top of page

సాహిత్యం - కొన్ని ఆలోచనలు

మన కథాస్రవంతి

panini.PNG

పాణిని జన్నాభట్ల

manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
adhyatmika.jpg
pustaka-parichayaalu.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
alanati.jpg
paatasanchikalu.jpg
samputi.jpg
maagurinchi.jpg
rachanalu.jpg

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

ఎక్కడో పర్వతాల్లో ఉద్భవించి, కొండల నుంచి కిందకురికి, అడ్డుగోడలనెదిరించి, ఉధృతంగా ప్రవహిస్తూ అనాదిగా తనకంటూ ఒక అస్తిత్వాన్ని

నిలబెట్టుకుంటూ వస్తున్న జీవనది, పయనంలో కొంత దూరం వచ్చాక తన పౌరుషాన్ని మమకారంగా మార్చుకుంటుంది. తనకోసం తహతహాలాడే జనాల, జీవాల కోసం తనను తాను మలచుకొని వాగులుగా, వంకలుగా మారి వాళ్ళకి దగ్గరవుతుంది. పిల్ల కాలువై అది కొందరి కడుపు నింపితే, జలపాతమై మరికొందరి మనసు నింపుతుంది. అయినా అది సంతృప్తి చెందదు. మనకి ఇంకా దగ్గరవ్వాలనే ప్రయత్నంలో తనను తాను కొంచెం కొంచెంగా కోల్పోయి ఒక్కోసారి ‘ప్యాకేజ్డ్ వాటర్’ గా మారుతుంది, రంగు పులుముకుని ఇంకో సారి ‘కోక్ టిన్’ ల లోకి చేరుతుంది. ఎలా మారినా, ఎవరు మార్చినా చివరికి అది మనల్ని చేరుతుంది, మనలో నిండుతుంది, తన ఆత్మలో మనల్ని నింపుకుంటుంది. మన గొంతు తడపడమే తన ఆనందమని చాటిచెబుతుంది.

 

మన తెలుగు కథ కూడా సమయమనే మార్గంలో అలాంటి పయనమే చేస్తోందని నా భావన. ప్రాచీన నీతి కథలూ, ఇతిహాసాల అనువాదాలతో ప్రారంభమైన ఆ సాహితీ ప్రవాహం గత వందేళ్ళల్లో నవలలూ, కథానికలనే మలుపులు తిరిగి ఎందరో అద్భుతమైన రచయితలనూ, సాహిత్యాన్నీ సృష్టించుకొని ఒక బంగారు శకాన్ని దాటింది. గత ముప్ఫై ఏళ్ళగా దృశ్య మాధ్యమాల ప్రాధాన్యం పెరగడంతో సినిమాలూ, సీరియళ్ళగా మారి మౌనంగా తన పాఠకులనే, ప్రేక్షకులుగా మార్చుకుంది. మన టీవీలలో, థియేటర్లలో, యూట్యూబ్ లో, వెబ్ సిరీస్ లలో చివరికి న్యూస్ ఛానెళ్ళలో ప్రవహిస్తోందీ, ఒదిగిపోయిందీ ఆ కథే. వెల్, మనల్ని విడిచి ఉండలేక రూపాంతరం చెందిన‌ కథ!

 

మనం ఎంతదూరం పెట్టినా తనని ఆపలేరని ఛాలెంజ్ విసురుతుంది మన కథ. నా దగ్గర చదవటానికి టైం లేదన్న వాళ్ళని వెక్కిరిస్తూ పాడ్ క్యాస్ట్ రూపంలో వినిపిస్తుంది. నీకు పది నిమిషాలకన్నా ఇవ్వలేనని విసుక్కునే టిక్ టాక్ జనరేషన్‌కి సహనంగా చిన్న కథ, ఫ్లాష్ ఫిక్షన్ లాంటి ‘స్నాకబుల్’ కంటెంట్ ని రెడీ చేస్తుంది. పుస్తకం చదివే అలవాటే లేదనే ఛాటింగ్ రాయుళ్ళని వాట్సాప్ కథలతో, ఫేస్ బుక్ కోట్స్ తో పలకరించి పోతుంది. ఒక్కోసారి పిల్లలు విచిత్రంగా అల్లే మాటల్లో, భర్త భార్యకు చెప్పే కొంటె అబద్ధాల్లో, రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యల్లో కూడా తొణికిసలాడి మనందరిలోనూ ఓ కథకుడున్నాడని నిరూపిస్తుంది. ముందు అన్నట్టు, ఎలా మారినా, ఎవరి ద్వారా వినిపించినా మనకి చేరాలనే ఏదో తహతహ! 

 

ఓ సారి పతంజలి శాస్త్రి గారి ఇంటర్వ్యూలో విన్నట్టు గుర్తు. ఆయనొకరోజు వాళ్ళ గురువుగారితో “తెలుగు సాహిత్యం నాణ్యత నానాటికీ పడిపోతోందండీ” అని బాధపడితే, ఆ గురువుగారడిగారట “ఎక్కడి నుండి?” అని! నిజమే, మనుషుల నుంచి పుట్టే కథలు వాళ్ళలాగే విభిన్నంగా ఉంటాయి. ఇలానే ఉండాలన్న బెంచ్ మార్కులుండవు సాహిత్యంలో. ఆ మాటికొస్తే ఏ ఆర్టులో కూడా. కొన్ని కథలు చాలా మందికి నచ్చి కాలంతో పాటు నిలిచిపోవచ్చు. కొన్నిటిని ఒక సామాజిక వర్గం హృదయానికి హత్తుకోవచ్చు, మరికొన్నిటిని ఒక వయస్సువారే ఆదరించచ్చు. మనుషులనెలా కంపేర్ చెయ్యలేమో వాటినీ అంతే, వాటినుండి పుట్టిన సినిమాలనూ అంతే. 

 

ప్రస్తుతం తెలుగు కథకొచ్చిన పెద్ద ప్రమాదం - తెలుగు భాష చదివగలిగేవాళ్ళు అలార్మింగ్ రేట్ లో తగ్గడమే. తెలుగు మూవీలని సబ్ టైటిల్స్ తోనో, అర్ధం‌ అయ్యీ అవ్వని డైలాగ్స్ విని గడుపుకొచ్చే కొత్త తరాలు, చదవటానికొచ్చేటప్పటికి చేతులెత్తేస్తున్నాయి. బలభద్రపాత్రుని రమణి గారు ఆమె రాసిన మామూలు తెలుగు పదాలు కూడా అర్ధం చేసుకోలేక, ఈ గ్రాంధిక పదాలు మార్చాలని డిమాండ్ చేస్తున్న నవతరం రైటర్స్ గురించి ఓ సభలో బాధపడ్డారు. తెలుగు చదవడమే రాకపోతే అక్షరరూపంలో ఉన్న తెలుగు కథ గతేంటి?! కొంతకాలానికది దృశ్యమాధ్యమంగా మాత్రమే బతికుంటుంది. స్కూళ్ళల్లో చిన్నప్పటినుండీ తెలుగు మాధ్యమంగా చదువుచెప్తే మాత్రమే ఇది సాధ్యమౌతుంది.

 

చివరిగా, తెలుగు రచయితల గురించి. రెండేళ్ళ ముందు వరకూ రాసేవాళ్ళు బాగా తగ్గిపోయారకునేవాణ్ణి. తర్వాత కొంచెం లోతుగా పరిశీలిస్తే, ప్రపంచంలో కొన్ని వందలమంది రచయితలున్నారని తెలిసి విస్తుబోయాను, ఇంకా పోతూనే‌ ఉన్నాను. అదొక ప్రపంచం, అందులో జొరబడితే కానీ సాక్షాత్కరించని ప్రపంచం. రచయితలకేమీ ఢోకాలేదనీ, కొత్త కొత్త ప్రయోగాలు చేసేవారికీ కొదవలేదనీ అర్ధమైంది. ఇది ఇంకా పెరగాలి, కేవలం ‘లిటెరరీ ఫిక్షన్’ , ‘ప్రేమ కథలు’ మాత్రమే కాకుండా కొత్త జానెర్ లలో రాసే సామర్ధ్యం పెంచుకోవాలి. నవలల నుంచి మళ్ళీ మూవీలు తీసే స్థాయికి తీసుకెళ్ళగలిగితే చదవటం మీద మళ్ళీ ఇంటెరెస్ట్ పెరుగుతుంది. దీనికి మొన్న దర్శకుడు క్రిష్ గారు తీసిన ‘కొండపొలం’ ఓ ఉదాహరణ. 

 

ఇకపోతే, కొత్తవారిని ఆదరించి కథలని ప్రచురించే మ్యాగజైన్ ఎడిటర్ లు ఎంతో మంది ఉన్నా, 'కంటెంట్ క్యూరేటర్స్' గా వాళ్ళు నిర్వర్తించాల్సిన బాధ్యత వల్ల అందరి రచనలూ స్వీకరించలేకపోవచ్చు. దీంతో వేచి చూసీ, చూసీ విసుగెత్తిన చాలా మంది రచయితలు తిరగబడి ప్రతిలిపి, కహానియా వంటి 'సెల్ఫ్ పబ్లిషింగ్' ఆప్స్ లో స్వేచ్ఛగా తమ రచనలు పబ్లిష్ చేసుకుంటూ వేలల్లో పాఠకులని సంపాదించుకుంటున్నారు. ఇదీ ఒక మంచి పరిణామమే. కాకపోతే దీంతో కథకి వచ్చిన పెద్ద చిక్కు - 'కంటెంట్ ఎక్స్ ప్లోషన్'. కోకొల్లలుగా వచ్చి పడుతున్న ఈ కథలలో, సిరీస్ లలో ఆణిముత్యాలని వెతకలేక అలిసిపోయి దొరికిన వాటితో సరిపెట్టుకుంటున్న  పాఠకులు కొందరైతే, తమకోసం రెడీగా  ఫిల్టర్ చేసిపెట్టిన మ్యాగజైన్ కథలవైపే మళ్ళీ పరిగెడుతున్న వారు మరికొందరు. 

 

సరిగ్గా చూస్తే కథ మనల్నెప్పుడో కమ్మేసింది, మనం గుర్తు పట్టలేని రూపాల్లో మన చుట్టూనే తిరుగుతోంది. చూద్దాం, కాలాన్ని బట్టీ, మనుషుల స్వభావాన్ని బట్టీ తెలుగు కథ ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో!

*****

bottom of page