top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
adhyatmika.jpg
pustaka-parichayaalu.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
alanati.jpg
paatasanchikalu.jpg
samputi.jpg
maagurinchi.jpg
rachanalu.jpg

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

కథా​ మధురాలు

న్యాయ సమీకరణాలు

 

ఓలేటి శశికళ

sasikala.JPG

“ అయ్యో! అయ్యయ్యో! ప్చ్! ఎంత ఘోరం! దేవుడున్నాడండి! అయినా పాపం మరీ ఇలానా!”.  టీవీ ముందు నేరాలూ-ఘోరాలూ ప్రోగ్రామ్  చూస్తూ, ఆ అపరాధ పరిశోధనలో పూర్తిగా లీనమైపోయి, ఆ ఘోర అన్యాయాలకు తీవ్రంగా ప్రతిస్పందిస్తూ, నేనిచ్చే ఈ శబ్ద ప్రతిక్రియలంటే మా ఆయనకు మహాచికాకు!

 

“ పిచ్చిగోల!”  అంటూ లేచి వెళ్ళిపోబోతుంటే, “ ఓయ్! ఒకసారి చూడండి ఇక్కడ! మీ పండు మామయ్య కొడుకులా లేడూ?! లేడూ ఏవిటి  అతనే! పాపం ఘోరమండీ. మొగుడూ, పెళ్ళాలను  ఇద్దరినీ చంపేసారు. పేరు మార్చుకుంటే మాత్రం, మనిషి మారతాడా! ఖచ్చితంగా అతనే!”.  అంటూ నేను రిమోట్ ఊపేస్తూ, నిర్ధారిస్తుంటే  మా వారు ఒక్కక్షణం ఆగి, వెనక్కి చూసారు!

 

ముభావి కదా! ముక్తసరిగా ” ఊ! వాడిలాగే ఉన్నాడు! అయ్యో! పిచ్చివెధవ! వాడు పోతే పోయాడు. పాపం ఆ కట్టుకున్న పిల్ల?  అవునూ  వాడికి పెళ్ళయిందా?!”  అంటూ లింకుల్లేని కొన్ని మాటలు అనేసి  కనీసం కారణం కూడా తెలుసుకోకుండా చెప్పులేసుకుని, బయటకెళ్ళిపోయారు.

 

తోచనప్పుడల్లా  వాకింగ్ పేరిట, వీధులు కొలవడం ఆయనకు అలవాటు. అసలు కుటుంబమే కాస్త తేడా అనిపిస్తుంది నాకు! ఇప్పుడు ఏ పార్కులోనో కూర్చుని, యూ ట్యూబ్ అంతా శోధించి, తెలుసుకుంటారన్న మాట  ఈ వార్త! నాతో చర్చించడం నామోషీ! పోయింది స్వయానా మేనత్తకొడుకు మరి!

 

ఆది ముందు మనం ఈ పండు మామయ్యగారి గురించి చెప్పుకోవాలి. పండుమామయ్య ఉరఫ్ పాండురంగారావుగారు  మావారి తాతగారి హయాంలో, మావారి ఏకైక మేనత్తను పెళ్ళిచేసుకున్న ఇల్లరికపు అల్లుడు. నా పెళ్ళికి ముందే, మా మావగారి హయాంలో, మరి ఏదో అప్రాచ్యపు పని చేసారని  సొంత చెల్లినీ, పండుమామయ్యనీ, వాళ్ళ ఒక్కగానొక్క కొడుకునీ  చండప్రచండ కోపంతో పెట్టెలు బయటకు విసిరేసి, “మళ్ళీ గుమ్మం ఎక్కితే కాళ్ళువిరక్కొడతా!” అని తరిమేసారట!

అయితే  భర్తను వీధిమొగలో నిలబెట్టి  మావారి మేనత్త మాత్రం చాలాసార్లే పుట్టింటి గుమ్మం తొక్కడం, అందింది కొంత, దండింది కొంత పట్టుకుని పోవడం రివాజు అయిపోయింది. ఇలా తల్లీ, తండ్రి దగ్గర కూటికోసం కోటివిద్యలూనేర్చుకుని  కోటలు కట్టాలన్న కలలతో పెరిగిన వాడే  ఇప్పుడు అనామకుడిలా చచ్చిపోయిన “ దినకరం”! వాళ్ళనాన్నగారిలాగే పండులా, టిప్ టాప్ గా ఉండే దినకరాన్ని, వాళ్ళమ్మ మాత్రం ” దినం!దినం!” అని ముద్దొచ్చినప్పుడూ, “వెధవా! నీ దినం పెట్టా!”.  అంటూ కోపం వచ్చినప్పుడూ పిలుస్తుంటే, చెవికి కంటకంగా ఉండేది!

 

మా అమ్మ అంది ఒకసారి “రాజీ! పుట్టుకతోనో, పుట్టిన వంశాలను బట్టో సుగుణాలు రావే! మంచికుటుంబాలకు మచ్చ తెస్తూ  కొందరు పుడుతుంటారు! మీ ఆయన మేనత్త ఏవిటో కాస్త తేడా మనిషి సుమా! రాణీ పిన్ని చెప్తే నమ్మలేదుకానీ.  మొన్న మనింటికి వచ్చారు మొగుడూపెళ్ళాలు! ఇంచక్కా భోంచేసారు. బట్టలు పెట్టాం! కబుర్లు చెప్పి  చక్కాపోయారు! ఆ తరవాత చూస్తే  ఇంట్లో ఏదో తేడా!”. అంతే చెప్తుంది మా అమ్మ! మా ఆయన లాగే! ఛస్తే  ఆ తేడా యేంటో మనకు తెలియనివ్వదు. కొన్నాళ్ళకు నాకే ఆ తేడా నడుచుకుంటూ వచ్చేసింది!

 

మావగారు పోయాకా కూడా మేమంతా చాలారోజులు ఉమ్మడిగానే ఉండేవాళ్ళం! తోడికోడళ్ళందరికీ ఎన్ని పొరపొచ్చాలున్నా  ఒకే ఒక ఐక్యతాసూత్రం “చీరలపిచ్చి”. ఆ పిచ్చికి ఆజ్యం పోస్తూ  ఆషాడమాసం సేల్ అంటూ టీవీలో ప్రకటనలు ఊదరగొడుతున్న వేళ దిగింది  పండుమావయ్యగారి  భార్య “ రవణమ్మత్తయ్య” రెండు పెద్ద షాపింగ్ బేగ్ ల నిండా చీరలు పట్టుకుని. “ ఎక్కడికర్రా దేవకన్యల్లా బయలుదేరారు నా కూతుళ్ళు!”  అంటూ మొదటి పంచదార బాణంవేసింది! “ఇప్పుడే రాజమండ్రి బస్సు దిగానర్రా! మా అన్నదమ్ములు ఆస్థులివ్వకుండా అన్యాయం చేసినా, ఏదో బతకాలి కదమ్మా. చీరల వ్యాపారం మొదలుపెట్టా!”.  అంటూ చకచకా రకరకాల పట్టుచీరలు , నాణ్యమైనవి  సోఫాలో పరిచింది.

 

ఆ రంగులూ, నాణ్యానికీ మా కళ్ళు మెరిసిపోయినా  ఆవిడ చెప్పబోయే ధరలకు గుండెలు పట్టుకున్నాం. “ ఒసేవ్ రాజీ! ఇది మూడువేలు! అలివేలూ! నువ్వు కంచిపట్టు తప్పా కట్టవు కదా! నీకు కనుకా రెండువేలు. ”   అంటూ   వాటి ఖరీదులో నాల్గవ వంతుకు చీరలు ఇస్తుంటే, ఆవిడ అమాయకత్వానికి, మా లాభసాటి బేరానికి  మురిసిపోతూ ఆవిడ రెండు బేగ్గులూ ఖాళీ చేయించి , ఇలా పంపామో లేదో  అలా మా రాజమండ్రీ ఆడపడుచు ఫోను!

 

"బట్టలషాపుల్ని దోచుకుంటున్న కేడీలేడీస్"  అంటూ వచ్చిన లోకల్ న్యూస్ లో  ఒకామె రవణమ్మ అత్తయ్యలాఉందని!

 

దానితో ఇంటిల్లిపాదీ   పక్కలో పాములపుట్ట పెట్టుకున్నట్టు, వణికిపోతూ  ఆ చీరలు ఎలా వదిలించుకోవాలో తెలీక,  బయట ఏ పోలీస్ జీప్ వెళ్తున్నా మా ఇంటికే అన్నట్టు, గదుల్లో తలుపులేసుకుని కూర్చునేవాళ్ళం!

 

ఈ సంఘటన జరిగాకా. మళ్ళీ మూడేళ్ళ వరకూ ఈ పండుమామయ్య గారి కుటుంబం మా దరిదాపులకు రాలేదు. మేమంతా కూడా ఎవరిళ్ళు వాళ్ళు కట్టుకుని , విడిపోయాం!

 

***

 

"ఏవమ్మా రాజ్యలక్ష్మీ! నువ్వు పిలవనంత మాత్రాన నేను తప్పట్టుకునే మనిషిని కాదు. నా మేనల్లుడు ఇంత ఇల్లుకట్టాడంటే  నాకు గర్వం కాదూ!  అంటూ, చిన్న గుడ్డలమూట చంకన పెట్టుకుని, మా ఇంటి గృహప్రవేశానికి దిగబడి పోయిన రవణమ్మత్తయ్యను చూసి  మళ్ళీ వెన్నులో చలి పుట్టింది మా అందరికీ. చెప్పాలంటే నేనే కాస్త నయ్యం "రండి పిన్నీ! మీరొచ్చారు. అదే సంతోషం!”  అంటూ  పలకరించా! మిగిలిన వాళ్ళంతా  మొహాలు తిప్పేసారు! ఆమె మేనల్లుడు, అదే మా ఆయన  ఆవిడమొహం కేసి కూడా చూడలేదు. మొత్తానికి  గృహప్రవేశం అయిన సాయింత్రానికే ఆవిడ వెళ్ళిపోయింది  వాళ్లూ, వీళ్లూ మాకు చదివించిన  నాలుగయిదు వెండిగ్లాసులూ, ఓ నాలుగు కొత్తచీరలూ మూటకట్టుకుని!

 

చాలా యేళ్ళయింది మళ్ళీ ఆ కుటుంబం మొహం చూసి. మాకూ పిల్లలూ, బాధ్యతలూ, వాళ్ళు తెచ్చే ఒత్తిడిలూ  జీవితం రోలర్ కోస్టర్ రైడ్ లా సాగిపోతున్న రోజులవి.

 

 ఓరోజు దినపత్రికలో సగం పైగా పేజీ ఆక్రమిస్తూ వచ్చిన ప్రకటన నన్ను విపరీతంగా ఆకర్షించింది. “ ఐదువేలు-ఐదేళ్ళు-ఏభైలక్షలు- ఐదు నక్షత్రాల హోటల్ లంచ్-ఆపద్భంధు దీనానాధ్ సయానీ! ఎన్నాళ్ళో వేచిన ఉదయం రేపే! త్వరపడండి. మొదటి వందమందికి లక్కీడిప్ లో రెండు హోండాసిటీ కార్లు, ఐదు బైకులూ!” . ప్రకటన కింద పెద్ద పెద్ద స్పాన్సరర్లు, మధ్యలో నిలువెత్తు చిత్రం  అందమైన, ఆకర్షణీయమైన విగ్రహం, అర్మానీసూటు, కళ్ళకు షానల్ చలవ కళ్ళజోడూ, ఊపుతున్న చేతికి నాలుగయిదు ఉంగరాలు,మండ గొలుసులూ. దీనానాధ్ సయానీ   అలియాస్ మా దినకర్ శయనం!

 

పరుగెట్టుకెళ్ళి మా ఆయనకు చూపించా ఆ పత్రికలో వచ్చిన ప్రకటనను! మొహంలో అదే నిర్వికారం! “ తెలుసు! నిన్న ఫోన్చేసాడు ఆఫీసుకు మనందరినీ రమ్మనమని!”  అన్నారు.

 

 “ అవునా! అయితే అందరం సరదాగా నాలుగు కార్లలో వెళ్దాం! మనింటి పిల్లాడు.పైకొస్తుంటే  మనందరికీ సంతోషమే కదా!”.  అన్నానో లేదో  ఈయన చెయ్యి గాల్లో ఊపి ” నీలాంటి వెర్రిమొహాలే ఉంటాయి రేపు అక్కడ! నగరశివార్లలో రెండువందల ఎకరాలట. ఏదో మాంజియమ్ ప్లాంటేషన్ వేస్తారట. ఐదేళ్ళ తర్వాత ఒక్కో చెట్టూ  పదిలక్షలకు మలేషియా వాళ్ళు కొనేసు కుంటారట! టేకు కన్నా మన్నికయిన కలపట మేంజియమ్!”  అంటూ ఏదో సొల్లు చెప్తున్నాడు!”.  అన్నారు నిరసనగా!

  ఒక ఇంట్లో కింద స్థాయి వాడు ఎదుగుతుంటే.  ఆడవారికి వాళ్ళమీద గౌరవం, మగవారికి నిరసన మొదలవుతుందని  నేను గ్రహించాను.

 

మావాళ్ళు ఎవ్వరూ వెళ్ళడం లేదని తెలిసి, మా అబ్బాయికి రహస్యంగా పదివేలిచ్చి  "మామయ్యని కలిసి, పది బాండ్లు కొని, పంచనక్షత్రాల భోజనం చేసి, వీలయితే బైకు గెల్చుకుని రా!”.  అని వీరగంధం పూసి మరీ పంపా!

 

సాయంత్రం ఎప్పుడో   మొహం వేలాడేసుకుని వచ్చి, ఓ కాయితం ముక్క నా చేతిలో పెట్టాడు మావాడు! ఎవరో మంత్రి, ఎమ్మెల్యే, స్పాన్సరర్స్, మార్కెటింగ్ వాళ్ళకే భోజనాలట. ఇరవై వేల మంది కుమ్మకుంటూ  వీధులన్నీ నిండిపోయాయట. మార్కెటింగ్ఏజంట్లు  అక్కడికక్కడే డబ్బులు తీసుకుని, బాండ్ పేపర్లు ఇచ్చేస్తున్నారట! వీడి వంతు వచ్చేసరికి  సాయంత్రం అయ్యిందట. “అమ్మా! ఈ లెక్కన మామయ్య ఎన్ని కోట్లు గడిస్తున్నాడో కదా!”  అన్నాడు మావాడు మెరుస్తున్న కళ్ళతో! ఎందుకో భయమేసింది నాకు, పిల్లాడి మనసులో “ఈజీమనీ” బీజం పడిందా నావల్ల   అని!

 

మావారు అన్నట్టే  రెండునెలల్లో రాష్ట్రమంతా, మరో పొరుగు రాష్ట్రంలోనూ మాంజియమ్ చెట్లు  అమ్మేసి  బోర్డు తిప్పేసారు “ ఆపద్బంధు” కంపెనీ వారు. నాలుక గీసుకోడానికి కూడా పనికిరాని, నా పదివేల కాయితం ముక్కను చూసుకుంటూ ” దొంగవెధవ! నాశనం అయిపోతాడు!”  అనుకుంటూ కుమిలి పోయేదాన్ని! ఓ ఏడాదిలో ప్రభుత్వం మారిపోయి, ఆపద్బంధు వెనకున్న సదరు మంత్రిగారు అజ్ఞాతంలోకి, మన దీనబంధు "దినంగారు" కారాగారానికీ వెళ్ళిపోయారు! సెబీలు, సీఐడీలు, సీబీఐ లూ, ఐటీ వాళ్లూ.  ఒక్క పైసా వెనక్కు రాబట్ట లేకపోయారు. పిచ్చిజనాల కోట్ల కష్టార్జితం అలా అదృశ్యమయి పోయింది!

 

***

జనాల జ్ఞాపకశక్తి ఎంత అల్పమంటే మరో రెండేళ్ళకు  వాళ్ళకో “జాతకరత్న” దొరికాడు!

 “నాడీజ్యోతిష్యం, చిలుక జ్యోతిష్యం, కోయ జ్యోతిష్యం, రత్నాల శాస్త్రము ,కేరళ, నేపాలీ, పతంజలి, వరాహమిహిర,, యూజ్ఞవల్క్య జ్యోతిష్యాలన్నీ కలిపిన ఒక “ భాగ్య జ్యోతిష్య శాస్త్రాన్ని “ సృష్టించిన శ్రీ పాండురంగ దినకర్ యోగి మీ భాగ్యవశాత్తు  మీ నగరానికివచ్చారు. ఫలానా హోటల్ లో, ఫలానా నంబర్ గదిలో ఉన్నారు. మూడురోజులే ఉంటారు. ఫోన్ అప్పాయింట్ మెంట్ కోసంసంప్రదించండి” అంటూ ‌మళ్ళీ మొదలు  కొత్తఅవతారంలో కేబుల్ టీవీలో నిరంతర ప్రకటనా స్రవంతితో!

జనాలు మళ్ళీవెర్రిగొర్రెల్లా! ఇంకోళ్ళను అనుకోడ మెందుకు? నేనే ఉన్నాగా! అమ్మాయి పెళ్ళి, అబ్బాయి అమెరికా అడ్మిషన్, ఆయనఆరోగ్యం  లాంటి సమస్యలతో!

 

మా అదృష్టరేఖ మా ఇంటితలుపు కొట్టింది ఒకరోజు!  మెడనిండా రుద్రాక్షమాలలు, పదివేళ్ళకూ పది జాతిరాళ్ళ ఉంగరాలూ, కాషాయపంచె, తెల్లని చొక్కా, నుదుటను అడ్డ‌ త్రిపుండాల మధ్య  రూపాయిబిళ్ళంత కుంకుమబొట్టు .  సాక్షాత్ దినకర్ యోగిగారే మా తలుపుతట్టడం నా అదృష్టమే కదా! 

 

ఎప్పుడు నేర్చుకున్నాడో, ఎలా నేర్చుకున్నాడోతెలీదు  బ్రహ్మాండంగా లాప్ టాప్ లో జాతకచక్రం వేసేసాడు. గతంలో జరిగినవి, వర్తమానంలో జరుగుతున్నవి, భావిలోరాబోయే భీభత్సాలన్నీ చూసినట్టే వేళ్ళ లెక్కను వేసి, మా జాతకాలు చెప్పాడు! 

 

అప్పుడే ఆఫీసునుండి వచ్చిన మావారిని ” నమస్కారం బావా! “  అంటూ లేచి పలకరించగానే, ఈయన మర్యాదకయినా  “ ఏరా!” అని కూడా అనకుండా, నాకేసి కోపంగాచూస్తూ  మళ్ళీ బయటకెళ్ళిపోయారు! అదే మంచిది. నా సందేహాలన్నీ నిర్భయంగా అడిగి తీర్చుకున్నా! కానీ నా పదివేల మేంజియమ్ చెట్ల సంగతి అడగడానికి మాత్రం నోరు పెగల్లేదు!

 

"నీ ఫీజు దినకర్!”.  అన్నానో లేదో, సాష్టాంగపడిపోయి "అక్కయ్యా! సాక్షాత్ మాతృ స్వరూపిణివి. నీ దగ్గర పైసాముట్టుకుంటే భస్మమయిపోనూ!”.  అంటూ, నలుగురూ నాలుగు ఉంగరాలు పెట్టుకోవాలని, ఒక్కోటీ తులం తక్కువ కాకూడదంటే, మా అమ్మ ఆ ముందునెల పిల్లకు నగ చేయించమని ఇచ్చిన నాలుగు తులాలూ బిళ్ళ కుడుముల్లా చేతిలోపెట్టా! మా పిల్లలు సంస్కారవంతులు! దినకర్ కాళ్ళకు దణ్ణం పెట్టారు. 

 

ఈసారి మాత్రం అతను మాట తప్పలేదు. నాలుగు రోజులు పోయాకా ఎవరో మార్వాడీ అబ్బాయి  యోగిమహరాజ్ పంపారని  నాలుగు ఉంగరాలిచ్చి వెళ్ళిపోయాడు. నాలుగూ చిటికెనవేళ్ళకు కూడా పట్టకుండా, ఒకటిన్నర తులంలో కిట్టించేయ బడ్డాయి! మళ్ళీ మోసపోయా!

 

తెలిసినా  ఒకే తప్పు పదేపదే చేస్తున్నానంటే, దినకర్ లో ఏదో నెగెటివ్ శక్తి చాలా బలీయమైనది, జనాలను వశపరుచుకో గలది వుండనయినా ఉండాలి, లేక నేను పరమ బలహీన మనస్కురాలిని అయ్యుండి, స్వశక్తి మీద నమ్మకం లేని దాన్నయినా అయ్యుండాలి!

 

అయితే, ఏ తథాస్థు దేవతలు దీవించారో  మరి దినకరం చెప్పిన కాలపరిమితిలోనే పిల్లకు అంగరంగ  వైభవంగా పెళ్ళి, పిల్లాడు కూడా అక్కతో పాటూ అమెరికా చదువుకు వెళ్ళిపోవడం, ఈయనకు సర్జరీ అయ్యి, ఆరోగ్యం కుదుటపడడం  జరిగింది. 

 

 ఈసారి కూడా నేను పెళ్ళికి పిలవలేదు పండుమామయ్యగారి కుటుంబాన్ని. ఎందుకంటే మా వియ్యాలారు చాలా సంపన్నులు అన్నివిధాలా. వారు, ఈ స్కాముల కుటుంబాన్ని మాతో చూస్తే  ఎక్కడ మాట పడాలో అని! సహజమే కదా నా ఆలోచనా, భయం!!

 

 ఆ తరువాత  మేము కూడా ఆర్నెల్ల అమెరికా యానాలు, అమ్మాయి కాన్పులు, ఉద్యోగ విరమణలు, అబ్బాయి పెళ్ళి, నడివయస్సు ఆధ్యాత్మిక సాధనలతో చాలా బిజీ అయిపోయాము! 

ఆ మధ్యెప్పుడో పండుమావయ్య గారు పోయారని, రవణమ్మత్తయ్యను కొడుకు పట్టించుకోట్లేదని, దినకరం   తన కన్నా పదిహేనేళ్ళ చిన్న అమ్మాయిని, ఎవరోపూజారి గారి కూతురట   పెళ్ళిచేసుకున్నాడని.  ఎవరో చెప్తే తెలిసినా, మునపటిలా అత్యుత్సాహం చూపించలేదు వారి విషయాల్లో!

 

రవణమ్మత్తయ్య గారికి మాత్రం ఎవరితోనో ఓ పదివేలు పంపి, ఓ దణ్ణం పెట్టేసా!

 

***

 

కొన్ని లంపటాలు  ఎంత వదిలించు కుందామనుకున్నా. బలమైన దారాల్లా  అదృశ్యంగా , మన కాళ్ళకు చుట్టుకుంటూ  మనకు తెలియకుండానే , అడ్డం పడుతూ ఉంటాయి. అలాగే మళ్ళీ దినకరం కంట పడ్డాం నేనూ, మా ఆయన! ఈసారి మా వూరికొచ్చిన, గొప్ప అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన ఒక ఆధ్యాత్మికవేత్తను దర్శించుకోడానికి వెళ్ళినపుడు.

 

ఎక్కడో మైలు దూరంలో కారు ఆపుకుని  అడుగు పెట్టడానికి కూడా వీలులేని పరిస్థితిలో  మేమున్నప్పుడు, “అక్కయ్యా! బావా!”.  అని ఎవరో అరుస్తున్నట్టు అనిపించి పక్కకు తిరిగాం! “ దినకరం!”.  తెల్లని మల్లె పూవంటి  లాల్చీ, కుర్తాలో, చిన్న విబూధిబొట్టు పెట్టుకుని  ఆరోగ్యంగా మెరిసిపోతూ! నేను గబుక్కున మావారి మొహంలోకి చూసా! ఆయన కళ్ళల్లో అదే కంపరం ఎప్పట్లాగే! “రండి! నేను తీసుకువెళతా స్టేజ్ దగ్గరకు”.  అంటూ పిలుస్తుంటే, ఏ కళనున్నారో నా కళ్ళలో అభ్యర్ధన మన్నించి నా వెనకే వచ్చారు.

 

చకచకా వలంటీర్లను తప్పిస్తూ, మమ్మల్ని వేదికకు ఏభై మీటర్ల దూరంలో కుర్చీలేసి మరీ కూర్చోపెట్టాడు దినకర్. ఆ రోజు మేము అనుభవించిన ఆధ్యాత్మిక తాదాత్మ్యతకు దినకరమే కారణం అని నేను నిర్ద్వంద్వంగా చెప్పగలను. మరి ఎలా సంపాదించాడో అంత పరపతి. అక్కడ చాలా మంది వలంటీర్లు  దినకరంతో సంప్రదించడం, మర్యాదగా పలకరించడం చూసి  చాలా ఆశ్చర్యపోయాం.

 

కార్యక్రమం అయిపోయాకా, మరి ఎక్కడి నుండి వచ్చిందో  ఒక యువతిని చూపించి ”మా ఆవిడ అక్కయ్యా!”  అంటూ పరిచయం చేసాడు. చక్కగా ఉన్నారు జంట. మా ఆయన కాస్త ప్రసన్నంగానే "చాలా థేంక్స్ రా!"  అన్నారు.  "అయ్యో! బావా! అది నా విద్యుక్తధర్మం!”  అంటూ వినయంతో వంగిపోయాడు!

 

వెంటనే నా లోని అక్కమనసు ఠకీమని మాట జారింది! "ఉంటారా కొన్నాళ్ళు? ఒకసారి అమ్మాయిని తీసుకుని ఇంటికి రా దినకరం!”  అనేసా! వెంటనే ఆ అమ్మాయి కేసి గర్వంగా చూస్తూ "చెప్పానా! మా అక్కయ్య అభిమానం గురించి!".  అంటూ, 'ఆదివారం వెళ్ళిపోతామక్కా! శనివారం వస్తాంలే!' అంటూ, ఎవరో పిలవడంతో  శలవు తీసుకుని వెళ్ళిపోయాడు!

 

శనివారమంతా టెన్షనే నాకు  ఎక్కడ వస్తాడా  అని! రాత్రి ఏడింటికి వచ్చాడు పెద్ద కారులో! భార్యను తీసుకురాలేదు. తను ఊరు వెళ్ళిపోయిందట! ఎప్పుడు వచ్చినా ముందు గదిలో కూర్చునేవాడు  ఈసారి ఇల్లంతా తిరిగి గదీ గదీ తిరుగుతుంటే  ఆందోళనతో నా గుండె చప్పుడు నాకే వినిపించ సాగింది.

 

“ ఇల్లు కడుతున్నానక్కయ్యా! ప్లానంతా అయిపోయింది. దేవుడి గది మోడల్స్ చూస్తున్నాను. ఒకసారి మీ పూజగది తలుపు తెరుస్తావా? చూసుకుంటాను!”  అంటూ దేవుడిగది ముందు నిల్చున్నాడు.

 

“చూడు!”  అంటూ తలుపు తెరిచారు ఈయన. ఒక పట్టాన రాడే! అవెక్కడ దొరికాయి? ఇవెక్కడ కొన్నారు? అమ్మవారికి వేసిన నగలు బంగారమేనా?”.  అంటూ ఒకటే ప్రశ్నలు! నేనే చొరవగా  “బయట కూర్చుందాంలే! భోంచేసాకా మేము పూజ గదిలోకి వెళ్ళం దినకర్"  అంటూ వంకలు చెప్పి, తలుపేసేసా! నా కారణాలు నాకున్నాయి మరి!

 

“భలేదానివి అక్కయ్యా! నేను నిరంతరం దైవజపంలో ఉంటా! నేను చచ్చిపోయే ఆఖరిక్షణాల్లో కూడా నానోట దైవనామమే ఉంటుంది. నాకు అంటు ఉండదు!”.  అంటూ గొప్పలు మొదలుపెట్టాడు.

 

ఇక్కడే తన భార్య గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. ఆ అమ్మాయి ఆర్కియాలజీలో డాక్టరేట్ ట!తూర్పు  చాళుక్యుల నాటి 7 వ శతాబ్దపు పురావస్తు పరిశోధకులతో కలిసి పనిచేస్తోందట! సామర్లకోట, రాజమండ్రి , ఇతర కోస్తాజిల్లాలను ఏలిన  కుబ్జ విష్ణువర్ధనుడనే వేంగి చాళుక్య రాజు కట్టించిన పురాతన దేవాలయాల మీద, ఎక్కడో భూమిలో  శిధిలాలలో  మరుగైపోయిన అపురూప శిల్పసంపద, పంచలోహ విగ్రహాల మీద విస్తృతంగా పరిశోధన చేస్తోందట!

 

చాలా సరదా వేసింది అది విని. ఎందుకంటే మా నాన్నగారు కూడా ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ లో డైరక్టర్ గా పనిచేసినవారే! 

"మీరు ఎక్కడుంటున్నారు దినకర్!”  అని అడిగితే  "నాదేముంది అక్కయ్యా! త్రిలోక సంచారిని!”  అంటూ నవ్వేసి  విషయం చెప్పకుండా వెళ్ళిపోయాడు!

 

***

ఆ యేడు అన్నీ శుభాలు కలగడంతో సంకల్పించుకుని ‌ చైత్రమాస శుక్లపక్ష నవమికి  సీతారాముల కళ్యాణం చాలా ఘనంగా చేసుకున్నాము. ఉదయం కళ్యాణం, భోజన వితరణ, సాయంత్రం చక్కని త్యాగరాజకీర్తనలతో సంగీతకచేరీ జరిగింది, మా మేడమీద! ఇల్లంతా తాజా మల్లెలు, మరువం, మావిడాకులతో దివ్య వాతావరణం కమ్ముకుని ఉంది. కార్యక్రమాలన్నీ ముగిసి, తీరని అలసటతోకూలబడిపోయాం మేమిద్దరం!

 

ఆ రాత్రి  మరి ఎలా ప్రవేశించారో ఏమో, ఎలా తాళాలు తీసారో తెలీదు, ఎంత మంది వచ్చారో కూడా తెలీదు  మొత్తం మా ఇల్లంతా జల్లెడ పట్టినట్టు వెతికి  పూర్తిగా దోచేసారు దొంగలు!  వాళ్లు ఎంత పాపభీతి లేని దుర్మార్గులో.  కళ్యాణం జరిగిన సీతారాములు, లక్ష్మణ, ఆంజనేయ సహిత పంచలోహ విగ్రహాలను కూడా తీసుకు పోయారు! దేవుడి గదిలోని అరుదైన విగ్రహాలు, వాటి మెడలో హారాలతో సహా తీసుకుపోయారు. వెండి దేవతార్చన, దీపాలు, కంచాలు, డబ్బు, బంగారం  సమస్తం ఊడ్చుకు పోయారు.

 

నవమి మర్నాడు  మధ్యాహ్నం మూడుగంటలకు కళ్ళు తెరిచిన మాకు  వెంటనే ఇంట్లో తేడా తెలిసింది. తలుపులన్నీ మారుతాళాలతో తెరిచారు. బహుశా మాకు మత్తు పెట్టి వుండాలి! బీరువాలు పగలగొట్టి దోచేసుకున్నారు! పోలీసులు వచ్చారు  పరిశోధించడానికి, మా కంప్లయింట్ నమోదు చెయ్యడానికీ! ! వెండి, బంగారాలు, డబ్బు లెక్క తప్పా  మా భోషాణం నుండి దొంగలు ఎత్తుకుపోయిన  పంచలోహ విగ్రహాల గురించి నేను పోలీసులకు చెప్పకపోవడాన్ని  మావారు ఆశ్చర్యంగా చూసారు. కళ్ళతోనే ఆయన్ని వారించాను నోరు విప్పద్దని!

 

ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పుకోవాలి. మా అమ్మానాన్నగార్లకు నేను ఒక్కతినే కూతుర్ని. నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగిగా దేశమంతా తిరుగుతూ,నన్ను అమ్మమ్మ గారింట్లో ఉంచడంతో నాకు నా పుట్టింటితో అనుబంధం తక్కువే.

 

 ఆరునెలల క్రితం, మా పుట్టింటికి వెళ్ళినపుడు  మా అమ్మ  వారసత్వ సంపదని, రహస్యంగా దాచుకోమని, ప్రదర్శన చెయ్యద్దని తాళాలేసిన ఒక పెద్దభోషాణాన్ని మాతో పాటూ లారీలో తీసుకు పొమ్మంది! మాది పెద్ద ఇల్లు కావడంతో, దాన్ని డ్రాయింగ్ రూమ్ లో ఏంటిక్ పీస్లా పెట్టుకున్నా!

ఒకరోజు అమ్మ ఫోన్ చేసి  “ భోషాణం తెరిచి చూసుకున్నావా?”  అని అడిగే వరకూ  దానిలో  రెండేసి అడుగుల పొడవున్న  తొమ్మిది  పంచలోహ విగ్రహాలున్నాయని నాకు తెలియనే తెలియదు. ఎందుకో వాటిని చూడగానే, భయమో, భక్తో  తెలియదు , కానీ ఒళ్ళు జలదరించింది! ఆ విగ్రహాల మెడలో నల్లబడిపోయిన  నగల్ని చూసి బహుశా అమ్మ ఎప్పుడో వేసి, అలా ఉంచేసి ఉంటుంది  అనుకుని, అలాగే వదిలేసా వాటిని!

 

వాటిలో అపుర్వంగా ఉన్న  శంఖచక్రగదాశంఖాలతో అలంకృతుడైన శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని మాత్రం నా దేవుడిగదిలో పెట్టుకున్నాను!

ఆలోచిస్తుంటే  సర్వం తేటతెల్లంగా అర్ధమైపోయింది  మా ఇంట్లో జరిగిన దొంగతనం ఎవరి పనో! పోలీసులకు చెప్పేయచ్చు  వాడి పేరు, వాడి భార్య చేస్తున్న రీసెర్చ్ గురించి. మా ఇంటికొచ్చినపుడు దినకర్ అనుమానాస్పద ప్రవర్తన, వేసిన ప్రశ్నల గురించి!

 

అయితే అమ్మ నన్ను ఎట్టి పరిస్థితుల్లో ఆ  విగ్రహాలూ, వాటి నగల వివరాలూ ఇవ్వడానికి వీల్లేదని  ఫోనులో ఒట్టేయించుకోడం నాకు మింగుడు పడడం లేదు! మా కుటుంబంలో నాకు తెలియని రహస్యాలా  అని.

 

"కోట్ల విలువ చేసే సంపద  ఎలా వచ్చిందో  అలాగే పోయింది!"  అన్న అమ్మమాట ఇంకా మింగుడుపడలేదు! ముందే చెప్పా కదా  ఆమె తలుచుకుంటే తప్పా  ఆవిడ నోటంట రహస్యం బయటకు రాదు. అడిగి అడిగి విసిగిపోయి ఊరుకోడమే!

 

రెండేళ్ళు గడిచినా  మా వస్తువులు దొరకలేదు, ఆ దోపిడీ దొంగలూ దొరకలేదు. నాకు నగల మీద పూర్తి వైరాగ్యం వచ్చిచేరి, పుస్తెలతాడుతో తిరుగుతూ, లోకం సానుభూతిని మాత్రం కావలసినంత మూటకట్టుకున్నా!

 

కాలం దాని పరుగులో  మరో మూడేళ్ళు పరిగెట్టింది. మా నాన్నకు జన్యుపరంగా సంక్రమించిన అంధత్వం, డిమెన్షియా ఒకేసారి వచ్చాయి. “అన్ని పూజలూ, నోములూ నోచింది  నాన్నను ఇలా చూడ్డానికా రాజీ!”.  అంటూ అమ్మ రోజుకోసారి ఫోన్లో ఏడుస్తుంది! నాన్నంటే నాకు పంచప్రాణాలు. పెద్ద కేంద్రప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి, ఎంతో నిజాయితీపరుడుగా పేరు సంపాదించు కున్నారు! బంధుమిత్రుల్లో ఎవరు కష్టాల్లో ఉన్నా, అమ్మ   నాన్నగారి చేత కట్టలు కట్టలు డబ్బు  ఇప్పించేది! “ కష్టార్జితం కానిది కష్టాల్లో ఉన్నవాళ్ళకే ” అంటూ!

 

***

మళ్ళీ కథలో నేను మొదలుపెట్టిన  భాగానికి వస్తే. ఏలూరు దగ్గర ఏదో పల్లెటూర్లో . ఒక చర్చిలో పాస్టర్ గా  పనిచేస్తున్న సదరు మావాడు  అంటే బ్రదర్ దినకర్ అతని భార్య ప్రతిమ  అత్యంత కిరాతకంగా చంపబడ్డారన్న వార్త  దాని పూర్వాపరాలు.

 

నిజానికి  దీని నేపధ్యం నెలరోజుల నుండి నడుస్తోంది వార్తల్లో!  మేము దృష్టిపెట్టలేదు కానీ రమణమ్మ గారు పోలీసులకి ఇచ్చిన గురించి విన్నాక అన్నీ సులభంగా గ్రాహ్యమయ్యాయి నాకు.

 

రాజమండ్రీ పుష్కరాల్లో  తొక్కిసలాటలో గాయపడిన ప్రతిమ తండ్రిని దినకర్ రక్షించి, ఇంటికి తీసుకెళ్ళడం  వాడి ఈ కొత్త ప్రస్థానానికి నాంది అని చెప్పాలి!

 

 ఆయన ప్రధాన పూజారిగా ఉన్న పురాతన ఆలయపు కుడ్యాలపై  పైశాచీ లిపిలో కొన్ని రహస్యశాసనాలు ఉన్నాయని, వాటిని బట్టీ ఆ ప్రాంతమంతా  కొన్ని శతాబ్దాల క్రిందట గొప్ప రాజాదరణతో  అభివృద్ధి చేసిన వైష్ణవాలయ సముదాయము లుండేవని, దాని సమాచారం ప్రకారం  తను ముప్ఫైయేళ్ళ క్రితమే ఆర్కియాలజీ శాఖవారికి సమాచారమిచ్చానని, వారు అక్కడకు ఏభైమెళ్ళ దూరంలో కొంత త్రవ్వకాలు చేసి వదిలేసారని దినకర్ కు చెప్పు కొచ్చారు ఆయన !

 అలాగే ఆర్కియాలజీలో పరిశోధకురాలు అయిన తన కూతురు ప్రతిమకు ఇప్పుడు ఆ  త్రవ్వకాలను కొనసాగించడానికి ఆర్ధికంగా, ప్రభుత్వపరంగా సహాయం కావాలని  ఆ పూజారిగారు  మాట వరసకు చెప్పిన మాటలను  దినకర్ చాలా లోతుకే తీసుకెళ్ళాడు.

 

ప్రతిమను పెళ్ళి చేసుకుని దినకర్ తన మొదటి పావు కదిపాడు! ఈ వ్యాపారంలో పెద్ద తలకాయలను  రంగంలోకి దింపి ఆ వ్యాపారంలో, ఆ రహస్య త్రవ్వకాలలో ఉన్న లోతు చవి చూపించాడు!

 

ఎందరో విదేశీ భక్తులున్న ఒక ప్రముఖ ఆశ్రమంలో కార్యకర్తలుగా చేరి, కొందరు సంపన్న విదేశీయుల ప్రాపకం సంపాదించి, వారి ద్వారా క్రైస్తవ మిషనరీల అండ సంపాదించి, మత ప్రచారకులుగా అవతారం ఎత్తి, అంతర్జాతీయ స్మగ్లింగ్ కు దారి సుగమం చేసుకున్నారు భార్యాభర్తలు ఇరువురూ.

 

సజావుగా నడుస్తున్న నేరస్థుల ఆటలో కాస్త డబ్బు కళ్ళబడేసరికి   నేరుగా వ్యాపారంలో దిగబోయి అంతమయ్యారు. ఈ  హత్యలతో ఎక్కడ దొంగలు అక్కడే గుప్ చుప్! ఒక ప్ర్రైవేట్ పోర్టు నుండి ఓడల్లో  భారతీయ కళాఖండాలను విదేశాలకు ఎగుమతి చేస్తున్న ముఠా ఒకటి కస్టమ్స్ అధికారులకు చిక్కడం నుండి మొదలైన అపరాధపరిశోధన  రకరకాల మలుపులు తిరిగి, చిట్టచివరకు ,ఆంధ్రదేశంలో  మారుమూల పల్లెటూర్లో  తేలింది.

 

రాజకీయనాయకులూ, వారి కొడుకులూ బంధువులూ, ఎక్కడో ఒక ఆశ్రమానికొచ్చే కొందరు విదేశీప్రముఖులు పాత్రధారులు, సూత్రధారులుగా తీగ లాగితే డొంకంతా కదిలినట్టు.  అతి పెద్ద ముఠా బయటపడింది. విగ్రహాల చదరంగంలో చివరి బంటు దినకరం! బంటు బంటులా పడి ఉండకుండా రాజునవ్వాలను కోవడమే వాడికి చావు కొని తెచ్చిపెట్టింది!

 

మాతో చెప్పినట్లు గానే దినకర్ నిజంగానే ఇల్లు మొదలుపెట్టాడు. అయితే పునాదుల్లోనే వాడి కలలు సమాధి అయిపోయాయి. ఎందుకంటే  ఆ ఇంటి పునాదుల కింద నేలమాళిగలో వాడూ, వాడి భార్యా దాచిన అపూర్వసంపద అంతా బయటపడింది!

 

అవన్నీ 7 వ శతాబ్దపు వేంగీ చాళుక్యుల కాలం నాటి  అమూల్యమైన లోహవిగ్రహాలు  కొన్ని బంగారానివి, కొన్నిపంచలోహాలవి, తంజావూరు చేత ఆలయనగిషీల బంగారుఆభరణాలు అతి నాజూకయిన పనితనంతో  ఒకప్పటి ఆంధ్రరాజుల వైభవాన్ని, చరిత్రనూ చాటే వెలలేని సంపద అదంతా!

 

ఆ నిధిలో దొరికిన  నా తొమ్మిది విగ్రహాలూ, వాటి బంగారు నగలు కూడా చారిత్రాత్మకంగా అదే శతాబ్దానివి  అన్నవార్త నాకు అగమ్యగోచరంగా అనిపించింది!

 

 కొన్నాళ్ళకు కొంత పరపతి వాడి  దినకర్ మా ఇంట్లోంచి దోచుకెళ్ళిన నా వెండి,బంగారాలు   ఆధారాలు చూపించి, దొరకబుచ్చుకున్నాం! అవి చాలు నాకు! ఆ పురాతన విగ్రహాలు, నగలు తీసుకునే ప్రయత్నం ఏమాత్రం చేయలేదు.

 

 ఇంట్లో కొండచిలువలా పడున్న ఖాళీ భోషాణం కూడా  మ్యూజియమ్ కు ఇచ్చేసాము!

 

దినకర్ హత్యానంతరం మా కుటుంబంలో ఎవ్వరూ కూడా  రవణమ్మత్తయ్యకు ఫోన్ చేసి, పరామర్శ చెయ్యలేదు ఎందుకొచ్చిన తద్దినం అనుకుని.

 

ఎప్పుడూ ఆ కుటుంబాన్ని , వారి నేరచరిత్రనూ నిరసించే మా ఆయన ఒక రాత్రి నాతో ” పాపం అత్తయ్య ఎలా ఉందో కనుక్కున్నావా  చెట్టంత కొడుకుపోయి, ఏం బాధలు పడుతోందో!”.  అన్నారు. నాకెందుకో వెర్రి దుఃఖం వచ్చింది ఆ మాటలకు!

 

కొందరు మన జీవితాల్లో  మనకు తెలియకుండానే ముఖ్యపాత్రలవుతారు  తమ మంచితోనో, చెడుతోనో!

 

 నా పెళ్ళికి పదేళ్ళ పిల్లాడు దినకర్! మా పెద్దాడపడుచు కన్నా చిన్నామె రవణమ్మగారు!నా పెళ్ళికి ముందే వాళ్ళను ఇంట్లోంచి బయటకు పంపేసారు మావగారు.ఆ పెళ్ళిలో  హడావిడిగా తిరుగుతున్న వాడికి  ఇంకా ఆ ఇల్లూ, మనుషులూ తనవారేనా? కాదా? అనే మీమాంస! నా పెళ్ళిలో వాడొక పాట పాడాడు  “ పిల్లలూ దేవుడూ చల్లనివారే- కల్లకపట మెరుగనీ కరుణామయులే!”  అంటూ! పెద్దపెద్ద కళ్ళతో, ఆ ఉంగరాల జుట్టు అందమైన పిల్లాడు  ఎంత ముద్దొచ్చేసాడో!

 

 అయితే ఇలాంటి పతనజీవితాన్ని గడిపి చివరకు పాతకుడిలా మిగిలిపోతాడని ఆ రోజు ఎవరైనా ఊహించగలిగామా?

 

 ఒక్కసారిగా నాకెందుకో మావారి మీద కోపం ముంచుకొచ్చింది! పడుకున్న ఆయన్ను గబగబా లేపేసి.

 

 "ఏం మీరెందుకు అడగలేదు  మీ మేనత్త యోగక్షేమాలు? మీ నాన్నగారి తోబుట్టువు. దొంగతనాలు చేస్తున్నారని  క్షణాల్లో తన్ని తరిమేసారు మొత్తం కుటుంబాన్ని! అప్పచెల్లెళ్ళకి చెందాల్సిన ఆస్థీ ఈయకుండా, బతువుతెరువు చూపకుండా వదిలేసారు. ఆమె వస్తే తలుపులేసుకున్నాం కానీ " అత్తయ్యా! ఇది తప్పు! ప్రమాదం!”  అని ఒక మంచిమాట చెప్పి, ఆవిడ దొంగబుద్ధికి ఏ ట్రీట్ మెంటో ఇప్పించి, ఏ ఆశ్రమంలోనో పునరావాసం చేయించచ్చు! ఏదీ చెయ్యలేదు మనం!

 

అలాంటి తల్లితండ్రులను, తల్లి పుట్టింటివారి నిరాదరణ చూస్తూ పెరిగిన దినకర్ లో ఏం సంస్కారం ఆశించగలం. వాడు మాయగాడి అవతారం ఎత్తాడు. అవతారాలు మార్చాడు. దొంగతనాలు చేసాడు. ఆధ్యాత్మిక గురువుగారి దృష్టిని ఆకర్షించి, ఆయన్ను వంచించాడు, ఏకంగా ఏనుగు కుంభస్థలం కొడుతున్నాను అనుకుని  వాడి అంతం వాడే చూసుకున్నాడు. ఒక మంచి ఉద్దేశంతో పరిశోధన మొదలు పెట్టిన  ఆ ప్రతిమ జీవితాన్ని కూడా.  అర్ధాంతరంగా ముగిసేలా చేశాడు. వాడికైనా గౌరవప్రదమైన ఉపాధి చూపించి ఉంటే, ఈరోజు ఆ కుటుంబానికి ఈ పరిస్థితి వచ్చేది కాదేమో!  ఈరోజు చెప్తున్నాను  పండుమామయ్య గారి కుటుంబం పతనమవ్వడానికి మీకుటుంబమే కారణం! ముమ్మాటికీ!”   అంటూ ఎన్నడూ లేనంత ఆవేదనతో ఏడ్చేసా.

 

ఎప్పటిలా బయటకు పారిపోడానికి వీలు లేదు. అది అర్ధరాత్రి మరి.  అందుకే మా వారు మౌనంగా ఉండిపోయారు! కాసేపటికి నా చెయ్యి మృదువుగా రాస్తూ,”నిన్ననే అత్తయ్యతో మాట్లాడా రాజీ! వాడు పోతూపోతూ  వాళ్ళమ్మకు మహోపకారం చేసాడు. తల్లికి.  ఆవిడ జీవితాంతం లోటులేకుండా, నిశ్చింతగా బతకడానికి.  ఓ మంచి, అన్ని సౌకర్యాలున్న వృద్ధాశ్రమానికి జీవితచందా కట్టేశాడు! ఈ ఆదివారం వచ్చి మా ఇంటికి తీసుకెళ్తా అత్తయ్యా!”  అన్నా! “ వస్తానంది పాపం  ఓ నెల్లాళ్లుండడానికి!”.  అన్నారాయన గద్గదస్వరంతో! మా ఇద్దరి మధ్యా భాష అక్కరలేని మౌనం!

 

దినకర్ కేసు జరుగుతున్నప్పుడు  మా అమ్మ అన్న మాటలు  మళ్ళీ గుర్తొచ్చాయి!

 

 ” రాజీ! మనం దేవుడున్నాడా? న్యాయం,ధర్మం అనేవి అసలు బతికున్నాయా?  అని ప్రశ్నలేస్తాం. అన్నీ ఉన్నాయి ఏ యుగంలోనయినా! సమీకరణాలే మారుతూ ఉంటాయి! ఎప్పుడో అప్పుడు , ఎవరికి చెందాలిసింది వారికి చేరుతుంది, రాజీ! మీరంతా  దొంగతనం అనుకుంటున్నదంతా  రవణమ్మగారికి  హక్కుగా చెంది వలసినదేనేమో! అలాగే దేవుడికి చెందినది  మళ్ళీ దేవుడికే చేరింది!” 

 

"అమ్మా! మరి మధ్యలో ఉన్నవాళ్ళంతా తప్పించుకున్నారు. దినకర్ కు మరీ  చావు దక్కడమేంటి??”  అన్నాను కాస్త ఉక్రోషంగా!

 

“ బావుందే! వాడు బతికుంటే ఇంకా ఏం చేసుండునో! వాడిని కలుపు ఏరినట్టే ఏరేసాడు భగవంతుడు! మిగిలిన వాళ్ళకు దక్కాలిసింది ఖచ్చితంగా దక్కి తీరతుంది!”  అంది దృఢంగా!

 

“ అమ్మా! మరి మన విగ్రహాలూ? అవి కూడా ముందు జరిగిన తవ్వకాల్లో దొరికినవే కదూ!”  అన్నా సందిగ్ధంగా!

 

కాసేపు మౌనం తర్వాత మెల్లగా నోరు విప్పింది అమ్మ.

 

" మీ నాన్నకు కళ్ళు పోయాయిగా! డ్యూటీ అంతా న్యాయంగా చేసి, ఆఖరి రోజుల్లో మాత్రమే కక్కుర్తి పడినందుకు. గుడ్డిలో మెల్లగా చేసిన పాపం గుర్తుకు రాకుండా డిమెన్షియా వచ్చింది. రాజ్యలక్ష్మీ! దేవుడున్నాడో, లేడో నాకు తెలియదు. కానీ లోకంలో ఏదో ఒక సమీకరణం మాత్రం మంచికీ చెడుకూ , నేరమూ -శిక్షకూ  మధ్యలో చక్ర భ్రమణం చేస్తూ ఉంటుంది! ఆలస్యంగా అయినా అంతిమ న్యాయం జరిగి తీరుతుంది!"  న్యాయం ఏదో జరిగిందన్న నిశ్చింత  అమ్మలో!

 

అమ్మ చెప్పిన న్యాయ సమీకరణాలను గురించి ఆలోచిస్తూ  కళ్ళు మూసుకున్నాను! 

 

*****

bottom of page