MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
అవధాన కళ
డా॥ రేవూరు అనంతపద్మనాభరావు
అష్టావధానం తెలుగు వారి సొత్తు. సంస్కృతం, తెలుగు భాషలలో తప్ప మరే భాషలో ఈ ప్రక్రియ కన్పించదు. 20వ శతాబ్దంలో అష్టావధానం బహుముఖాలుగా విస్తరించి శతావధానం, సహస్రావాధానం, ద్విసహస్రావాధానంగా ప్రసిద్ధి చెందింది. ఇదొక సాహితీ క్రీజ. అవధాని ఆశుకవిత్వ గరిమకు, సాహితీ పటిమకు, ధారణాశక్తికీ, పాండితీప్రకర్షకు నికషోపలం. అందుకే నేను ఒక అవధాన సభా ప్రారంభంలో
పద్యం:
వ్యవధానం బిసుమంతలేని కవితా వ్యాసంగములే తెల్గులో
అవధానం బని ఆశుధారయని అభ్యాసంబు గావింతు రం
దవదుల్ ధారణ ధోరణీ సహిత సద్యః స్ఫుర్తు లీనాటి మా
యవధాన ప్రతిభా ప్రదర్శనము రమ్యంబౌత వాగ్దేవిరో!
అని ప్రార్ధించాను.
అనాది కాలంగా ఎందరో కవిపండితులు ఆంధ్రదేశంలో ఈ విద్యను ప్రచారం చేశారు. వారిలో తిరుపతి వేంకటకవులు ప్రాతఃస్మరణీయులు. కొప్పరపు కవులు దిగ్దిగంత యశఃకాయులు. వేదాలకు సంబంధించి స్వరావధానము, అక్షరావధానము వ్యాప్తిలో వున్నాయి. నాట్యావధానములో డా॥ ధారారామనాధ శాస్త్రి అగ్రగణ్యులు. నేత్రావాధానం కూడా ప్రచారంలో వుంది. శాస్త్రసంబంధంగా గణితావధానము, జ్యోతిషావధానము వంటివి అభ్యాసం చేయబడ్డాయి. సంగీత నవావధానం పేర డా.మీగడ రామలింగస్వామి ప్రదర్శినలిస్తున్నారు.
అష్టావధానంలో ప్రధానంగా నిషిద్ధాక్షరి, సమస్యాపూరణ, దత్తపది, వర్ణన, ఆశువు, అప్రస్తుత ప్రసంగం, ఘంటాగణనం, పురాణపఠనం వగైరా అంశాలను అవధాని ఎంచుకొంటారు. ఎనిమిది పృచ్ఛకులకు నాలుగు ఆవృత్తాలలో పద్యాలను పూరించి దాదాపు 90 నిముషాలలో అష్టావధానం పూర్తి చేస్తారు. ఇదొక సాహితీ వినోదం.
నేను చేసిన ఒక అవధానసభలో ఈ సమస్య ఇవ్వబడింది.
కలలో గర్భము దాల్చి కన్య ఇలలో కన్యాత్వమున్ బాసెగా
పూరణ:
వెలయాలై జనియింపలేదు మదిలోవేర్భావమున్ పూనదా
కలికీ రత్నము ప్రేమ సంగీతులలో కాల్జారినన్ తల్లిలో
పలె యాంతర్యము దాచె, దాగవవి ఆ ప్రాంతాన పూరి పా
కలలో గర్భాము దాల్చి కన్య ఇలలో కన్యాత్వమున్ బాసేగా!
అలానే దత్తపదిలో కండ, రండ, దండ, ముండ – భారతార్థంలో రాయబార ఘట్టం చెప్పమన్నారు.
కండలు పొంగ సంధిపని గాదని యన్నను యుద్ధభామికే
‘రండ’ని కృష్ణ! వేగిరమె రావలె ఆహనభామి పార్థుకో
దండము ధార్తరాష్ట్రుల మదంబడపంగల దంచు దెల్పి భీ
ముండరి భీమ డంచనుము ముందు సుయోధనుడాలకింపగన్
ఈ అవధాన ప్రక్రియ పాతచింతకాయ పచ్చడి – అని ఆధునికులు ఎద్దేవా చేస్తారు. యువకులలో ధారణాశక్తిని పెంపొందించడానికి ఇది దివ్యౌషధం.
అప్రస్తుత ప్రసంగం అనే అంశం అవధాని జ్ఞాపకశక్తికి అవరోధం కలిగిస్తుంది. ధారణ మరిచిపోయేలా చేసే ప్రయత్నమది. సభ రక్తికట్టించే అంశం ఇది. ఛందస్సు గూర్చి తెలియని సామాన్యుడు కూడా ఆనందిస్తాడు.
ఆశువుగా పద్యం చెప్పడంలో అవధాని పద్యస్పూర్తి తెలుస్తుంది. నానాపురాణ పరిచయాన్ని పురాణపఠనం అనే అంశం పట్టి చూపిస్తుంది. భారత భాగవత రామాయణాది కావ్యాలు, ప్రబంధాలలో నుండి ఎక్కడో మధ్యలో నుంచి రెండు పద్యాలను పృచ్ఛకుడు చదువుతాడు. దాని సందర్భాన్ని వివిరస్తూ పూరాణ కాలక్షేప ఫక్కిలో అవధాని వివరించాలి. ప్రత్యక్షరనిషేధం అవధానికీ, పృచ్ఛకునికీ మధ్య జరిగే చదరంగంలో పావులు కదపడం వంటివి. ద్వ్యక్షర నిఘంటు సాయంతో అవధాని గట్టెక్కుతాడు.
తిరుపతి వెంకట కవులను ఒక అవధానంలో సైకిలు మీద ఆశువుగా ఒక పద్యం చెప్పమన్నారు. ప్రతి ప్రసవకష్టం వంటిది అవధానమనీ, గొడ్రాలికి ప్రసవ వేదన తెలియనట్లే అవధాని కష్టాలు ఇతరులకు తెలియదనీ నానుడులు బయలుదేరాయి.
సైకిలును గుర్రంతో పోలుస్తూ తిరుపతి కవులు పద్యం ఆశుధారలో కదను తొక్కించారు.
నీరుంగోరదు గడ్డియడ్గ దొకకొన్నే వుల్వవన్‌వేడదే
వారేనెక్కిన క్రింద త్రోయ దొకడున్ పజ్జన్ భటుండుంటచే
కూరంగా వలదు – అంటూ
ఔరా! వాజికి సాటియైన యిది విశ్వామిత్ర సృష్టంబొకో! అని చమత్కరించారు.
విశ్వామిత్రుడు సృష్టికి ప్రతిసృష్టి చేస్తూ గుర్రానికి మారుగా సైకిలును సృష్టించాడు.
గత ఐదారు దశాబ్దులుగా ఆంధ్రదేశంలో అవధానుల సంఖ్య వందకు పైగా చేరుకొంది. ఆంధ్రదైశంలోనేగాక ఇటీవల అమెరికాలోను నేమాని సోమయాజులు, శ్రీచరణ్ వంటి అవధానులు తమ ప్రదర్శనల ద్యారా పండిత ప్రశంసలందుకొంటుండటం హర్షదాయకం.
అట్లాంటాలోని సాహితీప్రియులు వల్లూరి రమేష్ అమెరికాలోను, తిరుపతిలోను త్రిగళావధానమనే ఒక వినూత్న ప్రక్రియను ముగ్గురు అవధానులచేత నిర్వహించారు. సంస్కృతంలో శ్రీచరణ్, తెలుగులో రాంభట్ల పార్వతీశ్వరశర్మ, అచ్చ తెనుగులో పాలపర్తి శ్యామలానంద ప్రసాద్‌లు త్రిగళావధానం చేశారు. తిరుపతి మహతి ఆడిటోరియంలో జరిగిన ఈ సభలో నేను అప్రస్తుతప్రసంగం నిర్వహించాను.
నేనూ గజ్జె కట్టి వందకుపైగా అవధానాలు చేసి సెభాష్ అనిపించుకొన్నాను. నా అవధాన పద్యాలను ‘అవధాన పద్మసరోవరం’ పేర ప్రచురించి వంగూరి చిట్టెంరాజు 2008లో ఫ్రిమాంట్‌లో నిర్వహించిన సభలో ఆవిష్కరింపజేశారు. వందకు దగ్గర దగ్గరగా అవధానులు ఈనాడు ఆంధ్రదేశంలో వున్నారు. వారి పేర్లు చెప్పడం మొదలెడితే సమయం చాలదు. డా॥ రాపాక ఏకాంబరాచార్యులు, ‘అవధాన సర్వస్వం’ పేర వెయ్యి పుటల బృహద్గ్రంధాన్ని ప్రచురించి ఆంధ్రదేశంలో వందల సంఖ్యలో అవధానుల జీవిత విశేషాలను, వారి పూరణలను ప్రచురించారు.
అవధాన కళామతల్లి దినదిన ప్రవర్థమానమై, ప్రౌఢ యౌవ దశను దాటి నేటికి సంసారపక్షానికి చేరుకొంది. చాలామంది అవధానులు పద్యపూరణలను గ్రంధరూపంలో తెచ్చారు. అవధానాలపైన పరిశోధన చేసి డా॥ సి.వి. సుబ్బన్న శతావధాని, డా॥ రాళ్లబండి కవితా ప్రసాద్, డా॥ కె. రామగోపాలకృష్ణమూర్తి తదితరులు పి.హెచ్.డి. లు పొందారు. గురుశిష్య పరంపరలో అవధానాలు నేర్పే ప్రక్రియ కూడా మొదలై కొందరు వర్ధిష్ణులు జైత్రయాత్ర సాగిస్తున్నారు. అతి చిన్న వయస్సులో 40 ఏళ్లనాడు జానదుర్గా మల్లికార్జునరావు ప్రారంభించి నేటికీ కొనసాగిస్తున్నారు. మహిళలలో గుంతకల్లుకు చెందిన యం.కె. ప్రభావతి ముప్పయ్యి ఏళ్లుగా అవధానాలు చేస్తూ తొలి మహిళ అవధానిగా గుర్తింపు పొందారు.
తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించినపుడు అప్పటి సాంస్కృతిక శాఖ సంచాలకులు, స్వయంగా అవధాని అయిన డా॥ రాళ్లబండి కవితాప్రసాద్ సభావేదికపై 30 మంది దాకా అవధానులను ఒక చోట చేర్చి ఆశుకవితా ప్రదర్శన చేయించి వారినందరినీ సత్కరించారు. అందులో నేను ఒకడినని వినయంగా మనవి చేస్తున్నాను.
ఇటీవల కాలంలో హిందీ, కన్నడ భాషలలోను అవధానాలు ప్రారంభించారు. తెలుగులో యతిప్రాసల నియమాలతో కూడిన ఛందోబద్ధ పద్యాలు ధారగా చెప్పడం కష్ఠం కావడంవల్ల ఇదొక సాహిత్య వినోదక్రీడగా తెలుగువారు సగర్వంగా చెప్పుకొనే స్థాయికెదిగింది.
ఆకాశవాణి విజయవాడ కేంద్రంవారు 1973 నుండి నేటి వరకు సరసవినోదిని – సమస్యాపూరణ కార్యక్రమాన్ని వారం వారం నిర్వహిస్తోంది. ప్రతివారం ఒక సమస్యను ప్రకటిస్తారు. శ్రోతలు కార్డు ద్వారా పూరణలు పంపుతారు. వాటిని ఆ వారం చదువుతారు. పద్యరచానా శక్తిని పెంపొందిచే ఈ ప్రక్రియ బాగా వ్యాప్తిలోకి వచ్చి ఇతర కేంద్రాలు కూడా మొదలెట్టాయి.
సమస్యలోని క్లిష్టతని పదాన్ని విరచడం ద్వారా సులభతరం చేయడమే ఇందులో కిటుకు.
నెల్లూరు జిల్లా గ్రంధాలయ సంస్థలో అవధానం చేసినపుడు నాకిచ్చిన సమస్య:
భరతుని జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్
పూరణ:
వరముని కోటికెల్లరకు బాధలు గూర్చెడి రాక్షసాళినిన్
దురమున ద్రుంచినాడు, మది తుష్టిని గూర్చె నహల్యభామకున్
కరుణ యొకింతలేక సతిగాసిలజేసెడి నీచుడైన రం
భరతుని జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చకన్
ఇలా అవధాన విద్య సరసజన మనోరంజకము, విజ్ఞాన వినోదదాయకము కావడంవల్ల శతాబ్దులుగా నిలిచివుంది.
*****
డా॥ రేవూరు అనంత పద్మనాభరావు గారు హైదరాబాద్ వాస్తవ్యులు, అష్టావధాని, గ్రంధకర్త. ఢిల్లిలో దూరదర్షన్ అదనపు డైరెక్టర్ జనరల్‌గా 2005లో పదవీ విరమణ చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో 2010 వరకు ఐదేళ్లు పని చేశారు. 120 గ్రంధాలు ప్రచురించారు. వీరి రచనలపై నాలుగు విశ్వవిద్యాలయాలలో ఆరుగురు పరిశోధన చేసి ఎం.ఫిల్/పి.హెచ్.డి. డిగ్రీలు పొందారు.
పద్మనాభరావుగారికి 1993లో తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారము, 2000లో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించాయి. అమెరికాలో జరిగిన ఆటా 2008 సభలలోను, వంగూరి ఫౌండేషన్ వారి 2002 సభలలోను, సప్నా 2002 సభలలోను ప్రసంగించి సత్కృతులందారు. రేడియో, దూరదర్శన్, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానళ్లకు ప్రత్యక్ష వ్యాఖ్యాతగా ప్రసిద్ధులు. తెలుగులో పరిశోధన చేసి పి.హెచ్.డి. గడించారు. కంచి కామకోటి పీఠంవారు 2008లో ఆస్థాన పండితునిగా సన్మానించారు.