MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
తెలుగు సాహిత్యంలో స్త్రీపాత్ర స్వాభావిక మరియు సామాజిక పరిణామక్రమం.
డా. గౌతమి యెస్. జలగడుగుల
మనిషి ఆలోచన, ప్రవర్తన ఆ మనిషి జీవించే సమాజ వ్యవస్థలోని భౌతిక కారణాలమీద ఆధారపడివుంటుంది. ఈ భౌతిక కారణాలు మారినప్పుడే ఆ మనిషి ఆలోచనా మారుతుంది. మెల్లగా వ్యవస్థ కూడా మారుతుంది. కానీ ఆ వ్యవస్థ ఆ మార్పుకు సిద్ధంగా ఉన్నప్పుడే మార్పు సంభవిస్తుంది. ప్రాచీనకాలం నుండీ నేటి వరకూ పోలిస్తే స్త్రీ అప్పటినుండీ ఒక తల్లిగా, సోదరిగా, ఇల్లాలిగా శక్తివంతమైన పాత్రలను పోషిస్తూనేవుంది. నేడు అదనంగా పురుషులతో సమానంగా విధ్యార్హతలను పొంది డబ్బు సంపాదన ప్రక్రియలో పురుషునికి చేదోడు వాదోడుగా ఉంటున్నది. ప్రాచీన గ్రంధాలు రామాయణం, మహాభారతం, విరాటపర్వం మొదలైన వాటిలో వివిధ స్త్రీ పాత్రల స్వభావాలను చూస్తే నాడు చుట్టూవున్న సామాజిక పరిస్థితులకు పురాణ స్త్రీ కూడా నేటి స్త్రీలాగే జీవన పోరాటం సల్పింది, కొన్ని ఉదాహరణలు చూద్దాం-
సీతమ్మ: తండ్రి ఇంట్లో రాజ్యభోగాలనుభవించిన సీత, తృటిలో వాటిని త్యజించి రాముని వెంట అడవులకు వెళ్ళిపోయింది. ఇది రామునియందు సీతకున్న ప్రేమ, అచంచలమైన భక్తి విశ్వాసాలు. తాను రావణుని చేత అపహరింపబడినప్పుడు కత్తి పట్టుకొని యుద్ధం చెయ్యకపోవచ్చు. కానీ తన ఆత్మవిశ్వాసంతో, మాటలతో రావణుని భయపెట్టిన ధీర సీత. ఈమె ధైర్యమే శ్రీరాముని, అతని సేనని కార్యోన్ముఖుల్ని చేసింది.
ద్రౌపది: ద్రౌపది కూడా కారణజన్మురాలు, రాకుమారి.స్వయంవరాన అర్జునుని చేపట్టింది. అత్తవారింట అడుగుపెడుతూనే కుంతీ ఆదేశం మేరకు పంచపాండవులకు ఇల్లాలై కష్టాలు నెత్తి మీదకు తెచ్చుకున్నది. ధర్మరాజు జూదక్రీడల వ్యసనం వల్ల కౌరవల చేజిక్కి అవమానాల పాలయ్యింది. భర్తల వెంట వనవాసాలకేగింది. అజ్ఞాతవాసంలో సైరంధ్రిగా ఒక రాణి ఇంట పనిచేస్తూ, కీచకుని కామోద్రేకాలకు గురయ్యి పరాభివింపబడింది. మరది కేవలం సైరంధ్రి పాత్రయినప్పటికీ, పట్టుసడలక భీముని కార్యోన్ముఖిడిని చేసి కీచక వధకు పంపి దుష్టశిక్షణ చేసింది. తన సమయస్పూర్తిని, పోరాటపటిమను లోకానికి చాటుకున్నది.
కుంతి: అలాగే కుంతి చిన్నతనంలో ఆకతాయితనంతో దూర్వాసుడు ప్రసాదించిన మంత్రాన్ని దుర్వినియోగపరచి సూర్యుని ద్వారా కర్ణుని కని, అతడు తన కుమారుడే అని చెప్పుకోలేని దుస్థితిని అనుభవించింది. ఆ పాత్ర ప్రపంచానికి ఒక గుణపాఠం.
ఇలా ప్రాచీన సాహిత్యంలోని పురాణ స్త్రీపాత్రల స్వభావాలను పరిగణలోనికి తీసుకుంటే కాలాలతో, ఆచార వ్యవహారాలతో సంబంధం లేకుండా వాటిని చిరస్థాయిగా ఒక ఆదర్శంగానో, గుణపాఠంగానో గుర్తుంచుకోవలసిందే.
మధ్యకాలం వచ్చేసరికి భారతజాతి మూఢనమ్మకాలతో అజ్ఞానంతో అలమటిస్తూవుండేది. విద్య నేర్చే అవకాశం స్త్రీకి లేదు. అంతేకాకుండా బాల్యవివాహాలు, కన్యాశుల్కం కారణాలవల్ల బాలికలు ఈడేరకముందే వైదవ్యం, సతీసహగమనం, వ్యభిచారం మొదలైన దురాచారాలకు గురయ్యారు. సరియన జ్ఞానార్జన లేకపోవడంవల్ల ఆ కాలంలో దయ్యాలు, భూతాలు, భూతవైద్యులు, చేతబడులు, అక్రమ సంపాదన విపరీతంగావుండేది. ఆ పరిస్థితులను చక్కదిద్దడానికి కందుకూరి వీరేశలింగపంతులుగారు, గురజాడగారు తమ రచనలద్వారా, ఉపన్యాసాలద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించారు. 19వ శతాబ్దం వచ్చేసరికి స్త్రీలను ఇతివృత్తాలుగా చేసుకొని చేసిన రచనలే చలం సాహిత్యంలోనూ కనిపిస్తాయి.
కాలం గడుస్తూవుండగా గృహజీవితంలో వుంటూనే ఒక జానపద స్త్రీగా తనని తాను ఆవిష్కరించుకున్నది. ఈవిడ చదువుకోలేదు, శాస్త్ర జ్ఞానం లేదు. శాస్త్ర సాధనా లేదు. అయినా ఈమె పాడింది, కవిత చెప్పింది, ఆమె పాడే పాటల్లోనే ఒక గృహలక్ష్మిగా, అత్తగా, కోడలిగా, స్నేహితురాలిగా తనని తాను సాక్షాత్కరించుకున్నది. అలాగే నాటి పెళ్ళివేడుకల తంతులు ఆవిడ పాడిన నలుగు పాటలు, వధూవరుల పాటలు, అలుక పాటలు, సరసాల పాటల ద్వారానే మనకీ నాడు తెలిసాయి. ఇలా తాను పడుతున్న ప్రతికష్టాన్ని, సంతోషాన్ని, వినోదాన్ని తన జానపద సాహిత్యం ద్వారా తెలియపరిచింది. తరువాత స్త్రీలో కొన్ని వ్యక్తిత్వ మార్పులు వచ్చాయి. బుర్ర కథల ద్వారా ఝాన్సీలక్ష్మీబాయి, నాగమనాయకి వంటి వీరగాధలు, స్త్రీ త్యాగాలను చాటి చెప్పే గాధలకు ప్రభావితమయ్యింది. గృహమునుండి బయటకొచ్చి బుర్రకథా కార్యక్రమాల్లో పాల్గొని ఊరూరా తిరుగుతూ బుర్రకథల్ని చెప్పింది. తన చుట్టూవున్న పరిస్థితులను, పరిసరాలను అర్ధం చేసుకుంటూ విద్య అవసరం లేకుండానే విజ్ఞానవంతురాలయ్యింది.
స్త్రీ 19-20 శతాబ్దాల మధ్యలోనే విద్యను అభ్యసించడం మొదలు పెట్టింది. అణగారిపోయిన పాడు జీవితాన్నంతటినీ బాగుచేసుకోవాలనే ధ్యేయానికొచ్చింది. ఈమెతోపాటుగా ఈమెకు చేయూతనివ్వడానికి మగా మారాడు. తండ్రిగా విద్య నేర్పించాడు. ఈ దశలో స్త్రీకూడా తనవంతు కృషి చేస్తూ, చదువుకొని వివేకవంతురాలయి, ప్రాచీన స్త్రీల పాత్రల ద్వారా స్వాభావికతను అర్ధం చేసుకొని ఆచరిస్తూ పాపభీతినీ, దైవభక్తినీ కలిగివుంది. ఈలోపులనే క్రొత్త దురాచారాలకు సమాజం మళ్ళీ లోనయ్యింది. వరకట్నపు చావులు, ధనాశ, వేశ్యావృతి. వీటన్నిటినుండీ తప్పించుకోవడానికి స్త్రీ పాత్ర మరోరూపు దిద్దుకున్నది, మగాడినీ, సమాజాన్ని ఎదిరించే స్వభావం. ఈ క్రొత్త మార్పుకూడా సాహిత్యంలో చోటు చేసుకున్నది. అదే స్త్రీవాద సాహిత్యం. స్త్రీలు పత్రికలను నడిపారు. 19వ శతాబ్దంలో బాలాంత్రపు శేషమ్మ హిందూసుందరి పత్రికను, పులగుర్తి లక్ష్మీనరసమాంబ సావిత్రి పత్రికను, వింజమూరి వెంకట నరసమ్మ అనసూయ పత్రికను ప్రారంభించారు. అలాగే ఆంధ్ర మహిళా మాసపత్రిక, ఆంధ్ర వనిత, భూమిక, చైతన్యమానవి, మహిళామార్గం, మహిళావిజయం, నారీలోకం ఇలా ఎన్నో మహిళాసరధ్యంలో ముందుకెళ్ళాయి. 20వ శతాబ్దం వచ్చేసరికి స్త్రీలు పత్రికలకు వ్రాయడం మొదలు పెట్టారు.ఇది ఆధునిక స్త్రీ లో వచ్చిన స్వాభావిక, సామాజిక మార్పుకు పరాకాష్ట మరియు తాను ఎదగడానికి, తానూ ఎదిగానూ అని చూపడానికి ఆమె ఉపయోగించుకున్న ఆయుధమే సాహిత్యం-స్త్రీ సాహిత్యం. స్త్రీ కష్టాలను, ఆలోచనలను, అనుభవాలను జగద్విదితం చేయడంలో సాహిత్యానిదే ప్రముఖ పాత్రవుంది. వ్యావహారిక భాషలో ప్రచారంలోకి వచ్చాక స్త్రీలో అభ్యుదయం పెరిగి ఆలోచనాధోరణి పూర్తిగా మారింది. ఆదూరి సత్యవతీదేవి, వేదవతి, యల్లాప్రగడ సీతాకుమారి మొదలైన వారు వైవిధ్యములైన కవితలు వ్రాశారు. స్త్రీ పరిపరివిధాల మేల్కొంది. స్త్రీవాద కవయిత్రులుగా ఓల్గా, జయప్రభ, పాటిబండ్ల, మహెజ్బీన్, షాజహానా మొదలైన కవయిత్రులు ప్రసిద్ధి చెందారు. 20వ శతాబ్దంలో స్త్రీలు నవలలు, కథలు చాలా విస్తృతంగా వ్రాశారు.
ఈ మార్పు మన సినిమా సాహిత్యంలో కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మధ్యకాల సినిమాలైన కన్నాంబ, సావిత్రి సినిమాలు చూస్తే ఒక గృహిణిగా గృహనిర్వహణలో స్త్రీ తానెంతో నేర్పు, ఓర్పును కలిగివుంది. తానెంత సమాజ గౌరవాన్ని పొందివుందీ అన్నది స్పష్టమవుతుంది. అలాగే వాణిశ్రీ, విజయనిర్మల మొదలైనవారి సినిమాలకొచ్చేసరికి అమ్మాయి చదువుకొని, స్వశక్తితో తన కాళ్ళమీద తాను నిలబడి ఉద్యోగం చేసి, ప్రేమించి కోరుకున్న వరుడ్ని కులాంతర వివాహం చేసుకొనే స్థాయికి చేరుకున్నట్లుగా కనిపిస్తుంది. యద్ధనపూడి సులోచనారాణి గడపదాటి ఉద్యోగానికి వెళ్ళే స్త్రీ ఎదుర్కొనే సమస్యలను "సెక్రటరీ" అనే నవలతో మొదలుపెట్టి జనరంజకమైన ప్రేమకథలతో ట్రెండ్ మార్చారు. అలాగే మాలతీ చందూర్, కోడూరి కౌసల్యాదేవి, మాదిరెడ్డి సులోచన మున్నగు నవలారాణులు స్త్రీ సమస్యలను విస్తృతంగా విశ్లేషించారు. ఇవన్నీకూడా ఆయా కాలాల్కనుగుణంగా స్త్రీ పాత్రల స్వభావాలు మారుతూ వస్తున్నాయనీ, ఇంకా మారాలనీ వ్రాస్తూ స్త్రీ కి పూర్తి స్ఫూర్తినిచ్చిన రచనా సాహిత్యం.
అయితే తాను ఏ దశలోనైనా అన్యాయమైపోయినప్పుడు ఆత్మహత్యలకు పాల్పడకుండా అన్యాయాన్ని ఎదిరించి నిలిచోవడానికి స్ఫూర్తినిచ్చే సాహిత్యం రచనారంగంలోనూ, సినిమారంగంలోనూ కూడా చోటు చేసుకున్నాయి. దానికి రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి, ఓల్గా ... మున్నగువారి రచనలు, అలాగే సినిమాలలో విజయశాంతి అభినయించిన కర్తవ్యం, ప్రతిఘటన, ఒసేయ్ రాములమ్మ లాంటి చిత్రాలు ఉదాహరణలు. స్త్రీ సాహిత్యం వివిధ ప్రాంతాలకు చేరేసరికి ఎంతో టైము పట్టేస్తుందని అనుకుంటున్న టైములో అంతర్జాలపరంగా తెలుగు స్క్రిప్టులు వచ్చి, సాహిత్యం నిముషాలలో అంతర్జాలపు తారాపథంలోకి దూసుకుపోయింది. సాహిత్యం అనేది తన గృహజీవిత ము నుండే మొదలయి నేడు మారుతున్న కాలంతో పాటి స్త్రీ తన స్వభావాన్ని మార్చుకుంటూ క్రొత్త విషయాలను తెలుసుకుంటూ, నేర్చుకుంటూ మరో నలుగురికి తన విజ్ఞానాన్ని పంచుతూ ముందుకు వెళ్తోంది. తన సాహిత్యానికి తానే సృష్టికర్త కావడం, స్త్రీజాతికి గర్వకారణం.
ఈ అన్ని కారణాలవలన "స్త్రీ పురుష సమానత్వం” అనేది సమాజంలో వచ్చిన ప్రస్తుత పరిణామం. స్త్రీవాదాన్ని ఆచరణలో పెట్టడానికి ముఖ్యంగా స్త్రీకి ఉండాల్సింది ఆర్ధిక స్వాతంత్రం. కొంతమంది మగవారికి పురుషాధిక్య భావజాలం ఇంకా పోలేదు. అయినా కూడా చాలామంది మగవారు స్త్రీ, పురుష సమానత్వాన్ని స్వాగతించారు. కాబట్టి సమానత్వం అనేది ప్రస్తుత సమాజపు ఒక విలువగా స్థిరపడింది. ఇది ఇలాగే కొనసాగి స్త్రీ మరిన్ని మెట్లు విజయం వైపు వేస్తోందీ అనుకొంటున్న పక్షంలో స్త్రీవాదం క్రొత్త మలుపులు తిరుగుతున్నది. ఒకటి పురుషులందరినీ స్త్రీ వ్యతిరేకులుగా అర్ధం చేసుకొని ఆ విధమైన ప్రచారం సాగించడం, రెండవది ఆధిపత్యం గురించి ప్రయత్నించడం, వీటివలన స్త్రీ, పురుష వర్గాల మధ్య ద్వేషపూరితమైన ఆధిపత్యాల పోరు మొదలై
మళ్లీ సమాజాలు మధ్యయుగాల్లోకి జారిపోయే ప్రమాదం ఉంది.
*****
డా. గౌతమి యెస్. జలగడుగుల అమెరికాలో శాస్త్రవేత్త, ప్రసంగవేత్త, కథాయిత్రి, నవలా రచయిత్రి, కవయిత్రి రేడియో ఆర్టిస్ట్ మరియు షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ రైటర్. పుస్తక ప్రచురణలు: ఔను...వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (కథల సంపుటి), ఎగిసే కెరటం (నవల).
*****