top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
adhyatmika.jpg
pustaka-parichayaalu.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
alanati.jpg
paatasanchikalu.jpg
samputi.jpg
maagurinchi.jpg
rachanalu.jpg

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

కథా​ మధురాలు

ఓ(టి)తీపి బతుకులు!

 

జయంతి ప్రకాశ శర్మ

Jayathi Prakash Sarma.PNG

డా. రఘురామారావు గారింటికి రెండు పనులు పెట్టుకుని, మా ఆవిడ్ని తీసుకుని వెళ్ళాను.

ఒకటి- వాళ్ళింట్లో బొమ్మల కొలువు పెట్టారు, అది చూడాలి. రెండు- ఎలాగూ వెళ్తున్నాం కాబట్టి బిపి, సుగరు చూపించుకునే పని కూడా అయిపోతుంది.

 

ఆయనింటికి వెళ్ళేసరికి, డాక్టరు గారు, వాళ్ళావిడ శాంతిగారు ఇల్లంతా కంగారుగా తిరుగుతున్నారు. మమ్మల్ని చూస్తూనే 'రండి, రండి! కూర్చోండి!' అంటూ మమ్మల్ని కూర్చోబెట్టి, వాళ్ళిద్దరూ హడావిడిగా ఇల్లంతా చుట్టేస్తున్నారు.  వాళ్ళలఓ ఆందోళన కొట్టొచ్చినట్లు కనబడుతున్నాది. రాకూడని టైములో వచ్చామా అనే చింత నాలో వచ్చేసింది.

 

రఘురామారావు గారు ఊర్లో పేరున్న డాక్టరు. ఆయన దగ్గర అపాయింట్మెంటు దొరకాలంటే పది పదిహేను రోజులు పడుతుంది. అంత బిజీలో కూడా సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తూ  కళాసేవ కూడా చేస్తారు. నాకే కాదు, చాలమందికి మంచి మిత్రులు, మా కుటుంబ శ్రేయోభిలాషి కూడా!  ఆ చనువుతో నాకు ఆయన క్లినిక్ కి వెళ్లే అవసరం ఉండదు. సెలవు రోజుల్లో ఆయనతో కబుర్లు చెప్పటానికి ఇంటికే వెళ్ళి, వైద్య పనులు కూడా చక్కపెట్టేసుకుంటాను ఇలా.

 

అంతలా కంగారుపడి ఏం వెతుకుతున్నారో అర్ధం కాలేదు.

అప్పుడు గుర్తుకు వచ్చింది. ఈ మధ్యే పారాడటం వచ్చిన డాక్టరుగారి మనవరాలు మంచాల కిందనో, అల్మోరా లోకో వెళ్ళిపోయిందా అని అనుమానం వచ్చింది. అదే అడిగాను.

"అబ్బే! ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉందంటే, అది పడుకుందనేగా. అదింకా లేవలేదు!" అంటూ అటు ఇటు తిరుగుతూ వెతుకులాటలోనే నా సందేహం తీర్చేసారు శాంతిగారు.

ఐతే ఏ నగో నట్రో, ఏ మూలో జారిపోయుంటుందని అనుకున్నాను.  సోఫాలో కూర్చున్నవాడ్ని  లేచి, సోఫా మూలల్లో వెతకడం ప్రారంభించాను.

అంతలో డాక్టరుగారు మరో మూలకి వెళుతూ "ఆ ఫోనుకి రింగు ఇస్తాను. చూడు." అని ఆయన భార్యతో అంటూ తన ఫోన్లో నెంబరు నొక్కారు.

"అయ్యో రామా! ఆ పని ఓ గంట క్రితమే చేసాను. అది సైలెంట్ మోడ్ లో ఉందండీ!" శాంతిగారి మాటలు విన్న తర్వాత, దేని గురించి వెతుకుతున్నారో నాకర్ధం అయింది.

"ఓహో. ఫోనా!  అది లేకుండా బతుకులు గడవటం లేదు లేండి!"   అంటూ స్థిమితపడి ఓ నవ్వు నవ్వాను.

"నిజమే! వీధిలో ఆ కొరియర్ వాడు నించున్నాడా? వాడికి ఓటిపి చెపితే గాని,  ఆ మూట ఇవ్వడు. కూరలు ఆన్లో బుక్ చెయ్యాలి. దానికి ఓటిపి కావాలి. వీటన్నింటికీ ఆ  ఫోన్ నెంబరే ఇచ్చాం!" అంటూ డాక్టర్ గారు వెతుకులాటలో అలసిపోయి వచ్చి కూర్చున్నారు.

ఇంట్లో ఉన్న పనమ్మాయి, వంటావిడ.. ఆ పని మీదే ఉన్నారు.

ఈ లోగా, లోపల గదిలో ఉన్న బొమ్మల కొలువు చూసి,  సెల్ ఫోనులో  నాలుగు ఫోటోలు తీసి వచ్చి కూర్చున్నాం.

"ఇంట్లో ఏసి వెయ్యాలన్నా, ఆఫ్ చెయ్యాలన్నా ఆ ఫోనుతోనే చెయ్యాలి. ఇక టివి, ఇంటి తాళాల రిమోట్ కనెక్షన్లు కూడా ఆ ఫోన్లోనే ఉన్నాయి. మన చేతులు మనమే కట్టేసుకున్నాం!  ఇప్పుడు చూడండి? మొత్తం అన్ని సంబంధాలు కట్ అయ్యాయి!" అంటూ డాక్టరు గారు ఆ ఫోను గురించి చెప్పారు.

కాస్సేపు కబుర్లు అయిన తర్వాత "అయ్యా! నా రెండు విషయాలు చూసేస్తే, మేం బయలుదేరుతాం!" అన్నాను.

డాక్టరు గారి పక్కనే టీపాయ్ మీదున్న రెండు చిన్న మిషన్లు తీసి, వాటిని ఆన్ చేసారు.ఫోన్ పట్టుకుని "మీ ఫోన్ నెంబరు 9848629151 కదూ!" అంటూ ఆ నెంబర్లు నొక్కారు.

ఆయనేం చేస్తున్నారో నాకర్ధం కాలేదు.

"మీ ఫోన్ కి ఓటిపి వస్తుంది. అది చెప్పండి!" అంటూ, ఓ రెండు క్లిప్పులు చేతి వేలికి, మోచేతికి తగిలించారు.

"ఓటిపి నా?" ఆశ్చర్యంగా అడిగాను.

"అవును. కొత్తగా వచ్చాయి ఈ మిషన్లు. ఆసుపత్రిలో పేషంటు సెల్ నెంబర్ సిస్టమ్ లో కొట్టగానే, వాళ్ళ మెడికల్ హిస్టరీ వస్తుంది. వాళ్ళు నా దగ్గరకి వచ్చినప్పుడు, ఓటిపి చెపితే, నా సిస్టమ్స్ లో వాళ్ళ జీవితచరిత్ర వస్తుంది. ఈ కేసుషీట్లు, ప్రిస్క్రిప్షన్ల గొడవ ఉండదు! ఇక్కడ నా సెల్లో ఆ భాగవతం వస్తుంది అన్నమాట! మనలో మన మాట. క్లినిక్ లో ఫీజు కడితేగాని వాళ్ల కథ ముందుకు నడవదు కూడా!"  అంటూ డాక్టరు గారు స్కూల్లో పాఠం చెప్పినట్లు చెప్పారు.

"అంటే మనవి ఇక ఓటిపి బ్రతుకులన్నమాట!" అంటూ ఫోన్లో వచ్చిన ఓటిపి నెంబరు చెప్పాను.

"అన్నమాట కాదు, ఉన్నమాటే!" నవ్వుతూ అంటూ " మీ మెయిల్ కి ఈ టెస్టుల వివరాలు, ఫలితాలు, మందులు వగైరా వివరాలు వస్తాయి. అయితే మీవన్నీ కంట్రోల్లో ఉన్నాయిలెండి! వాడుతున్న మందులే వాడండి!" అంటూ డాక్టరుగారు కబుర్లలో పడ్డారు.

"హమ్మయ్య దొరికింది!" అంటూ శాంతిగారు ప్రశాంతంగా మా మధ్యకొచ్చి కూర్చున్నారు.

"అమ్మయ్యా. ఓ తీపి కబురు చెప్పారు!" అంటూ మా ఆవిడ శాంతిగారి వైపు చూసింది.

"ఓ తీపి కబురు కాదు, ఓ టిపి కబురు!" అంటూ డాక్టర్ భళ్లున నవ్వారు.

"నిజమే సుమండి! బొమ్మల కొలువు మధ్యలో బొమ్మలా కూర్చున్న సెల్‌ఫోన్ ని చూడగానే, నా బిపి, సుగరు కూడా నార్మల్ కి వచ్చేశాయిలెండి!" అంటూ శాంతిగారు ఓ నవ్వు నవ్వారు.

"అన్నట్టు కబుర్లలో పడి బయట ఓటిపిగాళ్ళను మర్చిపోయావు! వెళ్ళి సామానుని తనఖా నుండి విడిపించుకో." అంటూ డాక్టర్ గారు ఆమె వైపు చూసారు.

"ఇంకేం ఓటిపీ. పది నిముషాల్లో మాయమవుతుందిట. మళ్ళీ వ్యవహారం ముందుకొచ్చింది! కూర్చోండి వదినగారు. కాఫీ పట్టుకు వస్తా!"

"కాఫీకి ఓటిపి అక్కర్లేదా?" నవ్వుతూ అడిగింది మా ఆవిడ.

"ఆఁ ఆ రోజులూ వస్తాయి. కుక్కరు విజిల్ వేయకుండా, ఓటిపి వస్తుందిట, దాన్ని కుక్కర్ యాప్ లో కొడితే, కుక్కరు శాంతిస్తుందిట!"

కాసేపలా సరదాగా ఓటిపిల మీద కబుర్లు సాగాయి.

కాఫీలు తాగి, మరి కాస్సేపు కబుర్లు చెప్పుకుని బయటపడ్డాం.  వస్తూ, వస్తూ దారిలో వెంకటేశ్వర స్వామి కోవెల కనబడగానే, దర్శనం చేసుకుందామని స్కూటరాపి లోపలికి వెళ్లాం.

"స్కూటరుని నో పార్కింగు దగ్గర పెట్టారు. చూడండి! ఓటిపి రాగలదు!" అంటూ మా ఆవిడ సీరియస్‌గా చూసింది.

"స్కూటర్ మీ నాన్న కొనిచ్చారుగా. ఆయన ఫోన్ కి వెళ్తుందిలే!" కొట్టిపారేస్తూ నడిచాను.

"ఏడిసినట్టుంది!  ఆయన పైకెళుతూ, ఫోను పట్టుకు వెళ్ళలేదు! ఆయన నెంబరు మీరే వాడుతుఉన్నారుగా, మీకే వస్తుంది!" అనేసింది. విసవిసా ముందు నడుస్తూ. నాలిక్కరుచుకుని, ఆవిడ వెంట గుడిలోకి వెళ్లాను‌.

"ఎలాగూ పండగ రోజులే కదా! జనం కూడా అట్టే లేరు, పావుగంటలో అయిపోతుంది. అభిషేకం చేయించండి!" అంది మా అవిడ. 

కౌంటరు దగ్గరకి వెళ్ళి, అభిషేకానికి టిక్కెట్టు అడిగాను.  'మీ ఫోను నెంబరు, మీ పేర్లు, గోత్రం చెప్పండి సార్!" అంటూ నే చెప్పిన వివరాలను,  కౌంటర్లో ఉన్నతను ఎదురుగా ఉన్న సిస్టమ్ లో ఎంటర్ చేసాడు.  డబ్బులు తీసుకుని "మీ ఫోనుకి ఒటిపి వస్తుంది. అక్కడికి వెళ్ళి పూజారిగారికి అది చెప్పండి! అభిషేకం చేయిస్తాడు!" అంటూ అతను సెల్లో మునిగిపోయాడు.

"హతవిధీ!" అనుకుంటూ గర్భగుడి వైపు వెళ్ళాను.

"అభిషేకం చేయించండి!" తలమీద శఠగోపనం చేస్తున్న పూజారితో అన్నాను.

"ఓటిపి చెప్పండి!" అంటూ అతను సెల్ ఫోన్ లో మునిగిపోయాడు.

నా నెంబరు చెప్పగానే, దాన్ని ఆయన చేతిలో ఉన్న సెల్లో నోట్ చేసాడు.   అంతే. అక్కడున్న మైకులో ముందుగా డప్పులు, జేగంటలు వినిపించి "శుక్లాంబరధరం విష్ణుం!" అంటూ ప్రారంభమైన అభిషేకం నా పేరు, గోత్రంతో పాటు, నాలా టిక్కెట్లు తీసుకున్న వారందరి పేర్లు, గోత్రాలతో సహా,  పూర్తిగా పూజా విధానం మైకులో వచ్చేసింది.

నాకు ఆశ్చర్యం కంటే అసహనం ఎక్కువైపోయింది.

"అయ్యా తీర్థ ప్రసాదాలు మీరిస్తారా? దానికీ ఓటిపి చెప్పాలా?" అంటూ పూజారిని చిరాగ్గా అడిగాను.

"ఆ ఉద్యోగం మాకింకా ఉంచార్లెండి!" అంటూ తీర్థ ప్రసాదాలు ఇచ్చాడు.

అవి తీసుకుని వెళ్ళబోతూ, "ఈ అభిషేకం చేయడం వలన మాకొచ్చే పుణ్యం, పాపాల పాయింట్లు ఎస్ఎమ్ఎస్ లో వస్తాయా సార్!" అంటూ వెటకారంగా అడిగాను.

"లేద్సార్. యమలోకంతో కనెక్టివిటీ ఇంకా రాలేదు!" అంటూ మరోసారి శఠగోపనం చేసాడు.

నా నోట్లో ఉన్న కొబ్బరి ముక్క గొంతుకలో అడ్డం పడింది!

*****

bottom of page