top of page
bhuvanollasam.PNG
srinivyasavani.PNG

సంపుటి  6   సంచిక  1

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

కథా​ మధురాలు

టైం ఫర్ సెలెబ్రేషన్స్

 

మైలవరపు ప్రసాద్

M-Prasad.JPG

తన ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉంది సుగుణ. అప్పుడే సాయంకాలం 4.30 అయ్యింది. మరో గంటన్నరకల్లా  ఆ వారానికి ప్లాన్ చేసుకున్న పని అయిపోతే వారాంతం రెస్టు తీసుకోవచ్చన్నది సుగుణ ఆలోచన.

ఇంతలోనే “మేనేజర్ గారు పిలుస్తున్నారు” అంటూ హెడ్ ప్యూన్ చెప్పడంతో, కంప్యూటర్ లో టైప్ చేస్తున్న రిపోర్ట్ ని  అలాగే వదిలేసి బాంకు మేనేజర్ గారి గది లోకి వెళ్ళింది.

అక్కడ మేనేజర్ ఎదురుగా తన కొడుకు అగస్త్య కూర్చుని ఉండడం చూసి ఆశ్చర్య పోయింది.

“మరేం ఫర్వాలేదు. నేను ఆయన్ని రేపు చూస్తానుగా!” అంటున్నాడు మేనేజర్.

“మేడమ్. మీపని అయిపోతే మీరు వెళ్ళిపోవచ్చు. మన RM దగ్గరనుంచి కాల్ కోసం వైట్ చేస్తున్నాను. యూ కెన్ గో నౌ” అన్నాడు మేనేజర్.

“ఇప్పుడే ఆ కంప్యూటర్ లో టైప్ చేసిన రిప్లయ్ మీరు ఒకసారి చూడండి సార్.  నచ్చితే, దాన్నే మీరు పంపెయ్యచ్చు.  కొన్నిమార్పులవసరం అనుకుంటే, అవి కూడా చెయ్యచ్చు” అని సుగుణ తన రూమ్ లోకి వెళ్ళబోతూ, “అగ్గూ. నీకు మేనేజర్ గారితో పనై పోతే నా దగ్గరికి రా” అంది. 

ఇంకో పదినిముషాల్లో తల్లీ కొడుకులిద్దరూ బయటకి వచ్చారు. 

 

“నేను మన కారు తెచ్చానులే. అర్జెంట్ గా ఇంటికెళ్ళాలి. పద అన్నాడు అగస్త్య. అప్పటికే కారు స్టార్ట్ చేసేశాడు.

కార్లో కూర్చున్న వెంటనే, “ఇప్పుడు చెప్పు. మా మేనేజర్ తో ఏమిటా గుసగుసలు? ’ఆయన్ని రేపు చూస్తాను’ అంటున్నది ఎవరిగురించి? అడిగింది సుగుణ.

అసలు సుగుణకి చాలా కోపంగా ఉంది. కారు మైంటెనెన్స్ కి ‘బడ్జెట్ లేదు’ అని ఇంట్లో మొగుడితో కొట్లాడి వచ్చిందాయె. అయినా వీడు కాలేజీ నుంచి రావడం, కారు తీసుకోవడం, మళ్లీ తననే కారులో ఎక్కించుకుని తీసుకెళ్లడం...  ఇవన్నీ ఆలోచిస్తూంటే, “ఇప్పుడు ఈ కార్ లో పెట్రోల్ కూడా పోయించాలి కాబోలు. ఎంతటి అవస్థరా దేవుడా!” అని గొణుక్కుంది సుగుణ.

“నువ్వు ముందు నేను చెప్పేది శ్రద్ధగా విను. మనం నేరుగా ఇంటికే వెడుతున్నాం.   మధ్యలో ఆగాల్సిన పనులేవన్నా ఉంటే  వాటిని కాన్సిల్ చేసుకో” అన్నాడు అగ్గూ.

“సరే! చెప్పండి సార్ ”

“ఇవాళ నాకు తొందరగా క్లాసెస్ అయిపోయాయి.” మొదలెట్టాడు అగ్గూ.

“అది తెలుస్తూనే ఉందిలే. నాకు బాంక్ లో లేటయ్యే అవకాశం ఉన్నప్పుడల్లా, నీకు క్లాసెస్ తొందరగా అయిపోవడాలూ, నువ్వూ మీ అక్కా మన కార్లో షికార్లు కొట్టడాలూ, ఆ తరువాత ఆ కారుని మళ్లీ సర్వీసింగ్ కి ఇచ్చుకోవడం,  ఆ విధంగా  మన మంత్లీ బడ్జెట్స్ లో ఇంకో రెండునెలలు లోటురావడం, మనకి మామూలేగా?”

“అమ్మా. ముందు నేను చెప్పేది విను.  ఆ తరువాత నీ కామెంట్స్ చెయ్యి. నీ కామెంట్స్ వినీ వినీ, మేము దానికి అలవాటు పడిపోయే ప్రమాదం కూడా ఉంది.”

“సరే. చెప్పు. ఎలాగూ బలైపోయాను కదా?”

“ఇవాళ నాకు తొందరగా క్లాసెస్ అయిపోయాయి కదా అని, ఇంటికి వచ్చి బట్టలు  మార్చుకుని బయటకి వెడదామనుకున్నాను. కానీ నేను ఇంటికెళ్ళేసరికి, నాన్నగారు మంచం మీద పడుకుని ఉన్నారు. స్పృహ లో లేరు.  బాత్ రూమ్ లో కళ్ళు తిరిగాయిట. పైగా వాంతి కూడా అయ్యిందిట. చెమటలు పట్టేశాయిట.  తెలివొచ్చాక తానే డేక్కుంటూ బయటకి వచ్చి, డా.సుధాకర్ కి ఫోన్ చేశారుట. ఆయన వెంటనే అటెండ్ అయ్యాడు.   అదీ కధ” అన్నాడు అగస్థ్య.


“ఓ గాడ్! నాన్నగారు ఎలా ఉన్నారిప్పుడు?” ఆందోళనతో అడిగింది సుగుణ.

“ఏం ఫర్వాలేదులే!  ఆయన బాగానే ఉన్నారు. సుధాకర్ అంకుల్ కూడా ఈమాటే అన్నారు. డాడీని అనవసరంగా టెన్షన్ పడద్దని చెప్పారు. అలాగే నాతోకూడా డాడీ టెన్షన్ ఫీల్ అయ్యేలా ప్రవర్తించద్దనీ చెప్పారు. మధ్యాహ్నం ఒంటిగంటకి ఆయన తన హాస్పిటల్ కి వెళ్ళిపోయారు” అన్నాడు అగస్థ్య.

“అయితే మధ్యాహ్నం నుంచీ నువ్వు ఇంట్లోనే ఉంటే, నాకెందుకు ఫోన్ చెయ్యలేదు?” కోపంగా అడిగింది సుగుణ. కారు లో ఏ సీ ఆన్ చేసినా, తనకి చెమటలు పట్టేస్తున్నాయి!

“నాన్నగారు నిద్రపోయారులే. డా.సుధాకర్ హాస్పిటల్ కీ వెళ్ళిపోయారు. తరువాత మందులు సాయంత్రం 4.00కి. ఈలోపులో అవసరం అయితే నన్ను ఫోన్ చెయ్యమన్నారు.  ఎలాగూ హాఫ్ డే అయిపోయిందికదా, నాన్నగారు కూడా నిద్రపోయారు కదా అని నీకు ఫోన్ చెయ్యలేదు”

“మరి ఇప్పుడెందుకు వచ్చినట్టో?”

“సమయం దొరికితే చాలు, నీ వెటకారాలు మొదలెట్టేస్తావు కదమ్మా? నేను చెప్పేది ఇంకా ఉంది. వింటావా వినవా?”

“సరే. తొందరగా చెప్పు”

“రెండు గంటలకల్లా అక్క ఐషు ఇంటికి వచ్చింది. దాని మెడికల్ కాలేజీ లో ఇవాళ మధ్యాహ్నం అందరూ క్లాసులు ఎగ్గొట్టేస్తున్నారుట. రాబోయే రెండు రోజులూ సెలవులు కదా? అందుకని ఎవరి ప్లాన్స్ వాళ్ళు వేసుకున్నారుట. వెరసి ఈ సామూహిక క్లాస్ రూమ్ బహిష్కరణా కార్యక్రమం అన్నమాట. కానీ అది ఇంటికొచ్చి తాళం తియ్యాల్సిన అవసరం రాలేదు. అప్పటికే నేనున్నాను కదా ఇంట్లో?

అక్కకి జరిగిందంతా చెప్పాను. వెంటనే సుధాకర్ అంకుల్ కి ఫోన్ చేసింది. 

ఆయనేమో, “హమ్మయ్య. ఐశూ. నువ్వొచ్చేశావు కద? మీ నాన్నకి నయం అయిపోతుందిలే.   ఇప్పటినుంచీ గంటకోసారి కొబ్బరి నీళ్ళు ఇయ్యి. నాలుగ్గంటలకల్లా తేరుకుంటే, ఇక మందేమీ అఖ్ఖరలేదు.   లేకపోతే, అక్కడే ఉన్న ’సార్బిట్రేట్’ టాబ్లెట్ ఒకటి ఇచ్చి చప్పరించమను” అన్నారు.

అప్పటినుంచీ అక్క నాన్నగారి బెడ్ పక్కన కూర్చునుంది.  నేనేమో హాల్లో కూర్చున్నాను”

“టీ వీ చూస్తూ... అని కూడా చెప్పవేం?” కసిరింది సుగుణ.

“అదే నీతో వచ్చిన తంటా. ఈ దెప్పుళ్ళని, మేము నీ పిల్లలం కాబట్టి భరిస్తున్నాం.  కానీ బాంక్ లో నిన్ను ఎలా భరిస్తున్నారో?” అని, మళ్ళీ “అలా టీవీ చూసెయ్యడానికి ఇవాళ క్రికెట్ మాచెస్ ఏమీ లేవు.   ఆ సీరియల్స్ నాకక్కరలేదని నీకూ తెలుసుగా? ఇంకా నేను చెప్పేది ఉంది, వింటావా వినవా?”  కాస్త రెట్టించి అడిగాడు అగ్గూ.

అప్పటికే కారు హైటెక్ సిటీ దాటుతోంది. “మాదాపూర్ ఇంకెంత దూరంలే!” అనుకుంది సుగుణ.

“సరే. తొందరగా అఘోరించు” పెడసరంగా అంది సుగుణ.

“డా.సుధాకర్ చెప్పినట్టుగా మూడుసార్లు కొబ్బరి నీళ్ళు ఇచ్చింది అక్క. కానీ, ఇందాకా అయిదు గంటలకి మాత్రం “నాకెందుకో భయంగా వుంది అగ్గూ. వెళ్ళి అమ్మని తీసుకురా. ఫోన్ చెయ్యద్దు. గాభరా పడుతుంది” అంది. అక్క ఆనతి మీద నీ దగ్గరికి రావడమైనది” ముగించాడు అగ్గు.

“మరయితే, అప్పుడు డా. సుధాకర్ కి ఫోన్ చెయ్యలేదా?” కోపంగా అడిగింది సుగుణ.

“వాట్సప్ లో ఇంతవరకూ కాంటాక్ట్ లోనే ఉంది అక్క. ఇంకో రెండు మూడు గంటల్లో ఎఫెక్ట్ ఉంటుంది అన్నారు సుధాకర్”

వెంటనే డా. సుధాకర్ కి ఫోన్ చేసింది సుగుణ. “అక్కా. ఇలాంటివి నార్మల్. మొన్ననే ఏభై వచ్చాయికదా బావగారికి? కొంచెం జాగ్రత్త అవసరం. అయన బాగానే ఉంటారులే” అన్నాడు సుధాకర్.

“మా తమ్ముడు పృధ్వీ కి కూడా ఇన్ఫార్మ్ చెయ్యనా?” అడిగింది సుగుణ.

“వాడితో నేను కంటాక్ట్ లోనే ఉన్నాను. అంతగా అవసరం అయితే వాడే డిల్లీ నుంచి ఇక్కడి నిమ్స్ వాళ్ళతో మాట్లాడుతాడులే. కాని ఆ అవసరం రాదు. ఐ కెన్ ట్రీట్ హిమ్. హీ విల్ బీ ఆల్ రైట్. డోంట్ గివ్ హిమ్ ఎనీ మెంటల్ స్ట్రెస్. కనీసం ఓ నెళ్ళాల్లు” అన్నాడు సుధాకర్.

"మీ బావగారు నెక్స్ట్ వీక్ దుబాయ్ వెళ్ళాలి కదా? దాన్ని వాయిదా వెయ్యాలా?"

"అవసరంలేదక్కా. అప్పటికాయన బాగానే ఉంటారు అని నా ఉద్దేశ్యం." అన్నాడు సుధాకర్.

ఈ సుధాకర్ తన తమ్ముడు పృధ్వీ క్లాస్ మేట్.  పృధ్వీ ఇప్పుడు డిల్లీలో ఎస్కార్ట్స్ లో ఛీఫ్ కార్డియాలజిస్ట్.   సుధాకర్ మొన్నటిదాకా హైదరాబాదులోనే కిమ్స్ లో చేసి, ఈ మధ్యే  ఛీఫ్ కార్డియాలజిస్ట్ గా అపోలో లో జాయిన్ అయ్యాడు. అంతగా అయితే అపోలోకే తీసుకెళ్ళచ్చులే. అనుకుంది సుగుణ.

ఇంటి ముందు కారాగగానే, వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోయింది సుగుణ. తన హాండ్ బేగ్, సెల్ ఫోనూ. అగ్గూ తీసుకొస్తాడులే. అనుకుంది.

బెడ్ రూమ్ లో భర్త ప్రవీణ్ నిద్రపోతున్నాడు. బెడ్ పక్కనే కూతురు ఐషు కూర్చుని ఉంది.

“మీ నాన్న ఎలా ఉన్నారు?” అడిగింది సుగుణ. అప్పటికే సుగుణ తన చేతులతో ప్రవీణ్ శరీరాన్ని అంతటినీ తడిమేస్తోంది!

“ఆయన్ని నిద్రపోనీ. ఇప్పుడు ఆరయ్యింది. ఇంకాస్సేపట్లోనే మెలకువ వస్తుందిలే.” అంది ఐశ్వర్య. “నీక్కొంచెం కాఫీ తెస్తానుండు” అంటూ బెడ్ రూమ్ లోంచి బయటికి వచ్చేసింది.

అంతే!    

ఎప్పటినుండో  ఈ అవకాశం కోసం నిరీక్షిస్తున్న దానిలాగా, ప్రవీణ్ ని అల్లుకు పోయింది సుగుణ.

“ప్లీజ్ గెటప్ ప్రవీణ్. ఐ లవ్ యూ. ఐ కాంట్ మిస్ యూ. ప్లీజ్..ప్లీజ్” కన్నీళ్ళతో ప్రవీణ్ మొహాన్ని తడిపేస్తోంది.

కొంతసేపటికి కళ్ళు తెరిచాడు ప్రవీణ్.

“అరే సుగూ. ఎందుకీ కన్నీళ్ళు? నేను బాగానే ఉన్నాను.  సుధాకర్ చూస్తున్నాడు కదా? ఐశూ తో పృధ్వీ మాట్లాడాడు.  మా పేరెంట్సూ మాట్లాడారు. అలాగే మీ వాళ్ళు కూడా.  ఐ విల్ బీ ఆల్ రైట్.నన్ను నమ్ము.” అన్నాడు ప్రవీణ్.

అప్పటికే ప్రవీణ్ చేతులు సుగుణని చుట్టేశాయి!

ఇంతలో తలుపులు తెరుచుకుని అగ్గూ, ఐశ్ లు వచ్చేశారు. ఐషూ చేతిలో ఒక ట్రే... నాలుగు కాఫీలూ.

“ఐషూ. చాలా కష్ట పడ్డావురా. థాంక్యూ. మధ్యాహ్నమే నాకు కబురందితే, నేను కూడా నీ కష్టాన్ని పంచుకునేదాన్ని” అంది సుగుణ.

“అది మధ్యాహ్నం నుంచే వచ్చింది. అంతకు ముందునుంచీ డాడీని చూసుకున్నది నేను.  కాబట్టి ముందు నాకు థాంక్స్ చెప్పు. అలాగే నీకు బాంకులో ఏ విషయమూ చెప్పకుండా, అక్కకి మాటిచ్చినట్టుగా కార్లోనే చెప్పాను. దానికి ఇంకో థాంక్స్ చెప్పు” అన్నాడు అగ్గూ.

తల్లిని ఏడిపించడానికి అక్క తమ్ముల్లు ఇద్దరూ సమ ఉజ్జీలే! కవలల లక్షణాలు ఎక్కడికి పోతాయి?

“ఆ మాటకొస్తే డా.సుధాకర్ కీ, పృధ్వీ మావయ్యకీ కూడా థాంక్స్ చెప్పాలి నువ్వు. ఇంతసేపూ వాళ్ళే నాన్నగారి ని మానిటర్ చేశారు. అనుకోకుండా మా ప్రొఫెసర్ గారు ఇవాళ క్లాసులో కార్డియాక్ అరెస్ట్, ఎర్రిథ్మియాల గురించి చెప్పారు.  ఆ తెలివి ఈ విధంగా పనికొచ్చింది” అంది ఐశు.

“సరే. మీ ఇద్దరికీ కూడా థాంక్స్. సుధాకర్ కీ, పృధ్వీకి నేను పర్సనల్ గా చెప్తాను. సరేనా?” అంది సుగుణ.

“ఎందుకూ అన్నది కూడా చెప్పు” అడిగాడు అగ్గూ.

“డాడీని బాగా చూసుకున్నారు కదా...దట్జ్ వై” అంది సుగుణ.

“అలా అయితే థాంక్స్ అఖ్ఖరలేదు. డాడీని చూసుకోవడం మా డ్యూటీ.  వేరే కారణం ఉంటే చెప్పు” అడిగింది ఐషు.

“తన మొగుడ్ని బాగా చూసుకున్నారు కాబట్టి’ అని తను  ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పదు. నేను పందెం కాస్తా.” అన్నాడు ప్రవీణ్.

“ఈ మాత్రానికి నేను బాంక్ వదిలి రానక్కరలేదు. ఈ విషయం తెలియగానే సుధాకర్ కి ఫోన్ చేసేదాన్ని. లేకపోతే పృధ్వీకి. వాడైతే విమానం లో వచ్చి అటెండ్ అయ్యేవాడు. కాబట్టి నో మోర్ థాంక్యూస్”   నిర్మొహమాటంగా అనేసింది సుగుణ.

“పోనీలే.  ఆమాట నువ్వు ఎప్పటికీ చెప్పవు. మేమే ఎడ్జస్ట్ అయిపోతాంలే. నువ్వు తయారయి స్నానం చేసి రా.   మనం బయటికి వెళ్ళాలి. నాన్నగారు ఇప్పుడు బాగానే ఉన్నారు కదా?” అన్నాడు అగ్గు.

“ఒక్క ఐదు నిమిషాలు” అంది సుగుణ. 

అగ్గూ, ఐషూ అయటకి వెళ్ళగానే, బెడ్ రూమ్ తలుపులు మూసేసి, భర్తని కౌగిలిలో బంధించింది సుగుణ. “ఐ లవ్ యూ ప్రవీణ్.  నువ్వు లేకుండా నేను బ్రతకలేను.” అంటోంది సుగుణ.

“టూ మినిట్స్ మోర్” బయట్నుంచి అరిచింది ఐశు.   “వీళ్ళు గడుగ్గాయిలే. మొగుడితో కూడా కబుర్లు చెప్పుకోనివ్వరు కదా?” అనుకుని, వెంటనే బాత్ రూమ్ లోకి దూరిపోయింది సుగుణ. ప్రవీణ్ తలుపులు తీసి బయటకి వచ్చి ఐశూ తో ఏదో మాట్లాడాడు.

“మనం సమయానికే అక్కడికి వెళ్ళవచ్చు లే. అమ్మకి చెప్పకు” అంటోంది ఐషు. 

షాపింగ్ కి తయారై వచ్చింది సుగుణ. అగ్గూ కారు తీసి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు. పక్కనే ఐషు.    వెనుక సీట్లో ప్రవీణ్ పడుకుని ఉన్నాడు.  పిల్లలిద్దరి ముందూ, భర్త  తల తన తొడమీద పెట్టుకుని కూర్చోవాలన్నమాట. “భలే ప్లాన్ చేశారే వీళ్ళు?”అనుకుంది సుగుణ.

కానీ కారు షాపింగ్ సెంటర్స్ ని దాటి వికారాబాద్ రూట్ లో వెడుతున్నట్టు గమనించింది.

ఐషూ వెనక్కి తిరిగి, “మమ్మీ. ఇది మీ వివాహం అయిన రోజు అన్నమాట. దీన్ని మేమే సెలెబ్రేట్ చేస్తున్నాం. మా స్కాలర్షిప్ ఎమౌంట్స్ ఈ వీక్ లోనే వచ్చాయి. దాంతో సెలెబ్రేట్ చేస్తున్నాం. ముందు మీ మేరేజ్ అన్నదే లేకపొతే, మేమెక్కడ? మా పుట్టినరోజు లు ఎక్కడ? మా ఈ ప్రోగ్రెస్ ఎక్కడ? నేనూ, అగ్గూ మనకోసం అనంతగిరి వద్ద TDC కాటేజ్   బుక్ చేశాం. రేపు మధ్యాహ్నం వరకూ అక్కడే ఉంటాం. మొత్తం ఖర్చంతా, నేనూ అగ్గూ కలిసి పెట్టుకుంటాం.    ప్లీజ్ డోంట్ సే నో.  డాడీ O K అన్నారు కూడా” అంది. 

అగస్త్య అందుకున్నాడు.   “వచ్చే నెలలో నేను కాంపస్ రిక్రూట్ మెంట్ లో మంచి జాబ్ సంపాదించలేకపోతే, కాలిఫోర్నియా లో ఎమ్ ఎస్ చదువుతాను మమ్మీ. ఈవాళే అడ్మిషన్ లెటర్ వచ్చింది. వీసా స్లాట్ కి కూడా అప్లై చేశాను. నీ ’బడ్జెట్ అప్ సెట్స్’ అన్నీ నా జాబ్  లోంచి వడ్దీతో సహా తీర్చేస్తానులే”

ఐషు చెప్పింది. “ఇంకో మూడు నెలల్లో నా హౌస్ సర్జన్సీ కూడా స్టార్ట్ అవుతుంది అమ్మా. అప్పటినుంచీ,  నా స్టైపెండ్ కూడా నీ జీతం లో కలిపేసుకో.  అందువల్ల నువ్వు శాంక్షన్ చేసే నా పోకెట్  మనీ తగ్గుతుంది”

మళ్ళీ అగస్త్య అందుకున్నాడు.  “ఏది ఏమైనా  వచ్చే ఫైనాన్షియల్ యియర్ నుంచీ,  నువ్వు మా ఇద్దరినీ మైంటైన్ చెయ్యనక్కరలేదు.   ను ఉద్యోగం లోనో, లేకపోతే హైయ్యర్ స్టడీస్ లోనో ఉంటాను. అక్క పోకెట్ మనీ కూడా అవసరమైతే నేనే ఇస్తాను. వీసా కోసం నాపేర డిపాజిట్ గా పెట్టే మొత్తంలోంచి, ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టను. నా ఆలోచనలు నాకున్నాయి.”

నోరెళ్ళ బెట్టడం సుగుణ వంతు అయ్యింది! ప్రవీణ్, అగ్గూ, ఐశూ లు నవ్వుతున్నారు.

“మీ బాంక్  కి వచ్చి, మీ మేనేజర్ తో ఈ ప్రొగ్రాం చెప్పి, నీతో మాత్రం చెప్పద్దనీ, ఇది సర్ప్రైజ్ అనీ అన్నాను.    అందుకే నువ్వొచ్చేసరికి మేనేజర్ గారు అలా రెస్పాండ్ అయ్యారు. ఆయన రేపు వస్తారులే.” అన్నాడు అగ్గూ.

“మరలాంటప్పుడు డా.సుధాకర్?” అడిగింది సుగుణ.

“అది కూడా ప్లాన్ లో భాగమే! మీ పెళ్ళిరోజు అంటే లెక్కలు చూస్తున్నావని, సుధాకర్ అంకుల్ కి చెప్పాం. మేమే, మా పాకెట్ మనీల తోనూ, మా సేవింగ్స్ తోనూ..ఈ పార్టీ ఇస్తామని చెప్పాం. సుధాకర్ అంకులూ, మేమూ కలిసే ఈ ప్లాన్ వేశాం. 

రేపు మనం ఇంటికొచ్చేసరికి, సుధాకర్ అంకుల్ అన్నీ చేసేస్తారు.  ఆంటీ, పిల్లలూ కూడా వస్తారు. అలా ఆశ్చర్య పోకు. మీ బాంక్ స్టాఫ్ కూడా వస్తారు. అలాగే డాడీ ఆఫీస్ వాళ్ళు కూడా.  మహా అయితే రేపటికి పృధ్వీ మావయ్యా, అమ్మమ్మా,తాతా, మనవలూ, మామ్మా, తాతా కూడా రావచ్చు.    బట్ డోంట్ వర్రీ. వుయ్ కెన్ మేనేజ్” అన్నాడు అగస్త్య.

సుగుణ ఆలోచిస్తొంది!

“పెళ్ళిరోజు సెలెబ్రేట్ చేసుకోడానికి, బడ్జెట్ లేదూ అని అన్నందుకు, పిల్లలు ఇలా చేశారన్నమాట.    బాంక్ జాబ్ కాదు కానీ, అన్నిటికీ బడ్జెట్సూ, ప్రావిజన్సూ, ప్రాఫిట్సూ...ఇలాగే ఆలోచిస్తోంది తను.   ఛ! ఈ మధ్య కాలంలో డబ్బువిషయాల్లో ఎంత స్ట్రిక్ట్ గా తాయారైంది తను! తను ఈ డబ్బంతా సంపాదించేది ఎవరికోసం? మొగుడూ పిల్లల కోసమే కదా? మరి వాళ్ళనే ఏడిపించేస్తే ఏం ప్రయోజనం? ప్రతీ చిన్న విషయానికీ, బడ్జెట్టూ, ప్రోవిజన్సూ...అంటూ వాళ్ళ ఆనందాన్ని పాడుచేస్తూ,  వాళ్ళని విమర్శిస్తూ కూర్చుంటే ఏంలాభం?  వాళ్ళేకదా మమ్మల్ని ఆ తరువాత చూసుకోవలసింది?

పెళ్ళిరోజు అంటే,  మేమిద్దరం ఒక్కటయ్యిన రోజు కదా! ఇంకో తరానికి కూడా జన్మనిచ్చాం కదా? ఆ తరం వాళ్ళు కూడా, ఇంకో అయిదారేళ్ళలో ఇంకో తరానికి నాంది పలుకుతారు కదా?  పిల్లల్ని అతి గారాబం చేయనక్కరలేదు గానీ, అతి క్రమశిక్షణ కూడా అక్కరలేదేమో? నిజమే. దీన్ని ఘనంగానే పాటించాలి.” పూర్తిగా మారిపోయింది సుగుణ.

“మీ పోకెట్ మనీలు ఏమీ ఖర్చు పెట్టక్కరలేదు. దీనికయ్యే ఖర్చు నేనే భరిస్తాను.” అంది సుగుణ.

“బాబోయ్. మాకు అలాంటి షాకులిచ్చెయ్యకు మమ్మీ! మేం నిజంగానే హాస్పిటల్ లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ప్లీజ్! నువ్వు ఎప్పటి అమ్మలాగే ఉండు. మంచి అమ్మలా వద్దు”  ఏడ్చినంత పనిచేసింది ఐషు.

“మమ్మీ దిస్ ఈజ్ ఎ లాస్ ప్రొపోజిషన్. నాట్ ఎ ప్రొడక్టివ్ వెంచర్. డోంట్ ఫైనాన్స్ దిస్.”అన్నాడు అగస్త్య.

పిల్లలూ, మొగుడూ కూడా తనని ఆట పట్టిస్తున్నారని గమనించింది సుగుణ. “ఏది ఏమైనా సరే. ఈ ఖర్చు నాదే” అంది.

“ఆఖరికి ఇలా జరగచ్చని కూడా అనుకున్నాములే! అందుకే నీకు డా. సుధాకర్ పెద్ద మొత్తం లోనే బిల్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు.” అంది ఐశ్వర్య.

“అయితే మా వాళ్ళకీ, మీ వాళ్ళకీ కూడా అయ్యే దారి ఖర్చులు కూడా ఇందులోనే కలిపేసుకో సుగుణా డియర్” అన్నాడు ప్రవీణ్. తను సీట్లో ఎప్పుడు లేచి కూర్చున్నాడో గమనించనేలేదు!

“మహా అయితే ఐషూ క్లాస్ మేట్సూ, అగ్గూ క్లాస్ మేట్సూ కూడా వస్తారు. ఓ వందమంది కి ప్లాన్ చేసుకో డియర్. నువ్వు మాత్రం హాపీ గా ఉండు! సుధాకర్ కి ఆ బిల్ ఎల్లుండి ఇమ్మని చెబుతాను” బుద్ధిగా చేతులు కట్టుకుని అన్నాడు ప్రవీణ్.   

యధాప్రకారం పిల్లలిద్దరూ తనని  ఆటపట్టిస్తుంటే, భర్తని ఆనుకుని, ముసిముసిగా నవ్వుకుంటోంది సుగుణ.

****

bottom of page