top of page
bhuvanollasam.PNG
srinivyasavani.PNG

సంపుటి  6   సంచిక  1

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

వ్యాస​ మధురాలు

ఒక వారసత్వం - మెడికో శ్యామ్ - అంతర్మథనం

dwaaram.JPG

ద్వారం దుర్గాప్రసాదరావు

  సి.ఎస్.శర్మ గారి శతజయంతి సందర్భంగా వెలువరించిన  "నడిచిన పుస్తకం : చిర్రావూరి సర్వేశ్వరశర్మ "సంకలనంలో మెడికో శ్యాం  గారి "కథకుడి అంతరంగం" కథపై దుర్గాప్రసాదరావు గారి విశ్లేషణ. (ఆ కథ అమెరికాలో ప్రవాసీమంచ్ కేంద్ర సాహిత్య అకాడమీ ప్రసారమయింది.  ఈ లంకెలో వినవచ్చు. Prawasi Manch on 16 July 2020)

మెడికో శ్యామ్ నాన్నగారు కీర్తిశేషులు శ్రీ చిర్రావూరి సర్వేశ్వర శర్మగారు. సి.ఎస్, సీరియస్, ఢిల్లీ శర్మలాంటి ఎన్నో కలం పేర్లు. మా ఎరికలో అంత చదువరీ, అటువంటి చదువరీ ఇంకోరు లేరు మా ప్రాంతాలలో. అన్ని పుస్తకాలు కొన్న వారూ, చదువుకున్న వారూ ఈ చుట్టుపట్ల లేరు. మల్లాది వారి గురించి విన్నాం. ఆరుద్ర పుస్తక భాండారం భాగ్యనగరంలో వాన వరదల్లో, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తడిసిపోవడం కన్నాం. శ్రీశ్రీ గారు మంచం కిందా, పరుపు కిందా ఎవరైనా వస్తే గబుక్కని దాచేసే అపురూప గ్రంథాల జాగ్రత్త గురించి విన్నాం. వేలూరి శివరామ శాస్త్రిగారి కావ్యాలూ జడివానల్లో చివికి పోవడం, వారి అపురూప గ్రంథాలయాన్ని అగ్నిదేవుడు ఆరగించడం - ఆ రోజుల్లోనే శ్రీ సి.ఎస్. శర్మగారు న్యూఢిల్లీ నుంచి విజయనగరం తరలి వస్తుంటే వందలాది పుస్తకాలూ, పత్రికలలో పడిన తన కథలు, కవితలు, వ్రాత ప్రతులు ఉన్న ట్రంకు పెట్టెలు దారిలో మాయమైపోవడం ఆయనకు తీరని దు:ఖం, మనకి తీరని నష్టం కలిగించేయి ఈ కథనాలన్నీ. ఐనా చివరిదాకా అసంఖ్యాకంగా కొంటూ చదువుకుంటూనే గడిపేరు శర్మగారు. ఇంట్లో ఉన్న ఆ పుస్తకాలన్నీ శ్యామ్ చదివేడనీ, ముఖ్యమైనవన్నీ జీర్ణించుకున్నాడనీ నా నమ్మకం.

శ్యామ్ నాన్నగారు శ్రీ సి.ఎస్. శర్మగారి శత జయంతి సంవత్సరం యిది. మనం జరుపుకోవాల్సిన ఉత్సవానికి కొవిడ్ ఇలా అడ్డుపడ్డం మన దురదృష్టం. ఆన్లైన్లోనైనా అందరం ఇలాగ రాసీ, మాట్లాడీ పండగ చేసుకోడానికి శ్యామ్ చేసిన కథాశ్రవణం మంచి ప్రారంభంలాగా ఉన్నాది. కేంద్ర సాహిత్య అకాడమీ వారు ప్రసారం చెయ్యడం, అమెరికాలో ప్రవాసీ మంచ్ వారు ఏర్పాటు చేయడం మరింత బాగున్నాది.

సాహిత్యకార్ల కోవలో శ్యామ్ ది అసలు మూడో తరం. శ్యామ్ తాతగారు ప్రసిద్ధ కవి. నవల/ నాటకం/ఖండకావ్యాలు రాసిన చిర్రావూరి కామేశ్వర రావుగారు. దీపసుందరి, అపరాజిత ఖండకావ్యం, రక్తబలి నాటకం లాంటి కావ్యాలు రాసిన ఆయన బరంపురంలో న్యాయవాది. మృదువరీ, కవీ, సాత్వికుడూ కావడంచేత రాణించలేదు ఆ వృత్తిలో. చిన్న వయసులోనే కాలధర్మం చెందేరు. ఇక సర్వేశ్వర శర్మగారు ఎవరికి స్నేహితుడో తెలిస్తే ఆయన గురించి చాలా వరకూ మనకు బోధ పడుతుంది. శ్రీశ్రీ, ఆరుద్ర, పఠాభి, ధర్మతేజ, నారాయణబాబు, చాసో, రోణంకీ, అంట్యాకుల పైడిరాజూ వీళ్లతో సాంగత్యం. పైగా బరంపురంలో సి.ఎస్. శర్మగారు పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారి దగ్గర విద్యార్థి. ధర్మతేజ శర్మగారి సహాధ్యాయి. వీళ్ళందరితో కాకపోయినా కొందరితోనైనా శ్యామ్ కి గాఢమైన పరిచయం ఉంది.

1942లో బ్రిటిష్ ఇండియ ఎయిర్ ఫోర్స్ లో సిగ్నల్ కార్ప్స్ లో సి.ఎస్. శర్మగారు జాయిన్ అయ్యారు. శ్రీనగర్ నుంచీ లాహోర్ నుంచీ అంబాలా, జలంధర్, కలకత్తా, ఢిల్లీ, మద్రాసు, కోయంబత్తూరు దాకా పనిచేసేరు. విమానదళ సంస్కారం ఆయనది. శ్యామ్ ది వాళ్ళ నాన్నగారిచ్చిన ఎడ్యుకేషనూ, సంస్కారమూ, వాళ్ళ అమ్మగారి ప్రేమా, పెంపకం. అదికాక తను సంపాదించుకున్న విశాఖ మెడిసిన్ చదువూ ఢిల్లీ ఎయిమ్స్ ఎం.డి., ఇంకానేమో ఎయిమ్స్ లోనే అపార అనుభవం. పరిశోధనకు తగిన ప్రశంసలూ. మెడికల్ రంగంలో అంతర్జాతీయ గుర్తింపులూ. అన్నింటినీ మించిన అర్హత శ్యామ్ పెంపొందించుకున్న కథా కథన సృజన శిల్పం. రసపట్టుల్లో హాస్యం, నీరసప్లాటుల్లో కూడా తర్కమో, సంగీతమో తెచ్చి పింగళి లాగానో, కె.వి. రెడ్డిలాగానో కథ రక్తి కట్టించగలడు శ్యామ్.

ఏ కథనైనా చదివిన వాళ్ళు కార్యశూరులూ, వీర సైనికులూ కానక్కర్లేదు కాని, వీధుల్లోకైనా రావాలి కదా; ఏదో ఒక ఎజెండాతో! ఆలోచనల్లో పడినా చాలు. అదెంత కాదు. ఆలోచనామృతం కదా ఇది. ఒక్కోసారి శ్యామ్ రాసినవి చదివి మాటల్తో ఆటలాడుకోడానికి మాలాంటి వాళ్ళు సాహసిస్తారు.

కథలో నీతి ఉండరాదు. బూతు ఉండవచ్చునని మెడికో శ్యామ్ కి ఎవరో మంచి ప్రిస్క్రిప్షనే ఇచ్చేరు. శ్యామ్ మాటలు నాకు ఎప్పుడూ చాలా ఇష్టం. వాళ్ళ నాన్నగారివి మరీనూ - ఇంకా ఎకానమీ ఆయనది. వడకట్టి వాడతారు వీళ్ళు. ఆస్వాదించిన మరుక్షణం మాటలు మాయమైపోవాలి - మాటలు మిగలకు - అనేది ఒక అభిశంసన కదా మనకి - శ్యామ్ మాటల్లాటి మాట్లతోనే అతని కథ గుర్తు తెచ్చుకుంటాను అనుకుంటున్నాను. కుంటుతానేమో తెలీదు.

 

బాల్కనీలోంచి అంతరంగ ప్రపంచం:

అమెరికాలో తన బాల్కనీలో నుంచుని శ్యామ్ తన అంతరంగ ప్రపంచాన్నీ, బాహ్య ప్రపంచపు అబద్ధపు పచ్చదనాన్ని చూస్తున్నాడు. ఆ ఎత్తుల్లోంచి కథ చెప్తున్నాడు. కొవిడ్ లాక్ డౌన్ లో చాలా నగరాల్లో బాల్కనీలే బాహ్య ప్రపంచాలైపోయాయి. చాలా దేశాల్లో తలుపు చాటో, తడక చాటో, తెర చాటో మాత్రమే యిల్లు. కన్యాశుల్కంలో, పోలిశెట్టి సాక్ష్యంలో అన్నట్టు అర్ధరాత్రి గుడ్డెమీదికెళ్తేనే బాహ్య ప్రపంచమో, అంతరంగమో కూడాను. అమెరికా జీవితమే ఒక నాటక రంగమైతే ఎలాగుంటుందో ద్విపాత్రాభినయం చేసేడు కథలో శ్యాం.

కాళీపట్నం రామారావు గారు త్రిపుర గురించి అన్న మాటలు ఇలాంటి కథా ప్రక్రియకు నిర్వచనాలు. "త్రిపుర అంతర్ముఖ ప్రపంచాన్ని కథలుగా మలిచే ప్రక్రియ ఎన్నుకున్నారు. తన అంతరంగ ప్రపంచం గురించే రాస్తారు. కానీ తన బాధలూ, గాధలూ రాయరు. వ్యక్తిగత జీవితం గురించీ చెప్పరు”. 

ఏ దేశం, ఏ భాష, ఏ రాష్ట్రము, ఏవతన్ ప్రశ్నలు ఉంటాయి వలస వెళ్లిన వాళ్లకు. అమెరికాలో కూడా పాలకులు పోలీసులూ వేసే ప్రశ్నలే ఇవి. వీళ్ళెందుకు వేసుకోవాలీ అంటే మనం ఇక్కడే ఉండీ ఈ ప్రశ్నలే వేసుకుంటూ ఉంటే మరి వాళ్ళకు ఇంకా అవసరం కదా. నా రాతలూ, కోతలూ ఎవరిక్కావాలి అని శ్యామ్ అంటే - అవి - రాతలంటే నెరేషనూ, కధనమూ, కోతలంటే ఎడిటింగూ, కూతలంటే మాటల ఆడిటింగూ అని అర్ధం - శ్యామ్ టెక్నిక్ కి అవే ఆధారం కనుక మనకి అవే కావాలి.

 

లాక్ డౌన్ సెల్ఫీ: 

రచయిత కథనం ఆత్మకథలాగా ఉత్తమ పురుషలో చెప్తున్నప్పుడు పలుకుబడీ ప్రత్యేకంగానే ఉంటుంది. చైతన్య స్రవంతులూ, ఆలోచనల గాలివాటులూ, మాటల ప్రవాహాన్ని విసురుతాయి. ఒకోసారి చల్లని జల్లు లాగా ఒకోసారి కుండపోతలాగా, వడగళ్ళు లాగా మాటలు పడతాయి. అలా కాకుండా తనకు సంబంధ బాంధవ్యాలు లేని పాత్రలతో కథ నడుపుతే ఈ వాక్య నిర్మాణ వైచిత్రి తగ్గి పాత్రోచిత, సమయోచిత, పరిసరోచిత మైత్రి మాటల్లోకి వస్తుంది. ఈ మాటల తిరగలి చేయి తిరిగిన నేర్పరులైన శ్యామ్ లాంటి రచయితలు ఈ రెండు రకాల కథనాలూ సాధిస్తారు.  

అందరికీ రెండు బాల్కనీలు ఉన్నాయి. గది బయట ఒకటి, గది లోపల టి.వీ. మరో బాల్కనీ. ఒకటి కుంచెం గాలి పీల్చుకుని వీధిలోకి చూసేది. గది లోపలిది ఊపిరి బిగబట్టి ప్రపంచాన్ని చూసేది. బాల్కనీలు లేని పూరి గుడిసెల్లో కూడా ఈ టీవీ బాల్కనీ ఉంటున్నాది. లాక్ డౌన్ లో ఈ రెండూ ప్రధానాలైపోయేయి. అంతరంగ కథనంలో అంతర్మథనంలో శ్యామ్ సోషల్ డిస్టెన్సింగ్ మనకి కొత్తదేమీ కాదని గుర్తు చేయగలిగేడు. సఫ్ఫోకేషన్ వల్ల సెపరేషన్ కావాలని వృద్ధులు కూడా అనుకోవడం వింత కాదనీ చీటీ డయాగ్నసిస్ చేసి ఇచ్చేడు. అంతస్తుల పైకి ఎక్కి బాల్కనీలోంచి చూసే వాళ్ళకి అంతా పచ్చగా కనిపిస్తున్నా, నేలబారు గుడిసెల్లోంచీ రోడ్లపక్క పడకల్లోంచీ కానవచ్చే శిధిల సౌందర్యాన్నీ శ్యామ్ చూడగలుగుతున్నాడు.  

ఆడ ఫ్లేవర్ చాలనుకున్న వాళ్ళు శిధిల సౌందర్యాన్ని, హిమాంగినీ హేమంతాన్నీ, ఫ్రిజిడ్ ఎయిర్ నీ సహించి శిరసావహిస్తారట. ఆడవాళ్ళకి ఏం కావాలో చెప్పగలిగిన మగాడెవరు? స్త్రీ పాత్రలు లేని నాటకాలు రాసి ఆడే మగాళ్ళు! స్త్రీలు ప్రేక్షకులుగా మాత్రమే కాకుండా నటులుగా, దర్శకనిర్మాతలుగా ఈ నాటకాలు వేస్తే స్క్రిప్టులు మారిపోతాయి.

 

అతలాకుతలం చేస్తున్న కరోనా: 

అదే అదే పదేపదే పనులు చేస్తూ మధ్య తరగతి ఇంట్లోనే కూర్చుంటే - జీతాలొస్తూంటే - కార్మిక వర్గం శిధిలం అవుతుంది. మధ్య తరగతికి మాట పడిపోతుంది. ధనస్వామ్యం రాజ్యంచేసి జీవఫలం చేదు విషం అయిపోతుంది. ధనస్వామ్యాన్నే శాస్త్రంలో ఫ్లూటోక్రసీ అంటారు. ఈ కొవిడ్ వాతావరణంలో రోజురోజుకీ ఎక్కువ అయిపోతున్న అనిశ్చిత, అసంగత, అసమ సమాజ, అస్థిర అంతరంగ బహిరంగ స్థితి గతుల్ని కథ నిర్వహణలో లోపలి దారానికి గుచ్చి మన మెడలో వేస్తున్నాడు శ్యామ్.

ఆరుద్ర ఇంటింటి పద్యాలకు గృహప్రవేశిక రాస్తూ నండూరి రామమోహనరావు గారు “ఆవరణ”ను తొలిగించేదే కావ్యరసం అని ప్రాచీనులు అన్నారని రాసేరు. విపత్కర ఆవరణను విషాద పాత్రను చేసే కథనం కూడా రసప్లావితం ఎందుకవ్వదు? అవ్వొచ్చిన కథ భీభత్స రసాన్ని చేదుమందులాగా ప్రహసనం అనే అనుపానంతో ఉగ్గు పడుతుంది - గురజాడ జాడ అదేకదా. అన్ని దేశాల్లోనూ ఉన్నాయి ఈ విపత్కర ఆవరణలు - అందరికీ తెలుసు - అందుకనే కథలో డీటైల్స్ ఏవీ లేవు. 

మైస్ - ఎన్ - సీన్ అంతా మాటలూ, భావాలతోనే తయారు చేసేడు శ్యామ్. వర్ణనలన్నీ పెడితే సినిమా వర్కింగ్ స్క్రిప్ట్ అయిపోవచ్చు. శ్యామ్ కథ స్టోరీ ఆఫ్ ఐడియాస్. స్టోరీ ఆఫ్ డిస్కషన్స్ కాదు. సత్యం తేల్చడానికి డిస్కషన్స్ తో చెలియలికట్ట దగ్గర కూర్చోడు శ్యామ్. 

కథ గురించి కథ చెప్పడం, కవిత్వం గురించి గొప్ప కవిత్వం చెప్పడం గొప్ప రచయితలూ కవులూ చేసేరు. మన చాసోగారు చెప్పిన చిన్నాజీ, బొర్జువా కుక్క, గొప్ప నమూనాలూ ఆదర్శాలూ కద. అలాగ అనిపించని కథల్లోనూ కవితల్లోనూ నవలల్లోనూ కూడా అంతర్గతంగా ఆ సంగీతం నేపథ్యంలో వినిపించడం కద్దు. తన కథాత్మకత గురించి శ్యాం చెప్తున్నాడు - నా మోనోలోగ్, నార్సిజం, నాస్టాల్జియా అసలు కథ. నాలో నేనూ నీతోనూ నేనే. కథాకథన నైపుణ్యమే అసలు కథ. ఆలాపన మన ప్రేలాపన - అన్నాడు కూడాను. నిరుపమానం నిరుపయోగం ఐనా - ఉద్వేగ పూరితమైన అనుభూతిని అందించేది. అంతవరకే ఆటోబయోగ్రఫికల్ ఇది. నిజాన్ని కలగనడం కవిత్వం - అబద్దాన్ని బయట పెట్టడం కథ - ఆటోబయోగ్రాఫికల్ అసలే కాదు. ఆటోరైటింగ్ లాగా అనిపించవచ్చునేమో. అయినా చాలా పాత్రలే ఉన్నాయి. సఫ్ఫోకేషన్ వల్ల సెపరేషన్ అడుగుతున్న ముసలాయన మొదలుకుని - ఆడవారి మాటలకూ అర్ధాలు వేరులే పాటని తోసి పారేసిన స్త్రీలూ, నిష్క్రమించిన వారూ, నీట్లో నీడలు చూసుకుని ప్రేమలోపడే అమ్మాయిలూ, హిమాంగినీ ఫ్రిజి డియర్ లూ, వీధుల్లోకి వచ్చి వర్ణవివక్షపై దాడిచేస్తున్న ఆందోళనకారులూ అందరూ పాత్రలే - కథే హీరో - కథనమే హీరోయిక్ యాక్షన్.

 

కథ అంటే: 

కథ అంటే చెప్పడం. అంటే అంటే కూడా చెప్పడమే. అని అంటే పోరనీ యుద్ధమనీ కూడా ఉన్నాది అర్ధం. కథ చెప్పే వాళ్ళకి పోరే. కథైతే వినే వాళ్లు పోరు - ఉంటారు - వింటారు - వెంట వస్తారు. అసలు ఏ పనైనా ఆ పని కోసమే - ఆపని పూనిక జీవలక్షణం. అనడం కూడా పనే కదా. అనే వాళ్లు అంటారు. వినే వాళ్లు వెంట ఉంటారు. అసలు మాటా - సిసలు భావమూనూ - ఆ మాటకొస్తే “అసలు” మాట తెలుగైతే బురద - పంకం (బ్రౌన్ చూడండి) అని అర్ధం. హిందుస్తానీ అయితే నకలు కాని మొదలు వరిజినల్ - వర్జినల్. సిసలు అచ్చం హిందూస్తానీయే. 

సిసలు అంటే నిర్ణయించబడినది అని అర్ధం. పంకంలోంచి పద్మం పుట్టినట్టు అసలు మాటే కథనం - సిసలు నిర్ణయం - అంటే భావం. మధ్యలో బోల్డు అర్ధాలు (బోల్డు ఆంగ్లమైతే సాహసార్థాలూ తెలుగైతే నానార్థాలూ అపార్థాలూ కూడాను) - నానా మాటలూ ఇలాగ అనటంలో నానా సంస్కృతమే తెలుగనుకునేరు. 

కవిత్వమైతే పాదాలకూ పాదాలకూ మధ్యనూ - కథైతే మాటల మధ్యనూ చదవాలిట - తులసి గారు అన్నారు. వేయిన్నొక్క కథల షహరజాదీలాగా మళ్ళీ పుట్టి అన్ని కథలు పన్నడం సుళువేనేమోగాని - మధురవాణి నవ్వు పట్టుబడితే గాని ఒక పెద్ద నాటకం ఆమెలాగా కథల్లాగా నడిపి అందరి కన్నీళ్ళు తుడవడం ఇంకోరికి చేతకాదు. ఆ కథ వేరు - అది రూటు - అడుగుజాడ. 

మహమ్మారులలాంటి రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కరువు కాటకాలే కాకుండా రెండు పెద్ద జబ్బులు దాడి చేసేయి. ఈసారి అణుయుద్ధం వస్తుందని భయపడుతుంటే ఈ మహాభయంకరమైన కొవిడ్ కణ యుద్ధం వచ్చి ప్రపంచం అంతటినీ కమ్మింది. జాయిస్ స్విట్జర్లండ్ లో కాందిశీకుడై తలకాచుకుని తన పని తాను పూర్తి చేసుకున్నట్లు శ్యామ్ యుఎస్ఎ బాల్కనీలో కాందిశీకుడైయ్యేడు. రెండో ప్రపంచ యుద్ధంలో సైన్యంలోనూ నౌకాదళం, వైమానిక దళాలలో చేరిన శిష్టా, శ్రీశ్రీ, ఆరుద్ర, అట్లూరి, సి.ఎస్. శర్మా - సైరన్ కూతలూ, ఫిరంగులూ, బాంబర్ల హోరుల మధ్య చీకటి బ్లాకౌట్లు, నిశ్శబ్దం, ఆశ నిరాశల విలువలూ అనుభవించి మాటల్లో ప్రయోగించేరు. త్రిపుర సైన్యంలో చేరలేదు గానీ ఆర్మీలాంటి ఎన్ సి సిలో ఆఫీసరుగా ఆయనది కెప్టెన్ ర్యాంకు. పైగా బోర్డర్స్ లో యుద్ధ వాతావరణం లోనే పనిచేసేరు. ఎలియట్టూ, ఆడెనూ, మెక్నీసు, అపొల్లీనీరూ, జాయిస్సూ, బెకెట్టూ, పికాసో, చాగాల్, మేటిస్, డాలీ, ఫ్రాయిడ్, మార్క్సూ కొత్త ఆలోచనలు, కొత్త దృష్టి తెచ్చిపెట్టేరు. ఉదాహరణకు జీన్ లుక్ గోడార్డ్ కథ నిర్మాణం గురించి ఇలాగ అంటాడు. ఒక సూత్రం చెప్పినట్టు - “కథకు మొదలు - మధ్య - ముగింపు ఉండాలి - కాని అదే వరుసలో ఉండనక్కరలేదు” - బెకెట్టూ, వర్జీనియా వుల్ఫ్ కధల్లో ఏమీ జరగకపోవడం కూడా ఒక సంఘటనే - ఈ కొత్తదనం వల్ల జ్ఞాపకాలు కూడా కొత్త రంగుల్లోనూ, కొత్త స్పష్టతలతోనూ ముసురుతాయి. అసంకల్పిత జ్ఞాపకాలూ, సంకల్పిత జ్ఞాపకాలూ - మార్సెల్ ఫ్రూస్ట్, వలంటరీ, ఇన్ వాలంటరీ మెమోరీస్ కలిసి జీవితంకన్నా పెద్ద సైజు - మోర్ దేన్ లైఫ్ సైజు - వర్ణ చిత్రాలూ, కుడ్య చిత్రాలూ, చలనచిత్రాలూ, బృహత్కధలూ, కావ్యాలూ అవుతాయి.

మన రివాజులూ, ఆనవాయితీలు, వ్యాకరణాలూ ఏం చెప్పేయి అంటే నేను ఉత్తమ పురుష, నువ్వు మధ్యమ పురుష, వాడు/అదీ ప్రథమ పురుష అని కదా - ఈ మూడింటి గురించే శ్యామ్ కథ ఇది. మళ్ళీ మాటల మాయా - మాయ మాటలూ - మూడిల్లు అంటే దాపరించు అనే అర్ధం కూడా ఉన్నాది - ఇక్కడ వర్తించదు అనే ఆశిద్దాం.

హృదయం మాట్లాడే వేళ మెదడు అభ్యంతరం చెప్పడం మర్యాద కాదని మెదడుకు తెలుసు అంటాడు మిలన్ కుందేరా. 

ఎవరి హృదయం వాళ్లదే - ఎవరి మనోధర్మం వాళ్లదే. మెదడు మాత్రం సమాజం యొక్క సామూహిక చైతన్యం - ఇవి రెండూ ఒకేసారి మాట్లాడవు కానీ - ఒకదానినింకోటి మేల్కొలుపుతూంటే శ్యామ్ కథల్లాంటివి పుట్టుతాయి.

*****

bottom of page