top of page
bhuvanollasam.PNG
srinivyasavani.PNG

సంపుటి  6   సంచిక  1

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

అలనాటి​ మధురాలు

అమృతవర్షిణి

 

ఓలేటి శ్రీనివాసభాను

Voleti-SrinivasaBhanu_edited_edited.jpg

ఈ కథ 2017 నవ్య వారపత్రిక వారు నిర్వహించిన ‘తురగా జానకి రాణి స్మారక కథల పోటీ’లో బహుమతి పొందింది. సంపాదకుల ప్రత్యేక ఎంపికగా ఈ కథని పునర్ముద్రిస్తున్నాము.

సైలెంట్ మోడ్ లో ఉన్న మొబైల్ రెండు సార్లు మోగింది.

 

ఇంట్లో పిల్లలకు వీణ పాఠాలు చెబుతున్న అమృతవర్షిణి చూసుకోలేదు.  “ఆంటీ మొబైల్ మోగుతోంది” అని ఓ స్టూడెంట్ చెప్పగానే అమృత వర్షిణి ఫోన్ అందుకొంది.

 

“మేడం..నేను టెక్నో స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. అర్జంట్ గా రండి. మీ అబ్బాయి బిలహరి కి హై ఫీవర్. వామిటింగ్స్ చేసుకొంటున్నాడు”అన్నాడు అవతలి వ్యక్తి.  ట్యూషన్ పిల్లల్ని పంపించేసి ఆటో లో  టెక్నో స్కూల్ కు వెళ్ళింది అమృత వర్షిణి .   బిలహరి ని తీసుకొని తోవలోనే ఉన్న తమ ఫ్యామిలీ డాక్టర్ మూర్తి గారికి చూపించింది. ఆయన వెంటనే తన హాస్పిటల్లో బిలహరిని అడ్మిట్ చేసుకొన్నారు. సెలైన్ పెట్టారు.  రెండు రోజులు హాస్పిటల్  లోనే ఉంచడం మేలన్నారు.

 

సమయానికి తన భర్త వాసు  ఊళ్ళో లేడు. అదే రోజు ఉదయం ఫ్లైట్ లో బాస్ తో కలిసి  దుబాయి వెళ్ళేడు. మూడు వారాల క్యాంప్.  వాసుది తరచు క్యాంపులు వెళ్ళే ఉద్యోగం. అందువల్ల పిల్లల్ని చూసుకోవడం  అమృతవర్షిణి కి అలవాటే. కానీ ఆ రోజు పరిస్థితి వేరు.  

 

బిలహరి హాస్పిటల్  బెడ్ మీద కలవరిస్తున్నాడు.  నిద్రలో ఉలికి  పడుతున్నాడు.  భయంతో ముడుచుకుపోతూ ఏడుస్తున్నాడు. ఎప్పుడూ లేనిది, అమృత వర్షిణి కి ఆ క్షణంలో భయం వేసింది. “పసివాడు. దేనికో భయపడ్డాడు. ధైర్యంగా ఉండండి.  మెడిసిన్స్ తో సర్దుకుంటుంది..”  డాక్టర్ మూర్తి ధైర్యం చెప్పారు.

బెడ్ కి దగ్గరగా కుర్చీ జరుపుకొని కూర్చొంది అమృతవర్షిణి. ఆమె ఒళ్లో బిలహరి స్కూల్ బ్యాగ్ ఉంది. సగం దాకా తెరుచుకొన్న జిప్ లోంచి బయటకు తొంగిచూస్తూ టెక్నో స్కూల్  ‘వీక్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్’.   కార్డ్ ను పైకి తీసింది అమృత వర్షిణి. మార్కులూ, రిమార్కులూ చూసింది. పేరెంట్/గార్డియన్  సిగ్నేచర్  కాలమ్ వైపు చూసి,  గట్టిగా నిట్టూర్చింది.

        

***

పన్నెండేళ్ళ క్రితం...

అమృతవర్షిణి కి రెండో కాన్పు లో అబ్బాయి పుట్టినప్పుడు “హరి అని  పిలుద్దాం..మా నాన్న  పేరు”అన్నాడు వాసు.   అమృతవర్షిణి మరో రెండు అక్షరాలు చేర్చింది.  ‘బిలహరి’ అంది. నవ్వాడు వాసు.  పేరు కొత్తగా అనిపించింది.  అదేదో  రాగం పేరై ఉంటుందనీ,  తన అర్ధాంగి అలాంటి మెలికేదో పెడుతుందనీ అనుకొంటూనే ఉన్నాడతను. తొలి కాన్పులోనూ ఇదే తంతు.  అమ్మాయి పుట్టింది.   “గౌరి అని పిలుద్దాం...మా అమ్మ పేరు” అన్నాడు వాసు. .  అమృతవర్షిణి  అదనంగా మరో నాలుగు అక్షరాలు చేర్చింది.   ‘గౌరీ మనోహరి’ అని  రాగం పేరు పెట్టుకొంది!

అమృతవర్షిణి  వీణ లో  ఎం.ఎ చేసింది! పార్ట్ టైం వీణ పాఠాలు చెబుతోంది.  ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీలో చిరుద్యోగం చేసే  వాసు జీతానికీ, జీవితానికీ అండగా నిలబడు తోంది. అతనికి సంగీతం మీద, అందులోనూ శాస్త్రీయ సంగీతం పట్ల  పెద్దగా అవగాహనా,  అభిరుచీ లాంటివి లేవు .  కాకపోతే  భార్య సంపాదన వల్ల అద్దె డబ్బులు కలిసొస్తున్నాయన్న గ్రహింపు ఆ మానవుడి లో  ఉంది.

“మా అమ్మాయి పేరులోనే  రాగం ఉంది. ఆమె వీణ వాయిస్తే  అచ్చంగా  అమృతం వర్షిస్తుంది” అంటూ పెళ్లి చూపులప్పుడు  కాబోయే మామగారు పొగడటం వాసు కి గుర్తుంది. అప్పట్లో  ఆయన ఓ సంగీత కళాశాల లో మృదంగం పాఠాలు చెప్పేవారు!  “మా పుట్టింట్లో  తలుపు చెక్క మీద తాళం వేసినా శ్రుతిలోనే ఉంటుంది” అని   పెళ్ళైన కొత్తల్లో   అమృత వర్షిణి సరదాగా అనేది.   వాసు అర్థం కానట్లు మొహం పెడితే- “జోక్ మహానుభావా..కొంచెం  నవ్వండి” అంటూ ‘శ్రుతి’, తాళం’ లాంటివి  వివరించబోయేది. వాసుకి  ఆసక్తి ఉంటే కదా? ఆవలించేవాడు.

రెండో కాన్పులో  అబ్బాయి  ‘హరి’   కాస్త  ‘బిలహరి’ గా మారగానే -   “మ్యూజిక్ టీచర్లు పిల్లల పేర్లకోసం వెతుక్కోవాల్సిన  పని లేదు.. ..” అని గట్టిగా  నవ్వాడు వాసు . “ఉష్..శ్రుతి తగ్గించండి. బాబు తుళ్లిపడుతున్నాడు” అంది అమృత వర్షిణి చంటివాణ్ణి  దగ్గరగా తీసుకొంటూ.

పన్నెండేళ్ళు తిరిగాయి. పరిస్థితులు మారాయి.

వాసు కి కొద్దో గొప్పో జీతం పెరిగింది.   పిల్లలు ఎదుగుతున్నారు. కార్పోరేట్ స్కూళ్ళ లో చదువులు.   ఖర్చులూ పెరిగాయి.   అమృతవర్షిణి  మంచితనం, వీణ పాఠాలు బాగా చేబుతుందన్న పేరు కలిసొచ్చాయి.  ట్యూషన్లు పెరిగాయి.   అంతా బాగానే ఉన్నా అమృతవర్షిణి లో ఏదో వెలితి.   గౌరీమనోహరికి వీణ నేర్పాలనుకుంది. !  “దాన్ని చదువు కోనీ, నీ సంగీతం పాఠాలతో అమ్మాయి చదువులు పాడు చెయ్యకు” అని వాసు అడ్డుపడేవాడు. దానికి తగ్గట్టుగా  సంగీతం విషయం లో  అమ్మాయి నాన్నను పోలింది.   సరిగమలు అబ్బలేదు గానీ గౌరీమనోహరి చదువుల సరస్వతి.  ర్యాంకుల పంట! అందుకే కూతురి విషయం లో అమృతవర్షిణి  తన ఆశలు చంపుకొంది. ప్రయత్నం మానుకొంది.  వాసు అనుకొన్నట్లే గౌరీమనోహరి ఖరగ్ పూర్  ఐఐటి  లో చేరింది. 

ఇక చిన్నవాడు  బిలహరి. అమ్మ మనసులోని వెలితిని తీరుస్తూ,  అన్న ప్రాసన నాడే  వీణ మీద ఎగబడ్డాడు! పన్నెండేళ్ళ వయసులోనే  భళీ అనిపించుకొంటున్నాడు. సంగీత   పోటీల్లో   బహుమతులన్నీ వాడివే! వాడు చదువుకుంటున్న విద్యోదయా స్కూల్ ప్రిన్సిపాల్ కి బిలహరి అంటే విపరీతమైన అభిమానం. తన ఆశలు నెరవేరుతున్నందుకు అమృతవర్షిణి  ఆనందించింది. 

వాసు  మాత్రం  ఊగిసలాడుతున్నాడు.  బిలహరి  అందుకొంటున్న ప్రశంసల్ని  అతను ఎంజాయ్ చేస్తున్నా ఎందుకో  చదువులో మన వాడు   ‘జస్ట్ అబవ్ ఆవరేజ్’ అనిపించి, దిగులు పుట్టుకొచ్చింది.   టెన్షన్ గా మారింది. దాంతో-    కొడుకు  తాలూకు  స్కూల్ రిపోర్ట్ కార్డ్  చూసి మొదట్లో   అతను   మొహం చిట్లించేవాడు. తర్వాత  చిరాకుపడుతూ సంతకం పెట్టేవాడు. టర్మ్స్ గడుస్తున్నా  ఆబ్బాయి మార్కుల్లో   ఆశించిన ప్రోగ్రెస్స్ కనిపించకపోవడంతో   వాసు  లో అసహనం మితిమీరింది.  అది  బిలహరి లోని సంగీత ప్రతిభను  మెచ్చుకోలేని స్థాయికి  చేరుకొంది.  ఇవేవీ ఆలోచించకుండా  కొడుకు పాటకు తల్లి తాళం వేయడం అతనికి  పెద్ద నేరంగా తోచింది.

 

ఆ మధ్య  వాసు పదిహేను రోజుల పాటు  క్యాంప్ వెళ్ళాడు.   పదహారోనాడు చీకటి పడే వేళకు    అలసట తో దిగబడ్డాడు.  ఇంట్లో అడుగు పెట్టగానే డ్రాయింగ్ రూమ్ లో    వీణ వాయిస్తున్న కొడుకు కనిపించాడు.  తాళం వేస్తున్న భార్య కనిపించింది.   ఫ్యాన్ రెగ్యులేటర్ స్పీడు పెంచగానే టేబుల్ మీద ప్రాగ్రెస్ రిపోర్ట్   గాలికి ఎగిరి వాసు పాదాల మీద పడింది.  దాన్ని అందుకొన్నాదతను.  కళ్ళతో స్కాన్ చేశాడు.   “ ఎందుకూ పనికి రాని ‘ఎ’ గ్రేడ్ . ఈ పెర్సంటేజ్ అడుక్కోడానికి కూడా సరిపోదు” అంటూ విరుచుకుపడ్డాడు. అప్పుడు   అమృతవర్షిణి అక్కడ లేదు. వంటింట్లోకి వెళ్ళింది.   నీళ్ళ గ్లాసు తో వచ్చి, “ఆకలి మీదున్నట్టున్నారు. త్వరగా స్నానం చేసి రండి. ఏకంగా భోజనం చేద్దురు గాని” అంటూ భర్తకు అందించింది.

 

అప్పటికే బిలహరి బిక్కచచ్చిపోయాడు.  బల్లిలాగా  వీణకు కరుచుకుపోయాడు.   అమృతవర్షిణి  అది గమనిచినట్టు లేదు. “శాంతము లేక సౌఖ్యము  లేదు కీర్తన ..ఇంకా బాగా రావాలి రా .  డెప్త్ లోకి వెళ్ళాలి. మళ్ళీ వాయించు” అని బిలహరికి చెప్పి, కుక్కర్ దించడానికి  వంటింట్లోకి వెళ్ళిపోయింది.  ఆకలి, అలసట, ఆక్రోశం ముప్పేటలా కమ్ముకొన్న   వాసులో అసహనం రెచ్చిపోయింది.   కొడుకు ప్రోగ్రెస్ కార్డ్ హ్యాంగ్ ఓవర్ లోనే ఉన్నాడతను. అరికాలి లోని మంట అరచేతిలోకొచ్చింది.    నీళ్ళ  గ్లాసు  భళ్లుమని పగిలింది.

“వీణ పాఠాలు  కూడు పెట్టవు రా.. అక్కయ్యని చూసి నేర్చుకో”  అంటూ ఒంటి కాలి మీద లేచాడు.     తండ్రి అలా విరుచుపడగానే బిలహరి భయంతో ముడుచుకుపోయాడు. గట్టిగా  ఏడుస్తూ వంటిట్లోకి పారిపోయాడు.  అమృతవర్షిణి కొడుకుని వెనకేసుకు వచ్చింది.   వాసుదేవరావు ని గట్టిగా నిలదీసింది.  పదిహేను రోజుల పాటు  క్యాంప్ లో పడ్డ అవస్థలు చాలవన్నట్లు  ఇంట్లో ఏడుపుల్నీ ,  ఎదురు జవాబుల్నీ  భరించలేకపోయాడతను.   విసురుగా బెడ్ రూమ్ లోకి వెళ్ళి,  దభేల్ మని తలుపు వేసుకున్నాడు.

బాగా చదువుకోవాలి. మంచి ఉద్యోగం లో చేరాలి. రెండు చేతులా సంపాదించాలి. డబ్బు  లేకపోతే బతుకు లేదు.  భవిష్యత్తు లేదు.  ఇదీ  వాసు లో బలంగా నాటుకొన్న అభిప్రాయం. మరోలా ఆలోచించాలంటేనే  భయం.  చదువుకుంటున్న రోజుల్లో అతను   టాప్ ర్యాంకర్. బ్రిలియంట్ స్టూడెంట్. కానీ ఆర్థికపరిస్థితి సహకరించలేదు. తమ ఊళ్ళో మిల్లు గుమస్తాగా పనిచేసిన తండ్రి హఠాత్తుగా కన్నుమూశాడు. తెలిసిన వాళ్ళు సాయం చేస్తే, నగరం చేరుకొన్నాడు. ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీలో చిన్న ఉద్యోగం లో కుదురుకొన్నాడు.  ప్రైవేటుగా డిగ్రీ  చేశాడు.  క్వాలిఫికేషన్ పెంచుకొన్నాడు.   భార్య సహకారంతో, సంపాదనతో ఒడ్డున పడ్డాడు. వర్తమానం హాయిగానే ఉన్నా  అతను  గతాన్ని వాటేసుకోవడం మానలేదు.   అడిగిన వాళ్ళకూ, అడగని వాళ్ళకూ తన కథను  ఏకరువు పెట్టందే అతని గుండె బరువు తీరదు.  తన పిల్లలు   కష్టపడాలి తప్ప కష్టాలు పడకూడదంటాడు.  బాగా చదువుకోవాలని,    పట్టు సడలించకుండా  పైకి రావాలని పదే పదే చెబుతాడు.  “ఈ విషయంలో  మీతో పూర్తిగా ఏకీభవించ లేను” అంటుంది అమృతవర్షిణి.

“ నిజమే.  చిన్నప్పుడు మీరు నానా ఇబ్బందులూ పడ్డారు.  పెద్దయ్యాక  సుఖంగానే ఉన్నారు  కదా? దీన్ని  ఆనందించకుండా  జరిగిపోయిన వాటిని తలుచుకొంటూ జడుసుకోవడం దేనికి?  మీరన్నీ అతిగా ఊహించుకొంటారండీ...  అనవసరంగా భయపడతారు. ఇలా  చూడండి.  అందరికీ ఒకేరకమైన టాలెంట్ ఉండదు. ఉండాలని రూలూ లేదు. అమ్మాయికి సంగీతం నేర్పాలని నేను ఆరాటపడ లేదూ? ఏమయింది? జంట స్వరాల దగ్గరే ఆగిపోయింది. దాని  దారి  వేరని తెలిసిన తర్వాత సంగీతం నేర్చుకోమంటూ  నేను దాని వెంట పడలేదు కదా?  తనకి నచ్చిన తోవ లో ముందుకెళ్ళింది. ప్రోత్సహించాం.  చదువులో నంబర్ వన్ అనిపించుకుంది.  మీతో పాటు తల్లిగా నేనూ ఆనందించాను.  అమ్మాయి  విషయం లో నేనెలా ఉన్నానో అబ్బాయి  విషయం మీరు అలాగే ఉండండి. ఆఫ్ట్రాల్  వాడి వయసెంత, చదువెంత? ఇప్పుడింకా సెవెంత్ క్లాస్.   మీరు ఆశిస్తున్న  స్థాయిలో లో కాకపోయినా ‘ఎ’ గ్రేడ్ లోనే  కొనసాగుతున్నాడు కదా! భయం దేనికండీ?  మన  పిల్లాడని  కాదు గానీ, ఓ మ్యూజిక్ టీచర్ గా చెప్తున్నాను.   బిలహరి  బ్రిలియంట్ స్టూడెంట్.   ఈ ఫీల్డ్ లో వాడికి మంచి భవిష్యత్తు ఉంది. నాదీ పూచీ.  సరేనా?  క్యాంప్ నుంచి అలసిపోయి వచ్చారు.   ఇలా అలిగి ఆకలి తో పడుకోడం మంచిది కాదు. పదండి  భోజనం చేద్దాం” అంటూ అమృత వర్షిణి  వాసు కి నచ్చజెప్పింది.  హాల్లో నిద్రపోతున్న బిలహరిని లేపి కంచం ముందు కూర్చోబెట్టింది.

ఆ రాత్రికి పరిస్థితి సద్దుమణిగిందనుకొన్నా రెండ్రోజుల తర్వాత, “ఇదిగో వినండి. మీ ఇద్దరికీ చెబుతున్నాను “ అంటూ  భార్యనీ, కొడుకునీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ లాంటిది ఇచ్చాడు వాసు. మనం పోటీ ప్రపంచం లో బతుకుతున్నామన్నాడు.  పరుగుల వేటలో ముందుండాలన్నాడు. వేట ఫలించాలంటే మన ఆయుధం పదునుదేలాలన్నాడు. వీటన్నిటినీ చదువుతో ముడిపెట్టాడు . గౌరీమనోహరి లాగా  బిలహరిని  కూడా ఐ ఐ టీ కి పంపించడం తన ‘మిషన్ అండ్ యాంబిషన్’ అని తేల్చి చెప్పాడు.  “బిలహరిని విద్యోదయా నుంచి టెక్నో స్కూల్ కి షిఫ్ట్ చేస్తున్నాను. ఏడోతరగతి  పరీక్షలు పూర్తికాగానే టీసీ తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ ఫైనల్. నో ఆర్గ్యుమెంట్స్” అని చెప్పి వాసు ఆఫీసుకు వెళ్ళిపోయాడు. మొహాలు చూసుకోవడం

తల్లీ, కొడుకుల వంతయింది.

బిలహరి ఏడో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఫలితాలు వచ్చాయి.  కొడుకు టీసీ కోసం విద్యోదయా స్కూల్ కి వెళ్ళాడు వాసు. ప్రిన్సిపాల్ రాఘవ బాధపడ్డారు.  ఎల్ కేజీ నుంచి తమ స్కూల్లోనే చదువుతున్న బిలహరి స్పెషల్ స్టూడెంట్ అన్నారు.  అతని  సంగీత ప్రతిభకు తార్కాణం గా తన రూమ్ లో ని షో కేస్ లో తమ స్కూల్ సాధించిన  ట్రోఫీల్ని వాసు కు చూపించారు. వచ్చే నెలలో స్టేట్ లెవెల్ మ్యూజిక్  కాంపిటేషన్ లో   విద్యోదయా స్కూల్ తరఫున  బిలహరి పేరుతో ఎంట్రీ పంపించామనీ , దయచేసి పెద్ద మనసు చేసుకోమనీ, నిర్ణయం  మార్చుకోమని ప్రిన్సిపాల్ రాఘవ కోరారు.  “చూడండి వాసుదేవరావు గారూ.. సానపడితే  మీవాడికి ఐ ఐ టి సీట్ వస్తుందో  లేదో చెప్పలేను గానీ దేశం గర్వించ దగ్గ సంగీత కళాకారుడవుతాడని  మాత్రం గ్యారంటీగా రాసివ్వగలను” ఆన్నారు ప్రిన్సిపల్ రాఘవ.  వాసు వినిపించుకోలేదు.  “ఐ యాం సారీ..”అంటూ అడ్డంగా తలూపాడు. అక్కడ కూడా  ‘పోటీ ప్రపంచం..పరుగుల వేట’లాంటి ఉపన్యాసం ఇచ్చి ,  బలవంతంగా టీసీ తీసుకొని వెళ్ళిపోయాడు.

ఆ మర్నాడే బిలహరి  స్కూల్ మారింది.

 

బడి కొత్త. టీచర్లు కొత్త. వాతావరణం కొత్త. ఉదయం ఏడు అయేసరికి స్కూల్ బస్సు హారన్  తీతువు లాగా కీచుమనేది.  ఏ సాయంత్రమో  పీక్కుపోయిన మొహాల్ని ఇళ్ళ  దగ్గర దింపి వెళ్ళిపోయేది . వస్తూనే బండెడు హోమ్ వర్క్.  సగం పూర్తికాక ముందే బిలహరికి  రెప్పలు అంటుకుపోయేవి.   పుస్తకాల సంచీ మీదే తలపెట్టుకొని  వాలిపోయేవాడు.   వాడి  పుట్టిన రోజుకి అమ్మ కానుకగా ఇచ్చిన బొబ్బిలి వీణ-  మీటే నాథుడు లేక  బిలహరితో పాటు  ముసుగు కింద నిద్రపోయేది. దీనికి తోడు  వారానికోసారి  ప్రోగ్రెస్ రిపోర్టులు. పేరెంట్స్/గార్డి యన్స్ కి సూచనలు.   రోజు కో యుద్ధం.  వచ్చిందే వస్తూ,  రోజూ పీడ కల.  కల నిండా గుర్రాలు. గాలి తో పోటీ పడుతూ కొండంచున పరుగులు. బిలహరిని ఎవరో   బలవంతంగా ఓ గుర్రం మీద కూర్చోబెట్టారట . చిన్నవాడు   సర్డుకోలేకపోతున్నాడట .   గుర్రం గట్టిగా సకిలించి. వాణ్ణి   పడదోసిందట. కొండ రాళ్ళ మీద దొర్లిపోతున్నాడట. ఆవులిస్తున్న  లోయలోకి జారిపోతున్నాడట. “అమ్మో” అని అరుస్తూ  నిద్రలో కేకలేశాడు బిలహరి . మంచం మీద నుంచి  రెండు సార్లు జారిపడ్డాడు. తగిలిన చోటే దెబ్బ తగిలింది.  తల మీద బొప్పికట్టింది. పగటికీ, రాత్రికీ తేడా తెలీటం  లేదు. కళ్ళు తెరచినా, మూసినా ఒకటే దృశ్యం!  క్లాస్ రూమ్ లో బెంచ్, బెడ్ రూమ్ లో మంచం.  రెండు చోట్లా పీడ కలలే ..ఎటు చూసినా రాకాసి లోయలే!

***

 

నిన్ననే  ఫస్ట్ వీక్   ‘ ప్రోగ్రెస్ రిపోర్ట్’   ఇచ్చారు.  చూస్తూనే బిలహరికి గుండె జారిపోయింది. రిమార్క్స్ కాలమ్ నిండా ఎర్రటి అక్షరాలు. స్టాండర్డ్ సరిపోదట. గ్రాస్పింగ్ పెరగాలట. రెండు వారాలు టైం ఇస్తారట. ప్రోగ్రెస్ కనిపించక పోతే రాత్రి వేళ స్కూల్లోనే ఉంచేసి,  మూడు గంటలు ఎక్స్ ట్రా కోచింగ్ ఇస్తారట. పేరెంట్స్ సంతకం తీసుకు రమ్మని క్లాస్ టీచర్ చెప్పారు.  రిపోర్ట్ ను ఇంటికి తీసుకొచ్చాడు బిలహరి.  ఆ రాత్రి వాసుకి చూపించకుండా బ్యాగులోనే దాచిపెట్టాడు. తెల్లవారగట్ల ఆయన  దుబాయ్ క్యాంప్ కి వెళ్ళిపోగానే  అమ్మ చేత సంతకం పెట్టించాలని బిలహరి ప్లాన్.  మర్నాటి  ఉదయం  ఆఫీస్ కారొచ్చింది. వాసు  హడావిడి గా  వెళ్ళిపోయాడు. అమ్మకి రిపోర్ట్ కార్డ్ ఎలా చూపించాలో, ఏం చెప్పాలో ఒకటికి రెండు సార్లు మనసులోనే  సాధన చేసుకున్నాడు బిలహరి.  ఎంత చేసినా ఏదో బెరకు. మనసును పీకేస్తూ బెంగ.  ధైర్యం చెయ్యలేకపోయాడు.  సరిగ్గా అదే సమయం లో మంచి నీళ్ళ  కొళాయి చప్పుడు చేసింది. అమృతవర్షిణి ఆ పనిలో పడింది. ఆ  వెంటనే  పెద్దగా హారన్  వినిపించింది . బెడ్ రూమ్ కిటికీ లోంచి చూశాడు బిలహరి.   స్కూలు బస్సు  మలుపు తిరిగింది.  గేటు దాటి,  తమ అపార్ట్ మెంట్స్  కాంపౌండ్ లోకి వస్తోంది.

"టిఫిన్ బాక్స్ పెట్టుకున్నావా ?” కొళాయి దగ్గర నీళ్ళు పడుతూ అమృత వర్షిణి  కేకపెట్టింది. బిలహరి ఆలస్యం చేయలేదు. ఓ చేత్తో  టిఫిన్ బాక్స్ తీసుకొన్నాడు.  మరో చేత్తో  రిపోర్ట్ కార్డ్  అందుకున్నాడు. రెండింటినీ బ్యాగ్ లో  దాచుకొన్నాడు. దాచుకొనే ముందు- రిపోర్ట్ కార్డ్ లో పేరెంట్స్/గార్డియన్ సిగ్నేచర్ కాలం ఖాళీ గా కనిపించింది. అమ్మతో  వివరించడానికి టైం లేదు. అందుకే తెగించాడు.  పెన్ను తీశాడు. ‘కె. అమృత వర్షిణి’..  అమ్మ సంతకం తనే పెట్టేసి, లిఫ్ట్ దిగి, స్కూలు  బస్సులో కూర్చొన్నాడు.

ఉదయం ఏడుగంటలకు టెక్నో స్కూలు కు వెళ్ళాడో లేదో పదకొండు గంటలకల్లా ఫోన్!   అబ్బాయికి హై ఫీవర్. వామిటింగ్స్..అర్జంట్ గా రమ్మంటూ మెసేజ్.  అమృతవర్షిణి గాబరపడుతూ వెళ్ళింది.  ఆటో లో  బిలహరిని ఎక్కించిన తర్వాత  స్కూల్  ప్రిన్సిపాల్ ఆవిడ  చేతిలో రిపోర్ట్ కార్డ్ ఉంచాడు.  సిగ్నేచర్ కాలమ్ వైపు చూపిస్తూ కనుబొమలు ముడిచాడు. పెదవులు విరిచాడు.  “ హోప్ దిస్ ఈజ్ నాట్ యువర్ సిగ్నేచర్ మేడం” అంటూ  భుజాలు ఎగరేశాడు.

***

 

డాక్టర్ మూర్తి హాస్పిటల్. అమృతవర్షిణి చేతిలోని ప్రోగ్రెస్ కార్డ్ రెప రెపలాడింది.  బెడ్ మీద కొడుకును చూసి తల్లి మనసు తరుక్కుపోయింది.  దుఃఖం తన్నుకొచ్చింది. అలా చేయడం  అమృత వర్షిణి కి   అశుభం లాగా అనిపించింది. “ఛ..ఛ..”అనుకొని, కొంగుతో మొహం తుడుచుకొంది. అప్పటికప్పుడు గట్టిగా ఓ  నిర్ణయానికి వచ్చింది.   రిపోర్ట్ కార్డ్ ని రెండు చేతుల మధ్యా ఉంచింది.  నిలువునా  రెండు భాగాలు... అడ్డంగా తిప్పి నాలుగు ముక్కలు..  మరుక్షణమే  అవన్నీ   డస్ట్ బిన్ లో.

           

హృదయాన్ని మెలి పెడుతున్న బాధ ‘ఉఫ్’ మంటూ ఎగిరిపోయింది. అమృతవర్షిణి  మనసు దూదిపింజలాగా తేలిపోయింది.

                         

***

 

మూడు వారాలు చూస్తుండగా గడిచిపోయాయి.  దుబాయి క్యాంప్ నుంచి ఓ  రోజు సాయంత్రం తిరిగొచ్చాడు వాసు. ఇంటికి తాళం వేసి ఉంది. స్పేర్ కీ తో తలుపు తెరిచి లోపలకు వెళ్ళాడు. టీ పాయ్ మీద ఉత్తరం.  అతను ఊళ్ళో లేనప్పుడు జరిగిన సంగతులు గుదిగుచ్చి అమృత వర్షిణి రాసింది.  చివర్లో...  “మీకు వీలుంటే కళాభవన్ కి రండి”  అని పెద్ద అక్షరాలతో రాసి, అండర్ లైన్ చేసింది.

వాసు ఆలస్యం చేయ లేదు. గబగబా తయారయ్యాడు.  ఆటోలో కళాభవన్ కు చేరుకొన్నాడు. లోపలకు వెళ్ళగానే పెద్ద పెట్టున చప్పట్లు. అప్పుడే బిలహరి  వేదిక మీదికి వెళ్ళాడు. రాష్ట్ర స్థాయి సంగీతం  పోటీల్లో  విద్యోదయా స్కూల్ పక్షాన ప్రథమ బహుమతిని అందుకొంటున్నాడు.  బహుమతిని అందజేసిన ప్రముఖుడు బిలహరిని దగ్గరగా  తీసుకొని,        “ పిల్లల్ని పొగడ కూడదంటారు.. బట్,  నోరు కట్టుకోలేక పోతున్నాను.  దిస్ కిడ్ ఈజ్ మ్యూజికల్ వండర్.  ఎక్స్ ట్రార్డినరీ”  అంటూ   బిలహరిని నుదుటి పై  ఆప్యాయంగా ముద్దుపెట్టుకొన్నాడు. ఆ తర్వాత ప్రేక్షకుల వైపు చూస్తూ,  అబ్బాయి  పేరెంట్స్ ని వేదిక మీదికి రమ్మంటూ ఆహ్వానించాడు. ప్రేక్షకుల్లో నడిమధ్య లో ఉన్న విద్యోదయా ప్రిన్సిపాల్ రాఘవ  “వెళ్ళండమ్మా..” అంటూ తన పక్క సీటులో ఉన్న అమృత వర్షిణి ని ప్రోత్సహించాడు. ఆమె మెల్లగా లేచి నాలుగడుగులు ముందుకు వేసింది. అంతలో వాసు గబగబా వచ్చాడు. భార్యతో పాటు కలిసి వేదిక మీదికి చేరుకొన్నాడు.  వేదిక మీది ప్రముఖుడు ఆ దంపతుల్ని సాదరంగా ఆహ్వానించి,  “ప్లీజ్ సే సంథింగ్..” అంటూ  వాసు  చేతికి మైక్ ఇచ్చాడు.

జీవితం లో మొదటిసారిగా మైకు అందుకొన్న వాసు తడబడ లేదు.  అనుభవజ్ఞుడిలాగా “అందరికీ నమస్కారం “అన్నాడు.  అని, “ ముత్తు స్వామి దీక్షితార్ లాంటి మహనీయులు ‘ఆనందామృత వర్షిణీ’ అంటూ   అమృతవర్షిణి రాగం తో   వర్షం కురిపించారట! అది    జీవం పోసిందనీ,  జీవితాల్ని కాపాడిందనీ  చరిత్ర.   ఈ బహుమతి  విషయానికొస్తే , ఇది మా చిరంజీవి  గెలుచుకొన్నా అసలు విజేత మాత్రం  నా శ్రీమతే.  అన్నట్టు ఆమె  పేరు అమృత వర్షిణి. ..” 

హల్లో చప్పట్ల వర్షం కురిసింది.

ఆ లోగా ఊపిరి తీసుకొన్నాడు వాసు, తీసుకొని,  “ త్యాగరాజస్వామి వారి వృత్తాంతం  తెలిసిందే! ఎవరో తరలించుకుపోయిన  తన సీతారాముల విగ్రహాలు  కావేరి నదిలో తిరిగి కనిపించగానే  ఆయన  ఆనందం పట్ట లేకపోయారట.  బిలహరి రాగం లో  ‘కనుగొంటినీ’  కీర్తన రాశారట.  పోగొట్టుకొన్న సర్వస్వాన్ని  తిరిగి పొందినప్పుడు  ఆ ఆనందాన్ని వర్ణించడానికి  బిలహరి రాగం అనువైందని పెద్దల మాట.  మా చిరంజీవికి ‘బిలహరి’ అని పేరు పెట్టింది కూడా నా  శ్రీమతే” అంటూ ముగించాడు వాసుదేవరావు.

                     

***

 "ఉదయం దుబాయ్ నుంచి ముంబాయి రాగానే   టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ కి ఫోన్ చేశాను. స్కూల్ మార్చేశావని  తెలిసి బాధ పడ్డాను. మా బాస్ రంగనాథన్  గారికి నా  గోడు వెళ్ళ బోసుకోన్నాను.  ఆయన  నాకు చీవాట్లు పెట్టారు. మెల్లగా   ఓదార్చి, తమ అబ్బాయి గురించి చెప్పారు. అతను  అమెరికాలో ఎం.ఎస్ చేసి,  పి హెచ్ డి చేస్తూ,   ఫిల్మ్ డైరక్షన్ లో  ఏదో  స్పెషల్ కోర్స్ కూడా  చేశాడట.  సినిమా మీద విపరీతమైన పాజన్ తో   చెన్నై కి వచ్చి ఫిల్మ్ ఫీల్డ్ లో సెటిల్ అయ్యాడట.  అది  ‘రేర్ కేస్’  సార్ అన్నాను.  రంగనాథన్ గారు ఒప్పుకో లేదు.  మీ అబ్బాయిది  ‘రేరేస్ట్ ఆఫ్ ద రేర్’  ఎందుకు కాకూడదు? అంటూ వాదించారు. నిలదీస్తూనే నచ్చజెప్పారు.  నాలో  ధైర్యం పోశారు. ‘అమృత వర్షిణి’, ‘బిలహరి’ రాగాల  గురించి  చెప్పిందీ ఆయనే! ”  ఇంటికి వస్తున్న  తోవ లో చెప్పాడు వాసు.

ఇంటికి చేరుకోగానే అమృత వర్షిణి తాళం తెరిచింది.

 

లైటు వెలిగించింది.

           *****

bottom of page