top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
adhyatmika.jpg
pustaka-parichayaalu.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
alanati.jpg
paatasanchikalu.jpg

సంపుటి 7  సంచిక  4

అక్టోబరు-డిసెంబరు 2022 సంచిక

maagurinchi.jpg
rachanalu.jpg

కథా​ మధురాలు

మైమౌ (maïmoú)

 

  భాస్కర్ సోమంచి

Bhaskar-Somanchi.jpg

                                        

 * 74-01-09 ∇ 16:58:45 లూనార్ ప్రామాణిక సమయం, కెప్లర్ బేస్ (భూమి సమయం మే 26, 2040 11: 45 UT)

 వివేక్ తన క్యాంప్ సైట్ నుండి చంద్రునిపై కెప్లర్ బేస్ వద్ద కొన్ని గజాల దూరంలో ** సౌర గ్రహణాన్ని చూస్తూ ఉన్నాడు. భూమి సూర్యుడిని పూర్తిగా ఆవరించింది. అతని స్వ గ్రహం భూమి నీలం, నలుపు కలగలసిన రంగు లో ఉంది. చుట్టూ కొద్దిగా సూర్యుని కరోనా కాంతితో మెరుస్తోంది. చంద్రుడి మీద గోధుమ రంగు కాంతి అలుముకుంది. తన తల్లితో భూమిపై గ్రహణాలు చూడటం అతనికి జ్ఞాపకం వచ్చింది. గ్రహణం ఒక నమ్మ శక్యం కానీ అద్భుతం.  చంద్రునిపై, భూమి మీద ఉన్న గ్రహణానికి వ్యతిరేక గ్రహణం చూడడం ఓ కల నిజమవ్వడమే. ఈ విశ్వాన్ని నడిపిస్తున్న శక్తకి అతను జోహార్లు అర్పించకుండా ఉండ లేక పోయాడు. దేవునిపై అతని నమ్మకం అతని తల్లి అతనికి నేర్పిందే. ఐన్స్టీన్ యొక్క ఆలోచనను అతను ఎక్కువగా నమ్మాడు, “దేవుడు విశ్వంతో పాచికలు ఆడడు”. ఆయన ఆలోచన ప్రకారం  దేవుడంటే ఎవరో ఒకరు సిద్ధాంతాలను ఏర్పరిచారు. ఆ సూత్రాల ప్రకారం విశ్వాన్ని సంచరించడానికి వదిలివేసారు.

 

వివేక్ తన స్వ గ్రహం లో ఉన్న కుటుంబం కోసం చంద్రుడి మీద జరుగుతున్న గ్రహణం స్ట్రీమ్ ని ప్రత్యేకంగా  ఏర్పాటు చేశాడు. వారందరూ చంద్రుని మీద సౌర గ్రహణాన్ని చూస్తూ పారవశ్యంలో ఉన్నారు. బైట చక్కని చంద్ర గ్రహణం. గోధుమ రంగులో చంద్రుడు. వివేక్ పంపిస్తున్న సూర్య గ్రహణం. అది ఒక అధి వాస్తవిక అనుభవం. వివేక్ వైద్యులకు సహాయం చేయడానికి, చంద్రునిపై రోబోటిక్ ఆరోగ్య నిర్వహణను అధ్యయనం చేయడానికి నాసా మిషన్ -3 లో వచ్చాడు. అతను తన పని కోసం రెండు రోబోట్లను మరియు సహాయక క్వాంటం కంప్యూటర్ ను తీసుకువచ్చాడు. అతను మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బయోమెడికల్ ఇంజనీరింగ్ లో పీహెడీ చేసాడు. రోబోటిక్ న్యూరో సర్జరీలో అతను చేసిన కృషికి నాసా అతనిని ఎంపిక చేసింది. యుఎస్ఎ చంద్రుడి మీద అనేక దశలుగా వలసరాజ్యం ఏర్పాటు చేసింది. మొదటి మిషన్ లో ఒక ఆర్బిటాల్ బేస్ ను ఏర్పాటు చేసింది - IMS -ఇంటర్నేషనల్ మూన్ స్టేషన్. అది చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది భూమి నుంచి వచ్చే ఆవశ్యక వస్తువులను చంద్రుడి మీదకు చేర్చింది. మిషన్ - 2 లో సోలార్ పానెల్స్ ను, చిన్న నిర్మాణానికి అవసరమైన పరికరాలను IMS ద్వారా అపోలో మరియు కెప్లర్ స్థావరాల వద్దకు పంపించారు. మిషన్ -3 మనుష్యులను తీసుకువచ్చింది. వారు మొక్కలను పెంచడానికి చిన్న నిర్మాణాలు, తాత్కాలిక రవాణా, తవ్విన ఐస్ ను మినీ ట్యాంకర్ లోకి తరలించే క్యాంప్ సైట్ లను, ద్రవ నీటిని తయారు చేయడానికి సోలార్ నిర్మాణా న్ని ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరాను కూడా ఏర్పాటు చేసారు. అతని స్వదేశమైన యునైటెడ్ స్టేట్స్ నుండి మానవులు వచ్చినప్పటి నుండి ఇది రెండు చంద్ర రోజులు (సుమారు 60 భూమి రోజులు). యుఎస్ఎతో పాటు, రష్యా మరియు ఇతర దేశాలు కూడా స్థావరాలను ఏర్పాటు చేశాయి. రష్యా ఇప్పటికీ ఒక సంవత్సరం క్రితం ప్రారంభించి వారి రొటేటింగ్ కాస్మోనోట్లతో ప్రయోగాలు చేస్తోంది.  అన్ని స్థావరాలు  దక్షిణ ధ్రువం వైపు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రస్తుత చంద్ర రోజు లో వాటికి సూర్య కాంతి అందుతోంది. వివేక్ అయిష్టంగానే తన సైట్ కు తిరిగి వేగంగా నడవడం ప్రారంభించాడు. 

**

 గ్రహణం సమయానికి ఒక చంద్ర కాల చక్రం (లూనార్ సైకిల్)  ముందు-

  74-01-08 ∇ 09:00:40 లూనార్ ప్రామాణిక సమయం (భూమి సమయం మే 25, 2040 4:17 UT)

 

 వివేక్ వాచ్ మోగింది. అతని కంప్యూటర్ లో మూడు సందేశాలు వచ్చాయి.  అతను నిద్ర లేచాడు. అతను రిఫ్రెష్ అవడానికి వెట్ నాప్కిన్స్ తో తుడుచుకుని, నీటి సాచెట్ మరియు పవర్ బ్రష్ తో పళ్ళు శుభ్రం చేసుకున్నాడు. రోజువారీ కాల కృత్యానికి బయో-డిగ్రేడబుల్ సాచెట్ ను చూసి దాన్ని పక్కన పడేసాడు. సాచెట్ ను ఉపయోగించడం, తరువాత ప్రత్యేక కంటైనర్ లో ఉంచడం అతనికి ఇంకా సౌకర్యంగా లేదు. అతను ప్రోటీన్ స్నాక్ తో తన క్వాంటమ్ కంప్యూటర్ ను త్వరగా చూశాడు. ఆ సందేశాలు అతని కక్ష్యలో ఉన్న చంద్ర మాడ్యూల్ నుండి లేదా ఎర్త్ కమాండ్ బేస్ నుండి కాదు. అతని కంప్యూటర్ ఎన్క్రిప్టెడ్ సందేశాలను మార్చ గలిగింది. అతని క్వాంటం కంప్యూటర్ ప్రత్యేకంగా ఐబిఎమ్ చేత నిర్మించబడింది, ఇది 1.2 భూమి రోజులలో AES-256 ఎన్క్రిప్షన్ ను కూడా మార్చగలదు. అతను ఆ మెసేజ్ లను చూశాడు. మొదటి మరియు మూడవది చాల పెద్దగా తలా తోక లేకుండా ఉన్నాయి. అతని కళ్ళు రెండవదానికి అతుక్కుపోయాయి. ఆ మెసేజ్--

 

SMASH K SITE

 

అతని ఆలోచనలు వేగంగా సాగాయి. "K అంటే కెప్లెర్  బేస్ ? ఎవరు పంపించి ఉండచ్చు? మొదటి , మూడవ మెసేజెస్ లో ఏమైనా ఉందా? మరో రెండు రోజులలో రష్యా మిషన్ ఉంది. చంద్రుడి మీద ఆధిపత్యం కోసం ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ?"

 

  అతను ఉన్న కెప్లెర్ బేస్ కి కొద్ది దూరం లో లియోనోవ్ రష్యన్ బేస్ ఉంది. గత ఇరవై యేళ్ళుగా  రష్యా తో కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. స్పేస్ కి సంబంధించి నాసా తో పని చేస్తున్నా, సహకారం అంతంత మాత్రమే. వివేక్ ఈ పజిల్ ని తానే సాల్వ్ చేయాలని అనుకున్నాడు. అక్కడ సరిహద్దులు లేక పోయినా ఎవరికి వారు పక్క దేశం వాళ్ళ ప్రైవసీ ని గౌరవిస్తున్నారు. అతను ఒక ప్లాన్ ని ఆలోచించాడు. రెండు దశలుగా అది చెయ్యాలనుకున్నాడు. మొదటిది ఇప్పుడు. కొద్ది సేపటిలో అతను రష్యన్ టీం ని కలవ బోతున్నాడు. అతని రోబోట్ దగ్గరకు నడిచాడు. రోబోట్ లో రష్యన్ కెమిస్ట్ ఆరోగ్య సమాచారాన్ని కొద్దిగా సవరించాడు.

రష్యన్ టీం కెప్లెర్ బేస్ లో వివేక్ ని కలిసింది. అతను రోబోటిక్ హెల్త్ చెక్ ఎలా పనిచేస్తుందో చూపించాడు. ఆ రోబోట్ చంద్రుడి మీద వాతావరణ పరిస్థితులను సేకరించి మనుషుల ఆరోగ్య స్థితి ని లెఖ్ఖ కట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిర్ణయిస్తుంది. అతను వాళ్ల టీం లో కెమిస్ట్ ను ఇంకా అధ్యయనం చేయాలనీ రోబోట్ చెప్పిన సమాచారాన్ని చూపించాడు. ఆ కెమిస్ట్ అక్కడే ఉండి పోయాడు. గ్రహణానికి ముందు రోబోట్ తో పరీక్షలు నిర్వహించడం మొదలు పెట్టి, అతనికి చెప్పకుండా రోబోట్ ద్వారా కెమిస్ట్ ని మత్తులోకి పంపించాడు.

 

 

ప్రస్తుత చంద్ర కాల చక్రం (లూనార్ సైకిల్), సంపూర్ణ సూర్య గ్రహణ సమయం

74-01-09 ∇ 16:58:45 లూనార్ ప్రామాణిక సమయం (భూమి సమయం మే 26, 2040 11: 45 UT)

 

వివేక్ అయిష్టంగా నల్లని బంతి లాంటి భూగోళం దృష్టి నుంచి పక్కకు తిరిగి, నడుచుకుంటూ మూడవ బేస్ స్టేజి లో ప్రవేశించాడు. అక్కడ తన స్పేస్ సూట్ తీసివేసి రష్యన్ కెమిస్ట్ స్పేస్ సూట్ వేసుకున్నాడు. అందులో రెండు మైక్రో చిప్స్ ఉన్నాయని అంతకు ముందే గుర్తించాడు. ఒక చిన్న టార్చ్ లైట్ పెట్టుకున్నాడు. బయటికి వచ్చి రోవర్ లో కూర్చున్నాడు. డ్రైవ్ చేసి లియోనోవ్ బేస్ కి కొద్దీ దూరం లో ఆపాడు. సంపూర్ణ గ్రహణం ఇంకా 30 లూనార్ నిముషాలు ఉంది.

ఆ టీం వాళ్ళందరూ గ్రహణాన్నిచూస్తూ ఉన్నారు. వివేక్ నెమ్మదిగా లియోనోవ్ బేస్ లో కి ఎంటర్ అయ్యాడు. అతని రష్యన్ సూట్ లో ఉన్న మైక్రోచిప్స్ వల్ల ఎక్కడా స్కానర్ ఇబ్బంది పెట్టలేదు. కొద్దిగా చీకటిగా ఉన్న చోట ఒక చిన్న బాక్స్ ఛాంబర్ లాగా కనపడింది. తన టార్చ్ లైట్ తో చూడగా దాని మీద 'maïmoú' అని వ్రాసి ఉంది. వివేక్ ఆ పేరు పై దృష్టి పెట్టకుండా ఆ చిన్న సెపరేటర్ ని తోసుకుని లోపలి కి వెళ్ళాడు. అక్కడ ఒక పెట్ కేజ్ తెరుచుకుని ఉంది. చంద్రుడి మీద ఎటువంటి జంతువులు ఉండకూడదని ప్రస్తుతం రూల్ ఉంది. రెండు సంవత్సరాల వరకు జంతువులని ఇక్కడ ప్రయోగాల కోసం వాడకూడదని అంతరిక్ష అంతర్జాతీయ కూటమి లో చంద్రుడి వలస దేశాలు అన్నీ సంతకం చేసాయి. వివేక్ ఆలోచనలో పడ్డాడు. రష్యన్ లు లైకా ని అంతరిక్షం లో కి పంపినట్టు ఇప్పుడు ఏమి తీసుకుని వచ్చిఉండచ్చు ? ఒక పక్క మానిటర్ ఉంది, దాని మీద అతనికి అంతకు ముందు లూనార్ సైకిల్ లో అతనికి వచ్చిన మెసేజెస్ కనబడ్డాయి.

 

ఒక్కసారి ఎవరో మీద పడ్డట్టయి పక్కకి జరిగాడు. చూస్తే ఒక కోతి !! గట్టిగా అరవబోయి ఆగాడు. ఇప్పుడు అన్నీ విడి వడ్డాయి. రష్యన్ లు తెచ్చిన కోతి కంప్యూటర్ తో ఆడుకుని కొన్ని మెసేజెస్ పంపింది. అతని స్మార్ట్ వాచ్ లో చూడగా maimou అంటే గ్రీక్ లో కోతి అని తెలిసింది. రెండవ మెసేజ్ చక్కగా అర్థమయినట్టు రావడం యాదృచ్ఛికం !!

*****

 

*చంద్రుని మీద కాల గణనం

సంవత్సరం-రోజు-చక్రం ∇ గంట:నిమిషం:సెకండ్.

తేదీ మరియు సమయం చంద్ర చిహ్నం (∇ నబ్లా) ద్వారా వేరు చేయబడ్డాయి. చాంద్రమాన సంవత్సరం పన్నెండు రోజులను కలిగి ఉంటుంది, చంద్రునిపై నడిచిన మొదటి పన్నెండు మనుషుల పేర్లు వాటికి పెట్టారు. ప్రతి రోజు 30 కాల చక్రాలుగా విభజించబడింది, ప్రతి చక్రం 24 చంద్ర-గంటలుగా విభజించబడింది. ప్రతి చంద్ర-గంటకు 60 చంద్ర-నిమిషాలు ఉంటాయి, అవి ఒక్కొక్కటి 60 చంద్ర-సెకన్‌లతో రూపొందించబడ్డాయి. చంద్రుడు భూమితో టైడల్ లాక్ చేయబడింది. చంద్రుని భ్రమణ (rotation) సమయం భూమి చుట్టూ తిరిగే పరిభ్రమణ (revolution) సమయానికి సమానంగా ఉంటుంది. దాదాపు 15 రోజుల నిరంతర పగటి వెలుతురును కలిగి ఉంటుంది (తర్వాత 15 రోజులు మొత్తం చీకటి). కాబట్టి, చంద్రునిపై ఒక "రోజు", దాదాపు 29.5 భూమి-రోజులకు అనుగుణంగా ఉంటుంది. దాదాపు ఒక నెల. ప్రతి 29 రోజులకు ఒకసారి, పౌర్ణమి ఉంటుంది, ఇది చంద్రుని "మధ్యాహ్నం" గా ఉంటుంది. కాబట్టి, చంద్రునిపై, ఒక రోజు, మధ్యాహ్నం నుండి మధ్యాహ్నం వరకు లెక్కించబడుతుంది, సుమారు 29.27 నుండి 29.83 భూమి రోజుల వరకు ఉంటుంది. ఇది స్థిరమైనది కాదు. సగటు విలువ, సుమారుగా 29.530589. కాలక్రమేణా అది పెరుగుతూ ఉంటుంది. భవిష్యత్తులో లీప్ సెకండ్ లేదా రెండు జోడించాలి. 30 చంద్ర చక్రాలను 29.53 లేదా అంతకంటే ఎక్కువ భూమి రోజులలో అమర్చడానికి చంద్రుని సెకను 29.530589/30గా నిర్వచించబడింది. నీల్ ఆమ్‌స్ట్రాంగ్ చంద్రునిపై జూలై 21, 1969 02:56:15 UTలో కాలు పెట్టినప్పటి నుండి చంద్రుని సమయ గణనం ప్రారంభమైంది.

 

http://lunarclock.org/lunar-standard-time-formats.php

 

** భూ గ్రహణాలు చంద్రునిపై వ్యతిరేకంగా ఉంటాయి. భూమిపై ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణం చంద్ర వాసులకు సంపూర్ణ సూర్యగ్రహణం అవుతుంది.


Feedback
editor@madhuravani.com
 
©  2022 madhuravani.com

మధురవాణి కొత్త సంచిక విడుదల వివరాలు ఉచితంగా సకాలంలో అందుకోవాలంటే మీ పేరు, ఇ-మెయిల్ చిరునామా editor@madhuravani.com  కి పంపించండి.

మీ వివరాలు ఎవరితోనూ పంచుకొనబడవు.​

Website Designed
 &  Maintained
 by
Srinivas Pendyala

bottom of page