top of page

మధురవాణి ప్రత్యేకం

కాళిదాసు కవిత

ఎర్రాప్రగడ రామకృష్ణ

సాహిత్యకారులలో కొంతమందికి శాపానుగ్రహ సామర్ధ్యం ఉంటుంది. అంటే వాళ్లు కోపం వస్తే శపించగలరు. ప్రేమ పెరిగిపోతే వరం అనుగ్రహించగలరు.

 

ఉపాసనా బలం వల్ల అలాంటి సామర్ధ్యం సిద్ధిస్తుందని పెద్దలు చెప్తారు. వరాలు ఇచ్చేవారి సంగతి ఎలా వున్నా కోపం వచ్చి శాపంగా మారిపోయే సందర్భాలను మాత్రం చరిత్ర బాగా గుర్తు పెట్టుకుంటుంది. తెలుగులో వేములవాడ భీమకవి అలాంటివాడు. ఆయన గురించి మనకి చాలాచోట్ల ప్రస్తావన కనపడుతుంది. తిరుపతి వెంకట కవులు తమ కథలూ- గాధలులో కూడా రెండు మూడు చోట్ల భీమకవి గురించి చెప్తారు.

తమిళంలో కూడా అలాంటి కవి ఒకరున్నారట. ఆయన పేరు - కడవణన్. ఆయన తిట్టుకవిగా ప్రసిద్ధుడట. ఆయన ఉన్నట్టుండి ఆసువుగా తిట్లను కవితారూపంలో వర్షంలా కురిపించేసరికి అవతలవాడు నిజంగానే చనిపోయేవాడట. 12వ శతాబ్దానికి చెందిన కడవణన్.. ఆ దేశపు రాజుగారికి స్వయంగా తమ్ముడు. ఆయన తిట్టు కవితను - 'కలంబనం' అంటారు. ఒకసారి ఆ రాజుగారికే కర్మ కాలి తీవ్రమైన ఆసక్తి కల్గి, తమ్ముడిని పిలిపించుకుని, వెంటనే కలంబనం వినిపించమని ఆదేశించాడు. చూస్తే అది రాజాజ్ఞ. కాదనడానికి వీల్లేదు. తీరా ఆయన తనకు స్వయంగా అన్నగారు. కనుక ఆయన చనిపోతే తను భరించలేడు. దాంతో కడవణన్ తీవ్రమైన ఘర్షణకు గురయ్యాడు. రాజు నుండి బలవంతం పెరిగిపోయింది. ఇక చేసేది లేక ఒక ప్రక్క ఏడుస్తూనే కవిగారు కలంబనం మొదలుపెట్టాడు  ఆ కవితావేశం పూర్తయ్యేసరికి రాజుగారు చచ్చి పడి పొయాడట. తమిళ సాహిత్యంలో ఈ ఉదంతం ప్రముఖంగా చరిత్రీకరించబడి ఉంది.

ఇలాంటి ఉదంతం కాళిదాసు విషయంలో కూడా ఒకటుంది. చరమ శ్లోకంగా దానికి ప్రసిద్ధి. అంటే ఆఖరి శ్లోకం  అని అర్ధం. ధారా నగరానికి పరిపాలకుడైన భోజ మహారాజు దగ్గరుండేవాడు కదా కాళిదాసు. అలాంటి కాళిదాసు తాను చనిపోయినప్పుడు కవితాత్మకంగా ఎలా విలపిస్తాడో వినాలని భోజుడికి అనిపించిందంట. భోజుడికి ఆ కోరిక కల్గడం గురించి వింటే. ఆశ్చర్యకరంగా ఉంటుంది కాని, మనలో కూడా చాలామందికి ఇలాంటి కోరిక ఉంటుంది. ముఖ్యంగా కీర్తి ప్రతిష్టలు, సంపద బాగా ఉన్నాయని తమకు తామే అనుకునేవారికి, తాము చనిపోయాక "మన గురించి ఈ ప్రజలంతా ఏమనుకుంటారో వినగల్గితే బాగుండును" అని అనిపిస్తూ ఉంటుంది. మరణం వల్ల కలిగే దుఃఖంలో, భావోద్వేగంలో, వియోగంలో, ఒకో మనిషి ఒక్కోలా స్పందిస్తాడు. ప్రజాకవి కాళోజీ మరణవార్త వినగానే నిన్న ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఎడిటోరియల్ వేదనకి ఒక గొప్ప ఉదాహరణ. గుండె లోతుల్లోంచి వెలువడే మాటలు అవిగో అలా ఉంటాయి. ఇంతకీ చెప్పొచ్చేది.. అలా తమ గురించి ప్రజల అంతర్యాలలోంచి నివాళి రూపంలో వ్యక్తమయ్యే మాటలు ఏ తరహావో వినాలనిపించడం సహజం. భోజరాజుకి కల్గిన కోరిక అలాంటిదన్నమాట.

భోజరాజుగారి సరదా సంగతి సరేగాని, కాళిదాసుకి వచ్చిన ఇరకాటం ఏమిటంటే, కాళికానుగ్రహం వల్ల ఆయనకు వాక్సుద్ధి లభించింది. నిజంగానే భోజరాజు చనిపోయాడనే భావంతో కాళిదాసు విలపించాడనుకోండి. భోజుడు ఇక భూమిపై మిగిలే అవకాశం లేదు. కంటి ఎదురుగా చూస్తూ కవిగారు భోజరాజు మీద వియోగ కవిత ఎలా వినిపించగలడు? ఎవడేనా ఒక ప్రముఖుడు ఆఖరి దశలో హాస్పిటల్‌లో చేరాడనగానే ముందు జాగ్రత్తగా అతని చరిత్రను సేకరించి పెట్టుకునే కొన్ని పత్రికలవాళ్లలాగా, కవితలు ముందే సిద్ధం చేసుకునే కవుల్లాగా కాదు కదా మహాకవి కాళిదాసు.

కనుక కాళిదాసు ససేమిరా అన్నాడు. భోజరాజు ఎంత బతిమాలినా చెప్పననేసాడు. దాంతో రాజుకీ కోపం వచ్చింది. "నేను చెప్పిన మాట విననివాడు నా కంట పడడానికి వీల్లేదు" అనేసాడు. చేసేదేం లేక కాళిదాసు రాజాశ్రయాన్ని ఒదిలేసుకుని ఒంటరిగా దూరంగా ఎక్కడో గుళ్లో తలదాచుకున్నాడు.

 

కొంతకాలం గడిచింది. ఇలా ఉండగా ఓ మునిమాపు వేళ కాళిదాసు కవితా సాధనలో మునిగి ఉన్నప్పుడు ఓ పల్లెటూరి రైతు ఆయన్ను సమీపించి "అయ్యా మీరు చూడబోతే కాళిదాసు మహాకవిలా వున్నారు. మీకీ విషయం తెలుసా మన మహారాజు భోజులవారు మరణించారు" అని ఏడుస్తూ చెప్పాడు.

 

అది వింటూనే కాళిదాసు నిశ్చేష్టుడయిపోయాడు. ఆయనలో ఆవేదన పెల్లుబికింది. శోకం శ్లోకం రూపం దాల్చింది."అయ్యో ఇక ధారానగరం నిరాధారానగరం అయిపోయింది. సరస్వతీ దేవి ఆలంబన కోల్పోయింది. పండితులు ఆశ్రయం కోల్పోయారు" అని విలపించసాగాడు. ఎప్పుడైతే కాళిదాసు విలపిస్తూ - అయ్యో భోజరాజు ఇక లేడు అన్నాడో ఎదురుగా ఉన్న రైతు క్రింద పడి ప్రాణాలు వదిలేసాడు. అప్పుడు కాళిదాసు గ్రహించాడు.

 

ఇలా భోజరాజే మారువేషంలో అక్కడికి వచ్చి తనకు కావాల్సిన శ్లోకం చెప్పించుకున్నాడన్నమాట. తీరా భోజుడు చేసిన పనికి జరగరానిది జరిగిపోయింది. దిమ్మెరపోయాడు కాళిదాసు. దుఃఖం కమ్మేసింది. ఆత్మాహుతికి సిద్ధపడ్డాడు. అప్పుడు కాళిదాసు ప్రత్యక్షమై “నీ వాక్కుకి ప్రాణం తీసేంత తీవ్రతే కాదు నాయనా.. ప్రాణం పోసేంత సామర్ధ్యం కూడా ఉంది. దాంతో నీ రాజును నువ్వే బతికించుకో.." అని చెప్పింది. అప్పుడు కాళిదాసు...

అద్యధారా నిరాధార నిరాలంబా సరస్వతీ

ఖండితా: పండితా: సర్వే భోజరాజే దివంగతే

 

అని మొదట చెప్పిన శ్లోకాన్నే మార్చి, భోజరాజు భువికి దిగిరాగానే - ధారానగరం సదాధారనగరం అయింది.  సరస్వతీదేవి సదాలంబన సాధించింది. పండితులంతా సర్వాలంకార భూషితులయ్యారు కదా అన్నాడు.

 

అద్యధారా సదాధారా సదాలంబా సరస్వతే

మండితా: పండితా: సర్వే భోజరాజే భువంగతే

 

వెంటనే భోజరాజు ప్రాణాలతో లేచి కూర్చున్నాడు. తన చావును, దానివెంట వచ్చే సంతాప కవితలను స్వయంగా తెలుసుకునే భాగ్యం కల్పించినందుకు కాళిదాసుకి, కాళికాదేవికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఈ కథలో మనం గ్రహించవలసింది ఏమిటంటే.. కడవణన్‌కి, కాళిదాసుకి గల తేడా అది అని కాదు.. కవిత అనేది అలా గుండెల్ని చీల్చుకుంటూ అప్రయత్నంగా పెల్లుబికితే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో మనం తెలుసుకోవాలి.

భరించలేని అవమానం లోంచి, నిస్సహయతలోంచి పెల్లుబికిన మాటలే మన పాలిట శాపాలవుతాయి. అలాగే అవతలవాడికి మనవల్ల కలిగిన స్వచ్చమైన ఆనందంలోంచి వచ్చిన మాటలే మనకి వరాలవుతాయి. అది కవిత కావొచ్చు, వట్టి మాటలు కావచ్చు. దానంతటది పుట్టుకొస్తే దాని ప్రభావం తప్పకుండా ఉండి తీరుతుంది. కట్టు కవితలకి ఆ బలం ఉండదు.

 

కాళిదాసు పుట్టు కవి. భోజరాజు మరణించాడనే మాట ఆయన మనసును గాయం చేసింది..కనుక మొదటి శ్లోకం భోజుడ్ని నిజంగానే చంపేసింది. అమ్మవారి మాట మీద తిరిగి భోజుడు బతికి తీరతాడన్న విశ్వాసం కాళిదాసుకి కలిగింది కనుక రెండో శ్లోకం సాక్షాత్తు ప్రాణమే పొసింది.

 

నిజంగా భావన కలిగిందా లేక నటిస్తున్నావా అనేది ఇక్కడ ప్రధానం.

 

స్వస్తి.

*****

Bio

ఎర్రాప్రగడ రామకృష్ణ

ఎర్రాప్రగడ రామక్రిష్ణ గారు ఈనాడు ఆదివారం పత్రిక 'అంతర్యామి ' శీర్షిక ద్వారా సాహితీబంధువులందరికీ సుపరిచితులు. తిరుపతి లో శ్రీ వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలలోనూ, భద్రాచలం లో సీతారామకళ్యాణ మహోత్సవాల్లోనూ వ్యాఖ్యాతగా వ్యవహరించే వీరికి ఆధ్యాత్మిక సాహిత్యాన్ని ఆసక్తికరంగా ప్రజల్లోకి తీసుకెళ్ళటం వెన్నతో పెట్టిన విద్య. తెలుగు పద్యాలపై పట్టు, వాటిని పలకటంపై సాధికారత వీరి సొంతం.

bottom of page