MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
మధురవాణి ప్రత్యేకం
సాహితీ సౌరభాలు
మహాభారతము – ఆంధ్రీకరణము – తిక్కన సోమయాజి
ప్రసాద్ తుర్లపాటి
అక్టోబరు 2020 సంచికలో ‘ కవిత్రయ మహాభారత ఆంధ్రీకరణము’ ప్రారంభించి నన్నయ గారి శైలి ని కొన్ని ఉదాహరణాలతో వివవరించాను. ఈ సంచికలో తిక్కన భారతం గురించి వివరించే ప్రయత్నం చేస్తాను.
హృదయాహ్లాది, చతుర్థ, మూర్జిత కథోపేతంబు, నానా రసా
భ్యుదయోల్లాసి విరాటపర్వ; మట యుద్యోగాదులుం గూడఁగాఁ
బదియేనింటిఁ దెనుంగుబాస జనసంప్రార్థ్యంబులై పెంపునం
దుదిముట్టన్ రచియించు టొప్పు బుధ సంతోషంబు నిండారఁగన్.
సహృదయులకు ఆహ్లాదకారిణి, పదునెనిమిది పర్వాలలో నాల్గవది, అయిన విరాటపర్వముతో మొదలుపెట్టి, ఆపైన ఉద్యోగపర్వం నుంచి స్వర్గారోహణ పర్వము వరకు ఉన్న పర్వాలతో కలుపుకొని మొత్తము 15 పర్వాలను ప్రజలచే కీర్తింపబడునట్లుగా, పండితులకు సంతోషదాయకముగా తెలుగులో రచించుట సమంజసం అంటూ తన విరాటపర్వ అవతారికలో సాహితీ సంకల్పం చేశాడు తిక్కన సోమయాజి.
ఇది తిక్కన సోమయాజి మనసులో కలిగిన మహాసంకల్పము. క్రీ.శ. 1225-1260 నడుమ తిక్కన సోమయాజి ఆదికవి నన్నయ మొదలు పెట్టిన మహాభారత ఆంధ్రీకరణాన్ని పూర్తిచేయడానికి శ్రీకారం చుట్టాడు.
ఆంధ్ర మహాభారతము లోని విరాటపర్వము మొదలుకొని స్వర్గారోహణ పర్వము వరకు గల 15 పర్వములను రచించిన కవిబ్రహ్మ తిక్కన. అభినవ వ్యాసుడు అని కొనియాడబడినాడు తిక్కన. మారన తన మార్కండేయ పురాణములో తిక్కనను “పరాశర సూనుడు” అని ప్రస్తావించాడు.
ఉభయ కవిత్వ తత్త్వ విభవోజ్జ్వలు, సంహితా ధ్వర క్రియా
ప్రభు, బుధ బంధు, భూరిగుణ బంధురు, భారత సంహితా కధా
విభు, పరతత్వ బోధను, నవీన పరాశర సూను, సంతత
త్రిభువన కీర్తయినీయ యశు, తిక్కన కవీందృని కొలతు నర్ధి తోన్
వేద విహిత కర్మలను నిర్వహించిన వైదిక కర్మ యోగి, అపార గుణానిధి, త్రిలోక కీర్తిసాంద్రుడు, భారత కధా సంహితా విభుడు, అభినవ వ్యాసుడు అని కీర్తింపబడిన తిక్కన సోమయాజి ఆంధ్రమహాభారత రచన దీక్ష కంకణధారి అయినాడు. భారత రచనా కాలం నాటికి యజ్ఞం చేసి సోమయాజి అయిన తిక్కన అంతర్ముఖుడై, పరీణిత మనస్కుడై భారత రచనకు ఉపక్రమించాడు. తిక్కన తన మహాభారత భాగాన్ని హరిహరనాధుని అంకితం కావించాడు.
తిక్కన పురాణం అనిపించుదగిన మహాభారతాన్ని కావ్యాలక్షణ శోభితముగా ప్రబంధము గా రచియించి, దానికి నాటకీయతను కూడా సంతరించాడు. తిక్కన భారతం చదువుతుంటే ఒక నాటకము చూస్తున్నామన్న భావన కలుగుతుంది. తిక్కన రచనలో అర్ధము ననుసరించి శబ్దము నడుచును కాని, శబ్దము తీసిన దారిని అర్ధము నడువదు, అంటే అర్ధము భ్రంశము కాదు. తిక్కన తనను ””అమలోదాత్త మనీష మైననుభయ కావ్య ప్రౌధి పాటించు శిల్పమునన్ బారగుడాన్ కళావిదుడ” అని చెప్పు కున్నాడు.
అమలోదాత్తమనీషి నే నుభయకావ్యప్రౌఢిఁ బాటించుశి
ల్పమునం బారగుఁడన్ గళావిదుఁడ నాపస్తంబసూత్రుండ గౌ
తమ గోత్రుండ మహేశ్వరాంఘ్రికమలధ్యానైకశీలుండ న
న్నమకుం గొమ్మనమంత్రికిన్ సుతుఁడఁ దిక్కాఖ్యుండ సన్మాన్యుఁడన్
తిక్కన భారతం లో ముఖ్యంగా మూడు అంశాలు ప్రస్తావించబడతాయి – రాజనీతి, యుద్ధ తంత్రము మరియు బ్రహ్మ విద్యోపదేశము. తన కాలం నాటి సంఘములోని మతవైషమ్యాలను గమనించి శైవ వైష్ణవ మత కలహాలకు అతీతంగా హరిహరాద్వైతాన్ని సృష్టించి సంఘసస్కర్తగా నిలిచాడు.
శివాయ విష్ణు రూపాయ
శివ రూపాయ విష్ణవే
శివస్య హృదయగుం విష్ణో
విష్ణోశ్చ హృదయగుం శివః
శివ కేశవ అభేదాన్ని పాటించడం, వివరించడం కఠినతరమయినది. కవి ఋషులయిన పోతన, తిక్కన్న గార్లకే అది సాధ్యమయినది. పోతన గారి బాలకృష్ణుని వర్ణన మరియు తిక్కన్న గారి హరిహరనాధ స్తుతి, “కిమిస్తిమాలం కిం కౌస్తుభం వా” అనే శ్లోకం “శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణవే“ అనే విషయాన్నీ సూచిస్తున్నాయి.
ఆంధ్ర మహాభారతము ఆరంభములోనే హరిహరనాధుని స్తుతించి కావ్యారంభం కావించాడు తిక్కన. శైవ, వైష్ణవ సంఘర్షణల మధ్య ‘శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణవే అంటూ’ మతసామరస్యాన్ని ప్రొత్సహించిన సంస్కర్త తిక్కన సోమయాజి. తన భారత రచనను హరిహరనాధునకు అంకితమిచ్చాడు.
శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భ
ద్రాయితమూర్తియై హరిహరంబగు రూపము దాల్చి 'విష్ణు రూ
పాయ నమశ్శివాయ' యని పల్కెడు భక్తజనంబు వైదిక
ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొల్చెద నిష్టసిద్ధికిన్
లక్ష్మీదేవి అని శ్రీ గౌరీ అని పిలువబడే వనితకు హృదయము ఉప్పొంగగా శుభప్రదమైన రూపము దాల్చిన హరిహరనాధుని భక్త శిఖామణులు ప్రార్ధన చేయగా నేను కొలిచెదను.
కి మస్థి మాలం కిము కౌస్తుభం వా
పరిష్క్రియాయం బహుమన్యసే త్వం
కిం కాలకూట: కిము వా యశోద
స్తన్యం తవ వదా ప్రభో మే
తిక్కన తన దైవమయిన హరిహరనాధుని స్తుతిస్తూ, “ ఓ ప్రభూ, నీ అలంకరణలో ఎముకల దండలు వున్నాయి, కౌస్తుభ రత్నం వున్నాయి. నీవు కాల కూటము త్రాగవు, యశోద చనుబాలు త్రాగావు” అన్నాడు. గంగ, యమున నదుల కలయికలోని వెలుగుల వెల్లువవలె తిక్కనకు హరిహరనాధుడు సాక్షాత్కరించాడు.
హరిహారనాధుని కల్పించడం వలన, మహాభారత రచన వలన తిక్కన శాంతి విప్లవాన్ని విస్తరింపచేశాడు. నన్నయకు, తిక్కనకు వున్న మధ్య కాలం లో మత విద్వేషాలు సంభవించాయి. తిక్కన మహాభారతవతరణాన్ని సామాజిక, మత, ధార్మిక, సాహిత్య, సాంస్కృతిక సముద్ధరణకు సమర్థమయిన సాధనంగా మలచడంలో కృతకృత్యుడయినాడు. తెలుగు సాహిత్యంలో 1225 నుండి 1320 వరకు తిక్కన యుగము అంటారు. కవిత్రయంలో రెండవవాడైన తిక్కన సోమయాజి ఈ యుగానికి ప్రధానకవి. శివ, కేశవ సమన్వయ వేదాంత సమన్వయ కర్త తిక్కన.
తిక్కన సారస్వతములో చతుర్విధ కవితారీతులు కానవస్తాయి – కధా కధన శైలి, నాటకీయ శిల్పం, వర్ణన మరియు ఆత్మాశ్రయ భావ నివేదన. మహాభారత ఆంధ్రీకరణాన్ని ముగ్గురు త్రిమూర్తులు (నన్నయ, తిక్కన మరియు ఎర్రన ) – కథాకథనం తో, నాటకీయతతో, వర్ణన లతో ఏకీకృత కావ్యం గా మనకoదించారు. తిక్కన రసవదఘట్టాలను ఒక ప్రబంధ మండలి గా తీర్చిదిద్దాడు. నాటకం లో లాగా సంభాషణలను రసస్ఫోరకంగా తీర్చిదిద్దటం తిక్కన ప్రత్యేకత. తిక్కన అనువదించిన మహాభారత భాగం ఎంతో కఠినతరమయినది. విరాటపర్వము, ఉద్యోగ పర్వములలో నాటకీయత మరియు సంభాషణాచాతుర్యము స్పష్టముగా కానవస్తాయి. యుద్ధషట్కం (భీష్మ – స్త్రీ పర్వము వరకు ) అనువదించుట కఠినతరము. వీరుల స్వభావాలు, కూచితములైన ఆలోచనలు, పరస్పర సంభాషణలు, వీరోచిత పోరాటాలను, హస్తన్యాస, ముఖన్యాస ప్రహారాణాదులను చక్కగా వివరించారు. అంతేకాక, భగవంతుని ప్రభోధమయిన భగవద్గీత, విష్ణుసహస్రనామాలను, అనుశాసిక పర్వములో భీష్మ పితామహుడు ఉపదేశించిన రాజనీతి ఇత్యాదులు తిక్కన రచించిన భాగం లోనివే.
తిక్కన దృష్టిలో పంచమవేదమైన మహాభారతం ధర్మాద్వైతాన్ని గుర్తించి పరమ ధర్మము సాధించే గ్రంధము. తిక్కన మహాభారత ప్రారంభము లోనే చెప్పిన వేదవ్యాస స్తుతిలో తిక్కన ప్రయోగించిన విశిష్ట పద గుంఫనం “ధర్మాద్వైత స్థితి”, “ అనన్య సామాన్యమగు పరమధర్మ ప్రకారంబు “, తాను గుర్తించిన వేదాంతం. అందుకే మహాభారత విరాటపర్వం అవతారికలో ఈ విధంగా అన్నారు –
వేదములకు అఖిల స్మృతి
వాదములకు బహుపురాణ వర్గంబులకున్
వాదైన చోటుల దా
మూదల ధర్మార్ధ కామమోక్షస్థితికిన్
అంటే ఒక విషయములో వేదాలు మరియు పురాణాలు కనుక వైవిధ్యం గా చెపితే, మహాభారతం లోని విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అందుకే మహాభారతం పంచమ వేదమైనది.
తిక్కన కవితా శైలి కి కొన్ని ఉదాహరణలు –
కథనం –
నారదుడు ధర్మారాజు కు కర్ణుని చావుకు గల కారణాలను వివరించే సందర్భం –
వినుము నరేంద్ర విప్రుఁడలివెన్ జమదగ్నిసుతుండు శాప మి
చ్చె నమరభర్త వంచనముసేసె వరం బని కోరి కుంతి మా
న్చె నలుక భీష్ముఁడర్థరథుఁ జేసి యడంచెఁ గలంచె మద్రరా
జనుచిత మాడి శౌరి విధి యయ్యె నరుం డనిఁ జంపెఁ గర్ణునిన్
తొమ్మిది చిన్న వాక్యాలలో కర్ణుని చావుకు కారణాలన్నిటినీ లయబద్ధంగా చెప్పటం ఉద్దేశం. ఇది కథను చెప్పటానికి తిక్కన అనుసరించిన శైలి.
వర్ణన –
ఉత్తర గోగ్రహణ సమయమున ఉత్తరుడు చూసిన కురు సైన్య వర్ణన -
అభినవ జలధర శ్యామంబు లగునెడ | లాకు జొంపంబుల ననుకరింప,
సాంధ్యరాగోపమచ్ఛాయంబులగు పట్లు | కిసలయోత్కరములఁ గ్రేణి సేయ,
రాజమరాళ గౌరములగు చోటులు | తఱచుఁ బూఁ బొదల చందంబు నొంద,
హారిద్రరుచి సమానాకృతులగు ఠావు | లడరెడు పుప్పొడులట్లు మెఱయఁ,
గలయ నెగసి ధరాధూళి లలితవనము | దివికి నలిఁగాఁపు వోయెడు తెఱఁగు దాల్ప
గోగణము ముంగలిగ నేల గోడివడఁగ | నడచు కౌరవరాజు సైన్యంబుఁ గనియె.
ఆవుల మంద వెనుక వెళుతున్న కురు సైన్యం నడుస్తూవుండగా లేచిన రంగు రంగుల ధూళి అందమైన ఉద్యానవనం వలె ఉండి స్వర్గలోకానికి వలసపోవుచున్నదేమో అన్నట్లుగా అలరారినది.
ఉత్తర గోగ్రహణ సమయమున ద్రోణుడు -
సింగంబాకటితో గుహాంతరమునన్ జేర్పాటుమై యుండి మా
తంగ స్ఫూర్జిత యూధ దర్శన సముద్యత్క్రోధమై వచ్చు నో
జం గాంతార నివాస ఖిన్న మతి యస్మత్ సేనపై వీడె వ
చ్చెం గుంతీ సుత మధ్యముండు సమర స్థేమాభిరామాకృతిన్
అనగా సింహము ఆకలిగొని గుహలో చాలాకాలం నివాసముండి బయటకి వస్తూ, ఏనుగుల గుంపును చూస్తే, మితిమీరిన కోపంతో ఏ విధముగా దూకుతుందో, ఆ విధముగా అర్జునుడు అరణ్యవాసం వల్ల ఎంతో బాధపడి మన సేన మీదకు యుద్ధములో స్థిరంగా నిలచే ఆకారంతో వస్తున్నాడు. ఇక్కడ "వీడే" అన్న పదం మరింత శిష్య వాత్సల్యాన్ని సూచిస్తుంది
ద్రౌపది, ధర్మజుని గొప్పతనాన్ని భీమసేనునకు వివరించే సందర్భము -
ఎవ్వాని వాకిట నిభమద పంకంబు
రాజభూషణ రజో రాజి నడఁగు
నెవ్వాని చారిత్ర మెల్ల లోకములకు
నొజ్జయై వినయంబు నొరపు గఱపు
నెవ్వాని కడకంటి నివ్వటిల్లెడు చూడ్కి
మానిత సంపద లీనుచుండు
నెవ్వాని గుణలత లేడు వారాసుల
కడపటి కొండపైఁ గలయ బ్రాఁకు
నతడు భూరిప్రతాప, మహా ప్రదీప
దూర విఘటిత గర్వాంధకార వైరి
వీర కోటీర మణి ఘృణి వేష్టితాంఘ్రి
తలుఁడు కేవల మర్త్యుఁడే ధర్మసుతుడు
ధర్మజుని వైభవాన్నీ, అతని గొప్పతనాన్ని, అధికారాన్నీ, కీర్తినీ – అన్నిటినీ విశదీకరిస్తూ చెప్పే పద్యం ఇది. ధర్మరాజు వాకిట వున్న మదపుటేనుగుల మదధారల వలన నేలంతా బురద అయిపోతే, రాజదర్శనానికి వచ్చిన సామంతరాజుల రద్దీ కారణంగా వారి శరీరాల మీద అలంకరించబడిన కిరీటాలు, రత్నభరణాల లోని మాణిక్యాలు ఒకటొకటి రాచుకున్నందువలన – రాలిన వజ్రాల పొడి ఆ బురద యొక్క సౌందర్యాన్ని ఇనుమడింపచేస్తున్నది. అటువంటి ధర్మజుడు – వైరివీరుల గర్వాంధకారాన్ని దూరానికి తరిమివేసే గొప్ప దీపం లాంటి ప్రతాపంతో శత్రువుల చేత కాళ్ళు మ్రొక్కించుకునే ధర్మజుడు – కేవలం మానవుడేనా ! సకలగుణోపేతుడు ధర్మసుతుడు.
సంభాషణ శైలి –
తిక్కన సంభాషణా చాతుర్యానికి ఉదాహరణలు –
విరాట పర్వములో – అర్జునుడు దుర్యోధనుడిని అధిక్షేపిస్తూ వ్యంగ్యంగా పలుకుట –
ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ
రా పురవీధుల గ్రాలగలదె
మణిమయంబగు భూషణ జాలములనొప్పి
ఒడ్డోలగంబున నుండగలదె
అతి మనోహరలగు చతురాంగనల తోడి
సంగతి వేడ్కలు సలుపగలదె
కర్పూర చందన కస్తూరి కాదుల
నింపు సొంపార భోగింపగలదె
కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర
వినుము నాబుద్ధి మరలి ఈ తనువు విడిచి
సుగతి బడయుము తొల్లింటి చూఱగలదె
జూదమిచ్చట నాడంగరాదు సుమ్ము
కురురాజ ! యుద్ధము లో ఓడిపోతే ఏనుగునెక్కి ప్రకాశిస్తూ, రెండు ప్రక్కల ఏనుగులు నడుస్తుండగా పుర వీధుల్లో ఊరేగడం గలవా ? కాదు. రత్నమాణిక్య హారాలనూ, ఆభరణాలనూ ధరించి సింహాసనం మీద కూర్చొనగలవా ? కర్పూరా, చందన సుగంధాలతో భోగాలనుభవించగలవా ? అందగత్తెలతో కులకగలవా ? ఇప్పుడు నీ గతి చూసుకో. వెనుకకు తిరిగి యుద్ధము చేసి, చేయలేకపోతే శరీరము విడిచి అయిన సరే పుణ్యలోకాలు పొందుము. ఇక్కడ నీ జూదపుటెత్తులు పనిజేయవు సుమా. ఇదీ పద్యభావం. నిజానికి పై వివరమంతా చెప్పాల్సిన పని లేదు. “జూదమిక్కడ ఆడంగరాదు సుమ్ము” అని ఆఖరు పాదం చెప్పడం, పద్యంలోని నాటకీయతకు తార్కాణం.
ఉద్యోగ పర్వములో - రాయబారానికి వెళ్ళేముందు ద్రౌపది శ్రీకృష్ణుడితో అనే సందర్భము –
నీవు సుభద్రకంటెఁ గడు నెయ్యము గారవముం దలిర్ప సం
భావన సేయుదట్టి ననుఁ బంకజనాభ ఒకండు రాజసూ
యావభృథంబునందు శుచియై పెనుపొందిన వేణిఁబట్టి యీ
యేవురుఁ జూడగా సభకు నీడ్చెఁ గులాంగన నిట్లొనర్తురే
ఆ సభ కేకవస్త్ర యగు నట్టి ననున్ గొని వచ్చి నొంచు దు
శ్శాసనుఁ జూచుచుం బతు లసంభ్రములై తగు చేష్ట లేక నా
యాసలు మాని చిత్రముల యాకృతి నున్న యెడన్ ముకుంద వి
శ్వాసముతోడ నిన్ గొలువ వచ్చె మనం బదియుం దలంపవే
వరమున బుట్టితిన్, భరత వం శము జొచ్చితి నందు పాండు భూ
వరునకు కోదలైతి జన వంద్యుల బొందితి నీతి విక్రమ
స్థిరులగు పుత్రులన్ బడసితిన్ సహ జన్ముల ప్రాపు గాంచితిన్
సరసిజ నాభ ! యిన్నిట బ్రశస్తికి నెక్కిన దాన నెంతయున్ !
జగద్గురువైన శ్రీకృష్ణుడికి తెలిసిన విషయాన్నే నర్మగర్భంగా రాయబరము ఎందుకు అని చెబుతోంది ద్రౌపది.
విరట పర్వములో - కౌరవసేనను చూసిన ఉత్తరుడు సారథి బృహన్నలతో సంభాషణ (ధీర్ఘ సమాసాలు ) –
భీష్మద్రోణ కృపాది ధన్వినికరాభీలంబు దుర్యోధన
గ్రీష్మాదిత్య పటుప్రతాప విసరాకీర్ణంబు శస్త్రాస్త్ర జా
లోష్మస్ఫార చతుర్విధోజ్జ్వల బలాత్యుగ్రం బుదగ్రధ్వజా
ర్చిష్మత్త్వాకలితంబు సైన్య మిది నేఁ జేరంగ శక్తుండనే
రూపకాలంకారములో తిక్కన విరాటపర్వములో రచించిన చక్కని పద్యమిది. ఉత్తరుడు కురు సైన్యంబును చూసి భయపడి అంటున్న సంధర్భం. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు మొదలయిన మహావీరులతో ఈ సైన్యం చాల భయంకరముగా ఉన్నది. దుర్యోధనుడు అనే వేశవికాలపు సూర్యుడి తాపముతో తీవ్రము గాను. శాస్త్రాల వేడిమి వ్యాపించినదిగాను, రధ, గజ, తురగ పదాతుల అనే చతురంగబాలలతో ఉగ్రంగాను ఉన్నది. రధాలకు కట్టిన జెండాల రెపరెపలు అగ్నిదేవుని నాలుకలు గా భయాన్ని గొల్పిస్తున్నాయి, అంతా సైన్యాన్ని నేను చేరుకోగలనా ?
విరాటపర్వములో - ద్రౌపది కీచకుడికి తన భర్తల శౌర్యాన్నిగురించి చెప్పే సంధర్భం
దుర్వారోద్యమబాహువిక్రమరసాస్తోకప్రతాపస్ఫురత్
గర్వాంధప్రతివీరనిర్మథన దీక్షా పారగుల్ మత్పతుల్
గీర్వాణాకృతు లేవు రిప్డు నిను దోర్లీలన్ వెసన్ గిట్టి గం
ధర్వుల్ మానముఁబ్రాణమున్ గొనుట తధ్యంబెమ్మెయిన్ గీచకా
తిక్కన భారత రచనలో తెలుగు వారికి ప్రీతిపాత్రమైన పద్యాలలో ఇది ఒకటి. వారించడానికి వీలులేని భుజ బాల పరాక్రమం గలిగిన గర్విస్టులైన శత్రువులను అవలీలగా వధించే విద్యలో ప్రవీణులని ప్రఖ్యాతిగాంచిన ఐదుగురు గంధర్వులు నా భర్తలు. వారు అవలీలగా నీ పంచప్రాణాలు హరిస్తారు సుమా !!
తిక్కన ప్రాచీనులు భావించినట్లు గానే మహాభారతం విజ్ఞాన సర్వస్వం అని భావన చేస్తూ కధ ఫలశ్రుతిలో ఈ విధముగా ప్రస్తావించాడు –
అమల ధర్మార్ధ కామమోక్షముల గురిచి
ఒలయు తెరు వెద్డియును ఇందుగలుగు – అదియు
ఓండెదల గల్గు దీన లేకుండ చెప్పు
తక్కో కంటను లేదు వేదజనులారా
మహాభారత పదిహేను పర్వాలు ఆంధ్రావళి సంతోషార్ధము ఆ హరిహారనాధుని కృపతో తిక్కన పూర్తిచేయగలిగాడు. తిక్కన తన మహాభారతంలోని చివరి పద్యములో ఎంతో ఐహికానంద ఆనంద తన్మయత్వం చెందాడు.
పరమ పదాప్తి హేతువగు భారత సంహిత శౌనకాది భూ
సురువారు లింపునం గరగు చొప్పున చెప్పినవారు మోద సం
భరితత పొంది ఆక్కధకు అర్చితు చేసిరి వార ధర్మలిన్
( మహాభారత కధను వివరించిన సూతుని శౌనకాది మునులు అర్చించారు )
ఈ మూడు పాదాల చంపక మాలతో మహాభారత కధ పూర్తి అయినది. తదుపరి పాదంలో ఏమి వ్రాయాలి ?
“ హరిహరనాధ సర్వభువనార్చిత నన్ దయచూడు మెప్పుడున్ “
అని తిక్కన హరిహరనాధునికి ధన్యవాదసహిత సాహితి నీరాజనాలు అర్పించాడు.
అందుకే తిక్కన సోమయాజి అభినవ పరాశర సూనుడు, వైదిక కర్మధారి, అపార గుణానిధి, ఉభయ కవితత్త్వ విభవోజ్వలుడు. ఆ సోమయాజకి వందన సహస్రములు.
తెలుగు సాహితి కి మంగళా శాసనం చేసిన తిక్కన కవిబ్రహ్మ.