MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కథా మధురాలు
శబ్ధచిత్రం
మణి వడ్లమాని
“అవును కదా ”
“ నిజమే అసలు నమ్మలేకపోయాను”
“ ఊహించలేదు.నేనయితే షాక్ అనుకో ”
**
“చిన్నతనం లో తండ్రి, పెళ్లి అయ్యాక భర్త, ఇహ చివరి దశలో కొడుకు. బ్లా..బ్లా బ్లా. .. ఈ మాటల కి చిరాకు, కోపం కూడా వస్తున్నాయే” ఆవేశ పడసాగింది స్వప్న.
“ఏయ్ ముందు జాగ్రతగ్గా గా డ్రైవ్ చెయ్యి, తరువాత చిరాకు పడు !” పక్కన కూర్చున్న స్నేహితురాలు అంది.
“పైగా ఏమన్నాడో తెలుసా? మీ ఆయన నిన్ను ఎందుకు వదిలేసా డో ఇప్పుడు అర్ధమవుతోంది. ఏదో తలతిక్కగా, పొగరు గా ఉండి ఉంటావు అందుకే భరించలేక వదిలేసాడు, ఇంకా నయం అమ్మ నిన్ను చేసుకోమంది. లక్కీ గా మనకి జాతకాలు కుదరక బెగిసి పోయింది కానీ, అమ్మో! తల్చుకుంటే.. పెద్ద ఆపద తప్పింది అంటాడా? యూజ్ లెస్ ఫెలో, వాడిని వదిలిపెట్టను. కన్న తల్లిని మోసం చేసే వీడు నీతులు మాట్లాడతాడా? చెప్తా,చెప్తా”!
“అసలు గొడవేంటి, మీ అత్తయ్యని సరిగ్గా చూడటం లేదా? మధ్యలో నీ డైవోర్స్ సంగతి ఎత్తటం దేనికి?”
“అదే కదా! వాడి తప్పుని ఎత్తి చూపించేసరికి ఇగో దెబ్బతింది. ఇలా కారెక్టర్ ఏసాసినేషన్ చేయడం ద్వారా నన్ను బాధ పెట్టాలని వాడి తాపత్రయం. వాడి ఏడుపంతా అలా నేను నిలదీసి అడిగానని! మా అత్తకి నిజానికి మావయ్య పోయిన తరువాత ఫామిలీ పెన్షన్ వస్తుంది. ఆవిడ కొచ్చే డబ్బులో చిన్న చిన్న కోరికలు తీర్చడానికి కూడా వీడి అభ్యంతరం ఏమిటో?”
“మరి మీ బావ భార్య ఎలాంటిది. మీ అత్తయ్య ని బాగా చూసుకుంటుందా?"
“హా, అదోరకం. చదువుకుని ఉద్యోగం కూడా చేస్తోంది. కానీ తనకి ఈ వయసులోనే బాబాలు,భజనలు, ఎప్పుడూ ఆ ఆరాటం లో ఉంటుంది. పెద్దగా ఇంటి విషయాలు పట్టించు కోదు. అందరి ఉద్ధారకుడు బావే ఉన్నాడు గా వంట కూడా బాగానే చేస్తాడు. ఇంటి పనులు కూడా వాడే చేస్తాడులే.” అంది.
అంతలో స్నేహితురాలు ఇల్లు వచ్చింది. దిగుతూ “రేపు ఆఫీస్ కి వస్తావుగా స్వప్నా”
“యా వస్తాను”
“ఒకే బై”
“బై”
సాగర్ నుంచి విడిపోయింది అతను ఒక శాడిస్ట్ అని తెలిసి. కానీ, ఇలాంటి సోషల్ శాడిస్ట్ లను నుంచి మటుకు తప్పించు కోలేకపోతోంది. పెళ్లయ్యాక ఎంతో హాయిగా, అపురూపంగా జరిగిపోతుందని అనుకున్న తన సంసారం కాస్తా ముక్కలయి విడాకులు తీసుకునే పరిస్థితులు వచ్చాయి. సాగర్ తో సర్దుకుపోవాలని తను చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఫలితం ఇది. సింగల్ విమన్ అనే సరికి అనే నోళ్ళకీ ఇక హద్దులే ఉండవు. ఇవాళ జరిగింది అదే.
పైగా తన జీవితం లో చూసిన మగాళ్లు అందరూ కూడా ఏదో రకంగా ఆడవాళ్ళ మనసులు తెలిసికోకుండా దాష్టీకం చెలాయించే వాళ్లే, నాన్న,రుక్మిణిత్త భర్త (రామనాధం మావయ్య), ఒకప్పుడు తనకి తాళికట్టిన సాగర్, ఇదిగో ఈ బావ శ్రీధర్.
అందరూ ఇలాంటి వాళ్లే కాదు. మనసుల్ని, మనుష్యులని అర్ధం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. తనకి జరిగినట్లు గా మిగతా వాళ్లకు జరగాలని లేదుగా అనుకుంటూ లోపలకి వెళ్ళింది స్వప్న. “హాయ్ మమ్మీ” అర్ఘ్య తల్లిని చుట్టేసుకున్నాడు.
వాడిని చూసేసరికి మనసంతా సంతోషంగా అయిపోయింది. అన్నీ మరచిపోయి కొడుకు బుగ్గ మీద ముద్దు పెట్టుకుని వాడు చెప్పే స్కూల్ విషయాలు వింటోంది.
**
రామచంద్ర,రుక్మిణి లకి శ్రీధర్ ఒక్కడే కొడుకు. రామచంద్ర కి ఒక తమ్ముడు ఉండేవాడు. ఆ తమ్ముడు సంసారం వదిలిపెట్టి సన్యాసులలో కలిసిపోయింది మొదలూ తమ్ముడి భార్య, కూతురికి అండగా నిలబడ్డాడు. తమ్ముడి భార్య కొన్ని రోజులకు పెద్ద జబ్బుచేసి చనిపోయింది. తమ్ముడి కూతురు జ్యోతిని కూడా శ్రీధర్ తో పాటు పెంచారు. రామ చంద్రానికి ఆడపిల్ల లేదు కదా, తమ్ముడు కూతురుని ఎంతో ప్రేమగా చూడవలసినది పోయి ఎప్పుడూ విసుక్కునేవాడు.పైగా ఖర్చే తప్ప రాబడి రాదు అని ఊరికే అనడం తో శ్రీధర్ కి కూడా ఆడవాళ్లంటే చులకనే, ఆ పిల్లతో ఆత్మీయంగా ఉండే వాడు కాదు.
శ్రీధర్ అప్పుడప్పుడు. తల్లితో మేనమామ గారింటికి వెళ్తూ ఉండేవాడు. వాళ్ళకో అమ్మాయి. పేరు స్వప్న.
రుక్మిణికి ఆశగా ఉండేది సంబంధం కలుపుకోవాలని. రామచంద్రానికి పెద్ద అభ్యంతరం లేదు. బావమరిది పరపతి, డబ్బు ఉన్నవాడే. కానీ వాళ్ళ ఇంటిగురువు మాట అంటే గొప్ప నమ్మకం. అతను జాతకాలు చూసి స్వప్న శ్రీధర్ ల జాతకాలు కుదరలేదు అని చెప్పటం తో ఆ సంబంధం విషయం అక్కడితో ఆగిపోయింది. రుక్మిణి మటుకు బాధపడింది.
కొంతకాలానికి శ్రీధర్ పెళ్ళి జరిగింది. తమ్ముడి కూతురికి, వచ్చిన కోడలు తాలూకు బంధువులబ్బాయి కిచ్చి చేసారు. ఆ అమ్మాయి లక్షణం గా కాపురం చేసుకుంటోంది.
కొన్నేళ్ళు గడిచాయి. శ్రీధర్ కి ఒక కొడుకు , తల్లి తండ్రులతో కలిసే ఉంటాడు. కానీ అతనిదో విచిత్ర స్వభావం. చిరాకు, అసహనం ఎక్కువ.
కొంత కాలంగా గుండె నొప్పితో బాధ పడుతున్న రామచంద్రం ఓ తెల్లవారుజామున మరణించాడు.
రుక్మిణి ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లిపోయింది. అలా నిస్తేజంగా శూన్యం లోకి చూస్తూ ఉండిపోయింది. ఎంత లేదన్నా దగ్గర దగ్గర ఏభై ఏళ్ళు కలిసి ఉన్నారు. ఆ దుఃఖం,విషాదం అంత తొందరగా తగ్గేవి కావు. అందరూ ఓదార్పు మాటలు చెబుతూనే ఉన్నప్పటికీ.
రామచంద్ర స్నేహితుడు విశ్వం పలకరించటానికి వచ్చి. “నీ దుఃఖం తీర్చలేనిదే కానీ నీకు డబ్బు కి లోటు లేదమ్మా ఎందుకంటే నీకు ఫామిలీ పెన్షన్ వస్తుంది. ఆ రకంగా నువ్వు అదృష్ట వంతురాలివి” అని ఓదార్చి వెళ్లిపోయాడు.
నిజానికి రుక్మిణి ఇంటర్ వరకు చదివింది. కానీ ఆమెని నోరువిప్పి మాట్లాడనిచ్చేవాడు కాదు. ఒక్క కరణేషు మంత్రి తప్ప మిగతా ధర్మాలో, కర్మలో అవన్నీ ఉండేవి. అందుకే పెద్దగా భర్త జీతం గురించి,దాచుకున్న డబ్బు గురించి గాని తెలియదు, అడగాలని కూడా తోచేది కాదు.
పదిహేను రోజులు గడిచాయి.
శ్రీధర్ తల్లిని బాంక్ తీసుకుని వెళ్లి ఆవిడ చేత అక్కడ కొన్ని కాగితాల మీద సంతకాలు పెట్టించాడు.
“అమ్మా నీకు నాన్న గారి పెన్షన్ వస్తుంది అని మాత్రం చెప్పాడు. ఎంత అని ఈవిడ అడగలేదు. ఇంత వస్తుందని అతను చెప్పలేదు.
పెద్దగా ఆరోగ్య సమస్యలు లేకున్నా అప్పడప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి.
నెమ్మదిగా జీవితం గాడి లోపడుతోంది. ప్రతి నెలా ఠంచనుగా “అమ్మ ఇదిగో నీ కోసం అయిన ఖర్చు లు” లెక్క మాత్రం చెప్పీవాడు.
మొదట్లో తెలియలేదు తరువాత తెలిసిపోయింది అబద్దం అని, కానీ ఏమనగలదు.
రోజులు గడుస్తున్నాయి.
ఇంట్లో మార్పులు ఏమి రాలేదు. రుక్మిణి ని చూడటానికి అప్పుడప్పుడు మేనకోడలు స్వప్న వచ్చేది.
శ్రీధర్ కి స్వప్న రావడం ఇష్టం ఉండేది కాదు. స్వప్న ఎవరినీ లెక్క చేయకుండా తనకు నచ్చిన దారిలో వెళుతోంది అని కోపం, తేలిక భావం.
రావద్దని అన లేడు. అందుకే స్వప్న వచ్చినప్పుడల్లా ఏదో రకంగా చిన్న బుచ్చుతూ ఉండేవాడు.
అలా స్వప్న వచ్చినప్పుడే రెండు మూడు సార్లు తల్లి కొడుకుల మధ్య డబ్బుని గురించి మాటల యుద్ధం అవుతుండేది.
**
ఒక రోజున ఎదురింట్లో ఉండే పద్మజ వచ్చి “యాత్రలకు వెళుతున్నాము. అన్ని బాగా చూపిస్తారు, చక్కగా చూసుకుంటారు. డబ్బులు కూడా మరీ ఎక్కువ కాదు అన్ని కలిపి ఏభై వేలు, నేను వస్తున్నాను. మీకు దగ్గరనుండి చూపిస్తాను. శ్రీధర్ గారికి చెప్పండి”. అని చెప్పి వెళ్ళిపోయింది.
ఆ రోజు రాత్రి కొడుకు భోజనము అయ్యాక చెప్పింది తనకి యాత్రలు చేయాలని, అవన్నీ చూడాలని ఉందని చెప్పింది.
“ఏంటమ్మా? ఇప్పుడు ఈ యాత్రలు అవీ అవసరమా? దేవుడు ఎక్కడ లేడు? హాయిగా ఈ చివరన శివాలయం ముందుకు వెళితే రాముడి గుడి ఉన్నాయి. వాళ్ళూ దేవుళ్ళే చక్కగా ఇక్కడే కానీ ఖర్చు లేకుండా చూడచ్చు,అదీ కాక నీ మందుల ఖర్చు తో పాటు , ఇంటికి వచ్చే పోయే వాళ్ల చేతి లో ఏదో ఒకటి పెడుతూనే ఉంటావు. సొంత చెల్లెలు కాక పోయినా ఇంటి ఆడపడుచు అని జ్యోతి కి పెడుతూనే ఉంటావు. ఇవన్నీ నీ కొచ్చే పెన్షన్ లోంచే అనుకుంటున్నావా? నా చేతి చమురూ వదులుతోంది” అని విసుకున్నాడు.
ఆ మాటలకి రుక్మిణి మొహం చిన్నపోయింది. అందరిలా తనకి బంగారం మీద పెద్ద మోజు లేదు. మనసులో ఎప్పటి నుంచో అన్నిప్రదేశాలు చూడాలని ఎంతో కోరిక. ఆయనుండగా అది తీరనే లేదు. ఎప్పడయితే పద్మజ వచ్చి చెప్పిందో ఆ కోరిక మళ్ళీ పురివిప్పింది.
దాన్ని కాస్తా వీడు నీళ్లు కార్చేసాడు. ఎక్కడికి పోతాయి అన్నీ అవే బుద్ధులు, తండ్రి నోట్లోంచి ఊడిపడ్డాడు. మాటలలో అసలు మార్ధవం ఉండదు.
**
ఓ రెండు రోజులు గడిచాయి. ఎప్పటిలా మళ్ళీ స్వప్న కొడుకు తో వచ్చింది మేనత్త ను చూసి పోదామని. కొంత సేపటికి శ్రీధర్ ఆఫీస్ నుంచి వచ్చాడు. వస్తూనే స్వప్న ని చూసి రుసరుస లాడుతూ గది లోకి వెళ్ళిపోయాడు.
భార్యను అడుగుతున్నాడు “అదొచ్చి ఎంత సేపయింది అమ్మ అదీ ఏం మాట్లాడుకున్నారు?"
“ఒక పావు గంట అయింది. అయినా కాస్త నెమ్మదిగా మాట్లాడండి”.
‘ఏమిటీ నెమ్మదిగా మాట్లాడేది పెద్ద ఏదో ఉద్ధరించే టట్లు అందుకే క్రితం సారి వచ్చినప్పుడు గట్టిగా పెట్టా, దానికి తన సంసారం చక్కదిద్దుకోలేదు కానీ వేరే వాళ్ళ ది మటుకు సరి దిద్దుతుంది.”అని గట్టిగా అన్నాడు. ఇదంతా స్వప్న వింటూనే ఉంది. గది నుంచి బయటకు వచ్చిన శ్రీధర్ హాల్ లోకి వచ్చి టీవీ పెట్టుకున్నాడు. ఆడుకోవడానికి వెళ్లిన పిల్లలిద్దరూ తిరిగి వచ్చేసారు.
“నాన్నమ్మా నిన్ను పద్మజ అంటీ ఫోన్ చెయ్యమన్నారు” అని చెప్పాడు శ్రీధర్ కొడుకు.
దేని కోసమో అర్ధమయింది రుక్మిణికి “అలాగే లే చింటూ,నేను మాట్లాడుతాను లే” అంది.
“అత్తయ్యా, అసలే బావ మూడ్ సరిగా లేదు, ఇప్పుడు మాట్లాడటం అవసరమా?”
“వాడేమీ పరాయి వాడు కాదుగా స్వప్నా ఓ మారు విసుక్కున్నా పర్వాలేదు లే” అంది.
ఇంకేమీ అనలేక అప్పటికి మౌనంగా ఉండిపోయింది.
“ఏరా ఏమంటావు? వెళ్లమంటావా? ముందు బుక్ చేసుకోవడానికి పదివేలు అడ్వాన్స్ కట్టాలి” అంది.
“మొన్న చెప్పనుగా అమ్మా? అట్టే నన్నువిసిగించకు” అన్నాడు.
"అదికాదురా, నా పెన్షన్ డబ్బులోంచి తీసి ఇయ్యి."
“అదేమయినా ఖజానానా? అందులో ఏమున్నాయి. నీ ఖర్చులకే సరిపోవటం లేదు”
కొడుకు మాటలకి,తన అసక్తత కి తనమీద తానే జాలిపడింది.
అక్కడే ఉండి వింటున్న స్వప్న మటుకు ఊరుకోలేక “అదేంటి అత్తయ్య పెన్షన్ ఇరవయి వేలు కి పైనే వస్తుంది. అంతా ఖర్చయిపోతుందా? ఆశ్చర్యంగా ఉందే ?" అంది.
“ఆ అవదా, ప్రతి నెలా డాక్టర్ చెకప్ లో,మందులు, రానుపోను ఖర్చులు”
“అంత డబ్బులు ఖర్చు అవుతున్నాయా? అవును రా ఎప్పటి నుంచో అడుగుదామని, నాకు నెలకి ఎంత వస్తుందిరా” అమాయకంగా అడిగింది రుక్మిణి.
“ఆ ఆ లక్షలు వస్తున్నాయి, చాలా? అయినా నీకు లెక్క చెప్పా లా "
“అవును చెప్పాలి బావా, అత్తయ్య తనకొచ్చే డబ్బులు గురించి తెలుసుకునే హక్కు ఉంది”
“అసలు నువ్వెందుకు మధ్యలో కలగ చేసుకుంటున్నావు. ఇది మా ఇంటి విషయం”
“నేను కూడా ఆవిడ కి దగ్గరే బావా. బంధుత్వమే అనుకో లేదా ఒక స్త్రీ గా అనుకో, కానీ అత్తయ్య తో మాట్లాడటం నీకు నచ్చదాయే, పర్వాలేదు, కానీ ఇది మటుకు దారుణం, అత్తయ్య కి నెలకి ఇరవయి వేలు వస్తున్నాయి. ఆ సంగతి తెలియకుండా దాచేశావు. పైగా నీ చేతి డబ్బులు ఖర్చు అయ్యాయి అని దబాయిస్తున్నావు. అంటే అత్తయ్యకి తెలియకుండా ఆ డబ్బులు తీసేసుకుంటున్నావు. అంతేనా?”
“ ఓహ్ అయితే ఇంకే? అన్నీ విషయాలు సేకరించావు, నా అవసరం లేనప్పుడు ఆవిడ ఇక్కడెందుకు, నువ్వే తీసుకుని వెళ్ళు, ఇంక ఆవిడ బాధ్యత అంతా నువ్వే తీసుకో ” అనేసాడు.
ఇవన్నీవింటున్న రుక్మిణి మనసు ఆక్రోశించింది. డబ్బు కోసం తల్లి ని ఎన్నెన్ని మాటలంటున్నాడు. ఎలాగూ స్వతంత్రం గా బతకలేదని ఉప్పెనలా దుఃఖం తన్నుకు వచ్చింది. హు, వీడా పున్నామ నరకం నుంచి తప్పించేది. అది తర్వాతి మాట, ముందు ఇక్కడే నరకం చూపిస్తున్నాడు.
అకస్మాత్తుగా గదిలోంచి పూర్ణ వచ్చి “నేను తీసుకుంటున్నాను ఆవిడ బాధ్యత!” అని శ్రీధర్ కి బదులిచ్చింది.
ఆ మాటలు విన్నరుక్మిణి, స్వప్న కూడా విభ్రాంతి గా చూసారు.
“నువ్వా, హహ్హ” అని పెద్దగా నవ్వాడు, “పూర్ణా, అత్తగారిని మంచి చేసుకోవలనా ఈ తాపత్రయం? బానే ఉంది, వెఱ్ఱిని చూసి తొర్రి వాత పెట్టుకోవడం. అదేదో అందని,.. ఓహ్.. fantastic” వెటకారంగా అన్నాడు
ఆ మాటలకి పూర్ణ తమాషాగా శ్రీధర్ ని చూస్తూ “అత్తయ్యా, పద్మజ గారికి డబ్బులు పంపేసాను. మీ టికెట్ బుక్ అయింది” అని శ్రీధర్ తో “ ఇదేమిటి, బాబా భజనలు చేసుకుంటూ, ఏ విషయాలు పట్టించుకోని దానికి ఇవన్నీ ఎలా తెలిసాయనా? ఇన్నాళ్లు ఒక ఎస్కెపిస్టు లా బతికాను. ఎక్కడో ఏదో దొరుకుతుంది.అన్న భ్రమ లో ఉన్నాను. జరుగుతున్న విషయాలని చూస్తూంటే జీవితమే పెద్ద వాస్తవం అని తెలిసొచ్చింది.”
“ ఓహ్! అయితే ఇప్పుడు జ్ఞానోదయం అయ్యిందా మేడం గారికి ” చప్పట్లు కొట్టాడు.
“అవును. మీరు వెటకారంగా అన్నా అదే నిజం. అంతే కాదు భయంకరమైన భవిష్యత్తు కనిపిస్తోంది. రేపు నా కొడుక్కి ఇవే బుద్ధులు వస్తే నా గతి అధో గతే కదా, ఎందుకంటే మావయ్య గారిలా పెన్షన్ జాబ్ కూడా కాదాయే మీది, మరి నేను జాగ్రత్త పడాలి కదా” చాలా మామూలు గా అంది.
ఆ మాటలులోని అంతరార్థం శ్రీధర్ కి కొరడా దెబ్బల్లా చెళ్లున తగిలాయి.
నిరాసక్తంగా ఉండే పూర్ణ లో ఇంత లోతయిన ఆలోచనలున్నాయని అనుకోలేదు.
పూర్ణ దగ్గరగా వెళ్లి భుజం తట్టింది అక్కడే ఉన్న స్వప్న.
ఆ ఆత్మీయ స్పర్శ …. మాటల కందని ఎన్నో భావాలు తెలిపాయి పూర్ణకి. ఆ చేయి అలాగే పట్టుకుని
“స్వప్నా వెరీ వెరీ సారి. శ్రీధర్ నిన్ను అన్న మాటలకి నేను క్షమాపణ చెబుతున్నాను. నీకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. అది అలాగే నిలుపుకో” అంది.
“ థాంక్యూ పూర్ణా నువ్వు...”
“అవును స్వప్నా ఇది నిజమే ఇప్పుడు కూడా మాట్లాడక పోతే ఒక ఆడమనిషి గా నన్ను నేను క్షమించుకోలేను. పైగా ఆవిడ కోరికను తీర్చిడం మా ధర్మం, బాధ్యత” అంది.
ఏమి జరుగుతోందో అర్ధంకాని అయోమయ స్థితిలో ఉన్న అత్తగారి భుజం చుట్టూ చేయి వేసి, శ్రీధర్ వైపు చూస్తూ-
“మీ భాష లో చెప్పాలంటే అదే లెక్కలు వేసుకుంటే ఆవిడ ఇక్కడే ఉంటే మీకే లాభం. పైగా ఇప్పుడు కొంత ఖర్చు పెట్టినా,ప్రతి ఏడాది పెరిగే డి .ఏ ,వాటి ఏరియర్స్ అన్నీ మీకే ఆ విషయం ఎలా మరిచి పోయారు. ఆవిడ బంగారు బాతు కదా! ఆలోచించుకోండి” శ్రీధర్ తో అంది.
నిశ్శబ్ధం శబ్ధించింది.
ఎప్పుడూ మౌనం గా ఉండి తక్కువగా మాట్లాడే పూర్ణ ,ఇలా తనను గురించి స్వయం నిర్ణయం తీసుకోవడం, పైగా కొడుకుకి గట్టి జవాబు చెప్పడం…. అసలు…..ఇలా మంచు లోంచి ఎగిసి పడిన నిప్పు కణం లా మాట్లాడుతుందని ఎన్నడూ అనుకోలేదు. అందుకే ఆశ్చర్యంతో పాటు ధైర్యం కూడా కలిగింది రుక్మిణికి .
పైన బూడిద కమ్మేసినా అడుగున నిప్పు రాజుకుంటూనే ఉంటుంది. ఆ ప్రక్రియలో ఒక్కోసారి మౌనం శబ్దచిత్రంగా విస్ఫోటమవుతుంది.
పూర్ణ మాటల లోని వ్యంగ్యం నిర్ఘాంతపోయి చూస్తున్న శ్రీధర్ గుండెల్లో సూటిగా గుచ్చుకుంది
***