MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కవిత్వంలో ఆధునికత
తమ్మినేని యదుకుల భూషణ్
కవిత్వం - ఆధునికత; ఒక రకంగా ఆలోచిస్తే ఆధునికత లేనిది కవిత్వమే లేదు. కొత్తగా చెప్పడమన్నది, కథకైనా, కవితకైనా చాలా ముఖ్యం. మనం, ఏదైనా కొత్తగా చెప్పకపోతే మళ్ళీ, పాత చింతకాయ పచ్చడే అనిపిస్తుంది అందరికీ. ఈ కొత్తగా చెప్పడమంటే మళ్ళీ అందరికీ అనిపించ వచ్చు.. ‘ప్రతి ముప్పై నలభై ఏళ్లకు పాతబడుతూనే ఉంటాయి, చెప్పే పద్ధతులు గానీ, భావాలు గానీ, మళ్ళీ మళ్ళీ పాతబడుతూనే ఉంటాయి.’ అని. మరి, ఏది ఆధునికత? ఆధునికతను మనం సరిగా నిర్వచించలేకపోతే, ఇక postmodernism అని కూడా ఒకటుంది కదా, మరి అదేమిటి? ఇటువంటివన్నీ చాలా సందేహాలు రావచ్చు. “మరి , ఇన్ని గొడవలుంటే , నీవు పది నిమిషాల్లో ఎలా చెబుతావయ్యా ఆధునికత గురించి?” అని మీరందరూ అడగవచ్చు. నా ప్రయత్నం నేను చేస్తాను.
ఇప్పుడున్న పరిస్థితుల్లో, మనమున్న పరిస్థితుల్లో దేనికి ఎక్కువ విలువ ఉంది?
“అర్థమయ్యేలా చెప్పాలి. అర్థమయ్యేలా మీరు రాయకపోతే ఎవరూ చదవరు. చదివినట్టు నటిస్తారంతే. అది ఎవరికీ అర్థం కాదు. కాబట్టి, అర్థం కావడం, అంటే కొంచెం మన వాడుక భాషకు దగ్గరగా ఉన్న భాషలో రాయడమన్నది ఒక ముఖ్యమైన విషయమే. అదొకటి. ఇప్పుడు మీరు గమనిస్తే, మన సభల్లో - సాంప్రదాయిక సభల్లో మీరు చూస్తే, ఒక వక్త వచ్చి ఒక డెబ్భై నిమిషాలు అందరినీ చావగొట్టి వెళ్ళిపోతాడు. అదే సమయంలో మనం పది మంది హాయిగా మాట్లాడుకుంటున్నాము.
అది కూడా ఆధునికత లక్షణమే. అంటే.. చెప్పేదేదో, తొందరగా ముగించి, మనం వెళిపోవడమన్నది చాలా శ్రేయస్కరం అందరికీ. ఆధునికత మూలాలు అక్కడే ఉన్నాయి. అందరినీ, విసిగించకుండా, చెప్పే విషయం తటాలున చెప్పేసి వెళ్లిపోవడమన్నది మంచి లక్షణం. కవిత్వంలో మరీను. పుట్టుపూర్వోత్తరాలు, చరిత్రలు, మన ఈ కాలజ్ఞానాలు, ఇవన్నీ వదిలేసి ఈ క్షణంలో నీవు సజీవంగా ఉండాలి. ఈ క్షణంలో నీకు తోచింది, నీ మనసులో ఉన్నది నీవు చెప్పగలగాలి, ఆ ప్రజ్ఞ కవిత్వానికి ముఖ్యం. దాన్ని ప్రపంచంలోని పలు దేశాల్లో, పలు రకాలుగా కవులు దాన్ని తీసుకువచ్చారు. ఇపుడు జాపనీయులు దీన్ని బాగా సాధన జేశారు. వాళ్ళ హైకూలు అందులో కొట్టివేతలు గట్రా ఉండవు. నించున్నట్టుగా హైకూ అలా వచ్చేయాలి. ఆ రసమయ ఘడియల కోసం వారు వేచి చూస్తారు. అంతవరకు వారు నోరు విప్పరు. కాబట్టి, వారి కవి సమయాలు, పద్ధతులు అన్నీ వారి ఆధునికతలో భాగం.
ఇంక మన తెలుగు పరిస్థితి ఏమిటి? వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యం మనం తీసుకుంటే, నన్నయకు ముందు కూడా చాలామంది కవులున్నారు. కానీ ఆయన అప్పటికి ఆధునికుడు అని నా అభిప్రాయం. 11 వ శతాబ్దానికి కావడం వలన వేరేవాళ్లలో లేని ఆధునికత ఆయనలో ఉంది కాబట్టే, అయన ఇన్నాళ్లు నిలబడ్డాడు. ఇది నా అభిప్రాయం. నన్నయ శైలి సంస్కృత భూయిష్టమైన శైలి. కానీ, నన్నయకు కవిత్వమన్న దినుసు ఏదో అద్భుతంగా అర్థమయి, ఆయనను ఒక మహాకవిగా నిలిపింది. నన్నయ పుట్టిన తర్వాత ఒక వంద సంవత్సరాలకే వచ్చినవారు పాల్కురికి సోమన. ఆయన శైలి మరీ విచిత్రం. అప్పటికే ఆయన ‘అల్పాక్షరముల ననల్పార్థ రచన కల్పించుటయు కాదె కవి వివేకంబు’’ ఆయన చెప్పగలుగుతున్నారు.
అంటే, తొందరగా ముగించి వెళ్ళిపో నాయనా అన్న ధోరణి, కవిత్వంలో ముఖ్యంగా చెప్పదలుచుకున్నది చెప్పేసి వెళ్ళిపో. మరి ఎలా? జనాలు అనుకుంటారు కదా.. నాలో ఎన్నో భావాలున్నాయి. సవాలక్ష ఆలోచనలు చెలరేగుతున్నాయి. ఇవన్నీ, ఎలా చెప్పి వెళి పోవాలి? అంత తొందరగా? సందేహముంటుంది. జనాలు ఆ అంటే దీర్ఘ కవితల్లోకి తెగబడతారు. కొంతమంది, ‘కవిత్వాల్లో నవలలు, గట్రా పర్సనాలిటీ బుక్స్ సకలము రాస్తాము అంటారు. “విశ్వంభర నేను ఒక మహా కావ్యం రాశాను”. (అలాంటి వాటికి జ్ఞానపీఠాలు కూడా వచ్చాయి.) మరి ఇదంతా, ఈ గొడవేమిటి? అంటే, ఈ ఆధునికత మీద ఒక అవగాహన లేకపోవడం వల్ల, ఇవన్నీ బయల్దేరుతున్నాయి.
ఒక మూడే మూడు విషయాలు చెబుతాను. ఈ ఆధునికత అన్నది ఎలా తీసుకోవాలి?
అనుభవాన్ని అనుభవంగా చిత్రించడానికి పనికి వచ్చే భాష వేరు. అది వాస్తవానికి ఎంత దగ్గరగా ఉంటే అంత ఉపయోగకరం.
ఇది భాష విషయంలో మీరు చూపే ఆధునికత.
జటిలమైన అనుభవాన్ని చిత్రించడానికి సరైన సాధనాలు పదచిత్రాలు. మీలో ఎంతో జటిలంగా ఉన్న భావాలను ఎలా తీసుకురావాలి ? అంటే దానికి సరిపోయిన పదచిత్రాల ద్వారా, దాన్ని తీసుకురావాలి.
కవిత్వానుభూతి సారాన్ని మాత్రమే గ్రహించి, మిగతా వాటిని పరిహరించే క్లుప్తత.
ఈ మూడు ఎంత ఆధునికత మీలో ఉంది అని తెలిపే లక్షణాలు. ఇంకా నాకు సమయం లేదు కాబట్టి, చాలా మంది కవులను ఉదాహరించలేను. ఒకటి రెండు కవితలు ఉదాహరించి ముగిస్తాను. నా ఉపన్యాసాన్ని వందేళ్ల తెలుగు సాహిత్యాన్ని తీసుకుంటే, తెలుగులో ఆధునికతను తీసుకువచ్చిన వాడు గురజాడ అప్పారావు. భాష మీద ఆయనకు గల అవగాహన చాలా గొప్పది. ఎప్పుడైతే, వృత్తాలను వదిలి, ముత్యాలసరాలను మన ముందుకు తీసుకువచ్చాడో, ఆ క్షణాన్నే తెలుగు కవిత “దిమ్మసా కొట్టిన హైరోడ్డెక్కింది“ శ్రీశ్రీ మాత్రా ఛందస్సులను వరించి కొంతకాలం గురజాడ మార్గంలో ఉన్నా, ఆయన మళ్ళీ తనకు అలవాటైన సంస్కృత పద భూయిష్టమైన శైలిలోకి వెళ్ళిపోయాడు. ఆ తరువాత, భావకవిత్వాలు, మార్క్సిజం ఆ స్పూర్తితో వచ్చిన ఈ కంకరరోడ్ల కవిత్వాలను దాటుకుని వచ్చిన విలక్షణమైన కవి ఇస్మాయిల్ కనిపిస్తాడు. ఆయన కవితలు రెండు
భావ కవిత్వాల్లో మీకు ప్రియురాళ్లు కనిపించరు. వాళ్ళు ఎక్కడో మేఘాల్లోనో, భావనా లోకాల్లో మాత్రమే ఉంటారు. కానీ, ఆధునిక కవికి ప్రియురాళ్లు కనిపిస్తారు. అన్ని రకాల భావాలు ఉంటాయి. ఈ ‘తలుపు’ కవిత అటువంటిది.
తలుపు
నా మీద అలిగి
భళ్ళున తలుపు తెరచుకుని
వెళ్ళిపోయావు నీవు.
నీకై ఎన్నడో మూసుకున్న తలుపును
బార్లా తెరిచి,
గాలీ వెలుతురూ రానిచ్చినందుకు
బోలెడు థాంక్సు.
డబ్బు మీద రెండు పద్యాలు
I
వేయి సువర్ణ ప్రభాతాల మేరకు
ధనవంతుణ్ణి.
నేను డబ్బు సంపాదించలేదని
మా ఆవిడ సణుగుతుంది.
II
డబ్బు లేదంటావా?
డబ్బెందుకు?
ఈ కిటికీలోంచి వాలి
టేబిల్ మీది పుస్తకాన్ని, పెన్నునీ,
ఇంకుస్టాండునీ మంత్రించే
సూర్యకిరణం ఖరీదెంత?
ఎంత డబ్బు పెడితే దొరుకుతుంది?
ఇది చెప్పదలుచుకున్న భావాన్ని, కొన్ని పదచిత్రాలలో క్లుప్తంగా చెప్పగలగడం, ఇందులోని భాష ఆధునికం, అంటే మనం మాట్లాడే భాషకు చాలా దగ్గర ఇది కవిత్వం చెప్పే తీరు. ఇది కవిత్వంలో ఆధునికతకు నేను తీసుకున్న ఉదాహరణలు. ఉపన్యాసం సమాప్తం, అందరికి నమస్కారం.
*****
శ్రీ తమ్మినేని యదుకుల భూషణ్ గారు అమెరికాలోని న్యూజెర్సీ నివాసి, రచయిత, విమర్శకులు మరియు అనువాద రచయిత. స్వస్థలం రాయలసీమలోని తాడిపత్రి. ‘నిశ్శబ్దంలో నీ నవ్వులు’, ‘చెల్లెలి గీతాలు’, ‘వాన కురిసిన పగలు’.. వంటి కవితా సంకలనాలు, ‘సముద్రం’ కథాసంకలనం, అనువాద రచన అయిన ‘నీ చేయి నా చేతిలో’ మరియు ‘నేటికాలపు కవిత్వం -తీరు తెన్నులు’ విమర్శ గ్రంథం, వీరు రచించిన విశిష్ట రచనలు.