top of page
bhuvanollasam.PNG
srinivyasavani.PNG

సంపుటి  6   సంచిక  1

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

కథా​ మధురాలు

శక్తి

 

నవులూరి వెంకటేశ్వరరావు 

Venkateshwarrao.jpg

బాల్యం నుంచే, ఉన్న వయసుకన్నాఐదేళ్లు పెద్దగా కనిపిస్తూ వస్తున్నఅప్పన్న నేటి అసలు వయసు నలభై. నూకాలుది వయసెరుగని దృఢమైన శరీరం.  అందం కూడా ఆమె సొత్తు. ఆటుపోట్లకు తట్టుకోగల తత్వం ఆమెది.  ఈసురోమని ఉండే గుణం ఆమె భర్తది. ఆమె అతని జీవం, చైతన్యం, వెన్నుముక. అసలే అంతంత మాత్రంగా సాగుతున్న జరుగుబాటు క్షీణించింది. అప్పన్న మరీ నీరసపడిపోగా, జీవితమంటే ఇలాగకాక  మరోలా ఉండదన్న అభిప్రాయానికి ఏనాడో వచ్చేసిందామె.  అందుచేత దాని గురించి మాట్లాడటం, అసలు ఆలోచించడమే మానేసింది. 

 

అది అతిచిన్న గ్రామం కనుక చేయడానికి కూలిపనులు తక్కువ. దొరికిన ప్రతి పనిని కౌగిలించుకో వలసిన అవకాశంగా ఆమె భావించగా, దొరికిన దానిని చెయ్యడానికి అప్పన్న కష్టపడేవాడు. పడే అతని కష్టానికి వడ్డీలా ఏదో మాయరోగమూ తోడయ్యింది. అందుచేత ఎక్కువ రోజులు గుడెసెలోనే భార్య గురించి ఎదురుచూస్తూ గడిపేస్తున్నాడు.  సిగ్గు పడటం మానుకోవాలని అతననుకున్నా వీలవడం లేదు. బ్రహ్మ ఒకడికి దుర్భరమైన జీవితాన్ని నొసట వ్రాసి, కించెత్తు అదృష్టాన్ని కానుకగా ఇచ్చాడు.  అదీ మరణానంతరం.  అది పుర్రె బ్రహ్మలోకం చేరే అవకాశం. బ్రహ్మ హాస్యప్రియుడు అని తేలుతోంది. వీళ్లిద్దరికీ ఇంకా పిల్లలు పుట్టకపోవడం వీళ్ళ అదృష్టం --ప్రయత్న లోపం, అంగ లోపం లేకపోయినా.        

 

"చచ్చే అదురుస్టం ఎప్పుడిస్తాడో ఆ దేముడు," అన్నాడు.  

 

"దానికి పేరెట్టినావంటే అది రాదు. అయినా పుట్టింది ఎప్పుడు సస్తామా అని ఎదురు సూట్టాకా యేటి?" 

 

"నేను నిన్ను పోసించాలిసింది నన్ను నువ్వే పోసిస్తన్నావ్! "

 

"ఇల్లు గడవటం కావాల కానీ ఔలు పోసిస్తేనేటి? ఒంట్లో సత్తవ వస్తే నన్ను ఇంట్లో తొంగో పెట్టి నువ్వే ఇల్లు నడిపించు."

 

"ఆ దినం వస్తాదా?

 

"రానని సెప్పిందేటి? రాక సస్తాదా?"

 

"నీ కడుపు సల్లగా -- వస్తే ఇంకేటి కావాలా?"

 

రాత్రి అవుతుండగా పని నుండొచ్చిందామె. దుమ్ముకొట్టిన, మసిపూసిన చందమామ లాగ ఉందామె ముఖం. ఆకాశం ఆ చివర నుంచి ఈ చివరిదాకా డేకి అలసినట్టుగా కూడా ఉంది. పేదదే అయినా పాక మీద కూడ వెన్నెల కురిసే ప్రయత్నంలో ఉంది. అది ఆకలిని మాత్రం తీర్చలేదు.   అందు చేత వెన్నెలను పట్టించుకోరు వాళ్ళు.  

 

దూరంగా గుడి గంట మోగింది. ఆమె కళ్ళు మూసుకుని లెంపలేసుకుంది, చేయని తప్పిదానికి  శిక్షలా.  అప్పన్న నవ్వాడు.  ఆమెకు దానర్థం తెలుసు.

 

దాలయ్య చెంబు పట్టుకుని వెళుతూ వాళ్ళిద్దరి ముందు ఆగాడు. భార్యాభర్తల మధ్య ఉన్న వ్యత్యాసం అతనికే తెలియని ఆనందం ఆతనికి కలుగుతుంటుంది. కలగాలి కానీ ఆనందం, ఎలా కలిగితేనేం? అతనికి విచారించడానికి కారణాలు లేవు, కావాలని సృష్టించుకుంటే తప్ప. భార్య అందంగా లేదన్న కారణం విచారాన్ని కలిగించటమే కాక ఇతరుల భార్యలలో అందాన్ని చూడకుండా వొదిలేయనీయదు.

 

"నూకాలమ్మ దొరకడం నీ అదురుష్టం, అప్పన్నా!' 

 

"వంద సార్లన్నావ్.  నేను వొప్పుకుంటానే ఉన్నా. ఆమె అమ్మోరు. ఆమెకు చిల్లంగి ఎట్టక."

 

"నాకేటొస్తది?"

 

"కుళ్ళు తీర్తాది."

 

"ఇలాట్టోడు నాకు దొరక్కపోడం నా అదురుష్టం," నూకాలంది.

 

“ఉన్న ఎకరా సెక్కనూ గెద్దలా ఎగరేసుకు పోడానికి సూస్తుండు”  అనుకున్నాడు అప్పన్న.

 

"అన్నియ, ఆపని సూసుకొనిరా,” అనింది వాళ్లిద్దరూ మాటా మాటా అనుకుంటారేమో అని.

 

"దానికి తొందరనీదునే.  ఔలైన బాగుపడాల్నని కోరుకునోటోడ్ని. అందుకే సెప్పేది.  పట్నంపోండి ఆ చెక్క అమ్మేసి.  ఓ రూపాయ ఎక్కువే ఇస్తా.  ఇది మీకు వొందాసార్లు సెప్పినా."

 

"ఆడ డబ్బు సెట్లకి కాస్తదా, పావురాయిలా వొల్లో  వాల్తాదా?'

 

"ఆ ఈలుంటే మీకన్నా నేనే ఎల్లి ఆడుండేవాడ్ని. ఆడ వద్దన్నా పని.  ఈడేదీ సెయ్యడానికి? ఈడ పది రూపాయలొచ్చే పనికి ఆడ వొందొస్తది. పని డబ్బును ఈంతాది. నా బామ్మరిది తమ్ముడు సీతయ్యగోడు పని సెయ్యకుండా డబ్బు సంపాదిస్తుండు. ఆడు ఊర్లో ఉన్నప్పటి గంటే తెలివి తేటలు వొంద రెట్లు ఎక్కువయ్యాయి. ఆడు ఆడి పెళ్ళాం నిగనిగ లాడుతుండ్రు. పిల్లలు కాన్వెంట్లో సదుంకొంటుండ్రు. మా అవిడి ఆడికే పోదామని నన్ను పీక్కు తింటుంటాది. కానీ నా అలవాట్లకు పట్నం సరిపోదు. నాలానే మీలాటోళ్ళెందుకు ఈడ మగ్గిపోవాలా. మాణిక్యం లాంటి నీ పెల్లం మట్టిలో ఎందుకుండి పోవాలా? ఈ మాణిక్యం నగరంలో, నగలో రానిస్తాది." 

 

"కట్టపడకుండా సీతయ్య సంపాదిస్తున్నాడంటే ఎదో తిరకాసుంటది. ఆడు ఆడే, మా ఆయినా మా ఆయనే. ఆడు సేయగలిగిన పని  మా ఆయన సేయనేడు. నేను సేయ్యనీను కూడా,"  ఒంగొని కోడిపెట్టను తరుముతూ అనింది.

 

"ఆడు దొంగతనాలు సేస్తన్నాడా.  ఈడ్ని అదే పని సేయమంతన్నానా? ఆడి తెలివితేటలు అమ్ముకుంటుండు.  తప్పా? మీ వోడు దద్దమ్మ అనొప్పేసుకో!" రెచ్చకొట్టాడు ఆమె వెనుక భాగాన్ని చూస్తూ.

 

"నాకు వొంట్లో ఓపిక రాగానే ఉన్న ఎకరా సెక్కనూ బాగు చేసుకుని, సాగు సేసుకోవచ్చు."

 

"అది బాగు పట్టం, నేను కలక్టెరు అవ్వడం ఒకేసారవుతాయ్."

 

"నవ్విన నాపసేను పండొచ్చేమో.  ఏం సెప్పగలం?" నూకాలమ్మ అంది.

 

" నా భూవిని ఆనుకునున్నదేనా నీ భూవి, ఆకాశం నించి కిందికి రాలినాదా? అందులో రాలు పండతాయా, పంట పండుద్దా? ఎవడో నవ్విండు కదా అని నాపసేను పండేస్తాదా? దున్నుకోనోడికి బూవెందుకూ?" వెకిలిగా నవ్వుతూ అన్నాడు దాలయ్య.

 

"నువ్వు దున్ని పండించగలిగింది మెం సేయ్యనేమా?" వెకిలి నవ్వును పట్టించుకో కుండా అన్నాడు అప్పన్న.

 

"నేనూ నువ్వూ ఒకటి కాదు. నేను డబ్బు కర్సు పెట్టగలను.  నీ దగ్గిరున్నది సిల్ల పెంకులు."

 

“పొలమంటూ ఉంటే దున్నుకో గలిగినపుడే దున్నుకో వచ్చు. దున్నుకోగలిగినపుడు పొలం ఆకాశం నించి రాల్తాదా?"

 

దాలయ్య వెళ్లి పోయాడు, ఈ రోజుకు ఈ బోధ చాలని.

 

                                            

 

                               ***

 

"సోమవారం మంచిరోజు.  వెళ్లి షాహుకారులై రండి," అన్నాడు నరసింహాచార్యులు.

 

మూడు తరాలుగా ఆ ఊరి పూజారుల కుటుంబం ఆయనది.  ఆ ఊరే అయన ప్రపంచం.

 

"సావుకారోడికి డబ్బు పెట్టుబడిగా కావాలి.  కూలోడికి సెవటే పెట్టుబడి," దీనంగా అన్నాడు ఆప్పన్న.

 

ఊరొదిలిపోతున్నందుకు దిగులు మనసంతా పొగమంచులా వ్యాపించింది.  ఏడుపొక్కటే తక్కువ, నూతిలో కప్ప సముద్రానికి పయనమైనట్టు.

 

"ఊళ్ళో ఉండటం ముక్కేమా, పాణం నిలబెట్టుకోడం ముక్కేమా?" ఓదార్పుగా అంది నూకాలు.

 

"పానం నిలబెట్టుకోడాకి అక్కడ ఇక్కడికన్నా ఎక్కువ ఈలని దేవుడు సెప్పుంటే ఈ ఏడుపుండదు. పిచ్ఛాశ అంతే," ఆప్పన్న అన్నాడు మామూలుగా కనబడటానికి ప్రయత్నిస్తూ. 

 

దారి ఖర్చుకై ముక్కుపుడక అమ్మేసింది. రామాచారి లాభపడ్డాడు." ముక్కర నేకపోతే నీకొచ్చిన లోటు నేదులే," అన్నాడు మనసారా ఆమెను చూస్తూ --వయసుతో పనిలేదు. నిత్యం దగ్గేవాడు, మూడు కాళ్లవాడు కూడా ఆ విధంగా ఆనందించొచ్చు, చొంగ కార్చొచ్చు.

 

సీతయ్యకు చెప్పాల్సింది చెప్పాడు దాలయ్య. వాళ్లిద్దర్నీ బస్సెక్కించడానికి కూడా వచ్చాడు దాలయ్య. అది కిటికీ అద్దాలు లేని బస్సు.  డకోటా విమానంలా కూడా వుంది. ముసలిదైపోయిన అది వొణికింది, సొణిగింది, దగ్గింది, మూలిగింది. 

 

"నా బామ్మరిది బస్సు కాడికొచ్చి మిమ్మల్ని దింపుకుంటాడు. బయమ్ లేదు. ఆడు నగరంలో సూడని సందు, మాట్టాడని మనిసి లేరు. ఆడు పల్లెలో ఆ పట్నం గురించే పుట్టింది. ఎక్కడ పుట్టావా అన్నది కాదు కావాల్చింది.  ఏమి సేయగలవన్నది కావాలి.  పొలం అమ్మడం మరిసి పోవద్దు.  పది రూపాయలు అదనంగానే ఇస్తా. నేనిచ్చే రేటే మనూరు భూ అమ్మకాలకు ఆధార మవుద్ది."

 

"పండని  పొలాన్ని కొరుక్కు తింటామా ఏటి, ముందు అవతల కొమ్మ అంది దానికి యాలాడి తేనేగా ఇప్పుడున్న దాన్ని వొదిలెయ్యాలా?" నూకాలంది అప్పటికి దాలయ్యను మాటలు ఆపటానికి.

 

దాలయ్య ఎప్పటిలాగే  ఆమె వైపు ఆబగా చూసాడు విమానం బయలుదేరుతుంటే. ఆమె లోపలి చూపు  మరల్చింది చీదరపుట్టి. ఇద్దరికీ దిగులేసింది ఉన్న ఊరు వొదులుతుంటే. దాన్నుంచి తాము గాక  తమనుంచి అదే దూరమవుతున్నట్టు అనిపించింది --రెండూ ఒకటే అయినా. అప్పన్న కన్నీరు పెట్టుకున్నాడు. నగరంలో సీతయ్య అండ కాబోతున్నాడు. ఎలాంటి అండ అది? పెరుమాళ్ళకు తెలుసు. 

 

"మన బతుక్కి ఈ బస్సే ఎక్కవ," అన్నాడు నూకాలుని నవ్వించడానికి. ఆమెకు నవ్వు రాకపోయినా నవ్వింది. అతని కోసమని.

 

"సాలక,  ఇమానం ఎక్కుదామనుకున్నావా ఏటి?" అతన్ని గోముగా చూస్తూ అంది.

 

ఆమెను, తన ప్రాణాన్నిదగ్గిరకు తీసుకోవాలని అనిపించింది లేకపోతే హంసలా ఎగిరిపోతుందేమో అన్న భయమేసి.

 

                                       ***

 

సీతయొచ్చాడు. ఆ నగరం తన పాలనలో ఉన్నంత ధీమాగా కనిపించి అప్పన్నకు ధైర్యమొచ్చింది. అతన్ని అప్పన్న కౌగలించుకున్నాడు. "నన్ను మనువాడతావా ఏటి నూకాలునొదిలేసి?" అన్నాడు నవ్వుతూ, నూకాలువైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. నూకాలు మర్యాదకు నవ్వుతూ తలొంచుకుంది. ఆటోలో సామానేసి నిర్మాణదశలో ఉన్న పెద్ద భవనానికి తీసుకెళ్లాడు. ఐదంతస్తులు, అన్నిటికన్నా పైన  అనుమతి లేని "పెంట్ హౌస్" ఓనరు ఉండటానికి లేక దాన్ని తరువాత అమ్మేయడానికి. సెల్లారులో వీళ్ళ మకాం. సీతయ్యది వేరే భవనం కాపలా, వగైరా.

 

శివరావు ఆరడుగుల ఎత్తుంటాడు ఒకటి రెండంగుళాలు అటో ఇటో. కోట్లాది వ్యాపారం చేస్తూ, ఆ భారానికి కృంగిపోయినట్టుంటాడు. విచారం అతని తల మీద గూడుకట్టినట్టుంటాడు. వయసు యాభై పైన. మెడలోని ఇరవై రెండు కారెట్ల గొలుసు ఇరవై నాలుగు కారెట్లన్నట్టు మెరుస్తోంది.

 

"మీరెట్టా పని చేస్తారో గమనించి అప్పుడు మీకు ఎంత కూలీ ఇవ్వాలో నిర్ణయిస్తా," అన్నాడు వాళ్ళను కూలికి కాక జిల్లా అధికారులుగా నియమించబోతున్నట్టు. 

 

కాపలా ఉద్యోగంలో ప్రతిభను చూపించడానికి అవకాశం శున్యం అని  అక్కడున్న నలుగురికీ తెలుసు. ఒక్కోసారి అబద్ధాన్నికాపాడ వలసిన అవసరం అందరి మీద ఉంటుంది.  సీతయ్య అప్పన్నను ఆనుకుని నిలబడ్డాడు ఓనరుగారి అంగరక్షకుడిగానో, అప్పన్న అంగరక్షకుడిగానో.  కూపస్త జీవితాన్ని గడిపిన మండూకం ఓనరులాంటి మర్యాదస్థుల ముందు  గంతులు వేసే  ప్రమాదం ఉందని జీవితాన్ని అతిగా గమనించిన సీతయ్య భావించాడు.  ఓనరును కాపాడుకోవలసిన బాధ్యతను సీతయ్య  ఏనాడో స్వీకరించి ఉన్నాడు.

 

"ఒప్పేసుకో!" అన్నాడు అప్పన్న చెవులో, శివరావుకు వినబడేట్లు.  ఒప్పేసుకోక వేరే మార్గమేదో ఉన్నట్టు.

 

"బలవంతపెట్టక," రంగబాబన్నాడు గంభీరంగా.  వంద శాతం నమ్మకం ప్రజాస్వామ్యంపై ఉన్నట్టు.

 

శివరావు రాముడు కాకపోవచ్చుగాని, అతనిపట్ల సీతయ్య అతి విశ్వాసపాత్రతను ప్రదర్శిస్తాడు. అతని బతుకులోని ఇతరులకు తెలియని కొన్ని విషయాలు సీతయ్యకు తెలుసు. అతి విశ్వాసంతో సీతయ్య మెసలడానికి అవసరమైన పైకాన్ని లెక్కపెట్ట కుండా శివరావు ఇస్తాడు. వ్యక్తికీ వ్యక్తికీ ఉండేది కేవలం వ్యాపార, వ్యవహార అనుబంధాలేనని ఏ వ్యాపారం చేయకపోయినా అతనికి తెలుసు.

 

"మీరు పెద్దోరు.  ఓ రూపాయ అదనంగా ఇవ్వగలరని నాకు తెలుసు," అని అతి వినయంగా అన్నాడు నడుం వొంచి, చేతులు కట్టుకుని.

 

శివరావు ఇలాంటి వినయాలు ముక్కోటి చూసాడు. అవన్నీ తనకు బాకీలని అతను భావిస్తాడు. శివరావు మౌనం వహించిన చోట సీతయ్య కలుగ జేసుకోవాలన్న అనుకోని ఒప్పందం ఇరువురి మధ్యా ఉంది.

 

"ఎవరన్నా ఓనరుగారికి బాకీ పడాలేగాని, ఓనరుగారు ఎవరికీ అర పైసా బాకీ ఉండరు," సీతయ్యన్నాడు.

 

"అయ్యగారు ఏం సెబితే అదే," అనింది నూకాలు.

 

"ఆమె తెలివిగలది," అన్నాడు శివరావు, ఆమె అన్నదాంట్లో ఏ తెలివితేటలూ వ్యక్తమవకపోయినా.  ఆమె మాట్లాడుతున్నప్పుడు కూడా శివరావు  ఆమె వైపు పావు క్షణం పాటు కూడా చూడక పోవటం ఆమెకు అతని మీద గౌరవాన్ని కలిగించింది. రంగబాబు వెళ్ళిపోయాడు.

 

"బతకటానికి ఈ పనే కాక ఏరేయీ ఉంటాయి," అన్నాడు సీతయ్య.  అవి ఓదార్పు మాటలు కావు.

 

"సీతయ్యబావా, నువ్ సదుంకున్నోల్లకు పాఠాలు సెప్పగలవు," అప్పన్న అన్నాడు. 

                                       

అనేక పనులకు ఉపయోగించుకునేవాడు ఓనరు సీతయ్యను, సలహా సంప్రదింపులతో సహా. సీతయ్య మరో భవన నిర్మాణములో పర్యవేక్షకుడిగా కూడా ఉంటున్నాడు. పదిహేనేళ్లకు తాపీ మేస్త్రిగా ఆరంభించిన జీవితాన్ని పదేళ్లలో 'పర్యవేక్షకుడిగా' మార్చుకొగలిగాడు. దశాబ్ద జీవితాన్నీ శివరావుకే అంకితం చేసాడు.  అది అతన్ని కోటీశ్వరుడ్ని చేసింది. ఇంకా పెళ్లి చేసుకోలేదు. 

 

అప్పన్న దంపతులు వచ్చిన మరుసటిరోజు ఓనరుతో మాట్టాడి ఒక వైద్యుడితో మాట్లాడించి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆయన క్షుణ్ణంగా పరీక్షలు చేయించి అనేక మందులు ఇచ్చాడు. అప్పన్న ఉబ్బితబ్బిబ్బులయ్యాడు.  సీతయ్యకూ ఓనరుకు చర్మంతో చెప్పులు కుట్టించి ఇవ్వాలనిపించింది. మూడో రోజు సింహాచలం తీసుకెళ్లాడు వాళ్ళిద్దర్నీ. అప్పన్న దరిద్రం పోతుందని అతనికి గుండు చేయించాడు. "గుండుతో బాగున్నావయ్యా!" అని భార్య అంది. నాలుగో రోజు కైలాసగిరి తీసుకెళ్లాడు. వాళ్లకు కైలాసంలో ఉన్నట్లనిపించింది. మహానగరం చాపలా పరుచుకుని ఉంది.  చీమల పుట్టలా అనిపించింది. ఊరును చూసి ఇద్దరూ వొణికారు. దీంట్లో ఉండటానికి తమకు అర్హతుందా.  అది తమను ఉండనిస్తుందా అన్న భయం కలిగింది. సీతయ్య అండ విలువ వాళ్ళ దృష్టిలో ఇనుమడించింది. ముందు ముందు అతను  సహాయం చేస్తాడో లేదో.  అసలు ఇప్పుడైనా తమ కులం కూడా కాని అతను ఏమి ఆశించి అంత  మేలు చెయ్యడానికి పూనుకున్నాడు.  కేవలం దాలయ్య  మాటకు కట్టుబడా? "నీకు రుణపడున్నాం, బావా," అన్నాడు అప్పన్న. "తీర్చుకుందుగానిలే" అన్నాడు  సీతయ్య .

 

చిల్లర పనులు అనేకం చేస్తున్నారు భార్యాభర్తలు.  పగలంతా ఖాళీ ఉండటం లేదు. అప్పన్నలో ఏదో నూతన శక్తి ప్రవేశించింది. 

 

"మీరు ఇక ఈ ఊరోళ్లు అయిపోయినారు కదా గ్రామంలో ఆస్తిపాస్తులుంటే అమ్మిపారేయకూడదూ?" అని రోజుకొకసారి అనేవాడు సీతయ్య. ఉన్న కాస్తా అమ్మాలంటే దిగులు, అమ్మకపోతే సీతయ్య ఏమన్నా అనుకుంటాడేమోనని భయం.

 

దిగుళ్ళకు దూరమై ఆచ్ఛాదన లేని పున్నమి చంద్రుడిలా వెలిగి పోతోంది నూకాలు.   

 

ఒక రోజున, ఈ రోజు పని లేదుకదా అల్లా వెళ్ళొద్దాం రా అన్నాడు సీతయ్య. అప్పన్న సిగ్గుపడ్డాడు.  భార్య ఒంటరిగా ఉండిపోతుందని భయపడ్డాడు, మోటారు వాహనం మీద ఎగిరి గంతేయాలని ఉన్నా. అతను సంతోషించడం ఆమెకు ఆనందాన్నిచ్చింది. 

 

"నువ్ ఒక్కదానివై పోతావ్."

 

"రావణసోమొచ్చి ఎట్టకెలతాడేట్రా?" సీతయ్య అన్నాడు.

 

"రావులోరు కలగన్నాడేటి  రావణసామి ఎత్తుకెల్లతాడని ?" అప్పన్న అన్నాడు.

 

"సీతమ్మమ్మోరు కంటే గొప్పదాన్నా రావణసోములు నాగురించి రాడానికి?"

 

వాళ్ళను గేటు దాకా సాగనంపింది.  అక్కడే కూర్చుంది.  

 

శివరావు  కార్లో వచ్చాడు. లేచి వెళ్లి సెల్లార్లో కూర్చుని వంకాయలు కోయడం మొదలుపెట్టింది. ఐదు నిముషాల తర్వాత శివరావు  అప్పన్నను పిలిచాడు. స్వరం విచారగ్రస్తంగా ఉంది. తన కష్టాన్ని అతనికి  చెప్పుకోవాలన్నట్టు పిలిచాడు. చేయి కడుక్కుని, పవిట చెంగుకు తుడుచుకుని మొదటి అంతస్తు మెట్లెక్కడం మొదలుబెట్టింది. 'అయ్యగారి గొంతుకు అలా ఉందేమిటి? మంచినీళ్ల సీసా కొనుక్కురమ్మంటారేమో. ఒంట్లో బాగాలేదా?' పుట్టపురుగు లేని ఆ ఆవరణలోని నిశ్శబ్దం అబద్ధంలా  ధ్వనిస్తోంది. 

 

శివరావు  తనకున్న మూడు భవనాల్లో  కోట లాంటి ఒక దాంట్లో ఉంటాడు.   రాణి లాంటి భార్యతో, యువరాజుల్లాంటి ఇద్దరు మగ పిల్లలతో. నిర్మాణం పూర్తవుతున్న ఈ భవనంలో మొదటి అంతస్తులో ఒక మంచం వేసుంటుంది శివరావు సేద తీర్చుకోడానికి. సీతయ్య పొట్లాలు తెచ్చిచ్చిన రోజు  రాత్రి పది గంటల దాకా గడిపి కారులో సొంత ఇంటికి పోతాడు. అలా వెళుతూ ఒక సారి ప్రమాదంలో ఇరుక్కున్నాడు.

 

అతను మంచం మీద కూర్చుని సిగరెట్టు  తాగుతున్నాడు. గదిలో చీకటి కమ్ముకుని ఉంది. దాన్ని చెరచడం ఇష్టం లేనట్టు సిగరెట్టును నలపకుండా విసిరేసాడు. ఆమె తటపటాయిస్తూ గది ముందు నిలబడింది,  లక్ష్మణుడు అక్కడ గీత గీసినట్లు. 

 

"అయ్యగారూ!"

 

"బల్బు మాడి పోయింది, లోనికిరా."

 

సిగరెట్టు ఆరిపోలేదు. కొస ఊపిరితో ఉంది.  ఉపయోగపడని సాక్షిలా. ఆతను మాత్రం కనబడటం లేదు అదృశ్యమైనట్టు. "రాను" అని అనగలదా? గుమ్మం దాటడానికి ప్రయత్నిస్తోంది. కాళ్ళు రాళ్లయ్యాయి. పై శరీరంతో సంబంధం తెగింది.

 

అతను గుమ్మానికి దగ్గరగా రాహువులా పొంచి ఉన్నాడు. కనురెప్పపాటులో అతని పంజా ఆమె చేతిని పట్టుకుంది అక్కడి ఎముకను విరచాలన్నట్టు. ఎడమ చేతి నాలుగు గాజులూ చిట్లిపోయాయి. ఒక ముక్క గుచ్చుకుంది. ఆ మాత్రం నొప్పులను ఖాతరు చెయ్యని ఆమె "అమ్మా" అని గొంతు చిరిగేలా అరిచింది. పంజా సడలలేదు.  లోపలికి  లాగుతోంది మొసలిలా. 

 

సైరంధ్రికి భీముడు అవసరమయ్యాడు తనను రక్షించుకోడానికి. నూకాలమ్మ కుడి చేయి లేచింది సమ్మెట పోటు వేసేటప్పటిలా. అతనికి దవడ పళ్ళు కదిలినట్టనిపించింది. "అమ్మా!" అన్నాడు చేయి వదిలేస్తూ. ఆమె వెనక్కొచ్చింది రాహువును వొదిలించుకుని.  వెళ్లి గేటు ముందు, రోడ్డును అనుకుని నిలబడింది.

 

తొమ్మిదికి అప్పన్న ఒక్కడే వచ్చాడు.  ఆనందం నింపిన తిత్తిలా వచ్చాడు. ఆమె భోజనం ఒడ్డించింది. ఆమె ముఖంలోకి చూసాడు.  ఉబ్బి ఉంది, కళ్ళు ఎర్రగా, పొడిగా ఉన్నాయి. పొయ్యి పొగ కారణంగానా? అయినా అడిగాడు:  "ఏమైంది?" ఆమె దాచదలచ లేదు. దాస్తే ఆ కథ అంతటితో ముగియదు. తమ ఇక్కడి పెద్ద కథ మాత్రం ముగిసినట్టే.  తాను చేసిన నేరానికి శివరావు శిక్ష వేయకుండా వదలడు.  ఆమె చేయి చాచిచూపింది. చిన్న గాజు పెంకు ఇంకా దిగబడి వుంది. చుట్టూ రక్తం గడ్డ కడుతోంది.  "ఓనరా?" అప్పన్న అడిగాడు. తల ఊపింది విషయం వివరించబోతూ. అతను గాలి తీసిన తిత్తి అయ్యాడు. రాత్రి ఒకరినొకరు గాఢంగా కౌగలించుకున్నపుడు అతను బోరు మన్నాడు. ఆమె ఓదార్చింది తాను మళ్ళీ ఏడవకుండా. ఆమె పక్కకు పొర్లకుండా పొదివి పట్టుకున్నాడు తన ప్రాణాన్ని ఎవరినీ దొంగిలించనీయనట్టు.  ఆమె అతని ప్రాణం. శక్తి. ప్రాణశక్తి.


 

తెల్లారుజామునే డకోటా విమానం ఎక్కారు.  అది పుష్పక విమానంలా వాళ్ళను ఆనందపరిచింది.

 

ఊరు పలకరించింది నిష్టూరంగా. ఎవరిదో గేదె పనసకాయంత పొదుగుతో గుడిసె ముందు నిలబడుంది. గుడిసె ముందు కుక్క మొరిగింది తోకాడిస్తూ. చింతచెట్టు పిందెలేయడం ఆరంభించింది, ఆమె మెడ తడుముకుంది. తాళిబొట్టుంది.  కనుచూపుకి అందే దూరంలో కనిపిస్తున్న వాళ్ళ పొలం దగ్గరికి నడచి మధ్యలో నిలుచుని దాన్ని పరికించింది. రెండు చేతులూ కట్టుకుని ఒక జబ్బను మరో చేత్తో నిమురుకుంటూ, వాటిలోని బలాన్నిపరామర్శిస్తూ.  మణికట్లు చూసుకుంది.  ఒక్కొక దానికీ రెండు గాజులున్నాయి. ఆ స్వల్ప గాయం మానడం ఆరంభించింది. గుడిసె మీదా, పొలమంతా లేత ఎండ పడుతోంది సమానత్వాన్ని చాటుతూ.

 

అతను వెల కట్టలేని తన ఆస్తిని, తన శక్తిని ఎప్పుడూ చూడనంతగా చూస్తున్నాడు. అభయమిస్తున్నట్టు నవ్వింది.

 

దూరం నుంచి దాలయ్య వస్తూ కనిపించాడు.


కలలాంటి నిజం!

*****

bottom of page