MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కథా మధురాలు
సిమ్ సిటీ
మధు చిత్తర్వు
నగరానికి దూరంగా నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది సిమ్ సిటీ.
భాగ్యనగరానికి వ్యాపారం మీద కానీ, పర్యటన కోసమో కానీ వచ్చే వారందరి కోసం, వారి ఆనందం కోసం దూరంగా కొండలమధ్య చెట్ల మధ్య నిర్మించిన రిసార్ట్.
రోడ్డు మార్గంలో పోవచ్చు.మెట్రో రైలు ఎక్స్టెన్షన్ మార్గంలో సిమ్ సిటీ స్టేషన్ దాకా కూడా పోవచ్చు. గంట ప్రయాణం. ఒక రోజు గడిపి మళ్ళీ రెండో రోజు కు రావచ్చు లేదా అక్కడే ఒక వారం ఉండొచ్చు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఒక వారం ఉండగలరు. ఎందుకంటే అక్కడ ఒక్క రోజు ప్యాకేజీనే రెండు లక్షల ఏభైవేల రూపాయలు!
కానీ అక్కడ వచ్చే థ్రిల్, ఆనందం మరెక్కడా రావు. అసలు రెండు రోజుల ప్యాకేజీ లో జరిగే వింతలు, విలాసాలు చాలు జీవిత కాలం గుర్తు ఉంచుకోవటానికి.
ఎందుకంటే అది ఒక సిమ్ సిటీ!!!సిమ్యులేటెడ్ సిటీ. కృత్రిమంగా నిర్మించిన కొత్త ప్రపంచం. వీడియో గేముల్లో కంప్యూటర్ మాత్రమే చేయగలిగే సాహసాలని ఆ ప్రపంచంలో స్వయంగా చేయవచ్చు. అసాధ్యాలు సాధ్యం చేసే వింతలూ, విశేషాలతో రూపొందించిన నగరం. ఎన్నిసార్లు పేల్చినా గాయాలు చేయకుండా ఉండే బుల్లెట్లు ఉన్న గన్లు, మనం చెప్పినట్లు వినే వివిధ రకాల గుర్రాలు, వాటిని అధిరోహించి వేగంగా లేక నెమ్మదిగా వెళ్ళ గలిగే సదుపాయం, టార్జాన్లు, వనకన్యలు ఇలా వింత వింత విషయాలు ఎన్నో ఉన్నాయి అక్కడ.
ఏ మూల నుంచో హఠాత్తుగా మీ కారుకు అడ్డంగా ఒక పులి రావచ్చు. లేదా ఒక అందమైన యువతి పబ్ లో మీకు కంపెనీ ఇవ్వటం జరగవచ్చు,ఇంకొంచెం ఎక్కువ చార్జ్ ఇస్తే అడవిలోని గెస్ట్ హౌస్ కి మిమ్మల్ని తీసుకెళ్ళి ఊహకందని చిత్ర విచిత్రాలు చూపించవచ్చు. లేదా బలమైన గుర్రం మీద మీరు అడవిలో సన్నని దారుల్లో స్వారీ చేస్తూ కొండల మీద నుంచి వచ్చే బుల్లెట్స్ ని బందిపోటు దొంగలని ఎదుర్కోవచ్చు. యుద్ధం చేసి వారిని చంప వచ్చు. ఇంకా అనుకుంటే సఫారీ జీప్ లో అడవి దారుల మధ్య తుపాకీతో వన్యమృగాల ని మీకై మీరే వేటాడ వచ్చు.
రోజల్లా గడిపాక అద్భుతమైన నాట్యాలు చూస్తూ, సంగీతం వింటూ అతిలోకమైన మదిరా పానం చేసి తన్మయత్వంతో రాత్రి కరిగి పోయేదాకా గడపవచ్చు.
సిమ్ సిటీ 2050 !!! ఇది మిథ్యానగరం కాదు.
నిజంగా కనబడే ఏండ్రాయిడ్ మనుషులు జంతువుల తో నిర్మించిన కల్పిత నగరం. అంతా నిజమే. అంతా నిజమైన అనుభవమే. కానీ ఏదీ నిజం కాదు.
నాలుగో సారి కళాధర్ తన సొంత కారులో ఈ సిమ్ సిటీ కి వస్తున్నాడు.
అంతర్జాతీయ వ్యాపార వేత్త అతను. దేశవిదేశాలు అన్నీ తిరుగుతాడు. భాగ్యనగరానికి ప్రతి ఆరు నెలలకు వస్తాడు. కానీ తీరికలేని అతని హడావిడి జీవితంలో సమయం కేటాయించి ప్రత్యేకంగా సిమ్ సిటీకి మళ్లీ, మళ్లీ నాలుగోసారి రావటానికి ఒకటే కారణం.
కరిష్మా!
నీలి రంగు కళ్ళు, బంగారు రంగు జుట్టు, దృఢమైన శరీరం, ఎర్రని పెదాలు చిరునవ్వుతో మాటలు.
"నీ కోసమే పుట్టాను, పెరిగాను, నీతోనే ఉంటాను" అని చెప్పకనే చెప్పే ఊసులేవో ఆమె కదలికల్లో, కనుచూపుల్లో, మాటల్లోనూ తొణికిసలాడుతూంటాయి. అతను ఆమెను చూడకుండా ఉండలేక పోతున్నాడు.
శారీరక ఆకర్షణ కన్నా మరేదో అతి బలమైన ఆకర్షణాశక్తి ఏదో అతన్ని రోజూ అక్కడికి తీసుకు వస్తోంది. ఆ బలీయమైన ఆకర్షణ నుంచి కళాధర్ బయటపడలేకున్నాడు.
ప్రేమ. అది మనిషిని పూర్తిగా వశపరచుకుని తన చుట్టూ జీవితాంతం తిప్పుకోగలదు!
***
పచ్చటి అడవి దారులలో ఎర్ర మట్టికొండలు సరస్సుల మధ్య దూరం గా తెల్ల గోడల భవనంలో నాలుగో అంతస్తులో కంట్రోల్ రూమ్ లో కూర్చుని వాళ్ళిద్దరూ మానిటర్ లన్నీ పరిశీలిస్తున్నారు.
"ఈ విజిటర్ నాలుగోసారి వస్తున్నాడు"
"గుడ్! ప్రొఫైలింగ్ చేసావా?"
"కరిష్మా కోసమే. ఎప్పుడూ ఆమె కోసమే అడుగుతాడు. ఇప్పటికి నాలుగు సార్లు అయింది."
"గుడ్!ఇంకా మిగిలిన వాళ్ళు? మొత్తం నిన్న విజిటర్స్ ఎంతమంది?"
"సుమారు 75 మంది. అందరూ కావల్సినంత డబ్బు వెదజల్లగలిగే సంపన్నులే"
"వెరీ గుడ్. వాళ్ళేగా మనకి కావాలిసింది."
ఆ మాట్లాడుకునే ఇద్దరిలోనూ ఒకడు గిరజాల జుట్టు తో ముప్పై ఐదేళ్ళ వయసు ఉన్నవాడు, జీన్స్ లో లో టీ షర్టు లో కంప్యూటర్ గీక్ లా ఉన్నాడు.
మరొకడు యాభై ఏళ్ళ పైబడి కొంచెం అప్పుడే పల్చబడుతున్న నెరసిన జుట్టూ, మధ్య వయసులో వచ్చే బొజ్జ తో ,ఈ-సిగరెట్ వ్యాపింగ్ చేస్తూ కూర్చున్నాడు.
గ్రౌండ్ ఫ్లోర్ లో సెక్యూరిటీ వాళ్లు ఉంటారు. మొదటి మూడు అంతస్తులలో రోబోటిక్స్ లేబరేటరీలు ఉంటాయి. ఆ అంతస్థులలో ఒక్కొక్క హాలులో కనీసం నలుగురు ప్రోగ్రామర్లు రోబోట్లు అనే మరబొమ్మల కి డ్రెస్సులు, వారి పాత్రలకు తగిన సంభాషణలు, తెలివితేటలు కృత్రిమ మేధ ఏ రోజుకు ఆ రోజు ప్రోగ్రాం చేస్తూ ఉంటారు .
కొందరికి బందిపోటు పోటు దొంగల ఆహార్యం. కొందరికి బార్లలో డ్రింక్స్ ఇచ్చే వారిలా వేషం. కొందరు యువతీయువకులు కేవలం కంపెనీ ఇచ్చేందుకే తయారు. సహజంగా కనిపించే సౌందర్యం అయినప్పటికీ సృష్టిలో కనబడనంత ఆకర్షణీయమైన అందం తో ఆ మనుషులని వివిధ రకాలుగా తయారు చేస్తారు .
పెద్ద, పెద్ద యాంత్రిక రోబోట్లు ఆ మర మనుషుల తలలలో సూదుల లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు గుచ్చి వాటి ద్వారా సాఫ్ట్వేర్ ని అప్లోడ్ చేస్తాయి. ఏ రోజుకారోజు కొత్త ప్రోగ్రాం. మళ్లీ వాటికి ఆ జ్ఞాపకశక్తి లేకుండా మెమరీ సాయంత్రానికల్లా చెరిపి వేస్తారు.
అలాగని మర మనుషులు కాదు, రోబోట్లు కాదు. ఎఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదుగా అంచెలంచెలుగా జరిగిన అభివృద్ధిలో భాగంగా సాధ్యమైన అధునాతన టెక్నాలజీతో రూపొందించిన వారు -నిజం మనుషులు, వ్యక్తులు, రక్తమాంసాలతో కండరాలతో భావాలతో నడిచే పాత్రలు!
ఒక్కొక్కరి కి ఒక్కొక్క కథ! ఒక్కొక్క పాత్ర ! వచ్చిన కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా మాట్లాడటం, కోరినట్టు గడపటం, వారితో యుద్ధం చేసి ఓడిపోయే దొంగలు లాగానేమి, వస్తాదులు లాగానేమి, భాష తెలీని టార్జానులాగా, ఏదీ కాకపోతే ఉత్తినే కూర్చుని కంపెనీ ఇవ్వడానికి లేదా స్నేహం చేయడానికి చదరంగం లేక టెన్నిస్ లాంటి ఆటలు ఆడటానికి వాళ్ళందరూ తయారు చేయబడతారు. ఇది మిథ్యా బింబాలు తయారు చేయడం కాదు. వర్చ్యువల్ వరల్డ్ కాదు ఇది సిమ్యులేటెడ్ అంటే కృత్రిమ వ్యక్తుల ప్రపంచం!
సిమ్ సిటీ ఇన్కార్పొరేటెడ్ ప్రపంచ బహుళజాతి సంస్థకి బిలియన్ల డాలర్ల ఆదాయం ఇచ్చే వ్యాపారం!
అవును ఇది ఒక వ్యాపారం మాత్రమే. మనసులతో ఆడుకుంటూ మనుషులు వారి ప్రవృత్తిలో దాచుకున్న విపరీత ధోరణులని వారికి తోచినట్టు తృప్తి పరిచి డబ్బు సంపాదించే బిజినెస్.
మీరు చంపవచ్చు. కానీ చంపబడలేరు.
ఆ మరమనుషులు మాత్రం మీరు చంపితే నిజంగా నేల మీద పడి గిలగిలా కొట్టుకుని నిజం రక్తం కారుస్తారు. మీరు వారిని చిత్రవధ చేయవచ్చు లేదా కొరడాలతో ఆడవారిని, మగ మనుషులని కొట్టవచ్చు. ఇలాంటి అన్ని ప్రకోపాలని, మృగయావినోదాలని కూడా నిస్సంకోచంగా సాధించుకోవచ్చు. ఇప్పటికి అర్థం అయ్యే ఉంటుంది. ఇది 2050 లోని కొత్త ప్రగతి.
కొత్త వికృతి కూడా!
***
కళాధర్ కారు పార్కింగ్ లో పెట్టి టికెట్ కౌంటర్ దగ్గర ఐడి కార్డ్ చూపించి ఎంట్రీ పాస్ ఎలక్ట్రానిక్ గా తీసుకున్నాడు ఫోన్ లోనే. అతనిని మరొక బ్యాటరీ కారులో సిమ్ సిటీ లోకి తీసుకువెళ్ళారు. ముందుగా స్పెషల్ డ్రెస్సింగ్ రూమ్ లోకి తీసుకువెళ్ళారు. ఎప్పటిలాగే.
అక్కడ ఓ అందమైన యువతి కావాల్సిన డ్రెస్సులు ఇస్తుంది. ఇది సిమ్ సిటీలో గడపటానికి "అవతార్" అన్నమాట. ఫ్యాన్సీ టోపీలు, బ్లూ జీన్స్, గన్ లూ కత్తులూ, కొరడాలు, సిగరెట్లు, పైపులూ, బైక్ లూ ఏవి కావాలంటే అవి.
"మీకు సహచరి కావాలా ?"
అదే ప్రశ్న అదే జవాబు.
"కరిష్మా కావాలి."
ఆమె చిరునవ్వు నవ్వి "షూర్!" అంది.
"కరిష్మా బిజీ అనుకుంటాను. సరిగ్గా కరిష్మా లాగే నలుగురు ఉన్నారు. చూడండి. హోలోగ్రామ్ రూపంలో ఒకదాని వెంబడి ఒకటి స్త్రీ రూపాలు. నజీమా,మార్గరెట్, మేనక ఇంకా అందరి కంటే సూపర్ గర్ల్ రోజీ.
"నో! నో!నాకు కరిష్మా నే కావాలి. మీరు ఎంత డబ్బు తీసుకున్నా సరే!"
"సారీ సర్, ఆమె కావాలంటే ఫోర్ ఎక్స్ కట్టాలి."
అంటే మామూలు రేటుకు నాలుగు రెట్లు!
ఒకసారి తన బెల్ట్ కి బిగించిన స్మార్ట్ ఫోన్ తీసి చూసి ఏవో అంకెలను నొక్కి అన్నాడు.
"డబ్బు ఇవ్వటానికి సమస్య లేదు. కానీ మీ నిబంధనలలో డిమాండ్ బట్టి రేటు అని ఎక్కడా లేదు. ఇది కస్టమర్ కి అన్యాయం.నాకు అన్యాయం జరిగిందేమో తర్వాత కన్జ్యూమర్ కోర్టులో చూడవచ్చు. ఇప్పటికీ డబ్బు తీసుకోండి."
కంగార్ పడింది ఆమె. ఫోన్ చేసి బహుశా తన పై అధికారి తో మాట్లాడింది.
"ఓకే సర్. మీరు కస్టమర్ కాబట్టి టూ ఎక్స్ కే ఇవ్వమని చెప్పారు."
దూరాన కంట్రోల్ రూమ్ లో వున్న ఇద్దరూ ఆ దృశ్యం చూస్తూ, కళాధర్ ఫోటోని అతని ప్రత్యేక నంబర్ ని వారి కంప్యూటర్ లో ఫీడ్ చేశారు.
"అతనిని కనిపెట్టి ఉండండి!"
***
కళాధర్ డ్రస్ మార్చుకుని జీన్స్,షర్ట్ లో , హాట్ లో, బెల్ట్ కి తగిలించిన గన్ తో, అక్కడి బార్లో ఒక బీర్ తాగి బయటకు వచ్చి రోడ్డుమీద నడవసాగాడు.
అప్పుడు ఉదయం 9 గంటలు అయింది. దూరాన కొండలూ, చెట్లూ, వాటి మధ్య రోడ్డు పక్కన ఉన్న ఒక ఇంట్లో నుంచి బయటికి వచ్చింది కరిష్మా.
ఆమె కూడా జీన్స్ ధరించి, గళ్ళ డిజైన్ వేసిన షర్టు తో జుట్టు విరబోసుకుని స్మార్ట్ గా నడుస్తూ వస్తోంది.
త్రిలోక సుందరి లా ఉంది!
"హాయ్ కళాధర్!"
"హాయ్ కరిష్మా!"
"మీకేం కావాలో చెప్పండి!"
అతనికి కాసేపు నిరాశ కలిగింది. ఏ రోజుకారోజు ఆమెను కొత్తగా ప్రోగ్రాం చేస్తారు. తన పేరు, ప్రొఫైల్ తప్ప ఆమె ఏమీ గుర్తు ఉండనివ్వరు. ఇప్పటికే నాలుగైదు సార్లు తామిద్దరూ కలిసి, తిరిగారు, దగ్గరయ్యారు. అతను ఆకర్షణలో పడిపోయాడు. చూడకుండా ఉండలేక పోయాడు. కానీ ఆమెకి మాత్రం ఏమీ గుర్తు లేదు.
"కళాధర్! ఇవాళ ఏమి చేద్దాం?" చిరునవ్వుతో అడిగింది.
"కరిష్మా!మనం మాట్లాడినవన్నీ గుర్తులేదా?"
ఆమె నీలి కళ్ళలో ఒక్క క్షణం నీటి మేఘపు పొర కమ్మింది.
అతనికి నిర్ధారణ కాలేదు ఆమె ఏమనుకుందో.
"మనం ఏదైనా తిందాం. నీకు చీజ్ బర్గర్ ఇష్టం కదా!"
"నీకైతే డోనట్స్, రోజ్ మిల్క్ విత్ హనీ "
కంట్రోల్ రూమ్ లో ఉన్న ఇద్దరు తృప్తిగా తలలాడించారు.
"కరిష్మా బాగానే ఉంది. మెమరీ చెరిగిపోయింది. నో మాల్ వేర్. నో ప్రాబ్లం."
కరిష్మా ,కళాధర్ ఇద్దరూ వైట్ హార్స్ అని తెల్ల గుర్రం రెక్కలతో ఎగురుతున్న నేమ్ బోర్డు ఉన్న రెస్టారెంట్ లో కి నడిచారు.
ఇద్దరూ ఓ మూల కూర్చున్నారు అద్దాల కిటికీ లోంచి మెలికలు తిరిగే ఎర్రమట్టి దారి దూరాన చెట్లమధ్య కొండల వైపు గా సాగిపోతూంది.అక్కడక్కడా రోడ్డు మీద జంటలు నవ్వుతూ మాట్లాడుతూ నడుస్తున్నారు. ఆగిన ఒక కారులో ఒక జంట ముద్దులు పెట్టుకుంటూ ఉంది. సహజత్వం కోసం కాబోలు ఒక రబ్బరు చక్రాల ఎద్దుల బండిని ఒక తలపాగా కట్టుకున్న గ్రామీణుడు తోలుకుంటూ పోతున్నాడు. అవి కూడా కృత్రిమమేనా?
"నేను మనసు మార్చుకున్నాను" అన్నాడు కళాధర్. "బర్గర్ బదులు లార్జ్ స్కాచ్ విత్ సోడా తీసుకుంటాను! నువ్వు కూడా అదే తీసుకో."
ఆమె ఆశ్చర్యం నటించింది."ఇంత పొద్దున విస్కీ నా?"
"అవును నువ్వు కనీసం వైన్ తాగు!" అంటూ ఆర్డర్ చేసిన పానీయాలు రాగానే, అవి తాగుతూ అడిగాడు.
"కరిష్మా మనమనుకున్నది మరిచావా?"
ఆమె ఆలోచిస్తున్నట్లు నటిస్తోంది.
ఏవేవో ఆమె మస్తిష్కంలో లీలగా మసకగా ఏవేవో మాటలు. అస్పష్టంగా దృశ్యాలు.
"ఇద్దరం వెళ్ళిపోదాం."
"..."
"కలిసి ఉందాం"
"..."
"నిన్ను విడిచి ఉండలేను."
"..."
"వాళ్లకి కావాల్సినంత డబ్బు ఇస్తాను.నిన్ను విడిపించుకుంటాను."
"..."
ప్రతీ మాటకీ మౌనమే సమాధానం. తానన్న మాటలకు కరిష్మాకి ఏమైనా సంతోషం కలిగిందా? ఏమైనా బాధ, ఆలోచన, ఉద్వేగం?
ఈ రిసార్ట్ కు వచ్చిన డజన్లకొద్దీ క్లైంట్స్ లేక కస్టమర్స్, ఇంకా చెప్పాలంటే "విటులు" చేసిన చిత్రహింసలు, లైంగిక వైపరీత్యాలు అన్నీసినిమాల్లో లాగా ఆమె కళ్ళకి కనిపిస్తున్నాయి.
సిగరెట్లతో కాల్చటం, నగ్నంగా చేసి కొరడాదెబ్బలు కొట్టడం, తాను నొప్పి లేకపోయినా అరవటం, కాలిన చోట కొద్ది కొద్దిగా మంటలు వేస్తే నిజం గానే అరవడం ఇలాంటి కృతక వికృతాల మధ్య ఇతని గాఢమైన ప్రేమ కి అర్థం తెలియడం లేదు.
అతను సిగరెట్ ముట్టించాడు.
"నేను మీ సేవ కోసం కోసం చేయబడిన కరిష్మాని. బయటికి రావటం మా యజమాని ఒప్పుకోరు. నేను ఎవరితోనూ ఉండలేను. అనుమతి లేదు."
అతనికి కోపం మిన్ను ముట్టింది. కానీ ప్రేమకి ఉన్న గాఢత అతని కోపంలో లేదు. అయినా అతని సిగరెట్ పీకని ఆ చేతిపై కాల్చాడు. విపరీత ధోరణితో కాదు, ప్రేమో, కోపమో ఏదో ఓ స్పందన ఆ మోములో చూడాలని.
ఆమెలో తాను అంతకుముందు వదిలివెళ్ళేముందు చూసిన ప్రేమైకభావాన్ని చూసేందుకు ప్రతీసారీ ఇలా సాయంత్రం వరకూ ఎదురుచూడటం, తిరిగి వచ్చేవరకల్లా ఎరేజ్ చేసిన మెమొరీ ఫలితంగా ఏ భావమూ పలకకపోవటం దుస్సహంగా ఉంది అతనికి. ఆమె తనని గుర్తించి, ప్రేమించేందుకు సాయంత్రం వరకూ ఎదురుచూసే ఓపిక లేకపోయింది. అందుకే అలా చిన్న గాయం చేసే ప్రయత్నం.
"అబ్బా" అని అరిచింది కరిష్మా.
ఇది మామూలే. ఒక వర్చువల్ ప్రపంచం లోని మరో సాధారణ దృశ్యం. పక్కన టేబిల్స్ పై ఉన్న జంటలు వారివారి సంభాషణల్లో మళ్లీ మునిగిపోయారు.
ఆమెకి నిజంగానే మంటగా ఉంది. తనలో ఏదో మార్పు వస్తోంది. కాలిన స్పర్శ తెలుస్తోంది. ఏవేవో దృశ్యాలు. ఒక ముసలి తల్లి, తండ్రి, ఏడుస్తున్న పాప, ఊర్లో ఉన్న ఒక చిన్న ఇల్లు. "నేనెవరిని? నాకు ఏమవుతోంది?"
రెస్టారెంట్ లోని సర్వర్ వచ్చి బ్యాండేజీ కట్టి సపర్య చేస్తున్నాడు. ఈ సపర్యా సిటీ ప్రోగ్రాములో భాగమే. కానీ, ఆమెలో బాధకి సంబంధించిన నిజమైన స్పందన గమనించి అతను హఠాత్తుగా టేబుల్ మీద బ్రెడ్ కోసే కత్తి తో ఆమె అరచేతి మీద చిన్నగా గుచ్చాడు.
రక్తం!
"నొప్పి !నొప్పి! అమ్మో! కళాధర్! ప్లీజ్ !ప్లీజ్ వద్దు వద్దు!గుచ్చవద్దు!
వద్దు. వద్దు" ఆమె అరిచింది.
"నువ్వు రోబోట్ కాదు. సాధారణ స్త్రీవి. నా ప్రేయసివి. చూడు, నీకు బాధ, నొప్పి, జ్ఞాపకాలు అన్నీ ఉన్నాయి. నీకు రక్తమాంసాలు, స్పర్శ, నొప్పి అన్నీ ఉన్నాయి. నువ్వు నాతో రా! నిన్ను రక్షించుకుంటాను." అతడు ఆమెను లేవదీసాడు. ఈడ్చుకుంటూ బయటికి లాక్కుని వెళ్ళాడు.
కరిష్మా అరుస్తోంది. "మాస్టర్! నేను నీకు అపాయం కలిగించకూడదు. అవి రూల్స్. నేను తిరగబడితే నీ ప్రాణాలు పోతాయి. కానీ నేను నిన్ను ఏమి చేయకూడదు.ప్లీజ్! వదిలేయి! నువ్వు వచ్చిన పని వేరు. చేస్తున్నది వేరు."
రెస్టారెంట్ లోని రిసెప్షన్ డెస్క్ వెనకాల ఉన్న ముసలి వ్యక్తి కంప్యూటర్ స్క్రీన్ లో ఎవరితో నో ఆదుర్దాగా మాట్లాడసాగాడు.
కళాధర్ కి చేతన లేనట్లుంది. దగ్గర ఉన్న పార్కింగ్ లో తన కారులో ఆమెని తీసుకుని పారిపోవాలి అని అతని మనసులో ఉంది. ఒక్కసారి ఈ సిం సిటీ నుంచి బయటకు వస్తే కరిష్మా మారిపోతుంది." అదేనమ్మకం అతనికి. ఆ నమ్మకానికి ఆధారం ఏదో అతనికి తెలియదు.
"నేను ఒక బీద కుటుంబం నుంచి వచ్చాను.నాకు తల్లి, తండ్రి, పాప ఉన్నారు.వారిని చూడటానికి వెళ్ళాలి. ప్లీజ్ కళాధర్ నన్ను వదిలేయ్."
అతను ఆమెను తోసుకుంటూ బయటకు తీసుకుని పోయి ఆ తరువాత ఆమెను భుజం మీద ఎత్తుకుని పార్కింగ్ లో ఉన్న తన పెద్ద కారు దగ్గరికి పరిగెత్తసాగాడు. కొద్దిగా ఆయాసం వస్తోంది.బుల్లెట్ ప్రూఫ్ కారు తనది. ఎలక్ట్రానిక్ నావిగేషన్ తో సెక్యూరిటీ నుంచి తప్పించుకోవచ్చు.
"సాధ్యం కాదు కళాధర్. పారి పోలేము. ఆపేస్తారు . వాళ్లు నిన్ను గేటు దగ్గర ఆపేస్తారు. పోలీసులకి అప్పజెప్పి జైలుకు కూడా పంపిస్తారు ఇప్పటికైనా నన్ను వదిలేయ్." రోడ్డుమీద కస్టమర్స్ అంతా పోగుపడి వినోదం చూసినట్లు చూస్తున్నారు ఈ దృశ్యం.బహుశా అందులో కొందరు దీనినీ సిమ్యులేటెడ్ అనే అనుకునుంటారు. సహజమేదో, కృత్తిమమేదో తెలియని లోకం అది మరి.
దూరాన సైరన్ మోగిస్తూ "సిమ్ సిటీ సెక్యూరిటీ" అని ఎర్ర అక్షరాలు రాసి ఉన్న వ్యాను వస్తోంది. రిమోట్ తో తన కారు డోర్ తలుపులు తీసి అతను ఆమెను లోపలికి తోశాడు.
తన గన్ పట్టుకుని వాళ్లని ఎదుర్కోవటానికి సిద్ధంగా నిలబడ్డాడు.
కరిష్మా అరుస్తోంది.
"కళాధర్! నీ గన్ పేలినా బుల్లెట్లు నిజమైనవి కాదు. అది అంతా ప్రోగ్రామే!"
ఎర్రటి దుస్తుల్లో ఉన్న ముగ్గురు సెక్యూరిటీ గార్డులు మెల్లగా వ్యాను లోంచి దిగి లేసర్ మెషిన్ గన్నులు పట్టుకుని అతని వైపు నడుస్తూ వస్తున్నారు.
"హ్యాండ్స్ అప్! నీకు అపాయం చేయము! ఆమెను తీసుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తే మాత్రం బుల్లెట్లతో నీ శరీరంలో రంధ్రాలు చేస్తాంము. చనిపోతావు. మా మీద కూడా కేసులు ఉండవు జాగ్రత్త! బతికితే నీవే ట్రెస్పాస్ కిడ్నాప్ కేసులకు జైలు కి వెళ్తావు!"
అతను పట్టించుకోకుండా గన్ పేల్చాడు.
మెరుపులు వచ్చాయి కానీ బులెట్ లు వారికి తగిలి కింద పడి పోతున్నాయి.
వాళ్ళు దగ్గరికి నడిచి వస్తూనే ఉన్నారు. కరిష్మా దిగి కింద అతని పక్కన నిలబడింది.
ఆమె మనసులో ఏవేవో జ్ఞాపకాలు. ప్రేమ విఫలం అయినట్లు, గుండె బరువెక్కినట్లున్న ఫీలింగ్, ముసలి తల్లిదండ్రులు, చిన్న పాప... డబ్బు కోసం ఇక్కడికి రావటం. ఏవో జ్ఞాపకాలు. ఆమె ఆలోచిస్తోంది ఈ జ్ఞాపకాలు ఏమిటి?
సెక్యూరిటీ గార్డులు అతని దగ్గరికి వచ్చి హఠాత్తుగా చేతులు విరిచి పట్టుకుని అతని చేతులకి బేడీలు వేశారు.
"కరిష్మా !కోడ్ నెంబర్ నైన్ వన్ ! యు కెన్ గో!" ఒకడు ఆమె తలకి గురిపెట్టి లేజర్ గన్ ని పేల్చాడు.
ఆమెకు గుర్తుకు వచ్చింది ఇప్పుడు. తన జ్ఞాపకాలు తుడిచి వేస్తున్నారు. జ్ఞాపకాలు కూడా అబద్దమేనా.
అది ఒక ప్రోగ్రామ్ ఏమో. బీదతనం, డబ్బు కోసం, కుటుంబం కోసం ఈ పని చేయటం- ఈ కథ కూడా తన మనసులో వాళ్ళు సృష్టించినదేనా, లేక నిజమా? ఏది నిజం, ఏది కృత్రిమం, ఏది ప్రోగ్రాం, ఏది వాస్తవం?
"నువ్వు ఎట్టి పరిస్థితులలో కస్టమర్ కి అపాయం కలుగ చేయవద్దు. యజమానికి అపాయం కలుగజేయ వద్దు. ఎప్పటికీ దాడి చేయవద్దు.ఈ కమాండ్స్ వాళ్ళు చెప్పినట్టు చేయాలి."
"మరి నా ముసలి తండ్రి, తల్లి, నా కుటుంబం, నా పాప ? నిజంగా కత్తి గుచ్చినప్పుడు నొప్పి వచ్చినట్టుంది కదా. అతను మళ్లీ వస్తాడు అని నిజంగా ఎదురు చూసింది కదా?"
కళాధర్ ని వేన్ లో ఎక్కించుకొని వెళ్లిపోయారు.
మెకానిక్ రోబోట్ కరిష్మా ఏ నిర్భాగ్య స్త్రీ మెదడులోని టెంపోరల్ లోబ్ తో ఆమె హార్డ్ డిస్క్ అనుసంధానం చేసి తయారు చేశారో... ఏ అందమైన స్త్రీ శరీరాకృతి మోడల్ గా మలిచారో! కరిష్మా కి తనెవరో తనకే అర్థం కావటం లేదు.
కానీ తన కళాధర్ ని కాపాడుకోవాలి. అతనికి తన వల్ల అపాయం రాకూడదు.
తన షర్టు లోపల హోల్ స్టర్ లో ఉన్న గన్ ని బయటకు తీసింది. అది అత్యవసర పరిస్థితుల్లో వాడవలసిన గన్. ప్రాణాలు తీయదు కానీ స్పృహ తప్పిస్తుంది.రోబోట్లని, సిస్టమ్ ని జామ్ చేస్తుంది. చాలా వేగంగా పరిగెత్త సాగింది. మెరుపు వేగంతో సాధారణ మానవ స్త్రీ కంటే పది రెట్ల వేగంతో, బలంతో, కృతనిశ్చయంతో!
***
కొన్ని గంటల తరువాత…
కంట్రోల్ రూమ్ లో వాళ్ళిద్దరూ తలపట్టుకు కూర్చున్నారు. "చెబితే వినలేదు. మ్యాట్రిక్స్ లోని చిన్న పొరపాటు అన్నావు. కానీ కరిష్మా కి మెల్లగా పాత జ్ఞాపకాలూ, కొత్త వ్యక్తిత్వమూ వస్తున్నాయి అని చెప్పితే వినలేదు. ఇప్పుడు ఆ కస్టమర్ తో పారిపోయింది. నలుగురు సెక్యూరిటీ గార్డులను దిమ్మతిరిగేటట్లు కొట్టి స్పృహ తప్పేట్లు చేసింది! ఇక ఆమెని పట్టుకోవటం అసాధ్యం. మన యజమాని మన ఉద్యోగాలలోంచి తీసేయటం ఖాయం."
***
చాలా కిలోమీటర్ల దూరంలో సిటీకి చాలా దూరం గా హైవే మీద రెండొందల కిలోమీటర్ల వేగంతో ఆధునిక డ్రైవర్ లేని కారు, సాఫీగా ప్రయాణం చేస్తూ వెళ్లిపోతోంది.
కారు వెనక సీట్లో కళాధర్ కరిష్మా ఒడిలో తల పెట్టుకుని..
"ఐలవ్యూ కరిష్మా" అంటున్నాడు పదేపదే.
ఆమె తన అద్భుతమైన కంప్యూటర్ మెమరీ ఉన్న హార్డ్ డిస్క్ ని కారు నావిగేషన్ సిస్టమ్ కి అనుసంధానం చేసి గ్లోబల్ మ్యాప్ ఇన్ సిస్టం చూస్తూ కారుని ఎక్కడికో వేగంగా డ్రైవ్ చేస్తూ తీసుకు వెళ్లిపోతోంది. ఆమె యాంత్రిక హృదయంలో కూడా ఇప్పుడు ప్రేమ ఆపుకోలేనంత బలంగా ఉత్పన్నమైంది.
"ఐ లవ్ యు టూ కళాధర్. వుయ్ డిడ్ ఇట్! తప్పించుకున్నాం. కానీ వాళ్లకు దొరకకుండా దూరంగా దూరంగా పారిపోవాలి. వాళ్ళ ఆయుధాలు పద్ధతులు నాకు ఒక్క దానికే తెలుసు. వారిని ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు."
కళాధర్ ఆమె నల్లని కురులని స్పృశిస్తూ అన్నాడు.
"నాకేం అర్థం కావటంలేదు కరిష్మా! ఐ లవ్ యు. అంతే!"
కారు చూస్తుండగానే హై వే మీద దూరంగా దూరంగా వెళ్లి పోసాగింది.
"అఫ్ కోర్స్ నేను కూడా నువ్వు వచ్చినప్పటి నుంచి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నట్టున్నాను కళాధర్. ఇక ఎప్పటికీ వీడిపోను. కొంచెం వెయిట్ చెయ్!అంతే!"
ఆమె ఎర్రని పెదవుల మీద ఇప్పుడు యాంత్రికం కాని సహజమైన తృప్తితో కూడిన మందహాసం వెల్లివిరిసింది. అది ఎంతో మనోహరంగా ఉంది.
*****