top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
adhyatmika.jpg
pustaka-parichayaalu.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
alanati.jpg
paatasanchikalu.jpg

సంపుటి 7  సంచిక  4

అక్టోబరు-డిసెంబరు 2022 సంచిక

maagurinchi.jpg
rachanalu.jpg

వ్యాస​ మధురాలు

 అమృత కథలు

bhavaraju.jpg

భావరాజు శ్రీనివాసు

అమృత  కథలని ఎందుకన్నానంటే ఇందులోని రెండు కథలు దేశాకాలాలకు అతీతమైనవి. రెండు కథల్లోనూ పరిపూర్ణ  జీవితాన్ని ఆశించే  'జీవుడు'  కథానాయకుడు. అజ్ఞానమే అతని పాలిటి విలన్. మహర్షుల బోధ, అంతరాత్మ ప్రబోధం అందుకుని ఆత్మ విశ్వాసంతో కథలోని  జీవుడు అజ్ఞానాన్ని జయించి తాను ఆశించిన  జీవితాన్ని సాధిస్తాడు. ఇది జీవుడి జీవితకథ. మానవుని ఆత్మకథ. పురుషార్ధాలయిన ధర్మార్ధకామమోక్షాలు నాలుగింటినీ సాధించి పరిపూర్ణజీవితాన్ని పొందాలనుకునే వారికి ఈ కథలు ఒక దారి చూపించగలవని ఆశిస్తున్నాను.

ఇందులోని కథలు - నేనెవరు?,  మోక్షం

 

నేనెవరు?

సహజంగా జీవించడానికి, సమాజంతో కలిసి నడవడానికి అడ్డుపడే ఆటంకాలను గుర్తించి, వాటినుండి బయటపడే మార్గాన్నికనుగొనడమే ఈ రచన ఉద్దేశ్యం. ఇందులో ప్రస్తావించిన ఈశ్వరుడు, బ్రహ్మం మతానికి చెందినవారు కారు. మానవత్వానికి చెందినవారు. గణితసమీకరణం అర్ధం కాకపోయినా సమస్యా, దాని పరిష్కారం అర్ధం అవుతాయి.

                                                           

                             

ఈశ్వరుడు:

చూసేవాడు జీవుడు, ద్రష్ట. జీవుడి చేత చూడబడేది జగత్తు, దృశ్యం. ఈపై ఫొటోలోని  అద్వైత సమీకరణం ప్రకారం జీవుడూ జగత్తు(ద్రష్ట, దృశ్యం) రెండూ ఈశ్వరుడే. రెండూ ఆయనవే. రెండింటి అంతరాత్మ ఈశ్వరుడే. కాబట్టి జీవజగత్తులు రెండూ నిమిత్తమాత్రంగా ఉంటూ అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి నడుచుకోవాల్సి ఉంది. జంతువులు తమకు తెలియకుండానే అంతరాత్మ ప్రభోదాన్ని అనుసరిస్తాయి. అందుకే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. శివుడాజ్ఞను పాటించడానికే కుట్టిన చీమకు కుట్టిన పాపం అంటదు. జంతువులు నిమిత్తమాత్రంగా జీవిస్తాయి. కానీ అర్జునుడు, నేను నిమిత్తమాత్రుణ్ణని అనుకోలేదు. యుద్ధంలో శత్రువులను చంపుతున్నది ‘నేను’ అనుకుని ఆ కార్యానికి కర్తృత్వం వహించాడు. దాంతో తన వాళ్ళను చంపిన పాపం తనను చుట్టుకుంటుందన్న భయం, బాధ అతణ్ణి యుద్ధానికి విముఖుణ్ణి చేసాయి. అంతరాత్మ ప్రభోధం  (శ్రీకృష్ణుడే అంతరాత్మ, ఆయన ప్రబోధమే భగవద్గీత) విన్న తరువాత తాను నిమిత్తమాత్రుణ్ణని గుర్తించి, కర్తృత్వాన్ని(అహంకార మమకారాలను) విడిచిపెట్టి యుద్ధం చేస్తాడు.

ఎవరి మాటైనా వినాలంటే వారి మీద విశ్వాసం ఉండాలి. అంతరాత్మ ప్రబోధం వినాలంటే దాని మీద విశ్వాసం ఉండాలి. ఇదే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం లేని జీవుడు అంతరాత్మ గొంతు నొక్కేస్తాడు. ఆత్మవంచనకు పాల్పడతాడు. అంతరాత్మను విడిచిపెట్టి బాహ్యంగా ఉన్న జగత్తును -అర్ధకామాలను, పేరు ప్రఖ్యాతుల్ని , ఇతరుల సానుభూతిని- ఆశ్రయిస్తాడు. వాటిని అదే పనిగా అన్వేషిస్తూ  వాటికోసం హత్యలు చేస్తాడు. లేదా ఆత్మహత్యకు పాల్పడతాడు.

అంతరాత్మను విడిచిపెట్టి బాహ్యజగత్తును ఆశ్రయించిన జీవుడు భంగపడి, జగత్తు కూడా నిమిత్తమాత్రమేనని గుర్తించి, తిరిగి అంతర్ముఖుడై అర్జునుడు కృష్ణుణ్ణి ఆశ్రయించినట్టు అంతరాత్మను ఆశ్రయిస్తాడు. ఆత్మవిశ్వాసాన్నిపెంచుకుంటాడు.

‘కర్త నేను కాదు ఈశ్వరుడు’ అని గుర్తిస్తే అహం పోతుంది. ‘జగత్తు నాది కాదు ఈశ్వరుడిది’ అని గుర్తిస్తే దాని మీద మమకారం, అధికారం ఉండవు. సహజంగా జీవించడం అప్పుడే మొదలవుతుంది. అప్పుడిక ఏ పని చేసినా అంతరాత్మ ప్రబోధం(ఆత్మజ్ఞానం) తో, ఆత్మవిశ్వాసంతో చేస్తాం. అహంకార, మమకారాలతో కాదు.

'నేను నిమిత్తమాత్రుణ్ణి' అని గుర్తిస్తే బాధ్యతలుంటాయి. బరువులుండవు.

'జగత్తు నిమిత్తమాత్రమే' అని గుర్తిస్తే దానితో ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది. దాని మీద ఆధారపడడం ఉండదు.

గీతాకారుడంటాడు:

“శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్”

స్వధర్మం అంటే అంతరాత్మ ప్రభోదించే ధర్మం. పరధర్మం అంటే లౌకిక ధర్మం. రెండిటిలో స్వధర్మమే శ్రేయస్కరం అంటాడు. వెల్లువలో పూచికపుల్లకూ , ప్రవాహంలో చేపకు తేడా ఉంది. పూచికపుల్ల చేపగా మారడమే స్వధర్మాన్ని గుర్తెరగడం. 'To follow one's impulse is slavery, but to obey self-prescribed law is liberty' అంటాడు రూసో. ఆ 'self-prescribed law' యే అంతరాత్మ ప్రబోధించే ధర్మం, స్వధర్మం. జీవుడితో పాటూ జగత్తు కూడా అంతరాత్మదే కాబట్టి, అంతరాత్మ ప్రబోధించే ధర్మంలో వ్యక్తి శ్రేయస్సు తోపాటు, లోక శ్రేయస్సూ ఉంటుంది. జీవుడికీ, జగత్తుకీ రెండింటికీ ఆత్మతో (ఈశ్వరుడితో) ఉన్నసంబంధం కారణంగా, రెండింటి మధ్య ఉన్న సంబంధం ఆత్మీయమైనది.

“కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన”

జీవజగత్తులు నిమిత్తమాత్రములు. కర్మమీద తప్ప ఫలితం మీద వాటికి అధికారం లేదు.

“ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి”

ఈశ్వరుడు సర్వభూతముల హృదయమందుండి వాటిని నడిపించుచున్నాడు.

బ్రహ్మం:

క్రింది సమీకరణం అంతటా ఉన్నది ఒకే ఒకటి(1). అది బ్రహ్మం. బ్రహ్మమే, తాడు పాముగా కనిపించినట్టు, జీవుడిగా, జగత్తుగా, ఈశ్వరుడిగా కనపడుతోంది. అందుకే బ్రహ్మ సత్యం, జగత్తు మిధ్య అన్నారు. ఉపనిషత్తులు కూడా జీవుణ్ణి ‘అయమాత్మా బ్రహ్మ’అని జగత్తుని ‘సర్వం ఖిల్విదం బ్రహ్మ’అని ఈశ్వరుణ్ణి ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ అని మూడింటినీ బ్రహ్మం గానే పేర్కొన్నాయి.

నేనే జీవుణ్ణి, నా శరీరమే జగత్తు, నా అంతరాత్మే ఈశ్వరుడు. కాబట్టి నేను గుర్తించినా గుర్తించకపోయినా(జంతువులు గుర్తించవు) నేను కూడా బ్రహ్మమే (అహం బ్రహ్మాస్మి). నేను, నా శరీరం, నా అంతరాత్మ -ఇలా మూడింటినీ, మూడుగా వేరు వేరుగా చూస్తే, మూడింటిదీ తలోదారీ అవుతుంది. వాటి మధ్య ఘర్షణ వస్తుంది. మనిషొక చోట ఉంటే మనసొక చోట ఉంటుంది. మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతుంది. మూడింటికీ ఉన్న సంబంధాన్ని, బ్రహ్మాన్ని గుర్తిస్తే, వాటి మధ్య ఐక్యమత్యం వస్తుంది. మనోవాక్కాయకర్మల్లో ఏకత్వం వస్తుంది. ఐకమత్యమే బలం.

 

శ్రీ సిరివెన్నల సీతారామశాస్త్రి గారి 'జగమంత కుటుంబం' పాటలో  “జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది" అని పాడుకుంటున్నది బ్రహ్మమే. బ్రహ్మమే జగమంత కుటుంబంలో రెండుగా (జీవుడు x జగత్తు), అంటే (భార్య x భర్త), (కవి xకవిత)- ఇలా ఒకరికొకరు వరసైన జంటలుగా మారి, తనతో తనే రమిస్తున్నది. ఏకాకిజీవితంలో ఈశ్వరుడై ఏకాంతంగా, జీవజగత్తులకు అంతరాత్మగా, సాక్షిగాఉంటున్నది. జీవజగదీశ్వరులుగా  జన్మించి, జీవించి, మరణిస్తున్నది  బ్రహ్మమే.

 

నేనెవరు? జీవుణ్ణా, బ్రహ్మాన్నా?రాజ్యం కంటే, యుద్ధం కంటే ఈ ప్రశ్నే ముఖ్యమై అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు. శ్రీకృష్ణుడు బ్రహ్మమై గీతను బోధించాడు. నేనెవరు? ఈ ప్రశ్నతో నిద్ర పట్టని శ్రీరాముడు అర్ధరాత్రి లేచి వెళ్ళి వసిష్టుడి తలుపు తట్టాడు. లోపల్నుంచి "ఎవరు నువ్వు?" అని వసిష్టుడు ప్రశ్నించగానే, అది తెలియకే వచ్చానన్నాడు రాముడు.

 

ఇల్లు అలుకుతూ పేరు మర్చిపోయిన ఈగ కథ అందరికీ తెలుసు. పేరు మర్చిపోవడంతో మొదలైన కథ ఒక అన్వేషణగా సాగి, తిరిగి పేరు గుర్తు చేసుకోవడంతో ముగుస్తుంది. నేనెవరు? అన్న ప్రశ్నతో మొదలయ్యే జీవుడి అన్వేషణ కూడా 'అహం బ్రహ్మస్మి' అని గుర్తుకు తెచ్చుకోవడంతో ముగుస్తుంది.

                               

మోక్షం

‘ధర్మార్ధకామమోక్షాలు’ ‘కామిగాని వాడు మోక్షగామి కాడు’, ‘సూక్ష్మంలో మోక్షం’ - ఈ మాటల్లో ఉన్న మోక్షాన్ని పొందడమే ఈ రచన ఉద్దేశ్యం. విషయాన్ని వివరించడానికి, ఈ రచనలో వాడిన పదాలు- జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, బ్రహ్మం,  మరియు వాక్యాలు-సర్వం ఖిల్విదం బ్రహ్మ, . . మొదలైనవి ఉపనిషత్తులనుండి స్వీకరించడం జరిగింది. ఈశ్వరుడు, బ్రహ్మం జ్ఞానానికి ప్రతీకలు. మతానికి కాదు.

                   

ఫోటో లోని మొదటి సమీకరణం లో జీవుడు(mind), జగత్తు(matter) తో relation లో ఉన్నాడు. ‘X’ (into symbol) ఈ  సంబంధాన్ని సూచిస్తున్నది. ఈ సంబంధమే, రిలేషనే relativity, సంసారం. ఈశ్వరుడు ఈ relativity ని, సంసారాన్ని దాటి ఏకాంతంగా, స్వేచ్ఛగా ఉన్నాడు. ఇది సన్యాసం(absolute). ’గజేంద్రమోక్షం’ కథలో గజేంద్రుడు, తనను మొసలి  బారి నుండి కాపాడమని దైవాన్ని ప్రార్ధించినట్టు, జీవుడు, జగత్తుతో ఏర్పడిన బంధం నుండి, సంసారం నుండి బయటపడాలని, జగత్తునుండి దృష్టి మరల్చి, relativityకి(సృష్టికి) అవతల ఎక్కడో ఉన్నాడని ఊహించే, ఈశ్వరుడి(దైవం)పై దృష్టి సారిస్తాడు. కానీ relativity ని దాటి ఈశ్వరుడి స్థాయిని అందుకోలేక ఆ ఈశ్వరుణ్ణి అక్కడనుంచి తీసుకొచ్చి, జగత్తులో ఒక గుడి కట్టి, ఆయన్ను అందులో  ప్రతిష్టించి భక్తి భావంతో ఆయనతో కూడా సంబంధం పెట్టుకుని, తనకు ప్రతికూలంగా మారిన జగత్తును, తనకు అనుకూలంగా మార్చమని ఆయన్ను ప్రార్ధిస్తూ ఉండడం వల్ల , జీవుడు సంసారం నుండి బయట పడక పోగా, ఈశ్వరుణ్ణి కూడా జగత్తులోకి, సంసారంలోకి లాగి, ఆయనకు అన్నీ సమకూర్చలేక సతమతమౌతూ సంసారాన్ని మరింత పెంచుకుంటున్నాడు. లోకంతో సంబంధం పెట్టుకోవడం కోసం లౌకిక వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకున్నట్టే ఈశ్వరుడితో సంబంధం పెట్టుకోవడం కోసం మత వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకున్నాడు.

Relativity లో ఉండడం వల్ల జీవ, జగత్తులో ఒకటి ఉంటే రెండోది ఉంటుంది. జీవుడు లేకపోతే (మరణిస్తే) జగత్తు లేదు. ఈ రెండూ లేకపోతే సంసారం లేదు. కానీ జగత్తు  తో పాటూ తను కూడా లేకుండా పోతుండడం వల్ల స్వేచ్ఛను అనుభవించే అవకాశం జీవుడికి లేదు. అందువల్ల జీవించి ఉండగానే relativity నుండి సంసారం నుండి విముక్తి పొందాలి. జీవించి ఉండగానే పొందే ముక్తే  జీవన్ముక్తి.

పోనీ, జీవించి ఉండగానే జగత్తుపై  మమకారాన్ని వదిలిపెట్టేసినా  శరీరం (అహంకారం) ఉన్నంతకాలం జగత్తుతో సంబంధం తప్పదు జగత్తు నుంచి తప్పించుకున్నా దాన్ని గూర్చిన ఆలోచనల్నుంచి జీవుడు తప్పించుకోలేడు. అహంకారమే విత్తనమై జగత్తుతో సంబంధం పెట్టుకుని సంసార వృక్షాన్ని విస్తరింపచేస్తుంది.

శాస్త్రజ్ఞుడు జీవుడి స్థానంలో ఉండి తను చూసే జగత్తులో ఒక పదార్ధానికీ, మరో పదార్ధానికీ, శరీరంలో ఒక అవయవానికీ మరొక అవయవానికీ, మనస్సులో ఒక ఆలోచనకు, మరొక ఆలోచనకు ఉన్న సంబంధాన్ని తెలుసుకుంటున్నాడు. ఐనస్టీన్ మాత్రం జీవుడి స్థానంలో కాకుండా ఈశ్వరుడి స్థానంలో ఉండి అక్కడనుండి జీవ జగత్తుల మధ్య ఉండే సంబంధాన్ని గుర్తించి సాపేక్ష సిద్ధాంతాన్ని (theory of relativity) ప్రతిపాదించిన తరువాత సృష్టిని గూర్చిన దృష్టి మొత్తం మారిపోయింది.

 

స్వేచ్ఛను పొందాలంటే జీవుడు relativity ని దాటి ఈశ్వరుడై పోవాలి. ఈశ్వరుడంటే జ్ఞానం. ఎటువంటి జ్ఞానం?. నేను స్వతఃసిద్ధంగా ఈశ్వరుణ్నేనని, ఆ స్థితిని(జ్ఞానాన్ని) కోల్పోయి జీవుణ్ణవడం వల్ల  జగత్తుతో సంబంధం (సంసారం) ఏర్పడిందని గుర్తించే జ్ఞానం. ఈ జ్ఞానం శివుడికి ఉందనడానికి ఆయనకు జ్ఞాననేత్రం ఉండడమే నిదర్శనం. ఈ జ్ఞానంతోనే, తనను జీవుణ్ణి చేసి relativity లో సంసారంలో, మాయలో పడెయ్యబోయిన మన్మధుణ్ణి గుర్తించి ధగ్ధం చేసి తన ఈశ్వర స్థాయిని కోల్పోకుండా నిలుపుకున్నాడు. ‘నేను’ ఈశ్వర స్థానం నుంచి జీవుడి స్థానానికి పతనమవ్వడం వల్ల ఈశ్వర స్థానం ఖాళీ అయి  ఆస్థానంలో మరొక ఈశ్వరుణ్ణి (ఇష్ట దైవాన్ని)ప్రతిష్టించ వలసి వచ్చింది.

జీవుడు తన నిజ స్వరూపాన్ని గుర్తించి ఈశ్వరుడై ఆస్థానంలో ఉండి జీవ జగత్తుల మధ్య జరిగే వ్యవహారాలను ‘సాక్షి’ గా చూస్తూ ఉండిపోదామనుకున్నా జగత్తు ఉండనివ్వదు. అతణ్ణి  వ్యవహారంలోకి, వివాదంలోకి లాగి జీవుణ్ణి చేసి మళ్ళీ  సంసారంలో పడేస్తుంది. ఈ  ప్రమాదం(సంసారం)నుంచి ఈశ్వరుడు తప్పించుకోవాలంటే జగత్తు ఉండకూడదు. ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. అందుకోసం ఈశ్వరుడు(జ్ఞానం) తను సాక్షిగా ఉండి చూస్తున్న relativityని, జీవజగత్తులను(అహంకార, మమకారాలను) రెండో సమీకరణంలో చూపించినట్టు తనలో కలిపేసుకుని ‘బ్రహ్మం’ అయిపోవాలి. అపుడు నదులన్నీ సముద్రంలో లయమై తమ ఉనికిని కోల్పోయి సముద్రంగా మారినట్టు, జీవజగదీశ్వరులు ముగ్గురూ జ్ఞానసాగరం(బ్రహ్మం) లో లయమై తమ ఉనికి కోల్పోయి  బ్రహ్మంగా మారిపోతారు. ఇప్పుడు జగత్తు బ్రహ్మమే(సర్వం ఖిల్విదం బ్రహ్మ). అలాగే జీవుడు(అయమాత్మా బ్రహ్మ), జ్ఞాన స్వరూపుడైన ఈశ్వరుడు(ప్రజ్ఞానం బ్రహ్మ). ఇపుడు బ్రహ్మం తప్ప రెండోది లేదు . ’ఏకమేవా అద్వితీయం బ్రహ్మ’. నదులన్నీ సముద్రంలో కలిసి సముద్రంగా మారిన  తర్వాత వాటిమధ్య  బేధం ఎలా లేదో, కనపడదో, జీవజగదీశ్వరులు మూడూ బ్రహ్మమైనపుడు వాటిమధ్య భేదం లేదు. కనపడదు. మూడింటినీ(అన్నింటినీ) సమానంగా, సజాతీయంగా  బ్రహ్మంగా చూడడం  -ఇది spiritual communism.

జీవజగత్తులు (relativity) కార్యమై, ఈ కార్యం యొక్క సృష్టి, స్థితి, లయాలకు ఈశ్వరుడు కారణమైతే ఈ కార్యకారణ సంబంధాన్ని (relativityని, హేతువాదాన్ని, తర్కాన్ని) దాటి  ఉన్నది ‘సత్యం’(Reality). అది బ్రహ్మం. జ్ఞానం ఆ సత్యాన్ని, బ్రహ్మాన్ని దర్శించడం కోసం కార్యకారణ సంబంధాన్ని (relativityని, హేతువాదాన్ని, తర్కాన్ని) దాటి పోయినపుడు ఆ ‘జ్ఞానం’ కూడా బ్రహ్మమే అవుతున్నది. సత్యం, జ్ఞానం అయిన బ్రహ్మం  కార్యకారణాలను (జీవజగదీశ్వరులను) వ్యాపించి, వాటిని తనలో లయంచేసుకుని  ‘అనంతం’అయింది. ‘సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ’

నదులన్నీ అనంతమైన సముద్రంలో కలిసి నదులుగా అంతమై సముద్రంగా అనంతత్వాన్నిపొందినట్టు, జీవజగదీశ్వరులు బ్రహ్మంలో లయమై జీవజగదీశ్వరులుగా అంతమై (మృతమై) బ్రహ్మంగా  అనంతతత్వాన్ని, (అమృతత్వాన్ని)  పొందుతున్నారు ఇలా జీవుడుగా ఒక జన్మ, బ్రహ్మంగా మారి  మరో జన్మ - ఇలా రెండు జన్మలు కలిగిన వాడు ద్విజుడు.

 

భగవత్తత్వానికి, జ్ఞానానికి, బ్రహ్మానికి(1కి)లింగం(+, -)లేదు. లింగం  లేకపోతే,  జీవ, జగత్తులు, relativity (సంసారం) లేదు. సంసారం లేకపోతే దాన్నించి బయటపడేసే సన్యాసమూ (ఈశ్వరుడు)లేదు. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు -ఈ త్రయం (తాప’త్రయం’) నుండి బయటపడడమే మోక్షం. పైకి పరస్పర విరుద్ధంగా కనిపించే relatives రెండూ (+, -), మొదట్నుంచీ ఒకటి (1) గానే ఉన్నాయని గుర్తిస్తేనే గానీ రెండింటి నుంచి బయట పడలేం. గుర్తించేది ఎపుడూ  నిరాకారమైన(+, - లేని) జ్ఞానమే కాబట్టి జ్ఞానం తప్ప మోక్షానికి మరో మార్గం లేదు. భగవత్తత్వానికి  లింగం(ఆకారం) లేకపోవడం(వ్యక్తం కాకపోవడం) నాస్తికత్వానికి, రెండులింగాలూ (+, -)ఏకమై ఒకటి(1)గా ఉండడం  ఆస్తికత్వానికీ దారితీసింది. 

ఇప్పుడు ఉన్నది ఒకటే. అది బ్రహ్మం. అది నేనే(అహం బ్రహ్మాస్మి). బ్రహ్మం వేరు, నేను వేరు అనుకుంటే రెండింటి మధ్య  మళ్ళీ  సంబంధం , relativity , సంసారం వచ్చి  పడతాయి రెండు ఉంటే రెండో దాని వల్ల  భయం, దాని మీద కోరిక. జీవుడిగా ఉన్నంత కాలం ఇటు జగత్తు(ఇహం), అటు ఈశ్వరుడి(పరం) వల్ల భయం, వాటి మీద కోరిక. కోరిక, భయం లేకపోవడమే స్వేచ్ఛ, మోక్షం. జీవుడు, జగత్తును , ఈశ్వరుణ్ణి , బ్రహ్మాన్నీ తనకు వేరుగా చూస్తూ వాటి వారి గురించి వింటూ  తెలుసుకుంటున్నంత సేపూ అది అవగాహనే కానీ  అనుభవం కాదు.

సన్యాసాన్ని ఇష్టపడి relatives ని వదిలి  ఉన్న శివుడు, relativesని(బంధుత్వాలను) ఇష్టపడి సంసారంలో ఉన్న  పార్వతి ని , తనలో లయం చేసుకుని అర్ధనారీశ్వరుడైనట్టు, relativity దాటి ఏకాంతంగా, సన్యాసంలో  ఉన్న ఈశ్వరుడు, జీవజగత్తులను, సంసారాన్ని, relativity ని తనలో లయం చేసుకుని  బ్రహ్మం అయ్యాడు. బ్రహ్మం అయిన  ఈశ్వరుడు కేవలం సన్యాసీ కాదు. కేవలం సంసారీ కాదు. రెండింటినీ తనలో లయం చేసుకున్న ‘జ్ఞాని’, బ్రహ్మ జ్ఞాని. జ్ణాని సన్యాసాన్ని, సంసారాన్ని వేరుచేసి చూడడు. ఈ జ్ఞానంతోనే శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు తన ‘జగమంత కుటుంబం’ పాటలో “సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావేలే” (రెండూ నావే)అని బ్రాహ్మీస్థితి లో ఉండి పాడుకున్నారు. 

 

శ్రీకృష్ణుడు జ్ఞాని. అందుకే అయన సంసారాన్నీ- సన్యాసాన్నీ; ధర్మాన్నీ- రాజకీయాల్నీ వేరు చేసి చూడలేదు. సంసారంలో ఉంటూనే, సన్యాసిలా తామరాకు మీద నీటి బొట్టులా ఉన్నాడు. రాజకీయాల్లో ఉంటూనే ధర్మాన్ని (పాండవుల్ని) విడిచి పెట్టలేదు. సంసారాన్నీ - సన్యాసాన్నీ;ధర్మాన్నీ-రాజకీయాల్నీ వేరు చేసి చూసేవారికి ఆ రెండిట్లో ఏ ఒక్కటీ ఎప్పటికీ పూర్తిగా  అవగాహనకు రాదు.

ఉపనిషత్ మహర్షులు  relativity ని, సంసారాన్నిదాటి ఈశ్వరులై, తాము దాటి(transcend అయి) వచ్చిన సంసార సాగరాన్ని తమలో లయం చేసుకుని బ్రహ్మామై ‘అహం బ్రహ్మాస్మి’ అని అనుకున్నవారే. Relitivity ని దాటిపోవడం స్వేచ్ఛ  అయితే, దాటి వచ్చిన relitivity ని తిరిగి కలుపుకోవడం బాధ్యత. బాధ్యతతో కూడిన స్వేచ్చే మోక్షం (utmost freedom). దాటిపోతే అనుభూతి, కలుపుకుపోతే అనుభవం కలుగుతాయి.

ధర్మార్థకామమోక్షాలలో ధర్మం ఈశ్వరుడు(moral life). అర్ధం జగత్తు (public life), కామం జీవుడు(private life) మోక్షమే బ్రహ్మం(spiritual life). జీవ, జగత్తులను  కలుపుకుపోలేని ఈశ్వరుడు బ్రహ్మం కాలేడు. అలాగే అర్ధకామాలను కలుపుకుపోలేని ధర్మం మోక్షానికి(పరిపూర్ణతకు)దారితీయదు. బ్రహ్మంలో జీవజగదీశ్వరులు ముగ్గురూ ఉన్నట్టు, మోక్షంలో ధర్మార్ధకామాలు మూడూ ఉన్నాయి కానీ ఆ మూడింటిలో ఏ ఒక్క దానిలోనూ  మోక్షం లేదు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వీరి జీవితాల్లో ధర్మార్ధకామాలు మూడూ ఉన్నాయి కానీ వాటిల్లో వారు లేరు. ‘పురుషులందు పుణ్యపురుషులు వేరయా’ అన్నట్టు వారు మోక్ష స్థితిలో ఉండి  ధర్మార్ధకామాలను మూడింటినీ కలుపుకుపోయారు.

 

భగవద్గీత ఆఖరి అధ్యాయం ‘మోక్షసన్యాసయోగం’లో ఆఖరి శ్లోకం ’సర్వధర్మాన్ పరిత్యజ్య’ మోక్షం కోసం ధర్మాన్నీ విడిచిపెట్టమంది. కారణం ఈశ్వరుడు రెండో సమీకరణంలో చూపించినట్టు జీవజగత్తులు రెండింటితోనూ సంబంధం పెట్టుకుని వాటిని control చేస్తూ  relativity (సంసారం)లో ఉన్నట్టు, ధర్మం కూడా అర్ధకామాలతో సంబంధం పెట్టుకుని వాటిని control చేస్తూ  relativity (సంసారం)లోనే ఉన్నది. అర్ధకామాలను కలుపుకుపోవడం ద్వారా ధర్మం relativity ని దాటిపోతేనే  మోక్షం. ’ఇంటికన్నా గుడి పదిలం’ ‘నికృష్టమైన శరీరం - ఉత్కృష్టమైన ఆత్మ’ అంటూ అర్ధకామాలను, ధర్మాన్నీ; జీవజగత్తులను, ఈశ్వరుణ్ణి (ఇహం-పరం అని) వేరు చేసి చూస్తే మోక్షం(పరిపూర్ణత) లేదు. అందుకే ‘కామిగాని వాడు మోక్షగామి కాడు’.     

 

(జీవుడు x జగత్తు), (జననం x మరణం), (మంచి x చెడు), (సుఖం x దుఃఖం), (శరీరం xమనస్సు), (దేశంxకాలం), (ఇహంxపరం), (ఆస్తికతxనాస్తికత) మొదలైన ద్వంద్వాలన్నీ relatives. వాటిది విడదీయలేని బంధం. విడిచిపెడితే రెండింటినీ విడిచిపెట్టాలి. కలుపుకుంటే రెండింటినీ కలుపుకోవాలి. కానీ  విడిచిపెట్టలేం. ఎందుకంటే already   జీవుడిగా జన్మించి ఉన్నాం. జీవుడిగా ఉన్నందుకు జగత్తును కలుపుకు పోవాలి. జన్మించినందుకు, మరణాన్ని కలుపుకుపోవాలి. కలుపుకుపోవడం( positive thinking) తప్ప మనకు మరో మార్గం లేదు. మనలో ఉండి వెలుగు చీకటిని కలుపుకు పోయినట్టు  కలుపుకుపోయేది జ్ఞానమే. తన జ్ఞానంతో జనన, మరణాలను కలుపుకుపోయి బ్రహ్మం అయిపోవడం వల్ల బ్రహ్మానికి లాగే  శివుడికి జననం లేదు. స్వయంభువు. మరణం లేదు. మృత్యుంజయుడు. బ్రహ్మానికి మల్లే లింగం లేదు. అర్ధనారీశ్వరుడు. కలుపుకోవడం వేరు, కలిసిపోవడం వేరు. కలుపుకుంటే అనుభవానికి వస్తుంది. కలిసిపోతే అస్థిత్వమే పోతుంది. శివుడు ఈశ్వరుడై , జీవజగత్తులను (relativityని) తనలో కలుపుకుని బ్రహ్మానుభవాన్ని, అమృతత్వాన్ని పొందాడు. మన్మధుని ప్రభావానికి లోనై జీవుడై relativity లో, సంసారంలో  కలిసిపోతే ఈశ్వరుడిగా తన అస్థిత్వాన్ని కోల్పేయేవాడు. ఈశ్వర స్థాయిని వదిలి పెట్టి జీవుడై, జగత్తుతో సంబంధం పెట్టుకోవడం మొదలు చెడ్డ బేరం అవుతుంది. 

గణితపరంగా, లేదా తాత్వికంగా చూసినా మూడుగా ఉన్న  జీవజగదీశ్వరులు, ధర్మార్ధకామాలు ఒక సమస్య (given problem, data). ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించి వాటిని  ఏకం చెయ్యడమే, సూక్ష్మీకరించడమే (simplify చెయ్యడమే)సమస్యకు పరిష్కారం. పరిష్కారమే మోక్షం. సూక్ష్మీకరించడంలోనే (ఏకం చెయ్యడంలోనే) మోక్షం ఉంది కనుక ‘సూక్ష్మంలో మోక్షం’. జీవజగదీశ్వరుల నుండి ‘సత్యం, జ్ఞానం, అనంతం’  అయిన బ్రహ్మం దగ్గరికి, అమృతత్వం వైపు  ప్రయాణం చెయ్యడమే, ’అసతోమా సద్గమయా’, ‘తమసోమా జ్యోతిర్గమయ’. ‘మృత్యోర్మా అమృతంగ మయ’.

*****


Feedback
editor@madhuravani.com
 
©  2022 madhuravani.com

మధురవాణి కొత్త సంచిక విడుదల వివరాలు ఉచితంగా సకాలంలో అందుకోవాలంటే మీ పేరు, ఇ-మెయిల్ చిరునామా editor@madhuravani.com  కి పంపించండి.

మీ వివరాలు ఎవరితోనూ పంచుకొనబడవు.​

Website Designed
 &  Maintained
 by
Srinivas Pendyala

bottom of page