top of page
bhuvanollasam.PNG
srinivyasavani.PNG

సంపుటి  6   సంచిక  1

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

కథా​ మధురాలు

ఏ కులమూ నీదంటే గోకులమూ నవ్వింది!

 

శశికళ వోలేటి

sasikala-volety_edited.jpg

" ఎవడ్రా నువ్వు? జాంచెట్టు దిగు ముందు! ఎవడు రానిచ్చాడు నిన్ను! దొంగెదవా! ఏయ్యో! ఇలా రా! ఈడిని పట్టుకో, !"కొంపలు మునిగిపోతున్నట్టు కేకలు పెడుతున్న రాఘవమ్మ మాటలకు గాబరాపడుతూ దుడ్డుకర్ర పట్టుకుని బయటకొచ్చాడు రామయ్యగారు.

అడవిలా పెరిగిపోయిన ఆ చెట్ల మధ్యనుంచి,ఎండుటాకులూ, పుల్లలూ కాళ్ళ కింద టపటటపలాడుతుంటే  ఎట్టకేలకు పెరట్లో ఆగ్నేయ మూలన ఉన్న జామిచెట్టు దగ్గరకు అతికష్టం మీద వచ్చాడాయన! ఎదురు ఎండకు చెయ్యడ్డంపెట్టుకుని కళ్ళు చిట్లించుకు చూస్తే కనపడ్డాడు కొమ్మల మధ్యలో ఓ బక్కపల్చని కుర్రాడు. జామకాయ నోటిలో కుక్కేసుకుంటూ!

రాఘవమ్మ విసురుతున్న రాళ్ళ దెబ్బలకు వెరవకుండా ఆ కొమ్మనుండి మరో కొమ్మకు పాకేసి, ఇంకో దోరజామకాయకోసుకుని జీవితంలో తిండి ఎరగని వాడిలా, కొమ్మలమీద కోతిలా కూచుని తింటున్న ఆ పిల్లాడి మీదకు  గురిచూసికర్ర విసిరాడు రామయ్యగారు. దెబ్బతప్పించుకునే ప్రయత్నంలో, చెట్టుమీంచి ధబ్బున పడ్డాడు ఆ పిల్లాడు.

మొగుడూ పెళ్ళాలిద్దరూ వాడిని పట్టుకునేలోగా,  తూనీగలా తప్పించుకుని  పరుగెట్టిపోయి అక్కడ సిమెంట్గోలెంలోని నీళ్లు ఆబగా దోసెళ్ళతో తాగేసి, లొంగిపోయిన సైనికుడిలా తూర్పుగుమ్మం మెట్లమీద కూలబడి, వంగుని మోకాళ్ళ మీద తలవాల్చుకుని కూచున్నాడు " ఏం కొడతారో కొట్టండి " అన్నట్టు.

 

డెబ్భయ్యవ  పడిలో ఉన్న ఆ దంపతులు వగర్చుకుంటూ, వగర్చుకుంటూ అక్కడకు నడుచుకుని వచ్చారు!

 

రామయ్యగారు జుట్టుపట్టుకుని, వాడి బుర్రెత్తి  మొహం మీద లెంపకాయలు ఛెళ్ళుఛెళ్ళు మనికొట్టడంమొదలుపెట్టారు. తనకా శాస్తి కావలసిందే అన్నట్టు మొహం అప్పచెప్పేసిన పిల్లాడిని ఆశ్చర్యంగా చూస్తూ, మండుతున్నఅరచేతిని ఉఫ్ఫుమని ఊదుకుంటూ " ఎవడ్రా కుర్రాడా నువ్వు?" అంటూ కోపంగా అడిగాడాయన!

“నా పేరు మురళీధర్ అండి! సీనియర్ ఇంటర్ లో చేరడానికి పట్నం వచ్చానండి. విపరీతమైన ఆకలేసింది! రెండురోజులయింది భోంచేసి! డబ్బుల్లేవు! అందుకే జాంకాయ దొంగతనం”

“దొంగతనం”అన్న మాట అంటుంటే,  గొంతుక వణికింది ఆ పిల్లాడికి!

కాస్త వెనక్కుతగ్గాడు పెద్దాయన! “ఏ ఊరేటి నీది? ఏ కులపోడవు?  నీకెవరూ పెద్దోళ్ళు లేరా?”  గుచ్చిగుచ్చిఅడుగుతుంటే, ఆ కుర్రాడికి ఎందుకో దుఃఖం, ఉక్రోషం ముంచుకొచ్చాయి.

“ప్రతిదానికీ కేష్టు కావాలాండి? నాకు నా కులం చెప్పుకోడం ఇష్టం లేదండి. మీరనుకుంటున్న కులపోడిని అయితే, నాకీపాట్లే ఉండకపోను. నాకు చదువంటే పిచ్చి ఇష్టం. నా కులానికీ… నా పేదరికానికీ  చదువొక్కటే భవిష్యత్తు! పదవ తరగతిరాష్ట్రంలోనే మూడవరేంకుతో పాసయ్యా! 

 

ఇక్కడకు దగ్గరలో ఉన్న కాలేజీ వారు ఇంటరూ, ఎంసెట్ వరకూ ఉచితశిక్షణ ఇస్తామన్నారు. మొదటిసంవత్సరం మా ఊరినుండి వస్తూ చదువుకున్నానండి. ఈ యేడు పరిస్థితులు మారిపోయాయి! ఇక్కడే, తినడానికి తిండి, ఉండడానికి బసచూసుకోవాలండి! తెలిసిన ప్లీడరు గారు మూడురోజులు భోజనం తమ ఇంట్లో ఏర్పాటు చేసారు. కాస్త పడుకోడానికీ, స్నానానికీ ఆరు అడుగుల స్థలం కావాలండి” స్వచ్ఛమైన భాషణంతో  మురళి మాట్లాడుతుంటే,  ఆ కుర్రాడిమాటల్లో స్పష్టత ,  ఆయనకు వాడి కులాన్ని పట్టిచ్చింది!

“బేపనోడివా!” అన్నాడో లేదో ఆయన  ఛివ్వున తలెత్తాడు మురళి.  “అదే వద్దన్నది! నన్ను పోనీండి! చేతిలోడబ్బులుంటే, ఎప్పుడో అప్పుడు మీ జాంకాయల ఋుణం తీర్చుకుంటాను లెండి. వదిలేయండి!  అంటూ పౌరుషంగా, చేతులుజోడిస్తున్న,  పొడవుగా  బక్కపలచగా,  పచ్చని దేహఛాయలో,  ఏదో తెలియని తేజస్సుతో, మెరుస్తున్న కళ్ళతో ,  ఉన్న ఆ పదహారేళ్ళ కుర్రాడిలో,  ఆయనకు ఏం కనబడిందో ఏమో మరి,  ఒక్కసారి తనచేతిపట్టువదిలాడు!

నీరసంతో, అవమానభారంతో ఆ పిల్లాడి మొహం ఎర్రబడిపోయింది. తిరిగి వెళ్ళిపోడానికి గోడవైపుకు నడవసాగాడు!

“ఆగు పిల్లాడా! ఎక్కడుంటున్నావు ప్రస్థుతం? మాకు తోటపనికి ఒక కుర్రాడు కావాలి. అదుగో ఆ షెడ్డు కనపడతందా?  అది బాగుచేసుకుని ఉండచ్చు. కరెంటు వాడుకోచ్చులే!“ అంటూ అరుస్తూ,  వెనక్కి పిలిచారు రామయ్యగారు!

“ఎవడో ఏటో తెలీకుండా పెరట్లోకి ఎలా రానిస్తాం! ఏం పట్టుకుపోతాడో ఎవడికి తెలుసు. అయినా ఈడు మాత్రంనిలబడ్తాడా ఏంది? పైగా సదువొకటి ఎలగబెడుతున్నాడు! వద్దొద్దు! ఫోరా పిల్లోడా!”  అంటూ విస్సాటంగాఈసడించింది రాఘవమ్మగారు! ఆవిడ మాట్లాడుతూనే, ఉంది. ఇంతలో, నాలుగడుగుల గోధుంతాచు. ఆవిడపక్కనుండే జరజరా పాక్కుంటూ, గోడపక్క తుప్పల్లోకి మాయమయిపోయింది. భయంతో, ఒక్క గెంతు గెంతిందావిడ!

“ఓరబ్బులూ! పామురోయ్!“  అంటూ భయంతో పిల్లాడి వెనక చేరింది. రామయ్యగారు ఇంత లావు దుడ్డుకర్ర తెచ్చుకొచ్చారు పాముని చంపడానికి. మురళి ఆయనకడ్డంగా నిలబడి ”అయ్యో! మంగళవారం. సుబ్బారాయుడు వచ్చాడండి మీ ఇంటికి. చంపద్దు! చంపద్దు”అని ఆయన్ను అభ్యర్ధిస్తూ,  పొదలదగ్గరకు వెళ్ళాడు! “స్వామీ! సుబ్రహ్మణ్యా! వీళ్ళకు అపకారం చెయ్యకుండా, జాగ్రత్తగా వెళ్ళిపో స్వామీ! పాహిమాం! పాహిమాం!”  అంటూ

“శ్రీసర్పరాజ! ఫణీశా! మహాదేవభూషా! స్వభక్తాళిపాషా! అఘధ్వాంతభాస్వత్ర్వదీపా! విరూపాక్ష! దేహాధివాసా! మహావిష్ణు పర్యంక! సర్వంసహా భారవాహా! మహాభక్తచింత్తాంతరంగా! శుభాంగా! నమస్తే నమస్తే నమస్తేనమః”అంటూ బిగ్గరగా సుబ్రహ్మణ్య సంస్థవం, చదవడం మొదలుపెట్టాడు!

 

ఈ పిల్లాడేవిటో, ఇలా తమింట్లో దూరి, ఈ దండకాలు చదవడం ఏమిటో అసలు పట్టపగలు అంత పొడుగు పాము రావడం ఏమిటో . అంతా అగమ్యగోచరంగా తోచింది ఆ వృద్ధదంపతులకు!

ముందుగా రామయ్యగారే తేరుకున్నారు. “ఇదో మురలీ, నీ కాలేజీ ఎనకాల వీధే కనకా, నీకు మా దొడ్లో సౌకర్యంగానేఉంటది. ఉండకపోయినా నీకు ఇంకో దారి లేదు. తోటపని చేసుకో చాలు! నెలకో బస్తాడు బియ్యం, కందిపప్పూ కొలుత్తాం! వంటసామానిత్తాం! నెలకు ఐదొందలు జీతం, నీ ఇష్టం! మా అవసరం కన్నా నీ అవసరమే ఎక్కువ. చూసుకో! నచ్చితే సామాన్లు తెచ్చుకో!” అని తేల్చేసి, “ఇగో! ఆ గోడ దూకమాకు! ఈ సందులోంచి ఫో బయటికి” అని చెప్పి లోపలికివెళ్ళిపోయారు.

 

అప్పటికే రాఘవమ్మకు అర్ధమైపోయింది. తోట బాగుచేయించకపోతే  పాములతో పాటూ ఇంకేమొస్తాయో అని భయం వేసింది. తమిచ్చే జీతాలకూ, చాకిరీలకీ, పనివాళ్ళొవరూ ఇటువేపుకు తొంగిచూడరు. ఇలాంటి దరిద్రనారాయణుడ్నిచేరదీస్తే, చేతికింద పడుంటాడు! “ ఇదిగో! అయ్యగారు చెప్పినట్టు ఇనుకో కుర్రాడా! సౌక్యంగా సదువుకో! మబ్బులోనీరు చూసి, ముంతలో నీరు ఒంపుకోమాక” అని హితవు చెప్పి  లోపలికి చక్కాపోయింది.

 

ఆలోచించుకుంటూ మురళి,  కాసేపు అక్కడే నిలబడిపోయాడు. చుట్టూ చిట్టడివిగా పెరిగిపోయిన తోటనుచూసుకున్నాడు. తనకు వసతిగా ఇచ్చిన,  ఒకప్పటి గేదెలకొట్టం చూసుకున్నాడు. మారు మాట్లాడకుండా, బయటకువెళ్ళిపోయాడు!

“ఆడెందుకొస్తాడే! ఆడికి కావలసింది వేరు! కష్టపడకుండా, ఒళ్ళొంచకుండా జరిగిపోవాల! ఆడు చెప్తున్న చదువూ, రేంకులూ,కచ్చితంగా కట్టుకధే! కాసిని కన్నీటి కబుర్లు చెప్పి, వందో రెండొందలో ఇత్తే తీసుకపోయుండే వోడు! సోవరిపోతులు!”   ఆయన మాటల్లో వేళాకోళం, ఎన్ని తరాలదో ద్వేషం!

 

మనిషి ఎప్పుడూ తన అంచనాల పరిధిలోనే తన ఆలోచనలను నియంత్రిస్తాడు. ఆ అంచనాలు వెంటనే వేసుకున్నవి కాదు. ఎన్నో చేదు అనుభవాలు, అవమానాలు, స్పర్ధలు, అసూయాద్వేషాలు, అంతర్గత యుద్ధాలు, సామాజిక ఆర్ధికఅసమానతలు, వర్గాల మధ్య లేని సయోధ్య, లోపించిన వర్గసంతులత  ఇలా ఒక మనిషిని చూడగానే ఆ మనిషిని ఈ పరామితిల చట్రంలో పెట్టి  తమకు అనువయిన రంగుటద్దం పెట్టుకుని విశ్లేషించుకుంటారు. రామయ్యగారి మనస్థత్వందీనికి భిన్నమేమీ కాదు!

 

ఇవే రంగుటద్దాలకు అవతలి పార్శ్వం మురళి!

పదహారేళ్ళ జీవితంలో చూసిన ఆటుపోట్లు, సామాజిక ప్రాముఖ్యతలు, ఆర్ధికఅభద్రత, అగ్రవర్ణాల అంతఃవ్యత్యాసాలు, ధనప్రాబల్యం అతనికి సమాజపు తీరుతెన్నుల మీద నిర్ధుష్టమైన చిత్రాన్ని దర్శింపచేసాయి! ఏకసంథాగ్రాహి అద్భుతమైన ధారణ ఉన్న ఆ కుర్రాడికి లోకాన్ని చదవడానికీ, లౌక్యంగా బ్రతుకుతెరువు వెతుక్కోడానికి జీవితకాలం అవసరమే లేదు. తనకు దొరికిన ప్రతీ అవకాశం నుండి అతడు చాలా లౌకికవిద్యలు నేర్చుకున్నాడు! తన తాతతండ్రులునమ్ముకున్న ఆముష్మికవిద్యలకూ, సమాజప్రాధమ్యమైన లౌకికవిద్యకూ మధ్య తారతమ్యాన్ని చిన్ననాటనే ఔపాసనపట్టాడు! చేతిలో ఎర్రఏగానీ లేదు. అయినా తను అసహాయుడినని అనుకోవడం లేదు. తను సంకల్పించుకున్న పెద్దఆశయాలసిద్ధికి అతనికి ప్రణాళికలు లేవు. దట్టమైన అడివిలో, కొమ్మాకొమ్మా నరుక్కుంటూ ముందుకు సాగిపోయే పథికుడులా ఉన్నాడిప్పుడు.

 

ఆ తెల్లవారుజామునే తన పుస్తకాలసంచీ, రేకుపెట్టితో  రామయ్యగారి గేటుదూకి తోటలోకి ప్రవేశించాడు మురళీధర్! చీకట్లను చీలుస్తూ వెలుగురేకలు విచ్చుకుంటున్న ఆ ప్రత్యూషసమయంలో  ఆ పరిసరాలకు తనను పరిచయంచేసుకుంటూ ,  భగవద్ ప్రార్ధన చేసుకుని ఆ తోట బాగుచేయడం మొదలుపెట్టాడు!

ఊడ్చిన ఆకుల్నీ, కంపల్నీ లాక్కుంటూ పోయి పెద్ద పోగువేసాడు. చిన్నాచితకా తోట కాదుకదా  ఏదో ఒక రోజులోపూర్తిచెయ్యడానికి! అలసటతో సపోటా చెట్టుకింద కూలబడ్డాడు.

చెట్టునిండా చిలుకలు కొట్టిన పరువపు సపోటాలు కోకొల్లలు. కొన్ని కోసుకుని తిన్నాడు. శరీరంలోకి నూతనోత్సాహంవచ్చింది.

తోటలో అలికిడికి పెద్దాయన లేచి వచ్చారు. సగం బాగయిన తోటనూ, కుళాయిదగ్గర మొహం కడుక్కుని నీళ్ళుతాగుతున్న మురళినీ చూడగానే ఆయన మొహంలో సంభ్రమం! తన అంచనాలు తప్పినా ఎందుకో చిన్నసంతోషరేఖ పొడసూపింది ఆయనలో!

లోపలికెళ్ళి షెడ్ తాళాన్ని పనిపిల్లకిచ్చి పంపారు. ఆవులకొట్టానికి ఆనుకుని ఉన్న ఆ గది ఆవాసయోగ్యంగానే ఉంది,  అన్ని కనీససౌకర్యాలతో! లోపలినుండి బియ్యం, పప్పూ, కూరగాయలూ, చిన్న కేన్ తో పాలూ పంపారు! మురళి గదిని, పాత్రలనూ శుభ్రం చేసుకుని,  కాస్త పులగం వండుకుని,  తన ఇష్టదైవం గణేశునికి నివేదించి,  కాలేజీకిబయలుదేరాడు.

గుమ్మంలోనే నించుని ఉన్న రాఘవమ్మగారిని కలిసాడు.” అమ్మా! సాయంత్రం వారిని కలుస్తా! నాకు ఉండడానికి నీడ, జీవనాధారం ఇచ్చినందుకు ధన్యవాదాలు! నా శక్తికొద్దీ మీకు ఉపయోగపడతా” అంటూ ఆమె పాదాలను తాకాడు!

పూర్తి పల్లెటూరి వాతావరణంలో పెరిగి, శ్రమైకజీవనం తప్పా ఎలాంటి సౌకుమార్యాలూ తెలియని ఆ పెద్దామెకు, ఆ అర్భకపు పిల్లాడిని చూసి గొంతులో ఏదో అడ్డుపడ్డట్టయింది! ప్రతీపైసా లెక్కలేసుకుని సంపద పోగుచేసే ఆమె, అప్రయత్నంగా చేతిలో ఉన్న రెండొందలు మురళి చేతిలో పెట్టేసి ”బా సదూకో! పనులు ఎగ్గొట్టకుండా చేసుకుంటేపెద్దయ్యగారు మంచోరు! బాగా చూసుకుంటారు!”  అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు.

 

ఆ డబ్బు వద్దని తిరస్కరించాలని అనుకున్నాడు మురళి. కానీ తల్లిదీవెనగా భావించి, నమ్రతతో, కృతజ్ఞతతో మనసునిండిపోగా ,  పాఠశాలకు బయలుదేరాడు!

 

సాయంత్రం తోటపని చేస్తుంటే రామయ్యగారు బయటకు వచ్చారు. ఆయనకు నమస్కారం చేసాడు మురళి. తలపంకించి లోపలకు వెళ్ళిపోయారు. ఈ పిల్లాడు జోడుబళ్ళ సవారీ , ఎంతకాలం, ఎలా నెగ్గుకొస్తాడో చూడాలని ఉంది ఆయనకు! వీడి జీవితాన్ని అధ్యయనం చెయ్యడమే నాకు పెద్ద కధా కాలక్షేపం అనుకున్నాడాయన, మనసులో గుంభనంగా నవ్వుకుంటూ!

 

తరగతిగదుల్లో చెప్పినపాఠాలు చెప్పినట్టు బుర్రకెక్కిపోయే మేధస్సు మురళీధర్ ది! ఖాళీసమయాల్లో  లైబ్రరీ నుండి తెచ్చుకున్న అదనపు సమాచారాన్ని చదువుతూ మననం చేసుకుంటాడు ఇంటికొచ్చాకా! ఆ రోజు రాత్రికి భోజనం చేసాకా, తన బుజ్జి వినాయకుడిని పక్కన పెట్టుకుని  తన జీవనోపాధికి తను ఏమేమి చెయ్యగలడో రాసుకోసాగాడు. వ్యాసుడికి భారతం రాసిపెట్టిన స్వామి ఈ సారి శ్రోతగా, సలహాదారుడిగా పాత్రవహించాడు!

 

మరునాడే తన ప్రణాళికను అమలుపరిచాడు మురళీ. తన తరగతిలో,  అతిసామాన్యంగా కనిపిస్తూ,  అఖండమేధస్సును ప్రదర్శించే మురళిపట్ల తోటివిద్యార్ధులలో విపరీతమైన గౌరవం ఉంది. ఒకరిద్దరికి అతనికి ఏదయినా సాయంచెయ్యాలని కూడా ఉన్నా,  అతని ఆత్మాభిమానం తెలిసి మిన్నకుంటున్నారు. వారిలో చాలామంది కాలేజీకాంపస్చుట్టుపక్కలే ఉంటారు. మురళీ వారితో తన ఆర్ధికపరిస్థితి వివరించి, వారి సహాయం తనకు కావాలన్నాడు.

 

ఆ మర్నాడే  తోటలో విరగపూసిన పారిజాతాలు, మందారాలు, నందివర్ధనాలూ, గన్నేరుపూలూ , మల్లెలూ, విష్ణుకాంచనాలూ  సగం చెట్లకే ఉంచి,  మిగిలినవి కోసి  పదిహేను కవర్లకు సర్దాడు. తెల్లవారి ఐదింటికే,  తనస్నేహితులుండే, అపార్ట్ మెంట్ల కాపలాదార్లకు పూలకవర్లు అప్పచెప్పాడు. నగరం నడిబొడ్డున ఇలాంటి దేవప్రియమైనపువ్వులు దొరకడం చాలా అపురూపం. వారు నెలకు ఆ పువ్వుల నిమిత్తం ఇంటికి రెండొందలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఒక పేదవిద్యార్ధికి ఈవిధంగా నిలబడదామనే సద్భావన కూడా వారిలో!

అలాగే జామిచెట్ల నుండి మంచి దోరజాంకాయలు, సపోటాలూ, మామిడికాయముక్కలు ఉప్పూకారాలతో పాటూ,  కేంపస్ బయట సంచీలో పెట్టుకుని నిలబడేవాడు. అరగంటలో అమ్మడయిపోయేవి.

తోట గోడ పొడవునా పెరిగిన ముళ్ళపొదల్లో రకరకాల ఔషధగుణాలున్న తీగెలు పెరిగేవి! అశ్వగంధ, సర్పగంధ, శతావరి, బ్రహ్మి, హరీద్ర, కపికచ్చు, తిప్పతీగ, బోడతరము, నేలతంగేడు, గుంటకలగర, చిత్రమూలము, పల్లేరు , ఆల్ఫాల్ఫా గడ్డి, పసుపు, వేప, కానుగ, వావిలి, జిల్లేడు  ఉసిరి, నేలఉసిరి,  అంటూ పేరుపేరునా , తోటలో ఉన్న రకరకాల ఆకులూ, మూలికలు సేకరించి , నువ్వుల నూనెలో , ఆవుపాలలో మరిగించి,  నారాయణతైలం, క్షీరబాలతైలం చేసి దేవాలయందగ్గర, బస్తీలో అమ్మేవాడు!

ఆదివారాలు మురళీధర్ తో సహాధ్యయనం చెయ్యడానికి నలుగురయిదుగురు స్నేహితులు వచ్చేవారు. మురళీ తోటపనిచేస్తుంటే, వారు కూడా ఒక చెయ్యి వేసి ఆడుతూపాడుతూ పని పూర్తిచేసేవారు!

అలాగే పుల్లా, పుడకా, గడ్డీ, గాదర ఏదీ వదలకుండా, బస్తీలో వారికి ఇచ్చేసేవాడు!

ఈ విషయాలన్నీ ఒకటొకటిగా రామయ్యగారి చెవిలో పడుతున్నాయి! రాఘవమ్మగారు మండిపడుతోంది! “ఎంత దైర్నంఈడికి. మనింట్లో చేరి, మన యెనకాల గోతులు తవ్వుతున్నాడు! మెడట్టుకు గెంటీయండి!” అంటూ!

“అమ్మీ! ఆ తోట నాకు ప్రాణం. ఆడు బాగు చేసి పెట్టాడు. చెట్లు, మొక్కలూ సంరక్షణగా ఉన్నాయి. తోట తడుపుతున్నాడు రోజూ! గెత్తం వేస్తున్నాడు. కూరగాయల మొక్కలేసాడు. తోటకు అందం వచ్చింది. ఇప్పటికే అడివిలా ఉందని,ఇల్లు ఫ్లాట్లకోసం అమ్మమని మనని చంపుతున్నారు. మనదొక్కటే ఇల్లు మిగిలింది ఇక్కడ. నా బొందితోనే, ఈ ఇల్లూ పోవాల! చూద్దాం! ఆడు బతకనేర్చిన వోడు! వాడు చిన్నప్పటి నాలాగా, నీలాగా ఉన్నాడు! మరీ హద్దుమీరితే చూద్దాం”అంటూ భార్యను ఒప్పించాడు పెద్దాయన.

 

 నెల్లాళ్ళయింది మురళీధరమ్ పనిలో చేరి. ఆ రోజు ఆదివారం! రాఘవమ్మ పనులన్నీ అయిపోగా తీరిగ్గా ఉయ్యాలబల్ల మీద కూచుని టీవీ చూస్తోంది. మురళీధర్, “అమ్మా”! అని పిలుస్తూ లోపలికి వచ్చాడు. “ఏటీ” అంది కటువుగా! జేబులోంచి ఒక కవరూ, కాగితం తీసాడు.

“అమ్మా! ఇవి నాలుగువేలండి. మన పువ్వులూ, కాయలూ అమ్మగా వచ్చిన డబ్బు. వ్యర్ధంగా పోతున్నాయని నేను ఆ ఏర్పాటు చేసా. దీనిలో రెండువేలు నావి, మీరివ్వాలిసిన జీతంతో పాటూ!” అంటూ డబ్బులు ఆమె పక్కన ఒద్దికగాపెట్టి నిలబడ్డాడు.

 

రాఘవమ్మ మనసు కరిగిపోయింది!  “ఛా! వీడినా నేను అనుమానించింది” అనుకుంటూ బాధపడింది మనసులో! లేచి ఒక కవర్లో ఊరు నుండి వచ్చిన మిఠాయిలూ, జంతికలూ, అరటిపళ్ళూ వేసి, తెచ్చి మురళి చేతిలో పెట్టింది.

“మీ రోజూవారి పూజకు పువ్వులు తెచ్చి ఇవ్వనా అమ్మా !”  అని మురళీ అడిగాడు!  

గట్టిగా నవ్వేసింది ఆవిడ- “లంకంత కొంపలో నీకు ఒక్క దేవుడు పటం కనిపిస్తావుందా? లేదు కదా! మాకు పూజలు, గుళ్లూ తెలియవబ్బాయి! మాపెద్దోళ్ళు, ’శ్రమే దైవం ‘అన్నారు. మా చిన్నప్పుడంతా కోళ్ళపారాలు చూసుకుంటూ,  మెకాల కు మేతలేయడంతోనే గడిసిపోయింది. ఈ రావయ్యగారి తండ్రి, మా నాన్న స్నేహితుడు. దండలపెళ్ళి చేసారు ఇద్దరికీ. ఒక్కలా కష్టవడ్డాం! బూవీపుట్రా పోగేసాం. నలువురు పిల్లలూ బాగా చదూకున్నారు. అబ్బాయి, కోడలూ అమిరికాలో పెద్దడాక్టర్లు. పోన్లే తప్పా, ఇక్కడికి వచ్చేది తక్కువ! కూతుళ్ళను బాగా అంతస్తున్న ఇళ్ళలో ఇచ్చాము. ఒక పిల్ల అత్తింటి ఆరళ్ళకు కాల్చుకునిపోయింది. మరో కూతురు రెండేళ్ళ క్రితం కేన్సర్ ముదిరిపోయి,ఆపరేషన్ టేబుల్ మీదే పోయింది! మేము పూజలుచెయ్యం! కానీ మా పిల్లలంతా మా ఇల్లొదిలాకా, పూజలూ, యాత్రలూ అంటూ పిచ్చిగా దేవుడ్ని కొలిచారు. ఏం చేసాడు మీ దేవుడు. మేము గుండుపిక్కల్లా ఉన్నాం. ఆళ్ళ పచ్చని జీవితాలు బుగ్గిచేసాడు!”, ఆ మాటలు చెప్తుంటే ఆమె గొంతులో దుఃఖం, నిరసన!

 

“అమ్మా! మీ దుఃఖానికి అర్ధం ఉంది. కానీ మీ పిల్లలకు జరిగిన దాంట్లో పరమార్ధం ఉంది! భారతీయ కర్మసిద్ధాంతాన్నిఅవగతం చేసుకుంటే మీ దుఃఖానికి హేతువు దొరుకుతుంది మీకు. మీకు అభ్యంతరం లేకపోతే, రోజూ ఒక అరగంటమనం భగవద్గీత చదువుకుందాం! మీ టీవీ సీరియల్స్ మొదలయ్యే టైమ్ కు వదిలేస్తాగా మిమ్మల్ని”  చిరునవ్వు నవ్వుతూ అన్నాడు మురళి.

వీధి వసారాలో ఈ సంభాషణంతా వింటూ, చుట్టకాలుస్తున్న రామయ్యగారు భార్య ఏమంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!

“యెళ్ళబ్బయ్యా! యెళ్ళి చదూకో! సంతకం తప్పా చదువా సంధ్యా నాకు. ఇప్పుడు ఇయన్నీ నా బుర్రకెక్కవు గానీ యెళ్ళు! ఈ డబ్బు తీస్కపో! ముందు ముందు కావల్సి వస్తాది!”  అంటూ నవ్వుతూ విదిలించేసింది పెద్దామె!

 

“సరేలెండి. కానీ ఈరోజు సాయంత్రం ఆరింటికి ధ్యానం చేసుకుందాం. మీకు బావుంటుంది!”  అంటూ వెళ్ళిపోయాడు మురళి. ఆమె వాటా డబ్బు అక్కడే ఉంది. అది చూసి, జీవితంలో మొట్టమొదటిసారి మనుషుల పట్ల ఆమెలో మృదుత్వం,అక్కర, నమ్మకం, గౌరవం వచ్చి చేరాయి!

 

రాఘవమ్మగారికి జీవితమంటే కూడబెట్టడం, పోగేయడం మాత్రమే! పోగేసిన సంపదను, పెంచుతూపోయి సంపదను  పిల్లలకు పంచగా , ఇంకా మరో నాలుగు తరాలకు సరిపడా ఉంటుందేమో! అయినప్పటికీ ఈమధ్య, జీవితాన్ని వెనక్కు తిరిగి చూసుకుంటే చాలా వెలితి కనిపిస్తోంది ఆమెకు.

 

పిల్లలను పట్టణాల్లో పెట్టి చదివించి,  తను పల్లెలో వ్యవసాయం, పాడి చూసుకునేది. ఆయన మిల్లు మీద మిల్లు కడుతూవ్యాపారం చూసుకునేవారు. పిల్లలతో ఏరోజూ మనస్పూర్తిగా మాట్లాడి,ముద్దుమురిపాలు చేసిందిలేదు. వాళ్ళ చదువులమీద పెట్టిన పెట్టుబడి వ్యర్ధం కాకుండా,  వాళ్ళను చదువుకోమని అదిలించడమే.

 

ఆఖరి పిల్లకు తనంటే ఎంతిష్టమో! వెనకెనక తిరిగేది. పెద్దపిల్లల్లా బాగా చదువుకోవట్లేదని  చిన్నతనంలోనే  పెళ్ళిచేసేసారు! నానాకష్టాలూ పెడుతున్నారని ఏడ్చినప్పుడల్లా అడిగినంత డబ్బిచ్చి పంపేసేవారు! అలా చెయ్యకుండా కన్నతల్లిగా తను ఆ పిల్ల సమస్యలను విని, ఆ కాపురం వదిలించి పుట్టింటికి తెచ్చేసి, కడుపులోపెట్టుకుంటే, ఆ పిల్ల తమకు దక్కేదేమో!

 

పూర్తిగా కాలిపోయిన శరీరంతో “ అమ్మా! నా పాప! నా పాప!”,  అంటూ తన కళ్ళలోకి చూస్తూ వెళ్ళిపోయింది!

 

మధ్యబిడ్డ,  పుడుతూనే ఎంత కలిసొచ్చింది తమకు! డాక్టరీ చదువుతుంటే మధ్యలోనే పెళ్ళి చేసి పంపేసాడు తండ్రి! కుటుంబమంతా డాక్టర్లు! అమ్మాయి గొప్పడాక్టరయింది. ఏం లాభం! తనలో పెరుగుతున్న కేన్సరు తనకే తెలియని స్థితిలో,  చెయ్యిదాటిపోయింది! ఆరోజు వియ్యపురాలు ఏమంది ”తల్లితండ్రుల పుణ్యాలే పిల్లలకు మంచిచేస్తాయి. కట్టూబొట్టూ, పూజాపునస్కారం తెలీని అడివిజాతి నుండి అమ్మాయిని తెచ్చుకున్నాం” అంటూ కదా ఈసడించుకుంది!  

 

ఎందుకో రాఘవమ్మగారికి ఇవన్నీ తలుచుకుంటుంటే, ఉడుకుమోత్తనంగా ఉంది  అయనెనకాలే బతుకయిపోయింది. ఆయన కారెక్కమంటే ఎక్కనూ, దిగమంటే దిగనూ! తన తోటోళ్ళంతా , దేశాలమ్మట తీర్ధయాత్రలంటా, తిరుగతా ఉంటే,  తనకు ఓయాత్ర లేదు  ఓ సరదాలేదు ! ఎప్పుడయినా ఒక్కసారి తిరుపతి వెళ్ళాలని,  ఏదయినా దేవుని పటం ఇంట్లో పెట్టుకోవాలని మనసులో సంకల్పం పుడుతోంది!

 

ఆమెకు తెలియని విషయమేమిటంటే ఏభైఐదేళ్ళ సాహచర్యం మహిమో ఏమో,  అవతలిగదిలో, ఆయనలో కూడా అవే భావనలు ఆవృత్తమౌతున్నాయని!

 

ఆయనకెందుకో హఠాత్తుగా కాలుస్తున్న ఆ చుట్ట వెగటుగా అనిపించింది. కిటికీలోంచి బయటపడేసారు. కొడుకు పక్కనుంటే బాగుండుననిపించింది. అమెరికా రమ్మంటాడు! ఆరోగ్యాలు ఆరా తీస్తాడు! ఏమి కావాలన్నాపంపుతానంటాడు! అతని ఆరాటం ‘తండ్రిని మించిపోయాను ‘ అన్న, అహంకారంలా అగపడుతుంది తనకు!

 

ఈ అంతులేని ఆస్థి అంతా తన స్వార్జితం! తన గర్వం తనది! వ్యాపారాల్లో ఏర్పడిన శత్రువులు తప్పా స్నేహితులు  లేరనడం కన్నా,  అపనమ్మకం వలన ఎవరినీ దగ్గరకు చేరనీయలేదు! తోబుట్టువులంతా ఒకరొకరిగా లోకం నుండే నిష్క్రమించారు! యాంత్రికంగా సాగిపోతున్న తమ జీవితాల్లో ఈ పిల్లాడి రాకేంటి, ఇంత అలజడి లేపుతోంది. ఏదో అవసరార్ధం పనికోసం వచ్చినాడ్లా లేడు. చిన్నప్పుడు వీధిభాగవతాల్లో చూసిన వామనుడిలా ఉన్నాడు ఈ కుర్రాడు! అలా వారి ఆలోచనలు సాగిపోతూనే ఉండగానే,  సాయంత్రం ఆరయింది.

 

తెల్లగా ఉతుక్కున్న లాల్చీపైజామాలో మురళి,  గుమ్మంలో చిద్విలాసంగా నవ్వుతూ,  చేతిలో పోతనగారి శ్రీమదాంధ్రమహాభాగవతం పట్టుకుని!

తప్పక కూర్చున్నారో, తప్పులు ఎంచుదామని కూర్చున్నారో,  మొత్తానికి రామయ్యగారి దంపతులిరువురూ మురళి ఏంచెప్తాడో విందామని కూర్చున్నారు!!

వారిద్దరిలో పేరుకుపోయిన దశాబ్దాల నాస్తికవాదాన్ని  గండ్రగొడ్డలితో నరికేసి,  ఆ నిరాకార, నిరంజన,నిర్గుణపరంజ్యోతి, పరబ్రహ్మ స్వరూపాన్ని వారికి పరచయం చెయ్యడానికి విచ్చేసిన  పరశురామావతారంలా ఉన్నాడుమురళీధరుడు!

“ఎవ్వనిచేజనించు జగమెవ్వని లోపలనుండు లీనమై

యెవ్వని యందు డిందు, పరమేశ్వరుడెవ్వడు, మూలకారణం

బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానయైన వా

డెవ్వడు, వానినాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్.”  శ్రద్ధగా భగవంతుని ప్రార్ధన చేసి,  తనకొచ్చిన రీతినిభగవంతుని కధ వినిపించడం మొదలుపెట్టాడు మురళి!

 

గంట తరువాత అతను “స్వస్థి”, చెప్పేసరికి,  వారిద్దరిచేతులూ జోడించి ఉన్నాయి!

 

జీవితాలలోకి భగవంతుని ఆహ్వానించడమే తరువాయి, మిగిలిన మార్పులన్నీ ఆయనే చేసుకుంటాడు నటనసూత్రధారి!

 

కొన్నిదినాల్లో, ఆ ఇంటి ఇనుపగోడలను చీల్చుకుని తిరుపతి వెంకన్న వచ్చి గోడమీద వెలిసాడు! ఆయన ముందొక దీపంవెలుగుతోంది! ఆ వృద్ధుల నిస్సారమైన నిర్లిప్తజీవితాల్లోకి శాంతి, సాంత్వనా వస్తున్నాయి! పరుల పట్లదాతృత్వభావన పెరిగింది. మురళి వారిద్దరికీ తల్లో నాలుకయ్యాడు! అతని జన్మసంస్కారం, వారి ఆధ్యాత్మికగవాక్షంఅయ్యింది.

 

రామయ్యగారి కొడుకు కొన్న కంప్యూటర్ ను మురళి వాడకంలోకి తెచ్చాడు. తరుచూ స్కైప్ లో తనతో మాట్లాడుతున్నతల్లితండ్రులలో మార్పు అతనికి కూడా పరమానందంగా ఉంది. వియ్యంకుల మధ్య మాటపట్టింపుల వలన ముభావంగాఉంటున్న ఆ ఇంటి పెద్దకూతురితో మెల్లగా సత్సంంధాలు పునర్మాణమై, తరచూ, వారితో మాట్లాడి,  యోగక్షేమాలుతెలుసుకుంటోంది ఆమె.

ఆ శ్రావణాన స్వామి వారి పక్కకు పద్మావతీదేవి వచ్చిచేరింది. రాఘవమ్మగారు పట్టుచీరకట్టుకుని, తలలో పూలెట్టుకుని,  శ్రావణశుక్రవారం పూజచేసుకుని  అమ్మవారికోసం బూరెలు చేయించింది.

భాద్రపదం నేనేం తక్కువ అంటూ గణేశచతుర్దశిని మోసుకొచ్చింది. మురళీధర్ ఉత్సాహానికి అంతులేదు. రాఘవమ్మగారిని ఊదరగొట్టేసాడు, తోటలో బొమ్మ నిలబెడతానని!!

చదువులు ఇప్పటిలా భారం కాని రోజులవి! మురళీ,  అతని స్నేహితులు,  రామయ్యగారి తోటలో చక్కని పందిరేసారు. రంగుజండాలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు! వెనకాల బస్తీనుండి తెచ్చిన మూడడుగుల గణనాయకుని శాస్త్రోక్తంగా ప్రతిష్టించారు!

రాఘవమ్మగారు, రామయ్యగారూ కుర్చీల్లో కూర్చుని ,  పిల్లల పూజలో ఆనందంగా పాలుపంచుకున్నారు! గణేశనిమజ్జనం రోజు  రామయ్యగారు, వంటోళ్ళని పురమాయించి  భారీగా ఖర్చుపెట్టి, బస్తీలోవారికీ,  ఆ చుట్టుపక్కల వారికీభోజనాలు పెట్టారు.

అన్నాళ్ళూ ఆయన డబ్బునే చూసిన వారంతా మొట్టమొదటిసారి ఆయన వితరణను కూడా చవిచూసారు. కూడపెట్టడంలో ఒకప్పుడు పొందిన ఆనందం,  వారికి ఇతరులకు పెట్టడంలో లభిస్తోందిప్పుడు!

ఆశ్వయుజాన ఆ ఇంటికి రాజ్యలక్ష్మి వచ్చింది. అమ్మవారి రూపాన కాదు. అమ్మాయి రూపాన.

దివాళా తీసిన దివాణాలలో  వ్యసనాల ఊబిలో కూరుకుపోయి,  చనిపోయిన భార్య ఆస్థిని కూడా ఆవిరిచేసి  చిట్టచివరకు తనవల్లకాదంటూ మనిషినిచ్చి,  ఇంటల్లుడు పంపించేసిన ఆ ఇంటి మనవరాలు! అమ్మను చూడని  ‘అమ్మా’ అని పిలువలేని  పదిహేనేళ్ళ మూగాంబిక ఈ రాజ్యలక్ష్మి!

దానికి తోడు, పెంపకం చేతకాని దాదీల నల్లమందు వైద్యం పిల్ల బుద్ధిమాంద్యానికొచ్చింది ! ఆ పిల్ల పెంపకమో సవాలు ఇప్పుడు!

రామయ్యగారు , తన కొడుకూ, కోడలూ  మానిటర్ చేస్తుంటే  ఆ పిల్లను రకరకాల డాక్టర్లకు చూపిస్తున్నారు. చిట్టచివరకు హైదరాబాదులో బాలపరమేశ్వరరావు గారి మందుల వలన కాస్త గుణం కనబడుతోంది.

 

మురళి చేసిచ్చిన స్వచ్ఛమైన మూలికాతైలాలతో మర్ధనాలు చేయిస్తున్నారు. మెల్లమెల్లగా రాజ్యలక్ష్మిలో మందత్వం, కలంజ ప్రభావం విరిగిపోయి, చైతన్యం రావడం మొదలుపెట్టింది. అమ్మమ్మగారి పోషణలో చక్కని అందం సంతరించుకుంటోంది. ట్యూషన్ టీచర్లు, మురళి కృషి వలన పదవ తరగతిలో కూడా చేరింది!

కాలం వేగం పుంజుకుంది!గమనించేలోగానే హేమంత శిశిర వసంతాలు హడావిడిగా వెళ్ళిపోయాయి. జ్యేష్టంలో మురళీధర్ మెడికల్ ఎంట్రన్స్ ఫలితాలు వచ్చాయి. ఉదయం రామయ్యగారికి కాలేజీ కరస్పాండెంట్ గారినుండి ఫోన్ వచ్చింది. మురళి మొత్తం రాష్ట్రంలోనే ప్రధమస్థానంలో నిలిచాడని, తమ కాలేజీ తరుఫున లక్షరూపాయల బహుమతిప్రకటిస్తున్నామని! ఆ వార్తకు దంపతులిద్దరూ పరమానందభరితులయ్యారు!

 

మురళి కోసం చూస్తే, ఆ పిల్లాడి జాడే లేదు ! గంట తర్వాత డాబా మీద మోకాళ్ళపై తలపెట్టుకుని , శూన్యంలోకి చూస్తూకూర్చున్న మురళిని , రాజ్యలక్ష్మి చూసి  తాతగారికి చెప్పింది. ఎందుకలా దాక్కున్నావని రామయ్యగారు ప్రశ్నలుసంధిస్తుంటే, ఒక్కసారి వాడి దుఃఖం పిక్కటిల్లింది. 

 

“ఎవరికి సంతోషమండి,  ఏమి చూసుకుని సంతోషం! కూటికి దిక్కులేని బ్రతుకు నాది! నేను నమ్ముకున్న వినాయకుడుమీ గూటికి చేర్చాడు నన్ను. ఆదిదంపతుల్లా మీరు నన్ను ఆదరించారు. కానీ ఎన్నాళ్ళు. ముందున్నది, అతిపెద్దభవసాగరం నాకు. నా ఆర్ధికస్థోమతు మెడిసిన్ చదవడానికి ఏ విధంగానూ సహకరించదు. ఇదివరకటిలా చిన్నాచితకాపనులు చేసుకుని సంపాదించే వ్యస్థత కూడా నాకు దొరకదు ముందుముందు! ఎక్కడి నుండి తేగలను డబ్బు”  ఏడుస్తున్నాడు మురళి!

 

“ఏడవకు మురళీ! ఏదో తోటపనికి మనిషి దొరికాడు అనుకున్నా కానీ , నీకు తెలియకుండానే నువ్వు మా జీవితాల్లోకే నేరుగా జొరబడ్డావు. అప్పుడు వివరాలు అడగలేదు. కానీ ఇప్పుడు అడుగుతున్నా! అసలు నీ గతం ఏంటి? నీ అసలుఊరు ఏంటి? ఎవరో ఒకరు బంధువులంటూ  సొంతవారు ఉండితీరాలి కదా నీకు. నేను తలుచుకుంటే నీ వివరాలన్నీరాబట్టగలను. అవసరం రాలేదు ఇన్నాళ్ళు. చెప్పు ఎవరు నువ్వు?” రామయ్యగారు కాస్త గట్టిగానే అడిగారు.

 

“మాది గోపాలపురం. మా నాన్నగారు ప్రముఖ ఆయుర్వేదవైద్యులు! మా అమ్మగారు వారి రెండవభార్య! మా సవితి అన్నగారు ఇంచుమించు మా అమ్మవయసు వాడు. నేను చురుకుగా ఉన్నానని,  నాన్నగారు నాకూ, నాతోపాటూ అమ్మకూ మూలికావైద్యం నేర్పేవారు. ఆయనే గురువుగా నాకెన్నో అలౌకిక విషయాలన్నీ బోధించేవారు! ఇది మా అన్నయ్యకు కన్నెర్రయ్యింది! నేనంటే ముందు నుండి అయిష్టమే అతనికి. వదినొచ్చాకా పూర్తిగా మారిపోయాడు! నన్ను ఇక్కడ ఇంటర్ జాయిన్ చేసి,  మా వూరు తిరిగెళుతూ,  మా నాన్నగారు హార్ట్ ఎటాక్ తో బస్సులోనే కన్నుమూసారు! ఆయన నిష్క్రమణ మా జీవితాలను తలకిందులు చేసింది! మా అన్నయ్యా, వదినల చేతిలోకి పెత్తనం చేరింది. అమ్మను దాసీని చేసాడు. నన్ను చదువు మాన్పించి , తనకింద పనికి పెట్టాలని ఆయన ఆలోచన. మాట విననందున, వదినతో అసభ్యంగా ప్రవర్తించానని నిందవేసి, ఊరంతా రచ్చచేసి, ఇంట్లోంచి తరిమేసాడు. వృద్ధులైన మా బామ్మగారు, తాతగారి కోసం అమ్మ అక్కడే ఉండిపోవలసి వచ్చింది. చెప్పండి సార్! నేనెక్కడికి పోగలను? నన్ను ఆదుకునే దిక్కుఎవరున్నారు?”  దుఃఖావేశం ఆవరించి,  వెక్కుతూ తన కధ వినిపించాడు మురళి!

గతంలో ఎందరో ఇలాంటి కధలతో ,  తమ సమస్యలను ఆయన ముందుంచేవారు,  ఏదయినా సాయంచేస్తారేమోనని! ఆ దీనగాధలన్నీ కాలక్షేపంగా విని వల్ల కాని సలహాలు చెప్పి, రిక్తహస్తాలతో పంపడం ఆయనకు రివాజుగాఉండేది.కానీ మురళి ఆయన మనసులో ప్రత్యేకంగా నిలబడ్డాడు. అతని నిబద్ధతా, పరిశ్రమా, ఆయనలో వాడిమీదనమ్మకాన్ని ఇనుమడింపచేసింది. ‘వీడికేదయినా చెయ్యాలి నేను’ అనుకునేంతగా!

“చూడు మురళీ! నేను వ్యవసాయం చేసినా, మిల్లులు పెట్టినా వ్యాపారధోరణితోనే చేసా. నా మటుకూ నాకు, మనిషి మనిషికీ ఉన్న సంబంధం ఒక బేరసారం మాత్రమే! ఇప్పుడుకూడా నిన్ను, నీ తెలివితేటల్నీ నమ్మి అదే ధోరణితో నీకు పెట్టుబడి పెడతా! పెట్టుబడి మాత్రమే,  సహాయం కానే కాదు! ఎన్నోళ్ళు చదువుతావో చదువు! నేను డబ్బు పెడతా! నీసంపాదన మొదలవగానే,  నా అప్పు నువ్వు వడ్డీతో సహా తీర్చవలసి ఉంది. ఈ డీల్ లో నా తరువాత నామినీ రాజ్యలక్ష్మి. ఇష్టమయితే చెప్పు, సాయంత్రమే లాయరు దగ్గరకు పోదాం, సంతకాలు పెడుదువు! "

ఆ పెద్దాయన కేసి తేరిపారి చూసాడు మురళి. ఆయన కళ్ళ వెనకాల  లోకాన్ని, లోకంలో వ్యాపారాన్ని , మనుషుల నైజాన్నీపూర్తిగా అధ్యనం చేసిన లౌక్యం, విజ్ఞానం!

మురళి మారుమాట్లాడకుండా  చేతులు జోడించాడు కృతజ్ఞతాసూచకంగా! మురళి మెడికల్ కాలేజీ చదువుమొదలయ్యింది!

 

***

ఆర్ధోపీడిక్స్ లో ఎమ్ ఎస్ చేస్తున్నాడు మురళి ఇప్పుడు! అతని తల్లి అతనితోనే ఉంటోంది! ఆమె తన భర్త అనువంశికంగా ఇచ్చిన ఆయుర్వేదవైద్యాన్ని జీవికగా చేసుకుంది.

ఇక మురళి పరిచయం చేసిన ఆధ్యాత్మికజీవనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారు రాఘవమ్మగారు. దైవభక్తితో పాటూ కట్టూబొట్టులో మార్పు కూడా ఆమెలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మంచి ఒడ్డూ పొడుగుతో తీరయిన రూపం వారిది. అందులో కాయకష్టం చేసిన శరీరమేమో, మంచి ఆరోగ్యంతో వయసు తెచ్చే వ్యార్ధక్యలక్షణాలు పెద్దగా అగుపడవు ఆమెలో!

మురళీ, అతని తల్లితో పాటూ  మొట్టమొదటిసారి తిరుపతి, శ్రీశైల యాత్రచేసారు ఆ దంపతులు! పురాణకాలక్షేపమని, ప్రవచనాలని,  రాఘవమ్మగారు, తన జీవనవిధానాన్ని ఐహికాలకు అతీతంగా మార్చుకుంటున్నారు.

 తోటలో, గణేశునికి చిన్న దేవాలయం నిర్మాణం చేయిస్తే రామయ్యగారికి ప్రాణప్రదమయిన ఆ తోట  ఎప్పటికీ సురక్షితంగా ఉంటుందని మురళి ఇచ్చిన సలహా ఆవిడకు బాగానచ్చింది!  

అన్నిహంగులతో,  సర్వాంగసుందరంగా విఘ్నేశ్వరునికి ఆలయం తయారయింది. ఆ విఘ్నేశ్వర మందిరాన్ని, జనాలంతా‘తోటవినాయకుడి గుడి’  అంటూ పిలవడం మొదలుపెట్టారు!

 

విశాఖపట్టణం,  శ్రీసంపత్ వినాయక ఆలయ ముఖ్యపూజారి,  శ్రీ మోహనస్వామి ఆధ్వర్యాన,  శాస్త్రోక్తవిధిని విగ్రహస్థాపన, ఆలయప్రారంభోత్సవం,  ఘనంగా జరిగాయి. రామయ్యగారి కొడుకు, కూతురు, కుటుంబాలతో దిగారు. కనీవినీ ఎరుగని రీతిలో ఉత్సవాలు చేసారు.

 

వారం రోజుల్లో సందడి సద్దుమణిగింది. పిల్లలు ఎవరి గూటికి వారు చేరారు. ఆరోజు పౌర్ణమి. శరద్జోత్స్నోద్దీపితంగా ఉంది తోటంతా! పారిజాతాలు, మధుమాలతీ పరిమళాలు ఆ గాలిని సుగంధభరితం చేస్తున్నాయి.

ఆ చలువరాతి దైవసన్నిధానమంతా, దివ్యమైన ధవళకాంతులతో మెరిసిపోతోంది.

గుడి పైమెట్టు మీద రాఘవమ్మగారు కూర్చున్నారు. ఆమె పాదాలచెంత క్రిందమెట్టు మీద మురళి కూర్చున్నాడు. ఇరువురూ, మౌనంగా, ఆ వాతావరణపు రమణీయతలో తాదాత్మ్యత పొందుతున్నారు!

వారి మధ్య మౌనాన్ని చీలుస్తూ ”మురళీ! నిన్ను ఎవరు పంపారు ఇక్కడకు” అంటూ రాఘవమ్మ ఆదమరుపుగా, అడిగింది. “తెలియదమ్మా!” అన్నాడు మురళి అంతే ఆదమరపుతో! “నాకు తెలుసు!” అందావిడ! మురళి తలపంకించాడు అవునంటూ! ఎందుకో తెలీదు వారిద్దరి మధ్యా ఒక మమతానుబంధంఅంతర్వాహినిలా ప్రవహిస్తూ ఉంటుంది. ఎలమిని అమ్మను చేరిన ఉమాసుతుడిలా ఉంటాడు మురళి ఆమె సన్నిధిలో!

కాలంతో సమాంతరంగా పరుగెడుతున్నాయి వారి జీవితాలు!

రాజ్యలక్ష్మికి,  వారి కుటుంబ ఆచారం ప్రకారం,  ఇరవయ్యవ యేటినుండే పెళ్ళిసంబంధాలు చూడడం మొదలుపెట్టారు రామయ్యగారూ, వారి కుటుంబసభ్యులు! ఆమెకు యోగ్యుడయిన వరుని తీసుకురావడానికి వారి డబ్బుబలం ఒక్కటేసరిపోలేదు. “తల్లిలేని పిల్ల”,  “ పనికిమాలిన తండ్రి”, “మూగపిల్ల” వంటి అవరోధాలను ఎత్తిచూపిస్తూ, తిరస్కరిస్తున్నారు ఆమెను. డబ్బాశతో వచ్చిన అయోగ్యులను రామయ్యగారు గుమ్మం కూడా ఎక్కనివ్వడంలేదు!

రాజ్యలక్ష్మి మాత్రం వీటికన్నిటికీ అతీతంగా కంప్యూటర్ సైన్సెస్ లో దూసుకుపోతోంది. అతిపెద్ద ఎమ్ ఎన్ సీ లో స్పెషల్ కేటగిరీలో ఆమెకు మంచి ఉద్యోగం దొరికింది. పాతికేళ్ళొచ్చినా ఆమెకు వివాహం చెయ్యలేదని బాధగా ఉన్నా మనవరాలి ఉద్యోగవిజయం వారికి అమితమైన సంతృప్తినిచ్చింది. మురళి ముందు నుండీ రాజ్యలక్ష్మి విషయంలోఅంటీముట్టనట్టు దూరంగానే ఉండేవాడు! పెద్దింటి అమ్మాయి తన వలన ఎలాంటి ఇబ్బందీ పడకూడదనే సంస్కారంఅతనిది.

మురళి సూపర్ స్పెషాలిటీ కూడా పూర్తిచేసాడు జాయింట్ రీప్లేస్ మెంట్, స్పైన్ సర్జరీలో!

రామయ్యగారి అబ్బాయి మురళిని అమెరికా ఆహ్వానించాడు. కానీ మురళికి భారతదేశంలోనే తన వృత్తి కొనసాగించాలని కోరిక. బంగారుపళ్ళెంలో పెట్టి మరీ ప్రభుత్వోద్యోగాన్ని ఇచ్చారు అతని మెరిట్ కు. రామయ్యగారి కొడుకు స్నేహితుడి సూపర్స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అతను. విజ్ఞానం, హస్తవాసీ కలిసి, నడిచొచ్చిన వైద్యుడు అతనిప్పుడు! సంపాదన-సేవాపథం అనే జోడుపడవల ప్రయాణం అతనిది! ఎన్నిసార్లు రామయ్యగారి వద్ద ఆయన ఋుణపత్రంప్రసక్తి తెచ్చినా,  ఆయన విషయాన్ని దాటవేసేవారు!

 

***

ఆ ఇంటి చరిత్రలో మరోప్రస్థానం.

 రాఘవమ్మగారి ఎనభయ్యవ పుట్టినరోజుకు ఆమెను కాశీయాత్ర , చార్ ధామ్ యాత్రా చేయించాలని ప్రతిపాదించారు పిల్లలు! రామయ్యగారు వయోభారం వలన,మురళి పనిభారం వలనా వెళ్ళలేకపోయారు! యాత్ర దిగ్విజయంగాపూర్తిచేసుకుని తిరిగి వచ్చారు. వైకుంఠసమారాధన, మహాగణపతి హోమం, చండీహోమం చేసాడు రామయ్యగారి కొడుకు! వారి వేడుకల్లో ఒక భాగంగా నిలబడుతున్నారే కానీ రామయ్యగారు సంపూర్ణశరణాగతి స్థితిలోకి రాలేక ద్వైదీభావంతోనే కొట్టిమిట్టాడుతున్నారు!

పూర్ణాహుతిరోజున  రాఘవమ్మగారు నూట ఎనిమిది ముత్తైదువులకు మూసివాయనాలు ఇచ్చుకున్నారు. ఆమెకు తనలోని స్త్రీభావనలన్నిటికీ సంపూర్ణత్వం సిద్ధించిన సంతృప్తి, గర్వం కలిగాయి! సాయంత్రం తనను చూడడానికి వచ్చినమురళి, పాదనమస్కారం చేస్తుంటే, ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. “మురళి! ఎంత ఎదిగిపోయావు పిల్లోడా! రాజ్యలక్ష్మి పెళ్ళి బాధ్యత నీదేరా అబ్బాయ్!” అన్నారు! మురళి నవ్వుతూ “తప్పకుండానమ్మా!” అంటూ మాటిచ్చాడు!

 

ఆ రాత్రి, కొడుకుతో కబుర్లు చెప్తూచెప్తూ, అలాగే  సోఫాలో అతని ఒడిలోకి ఒరిగిపోయారు,  ఆ మహాలక్ష్మీసమానురాలు,  ఆ యింటి దొడ్డఇల్లాలు  రాఘవమ్మగారు, పెను గుండెపోటుతో!

***

రామయ్యగారు రాఘవమ్మగారి హఠాన్మరణానికి దిగ్భ్రాంతి చెందారు! ఆయనకు భార్యావియోగం సైపనోపశక్యంగా లేదు. ఏ ఒక్కరోజు తన అడుగుజాడ నుండి కాలు తీసి ఎరుగదామె. తనతో సరిసమానంగా శ్రమించి, ఉద్యమించి త్యాగాలుచేసిన సాహసి ఆమె! జీవితంలో తను ఆహ్వానించిన ప్రతీ మార్పునూ తన పథం చేసుకుని నడిచిన సహచరిణి!

 

తను లౌకికజీవితాన్ని పూర్తిగా మధించిన వ్యాపారవేత్తగా  నిరీశ్వర నాస్తికవాదానికి ప్రతినిధిగా బ్రతికినవాడు! ఆముష్మికజీవన విధానానికి ఒకప్పుడు పూర్తి వ్యతిరేకి! కానీ భార్యలేని ఈ జీవనసంధ్య ఎంతో నిర్వేదంగా,  విరాగత్వంతోబ్రతకవలసిన అవసరం ఉంది! ఈ వృద్ధాప్యంలో ఒకటొకటిగా లంపటాలు వదిలించుకోవలసిన ఆవశ్యకత కనిపిస్తోంది ఆయనకు. తన భార్య అకాలమరణం జీవితపు అనిశ్చితిని కళ్ళకు కట్టినట్టు చూపిస్తోంది!

 

వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోஉపరాణి |

తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ ||”  అంటూ మురళి చదివే భగవద్గీత శ్లోకం గుర్తుకొచ్చింది. ఏదో ధృఢనిశ్చయానికి వచ్చినట్టు మురళిని పిలిచారు!

 

“మురళి! విషయం పొడిగించకుండా నేరుగా చెప్తున్నాను. నువ్వు రాజ్యలక్ష్మిని పెళ్ళి చేసుకోవాలి. ఇన్నాళ్ళూ నా ఋుణంతీరుస్తానని వెంటపడుతున్నావు కదా! ఇదే నువ్వు నాకు తీర్చవలసిన బాకీ!“ అంటూ దృఢంగానే అడిగారు మురళిని. విస్తుపోయాడు అతను! ఆయన కొనసాగించారు

 

“ అవునయ్యా! ఇంత పెద్ద బాధ్యత నేను ఇక మొయ్యలేను. నేను చేసిన తొందరపాటు పెళ్ళి,  ఆ పిల్లకు తల్లినిదూరం చేసింది! నోరులేని పిల్లకు మళ్ళీ అన్యాయం జరగకూడదు. నువ్వయితేనే ఆ పిల్లను కడుపులో పెట్టుకునిచూసుకుంటావు! నీ కభ్యంతరాలుంటే చెప్పు!” అన్నారు!

 

“రామయ్యగారూ! మీనుండి ఈ ప్రతిపాదన నేను ఊహించనిది. ఏ ప్రాతిపదికన నన్ను మీ కుటుంబంలోకిఆహ్వానిస్తున్నారో నేను తెలుసుకోవచ్చా? నేను మీ తోటలోకి దొంగతనానికివచ్చిన  రోజు మీరు నన్ను వేసిన మొదటిప్రశ్న, ” నీకులమేంట్రా” అని! ఇప్పుడు మీకు అభ్యంతరం లేదా మరి, నా కులమేంటో! అయినా చెప్తాను! ఏ కులంతో మీకంత సయోధ్య లేదో ఆ కులపు వాడిని! అయినా మనిషికి ఐడెంటిటీ కులాన్ని బట్టి ఏమిటండీ నాకు తెలీక అడుగుతా! సమాజాన్ని తనకు అనువుగా విడగొట్టడానికి మనిషి చేసిన ప్రయత్నం వర్ణ వ్యవస్థ! గీతలో భగవానుడు ‘ “చాతుర్వర్ణమ్మయా సృష్టం”  అన్నది దేవ,మనుష్య,తిర్యక్,స్థావరల”నే నాలుగు విభాగాల గురించి. ఈ కులాల గురించి కాదు! ఇప్పటికే మనిషి అంతరంగంలో వేళ్ళూనుకుపోయిన కులాన్ని ఎవరూ ఊడబీకలేరండి. రాజ్యలక్ష్మి కులం ఆమెదే. నా కులం నాదే! ఎవరి కులగర్వం వారికి ఉండడం తప్పులేదు. ఒకరి కులాన్ని ఒకరు అవమానించుకోకుండా, కించపరచకుండా ఉంటే చాలు!”  

 

మురళి గొంతులోని ఆవేశానికీ, గాంభీర్యానికి పకపకమని నవ్వారు రామయ్యగారు!

 

“అరే కుర్రాడా! నీతో మాట్లాడిన క్షణాల్లో నాకు నువ్వెవరివో తెలిసింది. కష్టసాధ్యమయిన ఆనాటి నీ ప్రయాణాన్ని, ఎలాలాగిస్తావో చూద్దామనే నేను నీకు ఆశ్రయమిచ్చాను. కానీ నువ్వు నా సమీకరణాలను తుత్తునియలు చేసావు. నా ఆలోచనావిధానం తప్పని నిరూపించావు! మనుషులను అంతస్థులతో కొలిచి,  లెక్కలేసే స్థాయి నుండి,  మనుషుల్లో మంచితనాన్ని ఆస్వాదించే స్థాయికి నన్ను మార్చావు! నువ్వు సరయిన దిశలో మంచి ప్రణాళికతో, నీ జీవనమార్గాన్నిసాగించావు. ఆత్మాభిమానంతో కష్టాన్ని , తెలివినీ పెట్టుబడి పెట్టావు. మానవత్వం, మన్ననతో ముందుకు నడిచావు! అలాంటోడు కులాలకు అతీతంగా ఎదిగినట్టే,  హృదయవైశాల్యం పెంచుకున్నట్టే! బలవంతం లేదు మురళి! నీ కులగౌరవాన్ని వదిలి మాత్రం, నా మనవరాలిని పెళ్ళి చేసుకోనక్కరలేదు. భవిష్యత్తులో ఒక్క జంటేనా ఈ కులతారతమ్యాలకు అతీతంగా ఎదగాలనే నా ఆకాంక్ష, అంతే!”  ఆ మాటలు అంటుంటే ఎందుకో ఆయన కళ్ళలో నీరుచిప్పిల్లాయి!

 

అదిచూసి మురళి చలించిపోయాడు. ఇంక తర్కమనవసరం ఆ కర్మయోగితో అనుకున్నాడు! సమ్మతిని తెలుపుతూ,  పెద్దాయన పాదాన్ని తాకాడు!

 

తోట వినాయకుడి గుడి ఆవరణలో ఉత్సవాలనుంచి సన్నగా వినవస్తుంది పాట- "ఏ కులమూ నీదంటే, గోకులమూ నవ్విందీ." గోడమీద వెంకన్న బాబు మొహంలో అదే చిరునవ్వు.

*****

bottom of page