top of page
bhuvanollasam.PNG
srinivyasavani.PNG

సంపుటి  6   సంచిక  1

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

PLNPrasad.JPG
7th telugu sahiti sadassu -2020 .JPG

తెలుగు సాహిత్యంలో హాస్య పరిణామం

  డా. పి.ఎల్.ఎన్.ప్రసాద్

సాహిత్యంలో హాస్యానికి రెండవ స్థానం ఇచ్చినా నిజానికి ఆధునిక యుగం దాకా హాస్యానికి పెద్ద పీట వేయలేదు. సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లోను నవ్వుకోవడం, వెటకారం, ఎత్తిపొడుపుల్లోనే హాస్యం  వినిపించింది తప్ప, హృదయగత హాస్యం, లలిత హాస్యం ఆధునిక యుగం దాకా పరిమళించలేదు. ఆధునిక యుగంలో అన్ని ప్రక్రియల్లోను సామాజిక జీవిత నేపధ్యం లోనుండి, కష్టాల్లోనుండి కన్నీళ్ళలోనుండి సమస్యల్లోనుండి కూడా రచయితలు హాస్యాన్ని అందించారు. పండించారు.

 

 ప్రాచీన యుగంలో జీవితంలో ప్రతిక్షణం కనిపించే హాస్యం సాహిత్యంలో కనిపించేది కాదు. ఇప్పుడు జీవితంలోనుండి హాస్యం సాహిత్యంలోకి ప్రవేశించింది. ఒకప్పుడు సాహిత్యంలో విదూషకుడు మాత్రమే హాస్యాన్ని అందించాడు. ఇప్పుడు జీవిత కావ్యంలో ప్రతి పాత్ర, ప్రతి  వ్యక్తి నాయక, ప్రతి నాయక, నాయికలతో సహా అందరు హాస్యాన్ని అన్ని ప్రక్రియల్లోను అందిస్తున్నారు. హాస్య రసమే విశ్వరూపం ధరించింది.    

 

అన్నమయ్య స్త్రీ హృదయం

 

తాళ్ళపాక అన్నమాచార్యుల సంకీర్తనల్లో సమాజంలోని అన్ని వర్గాల స్త్రీల హృదయం కనిపిస్తుంది. అన్నమయ్య నాయికలు కావ్య నాయికలు కారు. ప్రజా జీవితంలోని సమస్త వర్గాలకూ, అన్ని  ప్రాంతాలకూ చెందినవారు. ప్రతి నాయికా శ్రీవారికి ఆత్మార్పణ చేసుకున్నదే. స్త్రీ ప్రవృత్తిని హృదయాన్ని  అన్నమయ్య తన సంకీర్తనల్లో ఎన్నో గతులలో నిరూపించి ప్రపంచానికి అందించాడు. అచ్చ తెలుగు నుడికారంతో పాటు శుద్ధ సంస్కృతం కనిపిస్తుంది. తొలిసారిగా సంగీత సాహిత్య ప్రక్రియలను దేశీయంగా కూడా వ్రాసి, పద కవితా పితామహుడయ్యాడు.

 

జీవితంలో కలిగే ఎన్నో అనుభుతులు  ఒక్కో స్త్రీ ఒక్కో విధంగా స్పందిస్తుంది. ఈ స్పందన ఆమె సంస్కారాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి, గుణాన్ని బట్టి ఎన్నో రీతుల్లో ఉంటుంది, ఒక్కో సంకీర్తనలో స్త్రీ హృదయం ఒక ప్రత్యేక స్పందన, విలక్షణ అనుభూతి. స్త్రీ స్వభావంలోని ఓర్పు, నేర్పు, క్షమ కఠోర వాక్కు, లాలిత్యం, చాంచల్యం, వక్రోక్తులు, ఔదార్యాలు ఎంతో సహజంగా వారి అనుభూతుల్లో నుండి అన్నమయ్య అద్భుతంగా రసభరితంగా శ్రీ వేంకటేశ్వరుడిపై రచించాడు.

 

“బాపు బొమ్మ” అన్నమాట ఒక నామ వాచకం. ఒక అపూర్వ సృష్టి. ఇది  సౌందర్యానికే ప్రతీక అయి,  చిత్రకళా రంగంలోనుండి నిత్య జీవితంలోకి, సినిమాల్లోకి  ప్రవేశించింది. రేఖలతో చిత్రించబడిన బాపు బొమ్మ సినిమా రంగంలో ఒక అద్భుత నాయికగా వెలిసింది. బాపు సినిమాల్లో నాయికలు మరే ఇతర సినిమాల్లోనూ కనిపించనంత విలక్షణంగా కనిపిస్తారు. 

 

బాపు సినిమాల్లో నాయికకి  ఒక ప్రత్యేక స్థితిలో కలిగే అలుక, కన్నీరు, వలపు, బెట్టు మొదలైనవి దేహంగా కనిపిస్తుంది. ఆ నాయికకి  రాగం రసం గుణం స్వభావం ఆత్మ. ఇది ఒక విధంగా చెప్పుకోవాలంటే తిక్కన గుణ కవిత్వం కోవలోకి వస్తుంది. నాయిక పాత్రలో సౌందర్యం అంతా, ఆ నాయిక స్వభావంలో, ఒక స్థితిలోని ఆవేశంలో, గుణ స్వరూపంలో, వ్యక్తిత్వంలో, ఆ  ఆమ్మాయి జీవితంలో ఎదుర్కొన్న ఎదురు దెబ్బల్లో,  ఆ అమ్మాయి ప్రతి కదలికలో కనిపిస్తుంది.

 

 ప్రధానంగా సౌందర్యం అన్నది మనిషి గుణంలోనే కదా కనిపిస్తుంది. శ్రీరాముడిని ”సకల గుణాభిరాముడు”  అంటారు. బాపు గారికి, ఆయనకి ఆయన ఆత్మ ప్రతిరూపం ముళ్ళపూడి వెంకట రమణ గారికి అంతా రామ మయం.

 

బాపు దర్శకత్వం విశేషమైన రీతిలో ఒక ప్రత్యేకమైన ముద్రలో కనిపిస్తుంది. రమణ గారు అందించిన స్క్రీన్ ప్లే, కథ, మాటలని బాపు గారు తనదైన శైలిలో ఒక దృశ్య కావ్యంగా మలచుకుంటారు. బాపు ప్రత్యేకత  ఆయన కధన శిల్పంలో రమణీయంగా కనిపిస్తుంది. ఇతివృత్తాన్ని కథని బాపు అనేక కోణాల్లో చూపిస్తారు.

 

 కొంత భాగాన్ని నేపధ్యంలో చూపిస్తే, కొంత భాగం సంగీత సాహిత్యాల్లో వినిపిస్తారు. కొంత భాగం  సంభాషణల్లో చిత్రీకరిస్తే, మరి కొంత నటుల హావ భావాలు, వారి నటన ద్వారా ప్రదర్శించబడుతుంది. పాత్రల దుస్తులు, వారి అలంకరణ కధలో ఒక్కో సన్నివేశాన్ని ఎంతో కళాత్మకంగా నిరూపిస్తుంది.  ఏ సినిమాలోను ఏ పాత్రకీ సుదీర్ఘమైన సంభాషణలుండవు. అసలు కెమెరాయే ప్రధానంగా బాపు హృదయాన్ని ఆవిష్కరింపచేస్తుంది.

 

మనం బాపు సినిమాని ఇన్ని కోణాల్లోనుండి జాగ్రత్తగా  చూడకపోతే మనం ఎంతో కళని  కోల్పోయినట్లే. ప్రతి సన్నివేశంలోనూ సౌందర్యం బాపు ముద్రలో కనిపిస్తుంది. బాపు సౌందర్య తృష్ణ, రసావిష్కరణం సర్వ రూపాల్లో కనిపిస్తుంది.

 

సినిమా దర్శకులు సాధారణంగా స్త్రీ స్వరూపాన్ని వీలైనంత వరకు చాలా మనోహరంగా సౌందర్య మూర్తిగా చిత్రీకరించాలనే కోరుకుంటారు. ఆయా సినిమాల్లో నటించే నాయికలు కూడా తమని ఎంతో అందంగా చూపించాలనే  కోరుకుంటారు. ఆధిక  శాతం దర్శకులు స్త్రీ సౌందర్యాన్ని శరీరంలోని ఒంపు సొంపుల్లో కానీ , అత్యంత విలువైన దుస్తులు, ఆహార్యం లేదా కాస్ట్యూమ్స్ లో కానీ చిత్రీకరించడానికే ఆసక్తి చూపిస్తారు.

 

 బాపు నాయికల్లో అందమంతా వారి వ్యక్తిత్వం, సంస్కారం, సౌజన్యం. స్వభావంలో చిత్రించబడుతుంది. ప్రతి స్త్రీలో శిల్పం ఉంటుంది. ఇతరులది భౌతికి దృష్టి. అయితే, బాపూ  బాహ్య సౌందర్య దృష్టి మొత్తం ఆ అమ్మాయి ఆత్మ స్వరూపాన్ని ప్రతిఫలింపజేస్తుంది.

 

 ప్రధానంగా బాపు నాయికలు తెలుగింటి ఆడపడచులు. వీరి కట్టు, బొట్టు, నడక, నడత, వేష, భాషల్లో తెలుగు సంస్కృతి కనిపిస్తుంది. ఇది ఆ పాత్ర స్వభావానికి అనుగుణంగా తీర్చి దిద్దుతారు బాపు రమణలు. బాపు గారి తొలి  సినిమా  ”సాక్షి“  నుండి చివరి సినిమా  “శ్రీరామరాజ్యం“  వరకు ఎందరో సుప్రసిద్ధ నాయికలు వారి సినిమాల్లో అద్భుతంగా నటించారు. ఒక్క “శ్రీ రామాంజనేయ యుద్ధం“ సినిమాకి తప్ప అన్నీ సినిమాలకి శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారే స్క్రీన్ ప్లే సంభాషణలు వ్రాసారు.

 

మనస్సులో చెలరేగే భావోద్వేగాలకి అనుగుణంగా , స్త్రీలోని సహజమైనా అతి చిన్న కదలికలను బాపు కెమెరా అద్భుతంగా చూపిస్తుంది. సాక్షి సినిమా క్లైమాక్స్ లో,  బల్లకట్టు గోపన్న(శ్రీ కృష్ణ), తను హత్య చేసాడని సాక్ష్యం చెబుతాడని,  అతడిని చంపడానికి యముడిలా  ఫకీరు(జగ్గరావు)  అతడిని వెతుకుతుంటాడు.   అతడి  చెల్లెలు  చుక్క (శ్రీమతి విజయ నిర్మల)  గోపన్నని ప్రేమించింది. గోపన్నని కాపాడటానికి అతడిని ఆ క్షణంలోనే పెళ్లి చేసుకోవడం ఒక్కటే మార్గం అని భావిస్తుంది.

 

 “అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా “ పాట చిత్రీకరణంలో విజయ నిర్మల అద్భుతంగా నటించింది.  బల్ల కట్టు గోపన్నకి, ఫకీరుని ప్రేమించిన నరిసి (విజయలలిత)కి బలవంతంగా పెళ్లి జరగబోతోంది. ఇంతలో “ఫకీరు వస్తున్నాడు” అని ఎవరో అరిచారు. పెళ్ళిపందిరి అంతా పారిపోయింది.

 

ఫకీరు చెల్లెలు చుక్క నెమ్మదిగా ముందుకు వచ్చింది. గోపన్నని కాపాడాలంటే తను అతడిని పెళ్లి చేసుకోవడం ఒక్కటే మార్గం అని నిశ్చయించుకుంది. కన్నుల నీటితో అతడిని కంట నీరు పెట్టద్దంటుంది. పెళ్లికూతురే స్వయంగా పెళ్లి తంతు అంతా నిర్వహించి “బ్రతకరా బ్రతకర పచ్చగ” అని ఆశీర్వదిస్తుంది.  ఆరుద్రతో బాపు కోరి వ్రాయించుకున్న పాట “బ్రతకరా బ్రతకరా పచ్చగా“.  అమాయకపు పల్లె పడుచు పాత్ర అది. అంతకంటే లోకం తెలియని అమాయక చక్రవర్తి గోపన్న. నిన్ను మృత్యువు నీడ కూడా చేరదని చెప్పడానికి “నా సిగ పూవు రేకైనా వాడదురా “ అంటుంది.  ప్రతి సన్నివేశంలో పాత్ర మనస్సు స్వభావానికి అనుగుణంగా సర్వం తీర్చి దిద్దారు బాపు రమణలు .

 

     ఈ సినిమా అద్భుతంగా విజయవంతం అయింది. శ్రీమతి విజయ నిర్మల ఈ సినిమా గురించి ముచ్చటిస్తూ, తాను  “ఈ సినిమా ప్రభావం వల్ల దర్శకురాలినయ్యానని“ అన్నారు. నిజానికి ఆవిడ ఒక్కరే బాపు సినిమాల్లో అతి ఎక్కువ సినిమాల్లో నాయికగా (3) నటించారు. సాక్షితో పాటు శ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారితో బుద్ధిమంతుడు, చంద్ర మోహాన్ తో బంగారు పిచ్చికలో వేశారు.

 

తెలుగు వారి లోగిళ్ళలో బాపు రమణలు ముత్యాల ముగ్గు వేశారు.   బాపు సినిమాల్లో సంభాషణలు కేవలం నటీనటులకి మాత్రమే కాదు అలంకరణ, నేపధ్యం, మేకప్ ఎన్నో మాట్లాడతాయి. ప్రకృతి అంతా  పాత్ర చుట్టూ ఆవరించి, ఆవహించి ఎంతో చెబుతుంది. ముత్యాల ముత్యాలముగ్గు సినిమాలో సంగీత  పాత్ర కూడా ఎంతో విశిష్టంగా రూపొందించబడింది. ప్రత్యేకించి ఒక  నేపధ్యాన్ని సృష్టించి, తెలుగింటి ఆడపడుచు అలంకరణతో సన్నివేశం పాత్ర స్వభావాన్ని ఒకే దృశ్యంలో చూపించారు బాపు రమణలు. అదే “ముత్యామంతా పసుపూ, ముఖమెంతో చాయా“ పాట.

 

ముత్యాల ముగ్గులు వేస్తూ “గూటిపడవలో విన్నది ఆ కొత్త పెళ్లికూతురు. శృంగారాన్ని సజ్జాద్ హుస్సైన్   మాండోలిన్లో చూపించడం ఒక అద్భుత చిత్రీకరణ. ఇదే విధంగా  కలకాలం నిలిచిపోయే ఒక విరహగీతం బాపు చిత్రీకరించారు. ఒకే ఒక  సినిమా పాట వ్రాసి తెలుగువారి గుండెల్లో నిలిచి పోయారు శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారు.

 

“నిదురించే తోటలోకి  పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది.....నది దోచుకుపోతున్న నావని ఆపండి .. రేవు బావురు మంటోందని నావకి చెప్పండి.’‘ అద్భుతమైన చిత్రీకరణ. నాయిక పాత్ర స్వభావానికి తగిన సన్నివేశం. ‘సిఫార్సులతో కాపురాలు చక్కబడవు మావయ్య గారు! మీరు ఇక్కడే ఉండిపొండి. నాకు ముగ్గురు పిల్లలు అనుకుంటాను” అంటుంది ఆ అభిమానశీలి. ఆధునిక సీతలా  కనిపించే నాయిక సంగీత .

 

విజయ సంస్థ “శ్రీ రాజేశ్వరి విలాస కాఫీ క్లబ్ సినిమా  కృష్ణ గారితో తీస్తుండగా, చక్రపాణి గారు స్వర్గస్తులయ్యారు. సగం నుండి బాపు గారికి దర్శకత్వ బాధ్యత అప్పగించారు. ఈ సినిమాలో తెలుగువారికి ఒక శోభన సన్నివేశంలో అద్భుతమైన పాట అందించారు బాపు. అదే, పి.సుశీల గారు పాడిన  “ఆకాశ పందిరి లో నీకు నాకు పెళ్ళంట“

 

 బాపు రమణలు రామాయణం ఆధారంగా నాలుగు సినిమాలు తీశారు. సేతమ్మ, శ్రీ రామ పాత్రలతో త్యాగయ్య తీశారు. జయప్రద (సీతా కళ్యాణం),  చంద్రకళ  (సంపూర్ణ  రామాయణం), బి. సరోజ (శ్రీ రామాంజనేయ యుద్ధం), నయనతార (శ్రీ రామ రాజ్యం),  సంగీత (త్యాగయ్య)  సీతమ్మల పాత్రలు పోషించారు. వాల్మీకి చిత్రించిన  సీతమ్మ అద్భుత గుణగణాలని, ప్రవృత్తిని ఒక్కో సినిమాలో ఒక్కో నాయిక చేత పోషింపచేశారు .

 

 దసరా బుల్లోడు, ప్రేమ నగర్  అద్భుత విజయాలు సాధిస్తున్న రోజుల్లో వాణిశ్రీ గారికి మేకప్ లేకుండా “గోరంత దీపం” తీశారు.  సినిమా ప్రారంభం అంతా ప్రయోగాత్మకంగా వాణిశ్రీ గారికి ఒక్క డైలాగ్ కూడా లేకుండా ఆవిడ నటనతో సన్నివేశంతో నేపధ్య  సంగీతంలో ఆ పాత్ర స్వభావాన్ని  మనస్సుని చూపించారు బాపు రమణలు.

 

 అతిలోక సుందరి “శ్రీదేవి“ కూడా బాపు గారి ఒక్క సినిమా “శ్రీ కృష్ణావతారం”లో నటించారు. జయసుధ శ్రీ ఎన్.టి. రామారావు గారితో “శ్రీనాధ కవి సార్వభౌముడు”లో అత్యద్భుతంగా నటించారు.

 

“తూర్పు వెళ్ళే రైలు”లో ఆమాయక పల్లె పడుచుగా  జ్యోతి కనిపిస్తే, “వంశ వృక్షం”లో సంప్రదాయ బంధనంలో నలిగిపొయే పాత్రలో జ్యోతి కనిపిస్తుంది.   “మిష్టర్ పెళ్ళాం”లో  ఆమని అయినా, “పెళ్లి పుస్తకం”లో దివ్యవాణి అయినా, “రాధా గోపాలం”లో స్నేహ అయిన ఒక అపురూపశిల్పంలో చెక్కారు  బాపు రమణలు. షావుకారు జానకి ,శారద ,రాధిక, పూర్ణిమ జయరాం, కావేరి, మాధవి, రేవతి, సుహాసిని, సుమలత, విజయశాంతి, లత, ఛార్మి  ఇంకా ఎందరో సుప్రసిద్ధ నాయికలు బాపు రమణల  ‘సినిమాలు’ అనబడే దృశ్య కావ్యాల్లో నటించారు. తెలుగింటి ప్రతి ఆడపడుచుకి ప్రతీకలు బాపు నాయికలు.

*****

 

 శ్రీ పి ఎల్ ఎన్ ప్రసాద్ గారు వరంగల్ వాస్తవ్యులు. వారి ఆధ్యాత్మిక రచనా వ్యాసంగపరంగా ధార్మిక వ్యాఖ్యానాల పరంగా తెలుగువారందరికి సుపరిచితులు. దివ్య జ్ఞాన దీపిక పత్రికా సంపాదకునిగా 12 సంవత్సరాలు వ్యవహరించారు. ఎంఏ తెలుగు మరియు పి హెచ్ డీ పట్టాలను అందుకుని వరంగల్ లోని జూనియర్ కళాశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేశారు. ఇక వీరి రచనల విషయానికి వస్తే.. 13 పుస్తకాల ప్రచురణ, రెండు కూచిపూడి నృత్య నాటికలు, రెండు ఆడియో సిడిలు, 25 సంవత్సరాలుగా ఆకాశవాణిలో అనేక ఆధ్యాత్మిక ధార్మిక సాహిత్య ప్రసంగాలు, వ్యాఖ్యానాలు, దూరదర్శన్ జెమిని టీవీ మొదలగు వాటిలో వివిధ ప్రసంగాలు, 10 అనువాద రచనలు వీరి ప్రతిభకు తార్కాణాలు ఉత్తమ ప్రధానోపాధ్యాయుని జిల్లా పురస్కారం, కలహంస సాహితీ పురస్కారం, ఉత్తమ NSS అధికారి పురస్కారం మొదలగు అనేక సత్కారాలు అందుకున్నారు.

bottom of page