top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
adhyatmika.jpg
pustaka-parichayaalu.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
alanati.jpg
paatasanchikalu.jpg

సంపుటి 7  సంచిక  4

అక్టోబరు-డిసెంబరు 2022 సంచిక

maagurinchi.jpg
rachanalu.jpg

వ్యాస​ మధురాలు

విమర్శ - సమీక్ష 

Madhuravani_Social

కర్లపాలెం హనుమంతరావు 

విమర్శ అంటే విచారణ అని బ్రౌణ్యం. పక్షపాతం లేని సహృదయపూర్వక సానుకూల తుల్యమానం చక్కని పరిశీలన విమర్శ అవుతుంది. సాహిత్యానికీ, సంఘానికీ అది ఉపకరిస్తుంది కూడా. 

 

 ఇంగ్లాండు 'ఫిలిప్స్ సిడ్నీ' తన “ఏన్ అపాలజీ ఫర్ పోయెట్రీ" అని విమర్శగ్రంథంలో 'కవిత్వం నిరసింపరాని' దని అంటే 1579 నాటి స్టీవ్ సన్ 'ది స్కూల్ ఆఫ్ అబ్యూజ్' అనే  విమర్శ గ్రంథంలో ' కవిత్వం అబద్ధాల పుట్ట' అనేశాడు. అచ్చంగా అదే దారిన మన కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి కూడా 'కవిత యన మృష...' అన్నాడు.

 

దుయ్యబడితేనే విమర్శ అన్న దురభిప్రాయం ఈనాటికీ కద్దు. బండి "ఱ" తో రకారానికి నేస్తం కల్పించిందని పోతనగారి భాగవతాన్ని సైతం తప్పుపట్టిన మహనుభావులు మనకు కొల్లలు. రేఫ ద్విరేఫల నిబంధన చేసిన అప్పకవి తన నియమం తానే ఉల్లంఘించాడు మరి. అందుకే సంస్కృతంలోని 'దుర్జనముఖ చ పేటిక' అని, తెలుగులోని 'విమర్శాదర్శ విమర్శాధర్మము' లాంటి గ్రంథాలు  కువిమర్శలను  నిర్ద్వందంగా ఖండించడానికి ఇట్లాంటి కుత్సితపు పోకడ కారణం.

 

పాశ్చాత్యులూ తక్కువేం తినలేదు. పోపు, అడిసనులాంటి వారి గ్రంథాలు విమర్శలో  ప్రదర్శించిన  ప్రతిభ- మిల్టను, గ్రేల రచనా విమర్శల సందర్భంలో  జాన్సన్ ప్రదర్శించాడు కాదు. మిల్టనుతో రాజకీయంగా, గ్రేతో వ్యక్తిగతంగా ఉన్న విభేదాలు అంత సాహిత్య వేత్త నిష్పక్షపాతబుద్ధినీ ప్రశ్నార్థకం చేశాయి. అందుకే కువిమర్శకులను  వ్రణంబుఁ బరి కించు మక్షిక వితతుల్ ' అని అట్టిపోసింది కనుపర్తి అబ్బయామాత్యుడు. 

 

యయావరీయుడు విమర్శకులను ఆరోచకి, సతృణాభ్యవహారి, మత్సరి, తత్వాభినివేశి- అని నాలుగురకాలుగా విభజించాడు.

ఎంత మంచి కృతి అయినా సరే ఆరోచకుడికి రుచించదు.

మంచివీ, చెడ్డవీ కూడా శభాష్ అంటాడు సతృణాభ్యవహారి.

మత్సరి అసూయతో తప్పులు వెతికితే,

పక్షపాతం లేకుండా, పాలూనీళ్ళూ వేరుచేసే రాజహంసలాగ, కావ్య విమర్శ చేసేవాడు తత్త్వాభినివేశి.

 

కావ్యపరిశ్రమ తెలిసి చక్కని వివరణలతో శబ్దాల కూర్పును రసామృతంలగా అందించే తత్త్వాభినివేశులు అరుదని ' కావ్య మీమాంస ' అభిప్రాయపడుతుంది. మార్క్సు యథార్థవాదాన్ని సాహిత్యంలో విస్తృతం చేసి సాహిత్యాన్ని యుగవాదాలుగా సరికొత్త విధానంలో విమర్శించిన ఉత్తమ విమర్శకుడు కాడ్వెల్ అట్లాంటి వాడే! 

విక్టోరియారాణి యుగం నాటి మేథ్యూఆర్నాల్డు  కూడా స్వయంగా గ్రంథ విమర్శ చేయడమే కాకుండా, ఎలా విమర్శ చేయాలో ఆయన నేర్పించేవాడు కూడా. 

లోతైన అనుభవంతో అతిశయోక్తులు లేకుండా, అంశానికి మాత్రమే పరిమితమై, ఇతరేతర రచనలతో సందర్భోచితంగా పోలుస్తూ కావ్యంలోని విలువలమీద నిర్దుష్టమైన తీర్పు ఇచ్చే సామర్ధ్యం గలవాళ్లని ఉత్తమ జాతి విమర్శకులు అన్నాడు రిచర్డ్సు. 

కావ్యారణ్యాన్ని శుభ్రం చేసి నలుగురూ నడిచే సులువైన బాటను వేసేవాడు- అని స్కాటుజేమ్సు అంటే, సాహిత్య సాగరాలని మధించి ముత్యాలు ఏరి తెచ్చే ఈతగాడు సద్విమర్శకుడని  టి.యస్. ఇలియట్ అంటాడు. వజ్రంలాంటి సాహిత్యాన్ని సానపట్టి మరింత మెరుగులు దిద్దడమే సరయిన విమర్శ ధర్మం అన్నది విజ్ఞుల వాక్కు. 

కాకపోతే, ఒక కావ్యం మీది విమర్శలన్నీ ఒకే విధంగా ఉండవు. ఇంగ్లండు విమర్శకులకు ఉత్కృష్టమనిపించిన షేక్ ష్పీరియన్ సాహిత్యం ఫ్రాన్స్ విద్వాంసులకు పరమ చెత్తలా తోచింది. మిల్టన్ 'పారడైజ్ లాస్టు' కూ ఇదే గతి. ఎక్కడిదాకానో ఎందుకు? దిజ్ఞ్నాగాచార్యుడు కాళిదాసువి  కావ్యాలే కాదు పొమ్మంటే మల్లినాథుడు వాటినే 'సంజీవని 'తో పోల్చాడు కదా! ఎంకిపాటలు ఎంతో గొప్ప కవిత్వమని పంచాగ్నుల వారంటే, అది కవిత్వమే కాదని బసవరాజుగారు కొట్టిపారేశారు మరి. 

పాశ్చాత్య సాహిత్యంతో మన పరిచయం ఇటీవలది. కాని, అంతకు ముందు నుంచే మన వాజ్ఞ్మయంలోనూ కావ్యశాస్త్రాలకు కొదువలేదు. 

వేదకాలం నుంచే కావ్యశాస్త్ర ప్రాదుర్భావం జరిగిందనే వాదనా కద్దు.

అలంకారం, ఛందస్సుల రూపంలో వేదాల్లో స్పష్టంగానే విమర్శలు కనిపిస్తాయి. పురాతన సంస్కృత వ్యాకరణశాస్త్రమూ ఓ రకంగా విమర్శనా గ్రంథమే. నిరుక్తం, ప్రాతిశాఖ్యం, నిఘంటువులు గట్రాకూ ఈ వాజ్ఞ్మయ శాఖలో  చోటివ్వక తప్పదు. యాస్కుడు అయిదారురకాల ఉపమాలంకారాలు వివరిస్తే, పతంజలి తన మహాభాష్యంలో పాణిని సూత్రాలు పరామర్శించాడు. భరతుడి నాట్యశాస్త్రానికి ముందు కావ్యశాస్త్రం దండిగా వుండేదని పండితులంగీకరించిన సత్యమే. భరతుడి రససిద్ధాంతం పురస్కరించుకొని లోల్లటుడు, శంకుకుడు, భట్టనాయకుడు, అభినవగుప్తుడు తమవైన  వ్యాఖ్యా నాలు వినిపించారు. క్రమంగా రససంప్రదాయం, అలంకారసంప్రదాయం, వక్రోక్తిసంప్ర దాయం, రీతిసంప్రదాయం, ధ్వనిసంప్రదాయం లాంటివి శాస్త్రరూపంలోనే ఆవిర్భావించాయనుకొండి.

 

భారతీయ సాహిత్యశాస్త్ర సిద్ధాంతం ప్రకారం శబ్ధం, అర్థం, రసం- ఈ మూడిటితోనే కావ్యం పరిశీలన జరగాలి. భామహుడి కావ్యాలంకారం, దండి కావ్యాదర్శం, ముమ్మటుడి కావ్య ప్రకాశం, ఆనందవర్ధనుడి ధ్వన్యాలోకం, విశ్వనాథుడి సాహిత్యదర్పణం, రాజశేఖరుడి కావ్యమీమాంస, క్షేమేంద్రుడి ఔచిత్య విచారం, ఉద్భటుడి అలంకార సంగ్రహం, రుద్రటుడి కావ్యాలంకారం ఇందుకు సుప్రసిద్ధ ఉదాహరణలు. పాశ్చాత్య సిద్ధాంతాల పరిచయానికి ముందు తెలుగు సాహిత్యం వీటినే అనుసరించింది.

పాశాత్య సాహిత్యంలో క్రీస్తుకు పూర్వమే సాహిత్య విమర్శ కనిపిస్తుంది. ఆరిస్టోఫెన్సు, సోక్రటీస్, ప్లేటో వంటివారి రకరకాల కావ్య సిద్ధాంతాలు వెలువడ్డా  విమర్శకుడిగా ప్లేటో మాత్రమే ప్రథమ విమర్శకుడిగా గుర్తింపు సాధించాడు.

.

 ఇలియట్ ఎంత ఆధునిక కవో అంత ఆధునిక విమర్శకుడు కూడా. ఇతగాడి ప్రభావం ప్రపంచమంతటా ఆధునిక రచయితల మీద కనిపిస్తుంది.

మన దగ్గరా ఉద్దండలయిన పండితులు విమర్శాత్మకమయిన వ్యాసాలు,  గ్రంథాలు కొరవలేకుండా వెలువరించారన్న మాట కాదనలేం. కట్టమంచి రామ లింగారెడ్డిగారి 'కవిత్వతత్త్వ విచారము' , దీపాల పిచ్చయ్య శాస్త్రిగారి 'సాహిత్యసమీక్ష', గిడుగు వెంకటరామమూర్తిగారి 'ఆంధ్ర పండిత భిషక్కుల భాషాభేషజము' లాంటి విమర్శనా గ్రంథాలు వెలువడ్డ మాటా నిజమే. కాని, ఇవాళ  మన భారతీయ విమర్శను పాశ్చాత్య పద్ధతులే ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టే పడమటి దిక్కు విమర్శనా పోకడలను ఈ కొంచెంగానైనా తడమడం. 

 తెలుగులో సాహిత్య విమర్శ లేదనుకునేవాళ్లకు లేదు. ఉందన్నవాళ్లకు ఉంది. ఉన్నదయినా వుండవలసినంత ఉందా అన్న సందేహం ఎలాగూ ఉంది. తెలుగుకి ' లక్షణం' మొదట సంస్కృతంలో చెప్పడం జరిగింది! పార్రంభంలో ప్లేటో 'రిపబ్లిక్', ఆరిస్టాటిల్ 'పోయెటిక్సు' లాంటివే తెలుగులోకి వచ్చాయి. ప్రాంతీయ భాషలనించి 'కాళిదాస భవభూతులు' వంటివి ఏ వొకటో రెండో అనువాదం అయ్యాయి కాని, తెలుగుకంటూ  ప్రత్యేకమైన లక్షణగ్రంథాలు తెలుగులో స్వతంత్రంగా వెలువడ్డం అప్పుడూ తక్కువే. ఇప్పుడూ మరీ అంత ఎక్కువేం కాదు. దొరికిన సంస్కృత లక్షణగ్రంథాల అనుకరణలు, అనుసరణల మీదనే ఆధార పడటం నిన్న మొన్నటి దాకా. పెద్దన ఉత్పలమాలిక వంటి పద్యాలలో, వ్యాఖ్యానాలలో, నిబంధన గ్రంథాలలో, కుకవి నిందలలో విమర్శ సూత్రప్రాయంగా తొంగిచూసినా పడమటి గాలి సోకిన తరువాత గాని, ఇప్పుడు మనం అనుకునే పద్దతిలో విమర్శ తెలుగులో వికసించలేదంటే ఒప్పుకోక తప్పదు మరి. 

 

- ( పురిపండా అప్పలస్వామి గారి ' సాహిత్య వ్యాసములు - పీఠిక ఆధారంగా ) 


Feedback
editor@madhuravani.com
 
©  2022 madhuravani.com

మధురవాణి కొత్త సంచిక విడుదల వివరాలు ఉచితంగా సకాలంలో అందుకోవాలంటే మీ పేరు, ఇ-మెయిల్ చిరునామా editor@madhuravani.com  కి పంపించండి.

మీ వివరాలు ఎవరితోనూ పంచుకొనబడవు.​

Website Designed
 &  Maintained
 by
Srinivas Pendyala

bottom of page