
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కథా మధురాలు
టీకా - తాత్పర్యం
జయంతి ప్రకాశ శర్మ

నరసయ్యగారి నుంచి ఫోన్.. నాలుగు రింగులు అయిన తర్వాత, వెళ్ళి వీధి తలుపు తీసాను. ఈ మధ్యకాలంలో డోర్ బెల్లు పని చేయకపోవడంతో, నరసయ్యగారు గుమ్మం ముందు నిలబడి ఫోన్ రింగు చేస్తున్నారు. మా ఇద్దరికి ఓ ఒడంబడిక అది.
"అదేమిటి.. మీ ఫోన్లో కరోనా కథ రాలేదు?" అంటూ లోపల కొచ్చి ఆశ్చర్యం నటిస్తూ అన్నారు.
"అదేమో.. నాకేం తెలుసు? కరోనా తగ్గిందిగా, బహుశ ఆ సుత్తిముక్తావళిని తీసేసుంటారు!" నవ్వుతూ అన్నాను.
"అదా సంగతి!! తడుముకోకుండా చెప్పేస్తారు! అవునుగాని .. మీరేమిటి అలా సర్వస్వతంత్రంగా తిరుగుతున్నారు?" అంటూ వంటింట్లోకి ఓ చూపు విసిరారు. ఆ చూపుకి అర్ధం. ఓ గుక్కెడు కాఫీ కావాలని!
"ఇది మరీ బావుంది.. మా ఇంట్లో స్వతంత్రంగా తిరగడం కూడా వెటకారమా? ఒక మాట నిజమేలెండి. ఈ కొంపలో మా కంటే మీకే స్వాతంత్రం ఎక్కువగా ఉంటుంది!” అంటూ మా ఆవిడ తీసుకొచ్చిన కాఫీకప్పు ఆయనొకటి అందించాను.
"పోనీ, ‘ఊరక రారు మహాత్ములు.’ అంటూ దీర్ఘాలు తీస్తూ మీ మాట కూడా వినబడలేదే!"
"మా కొంప మయసభ కాదు, నేను దుర్యోధనుడ్ని కాను! అయినా మీరు చల్లకొచ్చి ముంత దాచే రకం కాదు కదా... నేఁనడక్కపోయినా సరే మీరే చెప్తారని నమ్మకం!"
"చెప్పక చస్తామా!! ఇంతా కష్టపడి చెపుతామా, ‘ఓస్ ఇందులో ఏఁవుందంటూ..’ అడుక్కోగానే ఉచితంగా ఓ సలహా పారేస్తారు.."
"కాదు కాదు.. నేను ఇస్తాను, మీరు పారేస్తారు! అంతేగా"
నా మాటలో శ్లేష ఆయనకు అర్ధమై, భళ్లున నవ్వారు. ఎందుకంటే ఆయన దగ్గర అప్పటికే ఓ పది సలహాలు, మరో డజను సొంత ఆలోచనలు ఉంటాయి.
"మీరు వేసే పంచ్ డైలాగులతో వచ్చిన పని మర్చిపోతాం అనుకోండి! ఇలాగే ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా. సమస్య చెప్పుకోడానికి వచ్చిన కామ్రేడ్స్ సమస్యల్ని హైజాక్ చేసి, అప్పడు కూడా బాగానే కాలక్షేపం చేసేసారు లెండి!" నాటక ఫక్కీలో అన్నారు.
అలాంటి మాటలు వినడం నాకు అలవాటే! అవి నాలిక మీద నుంచి వస్తాయి గాని గుండెల్లోంచి వచ్చే మాటలు కావు!
"సరే. ఇప్పుడలా కాలక్షేపం చేయడానికి మాకు కుదరదుగా. మీరు మా నాయకుడు కదా!" అంటూ, కూర్చున్నవాడ్ని లేచి నుంచుని, వంగి, చేతులు జోడించాను నాటక ఫక్కీలో .. నేను కూడా!!
ఇద్దరం ఓ బ్యాంకులో పని చేసో, చేస్తున్నట్లు నటించో.. రిటైరయ్యి ఒకే ఊర్లో ఉంటున్నాం. రోజూ కలుసుకునే శాల్తీలమే! అప్పట్లో నేను ఉద్యోగులకు నాయకుడ్ని అయితే, ఆయన ఇప్పుడు మా పెన్షనర్ల నాయకుడు!!
"ఆ వెటకారాలతోనే, తెల్లారితే మమ్మల్ని రోడ్డు మధ్యలో నిలబెట్టి, పరువు తీసేస్తారు! ఇంతకీ అసలు విషయం ఏమిటంటే... ఆ మధ్య మా మేనల్లుడికి సంబంధం కుదిరిందని చెప్పాను కదా, నిన్న ఆ పెళ్ళికూతురు తండ్రి మాట్లాడాడు. ఆ విషయం మీకు చెబుదామనుకున్నా... కాని తర్వాత మీరు వేసే యక్షప్రశ్నలకి జవాబులు చెప్పడం నా వల్ల కాదని, ఆ మాటలు రికార్డు చేసాను ! విని ఓ సలహా పడెయ్యండి" అంటూ ఫోన్లో రికార్డ్ చేసిన సంభాషణ వినిపించారు.
ఇలాంటి జిమ్మిక్కులు ఆయన దగ్గర కోకొల్లలు!
***
"హల్లో.. నరసయ్య గారు, నేను అంతర్వేదిని, రామతీర్థం నుండి మాట్లాడుతున్నా.!"
"రామతీర్థమా?"
"అయ్యయ్యో. కరోనా దెబ్బతో అటు ఇటు అయ్యింది సార్, నేను రామతీర్థాన్ని, అంతర్వేది నుంచి మాట్లాడుతున్నా."
"ఓహో మీరా. రామతీర్థం అంటే హడలి చచ్చానండి, అసలే రోజులు బాలేవు!"
"భలే వారే.. అమ్మాయికి అబ్బాయి నచ్చాడు, ఆ విషయాలే మాట్లాడదామని ఫోను చేసాను!"
"అలాగా. చాలా సంతోషం! మా బావగారు లేరు కదా, మా మేనల్లుడు పెళ్ళి బాధ్యత మా అక్క నాకప్పగించింది. కుర్రవెధవలకి సంబంధాలు కుదిరి చావడం లేదు కదా! ఆ మధ్యో సంబంధం చూసాం. ఆ అమ్మాయిని చూడ్డానికి మా మేనల్లుడుతో మేం కూడా వెళ్ళాం. ‘అబ్బాయి బాగున్నాడు, జాతకాలు నప్పాయి. అబ్బాయి ఉద్యోగం గట్రా కూడా బాగున్నాయి. అత్తగారు కూడా సౌమ్యంగా ఉన్నారు, అన్నివిధాల మాకు సంబంధం నచ్చింది గాని, అమ్మాయి కొంచెం ఇబ్బంది పడుతున్నది’ అని ఫోను చేసి చెప్పారు.”
“ఏమిట్టా ఇబ్బంది?”
“అబ్బాయి మేనమామకి బట్టతల ఉందీ, మేనల్లుడికి ఆ పోలిక వచ్చి, నాలుగు పదులు దాటకుండానే, క్షురకర్మ అవసరం లేకుండా ఉండే అవకాశం ఉంది, నాకొద్దు.. అని అమ్మాయి తెగేసి చెప్పిసిందిట. రోజులు అలా ఉన్నాయి! అలాంటి వార్త ఎక్కడ వినవలసి వస్తుందో అని, హడలి చస్తుంటే, మీరు శుభవార్త చెప్పారు. సరే. మిగతా లాంచనాలు, గట్రా విషయాలు ఎప్పుడు మాట్లాడుకుందాం?"
"లాంఛనాల సంగతి తర్వాత మాట్లాడుకుందాం, నరసయ్య గారు ! ముందు పెళ్ళి ఏర్పాట్లు చూసుకోవాలి కదా. దానికి తోడు లాక్ డవును తొమ్మిదిలో ఉన్నాం! ఇప్పుడు బానే ఉంది గాని, ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం కదా! ఎందుకైనా మంచిదని, ముందుగా పెళ్లికి రావడానికి ఓ ఏభై మందికి పర్మిషన్ తీసుకున్నాం. ఎలాగూ కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలి కదా. తప్పదు!"
"అంటే…"
"ఏం లేదు సార్. పెళ్లికొచ్చే మీ మగపెళ్లి వాళ్లందరూ పదహారు రోజులు ముందుగా వచ్చి, మా ఊర్లో క్వారంటైన్లో ఉండాలి. పద్నాలుగో రోజు ఉదయాన్నే అందరూ కోవిడ్ టెస్టు చేయించుకుని, పదిహేనో రోజు టెస్టు రిజల్స్ లో నెగిటివ్ వచ్చిన వాళ్లందరూ కళ్యాణ మండపానికి వస్తే చాలు. అక్కడ్నుంచి మేం చూసుకుంటాం! అన్నట్లు.. పెళ్ళికి వచ్చే వాళ్లల్లో ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే, వారిని ఇద్దరి కింద లెఖ్కెయ్యండి. లేకపోతే పోలీసులతో గొడవ పడలేం!"
"కానీ… పదిహేను రోజులు మీకు అదనంగా ఖర్చులు కదా సార్…."
"అబ్బే.. పెళ్లి రోజు, అర్ధరాత్రి ముహూర్తం కనుక ఆ మర్నాడు ఓ పూట. ఖర్చులు ఆడపెళ్ళివారు పెట్టడం మన సాంప్రదాయం కదా! ఆ మూడు పూటల ఖర్చు మాది. మిగతా రోజుల ఖర్చులన్నీ మీవే కదా సార్!"
"...."
"నరసయ్య గారూ, వింటున్నారా! మగపెళ్ళి వారందరికి సాంప్రదాయ బట్టలు బదులు పి.పి.ఈ. బట్టలు పెడతాం. అవి వేసుకుని పెళ్ళి మండపంలో అయిదడుగుల దూరాల్లో కూర్చోవాలి… పెళ్ళి కూతురు, పెళ్లి కొడుకు కూడా!"
"అయ్యా.. అలా కూర్చుంటే, పెళ్ళి కొడుకు పుస్తే ఎలా కడతాడు?"
"భలే వారే. మేం విజయనగర ప్రభువులం కదా, కత్తికి కట్టిస్తే సరిపోతుంది! "
"తర్వాతా. "
"తర్వాతేముంది సార్. ఆ తతంగం అయిన తర్వాత మేం మీ ఊరు రావాలి కదా. వ్రతం, కార్యం అక్కడే చెయ్యాలి! మీకో రూలు, మాకో రూలు లేకుండా, పెళ్ళి మర్నాడే.. మీ ఊరు వచ్చే వాళ్ళందరం వచ్చి, మేం కూడా పద్నాలుగు రోజులు హోమ్ క్వారంటైన్లో ఉంటాం. తర్వాత కోవిడ్ టెస్టు చేయించుకుని మీ ఇంట్లో గృహప్రవేశం చేస్తాం!"
"పద్నాలుగు రోజులు…"
"పెళ్లయిన తర్వాత మనందరం ఒకటే కదా ! రెండు పూటల కాఫీలు, టిఫిన్లు, భోజనాలు మేఁవుండే విడిదికి పంపితే చాలు! మా పాట్లు మేం పడతాం! అయినా అతిథి సత్కారాలు చేయడానికి, ఆ మాత్రం అవకాశం మీకూ ఇవ్వాలి కదా, అదన్నమాట! ఆ తర్వాత, శోభనం ముహూర్తాన్ని జూమ్ కాల్లో కానిద్దాం! ఈలోగా తుమ్మినా, దగ్గినా కొంచెం క్వారంటైన్ పెంచుకుందాం!”
"అమ్మాయిని కాపురానికి….!"
"అదే చెప్పబోతున్నాను! అలా మూడు నిద్దర్లు జూమ్ కాల్లో అయిందనిపించి, మేం అమ్మాయిని తీసుకుని మా ఊరు వెళ్లిపోతాం! టీకాలు వచ్చి, అమ్మాయి అబ్బాయిల వంతు వచ్చీ, వాళ్ళు తీసుకున్న తర్వాత, తర్వాత సంగతులు, తాత్పర్యాలు మాట్లాడుకుందాం! ఉంటాను!"
***
"ఇదండీ సంగతి. ఇప్పుడు చెప్పండి ఏం చేయమంటారు? మీకేమైనా అర్ధమయిందా?" నరసయ్యగారు అందోళనగా అడిగారు.
"అదేమిటి. ఆ టీకా తాత్పర్యం మీకు అర్ధం కాలేదా!" నవ్వుతూ అన్నాను.
"అర్ధమయితే మీ దగ్గరకి ఎందుకు వస్తాను!! ఇంతకీ ఏం చెయ్యమంటారు?" అంటూ బేలగా అడిగారు.
"మరో టీకా చూసుకోండి!" నవ్వుతూ అన్నాను.
తాత్పర్యం అర్ధమయినట్టు నరసయ్యగారు ఫక్కున నవ్వారు!!
*****