top of page

కవిత్వంలో ప్రయోగాలు

Vinnakota Ravi Shankar

వ్యాస​ మధురాలు

విన్నకోట రవిశంకర్

నా మొదటి కవితా సంకలనం “కుండీలో మర్రిచెట్టు” వచ్చిన కొత్తలో, ఒక ప్రముఖ కథకునికి ఆ పుస్తకం కాపీ ఇచ్చినప్పుడు, ఆయన వచన కవులు ఉచితంగా ఇచ్చిన పుస్తకాలకి తన ఇంట్లో సముచిత వినియోగం ఎలాఉంటుందో సోదాహరణంగా వివరించారు. కొన్ని గిన్నెల మీద మూతలుగా, కొన్ని టేబుల్ కోళ్ళ కింద సపోర్టుగా .. ఇలా. అదృష్టవశాత్తు నా పుస్తకానికి అటువంటి సత్కారం జరగలేదు గాని, పుస్తకం చదివాక

మెచ్చుకొంటూ ఆయన ఒక మాట అన్నారు. “కవిత్వం ఇలా కూడా రాయవచ్చా అనిపించింది ఈ కవితలు చదివితే” అని. ఈ మాట వ్యతిరేకంగా కూడా అనవచ్చుననుకోండి. అలా రెండు రకాల స్పందనలకి అవకాశం ఇచ్చే కవిత్వం ప్రయోగాత్మక కవిత్వం. దీని గురించి క్లుప్తంగా వివరిస్తాను.

 

అప్పటి వరకు అమలులో ఉన్న పద్ధతులకి భిన్నంగా రాయటం, కవితా నిర్మాణం, రూపం, పదప్రయోగం లేదా పేపరు మీద కవితను ముద్రించటంలో వైవిధ్యం చూపించటం వంటివి ప్రయోగంగా చెప్పుకోవచ్చు. ప్రయోగమన్నది ఒక ఒరవడి కానక్కర్లేదు. ఒక కవి ఒకసారి చేసినా అది ప్రయోగం కిందకే వస్తుంది. అలాగే ప్రయోగమన్న మాటలోనే వైఫల్య సూచన ఉంది. అంటే, అది సఫలమో, విఫలమో కావచ్చు. ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన ప్రయోగాలన్నీ సఫలమైతే ఈ ప్రపంచమే ఉండేది కాదేమో కదా!

తెలుగు కవిత్వంలో ప్రయోగం సాంప్రదాయ సాహిత్యం కాలం నుంచీ ఉన్నదే. ఉదాహరణకు, పింగళి సూరన పదహారవ శతాబ్దంలో రాఘవపాండవీయం అనే ద్వ్యర్థి కావ్యం రాసాడు. ఒకటి రెండు శ్లేష పద్యాలు ఏ కవైనా రాయవచ్చు గాని, ఏ మాత్రమూ సంబంధం లేని రెండు కథాంశాలను తీసుకొని, ఆ రెండు కథలు ఏక కాలంలో ఒప్పేటట్టు ఒక కావ్యం రాయటం గొప్ప సాహసమే అవుతుంది. అయితే, ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యంలో చెప్పినదాని ప్రకారం, అంతకు ముందే సంస్కృతంలో పలు ద్వ్యర్థి కావ్యాలు వచ్చాయి. అంతేకాదు, సూరన గారికంటే కొంత ముందు కాలంలో దైవజ్ఞ సూర్య పండితుడనే ఆయన “రామకృష్ణ విలోమ కావ్యం” రాసాడు. ఇందులో, ప్రతి శ్లోకం రామకృష్ణు లిద్దరి గురించి చెప్పటమే కాకుండా, శ్లోకాన్ని ఎటువైపునుంచి చదివినా ఒకే విధంగా ఉంటుంది. ఉదాహరణకు

 

“తం భూసుతా ముక్తి ముదార హాసం వందే యతోలవ్య భవం దయాశ్రీః

శ్రీయాదవం భవ్య లతోవదేవం సంహారదాముక్తి ముతాసుభూతం”

ఇందులో మొదటి పాదాన్ని తిరగేస్తే, రెండవ పాదం వస్తుందని తేలిగ్గా గ్రహించవచ్చు. ఇటువంటి శ్లోకాలతో ఒక కావ్యం రాయటం గొప్ప విషయమనే చెప్పాలి.

అప్పట్లో, సంస్కృతంలో రెండర్థాల నాటకం కూడా రచింపబడిందని అంటారు. కావ్యమైతే, నిఘంటువు సాయంతోనో, పండితుల సహకారంతోనో చదువుకోవచ్చు. కాని, ఏకకాలంలో రెండు కథాంశాలతో నడిచే నాటకం చూస్తూ అర్థం చేసుకోవటం మరింత కష్ట౦.

మరొక ప్రయోగం బంధ కవిత్వం. ఛందస్సులో సహజంగానే యతి, ప్రాస, గణాలకు సంబంధించిన నిబంధన లుంటాయి. వీటికి తోడు మరిన్ని క్లిష్టమైన నిబంధనలతో సాగేది బంధ కవిత్వం. 1,2,3 పాదాల్లో పడవ అక్షరం ఒకటే ఉండాలని, మూడవ పాదం ఏ అక్షరంతో ముగిస్తే, అదే అక్షరంతో నాల్గవ పాదం మొదలవ్వాలని... మొదలైన నిబంధనలు. వీటిలో కొంత సరళ సుందరంగా కనిపించేది గోమూత్రికా బంధం. రెండవ పాదంలో ప్రతి రెండవ అక్షరం మొదటి పాదంలో అదే స్థానంలో ఉండే అక్షరమే అవుతుంది. దానితో పద్యానికి కలనేత వంటి అందం వస్తుంది. భైరవ కవి రచించిన శ్రీరంగ మహత్వం కావ్యం నుంచి బంధ కవిత్వానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఆరుద్ర పేర్కొంటారు. వాటిలో గోమూత్రికా బంధంలో రచింపబడిన పద్యం :

“హరిపద సరసిజ మధుకర –మురభిద సితమూర్తి రామ భోగయ రామా !

కరిరద సురకుజ విధుకర – శరదుద సితకీర్తి ధామ చాగయ రామా!”

 

ఇటువంటివే, చిత్ర కవిత్వ ప్రయోగాలలో మత్తేభ గర్భ సీసం, కంద గర్భ గీతం వంటి మిశ్రమ ఛందస్సులున్న పద్యాలను కవులు రాసారు. ఒక విధంగా చూస్తే ఇవన్నీ కసరత్తుల్లాగానే అనిపిస్తాయి. వీటి రచనలో కవికి, అర్థం చేసుకోవటంలో పాఠకునికి శ్రమ కలిగే మాట కూడా వాస్తవం. అందువల్ల, కవి పాఠకునికి ఆశ్చర్యంతో కూడిన ఆనందం కలిగించవచ్చునేమోగాని, రసానందం కలిగించలేడని అనేకమంది భావిస్తారు.

కాని, వీటివల్ల కలిగే ముఖ్య ప్రయోజనం ఒకటుంది. భాషకున్న బలం, విస్తృతి, మలచబడే గుణం వంటివి ఈ ప్రయోగాల వల్ల నిరూపింపబడతాయి. ఒక క్రీడాకారుడు తన పరిశ్రమ చేత శరీరానికున్న పరిమితుల్ని విస్తరింప జేస్తాడు. అలాగే, కవికూడా తన ప్రయోగాలతో భాషకున్న పరిమితుల్ని విస్తరింప జేస్తాడు. కళలో, కవిత్వంలో ప్రయోగాత్మతకు విశేష ప్రాధాన్యత నిచ్చిన ప్రముఖ అమెరికన్ కవయిత్రి Getrude Stein మాటల్లో చెప్పాలంటే, భాష అటూ ఇటూ మార్చగలిగే ఇంట్లో ఫర్నీచరు వంటిది కాదు. అది సహజంగా ప్రవహించే నీరు వంటిది. మనం ఏ రూపం ఇస్తే, ఆ రూపం అది తీసుకుంటుంది. అందువల్ల భాషతో కలిగే సాధ్యాసాధ్యాలను అన్వేషించటం కూడా కవిత్వం సాధించే ఒక పని.

ఆధునిక కాలంలో భావకవులు వృత్తాలను, ఇతర ఛందో రూపాలను వదిలిపెట్టి దాదాపు గీత పద్యాలకే పరిమితమయ్యారు. కృష్ణశాస్త్రి గారు తన ఖండికలలో 5,6 పాదాలున్న గీత పద్యాలు రాయటం, చివరి పాదం మధ్యలోనే పద్యం ముగించటం వంటివి చేసారు. అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ క్రింది పద్యం అలాగే ముగుస్తుంది.

.. ఎదియె అపూర్వ మధుర

రక్తి స్పురియించు గాని అర్థముకాని

భావ గీతమ్ములవి ...

ఏక కథా వర్ణనతో సాగే కావ్యాల స్థానంలో వివిధ అంశాలపై రాసిన కొన్ని ఖండికలతో కూర్చిన ఖండ కావ్యాలను వెలువరించటం కూడా భావకవులు చేసిన ఒక ప్రయోగంగా చెప్పుకోవచ్చు. వారి తరువాత వచ్చిన శ్రీశ్రీ, ఛందస్సుతో, కవితా రూపాలతో ఎక్కువగా ప్రయోగాలు చేసారు. మాత్రా ఛందస్సు, ముత్యాల సరాలు, లిమరిక్కులు, పంచపదులు... ఇలా అనేక రూపాలలో శ్రీశ్రీ కవితలు రాసారు. ఛందస్సుల సర్పపరిష్వంగం అన్నవాడే, తన సిగరెట్టు పొగ ఊదుతూ ఆ పాములతోనే నాట్యం చేయించాడనిపిస్తుంది. సిరిసిరి మువ్వ శతకంలో కంద పద్యాలతో చేసిన తమాషాలు చెప్పనక్కర్లేదు. ఉదాహరణకు, మ, న, స అనే మూడక్షరాలు, వాటి గుణింతాలు మాత్రమే వచ్చేట్టుగా రాసిన త్యక్షర కందం చూడండి :

మనసాని నిసిన సీమా

మనసా మసి మనిసి మనసు మాసిన సీనా

సినిమానస మాసనమా

సినిమానిసి సీమసాని సిరిసిరి మువ్వా!

అన్ని ఆంక్షలతో పై కందం రాసినా మళ్ళీ యతులు, ప్రాసలు లేకుండా స్వచ్చంద కందం రాసారు

తేనెకు సీసా బంగరు

పళ్ళానికి గోడ చేర్పు కావాలి సరే ...

అలాగే, రకీ, ఠకి ప్రాస పాటించి దానిని కంటికింపయిన ప్రాస అనటం ఇటువంటిదే. కొత్త పదాలు, విచిత్రమైన పదబంధాలు సృష్టించటం ఒక రకమైన ప్రయోగం. శ్రీశ్రీకి ఎప్పుడో మాస్కోకి వెళ్ళే అవకాశం రాకపోతే, అది లేకపోయినా, విస్కీ సేవిస్తూనే శ్రీస్కీనై బతకగలనని చెప్పారు. పఠాభి తన కవితలలో హైహీలు యాన వంటి పద బంధాలు వాడారు. శబ్ద పరంగానే కాకుండా, అర్థ పరంగా కూడా చిత్రమైన సంయోజనాన్ని కొందరు సాధిస్తారు. ఉదాహరణకు ఇటీవల ఎమ్మెస్ నాయుడు ప్రచురించిన గాలి అద్దం సంకలనంలో గాలి ముత్యాలు, నీటి బొగ్గులు, సూర్య విశ్రాంతి వంటి పద బంధాలు ఆశ్చర్యం కలిగిస్తాయి.

పురాణ ప్రతీకల్ని వేరే సందర్భాలో వాడటం కూడా ఇటువంటి కోవలోకే వస్తుంది. శ్రీశ్రీ రుక్మీణీనాథశాస్త్రిని ‘వాణికీవు లిప్ స్టిక్కయ్యా’ అంటారు. జ్వరం గురించి వేగుంట మోహన ప్రసాద్ రాసిన ఒక కవిత (జీవన జ్వరతీవ్రత)లో

‘నరసూ, నుదిటి మీద చల్లని చేతుల్తో నువ్వుంచిన

మంచుముక్క పార్వతీదేవి సబ్బు బిళ్ళ’

అంటాడు. మొత్తానికి వీరిద్దరూ కాస్మిక్ ఫిగర్స్ వాడే కాస్మటిక్స్ గురించి సమర్థవంతమైన చమత్కారం చేసారని చెప్పుకోవాలి.

వచన కవిత్వం వాడకంలోకి వచ్చాక, దానిని ఆకర్షణీయం చెయ్యటానికి అనేక టెక్నిక్ లు వాడారు. అంత్యప్రాస, ఆరుద్ర వంటి ఏకొద్దిమంది చేతుల్లోనో తప్ప, ఎక్కువ ఫలవంతం కాలేదు. వచన కవిత్వంలో భాగంగా కథా కావ్యాలు రాయాలని ఒకరిద్దరు ప్రయత్నం చేసారుగాని, ఆ ప్రక్రియ ఎక్కువ సాగలేదు. కవితను విస్తరించి చెప్పటం, అవసరమైన దానికంటే ఎక్కువ చెప్పటం కొందరి విషయంలో జరిగింది. ఈ విస్తరణ వల్ల, ఒక రకంగా కవిత్వంలో ఒబీసిటీ ఏర్పడిందని చెప్పవచ్చు. ఎవరు ఎవరి గురించి అన్నారో గుర్తులేదుగాని, ఒక మంచి వాక్యం కోసం టన్నుల కొద్దీ చెత్త రాసాడనే వ్యాఖ్య ఒకసారి విన్నాను. అటువంటి కాలంలో, అమ్మాయిలాగా సన్నగా, నాజూకుగా ఉండే పద్యాలను ఫేషన్ చేసింది ఇస్మాయిల్ గారే. ఆ రూపానికి ఒంటి పేట గొలుసులా రెండో అక్షరం ప్రాస. అంత్య ప్రాస బదులు, తెలుగుకు సహజంగా అమరే రెండో అక్షరం ప్రాస అనే సాంప్రదాయ పద్య లక్షణాన్ని వచన కవిత్వంలో ప్రయోగించి విరివిగా వాడిన ఘనత ఇస్మాయిల్ గారికే దక్కుతుంది.

 

వచన కావ్యాలలో విజయవంతమైన ప్రయోగాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది నగ్నముని కొయ్య గుర్రం. ఆధునిక మహా కావ్యంగా చేరా ప్రశంసలందుకున్న ఈ కావ్యం, దివిసీమ ఉప్పెనలాంటి విషాద సంఘటనకి కవి స్పందనని, ప్రభుత్వ అలసత్వంపై కవి నిరసనని ఎంతో కవితాత్మకంగా చెబుతుంది. “చివరి విందులో చివరకు తననెవరు మోసం చేస్తారో జీసస్ కు తెలుసు, తప్పెవరిదో నాకు తెలుసు, అయినా నెపం కాస్సేపు సముద్రం పైకి నెడతాను” వంటి గుర్తుండిపోయే వాక్యాలెన్నో ఈ కావ్యంలో దొరుకుతాయి. తన జీవిత చరిత్రను, లేదా జీవితంలోని కొన్ని ఘట్టాలను వర్ణిస్తూ మో రాసిన “పునరపి”, “బతికిన క్షణాలు” కూడా మంచి వచన కావ్యాలు.

 

పెద్ద కవితలు, కథా కావ్యాలు, కథ లేని కావ్యాలు మొదలైన వాటితోబాటు, మరొకవైపు చిన్న కవితల ప్రయోగాలు కూడా జరిగాయి. ఉద్యమం కాని ఉద్యమం , మినీ కవితా ఉద్యమం ఒక దశలో కొంతకాలం నడిచింది. ఈ ఉద్యమం ఊపు మీద ఉన్న రోజుల్లో ఒక కవి ”లే” అనే ఏకాక్షర కవిత కూడా రాసాడు. మెజారిటీ కవుల దృష్టిలో కవిత్వమంటే ప్రజలను నిద్ర నుంచి మేల్కొలిపేదే కాబట్టి, ఆ మొత్తం సారాన్నీ ఒక అక్షరంలోకి కుదించాడన్నమాట ఆ కవి. అదే రోజుల్లో అలిసెట్టి ప్రభాకర్ తన మినీ కవితలకి తనే మంచి చిత్రాలువేసి ప్రాచుర్యంలోకి తెచ్చాడు. వాగ్గేయకారుల గురించి వింటాం గాని, చిత్రకారులైన కవులు మనకు చాలా అరుదు. అందువల్ల, ప్రభాకర్ కవితా చిత్రాలు ఒక ప్రత్యేకమైన ప్రక్రియగా గుర్తుంటాయి. తరువాతి కాలంలో ఇస్మాయిల్ గారు, గాలి నాసర రెడ్డి, బివివి ప్రసాద్ వంటి వారు రాసిన హైకూలు కూడా చిన్న కవితలలో చెప్పుకోదగ్గ ప్రయోగం. అదే సమయంలో, ప్రపంచ పదులు, నానీలు వంటివాటి గురించి ఎంత తక్కువ తలుచుకుంటే అంత మంచిది.

 

ఇకపోతే, కవితను అచ్చువెయ్యటంలో వైచిత్రిని చూపించటం ఒక పద్ధతి. ఆరుద్ర రాసిన “వెయ్యి వోల్టుల కవిత్వం” అనే కవితలో, కొన్ని లైన్లు + గుర్తుతోను, కొన్ని – గుర్తుతోను ఉంటాయి. కవితను చదివేటప్పుడు + గుర్తున్నవి ముందు చదివి, ఆ తరువాత – గుర్తున్నవి చదవాలి. ఈ ఉదాహరణను తన సిద్ధాంత గ్రంధంలో పేర్కొన్న సినారె విశ్లేషణ ప్రకారం, + గుర్తు విప్లవానికి, - గుర్తు రసికతకు చిహ్నంగా భావించాలసి ఉంటుంది.

అలాగే, పఠాభి ఒక గేయంలో “అడ్డము తిరిగెను అవనీస్థలి” అన్న దాంట్లో చివరి పదాన్ని అచ్చులో అడ్డంగా చూపించటం, “తలక్రిందులైనది ధరణీతలమ్ము” అన్నదాంట్లో రెండవ పదాన్ని తలక్రిందులుగా చూపించటం వంటివి చేసాడు. హిందీ, ఇంగ్లీషు వంటి వేరే భాషల పదాల్ని అదే భాషలో అచ్చువెయ్యటం, అంకెలకి సంబంధించిన పదం వస్తే అక్కడ అంకె వెయ్యటం - ౩తుంది, 6బయట వగైరా - కొంతమంది కవులు చేసారు.

అలాగే, విరామ చిహ్నాల గురించి కూడా ఒకమాట చెప్పుకోవచ్చు. శిఖామణి “కిర్రు చెప్పుల భాష” సంకలనంలో విరామ చిహ్నాలు లేకుండా ఏక వాక్యంగా సాగిన “పంచప్రయానాం” అనే కవిత ఉంది. “యానాం ధాతువు ప్రాణం మాతువు ప్ర ఉపసర్గ ఉపశ్రుతికి ప్లుతం చేరిస్తే యానమో యానమో ప్రయానమో మోకి మాత్రమేం తెలుసు కనుక అనంత అవిశ్రాంత నిరంతర చిరంతన ఆద్యంతాలులేని...” ఇలా సాగే ఈ కవిత మో ప్రభావంతో రాసిందని తెలుస్తూ ఉంటుంది. వీరిద్దరూ కలిసి జంటగా రాసిన ఒక కవిత కూడా ఉంది. అది“చిలక్కొయ్య” సంకలనంలో దొరుకుతుంది.

రూప పరంగా కాకుండా, అభివ్యక్తి పరంగా జరిగిన ప్రయోగాలలో శ్రీశ్రీ, నారాయణబాబు, మో రచించిన అధివాస్తవిక కవిత్వం, ఆరుద్ర మొదలైనవారు అనుసరించిన సింబాలిజం గురించి పేర్కొనాలి. వీరు రాసిన అధివాస్తవిక కవిత్వంలో ఒక ముఖ్యమైన తేడా ఏమిటంటే, శ్రీశ్రీ అధివాస్తవికత ఎక్కువగా శబ్దం మీద ఆధారపడి ఉంటుంది. “జీబ్రాకి ఆల్జీబ్రా చిహ్నాల లాంకోటూ, పాంకోళ్ళూ తొడిగి...” వంటి వాక్యాలలో అది తెలుస్తుంది. దీనికి భిన్నంగా, మో, ఆయన అనుచరులు రాసిన కవిత్వంలో అది ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. సింబాలిజం లేదా ప్రతీక వాదాన్ని ఆరుద్ర తన “త్వమేవాహం” కావ్యంలో విరివిగా వాడారు. నిజాంకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణా విప్లవం ఈ కావ్యానికి ప్రేరకమే అయినా, కాలం ఇందులో ప్రధానాంశం. కాలానికి ప్రతీకగా గడియారాన్ని తీసుకుని, మళ్ళీ అందులో చిన్నముల్లు పెట్టుబడిదార్లకి, పెద్ద ముల్లు మధ్యతరగతి ప్రజలకు, సెకండ్ల ముల్లు శ్రామికులకు ప్రతీకలుగా వాడారు. అంటే, ఆయా ముళ్ళు చేసే శ్రమను బట్టి వాటికి ఒక వర్గాన్ని కేటాయించారన్న మాట. ఇదే వర్గ దృక్పథాన్ని పైథాగరస్ థీరంకి అన్వయించటం మరొక విశేషం. లంబకోణ త్రిభుజంలో అడుగు భుజం శ్రామిక వర్గానికి, దానిపై ఆధారపడి నిలిచే పెట్టుబడిదారీ వర్గం లంబానికీ ప్రతీకలైతే, ఈ రెండిటి సంఘర్షణతో ఏర్పడే కర్ణం ఒక నూతన వ్యవస్థకు ప్రతీకగా నిలుస్తుందని ఇందులో ఆరుద్ర ప్రతిపాదిస్తారు. కేవలం గణితమే కాకుండా, మానవ శరీర శాస్త్రం, వృక్ష శాస్త్రం, మనో విశ్లేషణ శాస్త్రం, నౌకా శాస్త్రం వంటి అనేక వైజ్ఞానిక శాస్త్రాల నుండి గ్రహించిన పారిభాషిక పదాల్ని ఆరుద్ర తన కవితల్లో ప్రతీకలుగా వాడుకున్నారని సినారె తన సిద్ధాంత గ్రంధంలో వ్యాఖ్యానిస్తారు.

మన కవిత్వంతో పోలిస్తే, పాశ్చాత్య కవిత్వంలో ప్రయోగ ధోరణి మరింత ఎక్కువ. ఉదాహరణకి, రాబర్ట్ గ్రెనియర్ అనే కవి విడివిడి వాక్యాలు, పదాలు రాసిన 500 ఇండెక్స్ కార్డులను ఒక బాక్స్ లో కూర్చి, Sentences అనే సంకలాన్ని వెలువరించాడు.(ఈ కార్డుల్ని ఇక్కడ చదవవచ్చు.) అలాగే ఎరికా బామ్ అనే కవయిత్రి Dogs Ears అనే సంకలనం ప్రచురించింది. ఏవో కొన్ని paperback books నుంచి తీసుకున్న కొన్ని పేజీలను కుక్క చెవుల ఆకారంలో మడిచి, వాటి ఫొటోలతో ఆమె ఈ సంకలనాన్ని రూపొందించింది. ఇటువంటి సంకలనాలను ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాన్నది పాఠకుని ఊహా శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఈ సందర్భంగా కాళోజీ నాతో అన్న ఒక మాట గుర్తొస్తుంది. నేనేదో సామాన్య అనుభవాల గురించి రాసిన సరళమైన కవితలకే ఆయన “మీదంతా brain poetry” అనేవారు. మరి, ఇటువంటి ప్రయోగాల్ని చూపిస్తే ఆయన ఏమనేవారో అని నాకనిపిస్తుంది.

“కవిత్వంలో ఇతర కళలు” అనే అంశం మీద నేను గతంలో రాసిన ఒక వ్యాసంలో ఒక సందేహం ప్రకటించాను. ఒక సంగీతాన్ని విన్నప్పుడుగాని, కళా రూపాన్ని చూసినప్పుడు గాని కవిలో కలిగిన స్పందనని కవిత్వీకరిస్తూ రాయటం సాధారణంగా కనిపించే పద్ధతి. అలాకాకుండా, ఒక ఎమ్మెస్ పాటను వింటున్నట్టుగానో, పికాసో చిత్రం, లేక మన ఎస్వీ రామారావు గారి చిత్రాన్ని చూస్తున్నట్టుగానో అనుభూతినిచ్చే కవిత రాయటం సాధ్యమేనా అని. ఇటీవలి కొందరు కవులు రాస్తున్న abstract poems అదేపని చేస్తాయనుకుంటాను. పైన చెప్పిన Dogs Ears అన్న పుస్తకమైతే రెండిటి మధ్య ఒక అభేదాన్ని పాటిస్తూ చేసిన ప్రయత్నం. ఇందులో చేర్చిన ఫోటోలను ఒక చిత్రంగా భావించాలా, లేక ప్రతి ఫోటోలో ముక్కలుగా కనిపిస్తున్న వాక్యాలను కవిత్వంగా భావించి అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలా అన్నది కూడా వివాదాంశమే అవుతుంది. (ఇస్మాయిల్ గారి నక్సల్ భావే పద్యంలో “వీడిని నక్సలైట్ అందామా, సర్వోదయిష్టు అందామా! రెండూనేమో, రెండూ ఒకటేనేమో” అన్నట్టుగా ఉంటుంది.)

ఇటువంటి ప్రయోగాలలో ప్రధాన లక్ష్యం పాఠకుడిని ఒక షాక్ కి గురి చెయ్యటమని నాకనిపిస్తుంది.  మనకున్న పూర్వ భావన లన్నిటినీ పటాపంచలు చెయ్యటం వాటి ముఖ్యమైన పని. ఇది గొప్ప కవిత్వం కాదుగాని, అవసరమైన కవిత్వమే అని నా భావన. ఎందుకంటే, మన ఆలోచనా పరిధిని సహన శీలతని ఇది విస్తృతం చేస్తుంది. నాకు రావటానికి అవకాశం కూడా లేని ఊహని కవిలో చూసినప్పుడు ఒక ఆనందం కలుగుతుంది. ముందు abstract గా, తిక్కగా అనిపించే పద్యాలు కొంత అలవాటు పడ్డాక బాగానే అనిపిస్తాయి. మొదట్లో ఇస్మాయిల్ గారి పద్యాలు కూడా అస్పష్టంగా ఉంటాయని అనుకునే వాళ్ళం. కాని, ఇప్పుడెవరూ ఆ మాట అనరు. ఇది అలవాటు పడటం వల్ల వచ్చిన మార్పే. ఐతే మరీ మితిమీరకుండా, వైవిధ్యానికి, వెర్రితనానికీ ఉన్న తేడాను గుర్తెరిగి నడవవలసిన బాధ్యత కవి కూడా ఉంటుంది. తెలుగు సాహిత్య విమర్శలో కష్టమైన పద్యాలను వ్యాఖ్యానించి, వాటిని అర్థం చేసుకోవటానికి సహకరించే స్పెషలైజేషన్ ఒకటి రూపొందితే బాగుంటుంది.

ఇటువంటి కవిత్వంలో ఉండే మరొక ముఖ్య లక్షణమేమంటే, వీటిలో ఎవరి మీదా కంప్లయింట్ ఉండదు. ఈ కవితల మీద, అవి రాసే కవుల మీద కొందరికి కంప్లయింట్ ఉండవచ్చు గాని, వారికి ఎవరి మీదా కంప్లయింట్ ఉండదు. ఇది ఒక మంచి లక్షణం.

చివరిగా చెప్పుకోవలసిందేమంటే, మన ఆలోచనా పరిధిని విస్తృతం చేసి, మన అవగాహనకు కొత్త ద్వారాలు తెరిచే ప్రయోగాలు కొంత కష్టంగా అనిపించినా, ఆహ్వానించదగినవే. దీర్ఘ కాలంలో వాటివల్ల భాషకి, కవిత్వానికి ఉపయోగం చేకూరుతుంది.

(నాటా సభలలో చేసిన ప్రసంగానికి వ్యాస రూపం. ఉపయోగపడిన గ్రంధాలు : ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం, డా. సి.నారాయణ రెడ్డి సిద్దాంత గ్రంధం ఆధునికాంద్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు)

*****

మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...
 

Bio

విన్నకోట రవిశంకర్

అమలాపురంలో పుట్టిన విన్నకోట రవి శంకర్ గత ముఫై ఏళ్ళగా తనదైన ముద్రతో ఆధునిక కవులలో అగ్రశ్రేణి కవిగా గుర్తింపు పొందారు. తన అభిమాన కవి ఇస్మాయిల్ అని చెప్పుకునే రవి శంకర్ నిత్య జీవితంలో ఎదురయ్యే సున్నితమైన అనుభవాలని గాఢంగా ఆవిష్కరించడానికి కవికి స్పష్టత, నిజాయితీ అవసరమని విశ్వసిస్తారు. “కుండీలో మర్రి చెట్టు” (1993), “వేసవి వాన” (2002), “రెండో పాత్ర” (2010) మొదలైన స్వీయ కవితా సంపుటాలు, అనేక ఇతర కథలు, కవితలు, కవితా విశ్లేషణలు ప్రచురించారు. కవితా సంకలనాలకి సంపాదకుడిగా ప్రముఖ పాత్ర వహించారు. శ్రీ కళ, కూతురు హిమ బిందులతో పదిహేనేళ్ళగా సౌత్ కెరోలైనా రాష్ట్రంలో కొలంబియా నగరం నివాసం.

***

Vinnakota Ravi Shankar
Comments
bottom of page