top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
pustaka-parichayaalu.jpg
alanati.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
paatasanchikalu.jpg
maagurinchi.jpg

సంపుటి 8  సంచిక  1

జనవరి-మార్చి 2023 సంచిక

rachanalu.jpg

కథా​ మధురాలు

'అ-మర' లోకం

 

- నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్)

nirmaladitya_edited.jpg

"నాతో వస్తే చావు ఖాయం. రానంటే నువ్వు ఓ అమరుడిలా ఎప్పటికి చావు లేకుండా బ్రతికి పోవచ్చు. మనకు అంతగా టైం లేదు. నీ నిర్ణయం వెంటనే చెప్పు.” అంది ఓ అపరిచిత.

 

"ఇలాంటి మెదడు ఉపయోగించనవసరం లేని 'నో బ్రైనెర్' ప్రశ్న వేసి జవాబు అడుగుతున్నావు. ఎవరు నువ్వు? నేనెక్కడ ఉన్నాను? ఇవ్వాళ ఏమి రోజు?" అడిగాను నేను.

 

ఓ పది అడుగుల క్రింద సముద్రం నీలంగా కనిపిస్తున్నది. పైన నీలాకాశంలో, తెల్లటి పిల్ల మేఘాలు తిరుగుతున్నాయి. అపరిచిత, నేను ఓ నీటి బుడగ లాంటి వాహనం లో శరవేగంగా ప్రయాణిస్తున్నాము. నేను దేనినో ఆనుకుని కూర్చున్నట్టు ఉంది, కాని సోఫాలాంటిదేమీ కనపడటం లేదు. ఎటు వైపు వాలినా మెత్తగా, హాయిగా శరీరానికి ఏదో తగిలి అడ్డుకుంటున్నది. పూర్తిగా వాలిపోయి చూసాను, ఏదో అదృశ్య పడక మీద పడుకున్నట్టనిపించింది.  లగ్జరీ రిక్రియేషన్ వెహికిల్ లో కూర్చుని గాలిలో వేగంగా ముందుకు వెళ్ళుతున్నట్లుంది. కానీ ఆర్.వి. కనపడటం లేదు. ఉన్నది ఓ బుడగలోనే.

 

"అవును నో బ్రైనెర్ ప్రశ్నే. నీకు ముందు, నీలాంటి వారే, అందరూ జవాబు చెప్పారు. నీలా ఎదురు ప్రశ్నలు వేయలేదు.” అంది అపరిచిత.

 

"ఇంకా బ్రతకాలనే కోరికతో, నన్ను వేయి యేళ్ళకు ఫ్రీజ్ చేయమని ఓ క్రయో లాబ్ కు 2050లో డబ్బు కట్టాను. నాకున్న జబ్బుకు చావు తథ్యమన్నారు. ఓ వేయి యేళ్ళకు నా రోగానికి విరుగుడు కనుక్కోక పోతారాన్న ఆశ. మరి నాలాంటి వారిని నువ్వు మళ్లీ లేపితే, అమరత్వమే కావాలనుకుంటారు.” అన్నాను నేను.

 

"మరి నీది కూడా అదే నిర్ణయమా?  అలా అయితే, నిన్ను వదిలేసి మరో క్రయో లాబ్, అందులో ఫ్రీజ్ చేసిన మనుష్యులను వెదకడానికి పోతాను.” అన్నది.

 

"నీవేదో టూంబ్ రైడర్ లాగా పురాతన సమాధులు, అక్కడున్న శరీరాల వేటలో పడినట్లు ఉన్నావు. అయినా నీవు నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడే లేచాను. నా నిర్ణయం ముందు, నా పరిస్థితి అర్ధం చేసుకోనీ.” అన్నాను నేను

 

"నువ్వన్నది కరెక్టే. నేను, నాలాంటి వారు మరి కొందరు ఇలా క్రయో లాబ్ లు వెదికి, మీలాంటి వారిని తిరిగి బ్రతికించి ఈ లోకంలోకి తీసుకొస్తాము. ఇక నా గురించి నీకు ఎంత తక్కువ తెలిస్తే అంత మంచిది. నన్ను ఓ అపరిచితలాగానే ఉండనీయి. నువ్వు నివసించిన నగరమే కాదు, మీ ఫ్లోరిడా ప్రాంతం మొత్తం సముద్రం క్రింద ఉంది. నిన్ను, నేను సముద్రంలోకి దూకి వెదికి పట్టుకున్నాను. ఇక నీ కాలమానం ప్రకారం మనం 2550లో ఉన్నాము.” అంది అపరిచిత.

 

"ఫ్లోరిడా మొత్తం సముద్ర పాలు కావడం ఆశ్చర్యంగా ఉంది. బాధగా కూడా ఉంది.నేను వేయి యేళ్ళ తరువాత కదా లేపమన్నది? ఓ 500 ఏళ్ళు ముందే లేపేసావు. నా రోగం నయం చేసినట్లే ఉన్నావు. నీతో వస్తే చావు తప్పదు అంటున్నావు. బ్రతకాలని యేళ్ళకొద్ది ఫ్రీజ్ అయిన నాలాంటి వారు నీతో రావాలని ఎందుకనుకుంటారు?" అన్నాను నేను.

 

"నువ్వు గమనించే ఉంటావు. ఇప్పుడు భూమి మీద మనవంటి మనుష్యులు ఎక్కువ మంది లేరు. ఒకప్పటి నగరాలను కూడా చెట్లు, మొక్కలు, పచ్చటి ఆచ్ఛాదనతో కప్పివేసాయి. నువ్వు 50/500 రూలు గురించి విన్నావా? ఏ జాతి జంతువులైనా ఈ భూమి మీద అంతరించకుండా ఉండాలంటే వాటి సంఖ్య 50 ఉంటే చాలు. కానీ 50 మందే ఉంటే వాళ్లలో వారే కలవడం వల్ల పుట్టే పిల్లలు బలంగా ఉండరు.  కనీసం 500 ఉంటే అలాంటి జెనెటిక్ సమస్యలు రాకుండా బ్రతికి పోవచ్చు. ఇప్పుడు భూమి మీద దాదాపు 500 మానవులే జీవిస్తున్నారు. అందులో నేను ఒకరిని." అంది అపరిచిత.

 

"మరి మిగతా జనం ఎక్కడికి వెళ్లారు. నా లెక్క ప్రకారం జనాభా 1400 కోట్ల కు పై చిలుకే ఉండాలే. అరే ఈ నంబర్లు నాకు ఎలా వెంట, వెంటనే తోస్తున్నాయి?" ఆశ్చర్యంతో అన్నాను.

 

"నిన్ను బ్రతికించే ప్రయత్నంలో నీకిచ్చిన మందులు, నీకున్న రోగాలను నయంచేయడం మాత్రమే కాక, నీ మెదడును కూడా పదునుగా చేసాయి. మీ కాలానికి, ఇప్పటికి బాగా మార్పులు వచ్చాయి. నువ్వన్నది కరెక్టే. ఇప్పుడు మానవ జనాభా దాదాపు 1350 కోట్లు. కానీ వీరందరూ నీకు కన పడరు. భూమిలోపల పెద్ద నగరాలు రెండు, ఒకటి అమెరికాలో, మరోటి చైనాలో కట్టారు. అక్కడే జనమంతా ఉన్నారు. వాళ్లకు మరణం లేదు.” అంది అపరిచిత.

 

"అంత మంది జనం ఓ రెండు నగరాలలోనే ఎలా ఇమడగలిగారు?" ఆశ్చర్యంగా మరో ప్రశ్న వేసాను నేను.

 

"మంచి ప్రశ్నలు వేస్తున్నావు. అమరత్వం కోరకుండా, నాతో వస్తావేమోనని ఓ చిన్న ఆశ పుట్టింది. అవును అంత మంది రెండు నగరాలలో ఇమడడం కష్టమే. అందుకే నగరంలో చేరే ముందు శరీరాలని క్రెమటోరియం లో కాల్చేస్తారు." అంది అపరిచిత.

 

"ఏమంటున్నావు? ఒక పక్క అమరత్వం అంటూనే, అది కావాలంటే నా శరీరాన్ని అగ్నికి ఆహుతి చేయాలంటున్నావు. అమరత్వం కోరి నేను నా శరీరాన్ని 500 ఏళ్ళు ఫ్రీజ్ చేసి, ఆ శరీరంతోనే ఇప్పుడు మళ్లీ జీవిస్తున్నాను. వాట్ యామ్ ఐ మిస్సింగ్?" కొంచెం ఫ్రస్ట్రేషన్ తోనే అడిగాను నేను.

 

"నీ ఉద్దేశ్యం లో అమరత్వం అంటే ఏమిటి?" అడిగింది అపరిచిత.

 

"మనిషి మెదడు పనిచేసినంత వరకు బ్రతికి ఉన్నట్లే. మా కాలంలో కూడా డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అని ఖరారు చేసిన తరువాతే మనిషి చనిపోయాడని దృఢ పరిచేవాళ్ళు. ఆ విధంగా మనిషి మెదడు పని చేసినంత కాలం, ఆ మనిషి అమరుడే.” అన్నాను కొంచెం లోతుగా ఆలోచించి.

 

"గత 500 యేళ్ళలో చాలా మార్పులే వచ్చాయి. కిడ్నీలు పనిచేయకపోతే, కిడ్నీలు, గుండె పనిచేయకపోతే గుండె ట్రాన్ప్లాంట్ చేయడం మీ రోజులలోనే ఉండేది. అవన్నీ చేయడం మెదడు సక్రమంగా పనిచేయడం కోసమే. మెదడుకు ఈ అవయవాలన్నీ పనిముట్లే. నీకు తెలియని విషయం, ఈ రోజులలో మెదడు బ్రతకడానికి, అవయవాల అవసరం లేదు.” అంది అపరిచిత.

 

"అంటే నా శరీరం నుంచి, నా మెదడు వేరు చేసి దాన్ని మాత్రం బ్రతికిస్తారా?" అన్నాను. నా మాటలు నాకే గగుర్పాటు కలిగిస్తున్నాయి.

 

"నీ సమాధానం నిజానికి దగ్గరగానే ఉంది. ఓ రెండు వందల యేళ్ళ క్రితం అలానే మెదడు మాత్రం బ్రతికించేవారు. కానీ మెదడుకు కావాల్సిన రక్త ప్రసరణ ఏ మాత్రం అవాంతరాలు లేకుండా చేయడం సాధ్యం కాలేదు. ఎన్ని ఏర్పాట్లు చేసినా, ప్రపంచంలో కోటికొక్కరో, ఇద్దరో అప్పుడప్పుడు రక్త ప్రసరణ లేనందువల్ల చనిపోయేవారు.” అంది అపరిచిత.

 

"కోటికొక్కరు చనిపోయినా, అది అమరత్వం ఎలా అవుతుంది?" అన్నాను నేను.

 

"అందుకే అటు తరువాత, మెదడులను స్కాన్ చేసి అలాంటి మెదడే ఓ సర్క్యూట్ చిప్ లాగా మలచగలిగారు. ఇవి పనిచేయడానికి, సూపర్ కండక్టర్ బ్యాటరీలు అమర్చారు. ఈ బ్యాటరీలు ఎప్పటికి పని చేస్తూనే ఉంటాయి. ఫెయిల్ అయ్యే ప్రశ్నే లేదు." అంది అపరిచిత.

 

"అంటే ముందు నా మెదడును స్కాన్ చేసి నన్ను మరో సారి సృష్టించిన తరువాత, నా మెదడును కూడా, శరీరంతో పాటు కాల్చేస్తారా? నేను అలా ఎలా బ్రతకాలనుకుంటావు.” అన్నాను నేను. ఇదంతా ఏదో తికమకగా ఉంది.

 

"నీకు నీ శరీరం కోల్పోయిన అనుభవం ఏమాత్రం ఉండదు. మెదడుకు నీ అవయవాలన్నీ ఉన్నట్లే సిగ్నల్స్ అందుతుంటాయి, నీ జ్ఞాపకాలు కూడా, నీ అవయవాలు ఉన్నట్లే నిక్షిప్తం అయి ఉంటాయి." అంది అపరిచిత.

 

"ఒకవేళ నీవు చెప్పింది నిజమే అయినా, ఎక్కడా కదలలేని, ఎలాంటి అనుభూతులు లేని అలాంటి జీవితం నేనెందుకు కోరుకుంటాను? అచలనం అమరత్వం కాదు కదా." అన్నాను.

 

"కదలలేవని ఎందుకనుకుంటున్నావు. నీవెక్కడికి పోవాలనుకుంటే అక్కడికి పోయి పని చేయడానికి డ్రోన్ రోబోలు బోలెడన్ని ఉన్నాయి. అవి చూసిన దృశ్యాలు, పొందిన అనుభవాలు నీకు నువ్వు అక్కడ ఉన్నట్టే, ప్రత్యక్షమౌతాయి. ఓ అడవిలో చందనం చెట్టు దగ్గర తిరుగుతుంటే నీవు ఆ చందనం సువాసన ఆఘ్రాణించగలవు, అక్కడి దృశ్యాలు అక్కడున్నట్లే అన్ని దిక్కులనూ చూడగలవు, పళ్ళు కోసి, తిని రుచి చూడగలవు, పక్షుల కిలకిలలు, వినగలవు. నీవు అక్కడ ఉన్నట్లే అనుభూతి కలుగుతుంది".

 

"రోబోల సాయంతో జీవితం ఎలా గడుపుతాను? తోటి మనుష్యులు కావాలి కదా. నాకు సహచరి కావాలి కదా?" అన్నాను నేను.

 

"నీ ఆలోచనలు ఎక్కడకు పోతున్నాయో నాకర్ధం అయ్యింది. నువ్వు కావాలనుకుంటే, డేటింగ్, రొమాన్స్, లవ్, సెక్స్ అన్నీ సాధ్యమే. మార్పు చెందిన తరువాత ఎలాంటి అనుభవాలైనా, మీ కాలంలో నెట్ఫ్లిక్స్ లాగా నువ్వు ప్లే చేసి అనుభవించవచ్చు. 2100 సంవత్సరం తర్వాత మనుష్యుల అనుభవాలు పంచుకోవడానికి సదుపాయాలు ఏర్పాటు చేసారు. చనిపోయే ముందు మానవులు తమ బ్రెయిన్ డంప్ చేయవచ్చు. అమరత్వం ఎన్నుకున్న వారికి ఈ బ్రెయిన్ డంప్ లు వాళ్లు అనుభవించడానికి కన్టెంట్ అయింది. అలా రకరకాల జీవితాలు అనుభవించడం, కొత్త జీవన మార్గంగా మారింది.” అంది అపరిచిత.

 

"అంటే నేను కావాలనుకుంటే బిల్ గేట్స్ లా బ్రతకగలనా?" అన్నాను నేను.

 

"బిల్ గేట్స్ మీ తరం వాడు. ఆయన మెదడు డంప్ లేదు. కానీ నీవు కావాలనుకుంటే బిల్ గేట్స్ కు మించి జీవితంలో పైకెదిగిన మనుష్యుల జీవితాలున్నాయి. వారిలా నీవు జీవించి చూడవచ్చు.” అంది అపరిచిత.

 

"అంటే ఎలాంటి జీవితమైనా నేను అనుభవించవచ్చా?" అన్నాను నేను.

 

"తప్పకుండా. కావాలంటే ఓ సీరియల్ కిల్లర్ జీవితం కూడా, ఏ మాత్రం పర్యవసానాలు లేకుండా అనుభవించవచ్చు.” అంది అపరిచిత.

 

"చా! అలాంటి అనుభూతి నేను ఎందుకు కోరుకుంటాను.” అన్నాను కొంచెం జుగుప్సతో.

 

"మీ కాలంలో హార్రర్ సినిమాలు చూడలేదా? ఇదీ అంతే. సినిమా చూడడానికి నేరస్తుడు కానవసరం లేదు. ఇక్కడా అంతే." అంది అపరిచిత.

 

"అమరత్వం తో పాటు అన్ని కోరికలు తీర్చేసుకోవచ్చు అంటావు. బుద్ధుడన్నట్లు కోరికలు మానవ జీవనంలో ఉన్న బాధలకు కారణం అయితే, అన్ని కోరికలు తీరే ఈ కొత్త ప్రపంచంలో మనుష్యులు ఎల్లకాలం సుఖంగా బ్రతికేయవచ్చు అంటావు" అన్నాను నేను.

"అవును ఒక్క కోరిక తప్పితే, మిగతా అన్ని కోరికలు ఆ లోకంలో వారు తీర్చుకోవచ్చు.  కానీ దాని గురించి చెప్పేముందు నేను ఎంచుకున్న లోకం గురించి నీకు చెప్పాలి.” అంది అపరిచిత.

 

"దట్ మేక్స్ సెన్స్. నాకు రెండు ప్రపంచాల గురించి తెలిసిన తరువాతే కదా నా నిర్ణయం చెప్పగలను.” అన్నాను నేను.

 

"అందరూ అమరత్వం కోరుకుంటే మానవ జెనెటిక్ ప్రింట్ పోతుందని ఓ 500 మందికి మాత్రం అమరత్వం ఇవ్వకుండా మానవులుగా బ్రతకమని ఈ కొత్త ప్రపంచంలో నిర్దేశించారు. బిజినెస్ కంటిన్యూటీ లాగా మానవ లైఫ్ కంటిన్యూటీ పథకంలో ఇది ఒక భాగమనుకుంటా. మా జీవన విధానానికి మీ కాలంలో జీవించినదానికి పెద్ద తేడా లేదు. కాకపోతే ఇప్పుడు మనుష్యులు 150 ఏండ్ల దాకా బ్రతకగలుగుతున్నారు. నీకు చనిపోయినప్పుడు 50 ఏళ్ళు కాబట్టి మరో వంద ఏళ్ళు సరదాగా గడిపేయవచ్చు. నీకున్న జబ్బులన్నీ ఈ పాటికి సమసిపోయి ఉండాలి. నిన్ను నీ క్రయోజెనిక్ నిద్ర నుండి లేపే ప్రయత్నంలో, కావలసిన మెడిసిన్స్, వాక్సిన్ నీ ముక్కులో స్ప్రే చేసాను. ఇప్పుడు నీ ఆయష్షు మా లాగానే 150 ఏళ్ళు.  యు ఆర్ సెంట్ పర్సెంట్ హెల్తీ. కానీ మా లోకంలో నీకు ముసలితనం నుంచి, మరణం నుంచి విముక్తి లేదు. 130 నుంచి 150 యేళ్ళలో ఎప్పుడైనా చనిపోవచ్చు." అంది అపరిచిత.

 

"మరి మీ లోకంలో వారు కూడా అమరత్వం కోసం ప్రయత్నించవచ్చు కదా?" అడిగాను నేను.

 

"మంచి ప్రశ్న. మా లోకంలో నుంచి అమరలోకానికి పోవడానికి రిటైర్ అయిన తరువాతే సాధ్యం. మా లోకంలో అది 120 యేళ్ళకు కానీ రాదు. అలా 120 యేళ్ళ తరువాత అమరత్వం పొందాలనుకుంటే ముందు తమ బ్రెయిన్ డంప్ చేయాలి. లేకపోతే అమరత్వం దొరకదు, ఆ లోకంలోకి ప్రవేశం లేదు. తరువాత బ్రెయిన్ స్కాన్ చేసి  ఆ మర లోకంలో నిక్షిప్తం చేస్తారు. దానితో అమరత్వం వచ్చినట్లే" అంది అపరిచిత.

 

"నేను మరింత సూటిగా అడిగి ఉండవలసింది.  మరి ఎందుకు నీవు అమరత్వం కోరుకోవటం లేదు?" అన్నాను.

 

"నేను మానవ జీవితం పూర్తిగా గడపాలనుకుంటున్నాను. చావుతో సహా. నా జీవితానుభావాలు నావే. అవి నాకు ఇతరులతో పంచుకువడం ఇష్టం లేదు.” అంది అపరిచిత.

 

"అలాంటి ఖచ్చితమైన అభిప్రాయాలు ఉండడం మంచిదే. కానీ నీవు, నాకు ఇంకా ఏదో చెప్పలేదనిపిస్తోంది.” అన్నాను కొంచెం ఇబ్బందిగా కదులుతూ.

 

"ఇంకో ఐదు నిముషాలలో నేను ప్రస్తుతం నివసిస్తున్న మావి ద్వీపానికి చేరిపోతాం. నీ నిర్ణయం ఆ లోపు చెప్పాల్సిందే. నీవు గతంలో నుంచి వస్తున్నావు కాబట్టి, నీకు ఇట్టే అమరత్వం ఇవ్వడానికి ఒప్పుకుంటారు. నీ మెదడులో ఉన్న నీ అనుభవాలు పురాతన వస్తువుల వంటివి. మంచి డిమాండ్ ఉంటుంది. ఇక నీ ఇబ్బంది నేను అర్ధాంతములో వదిలేసిన ప్రశ్న వల్ల కావచ్చు.” అంది అపరిచిత.

 

"అమర లోకంలో వారికి ఒక కోరిక మిగిలి పోయింది అన్నావు?" నన్ను కలవర పెడుతున్న ప్రశ్న గుర్తుకు వచ్చింది.

 

"అవును. దానికే వస్తున్నాను. అమరత్వం పొందిన వారందరు అది స్వర్గంలా ఉందనే అంటున్నారు. ఆ లోకం సృష్టించి ఇప్పటికి దాదాపు 300 ఏళ్ళు అయ్యింది. ఇటీవల కొందరు ఏ మాత్రం చలనం లేకుండా ఉన్నారని కొన్ని పుకార్లు విన్నాను. వాకబు చేస్తే, వీరికి చావు అనుభూతి ఎలా ఉంటుందో అని అనుభవించాలి అని ఆశ ఆట." అంది అపరిచిత.

 

నవ్వు ఆపుకోలేక పోయాను నేను. "కేచ్ 22 లా ఉంది కదూ. చనిపోయిన వాడు, బ్రెయిన్ డంప్ చేయలేడు. ఆ అనుభవం కావాలంటే అమరత్వం కోరుకోకూడదు.” అన్నాను నేను.

"నేను దిగాల్సిన ప్రదేశం వచ్చేసింది. ఇక నీ నిర్ణయమే బాకీ. నాతో పాటు దిగిపోయి మరణం కోరుకుంటావా? కాదు అమరత్వం కావాలంటే నీవు ఇలానే ప్రయాణిస్తే ఆ లోకానికి చేరిపోతావు. నీ వాహనానికి ఆ దారి తెలుసు." అంది అపరిచిత.

"ముందు నన్ను వెదికి పట్టి, నన్ను మళ్లీ ఈ లోకంలోకి తెచ్చినందుకు థాంక్స్. ఓపిగ్గా నా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చావు. నేనో నిర్ణయానికి రావడానికి వీలైంది.” అన్నాను నేను.

"విచిత్రం ఏమిటంటే, అన్ని విషయాలు తెలిసినా, మీ వంటి వారి నుంచి ఎప్పుడూ ఒకటే జవాబు రాలేదు. మరి నీ నిర్ణయం చెప్పు.” అంది అపరిచిత, సూటిగా నా కళ్ళలోకి చూస్తూ.

 

***

bottom of page