top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
adhyatmika.jpg
pustaka-parichayaalu.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
alanati.jpg
paatasanchikalu.jpg
samputi.jpg
maagurinchi.jpg
rachanalu.jpg

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

కథా​ మధురాలు

కలవరమాయే ‘మదిలో’

 

పాణిని జన్నాభట్ల

panini.PNG

చాలాసేపటి తర్వాత మెల్లగా తెరవమని‌ చెప్పాను‌‌ కళ్ళని. ఎప్పటిలాగే పక్కనున్న‌ టేబుల్ ‌మీదున్న మొబైల్ తీసుకోమన్నాను చేతిని. 

"ఈ గొడవలు భరించలేను. మాట్లాడాలి నీతో! - మనోజ్"‌

మొబైల్ చూసి కళ్ళు‌ పంపిన‌ సందేశం.  ఒక్కసారి‌ నా‌ నిద్రమత్తంతా వదిలింది. పనిలోకి‌ దిగాను. గుండెని యాభై సార్లు ఎక్కువ కొట్టుకోమన్నాను. అది‌ నన్ను తిట్టుకుంటూ వేగం పెంచింది. ఊపిరితిత్తులకి ఒక‌ రెండు సెకన్లు శ్వాస‌ తీసుకోవద్దన్నాను. కళ్ళని కన్నీళ్ళు రెడీగా ఉంచుకోమని చెబుతూనే, తొందరపడి కార్చొద్దనీ చెప్పాను. ఇంకేదో మర్చిపోయాను..ముఖం! రక్తం ఎక్కువ ప్రవహించాలి ముఖంలోకి. ఎరుపెక్కాలి. ఇప్పుడు టైప్‌ చెయ్యమని చెప్పాను చేతి వేళ్ళకి - "ఇక నా వల్లా‌ కాదు. మధ్యాహ్నం లైబ్రరీ వెనక కలుద్దాం!"

 

ఫోను‌ కిందకి దించుతుండగానే చెవులు ఒక‌ పెద్ద అరుపుని మోసుకొచ్చాయి.

"నళినీ, ఎంత సేపు‌‌ ఆ రూంలోనే కూర్చుంటావ్, బైటికి రా" నళిని నాన్న. నాక్కూడానా? తెలీదు. ఏదో ఒకటి చెయ్యాలి తొందరగా. కాళ్ళకి‌‌ పరిగెత్తమని‌ చెప్పి, తలుపులు తియ్యమన్నాను చేతిని. కళ్ళని‌ మాత్రం ఎట్టి పరిస్థితిలో తన వైపు చూడద్దన్నాను. "ఫోర్త్ ఇయర్ ఈ సారైనా కంప్లీట్ చేస్తావా? పరువుపోతోంది నీ వల్ల"‌ చెవి‌ నుండి.

"ఏమైనా చెప్పనా?" అని‌ అడిగింది‌ నోరు. నోరు మూసుకోమన్నాను. ఏముంది చెప్పడానికి? అసలేమన్నా చదివితే‌ కదా.‌ అంతా మనోజ్ ధ్యాసే. 

"ఓ పక్క గొంతు‌చించుకుని అరుస్తుంటే రాయిలా నిలబడతావే. మెదడు లేదు నీకసలు" మళ్ళీ అరుపు. నాకు మండింది. ఇంత చాకిరీ చేస్తుంటే నేను లేనంటాడేంటి? పని చేయడం మానేస్తే గొడవొదిలిపోతుంది. కానీ నళిని‌ మీద జాలేసింది. నేను లేని తనని ఊహించుకోలేను. నాన్న వెళ్ళిపోయాడని‌ కళ్ళు చెప్పడంతో రిలాక్స్ అవ్వమన్నాను బాడీని.

 

అప్పుడే పొట్ట నుంచి సిగ్నల్స్ మొదలయ్యాయి. "నా‌ గురించి పట్టించుకోవట్లేదు నువ్వసలు. నిన్నటి నుంచి ఖాళీగా ఉన్నాను"

ఎవడు ఎటు పోయినా దీని గొడవ దీనిదే. ఇప్పుడే కాదు కొంచెంసేపు ఆగమన్నాను.‌

 

"ఏమయిందే​? కళ్ళేంటి‌ అలా‌ ఉన్నాయి. నిద్ర పోలేదా? ఆ‌ అబ్బాయి‌తో గొడవా?" - చెవి నుంచి. తియ్యగా ఉందా గొంతు. కళ్ళు‌ కూడా "అమ్మే" అని నిర్థారించాయి. 

 

ఉన్నట్టుండి నన్నొక నల్లటి పొగ ఆవరించింది. మనసు! దాన్ని గుర్తు పట్టి ఆపే లోపే అది నన్ను చుట్టుముట్టింది. ఒళ్ళంతటినీ స్వాధీనం చేసుకుంది. ఓడిపోయాను. మళ్ళీ తెలివి వచ్చి చూసేటప్పటికి, అమ్మని పట్టుకొని ఉన్నాయి చేతులు. కన్నీళ్ళ ధారలు చెంపలమీద పడుతున్నట్టు చెప్తోంది‌ చర్మం. చూస్తే మనసు నన్ను వదిలి ఓ పక్కకి వెళుతోంది. 

"బుద్ధి లేదు‌ నీకు. నీ వల్లే నళినికీ కష్టాలన్నీ" తిట్టాను దాన్ని. 

"నీ కర్థం కాదు. నువ్వొక యంత్రానివి" అదీ తిట్టింది.

"నేను లేకపోతే ఏ పనీ జరగదు తనకి. నీ వల్లే ఏ ఉపయోగం లేదు"

"నేనుంటేనే తననో మనిషిగా గుర్తిస్తారు"

"నీతో మాట్లాడి టైం వేస్ట్"

"నాక్కూడా. నువ్వేం చేసినా సరే, నేను రావలసినప్పుడు వస్తాను. నన్నాపలేవు"

"ఇలా వచ్చే ఆ మనోజ్ ని తీసుకొచ్చావు నళిని‌ జీవితంలోకి. ఇప్పుడు ప్రతి దానికీ నేను సంజాయిషీ వెతకాల్సి వస్తోంది"

తనేం మాట్లాడలేదు. వెళ్ళిపోయింది. అదెప్పుడూ అర్థం‌ కాలేదు‌ నాకు. 

 

తలలోని నరాలన్నీ ఏదో పెద్ద బరువుని మోస్తున్నట్టు బాధపడుతున్నాయి. పొట్టనుంచి‌ మళ్ళీ అరుపులు. లాభం లేదు. కాళ్ళని డైనింగ్ టేబుల్ వైపు వెళ్ళమన్నాను. నాకు బాగా ఇష్టమైన వంటకపు వాసనేదో పంపింది ముక్కు. బ్రేక్ ఫాస్ట్ తింటానికి రెడీగా ఉన్నానని నాలుక తొందర పెట్టింది. ‘సరే’ అన్నాను. నోరు చకచకా తన పని చెయ్యడం మొదలు పెట్టింది. ఓ రెండు నిమిషాల తర్వాత ఒంట్లోంచి సిగ్నల్సేమీ రాలేదు. పొట్టలో ప్రశాంతత. ఇంతలో నా మెమరీ మాడ్యూల్ ముందుకొచ్చి మనోజ్ తో ముందురోజు జరిగిన‌ గొడవంతా రీప్లే చెయ్యడం మొదలుపెట్టింది. 

"నీకు జాబ్ వచ్చాకే ఇంట్లో చెప్పి ఒప్పిద్దాం" అని చెప్పాను తనతో. దాంట్లో పెద్ద తప్పేమీ కనబడలేదు. తను ఊరికే అరవడం మొదలు పెట్టాడు. ఇంకొంచెం  వెనక్కెళ్ళి నళిని మనోజ్ తో ఆనందంగా గడిపిన‌ క్షణాలనీ, రోజులనీ ప్లే చేస్తోంది మెమరీ. ఎవరడిగారు దీన్ని‌ ఇప్పుడివన్నీ? దూరంగా మళ్ళీ మనసు తొంగిచూస్తోంది‌ నా వైపు. ఏం జరగబోతోందో అర్థమైంది. 

దీని ఆట ఈ సారి సాగనివ్వను! 

 

వెంటనే ఎడమ చేతికి పని చెప్పాను మొబైల్ తీసుకోమని. 

"స్వైప్ చెయ్యి, ఆ గ్రీన్ యాప్ మీద నొక్కు" ఆజ్ఞాపించాను. 

అంతే, ఒక్క‌ క్షణంలో ఇంకో ప్రపంచంలోకి మారినట్టుంది. నాలో డోపామైన్ కట్టలు తెగిన జలపాతంలా ప్రవహిస్తోంది. ఇష్టమైనవి‌ చూస్తే అంతే అది. పరవళ్ళు‌ తొక్కుతుంది. వాట్సాప్ మెసేజ్ లు చూస్తుంటే ఒంటరిగా ఒక వీధిలో నడుస్తున్నట్టుంది నాకు. ఒక ఇంట్లో పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అటు తిరిగి "హ్యాపీ బర్త్ డే" అని బిగ్గరగా అరిచాను‌ నవ్వుతూ. పక్కింట్లోనే మరణవార్త! చిన్న పిల్లలు నా‌ వైపు దీనంగా చూస్తున్నారు. దుఃఖం కట్టలు తెంచుకుంది. ఇంతలో పెద్దగా నవ్వులు వినిపిస్తే వెనక్కి తిరిగాను. నా‌ ఫ్రెండ్స్ అంతా ఏదో‌ వీడియో చూస్తూ నవ్వుతున్నారు. అదేంటో‌ చూడలేదు కానీ ఓ నవ్వు ముఖం విసిరాను వాళ్ళ వైపు. దూరంగా ఆర్తనాదాలు‌ వినబడ్డాయి. కంగారుగా అటువైపు నడిచాను. తుఫాన్‌ వల్ల వందల మంది చనిపోయారు. పసిపిల్లలు రోడ్డు మీద దీనంగా తిరుగుతున్న దృశ్యాలు. నాకు తెలీకుండానే మనసు ఆవహించింది, ఏడిపించింది. ముందుకు నడుస్తున్నాను. ఒక చోట కొంతమంది భక్తులు దేవుడి మహిమల గురించి‌ చెప్తున్నారు‌, వీకెండ్ ప్లానింగ్ గురించి సతమతమౌతున్నారు ఇంకొందరు. నేను స్పందించటం మానేసాను. ఏమీ చేయలేని, రియాక్షన్ లేని ప్రేక్షకురాలిలా ముందుకి సాగిపోతున్నాను. ఆ వైరాగ్య స్థితిలో ఎంతసేపు గడిపానో తెలీదు. దూరంగా ఒక‌ అరుపు వినబడింది.

"బుజ్జీ! తొందరగా రెడీ అవ్వవే కాలేజీకి" అని. ఒక్కసారి పొగమంచు వెలసినట్టుగా ఆ వీధీ, ప్రపంచం మాయమైయ్యాయి. ఎవరో విసిరేసినట్టు వేగంగా మళ్ళీ డైనింగ్ హాల్లోకి వచ్చి పడ్డాను. కళ్ళ ముందు అమ్మ!  అదే  చెప్పాయి కళ్ళు.

***

 

"కాలేజ్ కి ఇంకా రెండు గంటలుంది. క్లాస్ అసైన్మెంట్ పూర్తి చెయ్యాలి" మెమరీ మాడ్యూల్ తన బాధ్యతగా చెప్పింది. 

"చెయ్యకపోతే ఏమౌతుంది?" 

"తిట్లు పడతాయి. చెయ్యక తప్పదు" నాలో నేనే‌ వాదన. పుస్తకం తీస్కోని‌ చూడమన్నాను కళ్ళని. ఒక్క‌ నిమిషం చదివిందో లేదో, మెమరీ‌ వచ్చి‌ వాట్సాప్ ప్రపంచంలో చూసిన‌వన్నీ నా స్క్రీన్ మీద ఫ్లాష్ చెయ్యటం మొదలుపెట్టింది. "దీనికసలు బుద్ధి లేదు. ఎప్పుడేం చేస్తుందో తెలీదు". దాన్ని బలవంతంగా నెట్టలేను, పుస్తకం నుంచి‌ కళ్ళు మోసుకొస్తున్న‌ విషయాల్ని‌ చదవలేను. ఉన్నట్టుండి లాజిక్ సర్క్యూట్ నుంచో సలహా - "మ్యూజిక్ విను” 

చేతుల్ని "ఫోకస్ మ్యూజిక్" కోసం వెతకమన్నాను‌ మొబైల్ లో. అది ప్లే చెయ్యగానే నా‌ చెవిలోంచి ప్రవాహంలా వచ్చాయి ఎలెక్ట్రికల్ సిగ్నల్స్‌. నా చుట్టూ పరుచుకుని గార్డ్ చేస్తున్నాయి. మెమరీని బలవంతంగా బైటకి నెట్టాయి. అది చిన్నబుచ్చుకుని కనపడకుండా పోయింది. ఇదే అదను. కళ్ళు, చేతుల్ని కలిపి హడావిడిగా అసైన్మెంట్ పూర్తిచేయించాను. 

 

నళిని బయటకి కదలాలంటే వంద పనులు చెయ్యాలి నేను. మ్యాచింగ్ డ్రెస్స్, మేకప్ అన్నీ అయితే కానీ కాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వను. ఒక్కోసారి ఇదంతా ఎందుకనిపిస్తుంది. నళిని ఫ్రెండ్స్ తనని చూసి మెచ్చుకున్నప్పుడూ, అసూయపడినప్పుడూ నేను‌ చేసేదే కరెక్ట్ అని నిర్ధారించుకుంటూ ఉంటాను. 

 

అంతా అయ్యి హాల్లోకి అడుగుపెట్టాక కళ్ళు తెచ్చిన బ్యాడ్ న్యూస్ - నళిని నాన్న! అక్కడే ఉన్నాడు పేపర్ చదువుతూ. నా లాజిక్ సర్క్యూట్ రంగంలోకి దిగింది. అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో, ఏ ప్రశ్నకి ఎలా‌ సమాధానం చెప్పాలో అన్ని వివరిస్తోంది. అకస్మాత్తుగా చెవి నుంచి "బీటెక్ విద్యార్థినికి రెండు కోట్ల ప్యాకేజీ ఇచ్చిన గూగుల్ సంస్థ"

చచ్చాను!

లాజిక్ సర్క్యూట్ చక‌చకా ముందు ఇలా జరిగిన సంభాషణలన్నీ అనలైజ్ చేసి‌ చెప్పింది "కావాలనే తను పైకి చదువుతున్నాడు. నిన్నిప్పుడు తిడతాడు. నువ్వసలు పట్టించుకోకు!" 

"రెండు కోట్లు కాదు కనీసం రెండు లక్షల ఉద్యోగమైనా సంపాదించవే. మన తెలివితేటలకి అంతకన్నా ఎక్కువ ఆశల్లేవు నాకు" మళ్ళీ చెవి నుంచి.

తలంతా ఊగిపోతున్నట్టనిపించింది. నా‌లోనే‌ ఎన్నో చీకటి కోణాలు, మూసి ఉన్న తలుపులు. వాటిని తెరిపించే ప్రయత్నం ఎవరూ చెయ్యరు. కనీసం నాకు మార్గం చూపరు. గంటలు గంటలు చదవమంటారు. అదొక్కటే తలుపు వీళ్ళకి తెలిసింది. లాజిక్ సర్క్యూట్ చెప్పినవన్నీ బేఖాతరు చేశాను. నోటికి ఇది‌ చెప్పమన్నాను "నా టాలెంట్ సింగింగ్ నాన్నా, అది మీరు ఎంకరేజ్ చెయ్యలేదు చిన్నప్పుడు. ఇప్పుడెవరితోనో‌ వేరే విషయంలో కంపేర్ చేస్తున్నారు. ఇదంతా మీ తప్పే"

నోరు తెరిచి చెప్పబోయింది.

లాజిక్ సర్క్యూట్ ఒక్క ఉదుటున ముందుకి దూకి తిట్టింది "బుద్ధిలేదా, ఇంత చెప్పి వేస్ట్‌ నీకు. ఆపు అర్జెంట్ గా నోటిని"

తెలివిలోకి వచ్చాను. హఠాత్తుగా నోటికి వేరే సిగ్నల్ పంపాను - "సరే నాన్నా"‌ అని చెప్పు.

నోరు తెల్లబోయి‌ మాటమార్చింది తడబడుతూ.

ఓ నిమిషం పాటు అంతా నిశ్శబ్దం. చెవి‌ నుంచి నో మెసేజ్.‌ హమ్మయ్య. కాళ్ళకి పని చెప్పాను. ఉన్నట్టుండి తనకి గాలీ, ఎండా తగులుతున్నాయని ధ్రువీకరించింది చర్మం. బైటపడ్డాను.

 

***

 

కాలేజ్‌ లోపల‌ నడిపిస్తున్నాను నళినిని.  మళ్ళీ మెమరీ వచ్చి‌ మనోజ్ తో  ఉన్నప్పటి జ్ఞాపకాలని చూపించడం మొదలు పెట్టింది. ఆ క్యాంటీన్ లో కాఫీ తాగుతున్న సాయంత్రాలూ, కంప్యూటర్ ల్యాబ్ లో కూర్చుని చెప్పుకున్న కబుర్లూ, లైబ్రరీలో పుస్తకాల కన్నా ఒకళ్ళనొకళ్ళు ఎక్కువగా చూసుకున్న మధ్యాహ్నాలూ హఠాత్తుగా కారిడార్ లో  మనోజ్ కనపడ్డాడని చెప్పాయి కళ్ళు. తను తిడుతున్న, ఛీ కొడుతున్న, ఏడిపిస్తున్న దృశ్యాలు నా మెమరీ స్క్రీన్ మీద. “మా‌ మధ్య దూరం‌ ఎందుకు పెరిగింది?” అడిగాను లాజిక్ సర్క్యూట్ ని. మౌనంగా ఉందది. "నన్ను చెప్పమంటావా?" అడిగింది మనసు దూరం నుండి. అవసరం లేదన్నాను.

 

ఉన్నట్టుండి బాడీలో అన్ని భాగాలూ‌ కదిలి‌పోతున్నాయని సంకేతాలు పంపిస్తున్నాయి. రివ్వున గాలి తగులుతోంది‌ అన్నిటికీ. నళిని చేతిని బలంగా లాగుతున్నారెవరో. స్పర్శ చెప్తోంది మనోజేనని. లైబ్రరీ వెనక స్థలంలో ఆగినట్టు చెప్పాయి కళ్ళు‌. 

"ఏంటా మెసేజ్? నన్ను భరించలేవా?" తిడుతున్నట్టు వచ్చింది తన మాట. 

"నేను మొదలుపెట్టలేదు" 

సమాధానాలు రెడీగా ఉన్నాయి నా‌ దగ్గర.

"ఏంటి నీకా పొగరు?"

"గుర్తుందా? నా‌ పొగరు చూసే ఇష్టపడ్డానన్నావ్ మొదట్లో"

"నాకు ఉద్యోగం లేకపోతే నీకు అవమానమా? ఇంట్లో మన గురించి చెప్పవా?"

"చెప్పలేను, మా‌ నాన్నకి నేనో పెద్ద ఫెయిల్యూర్ లా కనిపిస్తాను, నీ గురించి‌ చెప్పి ఇంకో ఫెయిల్యూర్ ని‌ పరిచయం చెయ్యలేను"

"నువ్వు లిమిట్స్ దాటుతున్నావ్, ఇవాళ కాకపోతే రేపొస్తుంది నాకు ఉద్యోగం"

"నాకు అనుమానమే"

హఠాత్తుగా వచ్చిందో పెద్ద శబ్దం. చెవినుంచి రింగులు తిరుగుతూ నన్ను తాకుతోంది. కళ్ళ చుట్టూ చీకటి. నా చుట్టూ ఉన్నవన్నీ ప్రకంపిస్తున్నట్టు తెలుస్తోంది. నా పరిస్థితి‌ చూసి వెన్నెముక నా‌ బాధ్యత తీసుకుంది.  రెండు చేతులనీ‌ చెంపలమీదకి‌ తెచ్చుకొని కాపాడుకోమని చెప్పింది. చెంపకింది కండరం బాధగా సిగ్నల్స్‌ పంపినప్పుడు తెలిసింది. అతను కొట్టాడని!

 

మనసు నన్ను కమ్ముకుంటోంది. ఏడవమని ఆజ్ఞలివ్వటం మొదలుపెట్టింది‌ కళ్ళకి. లేదు. జరగనివ్వను. ఒక‌ మెరుపు. నా చుట్టూ ఏదో శక్తి. ముందెప్పుడూ పంపని గట్టి సందేశాన్ని పంపాను చేతికి. దాన్ని చూసి మనసు, లాజిక్ సర్క్యూట్ అదిరిపడ్డాయి. ఇంకోసారి ఆలోచించమన్నాయి. ఎవరి మాటా విననివ్వట్లేదా శక్తి. చెయ్యి లేచింది, మనోజ్ చెంప‌ చెళ్ళుమనిపించింది.‌

కొన్ని క్షణాలు శరీరంలో అణువు కదల్లేదు. అవయవాలన్నీ స్తంభించాయి.

 

మనసు తిడుతోంది. జీవితాల్ని పాడుచేస్తున్నావంది. నేను పట్టించుకోలేదు. కాళ్ళని మెల్లగా వెనక్కి నడవమన్నాను. మనోజ్ కి దూరంగా, క్లాస్ కి దగ్గరగా.

 

లాజిక్ సర్క్యూట్ నన్ను మెచ్చుకుంటోంది. నళిని నవ్వుతున్న ముఖాన్ని నా స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేస్తోంది మెమరీ.

*****

bottom of page