top of page
bhuvanollasam.PNG
srinivyasavani.PNG

సంపుటి  6   సంచిక  1

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

వ్యాస​ మధురాలు

అప్పిచ్చి'వాడు -వైద్యుడు- 3

 

శత్రువా శరణం గచ్చామి 

girja sankar.JPG

 చింతపల్లి గిరిజా శంకర్

 రాత్రి 8 గంటలయింది.

 

అది మిచిగన్ లో ఏప్రిల్ నెల. తొందరగా చీకటి పడుతుంది. 5 గంటలకల్లా. నేను నైట్ కాల్ చేస్తున్నాను ఎలోయీస్ సైకియాట్రిక్ హాస్పిటల్లోనేను ట్రెయినింగ్ మొదలెట్టి వారం. మొట్టమొదటిసారిగా నైట్ కాల్. నేనూ, ఒక నర్స్, ఒక అటెండెంట్. నేను కొత్తగా వచ్చానని వాళ్ళిద్దరూ ఆ హాస్పిటల్ చరిత్ర చెబుతున్నారు. ఆ హాస్పిటల్  పక్కనే ఒక శ్మశానం ఉన్నది. పాతరోజుల్లో ఆ హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళని అక్కడే పాతి పెట్టేవారట. వాళ్ళల్లో కొంతమంది దయ్యాలుగా అక్కడి పేషంట్లకే కాకుండా అక్కడి స్టాఫ్ కి గూడా   కనిపిస్తారని  వాళ్ళు చెప్పారు. హాస్పటల్ వూరికి దూరంగా [శ్మశానికి దగ్గరగా] ఉన్నది. ఇలా మాటలాడుకుంటుండగా, క్లర్క్ వచ్చి ఒక పేషంట్ వచ్చాడని చెప్పాడు. నర్స్ వెళ్ళి వైటల్ సైన్స్ అవ్వీ తీసుకుని నా ఆఫీస్ కి పంపించింది.  

  
మంచి సూట్ వేసుకుని, క్లీన్ గా షేవ్ చెసుకుని చేతిలో బ్రీఫ్  కేస్ తో   బిజినెస్ మాన్ లాగా ఉన్నాడు. వయసు 30 అని అతని చార్ట్ చెబుతోంది.

 

అడిగాను, ఏంకావాలి? ఏవిధంగా సహాయం చెయ్యగలను?"


"నన్ను హాస్పిటల్లో ఎడ్మిట్ చేసుకోవాలి" అన్నాడు. అతని పేరు జాన్ మార్టిన్.


"ఏమిటి బాధ? " అని అడిగాను


"పాట్రీసియా హర్స్ట్  పేరు విన్నావా?"


"తెలుసు"


ఈ పాట్రీసియా హర్స్ట్ తండ్రి    కాలిఫోర్నియాలోని ఒక పెద్ద పారిశ్రామిక వేత్త, న్యూస్ పేపర్, పబ్లిషింగ్  ఆసామి. ప్రపంచ ధనికుల్లో  పేరున్నవాడు. అతని పేరు రాండాల్ఫ్ హర్స్ ట్. సింబయనీస్ లిబరేషన్ ఆర్మీ  అనీ  అది ఒక విప్లవాత్మక స్వచ్ఛంద దళం...వాళ్ళు రాబిన్ హుడ్ లాగా ధనికులని దోచుకొని  పేదలకి పంచి పెట్టే దళమని పేపర్లలో చదివాను.అప్పటికి రెండు నెలల   కిందట  ఆ దళం ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది.

 

ఆ తరవాత న్యూస్ పేపర్లలో. టివి ల్లో ప్రకటనలిచ్చి అమ్మాయిని తిరిగి ఇవ్వడానికి రాన్సం  అడిగింది. ఇది జరిగిన కొన్నిరోజులకే వాళ్ళు ఒక బాంక్ ని సాయుధంగా దోచుకున్నారు. ఆర్మ్ డ్ రాబరీ. ఆ దోపిడీని వాళ్ళే ఫొటోల తో సహా పత్రికలకి పంపించారు.అందర్నీ ఆశ్చర్యసముద్రంలో ముంచినదేమిటంటే ఆ బాంక్ దోపిడీ ఫొటోల్లో, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పాట్రీసియ హెర్స్ట్ బొమ్మ కూడా వుంది, చేతుల్లో తుపాకి పట్టుకొని. తరవాత ఆమె చెప్పినట్లు ఒక పత్రికా ప్రకటనగూడా వచ్చింది, "నేను స్వయంగానే, ఎవ్వరి బలవంతం లేకుండానే ఈ దళంలో చేరాను, వాళ్ళ దృక్పథం పట్ల నాకు సానుభూతి ఉన్నదీ...ఇక నాకూ నా తండ్రికీ ఏమీ సంబంధం లేదూ..." అని. ఇది నా పేషంట్ చెబుతున్న కథా కమామిషూ  పూర్వ అధ్యాయం.
 
"అది సరే. దానికీ నీ రాకకీ ఏమిటి సంబంధం? నిన్ను ఎందుకు ఎడ్మిట్ చేసుకోమంటున్నావు. ఎడ్మిట్ చేయాలంటే ఏదయినా జబ్బుండాలి గదా!" అన్నాను.
 
"అదొక పెద్ద రహస్యం. మీరు పేపర్లల్లో చదివిందీ, టివి లో చూసింది అంతా బూటకం. అదంతా నేనూ, పాట్రీసియ ఆడుతున్న నాటకం, వాళ్ళ నాన్న కళ్ళల్లో కారం కొట్టడానికి. అసలు సత్యం ఏమిటంటే [ఇక్కడ కొంచం మంద్రస్వరంతో, రహస్యం లాగా చెప్పాడు] నేనూ, పాట్రీసియ ప్రేమించుకున్నాము. పెళ్ళి గూడా చేసుకుందామని నిర్ణయించుకున్నాము, వాళ్ళ నాన్న కాలాంతకుడు. అతడికీ పెళ్ళి ఇష్టం లేదు. గూఢచారుల్ని పెట్టాడు మమ్మల్ని ఫాలో అవ్వడానికి . అందుకని మేమిద్దరము ఈ ప్లాన్ వేశాము"  ఇక్కడ కొంచం ఆగి, కొంచం అటూ ఇటూ చూశాడు.

కుర్చీ ఇంకొంచం దగ్గరగా లాక్కుని, "అందుకే  పాట్రీసియాని సింబయనీస్ లిబరషన్ ఆర్మీ ఎత్తుకుపోయినట్టు ప్రకటించి ప్రచారం చేశాం. అసలా దళమనేది లేదు. వాళ్ళంతా మా ఫ్రెండ్స్. వాళ్ళ నాన్నని తప్పుదారి పట్టించడానికి మేము వేసిన బృహత్ పథకం. తను ఇప్పుడు మా ఫ్రెండ్స్ దగ్గిర న్యూయార్క్ లో ఉన్నది. నేను రెండురోజుల్లో వెళ్ళి, అక్కణ్ణించి ఇద్దరం పారిస్ వెళ్ళి పెళ్ళి చేసుకుంటాము. అక్కడ  ఫ్రెండ్స్  దగ్గిర కొన్నాళ్ళు అజ్ఞాతం గా వుంటాము ఆ తరవాత సుఖంగా ఉంటాము"  ఇదీ అతను చెప్పిన కథ సారాంశం.
 
ఇది చదువరులకెట్లా అర్థం కాలేదో, నాకూ అంతే అర్థమయింది. అదే అతడితో చెప్పాను,
"అవునూ. దీనిలో నేను చెయ్యగలిగినదేముంది? నీకేమీ మానసిక వ్యాధి లేకపోతే ఎలా ఎడ్మిట్ చేయడం? "
 
"హోటెల్లో వుంటే మా మామ  అనుచరులు ఇట్టే కనిపెట్టేస్తారు. అందుకని మేము ఈ ప్లాన్ సిద్ధం చేశాము. మెంటల్ హాస్పిటల్లో వుంటానని వాళ్ళు కలలో గూడా అనుమానించరు. . 
 
"మా లాయర్ మీ బాస్ కి ఫోన్ చేసి ఉండాలే?   ఇది తిరుగులేని బ్రహ్మాండమయిన ప్లాన్" అని ఒక చిరునవ్వు నవ్వాడు.
 
ఈ దెబ్బకి ముందు[ నా] మతి పోయింది. పక్క ఆఫీస్ కి వెళ్ళి మా బాస్, డాక్టర్ కాంగర్ కి ఫోన్ చేశాను, అంతా పూస గుచ్చినట్లు చెప్పాను. ఆయన తిరుగుటపాలో, "వెంఠనే అతన్ని లాక్ డ్ వార్డ్ లో ఎడ్మిట్ చేసి, ఆ తరవాత తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ ఆర్డర్ చేశాడు.
 
ఆ రాత్రంతా వాడు చెప్పిన కథ మళ్ళీ మళ్ళీ నెమరువేసుకుంటూ, మర్నాడు పొద్దున్న బాస్ రాక కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూశాను ఈ కథ ముడి ఎట్లా విప్పుతాడా అని. ఆయన చెప్పిన అనాలిసిస్ సారాంశం ఏమిటంటే,  వాడు చెప్పిందంతా కట్టుకథ. అయినా వాడు దాన్ని పకడ్బందీగా, బ్రహ్మాండంగా అల్లాడు. దీన్నే గ్రాండిఓజ్ పారనాయిడ్ డెల్యూజన్ అంటారు. వాడు ఎంత బాగా కల్పించాడంటే అనుభవం లేనివాళ్ళు అది నిజమని అనుకుంటారు. [నేను మనసులోనే తల తాటించాను] అంత బాగా అల్లాడు గాబట్టి దాన్ని ఫిక్సిడ్ డెల్యూజన్ అంటారు. ఆ తరవాత స్కిజోఫ్రెనియా గురించి, బైపోలార్ డిసీస్ గురించి, ఇంకా ఎల్.ఎస్.డి. స్పీడ్  తినేవాళ్ళకి వచ్చే మనస్తత్వాల గురించి చాలా చాలా చెప్పాడు.
 
కొన్ని రోజులు ట్రీట్మెంట్ అయ్యాక, వాడు ఆ కథలన్నీ మర్చిపోయాడు. పాట్రీసియ పేరు చెబితే నవ్వేవాడు.
                                   

     *** 
 

మన పేషంట్ గురించి చెప్పాలంటే, ఈ జబ్బులకి రకరకాల కారణాలు చెబుతారు. బ్రెయిన్ లో కెమికల్ మార్పులు రావడంవల్ల, రకరకాల విపరీత ఆలోచనలు వస్తాయి. అలా కొన్నాళ్ళకి కరుడుకట్టుకుపోయి, ఎవరు చెప్పినా సరే, ససేమిరా "నేను పట్టిన కుందేటికి మూడేకాళ్ళు" అనే వేదాంతానికి వస్తారన్నమాట. మనం మామూలుగా చాలామందిలో, జాత్యహంకారం, ధనాహంకారం, మతాహంకారం చూస్తుంటాం గదా. "మా కులమే గొప్పది, మా మతమే గొప్పది వగైరా. అయితే వాళ్ళని ఎందుకని మరి ట్రీట్ చెయ్యం? ఆయా సమాజాల్లో అది నార్మల్ ధోరణి అయితే, పక్కవాణ్ణి బాధపెట్టకుండా సమాజానికి ఆటంకం రాకుండా ఎవరిమానాన వాళ్ళు ఆలోచించుకుంటే అది జబ్బుగా పరిగణించరు. శృతిమించి రాగాన బడితే జబ్బు అనబడుతుంది.  ఎవరి వూహాగానాలు వాళ్ళు చేసికోవచ్చు. ఇప్పుడు అమెరికాలో చూడండి, ఒక పార్టీవాళ్ళు వాళ్ళ నాయకులు ఏమి చేసినా సమర్థిస్తారు. అవతలి వాళ్ళు చేస్తే తప్పుబడతారు. అందుకనే "ఒక పేషంట్ ని ఇద్దరు సైకియాట్రిస్టులకి చూపిస్తే, మూడు డయాగ్నోసెస్ వస్తాయన్న జోకు. ఇక్కడ ఫస్ట్ కజిన్ ని పెళ్ళిచేసుకుంటే అదేదో ఇన్సెస్ట్ Incest చేసినంత గోల చేస్తారు.  మరి మన అర్జునుడు చేసుకుంటే వాళ్ళని మనం ఆరాధిస్తాము. ఒకానొక ఫిలాసఫర్ "దేశభక్తి అనేది ఒక రకమయిన డెల్యూజన్ " అన్నాడు. Patriotism is a delusion that my country is the greatest and others are inferior.
 
ఫ్రాయిడ్ ఒక రకమైన అనాలిసిస్ కి పితామహుడంటారు. ఆయన ఇందాక చెప్పిన కథ కి డినయల్, ప్రొజెక్షన్ అని రెండు సిద్ధాంతాలు చెప్తాడు. అంటే నాకు కాదు, ఈ కష్టం, ఇది వాడివల్ల వచ్చింది. ఉదాహరణకి, ఒక ఐదుయేళ్ళ కుర్రవాడు పరిగెడుతూ తలుపుకి కొట్టుకుంటాడు. దెబ్బ తగులుతుంది. ఏడుస్తాడు. కోపమొచ్చి వెళ్ళి ఆ తలుపుని కొడతాడు, అడ్డమొచ్చింది కాబట్టి తప్పంతా దానిదే. అట్లాంటి మనస్తత్వం ఉన్న నాయకులు గూడా అదే చేస్తారు, ఇది నా తప్పుకాదు, ఇంతకుముందు ఉన్న ప్రెసిడెంట్ ది. ఇదే Denial, Projection అంటే.
 
ఈ విషయాలగురించి వచ్చే సంచికలో విపులంగా, సోదాహరణంగా వివరిస్తాను. ప్రస్తుతానికి, ఈ అమ్మాయి మనస్తత్వం పరిశీలిద్దాం. అందం, ధనం, సంఘంలో ప్రత్యేక స్థానం ఉండి, ఎవరో ఉగ్రవాదులు ఎత్తుకుపోయిన కొద్దిరోజుల్లోనే, వాళ్ళలాగా మారిపోవడం, వాళ్ళతోబాటే సంఘవిద్రోహక చర్యల్లో పాల్గొనడం, ఆతర్వాత మళ్ళీ మారిపోవడం [ఆ తరవాత కొన్ని మాసాలకే ఆ పాట్రీసియా ఆ దళాన్ని వదిలి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయింది]  

 
ఆ పాట్రీసియా హెర్స్ ట్  కథ తీసుకుంటే, ఆమె ఎందుకలా మారింది. తన్ని కిడ్నాప్ చేసిన దళంతో ఎందుకు చేరిపోయింది. దాన్ని Identification with the aggressor అంటారు  అంటె అత్యవసర పరిస్థితుల్లో శత్రువులో పరకాయ ప్రవేశం చేయడం లేదా మమైక్యం అయిపోవడం. యుద్ధఖైదీల్లో తరచూ కనిపిస్తుంది.  వీళ్ళని కాపలాకాసే శత్రు సైనికులతో కలిసిపోయి తమ దేశ సైనికులమీద పెత్తనం చెలాయించడం  నాజీ కాంపుల్లో ఉన్న ఝెవ్స్ లో ఇటువంటివి ఉటంకించారు. మన తెలివిలో ఉండి, అంటే కాన్షస్ గా చేస్తే అబద్ధం ఆడాడు, నాటకాలాడాడు, లంచం తీసుకున్నాడు.  అన్కాన్షియస్[Unconscious]  గా చేస్తే ఇలా జబ్బంటారు.
బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించేరోజుల్లో వాళ్ళ సౌకర్యం కోసం ఇంగ్లీషు భాషని మనకి ప్రవేశపెట్టారు. అది నేర్చుకున్న "మన ఇంగ్లీషు మాట్లాడగల" దొరలు మిగిలిన స్వదేశీయులని చులకనగా చూడటం మొదలెట్టారని విన్నాం, చదువుకున్నాం.[ఇప్పటికీ భారతదేశం లో ఏ ప్రభుత్వ ఆఫీసుకు వెళ్ళినా మర్యాదగా పలకరించడం అరుదే]


***


భారత యుద్ధం లో భీష్ముడు, ద్రోణుడు, ముఖ్యంగా, వీళ్ళు కౌరవుల తరఫున యుద్ధం ఎందుకు చేశారు? బలరాముడు చెయ్యలేదుగా. వీళ్ళు మొదట్నించీ, "కౌరవులు దుర్మార్గులు, దుష్టులు, అన్యాయంగా రాజ్యం అపహరించారు, పాండవులదే రాజ్యాధికారం" అని చెప్పి మరి అధర్మం పక్షాన ఎందుకు చేశారు యుద్ధం? ఇది కూడా నా వుద్దేశం లో శత్రువులతో మమేకం అయిపోవడం కిందే వస్తుంది. ఒకవేళ చేశారే అనుకోండి, అంత ఉధృతంగా చెయ్యక్కరలేదుగదా! నేను నా 10 యేళ్ళ మనవడితో సరదాగా  కుస్తీ పట్టాననుకోండి. సంతోషంగా ఓడిపోతానుగాని, వాణ్ణి చావ చితక కొట్టను గదా.
 
పాండవులు ధర్మపరులనీ, దుర్యోధనాదులు దుష్టులనీ, శ్రీ కృష్ణుడు పరమాత్ముడనీ తెలిసి తెలిసి మరెందుకంత తీవ్రంగా యుద్ధం చేశాడు భీష్ముడు. చివరికి ఆయనే ఒప్పుకుంటాడు, "నా చేతిలో ఆయుధం ఉన్నంతవరకు నేను అజేయుణ్ణి" అదే ఆయుధాహంకారం.  అదీ ఒక రకమయిన పరకాయ ప్రవేశం. శత్రువులతో మమెకం అవడం. [Identification with the aggressor]

 
మరి మన కథానాయకుడు John Martin  సంగతేమిటి? అసలు వీడున్నట్టు, వీడెవడో మన కథానాయకికి అస్సలు తెలీదు. ఇది పూర్తిగా వీడి పైత్యం. కొంతమంది, "నా అంత అందగాడు లేడు, నా అంత తెలివిగలవాడులేడు, నాతో దేముడు రోజూ మాట్లాడతాడు" అనుకుంటూ ఉంటారు. ఇట్లాంటివాళ్ళు మీకు కొందరికయినా పరిచయముంటారు. వాళ్ళని మనం నమ్మం గదా! నవ్వుకుంటాము. అంతెందుకు ఇప్పుడు సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మే వచ్చి, "ఒరేయ్! అబ్బాయిలూ! ఇదిగోరా. పాపం పండింది. పరిత్రాణాయ... వచ్చాను" అంటే ఆ సదరు పెద్దమనిషిని పిచ్చి ఆసుపత్రికి పట్టుకెళ్తారు.

 

కలియుగం మాటెందుకండీ? ఆ ద్వాపరయుగంలోనే సగం మంది నమ్మలేదు. పౌండ్రక వాసుదేవుడనే ఒక నకిలీ డెల్యూజనల్ శాల్తీ ఉండేవాడు. కృష్ణుడితో యుద్ధం చేస్తాడు.
 
ఇలాంటి మరి కొన్ని కథలు వచ్చే సంచికలో!
 

bottom of page