MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కథా మధురాలు
దెయ్యం వేదం వల్లించనీ...
తమిళ మూలం : జయకాంతన్
అనువాదం: రంగన్ సుందరేశన్
మధ్యాహ్నం మూడుగంటలు తరువాత, రెండుగంటలు నిద్రపోయి, స్నానం చేసి, కొత్తబట్టలు తొడుక్కొని, దువ్వుకున్న జుత్తులోని తడి ఆరడానికిముందే ‘అది’ ఆయనకి కావాలి! ఒక పరిచారకుడుగా అతన్ని పోషించే నౌకరు అప్పుకుట్టన్ కి అది సారాయిమాత్రం కాదు అని తెలుసు. ఐతే, తక్కినవాళ్ళకి తెలిసినదంతా మధుసూదనరావు ఒక తాగుబోతు అనే!
అతని బంగళా మేడమీద మండువాలో గుండ్రపు మేజాచుట్టూ మూడు కుర్చీలు కనబడతాయి. ఐతే రావుగారు కూర్చున్నది తప్పిస్తే తక్కిన రెండూ ఎప్పుడూ ఖాళీగానే కనబడతాయి. కాని ఆ కుర్చీలు అక్కడ కావాలి అని అప్పుకుట్టన్ కి తెలుసు.
మేజామీద ఒక కొత్త సారాయి బుడ్డి, దానిపక్కనే ఒక నాజూకైన గ్లాసు, రావుగారికోసం ప్రత్యేకంగా చుట్టలున్న ఒక పెట్టె - వీటికి ఎదురుగా రావుగారు తనే ఎన్నుకున్న పశ్చిమ సంగీత రికార్డులు - పేర్చబడి ఉన్నాయి.
యూడికొలాన్ వాసన ఘుమఘుమలాడుతుంటే కొంచెం గట్టిగానే అడుగులేస్తూ మధుసూదనరావు మండువాలో కాలుపెట్టగానే అతన్ని ఆహ్వానిస్తున్నట్లు అక్కడవున్న ఒంటరి గుమ్మటంలోని దీపం ప్రకాశించింది. ఆ స్వాగతం అంగీకరిస్తునట్టు ఒక నిమిషం ‘సరే’ అనే తృప్తితో ఆ మూడు కుర్చీలలో బంగళాకి ఎదురుగావున్న దానిలో అతను కూర్చున్నారు. ఎప్పుడూ ఆ దిశలో కూర్చోడమే అతనికి అలవాటు. అక్కడనుంచి చూస్తే గేటుదగ్గర ఆయుధంతో కాపలాకాసే సేవకుడూ, రావుగారిని చూడడానికి వచ్చే మనుషులు - వాళ్ళతోబాటు - వెన్నెల రాత్రులలో, చంద్రోదయమూ కనిపిస్తుంది.
అతను కూర్చున్నవెంటనే స్విచ్ బోర్డు దగ్గర నిలబడిపున్న అప్పుకిట్టన్ చరచరమని తక్కిన మీటలు నొక్కి బంగళాతోటలోవున్న అన్ని దీపాలూ వెలిగించి ఆ ప్రదేశాన్ని ఒక స్వప్నలోకంగా మార్చుతాడు.
ఇవాళ వెన్నెలరాత్రి కాదు. అందువలనే అతనికి ఏది ఇష్టమని అప్పుకిట్టన్ కి తెలుసు. ‘ఇక అతనికి ఏం సేవ కావాలో?’ అనే ఆలోచనతో అతని పక్కనేవచ్చి నిలబడ్డాడు. మేజామీదవున్న రికార్డులని దేనికిదానిగా చేతిలోకి తీసుకొని, వెలుతురులో పరీక్షించి, ఏది ముందు విందాం, ఏది తరువాత విందాం అని నిశ్చయించి, మధుసూదనరావు వాటిని వరుసపరిచారు. ఆ పని అయిన తరువాత ఒక చిరునవ్వు నవ్వారు.
మధుసూదనరావుకి నవ్వడంకూడా తెలుసు అని చెప్పడానికి ఈ దృశ్యం మాత్రమే సాక్షి. ఆ చిరునవ్వుకి కృతజ్ఞత తెలుపుతున్నట్టు “Yes, Sir!” అని చెయ్యెత్తి అతన్ని నమస్కరించి ఆ రికార్డులని మోసుకొని వెళ్ళి హాలులో రేడియోగ్రాం దగ్గరకి అప్పుకుట్టన్ వెళ్తున్నాడు.
గట్టిగా మళ్ళీ కాండ్రించుకుంటూ నెరసిన తన పెద్ద మీసాన్ని సర్దుకున్న తరువాత అతను చుట్టపెట్టెని తెరచి ఒక చుట్టని బయటకి తీసి, దాని లేబిల్ని పీకి పారేసి, ముక్కుదగ్గర వాసనచూసి, తృప్తితో దాని కొనని పళ్ళతో నమలి ముక్కని తలవంచి పక్కనే తుప్పారు. ఇంతలో అప్పుకుట్టన్ వచ్చి సిరాయి బుడ్డిని తెరిచి గ్లాసులో నింపాడు.
అప్పుడే ఆరంభమైంది సంగీతం. అతను మళ్ళీ చిరునవ్వుతో సారాయి తాగుతున్నారు.
రావుగారికి సారాయి తాగడానికి పెర్మిట్ ఉంది, అతను గుఱ్ఱాల పందాలకి వెళ్తున్నారు అనే కారణం వలన అతనేమో అనుమతించిన పనులే చేస్తారని అర్ధం చేసుకోకూడదు. అతనికి ఉద్యోగంనుంచి రిటైరవడానికి తగిన వయస్సు వచ్చినాకూడా అతని నడత, ప్రవర్తనలు చూస్తే అవన్నీ ఒక యవ్వన సరసుడు, వ్యభిచారికే వుంటాయని ఊరులో అందరూ చెప్పుకుంటున్నారు.
కాని రావుగారికి దానిగురించి ఎటువంటి విచారమూ లేదు. అతన్ని ఎవరేం చెయ్యగలరు? అతనొక ప్రభుత్వ అధికారి. నూరుమైళ్ళ విస్తీర్ణమున్న జిల్లా నిర్వహణకి అధికారమూ, బాధ్యతా అతనికున్నాయి. పదవికి ఎంత కరారూ, పర్యవేక్షణ కావాలో అవన్నీ అతనికున్నాయి.
అతని వ్యక్తిగత జీవితం ఎలావుంటే ఏమిటి? కాని అతన్ని ఒక చండశాసనుడని అనడంకంటే గడసరి అని అందరూ నమ్మారు. అతని గురించి ఎవరికీ మంచి అభిప్రాయం లేకపోవడానికి కారణం ఉంది. అతనెవరి ఆదరణా ఎదురుచూడలేదు. అందరూ తన్నుచూసి భయపడాలనే అతను ఎదురుచూసారు. వాళ్ళూ అలాగే ప్రవర్తించారు. అతనికి కావలసింది అంతే. అతని కార్యాలయం అతని దగ్గర మరేం ఎదురుచూడలేదు. అతను ఎలా ఉంటే ఏం? అతని పేరంటే ఒక హెచ్చరిక, అతని దర్శనమంటే భయం!
ఈ సంఘటన తప్పిస్తే మరెప్పుడూ అతని మొహంలో చిరునవ్వుని ఎవరూ చూసివుండరు.
ఇప్పుడు హాలునుంచి సముద్రకెరటాల్లాగ వస్తున్న సంగీతం విని - అతని హృదయకమలంలో ఎక్కడో ఒకమూల గడ్డకట్టుకున్నప్రాంతాన్ని ఒక దెబ్బతో చురుక్కుమని కోస్తున్నట్టు - అతని దేహం అల్లాడుతోంది. కళ్లు మెరుస్తున్నాయి. అతనూ ఒక మనిషే అని తెలియడానికి ఇది ఒక నిదర్శనం.
సంగీతం వింటూ ఒక ఘట్టానికీ ఇక అనంతర ఘట్టానికీ మధ్య కలిగే నిశ్శబ్దంలో - తన ఆనందం భరించలేక - అనుభూతితో పకపకమని నవ్వుతున్నారే - ఇప్పుడు అతనొక పసిపాప!
ఇటువంటి సమయాన్నే ఒక ముహూర్త సమయం అని పొగడుతూ ఈ రహస్యం తెలుసుకున్న కొందరు మహనీయులు మధుసూదనరావుగారిని చూడడానికి వస్తారు. అతనుకూడా ఎవరువచ్చినా ‘సరే, రానీ’ అని అనుమతి ఇస్తారు. వచ్చేవారిలో అధిక పక్షంవారు లారీ, బస్సుల యజమానులు, వర్తకులు, వాణిజ్యవేత్తలు - ఇటువంటి రకమే - ఉంటారు. అతనివలన వారికీ, వారివలన అతనికీ సహకారమూ, లాభమూ కలుగుతాయి.
ప్రతీనెలా అతనికి మాఫీ చెయ్యడానికి - డబ్బూ, వస్తువులూ, పారితోషికాలూ - ఇచ్చి తమ ప్రార్ధనలు తీర్చుకొనేవారున్నారు.
అవును, దానికి పేరు లంచం!
లేకపోతే, మరెలా రావుగారు ఇటువంటి జీవితం గడపగలరు?
అతనికి నెలనెలా వచ్చే జీతం వెయ్యిరూపాయలేకదా? మరెలా అతని ఇద్దరు పిల్లలు కాలేజీలో చదువుతున్నారు? అతని భార్య పోయిన తర్వాత ఇరవై సంవత్సరాలవరకూ వాళ్ళు హాస్టల్లోనేవుంటున్నారు. పెర్మిట్ ఉన్నాకూడా ఇతను అనుమతికి మించే తాగుతున్నారు. ఇతను సారాయికి చేసే ఖర్చులే కొన్ని వెయ్యిలకి పైగా ఉంటాయి.
లంచం లేకపోతే ఇదెలా సాధ్యం? మధుసూదనరావు ఒక లంచగొండి. తాగుబొతు. అతనికి చాలా దురలవాటులున్నాయి. అతనొక జూదరికూడా.
ఐతే అతని కార్యాలయంలో, అతని కింద పనిచేసేవాళ్ళెవరూ లంచం పుచ్చుకోడమో లేక అతని నిర్వహణకి చెడ్డపేరు వచ్చినట్టు ఏదైనా జరిగితే అతనది అనుమతించరు.
అతను తరచుగా తనలో చెప్పుకుంటారు: ‘నేను లంచగొండితనంకి విరోధి!’ అని.
అలా అంటున్నప్పుడల్లా అతని అంతరాత్మలో ఒక ప్రతిధ్వని వినిపిస్తుంది: ‘దెయ్యం వేదం వల్లించుతోంది!’
ఏది ఏమైనా ఒకటిమాత్రం ఖాయం. రావుగారికి ఎంత చెడ్డపేరున్నా అతని కార్యాలయంలో ఒక ఉద్యోగికూడా ఎటువంటి అపనిందకి పాలవకుండా మధుసూదనరావుగారి కాఠిన్యం కాపాడిందని చెప్తే అందులో సందేహమే లేదు.
మధుసూదనరావు కళ్ళు మూసుకొని చేతిలోవున్నదేమో తాగడం మరచిపోయినట్టు కనిపించారు. దూరంలోనుంచి వినిపించే సంగీతంలో - వయలిన్ వాద్యాలు సుస్వరంగా మళ్ళీ మళ్ళీ చెవులకి ఇంపుగా వాయించుతుంటే - తన్ను మరచిపోయి అతని కళ్ళు కొంచెం సమయం ముందు గేటులో కాంతితో ప్రవేశించిన ఒక కారుని చూసాయి. అప్పుడే అప్పుకిట్టన్ ఎదుట కనిపించాడు. అన్నీ తెలిసినా నాదయోగ ఉపాసనలో మునిగిపోయిన అతనికి దాన్ని కోల్పోవడానికి మనసు రాలేదు.
అతని ఆహ్లాదం పాడుచెయ్యకూడదని అప్పుకుట్టన్ మౌనంగా నిలబడ్డాడు.
తన ఎర్రకళ్ళను కొంచెం తెరిచి, అతను వాడిని చూసారు. చేతితో సైగ చేసి ‘అతన్ని రమ్మను!’ అని ఆజ్ఞ ఇచ్చి మళ్ళీ కళ్ళు మూసుకోవడానికి ముందు సారాయి తాగుతూ సంగీతంలో మునిగిపోయారు.
ఇప్పుడు అప్పుకుట్టన్ నిలబడిన చోటులో చేతివేళ్ళలో నవరత్నాలు మెరిసే ఉంగరాలు, మస్లిన్ పంచె, సిల్కు జిబ్బా ధరించి ఒక పెద్దమనిషి కనిపించారు.
కళ్ళు తెరవగానే ఆ పెద్దమనిషిని చూసి, కన్నులు చిట్లిస్తూ రావుగారు అన్నారు: “ఈ సంగీతం ఉందే - ఇది ఒక జడమైన వస్తువులో ప్రాణం పోస్తుంది. ప్రాణంలో ఆత్మని కలుపుతుంది. ఆత్మలో. ఓ, మీరొక పక్కా business man కదూ? మీకెందుకు ఆత్మవిచారం?” అని చెప్పి నవ్వారు. వచ్చిన మనిషి ఇదేం బోధపడక ‘హీ . . హీ . . హీ . . ’ అని నవ్వుతూ, వేళ్ళు పిసుకుతూ నిలబడ్డారు.
మధుసూదనరావుగారు ఎప్పుడూ, ఎవరినీ, కూర్చోమని చెప్పరు. ఎవరూ కూర్చోరు కూడా. ఇతనూ మామూలు మనిషే. ఇతనికి తెలుసు ఇటువంటి సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలని.
“ఒకవారంగా మీరు ఊరులో లేరు!” అని అతను ఉత్తినే సంభాషణ ఆరంభించారు.
“అవును . . .” అని బదులు చెప్పి నిదానంగా ఆలోచిస్తూ “నేను బెంగళూరికి రేసుకి వెళ్ళాను” అని అన్నప్పుడు రావుగారి చెవుల్లో ఆ పందెంలోని గుర్రాల గిట్టల శబ్దం వినిపించింది. అతని కళ్ళలో మొదటి గుర్రంగా వచ్చి చివరికి నాలుగవ స్థానంలో పడి వ్యర్ధమైన ఆ Golden Herald ని చూసి, ప్రేమతో సానుభూతి తెలుపుతున్నట్టు అతను తనలో తనే చెప్పుకొని “హా... హా... It’s all right! మరి Race అంటే అలాగే కదా?” అని చేయెత్తి మొహంముందు చూపి తన ఆలోచనలతో కలుపుకున్నారు: “ఏం, నేను లేనప్పుడు నన్ను వెతుక్కుంటూ వచ్చారా మీరు?”
“అవును సార్!... ఆ లైసెన్సు గురించే!... మీరు సంతకంచేసి వెళ్ళారు, Head Clerk కూడా పాస్ చేసేసారు. కాని చివరకి ఒక సర్వసాధారణమైన Clerk ఒకడు నా కొంప ముంచేసాడు. అందులోనూ మీ డిపార్ట్ మెంటులో, మీ ఆఫీసులోనే! జోసఫు ‘నూరు రూపాయలు ఇచ్చితీరాలి, లేకపోతే ఒక వారం వరకు కాచుకొని ఉండాలి!’ అని గట్టిగా చెప్పాడట. నా Accountant నా పేరూ, మీ పేరూ చెప్పినాకూడా అతను లెక్కచెయ్యలేదు. చూడండి, మన బిజినెస్ లో ఒక వారం అంటే ఎన్ని వేల రూపాయలు నష్టం! ‘సరేలే, మీరు వచ్చిన తరువాత చూసుకుందాం!’ అని వాడికి నూరురూపాయలు పారేసాను. మీ Head Clerk దగ్గర ఒక complaint కూడా రాసి ఇచ్చాను.”
మధుసూదనరావు చూపుడువేలుతో గడ్డం రుద్దుతూ, అంతా విని, ఒక నిట్టూర్పు వదిలారు: ‘ఇలా జరిగివుండకూడదు!’ అని తనలో గొణుక్కున్నారు.
“వందరూపాయలు ఏం పెద్ద సంగతికాదు. మీరు ఇటువంటివి అనుమతించరు. మీకు రేపు ఈ సంగతి తెలుస్తే నాగురించి నొచ్చుకుంటారని నేనే రిపోర్టు రాసియిచ్చాను. లేకపోతే నూరురూపాయలకేం లెక్క?”
‘ఈ సంగతి జరిగిన రెండురోజుల తరువాత నా చెవికి అందింది. రేపు ఆఫీసులో దీనిగురించి నిర్ణయించాలి!’ అని మధుసూదనరావు తనలో చెప్పుకున్నారు. వచ్చిన మనిషికి అది బోధపడింది.
“ఐతే, ఇక నేను సెలవు తీసుకుంటాను!” అని చెప్పి తన చేతిలోవున్న ఒక కవరుని మేజామీద పెట్టి, తల వంచి, నమస్కరించి, అతను బయటకి వెళ్ళారు. రావుగారు మళ్ళీ గానంలో మునిగారు.
అతను వెళ్ళిన అర్ధ గంట తరువాత మధుసూదనరావు కవరుని తెరిచి చూసారు. అందులో ఐదు నూరురూపాయలనోట్లున్నాయి. అదే అతని మామూలు. అది చూసి రావుగారు నోరువిప్పి నవ్వారు: ‘దెయ్యం వేదం వల్లించుతోంది!’
అప్పుడు అప్పుకుట్టన్ వచ్చి అతని ఎదుట నిలబడ్డాడు. రావు తన ఎర్రకళ్ళతో వాడిని చూసారు.
“ఎవరో జోసఫ్ అని పేరట. మీ ఆఫీసు క్లర్కట. మిమ్మల్ని చూడాలని వచ్చాడు సార్ !”
రావు కళ్ళు మూసుకొని ఆలోచించారు. అతని మొహం నల్లబడింది. నుదుటమీద మడతలు కనిపించాయి.
“ఆఫీసులో వచ్చి నన్ను చూడమను.”
ఇప్పుడు హాలులోనుంచివచ్చే సంగీతంలో ఒక వయలిన్ మాత్రం అపస్వరంగా ఏడుస్తున్నట్టు వినిపించింది.
అప్పుకుట్టన్ వచ్చిన మనిషిని తిరిగిపంపించడానికి మేడమెట్లు దిగుతూంటే వాడిని బలవంతంగా ఒక ధ్వని ఆపింది: “అప్పూ...”
“సార్!” అని వాడు పరుగెత్తుకొనివచ్చి నిలబడ్డాడు.
రావు చుట్ట తాగడానికి సిద్ధంగావున్నారు. అగ్గిపుల్ల పూర్తిగా కాలేవరకూ తన చుట్టని దానిలో వెలిగుంచుకొని పొగ అల్లుకున్న తరువాత కన్నురెప్పలెత్తి అప్పుని చూసి “అతన్ని రమ్మను!” అని పలికారు.
అప్పు వెళ్ళినతరువాత ఆ క్లార్క్ గురించి అతను ఆలోచించారు: ‘వీడెందుకు వచ్చాడు? తన గురించి అందరూ అన్యాయంగా మొరపెడుతున్నారని చెప్పి ఏడవడానికా? లేకపోతే ‘ఏమో తెలియక ఇలాంటి తప్పుచేసాను!’ అని నా కాలు పట్టడానికా? ఈ వెధవలగురించి నాకు తెలుసుగా? హూం, ఏడ్చినా, కాళ్ళపై పడినా ఇక ఏ లాభమూ లేదు.” అని అతను చింతిస్తుంటే జోసఫ్ వచ్చి అతన్ని నమస్కరించాడు.
“నువ్వు ఈ ఉద్యోగానికి వచ్చి ఎన్ని సంవత్సరాలయ్యాయి?” అని వాడి మొహం చూడకుండానే చేతిలోవున్న చుట్టని మళ్ళీ మళ్ళీ చూస్తూ అతనడిగారు.
“ఎనిమిది సంవత్సరాలు సార్.”
“నీ మీద లంచం పుచ్చుకున్నావని ఆరోపణ వచ్చిందే?”
“అవును సార్.”
“ఏమిటి ‘అవును సార్’?” అని అంటూ అతను తలెత్తి చూసారు. అతని కళ్ళు చిరాకు, కోపంవలన ఎర్రబడివున్నాయి. మొహం గంభీరంగా మారిపోయింది.
“అవును సార్, నేను లంచం తీసుకున్నాను, అది నిజమే. అందుకోసం ఏం జరుగుతుందో నాకు తెలుసు. నాకు మరేం దారి తెలియలేదు, అందువలనే అలాగ చేసాను. ఇప్పుడేమో నా ప్రశ్న తీరిపోయింది, ఇక మీరు నాకు ఎటువంటి శిక్ష విధించినా సరే.” అని జోసఫ్ అంటూంటే వాడి మొహాన్ని అతను బాగా పరిశీలించారు.
“ఐతే మరెందుకు ఇక్కడికి వచ్చావ్?” అని తన చూపుని మళ్ళీ వాడి మొహంమీద వాల్చారు. వాడి మాటలు ఇంకొకసారి తనలో ఆలోచించారు.
వాడికే తనెందుకు వచ్చానని బోధపడలేదా? ఒక నిమిషం మౌనంగా కళ్ళప్పగించి అతన్ని చూసాడు. పొంగివస్తున్న దుఃఖాన్ని మింగుతూ మెల్లగా మాట్లాడాడు:
“సార్, నేను లంచం పుచ్చుకున్నాను. కాని డబ్బుకోసం ఆశపడి, దుబారా ఖర్చులకోసం నేనాపని చెయ్యలేదు. ఇంతవరకూ నేను లంచం తీసుకోలేదు, లంచం పుచ్చుకొనే అలవాటువలన తీసుకోలేదు. ఇక నేను మళ్ళీ ఉద్యోగం చేస్తే అప్పుడుకూడా లంచం తీసుకోను. ఇది సత్యం సార్! ఇది మీకు చెప్పడానికే వచ్చాను. ఇక మీరు నాగురించి ఎటువంటి తీర్పు నిశ్చయించినా సరే, నేను దానికి అర్హుడని.”
“ఇంతవరకూ నేను లంచం తీసుకోలేదు, లంచం పుచ్చుకొనే అలవాటు వలన తీసుకోలేదు.”
వాడిమాటలు దీర్ఘంగా ఆలోచిస్తూనే మేజామీదున్నకవరుని - ఇంతకుముందు వచ్చిన ఆ వర్తకుడు ఇచ్చినది - అతను చూసారు. ఒక క్షణం తన గురించి ఆలోచించారు.
“Nonsense!” అని మొహంకి ఎదురుగా చెయ్యూపి, లేనిపోని ఆలోచనలని తోసిపారేసారు.
“నీ Personnel File ఇవాళ చూసాను. నువ్వు మంచి బుద్ధిమంతుడివి. మరెందుకు ఎటువంటి ఆలోచనా లేకుండా ఇలా చేసావ్? ఏమైనా నువ్వు చేసినది తప్పేకదా?” అని తనలో మాటాడుతున్నట్టు అతనడిగారు.
“అవును సార్.”
“ఐతే ఎందుకలా చేసావ్? నా పేరు చెప్పి Head Clerk పాస్ చేసిన పనికి అడ్డంగా నిలబడి నువ్వు లంచం పుచ్చుకున్నావని ఆ మనిషే నీకెదురుగా సాక్ష్యం చెప్తున్నాడే?” అని అంటూనే అతను గ్లాసులో సారాయి పోసారు. అతని మొహంలో చెమట కారుతోంది. నుదుటని తుడుచుకొని చుట్ట తాగారు. అప్పుకుట్టన్ వచ్చి అతని గ్లాసులో సోడా కలిపాడు. వొంగి నిలబడిన అప్పుకుట్టన్ వీపుకి పైగా తల ఎత్తి జోసఫ్ ని బెదిరిస్తున్నట్టు రావు అడిగారు: “ఇటువంటి అపచారం చెయ్యడానికి ఏమిటి కారణం? What is it?”
జోసఫ్ ఏడుస్తూ బదులు చెప్పాడు: “అది నా బిడ్డ సార్. ఇవాళ పొద్దున్న చనిపోయిన నా పిల్లవాడు. వాడే సార్...”
రావు ఉలికిపడ్డారు. “Joseph, I am sorry” అని తల వంచారు. మళ్ళీ తలెత్తి చూడడానికి అతనికి కొంచెం సమయం పట్టింది. వెనుకనుంచి వచ్చే సంగీతంలోకూడా ఏదో శోకం వున్నట్లు అనిపించింది.
రావు ఒక నిట్టూర్పు వదిలి, తలెత్తి చూసారు. అప్పుడే జోసఫ్ తన మొహం తుడుచుకుంటున్నాడు.
“జోసఫ్, ఇలా వచ్చి కూర్చో.” అని తన ఎదుటవున్న ఒక కుర్చీని చూపారు.
“పరవాలేదు సార్. ఇలాగే.” అని అంటూ జోసఫ్ కొంచెం జరిగి నిలబడ్డాడు. రావు వాడిని తరిచి అడిగారు.
“నీ పిల్లవాడికి ఎంత వయస్సు?”
“రెండేళ్ళు సార్.”
“ఏమైంది అబ్బాయికి?”
“Diphtheria అని అన్నారు. గవర్ణమెంటు ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాను. చాలా ప్రియమైన సూదిమందన్నారు. ఇంకొక కేసులో వేయడంవలన చేతిలో లేదన్నారు. వెంటనే ప్రైవేటు డాక్టరు దగ్గరకి వెళ్ళమన్నారు. నా దగ్గర ఒక పైసాకూడా లేదు. ఇదేమో ఒక క్లర్క్ అబ్బాయికి రావలసిన వ్యాధి కాదు అని నాకు తెలియలేదు. ఎవరినెవరినో అడిగి చూసాను. ఇప్పుడు నేను లంచం పుచ్చుకున్నాను అని అంటున్నవాళ్ళనికూడా అడిగాను. వాళ్ళదగ్గరా డబ్బు లేదు. మరి వాళ్ళేం లంచం తీసుకునే మనుషులా - నాకెలా వంద రూపాయలు ఇవ్వగలరు? అప్పుడే నేను - మొండిగా, మూర్ఖంగా అతన్ని నూరు రూపాయలు ఇమ్మని నిర్బంధించాను. ‘నేను చేసినది తప్పు, రేపు నా ఉద్యోగానికి హాని రావచ్చు’ అని తెలిసే అలా చేసాను. ఐతే ఆ కరుణించే దేవుడు నా బిడ్డ ఒక లంచగొండి క్లర్కుకి కొడుకుగా ఉండవద్దని.”
జోసఫ్ చెప్పి ముగించడానికి ముందే “No, no. అలా అనకు జోసఫ్!,” అని రావు అతని నోరు మూసారు. తనూ కొంచెం సేపు మౌనం వహించారు. ఆ మౌన క్షణాల్లో - తను తాగుబోతుగా మారని రోజుల్లో, తనొక నిజాయితీ Class III ఆఫీసరుగా ఉద్యోగం చేసినప్పుడు తనతో జీవించిన తన భార్యని ఎందుకో అతను గుర్తుచేసుకున్నారు. ఆమె పోయిన తరువాతనే శోకంలో మునిగిపోయి ఒక తాగుబోతుగా, స్త్రీలోలుడుగా, లంచాలు తీసుకుంటూవున్న తన్ను విడచి జీవిస్తున్న తన ఇద్దరు కొడుకులని అతను తలుచుకున్నారు. ఒకసారి బాగా దగ్గి, తన్ను సర్దుకొని అతను అన్నారు: “జోసఫ్, నీకేర్పడిన దుర్ఘటనకి నేను బాధపడుతున్నాను. నాకు నిన్ను పొగడాలనివుంది - నీ ధైర్యంకోసం. ‘నేను లంచం పుచ్చుకున్నాను’ అని నువ్వు చెప్పావుగా, ఆ నిజాయితీ కోసం. అందువలనే ‘నేను మళ్ళీ ఉద్యోగం చేస్తే, అప్పుడుకూడా లంచం తీసుకోను’ అని నువ్వు చెప్పే మాటలు నేను మనసార నమ్మగలను” అని అన్నారు.
ఇప్పుడే జోసఫ్ కి చేతులూ, వొళ్ళూ వొణకడం ఆరంభించాయి.
మధుసూదనరావుగారు మేజామీదున్న కవరుని దీర్ఘంగా చూసారు. తరువాత ఒక వెర్రి నవ్వుతో అన్నారు: “నాకూ నీలాగే లంచగొండితనం అంటే అసహ్యమే. ఇప్పుడుకూడా నేను లంచానికి విరోధి. ఐతే నేనలా అంటే ‘దెయ్యం వేదం వల్లించుతోంది!’ అని నీకనిపిస్తుందేమో?” అని అడిగారు. కాని వెంటనే ‘నేనలా అడిగివుండకూడదు,’ అని తనలో చెప్పుకున్నారు.
జోసఫ్ జవాబేమీ చెప్పలేక నోరుమూసుకొని నిలబడ్డాడు.
అతను మళ్ళీ చుట్ట కాల్చుకొని మాట్లాడారు: “ఆ మాటకి వస్తే ఎవరూ లంచం తీసుకోవాలని ఆశపడి దాన్ని పుచ్చుకోరు. ఎప్పుడైనా ఒక అత్యవసర పరిస్థితిలో లంచం పుచ్చుకుంటారు. కాని అందరికీ అలా ఒప్పుకోడానికి మగతనమో, గుండె ధైర్యమో లేదు” అని చెప్పి ఆగారు. తనగురించే మళ్ళీ ఆలోచించారు.
మళ్ళీ ఒక నిట్టూర్పు. “అవును, ‘ఇది కావాలి. అది కావాలి’ అని ఒక మనిషికి ఆశ వస్తే దానికేం అంతువుందా? అందువలనే నా దగ్గర పని చేసే ఉద్యోగులని నెనెలా దండించుతానని నీకు తెలిసివుండవచ్చు. మీరు అవన్నీ చెయ్యడానికి నేను అనుమతించను!” అని మళ్ళీ అన్నారు.
ఉన్నపాటున అతని మనసులో శాంతి చోటుచేసుకుంది. మళ్ళీ తాగడం ఆరంభించారు. జోసఫ్ ని చూస్తూ చెప్పారు.
“ఒక అత్యవసర పరిస్థితిలో లంచం పుచ్చుకున్నా లంచగొండితనం ఈ సమాజంలో పెరిగిపోవడానికి కారణం అత్యవసరం మాత్రం కాదు. అది ఒక అలవాటుగా మారిపోవడం వలనే! అవును, ఇవన్నీ అలవాటులేకదా? నేను చుట్టలు కాలుస్తున్నాను. బ్రాండీ తాగుతున్నాను. ఇవన్నీ మొదట అలవాటుగానే వచ్చాయి. దేనికైనా అలవాటుపడితే అందులోనుంచి తప్పుకోవడం చాలా కష్టం! మరి నాకు కష్టమంటే నేను చేసేదంతా సరే అని నేను చెప్పవచ్చా? తరువాత నా పిల్లల గతి ఏమౌతుంది? నేనెందుకు వాళ్ళు నన్ను విడిచి జీవించాలని నిశ్చయించాను? వాళ్ళు చెడిపోకూడదనే. నా కధ ఇంకా కొన్ని సంవత్సరాల్లో ఐపోతుంది. నాతో నా దురలవాటులూ రిటైరయిపోతాయి. మీరందరూ ఇక కలకాలం జీవించాలి. అందువలనే మీరు తప్పు చెయ్యడం నేను అనుమతించను!” అని చెప్పి, లేచి హుందాగా నిలబడ్డారు. అతని హృదయాన్ని ఉర్రూతలూగించినట్టు ఆ నేపధ్య సంగీతంలో వయలిన్ వాద్యాలు కిందకీ, మీదకీ పోటాపోటీలో పాల్గొన్నాయి.
జోసఫ్ శెలవు తీసుకోవాలని అతనికి నమస్కరించాడు. ఆదేమో చూడనట్టు రావుగారు ఆకాశాన్ని చూస్తూ అన్నారు: “దెయ్యం వేదం వల్లించనీ! అప్పుడే కొత్త దెయ్యాలు తోచవు. దానితో ఆ దెయ్యానికి పట్టుకున్న పాపంకూడా కొంచెం తగ్గుతుందికదా?” అని చెప్పి తనలో నవ్వుకున్నారు.
“సరే, నేను శెలవు తీసుకుంటాను,” అని జోసఫ్ మళ్ళీ అన్నాడు.
“సరే.” అని ఎక్కడో చూస్తూ జవాబిచ్చిన రావుగారు గభీమని తిరిగి “ఉండు.” అని చెప్పి మేజామీదున్న కవరు తీసారు. ఒక క్షణం నవ్వి, ఒక నూరురూపాయలనోటుని తీసి వాడికి అందించారు. “జోసఫ్, నువ్వేం లంచం తీసుకోలేదు. నువ్వు తీసుకున్నది అప్పుమాత్రమే. రేపు దీన్ని అతనికి ఇచ్చేయ్!. ఇక నువ్వు వెళ్ళవచ్చు.”
వొణికిన చేతులతో అది అందుకొని కళ్ళు చెమ్మగిల్లుతుంటే జోసఫ్ బయటికి నడిచాడు. వెళ్ళుతూనే రావుగారికోసం ప్రార్ధించుకున్నాడు: ‘దేవుడా! నన్ను కనికరించే వాళ్ళని నేను క్షమిస్తాను. నువ్వు నన్ను క్షమిస్తావా?’
మధుసూదనరావు వాడి వీపు చూస్తూ నిలబడ్డారు. హాలులోనుంచి వచ్చే గానంలో ఒక వయలివ్ కమాను కొనమెరుపులో ఒక సుస్వరమైన రాగాన్ని అతని ఆత్మలో చోటుచేసుకొని గుసగుసలాడింది.
గభీమని అనేక వయలిన్ వాద్యాలు ఒకేసారి ఉచ్చస్థాయిలో నిదానించి, నాలుగు సార్లు ఏదో సందేశం అతనికి ప్రకటన చేసాయి.
**
మరునాడు మధుసూదనరావు ఆఫీసునుంచి అతని సంతకంతో వచ్చిన ఫైళ్ళలోనుంచి చాలా ఆతురతతో జోసఫ్ Personnel File ని తీసి చదివారు Head Clerk రామభద్రన్.
అందులో ‘ఈ కార్యాలయంలో పని చేసేవారిలో నిజమైన ఉద్యోగస్తుడు’ అన్న వాక్యం చదివి అతని మొహం నల్లబడింది. అతనికి ఒక విధమైన ఆశ్చర్యమూ, నిరుత్సాహమూ కలిగాయి. ‘ఇదొక తాగుబోతు ఆఫీసరు వాగుడు!’ అని తనలో చెప్పుకొని అతను మొహం చిట్లించుకున్నారు.
అప్పుడు మధుసూదనరావు తాగివుండలేదు అనడానికి ఒక నిదర్శనం: ఇదిగో, నవ్వడమంటే ఎరుగని, ఒక విగ్రహంలాగ, ఎవరినీ లెక్కచెయ్యకుండా, అహంకారంతో, ఆఫీసునుంచి బయలుదేరి తన కారికి వెళ్తున్న అతని నడక!
అతను కారులో ఎక్కి వెళ్ళిపోయిన తరువాత ఆ దిశనే చూస్తూ కూర్చున్నారు రామభద్రన్. ఇంకో మూల జోసఫ్.
ఇద్దరూ అతన్ని చూసారు. కాని వేరే వేరే కోణాలనుంచి.
*****