువాత ఇమ్మిగ్రేషన్, సెక్యూరిటీ చెక్ ముందు ఓ కస్టమ్స్ ఉద్యోగి ఎక్కడో ఆలోచిస్తూ, కొన్ని సార్లు వస్తున్న ఆవలింతలు ఆపుకుంటూ, కనుసంజ్ఞలతోనే, పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్ చూడడం, ఓ చేయి ఊపి ముందుకు పొమ్మనడం చూడలేదు? ఇదేమిటి, ఈ సారి ఇలా ప్రశ్నిస్తున్నాడు, అని ఆశ్చర్యపడ్డాను.  కానీ ఈ సారి నేను, నాతో బాటు తీసుకెళ్తున్న వస్తువు బయట పడితే, నేరస్తుడుగా జైల్లో వేస్తారేమో అన్న అనుమానం చెమటలు పట్టించేసాయి.

 

నా పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్, నా ముఖం మరోసారి చూసి, కొంచెం దూరంలో ఉన్న మరో సీనియర్ కస్టమ్స్ అధికారిని పిలిచాడు. 

 

"శ్రీని కదా మీ పేరు? మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేయాలి. ఈయనతో బాటు పొండి", అంటూ క్యూ లోనుండి నన్ను పక్కకు తప్పించి, కొత్త అధికారికి అప్పజెప్పాడు.

 

కొత్త అధికారి  తో బాటు అక్కడున్న ఓ గది లోకి వెళ్ళాను.

 

"ఈ సూట్ కేస్ మీదేనా", అని అడిగాడు నన్ను చూసి.

 

బ్యాగ్గేజ్ టాగ్ మీద నా పేరు కనిపిస్తూనే ఉంది. 

 

"ఆ, అవునండి", అన్నాను. ముఖంలో కలవరం కప్పిపెట్టడం కష్టంగానే ఉంది. 

 

అధికారి భృకుటి ఓ రవ్వంత ముడి పడింది.

 

"చెక్ ఇన్ అయిన బ్యాగ్ లలో,  మీ సూట్ కేస్ మా పరిశీలనకు బయటపడింది. ప్రతీ ఫ్లైట్ లో కొన్ని బ్యాగ్ లు పూర్తిగా చెక్ చేస్తాము. సామాన్యంగా ఏమీ అనుమానస్పదంగా దొరకదు. మళ్లీ బ్యాగ్ మూసేసి, ఫ్లైట్ లోడింగ్ కి పంపించేస్తాము. శ్రీని, మరో సారి అడుగుతున్నాను, ఏమైన నాకు చెప్పదలచు కొన్నారా?", అడిగాడు.

 

"అబ్బే లేదండి" బింకంగా అన్నాను.

 

"ఇదేదో పెయింటింగ్ ని సూట్ కేసు లైనింగ్ గుడ్డ పీకి, దాని క్రింద దాచారెందుకు?", అడిగాడా అధికారి. ఎందుకో ఆయన చూపులు నాకు పడుతున్న చెమటలపై పడి, మరింత అనుమానిస్తున్నాడేమో అనిపించింది. డియోడరెంట్ బాగానే దట్టించానే. పైగా మొత్తం ఎయిర్పోర్ట్ ఏ.సి.నే కదా. భయపడితే పని చేసేటట్టు లేదు.

 

"పెయింటింగ్ జాగ్రత్తగా , ప్రయాణంలో దెబ్బ తినకుండా ఉండాలని చేసానండి", అన్నాను.  ఆ కష్టమ్స్ లో పని చేసే వారికి  పెయింటింగ్ ల పై పెద్ద అవగాహన ఉండదని ఎక్కడో ఓ చిరు ఆశ.

 

"రవివర్మ, అని సంతకం కనిపిస్తుంది. రాజా రవి వర్మ పెయింటింగ్ కదా? ఏ మ్యూజియం నుండి దొంగిలించారు? రవి వర్మ పెయింటింగ్ లు అన్నీ నూరేళ్లు పైబడినవే. అంటే, ఇదో పురాతన, సాంస్కృతిక వస్తువు. దేశం బయటకు అనుమతి లేకుండా తీసుకెళ్తే నేరం. భారీ జరిమానాలతో బాటు జైలు శిక్ష ఉంటుంది", అధికారం ధ్వనిస్తున్న కంఠంతో అన్నాడతను.

 

"అబ్బే ఇది ఓ పురాతన వస్తువు, దానిని దేశం బయటకి తీసుకెళ్లడానికి అనుమతి తీసుకోవాలని  నాకు తెలియదు. అసలీ పెయింటింగ్ నాకీ మధ్యనే, నాకు తెలిసిన వారు ఇచ్చారు.  నేనో ఫోన్ చేసుకోవచ్చా?" మామూలు గా చెప్పాలని ప్రయత్నించినా, ఎక్కడో బిచ్చగాడి గొంతులోని అర్ధింపు ధ్వనించింది. 

 

"మీ అమెరికా పద్ధతులు పాటిస్తున్నారా? లాయర్ కు ఫోన్ చేయాలా? లేక మీ అమెరికా రాయబార కార్యాలయానికా? రాయబార కార్యాలయానికి మేమే రేపు పొద్దున్న అప్డేట్ చేస్తాం లెండి", కొంచెం వెటకారంగానే అన్నాడతను.

 

"లేదండి. జెన్ని అని నాకు కావాల్సిన ఆవిడకి ఫోన్ చేయాలి", అన్నాను. జెన్ని జ్ఞాపకాలు, క్రమంగా, నా మెదడు మొత్తం ఆక్రమించేసాయి.

 

***

 

రెండేళ్ల క్రితం, ఫ్లోరిడాలో సరసోట నగరానికి, దక్షిణంగా ఉన్న సియెస్టా కీ బీచ్ రోడ్ మీద కారు నడుపుతున్నాను. క్రియాత్మకంగా ఆలోచించడం భగవంతుడు ఇచ్చిన వరమే. డబ్బులు చేసుకోవడం  ఒక కళ.  కానీ క్రియాత్మకంగా ఆలోచించే వారంతా డబ్బులు చేసుకోలేరు అన్న సత్యం నాకు, స్వయంగా అనుభవిస్తే కానీ అర్ధం కాలేదు. ఎప్పుడూ పుట్టెడు ఆలోచనలు నాకు. సి.డి. కవర్లు ఇండియాలో తయారుచేయించి ఇక్కడ అమ్మాలంటూ, సెల్ఫ్-హెల్ప్ పుస్తకాలు అంటూ ఏవో కొత్త కొత్త పథకాల మీద సొంత ఖర్చు పెట్టి బిజినెస్ మొదలెట్టాను. అవన్నీ మొదలు పెట్టిన ఒకటి, రెండేళ్ల లోనే దివాళా తీసాయి. యూట్యూబ్ వచ్చాక సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు ఎవరికి కావాలి? ఫోన్ లు, స్ట్రీమింగ్ సర్వీసులు ఉన్నప్పుడు సి.డి. లు, దాని కవర్లు ఎవరు కొంటారు?   

 

ఏ మాత్రం నిలకడ లేని నీతో జీవితం వద్దని, మా ఆవిడ చంటి పిల్లలనిద్దరిని తన వెంట తీసుకొని వెళ్ళిపోయింది. కోర్ట్ విడాకులు ఆమోదించి ఆరు నెలలు అయ్యింది. తను ఏదో మెడికల్ ట్రాస్క్రిప్ట్స్ కంపెనీ లో చేరి, రెండు వారాలకి ఓ సారి జీతం వచ్చే జీవితం లో తన సంతోషాన్ని వెదుక్కుంది.

 

నేను చేపట్టిన ఇంకో ప్రాజెక్ట్, ఈ మధ్యనే మళ్లీ నష్టాలలో ముగిసింది. మరో ప్రాజెక్ట్ మీద పని చేయడానికి డబ్బులు లేవు. 

 

అందుకే,  ఊబర్ డ్రైవర్ గా చేరాను. పనికి ఓ ఫోన్, కారు ఉంటే చాలు. ఈ దేశంలో జీవిత కనీసవసరాలకు సరిపడ డబ్బు సంపాదించుకోవచ్చు.  ఎవరైనా  రైడ్ కావాలన్నా,   రెస్టౌరెంట్ ఫుడ్ కావాలన్నా నాకు పని తగిలినట్టే.  కస్టమర్ల టిప్ కూడా దొరుకుతుంది.  అన్నీ ఆప్ ద్వారానే జరగడం గొప్ప సౌకర్యం. తరువాతి కస్టమర్ రైడ్ కోసం వేచే విరామ సమయాలలో,  బీచ్ రోడ్ మీద కారు నడపడం, వీలైతే పార్క్ చేసి ప్రపంచంలోనే అందమైన బీచ్ లలో ఒకటిగా పేరొందిన ఆ బీచ్, తెల్లటి, చల్లటి ఇసుక; నీలాలు, పచ్చలు, రత్నాలు కలబోసినట్లు మెరుస్తున్న సముద్ర జలాలు; పైన నీలాకాశం లో విహరిస్తున్న తెల్లటి పిల్ల మేఘాలను చూస్తూ   కొత్త ప్రాజెక్టుల గురించి ఆలోచించడం నాకు తెగ ఇష్టం. ఆ రోజు అలాంటి ఆలోచనలను భంగపరుస్తూ ఫోన్ పింగ్ వినపడింది. 'మేడ్ ఇన్ రోమ్ ఆర్గానిక్ జెలాటో' షాప్ లో జెలాటో తీసుకొని, క్రెసెంట్ బీచ్ దగ్గరున్న ఓ కాండో లో ఇవ్వాలి. నేనున్న బీచ్ రోడ్ మీదే రెస్టారెంట్, కాండో  రెండూ ఉండటం వల్ల,  వెంటనే డెలివెరీ జాబ్ కి   ఒప్పుకున్నాను.

 

ఓ మైలు ఉత్తరం వైపు బీచ్ రోడ్ మీద డ్రైవ్ చేసిన తరువాత ఆ జెలాటో పార్లర్ వచ్చింది. అక్కడ జెలాటో తీసుకొని, దక్షిణం లో క్రెసెంట్ బీచ్ వైపు కారు నడిపించాను. కాండో చేరి డోర్ బెల్ నొక్కగానే ఓ అరవై ఏళ్లు ఉన్న ఆవిడ తలుపు తీసింది. వెంట్రుకలు అంతా తెల్ల బడ్డాయి. భుజం వరకు జుట్టు. లేత ఆకుపచ్చ పేస్టల్ రంగులో గౌన్. ముఖంలో చిరునవ్వు. 

 

చూస్తూనే ఏదో ఆప్యాయత కలగడం, ఏదైనా సహాయం చేద్దామన్న ఆలోచన రావడం, స్నేహం చేయాలనుకోవడం కొంత మందిని చూస్తూనే కలుగు తుంది. ఆ మనుష్యుల మంచితనం, అసహాయత తో కూడిన  వల్నెరబుల్ చూపుల వల్ల కావచ్చు. నాకు ఆవిడను చూస్తూనే అదే అభిప్రాయం కలిగింది. అప్రయత్నంగా  ఆవిడ నవ్వుకు, సమాధానంగా నాముఖంలో నవ్వు ప్రత్యక్ష మైంది.

 

మామూలుగా అయ్యితే కస్టమర్లు, నా లాంటి ఊబర్  డ్రైవర్ ల దగ్గర ఫుడ్ ప్యాకెట్ తీసుకొని, తలుపు వేసేస్తారు. ఆగంతకులతో, అదీ  వయస్సు మళ్ళిన వారు, ఒంటరిగా ఉన్నప్పుడు, పరిచయాలు పెంచుకోవద్దని,  సన్నిహితులు , ఏ.ఏ.ఆర్.పి లాంటి పత్రికలు అప్పుడప్పుడు ఘోషించడం ఓ కారణం కావచ్చు.  

 

"థాంక్స్ శ్రీని. నువ్వు ఇండియన్ కదా. సౌత్ ఇండియా కదా . ఏ ఊరు? హైద్రాబాద్? బెంగళూరు? చెన్నై?", అడిగింది జెన్ని.

 

 నా పేరు ఆప్ లో డెలివరీ డ్రైవర్ గా చూసి ఉండాలి. 

 

" నాది హైద్రాబాద్.  ఎలా  గుర్తు పట్టారు జెన్ని? మీరు ఇండియాకి  టూర్ ఏమైనా వెళ్ళారా?", ఆశ్చర్యంగా అడిగాను నేను.

 

"ఇండియాకి టూర్ మీద కాదు. చాలా సార్లు మా అత్త, మామయ్య లను తిరువనంతపురం లో కలవడానికి వెళ్లి , చాలా రోజులే ఇండియాలో ఉన్నాను, తిరిగాను. మా ఆయన కూడా ఇండియనే", అంది జెన్ని.

 

తెరిచిన ద్వారం సందులో నుంచి అందంగా అమర్చిన ఫాయర్, డ్రాయింగ్ రూమ్ కనిపిస్తూ ఉంది. గోడలో ఓ పక్క పెయింటింగ్ చూస్తూనే ఏదో భారత దేశంలో కళాకారుడు వేసిన పెయింటింగ్ లాగే అనిపించింది. 

 

"మీరు చేతికి వేసుకున్న గాజులు, మీ ఇంట్లో ఉన్న డెకరేషన్ చూస్తే మీకు భారత దేశం సుపరిచితమే అని నాకు ఇప్పుడనిపిస్తుంది. నైస్ మీటింగ్ యు. హేవ్ ఏ గుడ్ డే", అంటూ వీడ్కోలు తీసుకోబోయాను నేను, ఈ తెల్లావిడ ఆ కాలంలోనే ఓ భారతీయుడిని వలచి పెళ్లాడిందా, అన్న ఆలోచన వల్ల వచ్చిన ఆశ్చర్యాన్ని కప్పి పుచ్చాడానికి ప్రయత్నిస్తూ.

 

"వై డోంట్ యు కమ్ ఇన్సైడ్? కెన్ గివ్ ఫిల్టర్ కాఫీ", జెన్ని అప్రయత్నంగా నన్ను ఇంట్లోకి ఆహ్వానించింది. చాలా రోజుల తరువాత ఓ ఇండియన్ ని కలవడం,   'ఇండియన్ ఓ ఊబర్ డ్రైవరా?' అన్న ఆశ్చర్యం, బహుశ నన్ను చూస్తూనే కలిగిన సదభిప్రాయం, జెన్ని కి నేను ఆగంతకుడన్న భయం పోగొట్టి ఉండాలి.

 

నేను ఫోన్ చెక్ చేసాను. జెన్ని మాట్లాడుతూనే నాకు 5 నక్షత్రాల రేటింగ్, మంచి టిప్ ఇచ్చింది. ఫిల్టర్ కాఫీ అన్న మాట ఎన్నో రోజుల తరువాత వినడం వల్ల, కాఫీ ప్రియుడిని అవ్వడం వల్ల,  నేను వెంటనే జెన్నిని డ్రాయింగ్ రూంలో కి అనుసరించాను. సోఫాలో కూర్చుని చూస్తే ఓ మ్యూజియం రూంలో కూర్చున్న ఫీలింగ్ కలిగింది. గోడ ల మీద అక్కడక్కడ అందంగా పెట్టిన పెయింటింగ్లు, నలు మూలాల ఉన్న చిన్న బల్లల పైన పెట్టిన వస్తువులు, ఒక సోఫా సెట్ , కార్పెట్ తప్పితే చాలా భాగం రూమ్ ఖాళీగా ఉండడం దానికి కారణం. 

 

 టేబుల్ పైన పెట్టిన ఓ తెర చాప ఉన్న ఓడ చూసి, అది కేరళ నుంచి వచ్చిందే అని వెంటనే పోల్చుకున్నాను. గోడ మీద ఉన్న పెయింటింగ్ లలో చాలా మటుకు, ఆబ్స్ట్రాక్ట్, లాండ్ స్కెప్ వంటివే ఉన్నాయి. టార్గెట్, వాల్ మార్ట్ లలో ఈ పెయింటింగ్ కాపీలు విరివిరిగా దొరుకుతాయి.  నా చూపులు, ఇదివరకు భారతీయ కళాకారుడు వేసి ఉంటాడనుకొన్న పెయింటింగ్ మీదికి వచ్చి నిలిచిపోయాయి. 

 

రవి వర్మ గీసిన చిత్రం లాగా అనిపించింది. అనిపించించడం ఏమిటి, కొంత వెదికి చూస్తే కింద ఓ కొనన రవి వర్మ అని సంతకం ఉంది. 

 

"రవి వర్మ పెయింటింగా?", ఆశ్చర్యంగా అడిగాను నేను. ఆశ్చర్యానికి కారణాలు రెండు. జెన్ని ఇండియా లో దొరికే, ఒకదానిపై ఒకటి ఉన్న స్టీల్ గిన్నెలనుపయోగించి ఫిల్టర్ చేసిన రుచికరమైన  కాఫీ తెచ్చి ఇవ్వడం, రెండు ఇలాంటి రవి వర్మ పెయింటింగ్ ఇదివరకు చూడక పోవడం.

 

"అవును, రవి వర్మ పెయింటింగే. మా ఆయన ఆప్త మిత్రుడి పూర్వీకులు, అక్కడి రాజుల దగ్గర పెద్ద పదవులలో ఉండే వారట. రవి వర్మ ను అడిగి , డబ్బులు ఇచ్చి ఆ పూర్వీకులలో ఒకరు వేయించుకొనిన చిత్రం ఇది. ఎక్కడ చూసి ఉండడానికి అవకాశం లేదు", అంది జెన్ని.

 

"రవి వర్మ, అంటే దేవుళ్ళు, దేవతల లాగా కనిపించే నిండు గృహిణుల చిత్రాలే చూసాను. ఇది కొంచెం వేరుగా ఉంది", అన్నాను నేను, మాటలు నానుస్తూ.

 

"ఓహ్ ఎరోటిక్ గా ఉందంటావా?", నవ్వేసింది జెన్ని "రవి వర్మ ఇలాంటి చిత్రాలు కొన్ని గీసాడు. 'తిలోత్తమ' లాంటివి. ఇది 'రతీ, మన్మధుల' చిత్రం. ఈ పెయింటింగ్ ఉన్నట్లు చాలా మందికి తెలియదు. ఇదివరకు అన్నట్లు, చాలా రోజులు ఓ కుటుంబం లో వంశ పారపర్యంగా ఉండిపోయింది. ఆ కుటుంబ వారసుడు, మా వారికి ఆప్త మిత్రుడు, మా పెళ్లికి ఇది కానుక గా ఇచ్చాడు. మాతో బాటు, ఈ రవి వర్మ చిత్రం కూడ ఇక్కడికి వలస వచ్చేసింది".

 

అప్పుడే మాటల సందర్భంలో జెన్ని వాళ్ళాయన రెండేళ్ల క్రితం పోయాడని, ప్రస్తుతం జెన్ని ఒంటరిగా ఉందని తెలిసింది.

 

కాఫీ తాగేసి, వెళ్లే ముందు,  జెన్ని నుండి వీడ్కోలు తీసుకుంటూ, "మీకు ఎప్పుడైనా అవసరం పడితే పిలవండి", అంటూ నా అడ్రస్, ఫోన్ కార్డ్ ఇచ్చాను.

 

 ఆరోజు నుండి తరచు, ఒంటరిగా ఉన్న జెన్ని దగ్గర అంత అపురూపమైన చిత్రం ఉండడం, గుర్తుకు వచ్చేది. దానితో పాటు,  ఆలోచనల తుఫానులు చెలరేగడం మొదలయ్యాయి.  జెన్ని కూడా అప్పుడప్పుడు ఇంటికి ఫుడ్ కనో, రైడ్ కనో పిలవడంతో రవి వర్మ చిత్రం మళ్లీ , మళ్లీ చూసే అవకాశం కలిగింది.  గూగుల్ చేసి చూస్తే రవి వర్మ చిత్రం ఒకటి, ఇటీవల 'సత బీజ్' వేలం పాటలలో రెండు మిలియన్ డాలర్ల పై చిలుకుకే పోయింది అని తెలిసింది. ఈ చిత్రం అరుదైన చిత్రం అని జెన్ని చెప్తున్నది. అంతకంటే ఎక్కువకే పోవచ్చు. నా దగ్గరే అలాంటి పెయింటింగ్ ఉంటే, అమ్మేసే వాడిని. ఓ మిలియన్ డాలర్లకి ఓ ఫ్రాంచైజ్ కొని ఓ షాప్ పెడితే కొంత నికరాదాయం దొరుకుతుంది. తిండి, గుడ్డ సమస్య ఉండదు. మిగిలిన డబ్బులతో నా కొత్త కొత్త పథకాలు ఎలాను కొనసాగించవచ్చు.

 

"ఛా.. ఇలాంటి  దుర్మార్గపు ఆలోచనలు వస్తున్నాయేంటి", అని కొన్ని సార్లు  నొచ్చు కున్నాను కూడా.

 

 జెన్ని ని కలిసిన  ప్రతీ సారి కాఫీ ఇచ్చేది. కబుర్లు వినేలాగే చెప్పేది. అదీ ఓ కళే. గంటలు క్షణాలలా దొర్లి  పోయేవి.   తన లాగా ఒంటరిగా వయస్సు మళ్లి ఉన్న వారిని, ఈ కాలంలో మోసం చేయడానికి ఎలా ప్రయత్నిస్తుంటారో అని కథలు, కథలుగా చెప్తుండేది. ఫోన్లో, ఫిషింగ్ ద్వారా జెన్ని సోషల్ సెక్యూరిటీ, బాంక్ అక్కౌంట్ నంబర్ లాంటి వాటిని కొట్టేయాలని చూడడం కూడా ఎక్కువైపోయింది, అని వాపోయింది. అందుకే నా లాంటి నమ్మకస్తుడు, ఇప్పుడు ఒక విధంగా మిత్రుడు దొరకడం అదృష్టమనేది. 

 

ముసలితనం, వంటరి తనం ఇలాంటి ఆలోచనలను సృష్టిస్తాయా? నిజంగానే సమాజం వయస్సు మళ్ళిన వారిని, అదీ ఒంటరి వాళ్ళను ఇలాంటి దోపిడీలకు గురి అయ్యే వాతావరణం కల్పిస్తున్నదా అని నేను కొన్ని సార్లు మీమాంస లో పడ్డాను కూడా. 

 

 ఒక పక్క భయం ఉన్నా,  తనకందరు మంచి వారే తటస్థ పడుతుంటారు, కావలసిన సహాయం అడుగకనే చేస్తారని, అన్ని తనకు కావలసిన దానికంటే బాగా జరుగుతుంది అని జెన్ని కి ప్రగాఢ నమ్మకం. ఇది వరకు జీవితం లో తటస్థ పడిన అనుభవాలు, ఆ నమ్మకాన్ని మరింత దృఢ పరిచాయి అని చెప్పింది కూడా. జెన్ని ఇరుగు పొరుగు వారు, కొందరు అపరిచితులు కూడా జెన్ని ని చూసి, ఆత్మ బంధువులు లాగా పలకరిచడం, సహాయం కావాలా అని అడగడం నేను నా కళ్లారా చూసి ఆశ్చర్య పడ్డాను కూడా. 

 

అందుకే రవి వర్మ చిత్రం విలువ గుర్తొచ్చినప్పుడెల్ల, జెన్ని మంచితనం చూసి, 'జెన్ని దగ్గర ఈ చిత్రం కొట్టేయడం తప్పు' అని  అనుకుండే వాడిని. కానీ మరో  వైపు, 'ముసలావిడ, ఏమి చేసుకొంటుంది. చివరకు ఏ గుడ్ విల్ లోనో, ఫ్లీ మార్కెట్ లోనో తేలే చిత్రం. అది తీసుకొని నేను బాగు పడగలిగితే తప్పేముంది' అని నా మనస్సులో, తరచు సంఘర్షణలు ఏర్పడడం మొదలయ్యాయి. 

 

 నేను, జెన్ని ఇద్దరూ పరిస్థితుల వల్ల ఒంటరిగానే ఉన్నాము కాబట్టి ఇలా కలవడం ఇద్దరికీ బాగానే నచ్చింది. జెన్ని కూడా ఫుడ్ కావాలంటూ ఆర్డర్ చేస్తుండం, ఇంట్లో చిన్న, చిన్న రిపేర్ పనులు  నా చేత చేయించుకోవడం  వల్ల నాకు డబ్బులు కూడా దొరికేవి.

 

ఓ మూడు నెలల ముందు,  నాకు జెన్ని నుంచి కలవమంటూ ఫోన్ కాల్ వచ్చింది. "ఫుడ్ లేక మరేదైనా వస్తువు కొనుక్కొని రావాలా", అని అడిగాను. "అబ్బే అవసరం లేదు. నీకు పనిలో బ్రేక్ ఉన్నప్పుడు, ఓ సారి వచ్చి వెళ్ళు", అంది జెన్ని.

 

జెన్ని ఇంటికి వెళ్లిన నాకు,  ఇంట్లో మార్పులు వెంటనే కనిపించాయి.  అందంగా ఉండే ఇల్లు , ఎదో ఇల్లు మారుతున్నట్లు అస్తవ్యస్తంగా ఉంది.

 

"ఇల్లు మారి పోతున్నారా?", మనస్సు లోని ప్రశ్నను అడిగాను. 

 

"అవును శ్రీని. ఇల్లు కాదు, ఈ దేశాన్నే వదలి, మరో దేశంలో బ్రతకుదామనుకుంటున్నాను. ఒంటరి తనం, నా భయాలకు విముక్తి కావాలంటే అదే సరి అయిన మార్గం అన్న నిర్ణయానికి వచ్చేసాను", అంది జెన్ని.

 

"కొత్త దేశంలో మీ భయాలు పోతాయన్న నమ్మకం ఎలా కలిగింది?", అడిగాను నేను. 

 

"ఈ మధ్య నే నాకు ఈ ఆలోచన వచ్చింది. వేరే దేశంలో రిటైర్ అవ్వడం గురించి బోలెడు పుస్తకాలు, వ్యాసాలు చదివాను. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ దేశాలలో జీవించడానికి పెద్ద డబ్బు అవసరం లేదు. ఇక్కడి కంటే క్రైం తక్కువే. ఇక్కడ లాగా మోసాలు లేవు. మా  అమ్మ , నాన్న స్పెయిన్ నుంచి ఈ దేశానికి వలస వచ్చారు. స్పెయిన్ లో ఉన్న నా కజిన్స్ తో కూడా మాట్లాడాను. ఇంకా ఏ దేశం పోవాలని నిర్ణయించలేదు. స్పెయిన్ ఒక ఆప్షన్. పనామ, కోస్ట రికా దేశాలు కూడా నా లాంటి వారు రిటైర్ అవ్వడానికి మంచి దేశాలు అని విన్నాను. కాని ముందు ఇంట్లో ని వస్తువులన్నీ అమ్మడమో, గుడ్ విల్ కు డొనేట్ చేయడమో, చేయాలి. దానికి సాయం చేస్తావనే పిలిచాను", అంది జెన్ని.

 

"అయ్యో మీరు వెళ్ళిపోతే నాకు పెద్ద నష్టమే. మిమ్మల్ని, మీ కబుర్లను, మీరిచ్చే పనులు, ఫిల్టర్ కాఫీ, అన్నీ మిస్ అవ్వుతాను", నొచ్చు కుంటూ అన్నాను నేను.

 

"నేనూ మిస్ అవ్వుతాను శ్రీని", అంది జెన్ని.

 

"అన్నట్లు, ఆ రవి వర్మ చిత్రం ఏమి చేయదలచు కున్నారు. దాన్ని గుడ్ విల్ కి ఇచ్చే పక్షంలో, నాకు ఇచ్చేయండి. మా ఇంట్లో, మీకు గుర్తుగా పెట్టుకుంటాను", 'ఓ రాయి విసిరితే పోలా' అనుకుంటూ, అన్నాను నేను.  అలా అప్రయత్నంగా నా నోట్లోనుంచి మాటలు దొర్లడానికి కారణం ఆ చిత్రం మీద నేను ఇదివరకే చేసిన ఆలోచనలు కావచ్చు. గుడ్ విల్ కు దానం చేయాలనుకున్నదంటే, ఆ పెయింటింగ్ విలువ తనకు తెలియనట్లే. అది జెన్ని సమాధానం తో ఋజువై పోతుంది. 

 

జెన్ని నా మాటలకు ఆశ్చర్యపడినట్లు, నాకనిపించలేదు.  "దాని గురించి ఆలోచించలేదు. ఒక వేళ నా వెంట తీసుకోకపోతే, నీకు తప్పకుండా ఇస్తాను. ముందు ఈ ఫర్నిచర్ ని అమ్మేయాలి, వస్తువులు ప్యాక్ చేయాలి. ఎలా చేద్దామంటావు?", అడిగింది జెన్ని.

 

నాకు ఎక్కడో  ఆశ మొలకెత్తింది. నేను ఊహించినట్లు, రవి వర్మ చిత్రం విలువ జెన్ని కి తెలిసినట్లు లేదు. జెన్ని కి అనుమానం రాకుండా మెలగగలిగితే, తొందరలోనే ఆ రవి వర్మ చిత్రం నా చేతికి వస్తుంది. నా కష్టాలన్నీ తీరిపోతాయి.

 

"దానికేముంది జెన్ని. నీ ఫేస్ బుక్ మార్కెట్ ప్లేస్ లో వస్తువులు అమ్మకానికి పెట్టు. అమ్ముడు పోకపోతే నేనో ట్రక్ హైర్ చేసుకొని గుడ్ విల్ లో వేసేస్తాను." అంటూ తరువాత ఏమి చేయవచ్చో వివరించాను.

 

తరువాతి రోజులు వేగంగా దొర్లిపోయాయి. సెల్లర్స్ మార్కెట్ కాబట్టి ఇల్లు కొనడానికి,  జనాలు లైన్ కట్టి మరీ నిలబడి, అడిగిన రేటు కంటే ఎక్కువే ఇస్తామంటూ ఎగబడడం తో జెన్నికి ఆ సమస్య కూడా ఇట్టే తీరిపోయింది.

 

జెన్నిని  చివరగా కలిసినప్పుడు, మళ్ళీ రవి వర్మ పెయింటింగ్ ప్రసక్తి తీసుకొచ్చాను.

 

"జెన్ని మీరు రవి వర్మ చిత్రం ఏమి చేశారు. గుడ్ విల్ కి ఇచ్చినట్లు లేదు?", నేను నానుస్తూ, నా కోరికను మరో సారి జెన్ని కి గుర్తు చేసాను.

 

జెన్ని ముఖంలో కొంత కలవరపాటు కనిపించింది. 

"నిజంగానే నీకు రవి వర్మ చిత్రం కావాలా? అలాంటి ఎరోటిక్ చిత్రం మీ ఇండ్లలో పెట్టడానికి పెద్దగా ఇష్టపడరే? కేరళ  నుండే తెచ్చిన పడవ బొమ్మలు లాంటివి నా దగ్గర ఉన్నాయి. అవి తీసుకోవచ్చు కదా?" అంది జెన్ని.

 

"జెన్ని ప్రస్తుతం నేను సింగలే కదా. ఆ చిత్రం నా ఇంటి గోడ మీద వేలాడించడంలో నాకు ఏమాత్రం అడ్డు లేదు. రవి వర్మ చిత్రం నాకు నా చిన్నతనం గుర్తుకు తెస్తుంది. ఆ నోస్టాల్జియా నాకిష్టం", నేను జెన్ని నుండి ఆ చిత్రం తీసుకోవాలని మరో సారి ప్రయత్నించాను. నా మాటలు నాకే కృత్రిమంగా అనిపించాయి. కానీ జెన్ని నా ఆలోచనలు పసి కట్టలేదన్న ధీమా. 

 

జెన్ని  అప్పటికే ప్యాక్ చేసి పెట్టిన ఒక పెద్ద సూట్ కేస్ విప్పి, అందులో ఓ కార్డ్ బోర్డ్ గొట్టం తీసి నాకందించింది.

 

"నాతో తీసుకు పోదామనుకున్నాను. ఇదిగో రవి వర్మ చిత్రం.  ఆ ఫ్రేములో నుంచి తీసివేసి ఈ గొట్టంలో ప్యాక్ చేసాను. అన్నట్టు ఈ రవి వర్మ చిత్రం కాపీ నే. ఒరిజినల్ చిత్రం మా వారు ఇండియాలోనే ఓ స్నేహితుడి దగ్గర వదిలేశారు. నువ్వు ఒక వేళ ఇండియా పోయి తెచ్చుకుంటానంటే, అతని చిరునామా ఇస్తాను అంది" జెన్ని.

 

నా ఆనందం ఉవ్వెతున పొంగింది. అది ముఖంలో కనపడకుండా కప్పిపెట్టడానికి ప్రయత్నిస్తూ,"థాంక్స్. చాలా థాంక్స్ జెన్ని. యు మేడ్ మై డే. అడ్రస్ ఇవ్వండి. ఎలాగూ ఇండియా కి ప్రతీ ఏడూ వెళ్లి వస్తుంటాను. త్వరలోనే పోవాలనుకుంటున్నాను. అతన్ని కూడా కలుస్తాను", అన్నాను.

 

జెన్ని పోస్ట్ ఇట్ నోట్ మీద అడ్రస్ రాసి ఇచ్చింది. నీ దగ్గరున్న నకలు అతనికిచ్చి, జెన్ని పంపిందని చెప్పు, నీకతను రవి వర్మ ఒరిజినల్ చిత్రం అందజేస్తాడు, నేను కూడా అతనికి ఫోన్ చేసి నువ్వొస్తావని చెప్తాను అంది  జెన్ని. అదే జెన్నిని చివరి సారి కలవడం.

 

***

 

నా వాట్స్ అప్ లో జెన్ని కి ఫోన్ చేసాను. జెన్ని వెంటనే ఎత్తుకోవడంతో పెద్ద రిలీఫ్ కలిగింది నాకు.

"జెన్ని. ఓ మై గాడ్, మీరు దొరికారు. నన్ను ఇక్కడ ఇండియాలో కస్టమ్స్ వాళ్ళు ఆపేసారు. రవి వర్మ చిత్రం దొంగతనంగా తీసుకెళ్తున్నాని నేరం ఆపాదిస్తున్నారు. మీరే, ఆ చిత్రం మీదని చెప్పి వీళ్ళ బారి నుండి కాపాడాలి", అంటూ గుక్క తిప్పుకోకుండా జెన్ని ని అర్ధించాను.

 

"శ్రీని  చాలా డిస్టర్బెడ్ గా ఉంది నీ గొంతు. నువ్వు  నేను చెప్పినతని దగ్గర నుంచి తీసుకున్న రవి వర్మ  చిత్రమే కదా పట్టుబడింది.  నువ్వేమి గాబరా పడద్దు. ఇదేమి పెద్ద సమస్య  కాదు. అయినా నువ్వు అదృష్టవంతుడివి. ఈరోజే ఓ పని మీద కీటో నగరానికి వచ్చాను. నా వాట్స్ అప్ పని చేసింది. నేను ఉండేది యాసుని నేషనల్ పార్క్ దగ్గర. అక్కడ సిగ్నల్స్ సరిగా లేవు", అంది జెన్ని.

 

"ఎక్కడున్నారు మీరు. అలాంటి సదుపాయాలు లేని ప్రదేశం లో ఎందుకున్నారు?",  అడిగాను.

 

"ఏక్వడోర్ దేశంలో ఉన్నాను. ఏదో ఓ ఆశయం పెట్టుకొని జీవించడమే నా భయాలకి పరిష్కారం అనిపించింది. అభివృద్ధి, టెక్నాలజీ అంటూ నా జీవితంలో అనవసరమైన పనులకు ప్రాధాన్యం ఇస్తున్నానని అనిపించింది.  ఈ కాలంలో కూడా ప్రకృతి వనరుల పై మాత్రమే ఆధార పడుతూ అమెజాన్ అడవులలో అతి సాధారణంగా, కనీసావసరాలతో బ్రతుకున్న ఇండిజెనిస్/ఆదిమ వాసుల కుటుంబాలను చూసి, వారి లాగే, వీలైతే వారితో బాటే బ్రతకాలనిపించింది.  వీళ్ళకి ప్రభుత్వం తో, ఆయిల్ డ్రిల్ల్ చేయాలనుకునే కంపెనీలతో సమస్యలున్నాయి. వాటికి సహాయ పడదామని, ఇక్కడి వలంటరీ సంస్థ వారి తో పాటు  కీటో కు ఇవ్వాళే వచ్చాను", అంది జెన్ని.

 

 నాకు నా  పరిస్థితి గుర్తుకు వచ్చింది. జెన్ని మాటలు పూర్తిగా అర్ధం కాలేదు. ఇప్పుడు అర్ధం చేసుకోవాలన్న ఆలోచన లేదు.

 

"ఆహ్..ఒకే. నన్ను ముందీ కష్టమ్స్ అధికారుల బారి నుండి తప్పించు", అని ప్రాధేయ పడ్డాను.

 

"నేను  అన్నాను కదా తప్పిస్తాను అని. అయినా నీకు నేను చెప్పింది అర్ధం కాలేదని తెలుస్తున్నది. కాబట్టి చెప్పాలనుకొన్నది కూడా ఆపేస్తాను.  నేను ఆ చిత్రం ఇవ్వమని నీకు ఒకతని అడ్రెస్ ఇచ్చాను కదా. అతనికి ఫోన్ చేసి చెప్తాను. ఈ రాత్రి అక్కడే గడువు. రేప్పొద్దునే అతను కష్టమ్స్ అధికారులను కలిసి నిన్ను విడిపిస్తాడు", అంది జెన్ని.

 

"అతనెలా విడిపిస్తాడు? అతనే కదా నాకు రవి వర్మ ఒరిజినల్ చిత్రం ఇచ్చింది. అదే ఇప్పుడు నన్ను ఇలా ఆపేయడానికి కారణం" ఉబికివస్తున్న ఫ్రస్ట్రేషన్ కప్పి పుచ్చుతూ అన్నాను నేను.

 

"నీకు తెలియదు శ్రీని. నువ్వు కలిసింది ఇండియాలో ఉన్న ఓ ఆర్ట్ డీలర్ ని. ఆయన ఇండియాలో ఉన్నప్పుడు మాకు మంచి స్నేహితుడు, సన్నిహితుడు. నేను నిన్ను కలవడం, నీవు రవి వర్మ పెయింటింగ్ కావాలుకోవడం ఆయనకి చెప్పాను. ఆయనే నన్ను నిన్ను ఇండియాకి పంపమన్నది. నీవు గమనించావో లేదో. నువ్వు ఇండియాకి పోతానని కమిట్ అయ్యిన తరువాతే నేను నీకు పెయింటింగ్ ఇచ్చాను", అంది జెన్ని.

 

"నేను ఇండియాకు పోవడానికి, నాకు మీరు పెయింటింగ్ ఇవ్వడానికి సంబంధం అర్ధం కాలేదు. అసలు మీ ఇంట్లో ఆ పెయింటింగ్ ఉన్నట్లు గమనించకుండా ఉంటే కూడా బాగుండేది. ఇలా వీళ్లకు దొరికి పోయే వాడిని కాదు. ఏది ఏమైనా, నన్ను విడిపించుకోవడానికి మార్గం చెప్పండి", అన్నాను నేను

 

 "సంబంధం ఉంది. నీవు ఇండియాకి పోయినందుకు థాంక్స్.  ఆ ఆర్ట్ డీలర్ నువ్వు కలిసినట్లు నాకు చెప్పాడు. ఇప్పుడు భారత దేశంలోనూ ఆలిగార్గ్ లు తయారయ్యారు కదా. వారు మిలియన్లు పోసి పెయింటింగ్లు కొంటున్నారట. వాళ్లు విదేశాలలో వారికున్న డబ్బు మనీ లాండరింగ్ చేయడానికి ఇదో పద్ధతి.   డీలర్ పంపిన డబ్బులు అందాయి. ఆ డబ్బులు ఇక్కడ ప్రభుత్వం, ఆయిల్ కంపెనీ వాళ్లతో పోరాడుతున్న ఈ ఆదిమ వాసులకు, నేను చేయదలిచిన స్వచ్ఛంద సేవకు అవసరం. నువ్వేమి వర్రీ అవ్వద్దు. రేప్పొద్దునే నిన్ను విడిచి పెట్టేస్తారు", అని మళ్లీ ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించింది జెన్ని.

 

నాకు చిరెత్తుకొచ్చింది. "ఎలా విడిపిస్తాడు జెన్ని. రవి వర్మ చిత్రం కష్టమ్స్ చేతుల్లో ఉంది.  నేనో పురాతన వస్తువు ఎలాంటి పెర్మిషన్స్ లేకుండా ,  స్మగుల్ చేస్తున్నానని వాళ్ళ ఆరోపణ. దానికి వారి దగ్గర ఆధారం ఉంది".

 

జెన్నికి నా మాటలు నవ్వు తెప్పించాయి. నవ్వాపుకుంటూ, " నీకింకా అర్ధం అయ్యినట్లు లేదు. నువ్వు నా దగ్గిర తీసుకెళ్లింది ఒరిజినల్ రవి వర్మ చిత్రం. నీ దగ్గర ఇప్పుడు పట్టు బడింది, ఆ డీలర్ నీ కోసం గీయించిన కాపీ నే. కాబట్టి డీలర్ స్వయంగా వచ్చి అది ఈ మధ్యనే గీసిన కాపీ, తన దగ్గర నువ్వు కొన్నావు, అంటే వదిలేస్తారు. కాపీ అని అక్కడే వదిలేయొద్దు. ఒరిజినల్ చిత్రంకు వచ్చినట్లు మిల్లియన్లు రాకపోయినా, వాటికి ఇక్కడ మార్కెట్ ఉంది. అమ్మితే నీ రాను పోను ఖర్చులు పోను,  కనీసం ఓ రెండు వేల డాలర్లు నీకు మిగలాలి. ఇది ఇండియా రైడ్ కు,   నా టిప్ గా తీసుకో", అంది.

 

***

bottom of page