top of page
bhuvanollasam.PNG
srinivyasavani.PNG

సంపుటి  6   సంచిక  1

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

Hema-Macherla.JPG
7th telugu sahiti sadassu -2020 .JPG

బ్రిటన్లో నవలా రచన -  కథాకమామిషూ

 హేమ మాచెర్ల

బ్రిటన్లో నవలా రచన, కథా కమామిషూ గురించి ఈ వ్యాసం ద్వారా తెలియజేస్తాను. నా రెండు నవలలు ఈదేశంలో ట్రెడిషనల్ పబ్లిషర్ల ద్వారా పబ్లిష్ అయినవి కాబట్టి ఆ అనుభవం మీతో పంచుకుంటున్నాను. 1980 నుంచి 1990 వరకూ నేను తెలుగులో వ్రాసిన దాదాపు ఇరవై కథలు, దాదాపు అన్ని వారపత్రికల్లోనూ ప్రచురించబడ్డాయి. ముఖ్యంగా అప్పటి ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు నన్ను చాలా ప్రోత్సహించారు. వారికెప్పుడూ నేను ఋణపడి ఉంటాను. 

 

నా రెండు నవలలకు స్ఫూర్తి ఎలా కలిగింది? ఆంగ్లభాషలో వ్రాయడానికి కారణాలు.

నా మొదటి నవల Breeze From The River Manjeera మూలాధారం ఒక నిజమయిన జీవితం.  అనుకోకుండా, కొత్తగా ఇండియానుండి వచ్చిన ఒక అమ్మాయిని కలవడం జరిగింది. ఆమె గురించిన విషయాలు విని మనసు చలించిపోయింది. ఈ 21వ శతాబ్దంలో కూడా, అందునా యు.కె లాంటి అభివృధ్ధి చెందిన దేశంలో కూడా ఇలాంటి దురంతాలు ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయా అనే ఒక షాక్ నుంచి పుట్టుకొచ్చిన కథ ఇది. అయితే ఆ మూసిన తలుపుల వెనక, నాలుగు గోడల మధ్య, చీకటి కోణాల్లో జరిగే అత్యాచారాలు వెలికి తీసుకొచ్చి సమాజానికి తెలియపర్చాలనే ఒక బలమయిన తపన నా నవలకు ప్రేరణ.  

 

ఈ విషయంలో కొంత రీసర్చ్ చేసినప్పుడు అలాంటి సంఘటనలు మరెన్నో  ఇంగ్లండ్ లాంటి ఈ దేశంలో కూడా జరుగుతున్నాయని తెలిసి అందరికీ అందుబాటులో ఉండే ఆంగ్ల భాషలో రాయాలని నిర్ణయించుకున్నాను. అయితే మా పబ్లిషర్స్ నా రెండో నవల Blue Eyes కు కూడా కాంట్రాక్ట్ సైన్ చేయించుకున్నారు. 

 

Blue Eyes 1920 బ్రిటిష్ ఇండియాలో జరిగిన రాజకీయ అలజడిలో ఇరుక్కున్న అప్పటి యువత గురించిన,  ఒక చారిత్రాత్మక నవల అని చెప్పుకోవచ్చు. Blue Eyes  నవలకు స్ఫూర్తి చిన్నప్పుడు మా తాతమ్మ చెప్పిన గాంధీకాలం నాటి నిజమయిన కథలు.  ఆమె భర్త  (మా తాతగారు)  గాంధీ భక్తులు.  స్వతంత్రం కోసం ముమ్మరపోరాటం జరుగుతున్న ఆరోజుల్లో, ఆయన ఆస్తి అంతా దేశంకోసం ధారపోసి చాలా సాధారణ జీవితం గడిపేవారట. 

 

ఆ నేపధ్యంలో  1920లో జరిగిన కథ Blue Eyes.  ఒకవేపు బ్రిటిష్ వారి నిరంకుశ పాలన , మరో వేపు అప్పుడప్పుడే రాజకీయ వేదికపైకొస్తున్న గాంధీగారి ఆదర్శాలు, గవర్నమెంట్ రద్దు చేసినా సరే, రాజస్తాన్ లో విరివిగా జరుగుతున్న సతీసహగమనాలు. వీటన్నిటిమధ్యా చిక్కుకున్న ఆ కాలపు యువత.

 

 బ్రిటన్ లో నవలలు ప్రముఖ ప్రచురణలకర్తల ద్వారా ప్రచురించబడాలంటే అవసరమయిన మార్గాలు.

నవల రాయడం ఒకెత్తయితే దాన్ని ప్రచురిచడం మరో ఎత్తు. ముందుగా మనం చేయాల్సిన పని, మొదటినించీ చివరివరకూ ప్రతి వాక్యం మళ్ళీ చదవి ఎడిట్ చేసుకోవడం.  అంటే అనవసరమయిన పదాలు, వాక్యాలు, కథ మధ్యలో రచయిత జొరబడడం లాంటివి లేకుండా అన్నమాట. మొదటిసారిగా రాసేవాళ్ళు మాత్రం, వాళ్ళ నవలను  'లిటరరీ కన్సల్టెన్సీ' అని ఉంటారు. వాళ్ళకు పంపించడం చాలా అవసరమని నా ఉద్దేశ్యం. వాళ్ళు నవలను కాచి వడబోసి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇస్తారు. అది మన నవలను  ఇంప్రూవ్ చేసుకోడానికి చాలా సహాయం చేస్తుంది. తర్వాత మన నవలకు సరి అయిన పబ్లిషర్స్ ను ఆన్లైన్ లో గానీ, లేక ‘రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ ఇయర్ బుక్’ అని ఉంటుంది. ఇది అన్ని బూక్ షాపుల్లో, లైబ్రరీలో దొరుకుతుంది. దాన్లో అయినా వెతికి ఎంపిక చేసుకోవాలి. 

 

సాధారణంగా, క్లుప్తంగా 1000 పదాలకు మించకుండా నవల సినాప్సిస్,  మొదటి మూడు సాంపుల్ చాప్టర్లు, కవరింగ్ లెటర్ అడుగుతారు. 

 

అయితే కవరింగ్ లెటర్లో, మనకు ఈ నవల రాయడానికి స్ఫూర్తి ఎందుకు కలిగింది? ఇది చదవడం వలన పాఠకులకు ఏ రకమయిన స్పందన కలుగుతుందని?  అసలు మన నవలాపాఠకులు ఎవరు ఉంటారని మనం ఆశిస్తున్నాము? ఇవి అన్నమాట. ఒకవేళ పబ్లిషర్స్ కు మన సాంపిల్ చాప్టర్లు  నచ్చితే మొత్తం నవల పంపించమని అడుగుతారు. అదికూడా నచ్చితే, కాంట్రాక్ట్ పంపిస్తారు.  వాళ్ళ ఎడిటర్ కథను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, నా అనుభవంలో చెప్పాలంటే,  చాప్టర్ తర్వాత చాప్టర్ ఎడిటింగ్ ఉంటుంది.

 

 నవలలు ఇతర భాషల్లోకి అనువాదాలు ఎలా జరుగుతాయి :

మన నవలలు ఇతర భాషల్లోకి అనువాదాలు ఎలా జరుగుతాయంటే, సాధారణంగా  పబ్లిషర్స్ ఫారిన్ రైట్స్ ఏజెంట్స్ ను సంప్రదిస్తారు. వాళ్ళు కొన్ని పుస్తకాలను ఎంపిక చేసుకొని ఇతర దేశాల ప్రచురణకర్తలకు పంపించడం కానీ, లెక మేజర్ బుక్ ఫెస్టివల్స్ మొదలగువాటికి తీసుకెళ్ళడం గానీ చేస్తారు.  ఉదాహరణకు నా నవలను ఫ్రాంక్ ఫర్ట్ వర్ల్డ్ బుక్ ఫెయిర్ కు తీసుకెళ్ళారు.  అక్కడ ఫ్రెంచ్ పబ్లిషర్స్, Mercvre De France, అనువాద రైట్స్ కొనుక్కుని ఫ్రెంచ్ లో అనువదించి “La brise qui monte du fleuve” పేరుతో పబ్లిష్ చేసారు.    

 

 నవలలు పోటీలకు ఎలా పంపించాలి? బహుమతులు ఎలా ఎంపిక చేయబడుతాయి?    

చాలా రకాల రచనాకార్యక్రమాలు, రీడింగ్ గ్రూపులు, రైటింగ్ గ్రూపులు ఉన్న ఈ దేశంలో ఎప్పుడూ ఏవో సాహిత్యకార్యక్రమాలు, పోటీలు,  లొకల్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతూనే ఉంటాయి. ఆ వివరాలు అన్నీ లైబ్రరీల్లో, న్యూస్పేపర్లల్లొ, రైటర్స్ న్యూస్ వంటి ప్రత్యేకమయిన సాహితీపత్రికల్లో దొరుకుతూనే ఉంటాయి. దాన్ని బట్టి, ఆ నిబంధనలకు సరిపోయేట్టుగా  మనం మన ప్రచురించబడిన, ప్రచురించబడని పుస్తకాలను కూడా  పంపించుకోవచ్చు.  కొన్నిసార్లు లైబ్రరీలు, సాహితీసంస్థలు కూడా పుస్తకాలను నామినేట్ చేస్తుంటారు. ఉదాహరణకు, 2008 లో నేషనల్ గా నిర్వహించిన  'నేషనల్ రీడింగ్ హీరో' అవార్డ్  కోసం నా పుస్తకాలు మా లోకల్ లైబ్రరీ వాళ్ళు నామినేట్ చేసారు. వాళ్ళు చేసినట్టుగా నాకు 10 డౌనింగ్ స్ట్రీట్ నుంచి ఫొన్ కాల్ వచ్చేంత వరకూ తెలియదు. అలాగే బిగ్ రెడ్ రీడ్ అవార్డ్ కూడా. కొన్ని టెలివిజన్ చానల్స్ కూడా ఈ పోటీలు నిర్వహిస్తుంటారు. ఉదాహరణకు నా మొదటి నవల, చానల్ 4 వాళ్ళ రిచర్డ్ అండ్ జూడీ చాట్ షో  నిర్వహించిన ‘“How to write a novel”’ అనే కాంపిటీషన్ లో షార్ట్ లిస్ట్  చేయబడింది. కాకపోతే ఇవి ఎప్పుడో ఒకసారి చాలా అరుదుగా నిర్వహించే అవార్డులు.     

       

తరచుగ నిర్వహించే చాలా ప్రతిష్టాత్మకమయిన ప్రైజులు

Man Booker prize

Costa Book Award.

Walter Scott Prize

Orange Broadband Prize for Fiction ( Women's Prize for Fiction)  

 

Man Booker prize

సాధారణంగా ఈ ప్రైజ్ కు పబ్లిషర్స్ ద్వారా ఎంపికై వచ్చిన పుస్తకాలను మాత్రమే ఆమోదిస్తారు. అయిదుగురు జుడ్జెస్ ఉంటారు.

Costa book awards-  

ఇవి ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. అయిదు రకాలుగా ఉంటాయి. మొదటి నవల, నవల, ఆత్మకథ, పిల్లల పుస్తకం, కవితా సంకలనం. మొదలగునవి. దీనికి కూడా ప్రచురణకర్తలు Book sellars association వాళ్ళ నుండి ఎంట్రీ ఫారంలు తెప్పించుకోవాల్సి ఉంటుంది.  తొమ్మిదిమంది జడ్జెస్ కలిసి నిర్ణయిస్తారు కోస్టా అవార్ద్ ను.  ఇదండీ  టూకీగా  బ్రిటన్లో నవలా రచన -  కథాకమామిషూ!

*****

శ్రీమతి  హేమ మాచెర్ల గారు యునైటెడ్ కింగ్డమ్ వాస్తవ్యులు, తెలుగు, ఆంగ్ల కథా, నవలా రచయిత్రి. వీరు వ్రాసిన సుమారు 25 కథలు, కొన్ని వ్యాసాలు వివిధ వార, మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి. ‘ మా తెలుగు’ ‘Other worlds' అనే పుస్తకాలకి సంపాదకులుగా కూడా వ్యవహరించారు. వీరు వ్రాసిన ఆంగ్ల నవల Breeze from the River Manjeera'  చానల్ 4 టీవీ వారు నిర్వహించిన నవలల పోటీలలో ఉత్తమశ్రేణిలో ఎంపిక చేయబడింది మరియు ఫ్రెంచి భాషలోకి అనువదింపబడింది . National Reading Hero, Achievement Award, Big Red Read పురస్కారాలు  అందుకున్నారు.

bottom of page