top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
pustaka-parichayaalu.jpg
alanati.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
paatasanchikalu.jpg
maagurinchi.jpg

సంపుటి 8  సంచిక  1

జనవరి-మార్చి 2023 సంచిక

rachanalu.jpg

కథా​ మధురాలు

హీరోకి ఒక హీరోయిన్

 

తమిళ మూలం : జయకాంతన్
తెలుగు అనువాదం : రంగన్ సుందరేశన్.

Rangan Sudareshan.jpg

(1964 లో ఆనంద వికటన్ లో మూల తమిళ కథ తొలిగా ప్రచురించబడింది.)

నిలువుటద్దం ముందు నిల్చొని కత్తిరించిన జుత్తుని దువ్వెన వెనకభాగంతో గట్టిగా నొక్కుకుంటూ, రింగుల వెండ్రుకలని మరింతగా మెరుగుపరిచే ప్రయత్నంలో సీతారామన్ గత పదిహేను నిమిషాలు లీనమైవున్నాడు.

 

గదినిండా సువాసన తైలం, స్నో, పౌడరు, అత్తరు - వీటి నుగంధం వ్యాపించివుంది.

 

అద్దం పక్కనే, ఒక చిన్న మేజాపైన, అతని అలంకార వస్తువులన్నీ అలాగే పడి ఉన్నాయి. వాటి మధ్య అతని షేవింగ్ సెట్ - అశుభ్రంగా, మురికిగా, అలాగే సబ్బు నురుగుతో - కనిపిస్తోంది. తనను అలంకరించుకోడానికి సీతారామన్ కి అర్ధగంటకి పైగా పట్టింది, కాని ఆ షేవింగ్ సెట్ ని శుభ్రపరచడానికి అతనికి సమయం, ఓపిక, లేవు. అందుకు అగత్యమూ లేదు. అలాంటి పనులు చెయ్యడానికే కాచుకున్నట్లు మధురం ఉంది.

మధురంకి మనసులో తన భర్త విషయమై చాలా గర్వం, అతనిపై అభిమానం.

 

రోజూవారి ఉదయం కాఫీ గ్లాసుతో అతని మంచం పక్కన నిలబడి భర్తని లేపినప్పుడు, ఇంతసేపూ హాయిగా నిద్రపోతున్న అతన్ని చూస్తే ఆమెకు ఒక విధమైన అపురూపం.

 

ఇంటిపనులన్నీ పూర్తిచేసి కొళాయిముందు నిలబడి ఎటువంటి ముడతలు లేని అతని దుస్తులని ఇంకొకసారి ఉతికినప్పుడు వాటిమధ్య తడిసిపోయిన ఒక సిగరెట్టు పేకెట్టు కనిపిస్తే చాలు, తన ఎదుట కనిపించని భర్తని గుర్తుచేసుకొని మధురం నవ్వుతుంది, అప్పుడు కూడా ఆమెకి ఎంత ఆహ్లాదం?

 

ప్రతీరోజూ భర్త ఆఫీసుకు బయలుదేరినప్పుడు అతనికి ఒక రుమాలు అందించి ఇంతకుముందు ఇచ్చిన రుమాలు ఏమైందని అడిగినప్పుడు అతను జడ్డిగా నవ్వుతాడే, అది చూసి మధురంకి ఒక విధమైన ఆనందం!

 

ఇద్దరు పిల్లలకి తండ్రియైన తన భర్తలో ఇటువంటి నిరంకుశ భావం చూసిన తరువాత కూడా  మధురం అలసట, విసుగు లేకుండా, ప్రతీ దినం సంతోషం, సంతృప్తితో అతనికి సేవ చేస్తోంది.  అందులో ఉన్న రహస్యం ఏమిటి?

 

ఇద్దరికి తెలిసినది ఏదీ రహస్యం కాదు. అందువలన అది మధురంకే తెలుసు! అవును, అది అతనికి తెలియదేమో? దానిగురించిన అవగాహన, తలంపు ఉంటే, తనని చూసి చూసి మురిసిపోయి ఆమె చేస్తున్న సేవలన్నీ అంగీకరించి, నీటుగా తన ఇష్టం వచ్చినట్టు మెలగడం ఆ భర్తకెలా ఎలా సాధ్యం!

 

కాని మధురంకి అతని వాలకం ఉపేక్షగా తోచదు. అతను ఎప్పుడూ అలాంటి మనిషే అని ఆమె మనసులో ఉంది. అతని తీరు, మాటలు, చూపు, ధోరణి - అన్నీ భారీగా, గంభీరంగా కనిపించడం వలన అది ఇతరులకి ఉదాసీనతగా కనిపిస్తుందట! అతనిగురించి ఆమెకి బాగా తెలుసట!

 

“సీతారామన్ చాలా అదృష్టవంతుడు!” అని అతని సహోద్యోగులు చెప్పుకుంటారు. కాని వాళ్ళకి అతని భార్యగురించి ఇవేమీ తెలియవు. 

ఆఫీసులో అందరూ అతన్ని ‘హీరో సీతారామన్’  అనే పిలుస్తారు.

అతను వాళ్ళ ఆఫీసు కార్యక్రమాల్లో, నాటకాల్లో పాల్గొంటాడు, హీరోగానే నటిస్తాడు. ఆ అర్హత తనకి తప్పిస్తే మరెవరికీ లేదని అతని నమ్మకం. ఆఫీసులోనూ అందరూ అదే అంటున్నారు.

‘హీరో సీతారామన్’కి అందం ఉంది, అదృష్టం ఉంది. అతనికి తప్పకుండా సినిమాలో ఒక చాన్సు దొరుకుతుందట.

 

ఆ ఆఫీసులో తను ఒక గుమాస్తాగా పని చేస్తూ తన వలనే ఆ ఆఫీసుకి గౌరవం అనే ధోరణితో సీతారామన్ తన జాగాలో కూర్చొనివుంటాడు. ఏ పనీ చెయ్యకుండా నవ్వు, అహంకారంతో అతను ఉబుసుపోక కబుర్లు చెప్పుకొనిపోతుంటే అందరూ వింటారు. ఏ పనీ చెయ్యని అతని వెనుక కూర్చొని శ్రమతో రాస్తూ పళ్ళు ఇలికరించే ఇతర గుమాస్తాలకి అది మజాగా ఉంటుంది.

 

అక్కడ పని చేసే జూనియర్ క్లర్కులు - పెళ్ళికానివారు కూడా  - ఇద్దరు పిల్లలకి తండ్రి అయిన నలభైయేళ్ళ  సీతారామన్ లాగ దుస్తులు ధరించడానికి, సినిమాలు చూడడానికి, ఖర్చులు చెయ్యడానికి తమకి సాధ్యం కాదని అంగలార్చుకొనేవారు.

 

వాళ్ళకేం తెలుసు? ఇతనిలా ఉండడానికి అసలు కారణం - అతను ఇద్దరు పిల్లలకి తండ్రిగానూ, మధురంలాంటి ఒక స్త్రీకి భర్తగానూ ఉండడం వలనే అని?

 

వాళ్ళకి తెలియనక్కరలేదు, తెలియకపోయినా ఏ బాధా లేదు. మధురం వరకూ అతనికి ఆ అవగాహన లేకపోయినా ఏ బాధా లేదు.

 కాని తన ఆత్మగౌరవంకి  అతనికి  ఈ అంతర్బుద్ధి ఉండవద్దూ?

‘హీరో సీతారామన్’ దృష్టిలో అతని జీవితం, ఉద్యోగం, కుటుంబం, భార్య - ఇవన్నీ చాలా అలక్ష్యంగానే ఉన్నాయి. ఆతనికున్న ఆదర్శమంతా ఒకటే ఒకటి! తనకి సినిమాలో దొరకబోయే ఆ హీరో ఛాన్సు!

 

అతను ఆఫీసులో జీతం పుచ్చుకొని తన్ను ఒక నవ యుగ యువకుడుగా అలంకరించుకొని హఠాత్తుగా ఒకరోజు రాబోయే ఆ సినిమా ఛాన్సుకి కాచుకున్నట్టు తన జాగాలో కూర్చుంటాడు.

చాలామంది జీవితంలో అటువంటి అదృష్టం చోటుచేసుకుందట!

అతని కళ్ళల్లో మరెదైనా సరే - నిత్యమూ - ఒక అలక్ష్య భావన ప్రకాశిస్తున్ది.

 

ఆ కళ్ళు చాలా ఉందంగా ఉన్నాయని మురిసిపోయి అతని అందం, ఖ్యాతి చూసి పరవశించిన టైపిస్టు కమల ఈ హీరోకి తగిన హీరోయిన్ గా కొన్ని మాసాలముందు జరిగిన ఒక ఆఫీసు నాటకంలో నటించింది.

ఇదిగో, ఇప్పుడు గదిలో అద్దం ముదు నిలబడి అలంకరించుకొనే ఈ హీరోని చూసి మరిసిపోతున్నట్టే ఆ రోజు ఆ నాటకంలో ఆమెతో తన భర్తని చూసి మధురం హర్షించింది.

 

తన మెడలో వేలాడుతున్న మైనర్ చెయిన్ అందరికీ కనిపించే విధంగా  సీతారామన్ సిల్కు జిబ్బా, అందమైన పాదరక్షలని దాచి పొరలుతున్న పంచె మొదలైన భూషణాలతో అద్దం నుంచి కొంచెం వెనక్కి జరిగి తన పూర్తి ఆకారాన్ని చూసుకున్నప్పుడు - ఆ గదిలో, ఒక మూల, పొగ, చెమట కప్పేసిన మొహాన్ని, తడిసిన చేతులని చీర మొనతో తుడుచుకుంటూ నిలబడిన మధురంని - అద్దంలో చూసాడు.

అతను తనని చూస్తున్నాడని తెలుసుకొని మధురం నిలువుటద్దంలో అతని రూపం చూసి నవ్వింది. నవ్వుతూ అతని దగ్గరకి వచ్చి మాటాడింది. “చూడండి, ఈ నెల నుంచి మీ భోజనానికి నేనొక ఏర్పాటు చెయ్యాలని నిశ్చయించాను. మీరు ఇంటిలో భోజనం చెయ్యమంటే వినరు. ప్రొద్దున్నే టిఫన్ తరువాత ఏవేవో హోటల్లో భోజనం చేస్తే మీ ఒళ్ళు ఏమౌతుంది?” అని ఆమె చెప్తూంటే సీతారామన్ ఆమె మాటలేవీ తను వినలేదనే ధోరణిలో  ఆమె పక్క తిరిగి తన ఎదుట నిలబడిన మధురం భుజాలమీద తన రెండు చేతులు ఆంచుకొని ఆమెను రెప్పవాల్చకుండా చూసాడు. ఆ చూపులో అరుదుగా ఒక లోతైన ఆలోచన తేలుతున్నట్టనిపించింది.

 

“ఏమిటలా చూస్తున్నారు?” అని బిడియం ఆవరించుకున్నట్టు మధురం తల వొంచింది.

 

“నీవేమో అన్నావ్, నేను సరిగ్గా వినలేదు, ” అని తన మనసులో ఉన్నది చెప్పలేక సీతారామన్ మాటవరుసకి ఏదో అన్నాడు.

 

“అదేంటి? అంతగా ఆలోచన? కొత్త నాటకానికి ఏమైనా ఏర్పాట్లు జరుగుతున్నాయా?” అని ఆమె నవ్వుతూ అడిగినప్పుడు, అలా కాదని సీతారామన్ తలూపినప్పుడు అతని నుదుటమీదున్న జుత్తు కదిలే అందం చూసి, ఆహ్లాదంతో మధురం వివరించింది.

 

“మీరెందుకు హోటల్లో భోంచేసి ఒళ్ళు పాడు చేసుకోవాలని నేనొక వంటమనిషిని ఏర్పాటు చేసాను. ఇక రేపునుంచి సూటిగా మీ ఆఫీసుకే భోజనం వచ్చేస్తుంది. ఏమంటారు? సరేనా?”

 

తన ఏర్పాటు విని భర్త తన్ను పొగుడుతాడని మధురం ఎదురుచూడలేదు. అతను కూడా “దానికేం, అలాగే చెయ్” అని ఉపేక్షతో చెప్పి మళ్ళీ తనేదో చెప్పడానికి వెనకాడుతున్నట్టు ఆమె భుజాలమీదున్న చేతులు తీయకుండా “మధురం...” అని  వాత్సల్యంతో పిలిచాడు.

 

“ఏమిటి కావాలి?” అని ఆమె ప్రేమతో అడిగింది. సీతారామన్ చిరునవ్వు నవ్వాడు.

 

ఆఫీసుకి వెళ్ళినప్పుడెల్లా త్వరత్వరగా ఈలపాట పాడుతూ, ఆమెను చూడకుండా పరుగెత్తే సీతారామన్ ఇవాళ అరుదుగా తన ఎదుట సంకోచంతో ఎందుకు నిల్చొని ఉన్నాడని గ్రహించి మధురం కలవరపడింది.

 

సీతారామన్ మౌనంగా ఆలోచిస్తూ తన హంద్బగ్ తెరిచాడు. నిన్ననే ఇంటి ఖర్చులకి ఇవ్వవలసిన తన జీతం గురించి అతనికి ఇప్పుడే గుర్తుకి వచ్చింది. ఆ రొక్కం ఆమెకి అందించాడు. ఆమె తీసుకొని లెక్కబెట్టింది. యాభై రూపాయలు!

 

‘ఇదేంటి? ఇంతేనా?’ అని అడుగుతున్నట్టు మధురం అతన్ని చూసింది. అతను మళ్ళీ నవ్వాడు. ఆమె కూడా తృప్తితో నవ్వేసింది.

అంతే! ఆ విషయం అక్కడితో సరన్నమాట!

ఇటువంటి భర్త జీతంని నమ్మి కాపురం చెయ్యడమెలా సాధ్యం?

 

**

 

మధురం తల్లి తను కన్నుమూసినప్పుడు ఈ ఇల్లు తన కూతురుకి అప్పగించింది. మధురం దాని ముందు భాగం తనకని ఉంచుకొని వెనుకవైపుని మూడు భాగాలుగా చేసి అద్దెకి ఇచ్చింది. రెండు ఆవులు కొని అద్దెకున్నవారికి పాలు అమ్మింది.  తన ఇద్దరి పిలల్లని, భర్తని పోషించడానికి తను పడే కష్టాలు గురించి ఆమె లెక్కచెయ్యలేదు. అదే ఆమెకి హాయిగా ఉంది. కాని ‘నా భర్తకి వచ్చే 175 రూపాయల జీతం అతనెలా ఖర్చు చేస్తున్నారు?’ అని ఆమె మనసులో ఒక ప్రశ్న లేచినప్పుడు ‘సరేలే, మగవారికి ఎన్నో ఖర్చులుంటాయి.’ అని ఆ చిరునవ్వుతోనే మధురం అన్నీ మరిచిపోతుంది. కాని దాన్ని రవంతైనా భర్తకి ఆమె తెలియజేయకపోవడం పొరబాటు కదా?

 

“అందుకే నేనంటున్నాను. ఉత్తినే డబ్బు ఖర్చు, ఎందుకు మీరు ఒళ్లు పాడుచేసుకోవాలని, మధ్యాహ్న భోజనం హోటల్లో ఆరంభించిన తరువాత మీరు బాగా చిక్కిపోయారు, రేపటినుంచి నేను వంటమనిషిని ఏర్పాటు చేసేసాను, ” అని మధురం పదే పదే ఆ సంగతి గురించి మాటాడుతుంటే సీతారామన్ ఇక ఓర్చలేక కెవ్వుమని అరిచాడు.

 

“సరేలే, నువ్వు చెప్పినది నేను విన్నాను. ఇక నువ్వు పంపించినదే తింటాను. ఏ హోటలుకీ వెళ్ళను, సరేనా?” అని అరిచేసి అతను ఆఫీసుకి బయలుదేరాడు.

 

తను చెప్పినది అపార్ధంగా తీసుకొని భర్త వెళ్ళడం చూసి - ఆఫీసుకి వెళ్ళే సమయంలో అతనికి కోపం వచ్చిందని - మధురం కలవరపడుతూ నిల్చుంది.

 

కాని కోపంతో వేగంగా నిష్క్రమించిన సీతారామన్ ఎన్నడూ లేనట్టుగా - ఆమెకి ఆశ్చర్యం కలిగే విధంగా - ఒక క్షణం ద్వారం దగ్గర నిలబడ్డాడు. ఆ ఒక్క క్షణంలో నిమ్మళంగా ఆమెను తిరిగిచూసాడు.

మధురం తడిసిన కళ్ళతో తల వొంచి అలాగే నిల్చునున్ది.

 

అతను ఆమెను చేరి, ఆమె భుజాన్ని గట్టిగా పట్టుకొని, ఊపాడు. “మధు, నీకు బాధగా ఉందా?” అని ప్రేమతో అడిగాడు.

 

మధురంకి ఆశ్చర్యం ఇంకా ఎక్కువైంది.

 

“నాకెందుకు బాధ?” అని అంటూ తడిసిన కళ్లతో మధురం నవ్వింది. తన భర్త ఏదో నెపం గురించే ఈ నాటకం ఆడుతున్నాడని గ్రహించి ‘ఇతనికి నా దగ్గర ఏమిటి కావాలి?’ అని ఆలోచిస్తూ తన చేతిలోని రూపాయల నోట్లని చూస్తూ నిలబడింది.

 

“మధు, మధు. లోపలికి రా, నీతో ఒక సంగతి మాట్లాడాలి” అని సీతారామన్ కృత్తిమ నవ్వుతో ఆమె భుజంమీద చెయ్యి వేసి ఆమెతో గదిలోకి తిరిగివచ్చాడు. ఆమెను పిలిచినప్పుడు, గదిలో ప్రవేశించినప్పుడు ఉన్న ఉత్సాహం హఠాత్తుగా తగ్గిపోవడంతో ఏదో తీవ్రమైన ఆలోచనలో పడి మంచంమీద కూర్చున్నాడు.

“అదేమిటో చెప్పండి” అని మధురం అతని ఎదుట నిలబడినప్పుడు ఆమె చేతిలో ఆ రూపాయల నోట్లు ఉన్నాయి. అదే అతను అడుగుతున్నాడేమో. అడిగితే ఇచ్చేయాలి అని మధురం సిద్ధంగా ఉంది.

 

“మరేం లేదు. నేను బాగా ఆలోచించిన తరువాతే, నీకూ ఇది మంచిదే” అని అంటూ చెప్పవలసిన సంగతి చెప్పలేక అతను బాధ పడుతుంటే మధరం ఒక చిరునవ్వు నవ్వి అతని పక్కన వచ్చి కూర్చుంది.

 

“ఏంటి? మీరిలా మాటలని మింగుతున్నారు, హూం, చెప్పండి, ఏం కావాలి? అని అతని గడ్డంని తనవైపు తిప్పింది. ‘మీరు ఏదడిగినా సరే, ఇస్తాను’ అనే అభయం ఆమె కళ్ళలో మెరిసింది. అప్పుడు కూడా సీతారామన్ మౌనంగా తల వొంచి ఉండడం చూసి “సరే, నాకు ఇంటి పనులు బోలెడు ఉన్నాయి." అంటూ మధురం లేచింది.

“ఉండు, ఉండు!” అని ఆమె చేతిని పట్టుకొని, దగ్గరకి లాగి, కౌగిలించుకున్న సీతారామన్ ఆవేశంతో వొంగి ఆమె మొహంలోకి చూసాడు.

“మధు, నువ్వు నాకు చెప్పలేదూ - నా సంతోషమే నీ సంతోషమని?”  ఆమె చెవిలో అతను గుసగుసలాడినప్పుడు ఆ నిశ్వాసం ఆమె బుగ్గల్ని వేడిచేసింది.

 

“ఇప్పుడెందుకు దాని గురించి? మీరు ఆఫీసుకి వెళ్తున్నప్పుడు?” అని మధురం అతని పట్టునుంచి వదిలించుకోవాలని ప్రయత్నించింది.

ఆమె మనసులో ‘ఈ మహానుభావుడు ఈ నెల ఖర్చులు కొంచెం ఎక్కువగానే చేసేసారు కాబోలు, నాకిచ్చిన డబ్బు మళ్ళీ కావాలని ఈ నాటకమా? ఈ యాభై రూపాయలు లేకపోతే నాకేం నష్టం? అతన్ని చూస్తే నాకు జాలిగా ఉంది. ఇతను తన జీతాన్ని పూర్తిగా ఎలా ఖర్చు చేస్తున్నారు?’ అని ఆలోచించినా - ఒక మగవాడిని, అందులోనూ తన భర్తని, అతని ఆదాయం గురించి అడగడానికి తనకి అధికారం లేదని, అలాగ అడగడం అనుచితమని ఆమెకి తెలుసు కాబట్టి వేదనతో అతన్ని చూసి మెల్లిగా నవ్వింది.

 

అతను ఆమె చెవులని తన పెదిమలతో తాకుతూ మాట్లాడుతున్నాడు.

“మధు, నువ్వు నాకొక సాయం చెయ్యాలి, సాయమంటే అది నాకు మాత్రం చేసే సాయం కాదు. అందుకే నిన్ను అడగడానికి నాకెలాగో ఉంది. నీకు తెలుసుగా మా ఆఫీసు టైపిస్టు కమల?” అని అంటూంటే అతని ప్రార్ధన గద్గదస్వరంగా మారిపోయింది.

 

“ఎవరు? మీ హీరోయిన్ కమలా?” అని మధురం ఎగతాళిగా అడిగింది.

‘హూం, ఇతను చేసే ఖర్చులు చాలక ఆమెకి కూడా అప్పు ఇస్తున్నారు కాబోలు, ఎవరికి తెలుసు?’ అని మధురం మనసులో సణుక్కుంది. ‘మీ హీరోయిన్ కమలా?’ అని తను అడిగిన ప్రశ్నకి అతని జవాబు ఎదురుచూసింది.

 

ఆ రోజు - నాటకం ముగిసి - ఇంటికి వచ్చినప్పుడు “మన హీరోయిన్ ఎలాగుంది?” అని అతను మధురంని అడిగినప్పుడు -

“మీరేమంటున్నారు - ‘మన హీరోయిన్’ అంటే ఎవరు?” అని మధురం చిరుకోపంతో మొహం ముడుచుకున్నప్పుడు -

“మధు, విను, నాటకంలో మాత్రం ఆమె నాకు హీరోయిన్. కాని నా జీవితంలో నిజమైన హీరోయిన్ నువ్వే కదా?” అనే ఓ జవాబునే మధురం మళ్ళీ ఎదురుచూసి ఆ ప్రశ్న అడిగింది.

 

కాని సీతారామన్ జవాబు ఇవ్వకుండా ఏదో ఆలోచిస్తూ తల వొంచి “అవును, ఆ కమల గురించే చెప్తున్నాను, ఆమె ఇవాళ మధ్యాహ్నం నిన్ను చూడడానికి ఇక్కడికి వస్తుంది. నువ్వే ఆమె అడిగిన సాయం చెయ్యాలి. నాకోసం చేస్తావా? ఆమెకి నువ్వంటే చాలా నమ్మకం. దానికి తగినట్టుగా నువ్వు ఏం చెప్పినా చేస్తుంది. పాపం. ఆమెకి మరెవరూ లేరు.” అని అతను ఆ కమల గురించి అంత సానుభూతితో మాట్లాడడం చూసి మధురానికి చికాకు కలిగింది.

 

“సరేలేండి, ఆమె రానీ, మీకూ ఆలస్యం అవుతోంది” అని మధురం సంభాషణ మార్చింది.

 

“సరే, నేను వస్తాను” అని సీతారామన్ ఇష్టం లేక వెళ్తున్నట్టు నిష్క్రమించాడు.

 

మధురంకి ఏమీ బోధపడలేదు. ఆమె మనసులో ఆ రోజు సీతారామన్ హీరోయిన్ గా నటించిన కమల  పసి మొహం కనిపించింది.

 

‘ఇతనెందుకు ఆమెకి అప్పు ఇవ్వాలి?’ అనే అనుమానం మొలకెత్తగానే, “ఛీ, ఛీ, నేనెందుకు ఒక అమ్మాయిగురించి ఇలాగ తప్పుగా ఆలోచిస్తున్నాను?’ అని మధురం తన్ను తానే నిందించుకుంది.

 

అదే ఆమె స్వభావం. తన భర్త గురించి, ఇంటి ప్రశ్నల గురించి, పిల్లల అల్లరిగురించి - వీటన్నిటికీ ఒక విధంగా సమాధానం వెతకడం ఆమెకి బాగా తెలుసు.

 

లేకపోతే ఇటువంటి జ్ఞాపకాల్లో ఆమె చిక్కుకుంటే ఎలాగ? ఇంకా ఒక గంటలో ఆమె ఇద్దరు పిల్లలు బడినుంచి ఆకలితో వచ్చేస్తారు,

సబ్బు పౌడరుతో నానబెట్టిన  భర్త, పిల్లల దుస్తులు - ఉతకాలి,

వంటగదిలో బియ్యం ఉడుకుతోంది. ఆవులకి మేత చేర్చిబెట్టాలి.

 

"అబ్బా, ఎన్ని పనులున్నాయి!" అనే దిగులు, అవన్నీ చెయ్యాలనే ఆరాటం ఆమెను చుట్టుముట్టాయి.  అంతే. ఆ క్షణం ఆమె తక్కినవన్నీ మరిచిపోయింది. మొట్టమొదటి పనిగా భర్త అలాగే పడేసిన Shaving Set ని తీసుకొని బాత్ రూమ్ కి నడిచింది.

 

**

 

మధ్యాహ్నం రెండు గంటల తరువాతనే మధురంకి కొంచెం విశ్రాంతి. ఆ ఒక్క గంటకి తక్కువ అవకాశంలో హాలు మధ్య, వెనుకవైపుకి వెళ్ళే ద్వారానికి ఎదురుగా పిల్లగాలి వచ్చే గడపలో నేల చీరని పరిచి మధురం నిద్రపోతుంది. నిద్రని చాలించి కొంత సేపట్లో లేచి, మొహం కడుక్కొని వచ్చి, జడ అల్లుకోడానికి కూర్చుంటుంది. ఆ సమయం తప్పితే మళ్ళీ తల దువ్వుకోడానికి ఆమెకి వీలవదు.

అందుకని సరేలే అని ఊరుకుంటే ఎలాగ? అతను వచ్చినప్పుడు తను కొంచెం సొగసుగా కనిపించవద్దూ? అందుకే మధ్యాహ్నం మూడు గంటలకి మధురం తన అలంకరణ పూర్తి చేసుకుంటుంది.

 

అంటే, అతని రాకని మధురం మూడు గంటలనుంచే ఎదురు చూస్తుందని కాదు. నాలుగు గంటలకి పువ్వులు అమ్మేవాడు వస్తాడు. అది వాడుక! ఇద్దరు అమ్మాయిలు ఉన్నారుగా? వాళ్ళని కలుపుకొని మధురం పువ్వులు కొంటుంది. వాళ్ళకోసమే తను పువ్వులు కొంటున్నట్టు చెప్పుకుంటుంది. కాని అదేమంత

 నిజం కాదు.

 

సాయంకాలం ఆమె ఇంటిముందు వచ్చి నిలబడి ఇంట్లోకి తిరిగి వెళ్తుంది. అతను ఉదయం  అలంకరించుకున్నప్పుడు మధురం చింపిరి జుత్తుతో, మురికి బట్టలతో ఉంటుంది. "ఇదేనా ఆమె?" అని ఇంట్లోకి ప్రవేశించగానే ఒక క్షణమైనా అతను నిలబడి చూడవద్దూ?

కాని చాలా సార్లు ఆమెను అతను గమనించకుండానే వెళ్తాడు. ఆమె అతని ఉపేక్షని లెక్కచెయ్యదు. కొన్ని సమయాల్లో అతను ఆమె సింగారాన్ని చూసి నవ్వుతాడు. ఆ ఎగతాళి ఆమెకి అర్ధం కాదు.

 

**

 

మధ్యాహ్నం మూడుగంటలకి హాలులో గోడమీద అద్దంని ఆనుకుంటూ మధురం జడని సింగారించుకున్నప్పుడు, వాడుకగా తల ముందు భాగంలో కనిపించే ఆ నెరసిన వెండ్రుకలని చూసుకుంది. అక్కడ తైలం పూసుకొని దువ్వుకుంటే ఆ నెరసిన జుత్తు ఇక మరి కనిపించడంలేదే!

 

మధురం తైలం పూసుకున్నప్పుడే ఆ కమల వచ్చింది. ఆ హీరోయిన్ కమల తన నెరసిన వెండ్రుకని చూడకూడదనే తొందరలో మధురం దువ్వెనని తీసుకొని గబగబా లోపలికి పరుగెత్తుకొని వెళ్ళి గదిలోని నిలువుటద్దం ముందు నిలబడి దువ్వుకున్నప్పుడు తనకు తానే ప్రశ్నించుకుంది. ‘ఏం, ఎందుకు? ఆమె చూస్తే ఏంపోయింది? ఆమె నా నెరసిన వెండ్రుక చూడకూడదని నాకెందుకు ఇంత ఆతురత?

అంటే, ఆ హీరోకి తగినట్టు హీరోయిన్ గా నటించే ఆ కమలకి, ఆ హీరో తన జీవితంలో ఇలాంటి అనుచితమైన హీరోయిన్ తో కాపురం చేస్తున్నాడని తెలియకూడదు అనే బెంగ కారణమా?'

 

కమల ఇంటిలోకి ప్రవేశించింది!

 

“రామ్మా, ఆరోజు నాటకంలో నిన్ను చూసాను. అంతే! మా ఇంటికి రాకూడదా? ఇదిగో. కూర్చో. వస్తాను.” అని అంటూ తన తల ముందు భాగం ఉన్న జుత్తుని దువ్వెనతో మూడు సార్లు బాగా నొక్కుకుంటూ, మధురం స్నేహభావంతో ఆమెకు స్వాగతం చెప్పింది.

“నిలబడతావేం, కూర్చో!” అని హాలులో ఉన్న రెండు సోఫాలలో ఒకటి చూపి, మధురం తనూ ఒక సోఫాలో కూర్చుంది.

 

ఎవరైనా కొత్తగా ఇంటికి వచ్చారంటే మధురం అక్కడే వాళ్ళని కూర్చోబెట్టి మాటాడుతుంది.

 

ఆమె ఎదుట కూర్చున్న కమల హాలు చుట్టుపక్కలని చూసి “పిల్లలు కనిపించరేం?” అని అడిగింది.

 

“స్కూల్ నుంచి ఇంకా రాలేదు.”

 

“ఓ, చిన్నమ్మాయి కూడా వెళ్తోందా స్కూలుకి?”

 

“అవును. దాన్ని ఇప్పడే చేర్చాను. ఒక రోజు వెళ్తుంది, ఇంకొక రోజు ‘వెళ్ళను’ అని హఠం చేస్తుంది!” అని చెప్పి మధురం నవ్వింది.

 

అది విని కమలకూడా నవ్వింది. ఆ తరువాత ఒక క్షణం ఇక ఏం మాట్లాడాలో తెలియక మధురం తన రెండవ కూతురు గురించి మాటాడింది. “స్కూలుకి వెళ్ళకపోతే అది ఇంటిలో చేసే అల్లరి ఇలా అలా కాదమ్మా, పెద్ద పిల్ల చాలా సాధువు. ఇదోమో ఇలాగుంది. అసలు బట్టలే వద్దంటుంది. స్కూలునుంచి రాగానే గౌనును ఒక పక్క, జట్టిని మరొక పక్క పీకి పారేసి ఇల్లంతా కేకలు పెడుతూ తిరుగుతుంది, నేనూ దాన్ని కొట్టాను. బాదాను. ఏం చేసినా మాట వింటేనా?” అని నవ్వుతూ వివరించింది. 

 

“అవును మరి, పిల్లలంటే అలాగే” అని అంటూ అంటూ కమల తన చేతిలోని సంచీనుంచి ఒక బిస్కట్టు డబ్బా,  రెండు పెద్ద చాకలెట్ పేకెట్లు తీసి సోఫామీద పెట్టింది.

 

‘అప్పు అడగడానికి వచ్చినది ఇవన్నీ ఎందుకు కొనితేవాలి?’  ఆని మధురం ఆలోచించింది.

 

‘మొట్టమొదటిసారిగా ఒకరింటికి వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్తే ఎలాగ? అనే ఆలోచనతో తెచ్చి ఉంటుంది.నిత్యమూ ప్రతీదానిలోనూ తన స్వభావానికి తగినట్టు సమాధానాలు వెతికే మధురం “ఇవన్నీ ఎందుకమ్మా?” అని అడిగింది.

 

 

“అదేంటి అక్కయ్యా - నేనెవరో గెస్టులాగ మీరు మాటాడుతున్నారే?” అని విశేషాధికార భావంతో అడుగుతూ కమల మధురంని చూసింది.

 

మధురం కృతజ్ఞతతో, చిరునవ్వు నవ్వుతూ కమలని, ఆమె అలంకరణ - చీర, శిఖ, నగలు, ఇవన్నీ - పరిశీలించి చూసింది. మధ్య ఒక సారి లేచి వంటగదికి వెళ్ళి కాఫీకి పొయ్యి వెలిగించి మళ్ళీ హాలుకి వచ్చి కూర్చుంది.

 

ఇంత సేపైన తరువాత కమల తను వచ్చిన కారణం గురించి మాట్లాడలేదని మధురం తనే సంభాషణ ఆరంభించింది.

 

“అతను ఉదయం నాకు చెప్పి వెళ్ళారు.” అని మధురం అనగానే కమల మొహంలో దిగులు చోటుచేసుకుంది. “అతను ఏం చెప్పి వెళ్ళారు?” అని అడిగింది.

 

“మరేం లేదు, నువ్వు వస్తావని చెప్పారు. ఆ తరువాత నీకెవరూ లేరని చెప్పారు. నేనతన్ని అడగాలని అనుకున్నాను, కాని అప్పుడు సమయం దొరకలేదు. సరే, పోనీ, ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావ్? నీ సొంత ఊరు ఏది? తల్లిదండ్రులు లేకపోయినా బంధువులు ఎవరైనా ఉన్నారా?” అని మధురం అడిగింది.

 

కమల మధురం ప్రశ్నలకి వెంటనే జవాబు ఇవ్వలేదు. ఒక నిమిషం మౌనంగా తల వొంచి కూర్చుంది. వంచిన తల ఇంకా ఇంకా వొంగింది. మెడలోని ఎముకలు బెణికాయి. చెవుల మొన ఎర్రబోయింది.

 

ఆమె తలెత్తి చూసినప్పుడు తడిసిపోయిన కమల కన్నులు చూసి మధురం అదిరిపడింది.

 

తనేదో పొరబాటుగా అడిగేసాననే భయంతో మధురం ఆమెను చేరుకొని “ఎందుకమ్మా ఏడుస్తావ్?” అని చింతతో అడిగింది.

 

“మీరు నా తోడబుట్టిన అక్కయ్య అనే అభిమానంతో నేను మిమ్మల్ని చూడడానికి వచ్చాను, ” అని గద్గదస్వరంలో చెప్పిన తరువాత మరేం మాట రాకుండా కమల కింద పెదిమని కఱచుకుంది.

 

“కన్నవాళ్ళని బాల్యంలోనే పోగొట్టుకొని మామయ్య ఇంటిలో ఎన్నో కష్టాలు అనుభవించాను.  ఆఖరికి ఎలాగో చదువు ముగించి ఒక పనిలో చేరి ఆ నరకం నుంచి తప్పించుకున్నాను, ఒక హాస్టల్లో ఉంటూ - అనాధగా, ఒంటరిగా ఇంకా ఎన్ని రోజులు ఈ బతుకు?” అని ఎర్ర ముక్కు వొణుకుతూ ఆమె అడిగినప్పుడు మధరంకి ఆమె శోకం బోధపడింది.

 

“ఏం, ఎందుకు? ఒక పెళ్ళి చేసుకొని నువ్వు హాయిగా ఉండలేకపోయావా? నీకేం తక్కువ? నాలాగ ఉన్నవాళ్ళు చెప్తే అందులో న్యాయముందనిపిస్తుంది, నీకెందుకు విచారం?” అని మధరం ధైర్యం ఇచ్చింది.

 

కమల ఒక నిట్టూర్పు వదిలింది.

 

“అవన్నీ బంధువులు, బాధ్యత గల పెద్దలు ఉంటేనే జరుగుతాయి. నాకలాగ ఎవరూ లేరే? సరే, నా ఇరవై ఆరు సంవత్సరాల జీవితంలో అందుకు నాకు ప్రాప్తం లేదని తెలుసుకున్నాను. ఇలాగే నా జీవితం గడిపేయాలని నిశ్చయించాను. ఎటువంటి ఆసరా లేని నాకు అన్ని విధాలా సాయం చెయ్యడానికి మా ఆఫీసులో ఉండేది ఇతనే - మిస్టర్ సీతారామన్ -మరెవరూ లేరు.” - అని ఆమె చెప్పి ఆగగానే ఇద్దరూ ఒకరినొకరు బాగా చూసుకున్నారు.

 

హఠాత్తుగా మధురం మనసులో ఒక విపరీతమైన ఆలోచన లేచింది! అది బయటకి రవంతైనా కనిపించలేదు. పైకి కనిపించని, ఎటువంటి చలనం చూపని అది ఆమెను ఒక క్షణం రిమ్మెత్తింపజేసి కమలని ఆరసించే విధంగా చూడనిచ్చింది. తను చెప్పవలసిన సంగతి చెప్పకుండానే మధురం అది గ్రహించిందని  కలతతో కమల ఆమెను రెప్పవాల్చకుండా చూసింది.

 

‘ఆమె సమ్మతించకపోతే? తన్ను తిట్టి తరిమితే? తన పరువు పాడు చెయ్యాలని ఊరులో అందరినీ పిలిచి న్యాయం అడుగుతే?’ క్రమేణ ఈ ఆలోచనలు ఒకటి తరువాత ఒకటి తోచగానే, ఉన్నట్టుండి కమల ఏడుస్తూ తన మొహం కప్పుకుంది.

 

‘నువ్వెందుకు ఏడుస్తున్నావ్?’ అని మధురం అడగలేదు. కమల మధురంని చేరుకొని ఆమె చేతిలో తన మొహం ఒత్తుకున్నప్పుడు మధురం అలాగే నిల్చుంది.

 

కమల మధురం చేతులు గట్టిగా పట్టుకొని, ఏడుస్తూ, స్పష్టంగా చెప్పేసింది. “అక్కయ్యా, నాకు మీ జీవితంలో వాటా కావాలని అడుగుతున్నాను.”

 

ఏడ్పు అనే ఆయుధం ధరించి ఆ ఖడ్గాన్ని తటాలున  మధురం గుండెలో కమల లోతుగా పాతేసింది.

 

“ఈ అనాధకి మీరే దారి చూపాలి. నా పరువు, ప్రతిష్ట మీ చేతిలో ఉన్నాయి. మీకు నేను చేసిన ద్రోహం క్షమించాలి. మీ బిడ్డ వేరు, నా కడుపులో ఉన్న బిడ్డ వేరా, అక్కయ్యా?”

 

దిగగొట్టిన ఖడ్గంని తీసి మళ్ళీ ఆమె దూర్చినప్పుడు మధురం తన మనోబలంని పూర్తిగా కూడబెట్టుకొని, పళ్ళు కొఱుకుతూ, కన్నులు మూసుకొని భరించింది.

 

“మీ కృతజ్ఞత నేను బతికివున్నంతవరకూ మరిచిపోను, మీకూ, మన కుటుంబంకి, ”  అని ఆమె చెప్తూ పోతుంటే మధురం జోక్యం చేసుకొని ఆమెని ఆపి నిమ్మళంగా గొణుక్కుంది.

“చాలు, కమలా, అయ్యో, ఇది నేను భరించలేను!” అని గాయపడినట్టు సోఫాలో వాలి మధురం తలని అటూ ఇటూ తిప్పుతూ బాధపడింది. అర్ధగంటవరకూ ఆమె లేవలేదు. కళ్ళు విప్పలేదు.

తను చెప్పవలసినదేదో చెప్పడమైంది. ఇక మధురం ఆమోదం ఎదురుచూస్తూ కమల మనసులో దిగులుతోనూ, బయట ఒక విభ్రాంతితోనూ కూర్చుంది.

 

మధురం పరిస్థితి చూసి కమల మనసులో భయమూ, విచారమూ చోటుచేసుకున్నాయి. తను ఎదురుచూసినట్టు మధురం కోపించుకొని తనను దూషించలేదు, శపించలేదు. ఇంత మంచి హృదయంని నలగగొట్టినందుకు కమల అపరాధ భావంతో వెక్కి వెక్కి ఏడ్చింది.

 

చాలా సేపు మౌనంగా ఏడ్చిన తరువాత కమల మధురం దగ్గరకి వచ్చి “అక్కయ్యా, అక్కయ్యా” అని ఏడుస్తూవే పలకరించింది.

 

ఏమీ జరగనట్టు మధురం స్పష్టమైన మొహంతో, దృఢ నిర్ణయంతో లేచి నిటారుగా సోఫాలో కూర్చుంది. ఆమె రెండు కన్నులూ తామరాకుల్లాగ ఎఱ్ఱబారిపోయాయి.

 

“నువ్వెందుకమ్మా ఏడుస్తావ్? ధైర్యంగా ఉండు!” అని చెప్పి మధురం తన గదికి వెళ్ళింది. ఆమెకు ఎందుకో ఏకాంతం కావాలనిపించింది. గదిలోని మంచంని, పక్కనే భర్త బట్టలని తేఱిపార చూసింది.

 

ఆమె తన రెండు చేతులూ వెనక కట్టుకొని గదిలో అటూ ఇటూ సంచరించడం కమల హాలునుంచి గమనిస్తూవుంది.

 

మధురం నిలువుటద్దం ముందు నిల్చుంది. ఆమె భర్త అలంకరించుకుంటాడే అదే జాగాలో నిలబడి తనను చూసుకుంది. తొందర తొందరగా ఆమె దువ్వుకున్న తలలో ముందున్న నెరసిన వెండ్రుకలు ఇప్పుడు ఆమెకి స్పష్టంగా కనిపించాయి. ఆమె మొహం నల్లబారిపోయింది. తను బలిసిపోయినట్టు, వయసుకి మించిన ఆకారంని చూస్తున్నట్టనిపించింది.

‘అతనెలా ఉన్నారు? ఆ రోజు చూసినట్టే!’ అని ఆలోచిస్తూ మధురం హాలులో ఉన్న కమలని చూసింది.

 

‘ఈమె అతనికి తగిన చెలికత్తె.  నేను ముసలిదానిగా అయిపోయాను. అదెలా సాధ్యం? అతనికంటే చిన్నదైన నేనెందుకు ఇలా అతనికంటే వయస్సులో పైబడినట్టు కనిపిస్తున్నాను? అవును. నా ముసలితనం వయస్సువలన కాదు. అది నా తెలివితక్కువతనం వలన. అజ్ఞానంతో బుద్ధి లేక.' చిరచిరలాడుతూ మధురం పళ్ళు పటపటమని కొరుక్కుంది.

 

జీవితమంతా అతని ధ్యాసలో ఆమె తనని మరిచిపోయింది. అతను తనను అలంకరించుకొని యౌవనంలో మునిగి ఆనందించడం చూసినప్పుడల్లా తనను ఆవరించుకుంటున్న  ముసలితనంని ఆమె గ్రహించలేకపోయింది.

 

ఇప్పుడే ఆమె అవన్నీ ఆలోచించి చూసింది. ఆమె మనసుని ఇప్పుడు  హింసించే బాధ తన భర్తని ఇంకొక స్త్రీ అపహరించందని కాదు. ‘నేను ఎంత జడ్డిగా, ఒక అబద్ధాన్ని నమ్ముకొని నా జీవితంలో మధురమైన వేళలన్నీ పాడుచేసుకొని మోసపోయాను!’ అనే కటువైన సత్యం ఆమెకి ఇప్పుడు కొట్టవచ్చినట్టనిపించింది. అలాగే దిగ్భ్రాంతితో నిల్చుంది.

 

ఆమె నిట్టూర్పు వదలింది. చెప్పడానికి మరేముంది? కాని ఆమె మాట్లాడింది.

 

‘కుటుంబ భారమంతా నేనే మోసాను. మరి జుత్తు నెరవక ఉంటుందా ఏమిటి? అతనిలాగ నేను ఏ చింతా లేకుండా ఉన్నానా? అన్నీ నేనే చూసుకున్న తరువాత అతను ఎప్పుడూ హీరోగానే రాణించారంటే అందులో ఆశ్చర్యమేముంది? నాకు నాగురించి ఏ గుర్తూ లేదు. అతని ధ్యాస చాలు, కాని అతనికి? నేను మాత్రం చాలా? ఇది ఎంత పెద్ద మోసం! ఎంత పెద్ద దోపిడీ! నా జీవితాన్ని తలచుకుంటే నాకు రోతగా ఉంది, ఛీ, ఛీ, ఇక అతని మొహం చూసే పాపంకూడా నాకు వద్దు! ఆ పాడు కల అయిపోయినట్టే!” అని నోటిమాటగా మూలుగుతూవుంది.

 

ఆమె హాలుకు వచ్చి కమల ఎదుట కూర్చొని, ఆమెను దయతో చూస్తూ మాటాడింది.

“కమలా, నీ తలరాతకి నేనేం చెయ్యగలను? నువ్వు నా జీవితంలో వాటా కావాలంటున్నావు. అసలు, నేనేం జీవించాను చెప్పు? నేను చేతులెత్తి నిన్ను ప్రార్ధిస్తున్నాను. దయచేసి నా జీవితాన్ని పూర్తిగా తీసుకో. నేను పదిహేను సంవత్సరాలు అతనితో జీవించాను. దానికి ఫలం పూజ్యం అని నాకు ఇప్పుడే తెలిసింది. అబ్బా, నేను పడిన బాధలు ఎన్ని! నరే, పోనీ, నువ్వు వెళ్ళి ఇక అతనికి ఈ ఇంటిలో జాగా లేదని చెప్పేయ్, ఇక అతని మొహం చూస్తే నేను కేకలు పెట్టి చచ్చిపోతాను! ద్రోహం అనుభవించడం కూడా అంత కష్టమైన పని కాదమ్మా, కాని ద్రోహి నవ్వు చూడడం మహా ఘోరం! విను, నేనూ, నా పిల్లలు ఎవరి దయకై ఎదురుచూసి జీవించలేదని తెలుసుకో. ఈ పదిహేను సంవత్సరాలూ అతని మీదున్న నమ్మకం వలన నేను జీవించానేమో, కాని అతన్ని నమ్మి ఇక్కడ ఎవరూ జీవించలేదు, అది అసాధ్యం. అతనలాటి మనిషి, సరే, వెళ్ళు!  అతన్ని ఇక్కడ రావొద్దని చెప్పేయ్, నీ తలరాతకి నేనేం చెయ్యగలను? ఈ హీరోయిన్ కథ అయిపోయింది, ఇప్పడు అతనికి ఇంకొక హీరోయిన్ కావాలి. అవునా?” అని అడుగుతూ మధురం లేచింది.

 

ఆమె మాటల్లో ఉన్న స్పష్టత, నిశ్చలత గమనించి - ఆమె చెప్పేది వట్టి భావావేశం వలన కాదని - కమలకి బోధపడింది. కమల తల వంచి, చేతికున్న గోర్లు చూసుకుంటూ కూర్చుంది. లేచిన మధురం దయతో కమలని చూసింది.

“మీరు నా తోబుట్టువు లాగ ఈ అనాధకి దారి చూపండి.” అని కొంచెం సేపు ముందు కమల బతిమాలిన మాటలు మధురం గుర్తుచేసుకుంది.

“కమలా, నన్ను అక్కయ్యగా భావించి నీకు దారి చూపమన్నావు. నేనేం చెయ్యగలను? అప్పుడు మా అమ్మ ఉండేది. నేను ఇతన్నే పెళ్ళిచేసుకుంటానని హఠం చేసాను. మా అమ్మ నాకెన్నో బోధనలు చేసింది. నేను వినలేదమ్మా!” అని మధురం తన తల్లిని తలుచుకుంది.

 

“ఇలాగేదో జరుగుతుందని తెలిసే కాబోలు, మా అమ్మ తన సొంత ఇల్లుని మరెవరికీ ఇవ్వకుండా నాకు ఇచ్చింది. కమలా, నాకూ, నా పిల్లలకీ తిండి పెట్టేది ఈ ఇల్లే - ఈ ఇల్లూ, రెండు ఆవులు, ఆ ఆవులమీద చూపవలసిన అభిమానాన్ని, ఈ ఇంటిమీద చూపవలసిన భక్తిని - ఇన్ని సంవత్సరాలు - నేను దుర్వినియోగం చేసాను.” అని తనకు తానే మాట్లాడుకున్నట్టు కనిపించిన మధురం గభీమని చిరచిరలాడుతూ గర్జించింది. “ఇది నా ఇల్లు! ఈ గడపని నేను కాక ఎవరూ దాటకూడదు!”

ఆమె అరుపు, ఆకారం చూసి కమల అదిరిపడింది.

 

తను ఇంకా అక్కడ నిలబడితే కమల సమక్షంలో కోపంతో ఉన్న తన అంతరంగ భావనలు ఒలకబోయడం సాధ్యం అనే భయంతో మధురం లేచి, తన గదికి వెళ్ళి తలుపు మూసుకుంది.

 

మూసిన ఆ తలుపుని కమల రెప్పవాల్చకుండా చూసింది. తన మొహం చేతులతో కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చింది.

 

ఆమె ఎందుకు ఏడ్చింది? తన తలరాత  గురించా?

‘ఈ హీరోయిన్ కధ ఐపోయింది, ఇప్పడు అతనికి ఇంకొక హీరోయిన్ కావాలి.’  అని వైరాగ్యంతో అతన్ని నిరాకరించిన మధురంని కమల గుర్తుచేసుకుంది.

 

‘అబ్బా, స్త్రీ అంటే ఇలాగ ఉండాలి!’ అని ఆమెను కమల మనసారా ప్రశంసించింది.

 

తనలాగా మధురం చదువుకోలేదు. తనలాగా ఎక్కడకి వెళ్ళినా ఒక టైప్ రైటర్ ముందుకూర్చుంటే నెలకి 175 రూపాయలు ఖాయం అనే భరోసా ఆమెకు లేదని గ్రహించిన తరువాతే కమలకి తనూ అనాధ కాదు, తనకీ ఎవరినీ బతిమాలవలసిన అగత్యం లేదనే నమ్మకం కలిగింది.

 

‘నా జీవితం ఇంకా పాడైపోవాలా?’ అనే ప్రశ్నకి జవాబుగా అతని ఆకారం ఆమె మనసులో లేచింది. ఆ కళ్ళలో కనిపించే ఉదాసీనత ఇప్పుడు ఆమెకి బోధపడింది.

‘ఇంత మంచి భార్యని, ఆమె సేవ, ఆమె ప్రేమ, ఆమె ఔదార్యం - ఇవన్నీ అనుభవించిన తరువాత - అతను ఏ పని చేసాడు?’ అని ఒక మూడవ మనిషిలాగా ఆలోచించగానే ఆమెకు అతనిమీద ద్వేషం కలిగింది.

 

ఆ ద్వేషం విషంలాగ పెరిగింది.

 

అవును. అతన్ని ప్రేమించడానికి ప్రత్యేకంగా కమలకి ఎటువంటి కారణమూ లేదు. అదొక బలహీనత. ఆలోచించి చూస్తే అతన్ని అసహ్యించుకోడానికి - ఇటీవల, కొన్ని నెలల్లో  - వెయ్యి కారణాలున్నాయని కమల గుర్తుచేసుకుంది.

 

మధురం చెప్పలేదూ - ‘ఇది ఎంత పెద్ద మోసం! ఎంత పెద్ద దోపిడీ! నా జీవితంని తలచుకుంటే నాకు రోతగా ఉంది.’ అని? ఆ మాటల్లోని గాఢత్వం, అర్ధం గ్రహించి, ఆలోచించి చూస్తే కమలకీ తన కళ్ళు తెరచినట్టనిపించింది.

 

కమల తలెత్తి కూర్చుంది. ఆమె కన్నులలో ఉదాసీనత ప్రకాశించింది.

‘ఇద్దరు పిల్లల తల్లికి లేని దిగులు నాకూ, ఇంకా పుట్టని నా శిశువుకి వచ్చేస్తుందా ఏమిటి? అలాగేమైనా జరిగితే ఇతనేం దాన్ని ఆపుతారా? సరేలే, ఈ రెండవ హీరోయిన్ కథ కూడా అయిపోయినట్టే!’ అని గొణుక్కుంటూ కమల హ్యాండ్ బ్యాగ్ నుంచి కాగితం, కలం తీసి, దృఢమైన మనసుతో, పెదిమలు కఱచుతూ ఉత్తరం రాయడం ఆరంభించింది.  

 

**

 

రాత్రి ఏడుగంటలవరకూ ఆ పార్కులో సీతారామన్ కమలకోసం కాచుకొని ఉన్నాడు. ఆరుగంటలకి శుభవార్తతో తన్ను చూడడానికి వస్తానని చెప్పిన కమల ఇంకా రాలేదని అతను గాభరా పడలేదు. జీవితంలో తనకి విజయం తప్పితే మరేదీ లేదనే జడ్డి నమ్మకం అతనికి ఉండడం వలన ఇప్పుడు కూడా అతను పూర్ణ నమ్మకంతో ఉన్నాడు.

 

‘ఆర్జించడానికి ఒక భార్య,సేవ చెయ్యడానికి మరొక భార్య’ అనే తన స్వార్థం యీడేరుతుందని ఆహ్లాదంతో అతను వాడుకగా ఈలపాట పాడుతూ రాత్రి ఎనిమిది గంటలకి ఇంటికి వచ్చి చేరాడు. ఇద్దరు స్త్రీలు తనకి వేడుకగా స్వాగతం చెప్తారని అతని ఊహ.

అతను ఇంటి ముందు హాలు ప్రవేశించినప్పుడు కమల కనిపించలేదు. మధురమూ లేదు. ఇద్దరు అమ్మాయిలు మాత్రం ఉన్నారు.

 

పెద్దమ్మాయి  ఉమా సోఫాలో కూర్చొని పాఠం చదువుతోంది. చిన్న అమ్మాయి లతా  వివస్త్రగా సోఫా వెనక నిల్చొని  ఉమా జడని లాగుతూ అల్లరి చేస్తోంది.

ఆ సోఫా మీద ఒక బిస్కట్టు డబ్బా తెరచి ఉంది. బిస్కట్లు చెల్లాచెదరుగా పడి ఉన్నాయి.

 

సీతారామన్ ఇంట్లోకి ప్రవేశించగానే వంటగది తలుపుని తటాలున మూసిన ధ్వని అతనికి గుండెలో ఎవరో తన్నినట్టు అనిపించింది.

అతను వంటగదివైపు నడిచాడు.

 

మూసిన తలుపుని తట్టి “మధూ, మధూ!” అని పిలిచాడు.

 

లోపల, తలుపుమీద ఆనుకొని మధురం నిల్చొని ఉందని తెలిసింది.

ఆమె మాటలు స్పష్టంగా వినిపించాయి.

“నువ్వుగాని మగవాడైతే, పరువు గల మనిషి అయితే - నా ఇంట్లోకి ప్రవేశించకూడదు! ఇక్కడ మీకు జాగా లేదు!”

 

“మధు, తలుపు తీయ్! నా మాట విను.” అని ఏడుస్తున్నట్టు సీతారామన్ బతిమాలాడు.

 

“తలుపు తీయను! మీ మొహం చూస్తే, అయ్యో, వొద్దు, మొగుడు మొహంలో ఉమ్మిన భార్య అనే అపకీర్తి నాకు వొద్దు!”

 

సీతారామన్ కి చెంపమీద వాయించినట్టనిపించింది. మొహమంతా చెమట పట్టేసింది. జీవితంలో మొట్టమొదటిసారిగా  ఒక ముఖ్యమైన విపరీతం అతను అనుభవించాడు.

 

అతనికి కోపమూ వచ్చింది.

“ఏమే, ఏమంటున్నావ్? నేను వెళ్ళనంటే ఏం చేస్తావ్?”

 

గాజు పాత్రలు బద్దలైనట్టు లోపలనుంచి మధురం బిగ్గరగా నవ్వింది. ఆ తరువాత - నవ్వుతూనే - చెప్పింది: “మంచిది. ఇక్కడే ఉండండి. ఈ ఇద్దరు పిల్లలకి - ఐతే తండ్రి, లేకపోతే తల్లి కావాలి, మీరే ఉండండి, ” అని ఆమె అంటూంటే వంటగదిలో ఉన్న తాడుని బలంగా ఈడుస్తున్న ధ్వని సీతారామన్ చెవులకి వినిపించింది.

 

అతనికి చేతులూ, కాళ్ళూ వొణికాయి. ఎక్స్ రే పటం లాగా మూసిన తలుపు వెనుక జరిగేది అతని కళ్ళకి తెలిసింది. తనను చూసిన ప్రతీ క్షణమూ మధురం కంఠం బిగించుకుంటుందని తెలుసుకొని అతను హోరున ఏడ్చాడు.

“మధురం, నేను వెళ్తాను, ఇదిగో వెళ్తున్నాను” అని తలుపుమీద రెండు సార్లు బాదుతూ సీతారామన్ అరిచాడు.

 

“వెళ్ళు!” అని ఏక వచనంలో చెప్పి, చేతిలో ఉన్న తాడుని మధురం మూసిన తలుపుమీద కొట్టినప్పుడు అతనికి ఆమె ఆవేశం, ద్వేషం బోధపడింది.

 

‘నేను చస్తాను అని అనగానే అతనిలా వాపోవడానికి కారణం నామీదున్న అభిమానం కాదు - ఈ ఇద్దరు పిల్లల భారం తన నెత్తిమీద పడుతుందనే పిరికితనం’ అని గుర్తు చేసుకొని మధురం “ఛీ” అని ఇంకొకసారి జుగుప్సతో తన బట్టలు దులుపుకుంది.

- ఇప్పుడే - మొట్టమొదటి సారి - తన స్వభావంకి తగినట్టుగా ఏ విధమైన ‘సమాధానం’ వెతక్కుండా  అతని బలహీనతని మధురం సూటిగా తెలుసుకుంది.

 

సీతారామన్ తొందర తొందరగా తన గదికి పరుగెత్తుకొని వెళ్ళాడు. తన బట్టలన్నీ రెండు సూట్ కేసులలో నింపుకొని హాలుకి వచ్చాడు.

అప్పుడు టపా పెట్టెలో ఒక ఉత్తరం కనిపించింది. సూట్ కేసులని నేలమీద పెట్టి ఆ ఉత్తరం చదివాడు.

 

పిల్లలిద్దరూ తమ పరిసరాల్లో ఏం జరుగుతుందని తెలియక కమల కొనితెచ్చిన బిస్కట్లు, చాకలెట్లు తింటున్నారు. పెద్దమ్మాయి ఒక పెద్ద క్యాడ్ బరీ చాకలెట్ని కఱచి, దాన్ని పక్కనే పెట్టుకొని చురుకుగా ఏదో రాస్తోంది.

 

చిన్నమ్మాయి పిల్లినడకతో ఆమె దగ్గర వచ్చి ఆ చాకలెట్ ని తీసుకొని తనూ ఒకసారి కఱచింది.

“ఏమే, ఎందుకు నాది తీసుకుంటున్నావ్? నాన్నగారూ, చూడండి, ” అని ఉమా తన దగ్గర ఉన్న తండ్రిని పిలిచింది.

 

ఆమె కూత వినగానే చిన్నమ్మాయి లతా తను కఱచిన చాకలెట్ ని మళ్ళీ ఉమా పక్కన పెట్టేసి దూరంలో నిల్చుంది. ఉమ దాన్ని తీసుకొని, రెండు సార్లు అటూ ఇటూ చూసి “ఛీ!, ఇది ఎంగిలి, నాకు వొద్దు!” అని లతాకే తిరిగి ఇచ్చేసింది.

 

లతా దాన్ని తీసుకొని ఏం చెయ్యాలో తెలియక కొంచెం సేపు అలాగే నిల్చుంది.

అక్కయ్య అది తనకి ఇవ్వగానే - ఎంగిలి తినకూడదని, తను ఇంతకు ముందు తిన్నది ఎంగిలి అని గ్రహించిన వెంటనే లతా కూడా “ఛీ!, ఇది ఎంగిలి, నాకు వొద్దు!” అని చేతిలో ఉన్న ముక్కని పారేసి నోరు తుడుచుకుంది.

 

ఆ ఎంగిలి చాకలెట్ ముక్క సీతారామన్ కాళ్లముందు వాలింది.  

అది అతను చూసాడు. చేతిలో ఉన్న ఉత్తరాన్ని నలిపేసి తన రెండు సూట్ కేసులని ఎత్తి పట్టుకుని వెళుతూ గడప చేరుకున్నాడు.

 

“ఉమా, ఇలా రా, నాన్నగారు ఊరుకి వెళ్తున్నారు, ” అని అరుస్తూ లతా నగ్నంగా గడప దగ్గరకి వచ్చింది. ఉమా కూడా ఆమె వెనుక వచ్చింది.

 

వీధిలో దిగిన సీతారామన్ తిరిగి చూడగానే ఇద్దరు పిల్లలూ తలమీద చేతులెత్తి అలవాటుగా “నాన్నగారూ,  టా టా!” అని సైగ చేసారు.

 

సీతారామన్ కన్నులు - నిత్యమూ ఉదాసీనతతో మెరుస్తూ, ఆ ఉదాసీనతని ఒక భూషణంగా ధరించి, దాన్నే ఒక వినోదంగా అందరూ చూసి అతన్ని హీరోగా కొనియాడిన అవే కన్నులు - ఇప్పుడు బాగా తడిసిపోయాయి!

*****

bottom of page