MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కథా మధురాలు
పప్పు సత్యం
కాళీపట్నం సీతా వసంత లక్ష్మి
పెళ్లి హాల్ అంతటా సందడిగా ఉంది. పలకరింపులు, చిరునవ్వులు, పట్టుచీరల కరకరలు, బంగారం, డైమండ్ నగల తళతళలు, కొత్త గాజుల గలగలలు, మగవారి ప్యాంటు షర్టుల కసకసలు, పెళ్ళికొడుకు ముచ్చట్లు, పెళ్లికూతురు మురిపాలు, కొత్త కోడళ్ల మీద వేళాకోళాలు, కడుపుతో ఉన్న అమ్మాయిల ఆపసోపాలు, మొత్తం మీద కళకళలాడిపోతోంది.
పెళ్లి హాల్లో ఎంత హడావుడి ఉందో అంతకు మించి వంట హాల్లో ఉంది ఖంగారు, హడావుడి. ఆ ఊరిలో ఏ పెళ్లి అయినా కాస్త ఆర్భాటంగా జరగాలంటే, లక్ష్మి కల్యాణ మండపం, బాంక్వెట్ హాల్, తోడుగా సత్యం కేటరింగ్ ఉండి తీరాల్సిందే.
ఆ గ్రూపులో పెద్ద సత్యంగారు, చిన్న సత్యం, చిట్టి సత్యం ఉండాల్సిందే. అవటానికి కేవలం పెద్ద సత్యం మాత్రమే అసలైన సత్యం పేరు గలవాడైనా, అతడికి ఉన్న పేరు ప్రతిష్టల మూలంగా అతని అసిస్టెంట్లకు కూడా అదే పేరు తగులుకుంది.
ఈ కేటరింగ్ కంపెనీలో పనిచేసే పేరుగాంచిన మరో ఇద్దరు పెళ్లి బూరి, చిట్టి బూరీ. బూర్ల స్పెషలిస్టుగా ఆ పేరు సంపాదించుకున్నారు. పెళ్లి బూరి అసలు పేరు సూర్యం, అది కాస్తా సూరిగా తదుపరి స్పెషలైజేషన్ ద్వారా బూరిగా మారింది. సకల కార్య కోవిదుడు, అంటే పాత్రలు కడగటం దగ్గరినుంచి, సర్వర్ లా యూనిఫార్మ్ లో హడావిడి చేసే చిట్టిబూరి పేరు గురించి ఇక ఎవరూ పట్టించుకోలేదు.
వంటహాల్లో గ్యాస్ పొయ్యిలు భగభగా మండుతూ భోజనాల తయారీలో తమదే పెద్ద చేయి అంటూ పైపైకి ఎగసెగసి పడుతు న్నాయి.
చిట్టి సత్యం జోరుగా గుమ్మడి కాయ ముక్కలు నరికి., ... క్షమించాలి, తరిగి పడేస్తున్నాడు. గుమ్మడికాయ అవగానే వంకాయలు కూడా పెద్ద పెద్ద ముక్కలుగా తరగటం ఆరంభించాడు. తొందరలో కొన్ని పుచ్చు ముక్కలు కూడా తోసేసి, వెంటనే నాలుక్కరుచుకుని, వాటిని తీసి పక్కన తొక్కలున్న బుట్టలో పడేశాడు. అది ఎవరి కంట పడకూడదో వారి కంట పడనే పడింది. పెద్ద సత్యంకి చాలా కోపం వచ్చింది.
"ఇలాంటి వెధవ పుచ్చుపనులూ, చచ్చుపనులూ చేస్తే ఇహ మనల్ని ఎవ్వళ్ళూ పిలవరు. పిండివంటలు తినటానికి అలవాటు పడ్డ వాళ్ళం , యాయవారాలు చేసుకోవలసి వస్తుంది. జాగ్రత్త. కాస్త ఒళ్ళు, కళ్ళూ దగ్గరపెట్టుకుని పనిచేయండి"... అంటూ కసిరి వెళ్ళాడు.
"అయ్యో , పప్పు అడుగంటుతోందేమో " అనుకుంటూ మూత తీసేసిన పెద్ద కుక్కర్ లో ఉడుకుతున్న ముద్దపప్పు కలియబెడుతూ, చేత్తో ఒక పలుకు నొక్కి చూసుకున్నాడు. " ఉడికిపోయింది, హమ్మయ్య, పప్పు ఉడికితే సగం వంటయినట్టే" అనుకుంటూ, పాకెట్టెడు ఉప్పు అందులో పోసి కలియబెట్టాడు.
ఇక మిగిలింది ముక్కల పులుసు. సలసల కాగుతున్న నీళ్లలో తరిగి ఉంచిన గుమ్మిడికాయ ముక్కలు, వంకాయ ముక్కలు, ములక్కాడలు ఎత్తి పడేశాడు.
"చిట్టీ కాస్త పప్పు చూస్తూండు, నేవెళ్ళి నెయ్యి డబ్బా తెచ్చుకొస్తాను. నేతి డబ్బా కోసం వెళ్లి ఎంతసేపైంది? ఒక్కొక్క పనికి ఇలా ఇద్దరేసి వెళ్లాల్సొస్తే, ఈ వంటెలా అయ్యేడుస్తుంది?" సణుక్కుంటూ స్టోర్ వైపుకి వెళ్ళాడు.
"ఈ పెద్దన్న ఎప్పుడూ ఇంతే. తానొక్కడే పనిమంతుడూ, బాధ్యతున్నవాడూ అయినట్టూను, నేనేదో పోరంబోకులా తిరుగుతున్నట్టూను" అంటూ గొణుక్కుంటూ గ్యాస్ మంటని కాస్త ఎక్కువ చేశాడు. కొంచెం వేడి చిట్టి సత్యం బుర్రలోకీ ప్రవేశించినట్టు అనుభూతి. ఆ పప్పు సంగతేమిటో చూడటానికి అటు కదిలాడు.
పెద్ద గరిటె చేతబట్టి కాస్త పప్పు బైటికి తీసి, చేత్తో నొక్కి చూశాడు చిట్టి. సుబ్భరంగా ఉడికిపోయింది. ఇక ఉప్పేసి కలియబెట్టేస్తే దింపెయ్యచ్చు. ఒక డబ్బాతో కొలత చూసుకుని తీసి పప్పులో వేసి ఎనిపేసి కిందికి దింపేశాడు. ఇక ఓ మాటు బాత్రూం కి వెళ్లి వచ్చి మళ్ళీ కాళ్ళూ చేతులూ కడుక్కుంటేనే గానీ వడ్డనకు యూనిఫారం ఎక్కించుకోడానికి వీల్లేదు అనుకుంటూ తనపని పూర్తయినందుకు సంతోషంగా బాత్రూం లవైపు నడిచాడు.
నేతి డబ్బా భుజం మీదేసుకుని చిన్న సత్యం ముందు నడుస్తూంటే, ఠీవిగా వెనక నడుచుకుంటూ వస్తున్న పెద్ద సత్యం అపర భీముడిలా కనిపించాడు. పులుసు పోపు వేసేస్తే వంట పూర్తయినట్టే. ఇక చూడాల్సింది బూరెలొక్కటే.
"పెళ్లి బూరీ, నీ పనెంతవరకూ వచ్చింది? ఇంకా ఎంత పూర్ణం మిగిలింది?" తనిఖీ చేస్తూ అన్నాడు. "ఈ ఏభై కూడా వేసేయ్. ఇక పూర్ణమూ, తోపు కూడా మిగలకూడదు. ఎంతా, అరగంటలో అయిపోతుంది. ఎలాగూ పన్నెండున్నర అయింది కదా, వంట రెడీ, మొదటి బాచ్ సర్వీస్ సిద్ధం చేశామని నేవెళ్ళి సారుకు చెప్పొస్తా". అంటూ డైనింగ్ హాల్ వైపుకి వెడుతూ వెడుతూ, నెయ్యి చిన్న గిన్నెల్లో పోసి పెట్టమని పురమాయించి వెళ్ళాడు.
పెళ్ళిబూరి ముఖంలో అలసట కనిపిస్తున్నా, టైం కి అంతా పూర్తయిందని అందుకున్న మెచ్చుకోలు, అతడి ముఖంలో వెయ్యి బల్బుల కాంతిని నింపింది
"ఈ చిట్టి ఎటుపోయాడో" అని తనలోతాను అనుకుంటూ ఉండగానే, యూనిఫారంలో చిట్టి సత్యం కనిపించేసరికి తృప్తిగా నిట్టూర్చాడు, పెద్ద సత్యం. ఆ తృప్తి అట్టేసేపు నిలవలేదు.
"పెద్దన్నా, పప్పులో ఉప్పు వేసేశాను. మరిక వెయ్యక్కరలేదు" అన్న చిట్టి సత్యం మాట వినగానే. మొట్టికాయ తిన్నట్టు అదిరిపడ్డాడు పెద్ద సత్యం.
"ఉప్పా!" అనిమాత్రం అనగలిగాడు. మొదట ఏడుస్తున్నట్టు ఎక్కులెక్కినట్టు వచ్చిన మాటలు, తరవాత చిల్లిబిందెలో నీళ్లలా ధారాపాతంగా జారిపోయాయి. "కందిపప్పు వేయించి పొద్దున్న 7 గంటలకు స్టౌవెక్కిస్తే, పూర్ణంలా ఉడకటానికి 5 గంటలు మింగిన రాకాసి ముద్దపప్పు , ఇప్పుడంతా ఉప్పు మయం, ఉప్పు కషాయం చేసేశావా చిట్టీ, ఎంతపని చేశావురా" అన్నాడు. ఆక్రోశం ఇంకా అవలేదు.
" అసలు నన్నడక్కుండా ఉప్పెందుకేసేవురా? నేనూ వేస్తిని గదా! ఇప్పుడేం దారి అన్నపూర్ణమ్మ తల్లీ" అంటూ కులదైవాన్ని తలుచుకున్నాడు.
ఒక్క క్షణం ఏదో స్ఫురించిన వాడిలా చిట్టిసత్యాన్ని కోపంగా చూస్తూ, "అలా మాడిన పప్పు మొఖం వేసుకునే బదులు, ఆ నేతి డబ్బా ఇలా పట్టుకురా." అని అరిచినట్టుగా అన్నాడు.
ఇక యుద్ధ రంగంలో దిగిన యోద్ధుడిలా పెద్ద సత్యం ఆజ్ఞాపించటం, మిగతా వారంతా వినయవిధేయతలల్తో పాటించటం నిమిషాల్లో జరిగిపోయింది. పన్నెండూ నలభై ఐదుకి ఆపత్కాలం అంతరించింది. సాక్ష్యంగా ఖాళీ నేతి డబ్బా మూల నక్కి పడింది.
***
ఒంటిగంటకు డైనింగ్ హాల్లో భోజనాలకు కూర్చున్న పెళ్ళివారంతా అడిగి అడిగి, మరీ మరీ మారు వేయించుకుని పప్పు తిన్నారు. మగపెళ్ళివారి నోట ఎక్కడవిన్నా పప్పు మెచ్చుకోలే. ఇక ఆడపెళ్ళివారు, తదితర ముఖ్యంగాని అతిథులూ తినే సమయానికి పప్పు మిగలనే లేదు. పెళ్లి కూతురి తండ్రి, అన్నగారు వచ్చి -
"ఇదేమిటండీ, పప్పు సరిపడినంత ఎందుకు వండలేదు? ఆడపెళ్ళివారయితే మాత్రం పప్పు వెయ్యకుండా ఏమిటీ ఇలా చేశారు?" అంటూ మండి పడ్డారు. డబ్బులో గొడవవుతుందేమో అని గ్రహించిన పెద్ద సత్యం, వారిద్దరినీ చాటుగా తీసుకెళ్లి కాన్ఫరెన్సు పెట్టేశాడు. పప్పులో రెండుసార్లు ఉప్పు పడటంతో మొదలెట్టి, రిపేరుగా తాను అందులో గుమ్మరించిన నెయ్యి, వేసిన బెల్లం ఎలా పప్పుని పరి "పూర్ణంగా" తీర్చిదిద్దాయో, వివరించాడు.
"సార్, మీరు మమ్మల్ని మన్నించక పోతే, నా కంపెనీ అంతా మటాషయిపోతుంది" అంటూ "నీవే తప్ప నితఃపరంబెరుంగ కావవే వరద రక్షించు భద్రాత్మకా" అనేలా చేతులు జోడించేశాడు.
"హారి నీ అసాధ్యంగూలా" అని ఆశ్చర్యపోవటం మిగతావారి వంతయింది.
మరి ఆ తరువాత ఎలాంటి పబ్లిసిటీ అందిందో ఏమో గానీ సత్యం పేరు మారి "పప్పు సత్యం"గా ఘనతకెక్కాడు. సత్యం కేటరర్స్ కి ఇప్పుడొక వెబ్ సైట్ కూడా ఉంది. అందులో "పూర్ణం పప్పు" వారి "స్పెషాలిటీ" గా పేర్కొనబడి ఉంటుంది. ఇదే పప్పు సత్యం... అహహా... పరమ సత్యం.
*****