top of page

సంపుటి 1    సంచిక 4

వ్యాస ​మధురాలు

ప్రాచీన కావ్యాలు – వ్యాఖ్యానాలు – విశేషాలు

Jada Subbarao

జడా సుబ్బారావు

madhuravani.com అంతర్జాల పత్రిక  నిర్వహించిన వ్యాస పోటీ లో ఉత్తమ బహుమతి సాధించిన వ్యాసం

వ్యాఖ్యానం-ఉపోద్ఘాతం: 

తెలుగుసాహిత్యంలో వ్యాఖ్యాన సంప్రదాయానికి ఒక ప్రత్యేకత ఉంది. కేవలం కఠిన పదాలకు మాత్రమే అర్థాన్నివ్వడం కాకుండా వాటిలో ఉండే వ్యాకరణాంశాలు వివరించడం కూడా వ్యాఖ్యానంలో భాగంగానే ఉంది. కావ్యంలోని అందచందాలను, చమత్కారాలను తెలియజేస్తూ కవి హృదయాన్ని ఆవిష్కరించడంలో కావ్య వ్యాఖ్యానాలు ప్రముఖ పాత్ర వహించాయి. కవిని పునరుజ్జీవింపజేసి కావ్య పరమార్థాన్ని పాఠకులకు విశదపరచాలనే క్రమంలో వెలసిన ఈ  వ్యాఖ్యానాలను సాహిత్యాభివృద్ధిలో కీలకపాత్ర వహించే విమర్శ, భాషాంతరీకరణల తర్వాత  అత్యంత ప్రాధాన్యం ఉన్న అంశంగా గుర్తించారు.                                   

కావ్యనాటకాలకు వ్యాఖ్యానం రాయడం అనేది ప్రాచీన కాలం నుండీ వాడుకలో ఉన్న అంశమే. అందుకే వ్యాఖ్యానం ప్రాచీన సాహిత్యంలో ఒక విశిష్టమైన సాహిత్య విమర్శగా పరిగణించబడింది. కావ్య నాటకాదులకు వ్యాఖ్యానం అనే పేరుతో పాటు వ్యాఖ్య, టీక, టిప్పణి, టుప్టీక, లఘు వ్యాఖ్య, విపులవ్యాఖ్య, వివృతి అనే పేర్లు కూడా పర్యాయపదాలుగా  ఉన్నాయి. కనుక ఏ పేరుతో పిలిచినా వ్యాఖ్యానమంటే ‘విడమర్చి చెప్పడం’ అనే అర్థంలోనే బాగా ప్రాచుర్యం పొందింది.  సంస్కృత వాఙ్మయ ప్రభావంతో తెలుగులోకి వచ్చిన సాహిత్య సంప్రదాయాలలో వ్యాఖ్యాన సంప్ర దాయం కూడా ఒకటి కాబట్టే ‘వ్యాఖ్యానాల వల్ల గ్రంథ పఠనం మీద అభిరుచి కలిగి సహృదయత్వం కలుగుతుంద’ మన పెద్దలు భావించారు.

వ్యాఖ్యానం నిర్వచనాలు:                                                                                                     

కావ్యం లేదా శాస్త్రాలలోని పద్యాలకు, శ్లోకాలకు సందర్భాదులతో కూడిన అర్థాన్ని వివరించడం వ్యాఖ్యానం అనబడుతుంది. అంతేగాక వ్యాఖ్యానం, వ్యాఖ్యానించడం అనేది ‘వివరించి చెప్పడం’ అనే వ్యవహారంలో వాడుకలో ఉన్నాయి. ప్రాచీన కావ్యాలను అర్థం చేసుకోవడానికి వీలుగా వ్యాఖ్యానాలు వచ్చాయని చెప్పవచ్చు.                       

  1. ‘వ్యాఖ్యాయతే అనేన ఇతి వ్యాఖ్యానమ్’- అన్నట్లు ‘ఏది మరోదాన్ని వివరించి చెప్తుందో అది వ్యాఖ్యానం’                                           

  2. వి+ఆఖ్యానం = వ్యాఖ్యానం అంటే విశేషంగా వివరించి చెప్పడం అని కూడా అర్థం చెప్పవచ్చు.                                                       

  3. ‘వ్యాఖ్యానం’ అనే పదంలోని ‘ఖ్యా’ధాతువుకు ‘ప్రకథనే’ అనే అర్థం. ‘ప్రకృష్ట కథనం’ లేదా ‘విశేషకథనం’ అని అర్థం.                        

  4. ‘విశేషేణ ఆఖ్యానమ్ వ్యాఖ్యానమ్’ అనే నిర్వచనం ప్రకారం విశేష కథనం అంటే కేవలం ప్రతిపదార్థాన్నే కాకుండా అందులోని విశేషార్థాన్నీ, తాత్పర్యాన్నీ దానికి ప్రోద్బలకంగా ఉండే రూఢ్యర్థాన్ని నిరూపించడానికి కావలసిన వివిధ నిఘంటువుల్లోని శబ్దజాలాన్నీ పరమార్థాన్ని వివరించాల్సి ఉంటుంది వ్యాఖ్యానం.                                                                  

  5. “అతిశయ వర్ణనా వ్యాఖ్యానమ్” అంటూ కౌటిల్యుడు అర్థశాస్త్రంలో ‘ఒక దానిలో ఉండే అతిశయాన్ని, వైశిష్ట్యాన్ని వివరించడం వ్యాఖ్యానం’ అని చెప్పాడు.

  6. ‘అర్థం కాకపోవడం వంటివాటిని తొలగించడం కోసం మూలంలో ప్రయోగించిన పదాలకు సమానార్థకాలైన పదాలు చూపుతూ విస్తారంగా మూలార్థాన్ని వివరించడం వ్యాఖ్యానం అని న్యాయకోశం కోసం చెప్పిన నిర్వచనం పుల్లెల శ్రీరామచంద్రుడుగారు కూడా వివరిస్తారు.                                                                                                             

  7. తెలుగు విశ్వవిద్యాలయం ‘వ్యాఖ్యాస్రవంతి’ అనే పేరుతో ప్రాచీన కావ్యా లకు వ్యాఖ్యానాలు ప్రకటించే ఒక ప్రణాళికా పథకం చేపట్టింది. ఈ పధ కాన్ని అనుసరించి విశ్వవిద్యాలయం వారు రాయించే వ్యాఖ్యానాలు ఎలా ఉండాలో వ్యాఖ్యాతలు అనుసరింపదగిన నియమాలు కొన్నింటిని ప్రకటించింది. అవి -                                                                        

    • అర్థ తాత్పర్యాలు ప్రతీ పద్యానికీ, వచన భాగానికీ కూడా ఇవ్వాలి      

    • విశిష్టపదాలకు తప్పనిసరిగా అర్థాలివ్వాలి. కాని, అంత, అని, ఇవ్విధంబున వంటి తేలిక మాటలకు పర్యాయపదాలు, అర్థాలు ఇవ్వన వసరం లేదు.                            

    • వ్యాఖ్యానం పాండిత్య స్ఫోరకంగా కాక విషయ వివరణ చేసేటట్లుగా ఉండాలి. ‘ఇత్యమర:’ వంటి సమర్ధనలు అవసరం లేదు.

    • వ్యాఖ్యానంలో సాహిత్య సౌందర్యానికే అధిక ప్రాధాన్యం ఉండాలి. పాత్ర చిత్రణ, విశేషాలు, భాషావివరణ, వ్యాకరణ చర్చ, అలంకార, రసచర్చలు అవసరమైతే చిన్నచిన్న అనుబంధాలుగా కూర్చవచ్చు. అలంకార విశేషాలు వివరణలు స్వల్పంగా వ్యాఖ్యానాల్లో వుండవచ్చు.                                                                                                   

    • పద ప్రయోగౌచిత్యం, పద్యరచనాశిల్పం, విశేషార్థ సూచనలు, ధ్వని విశేషాలు కావ్య సౌందర్యాన్ని వివరించే అంశాలు వ్యాఖ్యానాల్లోనే ఉండాలి.                                                                                                                                         

    • వ్యాఖ్యానం సాధ్యమైనంతవరకు చిన్నచిన్న వాక్యాల్లో తేలిక మాటల్లో ఉండాలి.          

    • వ్యాఖ్యాన లక్ష్యం ప్రధానంగా ప్రాచీన కావ్యాల రచనా సౌందర్యంపై ఈనాటి విద్యార్థులకు అభిరుచి కలిగించేటట్లు ఉండాలి.                                               

వ్యాఖ్యాన లక్షణాలు:  

పదచ్ఛేద: పదార్థోక్తి: విగ్రహో వాక్యయోజనా 

ఆక్షేపశ్య సమాధానం వ్యాఖ్యానం పంచలక్షణమ్ 

పై శ్లోకం ప్రకారం అర్థంచెప్పడం లేదా వివరణ నివ్వడం అనే అంశాన్ని ప్రధానంగా కలిగివున్న వ్యాఖ్యానాలు ఈ క్రింది అయిదు లక్షణాలు కలిగి ఉన్నాయి.  

  • పదచ్ఛేద: - అర్థం సులువుగా చెప్పడానికి ముందు పదాలను విభజించడం, దీనివల్ల పదవిభాగం అర్థమవుతుంది.

  • పదార్థోక్తి: - విభజించిన పదాలకు అర్థాలు చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల పాఠకుడికి అర్థజ్ఞానం కలుగుతుంది.

  • విగ్రహాదులు చెప్పడం:  కావ్యం/శ్లోకంలోని సమాసాలకు విగ్రహవాక్యం చెప్పడం వల్ల విభక్తిజ్ఞానం  కలుగుతుంది. 

  • వాక్యయోజన: వాక్యయోజన వల్ల పూర్వాపర విషయాల పట్ల అవగాహన కలుగుతుంది. 

  • ఆక్షేపాలకు సమాధానం చెప్పడం: ఆక్షేపణలకు సమాధానం చెప్పడం వల్ల పాఠకులకు సందేహాలు తీరి విమర్శనా శక్తి కలుగుతుంది. విషయం మీద పూర్తి అవగాహన కూడా ఉంటుంది.  

  •  వ్యాఖ్యాత: అర్థంచేసుకోవడం అనే వ్యాపారాన్ని తనకున ప్రతిభా పాండిత్యాల ద్వారా వివరించి విశదీకరించేవాడు వ్యాఖ్యాత. కావ్యాలకు వ్యాఖ్యానంచేసే వారు వ్యాఖ్యాతలు. ‘కవితా రసనైపుణ్యం వ్యాఖ్యాతా వేత్తినో కవి:’ అన్నట్లు కవి భావాన్ని గ్రహించి కావ్య పర మార్థాన్ని తెలియజెప్పేవాడు వ్యాఖ్యాత. కవితావేశంలో మునిగి రచనావ్యాపారాన్ని సాగించే కవీశ్వరులు కూడా ఊహింపజాలని అపూర్వ విశేషాలను వివరించడంలో కీలకపాత్ర వహించే వాడు వ్యాఖ్యాత. ‘వ్యాఖ్యాత ప్రధానమైన పని కావ్యానికి అర్థంచెప్పడం. ఒక్కొక్క ప్పుడు కవి మారుమూల పదాలు వాడతాడు. మరుగున పడిపోయిన పలుకు బడులు, నుడికారాలు, సామెతలు కావ్యంలో కనబడతాయి. ఐతిహ్యాలు ఉంటాయి. వీటన్నిటినీ వ్యాఖ్యాత వివరించాలి. అలాగే కావ్యంలోని వ్యాకరణ అలంకార ఛందో విషయాలను కూడా ఈతడు సమగ్రంగా పరిశీ లించాలి. ప్రయోగ వైశిష్ట్యం, ప్రయోగంలోని గుణదోషాలు, మెలకువలు సునిశితంగా కనిపెట్టాలి. కావ్యాలకు ఆకరాలను తెలుసుకుని, మూలంలోని అంశాలను కవి యేఏ సందర్భాలలో ఎలా ఉపయోగించుకున్నాడో చెప్పగలగాలి’ అంటూ శ్రీ వడలి మందేశ్వరరావు గారు వ్యాఖ్యాత విశిష్టతను తెలియజేస్తారు.  కావ్యలక్షణాల యొక్క విశేషఙ్ఞానం వ్యాఖ్యాతకు అవసరం. కావ్యంలో ఔచితీ విధానం, రచనాపద్ధతి, పాత్ర పోషణ, సన్నివేశ కల్పన, అలంకారిక విషయాలు, రసపోషణ మున్నగు కావ్యలక్షణాలలో వ్యాఖ్యాత కవికంటే ఎక్కువ పాండిత్యం కలిగి వుంటాడని చెప్పడం అతిశయోక్తి కాదు. ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసాలతో జనించిన కావ్యసొగసులను, కవి యొక్క భావ హృదయాన్ని పాఠకునికి చేరవేసే క్రమంలో ఇద్దరికీ మధ్యేమార్గంగా ఉంటాడు వ్యాఖ్యాత. శబ్ద ఙ్ఞానం, అర్థఙ్ఞానం, ఔచిత్య పరిఙ్ఞానం మొదలైన విషయాలన్నింటిలోనూ వ్యాఖ్యాత బహుముఖ ప్రఙ్ఞ కలిగి ఉండాలి.                      వ్యాఖ్యాత కవికీ పాఠకునికీ మధ్య వంతెనగా నిలుస్తాడు. మహా కవులు లోకానికి మహదాశయాన్ని ఉపదేశించే నిమిత్తం కావ్యనిర్మాణం చేస్తారు. అటువంటి జగద్ధితములైన కావ్యాలు శాశ్వతత్వం కలిగివుంటాయి. ఆయా కావ్య కర్తలు మరణించినప్పటికీ వారి కావ్యాలను సజీవంగా వుంచే పనిలో సిద్ధహస్తుడు వ్యాఖ్యాత. ఈ పనిలో వ్యాఖ్యాతకు ఎంతో ప్రతిభా పాండిత్యాలు అవసరం అవుతాయి. రసానందం కలిగించే కావ్య స్వభావాన్ని వ్యాఖ్యాత సరిగా గ్రహించక పోయినట్లయితే ఆయా విషయాలపై ఆయన వ్యాఖ్యానం లోకంలో అపోహలకు గురవుతుంది.                           

కావ్య స్వరూపాన్ని తాను చక్కగా గ్రహించడం మాత్రమే కాకుండా వ్యాఖ్యాత తాను గ్రహించిన విషయాన్ని స్పష్టంగా వ్యక్తీకరించాలి. అప్పుడే ఆయా వ్యాఖ్యానాలు పాఠకులకు సులభంగా అర్థమవుతాయి. అటువంటి వ్యాఖ్యానాలు అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండి పాఠకులను మూలగ్రంథ పఠనానికి ప్రేరేపిస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు. కవి తన రచనలో ఆశించిన లక్ష్యాలను సహృదయులకు చేరవేయాలి. ప్రతిభ పాండిత్యాల సమన్వయం ఏ వ్యాఖ్యాతలో ఉంటాయో అతడు ఉత్తమ వ్యాఖ్యాతగా నిలుస్తాడని చెప్పడం అతిశయోక్తి కాదు.

కావ్యానికి వ్యాఖ్యానాన్ని రచించి ఆయా కవులను పునర్జీవింపజేసిన వ్యాఖ్యాతలుగా సంస్కృతంలో మల్లినాథ సూరి ప్రసిద్ధుడైతే, తెలుగులో వేదం వేంకటరాయశాస్త్రిగారు ప్రసిద్ధులు. సంస్కృత వ్యాఖ్యాన లక్షణాలను తూచ తప్పకుండా పాటించి తన పాండిత్య ప్రతిభలతో కావ్యాలకు బృహద్వ్యాఖ్యలు రాసి తర్వాత వచ్చిన వ్యాఖ్యాతలకు మార్గదర్శిగా నిలిచాడు వేదం వేంకట రాయశాస్త్రి. సంస్కృత వ్యాఖ్యాన లక్షణాలను మీరకుండా అలంకారశాస్త్ర మర్యాదలను తన వ్యాఖ్యానాలలో ఇనుమడింపజేశారు వేదంవారు. శృంగార నైషధం, ఆముక్తమాల్యదలాంటి ప్రౌఢ కావ్యాలకు అంతే ప్రౌఢంగా వ్యాఖ్యలు రాసి చిరస్మరణీయులయ్యారు వేదంవారు. అయితే వారి వ్యాఖ్యానాలు పాఠకులకు అంత సులభంగా అర్థం అయ్యే స్థితిలో లేవు. వారి వ్యాఖ్యానాలు అనేక అంశాలను, ఎంతో పాండిత్యాన్ని ప్రదర్శించినా అవి పాఠకులకు దూరంగా నిలిచాయనేది అంగీకరించాల్సిన విషయం. కొన్ని పదాలకు అర్థాలు రాసే క్రమంలో కూడా వ్యాఖ్యాతల మధ్య భిన్నాభిప్రాయాలున్నట్లు మనకు ఆ వ్యాఖ్యానాలలో కనిపిస్తుంది. ఒక కావ్యాన్ని విస్తరించి రాస్తూ ఒక పదానికి అనేక అర్థాలు రాస్తూ వ్యాఖ్యానం చేయడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. కనుక భాషాభివృద్ధిలో కీలక పాత్ర వహించే వ్యాఖ్యానా లను అనుశీలించడం ఈ వ్యాస ఉద్దేశ్యం.                                                                                              

 

ప్రసిద్ధకావ్యాలు-వ్యాఖ్యానాలు:

తెలుగుసాహిత్యంలో వ్యాఖ్యానాలకు ఒక ప్రత్యేక ఒరవడిని సృష్టించిన వ్యాఖ్యాతలు ఎందరో ఎన్నో ప్రసిద్ధ కావ్యాలకు వ్యాఖ్యానాలు రాశారు. ఎవరి వ్యాఖ్యాన విధాన ప్రత్యేకత వారిదే అన్నట్లుగా వారి వ్యాఖ్యానాలు సాగాయి. ఈ వ్యాసంలో వ్యాఖ్యానాలను పరిచయం చేసి, వాటి ప్రాధాన్యాన్ని వివరించడం, శృంగారనైషధం, ఆముక్తమాల్యద, విజయవిలాసం లాంటి కావ్యాలకు వేదం వారితో పాటు వ్యాఖ్యానాలు రాసిన కేతవరపు వేంకటశాస్త్రి, వావిళ్ల రామస్వామి శాస్త్రులు, తుమ్మపూడి కోటేశ్వరరావు, తాపీ ధర్మారావు  మొదలైన వారి  వ్యాఖ్యానాలలోని కొన్ని అంశాలను వివరించే దిశగా ఈ వ్యాసం సాగుతుంది.           

1. శృంగారనైషధం-వ్యాఖ్యలు:

ఆంధ్ర సాహిత్యంలో ఒక నూతన అధ్యాయాన్ని ఆరంభించే తర్వాత వచ్చిన అనేకమంది కవులకు మార్గదర్శ కుడైన శ్రీనాథుని శృంగార నైషధానికి ప్రధానంగా ఈ క్రింది వ్యాఖ్యలు కనబడుతున్నాయి. శృంగారనైషధం 8 ఆశ్వాసాల కావ్యం. శృంగారనైషధం పఠనపాఠన వ్యవహారంలో బహు వ్యాప్తి కలది. నలదమయంతుల పరిణయ వృత్తాంతాన్ని ఇరవైరెండు సర్గలలో అత్యద్భుత వర్ణనా చాతుర్యంతో నారికేళపాకంలో సూక్తివైచిత్రితో శ్రీహర్షుడు రచించగా, అంతే పాండిత్య ప్రతిభలతో శ్రీనాథుడు శృంగారనైషధాన్ని రచించాడు. ఆనంద ముద్రణాలయమువారు ప్రచురించిన కేతవరపు వేంకటశాస్త్రి గూఢార్థ ప్రకాశినీ వ్యాఖ్య ఉన్నా నేటివరకు శృంగారనైషధానికి అజరామరంగా వెలుగొందుతున్న వ్యాఖ్యానం వేదం వేంకటరాయ శాస్త్రిగారి ‘సర్వంకషావ్యాఖ్య’. మల్లినాథసూరి ‘జీవాతువు’ వ్యాఖ్యానాన్ని ఆదర్శంగా తీసుకుని ‘సర్వంకషా’ వ్యాఖ్యానం రాసి ‘ఆంధ్రమల్లినాథులు’గా కీర్తింప బడ్డారు వేదం వేంకట రాయశాస్త్రిగారు.                                                

 

కేతవరపు వేంకటశాస్త్రిగారి గూఢార్థ ప్రకాశినీవ్యాఖ్య:

కేతవరపు వెంకటశాస్త్రిగారు శృంగారనైషధానికి ‘గూఢార్థ ప్రకాశినీ వ్యాఖ్యను 1913 లో రచించారు. శృంగార నైషధం ప్రౌఢకావ్యం కనుక ఆ కావ్యానికి రాసే వ్యాఖ్యానం పాఠకులకు అర్థమయ్యేలా రాసినప్పుడే దానికి సార్ధకత ఉంటుందని భావించిన వెంకటశాస్త్రిగారు ప్రతీ పద్యానికీ అర్థం, తాత్పర్యం, అవసరమైన చోట్ల వ్యాకరణ విషయాలను వివరించారు. అంతకుమించి ఆ కావ్యంలోని విశేషాలను లోతుగా వివరించే ప్రయత్నం చేయలేదు.                    

 

వేదం వేంకటరాయశాస్త్రిగారి సర్వంకషావ్యాఖ్య: 

ఈనాటికీ శృంగారనైషధానికి విశిష్టవ్యాఖ్యగా పేరుపొందినది వేదాంవారు రచించిన సర్వాంకషావ్యాఖ్య. శృంగారనైషధం ప్రౌఢకావ్యం కనుక దానికి రాసే వ్యాఖ్యానం సంస్కృత వ్యాఖ్యాన మర్యాదలను మీర కుండా ప్రౌఢంగా ఉండాలనే నియమం వేదంవారిది. వ్యవహారిక భాషా వాదాన్ని ఒప్పుకోక పోవడం, లక్షణగ్రంథాలను తూచ తప్పకుండా పాటించడం అనే లక్షణాల వల్ల వేదంవారి వ్యాఖ్యలు కొన్నిసార్లు విమర్శకు గురయ్యాయి. అయినప్పటికీ తాను నమ్మిన సిద్ధాంతాన్నే పాటించి ఆ కావ్యానికి అజరామరమైన వ్యాఖ్యను సంతరించడంలో వారు పడిన పరిశ్రమ మనకు కనిపిస్తుంది. అయితే శృంగారనైషధానికి పైన చెప్పిన రెండు వ్యాఖ్యానాలలోనూ కొన్ని పదాలకు అర్థాలు వివరించే టప్పుడు కొంత అసమంజసం కనిపిస్తుంది. కొన్నిసార్లు భావాన్ని చెప్పేటప్పుడు కూడా ఇదే ధోరణి మనకు కనిపిస్తుంది.  ఒకటి రెండు ఉదాహరణలు చూద్దాం.                                                                                         

ఐదుపదిసేసిన “నవ సమాగమ వేళ నయ్యవసరమున

నువిద లజ్జాభరంబున కోహటించి 

యైదు పదిసేసె వలరాజు నంతవాడు!

నరయ నెవ్వాని సొమ్ము జయాపజయములు?" (7-168) 

 

పై పద్యంలోని ‘ఐదుపదిసేసె’ అనే పదానికి పైన పేర్కొన్న రెండు వ్యాఖ్యానాలలోనూ దాదాపు ‘ముందరికాలు వెనుకకు పెట్టెను’ అనే అర్థమే కని పిస్తుంది. వ్యాఖ్యాత లక్షణాలలో కేవలం పదానికి అర్థం మాత్రమే కాకుండా ఆ అర్థాన్ని భావంతో కూడా సమన్వయం చేయాలి. అప్పుడే పాఠకులకు ఆ సందర్భం సులభంగా అర్థమవుతుంది.                            

 

“ఐదుపదిసేసిన- ఆ జవ్వని యొక్క సిగ్గు పెంపునకు వెనుదివిసి, ముందరి కాలు వెనుకకు బెట్టెను. ముందు రాచినప్పుడు అయిదు వ్రేళ్ళే. వెనుకకు దివిసినప్పుడు వెనుకనున్న పాదముతో కలిసి పదివ్రేళ్ళు- కావున ఓడిపోయెనని యర్థము” అని సర్వంకష వ్యాఖ్యానంలో మనకు కనిపి స్తుంది. ఈ పద్యంలో దమయంతి తనకున్న సిగ్గువల్ల మన్మథుడు ప్రయోగించిన బాణములకు వెరవకపోవడం వల్ల మన్మథుడు ఓడిపోయాడు. ఓడినవారు చేతులు జోడించడం సహజంగా ఉంటుంది. ముందరికాలు వెనక్కి పెట్టడంవల్ల ఆ భావం స్పష్టంగా గ్రహించలేము. ఇక్కడ ఈ వ్యాఖ్యా నంలో కూడా ఇదే మనకు కనిపిస్తుంది. అదే భావాన్ని ‘ఓడినవారు చేతులు జోడించారు’ అని చెప్పినట్లయితే ఇంకా బాగుంటుంది.                                                                                                                         

 

2. ఆముక్తమాల్యద వ్యాఖ్యలు:

శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలో ప్రధానరసం భక్తి. అయితే నవరసాలలో భక్తిరసమంటూ లేదు కనుక ఆముక్తలో ప్రధాన రసం భక్తిరూపంలో శాంతరసం అని చెప్పవచ్చు. శృంగార రసం కూడా సందర్భాను సారం పోషించబడింది. ఈ కావ్యంలో వర్ణనలు వేటికవేసాటి. కావ్యంలో నీతికథలున్నాయి. పారమార్థిక సంబంధమైన చర్చలున్నాయి. విశిష్టాద్వైత సిద్ధాంత బోధనలున్నాయి. ఐహిక విషయమైన నీతులున్నాయి. ఓ మహాకావ్యంలో ఉండాలని అలంకార గ్రంథాలు చెప్పే లక్షణాలలో చాలా లక్షణాలు మనకు ఆముక్త మాల్యదలో కనిపిస్తాయి ఆముక్త మాల్యదకు సుమారుగా 30కి మించి సమగ్ర, అసమగ్రమైన వ్యాఖ్యానాలున్నట్లుగా ఆధారాలున్నాయి. కానీ అవేమీ ఇప్పుడు అందుబాటులో లేవు. ఈ క్రిందివి ఆముక్తమాల్యదకు ఉన్న వ్యాఖ్యలలో ప్రసిద్ధమైనవి.

వావిళ్ళ రామస్వామిశాస్త్రులు రుచి వ్యాఖ్యాసహితం (క్రీ.శ 1869): 

సుమారు 1800 సంవత్సరాన గట్టుపల్లి శ్రీనివాసకవి ఆముక్త మాల్యదకు రచించిన ‘మహాటీక’ ను ఆధారంగా చేసుకుని వావిళ్ళవారు ‘రుచి’ వ్యాఖ్యను రచించినట్లు తెలుస్తుంది. ఈ వ్యాఖ్యలో టీక, తాత్పర్యం అనే శీర్షికలతో పాటు అలంకారాలు, వ్యాకరణాంశాలు వంటి విశేషాంశాలు కూడా పేర్కోవడం జరిగింది. పూర్వ వ్యాఖ్యానాలలోని కవుల ప్రయోగాలను వ్యాఖ్యాతలు తమ ఇష్టానుసారం దిద్దడం సమంజసం కాదని పై విషయం ద్వారా స్పష్టం చేయబడింది. అలా చేసినందువల్ల కవి స్వభావాన్ని, ధోరణిని తెలుసుకోవడం సాధ్యం కాని పని. కాబట్టే వావిళ్ళ వారి వ్యాఖ్య ఈ పద్ధతి లోనే సాగి కొంతవరకు కవి హృదయాన్ని పాఠకులకు దగ్గర చేసిందనే చెప్పాలి.                                                                                          

 

వేదము వేంకటరాయశాస్త్రి సంజీవనీ వ్యాఖ్య (క్రీ.శ.1927): 

ఆముక్తమాల్యదకు లభిస్తున్న వ్యాఖ్యానాలలో అందరి చేతా ప్రామా ణికం అని అంగీకరించబడిందీ, ఆంధ్ర సాహిత్యానికి అలంకారంగా పేర్కొనబడిందీ ‘సంజీవనీ’ వ్యాఖ్య. 1927 వ సంవత్సరంలో ఈ వ్యాఖ్యానం వచ్చినట్లు తెలుస్తుంది. దీనిని వ్యాఖ్యానించడానికి మూలంగానీ, మల్లినాథుని వ్యాఖ్యగానీ లేవు. వేదంవారు స్వయంకృషితో ఆముక్త మాల్యదకు ‘సంజీవని’ అనే పేరుతో బృహద్వ్యాఖ్యను రచించారు. అంతేగాక “వ్యాఖ్య ఈ పాటి విపులమగునని ఆదిలో నేను యూహించుకొనలేదు. రెండాశ్వాసములకు వ్రాసిచూడగా, బావిత్రవ్వగా బేతాళములు వెలువడినట్టులయింది. గ్రంథమునకెల్ల జీర్ణోద్ధారమే కావలసి వచ్చింది. అందులకై సమగ్ర సంస్కరణ- సాధుపాఠ నిర్ధారణ- కువ్యాఖ్యా విషహరణ – సమంజసార్థా విష్కరణ పూర్వక విపుల వ్యాఖ్యానము వ్రాయనుద్యమించితిని” అని వారు చెప్పుకున్నారు. శ్రీ వైష్ణవ మతానికి సంబంధించిన అన్ని అంశాలను వివరించడం, కేవలం కావ్యమార్గానికి చెందిన ఇతరాంశాలను వివరించడం అనే రెండు లక్ష్యాలను వారు తమ వ్యాఖ్యానంలో పాటించినట్లుగా తెలుస్తుంది.                                                      

 

తుమ్మపూడి కోటేశ్వరరావు సౌందర్యలహరీ వ్యాఖ్యానం 2001: 

ఆముక్తమాల్యదకు లభిస్తున్న వ్యాఖ్యలలో తుమ్మపూడి కోటేశ్వరరావుగారి సౌందర్యలహరీ వ్యాఖ్యానం 2001లో వెలువడింది. తుమ్మపూడివారు తమ వ్యాఖ్యలో ఆముక్తమాల్యదకు ఆరు ఆశ్వాసాలలోనే వ్యాఖ్యానం చెప్పారు. అనగా వావిళ్ళ వ్యాఖ్యానంలో ఆరు ఆశ్వాసాలుగా ఉన్న కావ్య వ్యాఖ్యానం; వేదంవారి వ్యాఖ్యానంలో ఏడు ఆశ్వాసాలుగా విభజించ బడింది. కానీ వాస్తవానికి ఆరు ఆశ్వాసాలుగా ఉండిన ఆముక్తమాల్యద కావ్యాన్ని వేదంవారు ఏడు ఆశ్వాసాలుగా మార్చుకుని వ్యాఖ్యానం చెప్పారనే విషయాన్ని మనం తుమ్మపూడి వారి వ్యాఖ్యానం ద్వారా గ్రహించవచ్చు. కనుక పీఠికలో వారే చెప్పినట్లు “ఆముక్తరచన చివరి ఆశ్వాసమే కావ్యంలో ప్రధానం- రసదృష్ట్యా, మతదృష్ట్యా. కాక స్వప్నంలో విన్పించిన స్వామి ఆఙ్ఞ ప్రకారం ‘అప్పిన్న’ దాని కతతోనే ముగింపు. దాసరికథ- గోదావివాహ వృత్తాంతం- అన్నీ కలిపిన ఆశ్వాసమే ‘వరేణ్యం’. ఏడుగా విభాగిస్తే ఈ ఔచిత్యం పోయింది. కనుక నాలుగవది ‘వరంబు’- రాజనీతి-ఋతువర్ణనల వల్ల. చివరిది (ఆరవది) వరేణ్యం - పై కారణాలవల్ల. ఇందుచేత ఆరే ఆశ్వాసాలు” అని తుమ్మపూడివారు తమ వ్యాఖ్యానంలో చెప్పుకున్నారు. పై ముగ్గురు వ్యాఖ్యానాలలోనూ పదాలకు ఇచ్చిన వేర్వేరు అర్థాలు చూద్దాము.

చెట్లువట్టి

తే. డేని సప్తాంగములు నీకు నిచ్చి చెట్లు

వట్టి పెన్రాల తిప్పలు వట్టి తిరుగు

నట్టి ఖాండిక్యు డొక్కడ యరయ నెఱ

నే నెఱుగు; వేడు మది కర్జమేని యనిన" (3 -24) 

 

పై పద్యంలో ‘చెట్లువట్టి’ అనే పదానికి పైన పేర్కొన్న మూడు వ్యాఖ్యానాలలోనూ ‘వృక్షంబులం బట్టి’ (వావిళ్ళ వారు), ‘వృక్షసమూహములను, వట్టి = శూన్యములయిన’ (వేదంవారు), ‘చెట్టుచేమలు పట్టుకుని’ (తుమ్మపూడి వారు)  అనే అర్థాలు కనిపిస్తాయి.                                                      

 

వావిళ్ళవారూ, తుమ్మపూడివారూ ‘చెట్టువట్టి’ అనే పదాన్ని ఏక పదంగా తీసుకుని దానికి అర్థాన్నివ్వడం జరిగింది. అయితే వేదంవారు దానికి భిన్నంగా చెట్టు, వట్టి అనే విధంగా గ్రహించి అర్థాలిచ్చారు. అయితే చెట్లుపట్టి, తిప్పలు పట్టి - అనేవి జనవ్యవహారంలో ఉన్న పలుకుబళ్ళు. చెట్లు చేమలు పట్టుకుని తిరుగుతున్నాడు అని నేటికీ వాడుక లోకంలో ఉంది. కానీ ఆ పదాన్ని విడదీసి చెప్పడంవల్ల ఆ అర్థం స్ఫురించదు. కాబట్టి చెట్లువట్టి, తిప్పలువట్టి అనేవి ఇచ్చు అనే క్రియతో కూడి ఏర్పడుతున్న శబ్ద పల్లవాలు కాబట్టి వాటినలాగే వాడి అర్థం చెప్పాలని శ్రీ దీపాలవారు చెప్తారు.  

 

అక్కవాడలు

దర్భపోటుల తిని, లేని తఱుల మైత్రి 

నంటి ప్రితృశేషము భుజించి, యదియు నెడల

నక్కవాడల నరకూళ్ళు మెక్కి, మీద

వీని శేఖర మొక తులార్త్విజ్యము కొని (7 - 5)

 

‘నీకీ బ్రహ్మరాక్షసరూపం రావడానికి కారణమేంటి?’ అనే అడిగిన మాలదాసరితో బ్రహ్మరాక్షసుడు చెప్పే సందర్భంలోనిది పై పద్యం. బ్రాహ్మణుడు చేయకూడని అకృత్యాలన్నీ చేయడంవల్ల తనకీ రూపం ప్రాప్తించిందంటూ దర్భపోటులు తిని, శ్రాద్ధ భోజనాలు, పితృశేషాలూ భుజించడం వల్ల, అదీ దొరక్కపోతే పూటకూళ్ళ యిళ్ళల్లో అరకూళ్ళు తినేవాణ్ణి. ఇవేగాక తులాభారాలు గ్రహించేవాణ్ణి, అందువల్లే తనకీ రూపం ప్రాప్తించిందంటూ చెప్తాడు బ్రహ్మరాక్షసుడు. పై పద్యంలో ప్రధానంగా ‘అక్కవాడలు’ అనే పదానికి వావిళ్ళ = పూటకూలి యిండ్లుండు వీథులయందు (అక్కవాడలు), వేదం = అమ్మ లక్కలవీథులయందు (యనగా వీథివీథికేగి అమ్మా అక్కా అని స్త్రీలను మంచిమాటలాడి స్నేహము చేసికొని ఆ దాక్షిణ్యముచేత వారియింట అరకూళ్ళు), తుమ్మపూడి = పూటకూటిళ్ళలో అనే అర్థాలనిచ్చారు. పై పద్యంలోని ‘అక్కవాడలు’ అంటే పూటకూలి యిండ్లేగాని అమ్మ లక్కలవీథి కాదు. ఏ పట్టణంలోనైనా ‘అమ్మ లక్కలవీథి’ అని ప్రత్యేకంగా లేకపోవడం మనం చూస్తున్న విషయమే. అమ్మలక్కల వీథిని పేర్కొన్న కావ్యంకూడా మనకు కనబడదు. అంతేగాక ఈ పదానికి లక్ష్మీనారాయణీ యములో ‘అక్కలవాడ = వంటలక్కలుండు వీథి’ అనే  అర్థం మనకు కనిపిస్తుంది. బ్రౌన్ పండితుడు కూడా  ‘అక్కలవాడ - slut's alley, a street in which cook maids live, వంట చేసే ఆణంగులు వుండే వీథి అని వివరించి అక్కడ ‘అక్కవాడల అరకూళ్ళు మెక్కి’ అని యీ ఆముక్త మాల్యద పద్యాన్నే ఉదాహరించడాన్ని బట్టి ‘అక్కలవాడ’ అంటే ‘పూటకూ లిండ్లు ఉండే వీథే’గానీ ‘అమ్మలక్కలవీథి’ కాదనేది స్పష్టం.

3. విజయవిలాస వ్యాఖ్యలు విశేషాలు                                                                                               

అన్ని ప్రముఖ ప్రబంధాలలాగానే విజయవిలాసం కూడా వర్ణన ప్రధానమైన కావ్యం. విజయుడైన అర్జునుడు ఉలూచి, చిత్రాంగద, సుభద్రలను వివాహమాడి వారితో చేసిన విలాసాలే ఈ విజయవిలాసంలోని ప్రధాన విషయం. విజయవిలాసానికి నోరి గురులింగశాస్త్రిగారు 1906లో తత్వబోధిని అనేపేరుతో టీకా తాత్పర్యాలతో ముద్రించిన విజయవిలాసప్రతి,జూలూరి అప్పయ్యశాస్త్రిగారి వ్యాఖ్యానము కూడా వున్నట్లు తెలుస్తుంది. కానీ అవి ఇప్పుడు అలభ్యాలు. మనకు అందుబాటులో వున్నంత వరకు ఈ క్రింది వ్యాఖ్యానాలు లభ్యమవుతున్నాయి.                                                                     

  1. వేదము వేంకటరాయశాస్త్రి వ్యాఖ్య                                                                                                  

  2. బులుసు వేంకటరమణయ్య ముకురవ్యాఖ్య          

  3. ధర్మారావు తాపీ వారి హృదయోల్లాసవ్యాఖ్య                                                                       

 

వేదము వేంకటరాయశాస్త్రి వ్యాఖ్య

శ్రీ వేదము వేంకటరాయశాస్త్రిగారు 1912లో విజయవిలాసానికి వ్యాఖ్యానం రాసినట్లు తెలుస్తుంది. కానీ అది లభించలేదు. 1948లో అదే వ్యాఖ్యానాన్ని పునర్ముద్రించడం జరిగింది. అయితే ప్రధానంగా సారంగధరకు వేదంవారు రాసిన వ్యాఖ్యానమంత సామాన్యంగాగానీ, ఆముక్తమాల్య దకు రాసిన వ్యాఖ్యవలే సంపూర్ణంగాను, ఉత్తమంగానూ లేదు. ఈ విజయ విలాసవ్యాఖ్యానం 1948లో వేదం వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్ వారు ప్రచురించడం జరిగింది. ఇది విపులమైన వ్యాఖ్యానం కాదు. అవసరమైన పదాలకు మాత్రమే అర్థాలివ్వడం జరిగింది. భావం అన్ని పద్యాలకు కనిపిం చదు. అలంకారాలు తెల్పడంగానీ, శ్లేషను వివరించడంగానీ జరగ లేదు. విజయవిలాసం శ్లేషప్రధానమైన కావ్యం. కానీ వేదంవారి వ్యాఖ్యలో శ్లేష వివరణ అంతగా కనిపించదు. ప్రామాణిక కవి ప్రయోగాలు కూడా మనకు ఈ వ్యాఖ్యానంలో కనిపించవు.

బులుసువేంకటరమణయ్య ముకురవ్యాఖ్య:                                                                               

వేదంవారి వ్యాఖ్య తర్వాత విజయవిలాసానికి వచ్చిన వ్యాఖ్యానాల్లో బులుసు వేంకటేశ్వర్లు గారి ‘ముకురవ్యాఖ్య’ పేర్కొనదగింది. 1952వ సంవత్సరంలో వావిళ్ళ ప్రెస్ వారు ఈ విజయవిలాస ముకురవ్యాఖ్యను ప్రచురించారు. తర్వాత 1969లో పునర్ముద్రణ వచ్చింది. విఙ్ఞప్తిపుట iii లో వేంకటేశ్వర్లుగారు “శ్రీ వేదమువారి వ్యాఖ్యానము వ్యాఖ్యాన సాపేక్షకమయి, కవిహృదయము నావిష్కరించుటలో నేమాత్రము నుపయోగించకున్నది” అంటూ ప్రకటించడాన్ని  బట్టి  విజయవిలాస కావ్యంలోని అందచందాలను, విశేషాంశాలను, చమత్కారాలను గ్రహించడానికి వీలుగా వేదంవారి వ్యాఖ్యలేదనే విషయం మనకు అర్థమవుతుంది. అంతేగాక ముకురవ్యాఖ్య విజయవిలాసానికి దర్పణప్రాయమై కవి హృదయాన్ని కొంతవరకు మాత్రమే గ్రహించడానికి అవకాశముందని వారే తెల్పారు. అంతేగాక ఈ టీక, తాత్పర్యం, విశేషాంశాలు, అలంకారం అనే శీర్షికలతో బులుసువారు విజయవిలాస ముకుర వ్యాఖ్యను తీర్చిదిద్దారు.                         

 

తాపీ ధర్మారావు హృదయోల్లాసవ్యాఖ్య

చేమకూరకవి విజయవిలాస కావ్య అందచందాలను తన ‘హృదయోల్లాస’ వ్యాఖ్యానంతో పరిమళింప జేసిన వారు తాపీ ధర్మారావు గారు. కవి హృదయాన్ని ఆవిష్కరించడమే ప్రధాన ధ్యేయంగా తమ వ్యాఖ్యానాన్ని సంతరించారు తాపీవారు. ఇంతగా ప్రాచుర్యం పొందిన ఈ వ్యాఖ్యానంలో అర్థం, తాత్పర్యం, విశేషాలు, చమత్కారాలు, పాఠాంతరాలు, అలంకారం మొదలైన శీర్షికలతో అందంగా తీర్చిదిద్దారు. పూర్వపు వ్యాఖ్యాతలు చూపని విశేషాలమీద, అందచందాల మీద, అర్థవివరణల మీదా దృష్టిని కేంద్రీకరించి కవిహృదయం ఆవిష్కారమయ్యే సాధు పాఠనిర్ణయాలు, పూర్వపు వ్యాఖ్యానాలలోని దోషాలు తెలియజేస్తూ సరియైన వ్యాఖ్యానం వెలువరించడమే తన ధ్యేయంగా భావించారు. శ్లేషసౌంద ర్యాన్ని, భావ, పద సౌందర్యాలను, పద సార్థకతను వివరిస్తూ పూర్వ వ్యాఖ్యానాల్లో ఉన్న దోషాలను తెలియజేస్తూ మనోరంజకంగా ఈ వ్యాఖ్యానం రాశారు. తన వ్యాఖ్యానం ‘పాండిత్య ప్రకటనకు కాదు, కవి హృదయానికి దగ్గరగా పాఠకుణ్ణి తీసుకువెళ్లడానికి మాత్రమే’ అంటూ చేమకూర తన వర్ణనలలో ఊహించిన విశేషభావాల్ని  వారి వ్యాఖ్యానంలో చూపించడం జరిగింది. కనుక విజయవిలాసంలోని కొన్ని పద్యాలకు ఆయా వ్యాఖ్యాతలు ఇచ్చిన అర్థాలతో పాటు వాటి విశేషాలు కూడా తెలుసుకుందాం.                                          

మామకాగమనవార్త

    “అపుడు నృపుడు ప్రపుల్ల నవాంబుజ ప్ర

     సన్న ముఖుడయి మలయధ్వజ క్షితీశ

     కమల హితునకు మామ కాగమన వార్త

     దెలుపు మనుచు విశారదు బిలిచి పనిచె” (1 -217)                                                                

 

ఈ పద్యానికి వ్యాఖ్యానం రాయడంలో కూడా వ్యాఖ్యాతలు చమత్కారాలు మనకు గోచరిస్తాయి. ఈ పద్య మూడవపాదమైన ‘మామ కాగమనవార్త’ పద విషయంలో వ్యాఖ్యాతల అర్థాలు ఇలా ఉన్నాయి.

     జూలూరివారు= మామకు ఆగమన వార్త అని కూడా చమత్కా రము విచారించవలెను.

     వేదమువారు = మామకున్ ఆగమనవార్త –

    తన కూతును నాకిచ్చి వివాహము చేయుమని ఆయనను  అడుగుము అని చమత్కారము.                                                                        

 

కాని పై పద్యభావాన్ని పరిశీలిస్తే అర్జునుడు విశారదుడిని పిలిచి మలయధ్వజునకు తానక్కడికి వచ్చిన వార్త తెలియజేయమనే అర్థం మనకు కనిపిస్తుంది. చిత్రాంగదతో అర్జునుడికి ఇంకా వివాహం జరగలేదు. కాబట్టి మలయ ధ్వజుడు అర్జునునికి ‘మామ’ కావడానికి అవకాశంలేదు. తాను వచ్చిన విషయం తెల్పమనే భావనతప్ప, తనకు ‘మామ’ అనే అర్థంలో ఆ పదప్రయోగం జరగలేదంటూ తాపీవారు ‘మామ+కాగ+మనవార్త తెలుపుము’ అనే  విధమైన పదవిభజనా, ‘మామ అయేటట్టు మనవార్త తెలుపుము’ అనే అర్థ సమన్వయాన్ని సాధించి చేమకూర హృదయానికి దగ్గరగా పాఠకులను తీసుకెళ్తారు హృదయోల్లాస వ్యాఖ్యానంలో.                                                                             

 

కవి పద్యంలో సూచించిన పదాలను భావాలకు సరిపోయేలా అర్థాన్ని చెప్తే అది పాఠకులకు మరింత దగ్గరతుందనే విషయం పై పద్య వ్యాఖ్యానంద్వారా, వాటి వివరణల ద్వారా మనం గ్రహించవచ్చు. చేమకూర వేంకటకవి పద్యాలకు కొన్నింటికి రమణీయ వ్యాఖ్యలు రాసిన శ్రీ కులశేఖర రావుగారు ‘మామకాగమనవార్త’ అనే దానిలో ఉన్న అర్థాల్ని ఇలా వివరిస్తున్నారు.                                                                                                                  

‘మామక+ఆగమనవార్త - అంటే నా రాకను గురించిన వార్త తెలుపుము అనేది సామాన్యార్థం. మామకు+ ఆగమనవార్త - అంటే మామ లాంటివాడు, అతని కూతురును తాను వివాహం చేసికొనబోతున్నవాడు, కాబట్టి ఆయనకు నా రాకను గురించి తెలుపుమని చెప్పడం రెండవ అర్థం. మామకాగ+మనవార్త- అనగా ఆ మలయధ్వజుని కుమార్తెను నేను వరించినాను. అతడు నాకు తన కుమార్తెనిచ్చి వివాహం చేసి మామ కావలసి ఉంది. అందుచేత నా రాకను గురించిన వార్తతోపాటు అతడు నాకు మామ అయ్యేటట్లుగా వార్త చెప్పవల్సింది అని ఆదేశించడం మూడవ అర్థం’. కనుక ఇటువంటి పదాలు, ముఖ్యంగా చమత్కారంతో కూడియుండి రమ్యంగా ఉండే పద్యాలను, వాటి అర్థాలను వివరించేటప్పుడు వ్యాఖ్యాతలు ఆక్షేపణలతో సరిపెట్టక భావానికి సరిపోయే అర్థాన్ని వివరిస్తే పాఠకులు మరింతగా దీనిని ఆస్వాదించగలుగుతారు.

                                                                                                                           

ముగింపు:

కాలం మారుతూ ఉన్నప్పుడు భాషలో కూడా మార్పులు జరగడం అనివార్యం. ఈ మార్పులు చాలావరకు ఆయా వ్యాఖ్యానాలలో కూడా ప్రతిఫలిస్తుంటాయి. శ్రీహర్షుని నైషధం ఎంత ప్రౌఢంగా ఉంటుందో, అంతకంటే ప్రౌఢంగా శ్రీనాథుడు దానిని శృంగారనైషధంగా తెలుగులోనికి అనువదించాడు. ‘నైషధం విద్వదౌషధమ్’ అనే విధంగా పండితులకు కూడా కొరుకుడు పడనివిధంగా పండితులకు ఔషధంగా శృంగారనైషధం తెలుగుసాహిత్యంలో భాసిల్లింది. ప్రత్య క్షంగా చదవడంద్వారా ఏ పాఠకుడూ దానిలోని సంప్రదాయాలనుగానీ, శ్రీనాథుని వ్యక్తిత్వాన్నిగానీ, పాత్రల మనస్త త్వాన్ని గానీ అవగాహన చేసుకోవడం చాల కష్టతరమైన విషయం. కేవలం వ్యాఖ్యానాల సాయంతో మాత్రమే చదవదగిన ఒక విశిష్టగ్రంథం శృంగార నైషధం. దీనికి వ్యాఖ్యానం రాసే వ్యాఖ్యాతలు సందర్భానుసారంగా ఎన్ని విశేషాలనయినా చొప్పించవచ్చుగానీ కావ్య పరమార్థాన్ని పాఠకులకు చేర వేయడంలో మాత్రం తప్పక కృతకృత్యులు కావాలి. బహుశా ఈ విషయంలో సర్వంకషవ్యాఖ్య కంటే గూఢార్థ ప్రకాశినీ వ్యాఖ్య ముందు వరుసలో ఉంటుందని చెప్పడం అతిశయోక్తి కాదు.                                                                                                            

సర్వంకష వ్యాఖ్యానంకంటే గూఢార్థ ప్రకాశినీ వ్యాఖ్య అంత ఉత్తమ మైనదని నా భావన కాదుగానీ అర్థంచేసు కోవడానికి బాగా ఉపకరిస్తుందనేది మాత్రం వాస్తవం. సర్వంకషను అర్థంచేసుకోవడం చాలా కష్టం. సర్వంకష తర్వాత అన్నే విశేషాలతో అంతే ప్రౌఢంగా రాసిన వేదంవారి వ్యాఖ్య సంజీవనీ. ఈ రెండు వ్యాఖ్యానాలను వివరించడానికి ఎన్నో ఉపపత్తులను, ఉత్తమగ్రంథాలను ప్రమాణంగా చూపిస్తూ వ్యాఖ్యానం సంతరించారు వేదంవారు. సంప్రదాయాన్ని మోసుకుంటూనే ఆధునికత వైపు ప్రయాణించడం భాషాభివృద్ధికి సూచిక. ప్రత్యేకించి ఒక కావ్యానికి వ్యాఖ్యానం చెప్పడం మామూలు విషయం కాదు. ఎన్నో నిఘంటువుల్ని ఉదాహరణగా చూపించాలి, ఒక పదానికి సరియైన అర్థాన్ని చూపించి భావసమన్వయం చేయాలి. కవులు ప్రయోగించిన కొన్నికొన్ని పదాలకు నిఘంటు అర్థాలు దొరకనప్పుడు వ్యాఖ్యాతలు వారి పాండిత్యాన్ని అనుసరించి సరికొత్త పద సృష్టి చేస్తారు. దీనివల్ల భాషాసంపద విస్తృతంగా అభివృద్ధి చెందుతుంది. ఆ పదం వాడుక వల్ల కొన్ని మామూలు పదాలు కూడా జనసామాన్యంలో వాడుకలోకి వస్తాయి. కనుక ప్రాచీన కావ్యాలకు విస్తృతంగా వ్యాఖ్యానాలు రాసినప్పుడు కవులు వాడిన అరుదైన పదాలకు అర్థాలు చెప్పడం సాధ్యమవు తుంది. పదసంపద అభివృద్ధి చెందుతుంది.                                                                                     

ఉపయుక్త గ్రంథసూచి                                                                                                                            

  1. కృష్ణమూర్తి ఇరివెంటి (సం): 1974: శ్రీనాథుని కవితావైభవం, యువభారతి ప్రచురణ, హైదరాబాద్.                           

  2. కోటేశ్వరరావు తుమ్మపూడి: 2001: ఆముక్తమాల్యద సౌందర్యలహరీ వ్యాఖ్య, మలయకూట పబ్లికేషన్స్, హైదరాబాద్.                                                       

  3. నటేశ్వరశర్మ అయాచితం: 1992: ఆముక్తమాల్యద పరిశీలనము, జాతీయ సాహిత్య పరిషత్తు ప్రచురణ, కామారెడ్డి.                                                   

  4. రాజేశ్వరశర్మ అమరేశం (1986): శ్రీ వేదం వేంకటరాయశాస్త్రి వ్యాఖ్యాన నాటక సమాలోచనము, ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రచురణ, హైదరాబాద్.                                                                                                             

  5. రాధాకృష్ణమూర్తి పాతకోట: 1979: పుంభావ సరస్వతి శ్రీనాథుడు, రత్నాఆర్ట్ ప్రింటర్స్, గుంటూరు.                           

  6. రామస్వామిశాస్త్రులు వావిళ్ళ: 2004: ఆముక్తమాల్యద రుచి వ్యాఖ్యానం, వావిళ్ళ రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్, చెన్నై.                                                                                                                                                     

  7. రామదాసయ్యంగార్ నేలటూరి: 1966: శ్రీ సాహిత్యోపన్యాసములు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాద్.                        

  8. వేంకటనారాయణ మేడవరం: 1990: భారతీయ సాహిత్యంలో వ్యాఖ్యాన సంప్రదాయం తెలుగులో వ్యాఖ్యానాలు, అముద్రిత సిద్ధాంత గ్రంథం, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి.                                                                             

  9. వేంకటరాయశాస్త్రి వేదము: 1961: శృంగారనైషధ సర్వంకషావ్యాఖ్య, లింగిశెట్టివీథి, మదరాస్.                                                                     

  10. వేదము వేంకటరాయశాస్ర్త్రి: 1964: ఆముక్తమాల్యద సంజీవనీవ్యాఖ్య, వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్, మదరాస్.                                                                                                                                                   

  11. వేంకటశాస్త్రి కేతవరపు: 1913: శృంగారనైషధం గూఢార్థ ప్రకాశినీ వ్యాఖ్య                                                                                                                                                                                                                   

  12. హనుమంతరావు మల్లాది: 2009: ఆముక్తమాల్యద పరిచయం, సిపి బ్రౌన్ అకాడమీ ప్రచురణ, హైదరాబాద్.                                                                

హేమలత డి: 1998: తెలుగులో వ్యాఖ్యాన సంప్రదాయం వ్యుత్పత్తి వికాసాలు (తెలుగు పురాణ, ఇతిహాస, కావ్య, ప్రబంధవ్యాఖ్యలు), అము ద్రిత  పిహెచ్.డి సిద్ధాంత గ్రంథం, హైదరాబాద్ విశ్వవిద్యాలయం.

OOO

Bio

జడా సుబ్బారావు

డా. జడా సుబ్బారావు గారు కృష్ణాజిల్లా నూజివీడులోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో 2009వ సంవత్సరం నుండి తెలుగు లెక్చరరుగా చేస్తున్నారు. నూజివీడు, కృష్ణాజిల్లా (ఆంధ్రప్రదేశ్, ఇండియా) వాస్తవ్యులు. ఆయన రాసిన ‘తలరాతలు’ అనే కథా సంకలనాన్ని మధురవాణి మునుపు సంచికలో పరిచయం చేసాము.  కథలేకాకుండా ఆయన రాసిన ఎన్నో సాహితీ పరిశోధనా వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి.

కథాసంపుటం  : తలరాతలు (విశాలాంధ్ర ప్రచురణ)
వ్యాససంకలనం: వ్యాసలోహిత (ప్రాచీన సాహిత్య పరిశోధనా వ్యాససంపుటి) 
అముద్రిత కవితాసంకలనం: కొన్ని కలలు...కొన్ని కన్నీళ్లు.
రేడియో ప్రసంగాలు: తెలుగు కవులు - భట్టుమూర్తి అనే అంశంపై ప్రసంగం.

స్వీయ కవితా పఠనం వృత్తికి సంబంధించిన రచనలు:  వివిధ కాలేజీలు, విశ్వవిద్యాలయ జాతీయ సదస్సుల్లో 40 పత్రాలకు పైగా సమర్పణ, అంతర్జాతీయ సదస్సులో పత్ర సమర్పణ, వివిధ సాహిత్య పత్రికలలో పలు వ్యాసాలు ప్రచురితం.
.

Comments
bottom of page