top of page

సంపుటి 1    సంచిక 4

కథా మధురాలు

పాప కోసం

Bhavani Phani

భవానీ ఫణి

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో బహుమతి సాధించిన కథ

దూరంగా హెడ్ లైట్ల వెలుగు కనిపించడంతో రిలీఫ్ గా ఊపిరి పీల్చుకుంది కల్పన. కానీ, వెనువెంటనే ఆమె మనసులోకి ఓ సందేహం ప్రవేశించింది. ఒకవేళ అదే నిజమైతే ఎంత ప్రమాదమోననుకుంటూ అటూ ఇటూ చూసేసరికి పక్కనే గుబురుగా ఉన్న పొదలు కనిపించాయి . పాకెట్ బాటరీ లైట్ వెలుగులో, సంశయిస్తూనే ఆ పొదల మధ్యకి ప్రవేశించిందామె . కొంచెం లోపలగా దాక్కుని, భయం భయంగా రోడ్డు వైపు చూడసాగింది.

 

ఇంతలో చీకటిని చీల్చుకుంటూ ఒక తెల్లని కారొచ్చి సరిగా బస్ షెల్టర్ ముందుగా ఆగింది. కల్పన గుండె మరింత వేగంగా కొట్టుకోసాగింది. కార్లో ఎవరున్నారోనని కళ్ళు  చిట్లించి పరిశీలనగా చూసింది. ఎత్తుగా భారీగా ఉన్న ఒక వ్యక్తి  క్రిందికి దిగి ముందుకు నడిచాడు. కార్ బాయ్నేట్ పైకెత్తి సెల్ ఫోన్ వెలుగులో పరీక్షచేయడం మొదలుపెట్టాడు. అంటే కారుకేదో సమస్య  రావడంవల్ల ఆగిందన్నమాట. ఇంతలోనే మరో వ్యక్తి కూడా కార్ దిగి అతని దగ్గరకి వచ్చాడు. ఇద్దరూ మెల్లగా ఏదో మాట్లాడుకుంటున్నారు. తను దాక్కోవడమే మంచిదయింది.  చూడ్డానికి వాళ్లిద్దరూ రౌడీల్లా ఉన్నారు.  బాగా తాగి ఉన్నట్టున్నారు కూడా. వాళ్ల కళ్లబడితే ఏం జరిగి ఉండేదో ఏమో!


అయినా ఆఫీస్ లో ఈరోజే ఇంత లేటవ్వాలా? వర్షమూ ఈరోజే వచ్చి పడాలా? తన కార్ కూడా ఇటువంటి నిర్మానుష్యమైన ప్రదేశంలోనే ఆగిపోవాలా? మొబైల్ బాటరీ కూడా డెడ్ ఇప్పుడే అయి ఏడవాలా? కనీసం వీళ్ళయినా మంచివాళ్ళయి ఉండకూడదా! తన దురదృష్టానికి బాధపడింది కల్పన.

ఇంతలో ఒక అనుకోని సంఘటన ఆమె కళ్ల పడింది. కార్ వెనక డోర్ తెరుచుకుని ఎవరో మెల్లగా క్రిందికి దిగుతున్నారు. ఆమెని ఆశ్చర్యానికి గురిచేసిన విషయం అది కాదు. ఆ దిగుతున్న ఆకారం, ఒక ఏడెనిమిదేళ్ల వయసుగల పాపదిగా పోల్చుకుంది కల్పన. పాప నోటికి ప్లాస్టర్ వేసి ఉంది. చేతులు వెనక్కి కట్టుకుని ఉంది. బహుశా ఎవరో ఆలా కట్టేసి ఉంటారు. 'అయ్యో, ఈ వెధవలు పాపని కిడ్నాప్ చేసినట్టున్నారే!' మరింత భయంగా అనుకుంది.


పాప భుజంతో మెల్లగా డోర్ దగ్గరకి వేసి కార్ వెనక్కి వెళ్లి చీకట్లోకి మాయమయింది. 'ఈ దుర్మార్గులు పాప పారిపోయిన విషయాన్ని గమనించకుండా ఉంటే బాగుండును' అని కల్పన మనసులోనే దేవుడ్ని ప్రార్థించుకుంది. ఏ దేవతలు ఆమె మొర విన్నారో కానీ కారు సమస్య  పరిష్కారమయినట్టుంది, ఇద్దరూ కారెక్కి స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయారు. కల్పనకి గుండెల మీదనించి కొండంత బరువుని దించుకున్న ఫీలింగ్ కలిగింది.

ఇంతలో పాప చీకట్లోంచి వీధి లైట్ వెలుగులోకి నడుచుకుంటూ వచ్చింది, నోటికి ప్లాస్టర్ తో, వెనక్కి విరిచి కట్టున్న చేతుల్తో ఉన్న పాపని చూస్తే కల్పనకి చాలా జాలి కలిగింది. పాప  వైపే చూస్తూ పొదల మాటు నుండి బయటకి నడిచింది. ఆమెని గమనించిన పాప బెదిరినట్టుగా కదిలింది.


"భయం లేదు పాపా, నేను నిన్నేమీ చెయ్యను. ఇక్కడికి కొంచెం దూరంలో నా  కారాగిపోయింది. బస్సులేమైనా దొరుకుతాయేమోనని ఇలా వచ్చి ఈ షెల్టర్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. వాళ్లు వెళ్లిపోయారులే, భయపడకు" అనునయంగా అంటూ తనవైపుకి నడిచింది. పాప కళ్లలోకి కొంత జీవం వచ్చినట్టనిపించింది.

 

ఈ సారి కల్పన కాస్త చురుగ్గా కదిలి పాపని చేరుకుని కట్లు విప్పింది, తన చెదిరిపోయిన జుట్టును సవరిస్తూ "నీ పేరేమిటమ్మా ?" అంది. పాపేమీ సమాధానం చెప్పలేదు. 
కానీ అంతలోనే కల్పనకి మరో ఆలోచన కలిగింది. ఆ దుర్మార్గులు పాప తప్పించుకుందన్న సంగతి గమనిస్తే వెతుక్కుంటూ మళ్ళీ ఇక్కడికే వస్తారు. తామిక్కడుండటం మంచిది కాదనుకుంటూ ఎటు వెళ్లాలా అని ఆలోచిస్తుండగానే  కారు వెళ్లిన వైపునుండి వెలుగు కన్పించింది .

 

'అయ్యో, అనుకున్నంతా అయిందే, వాళ్ళు వెనక్కి వస్తున్నట్టున్నారు. ఇప్పుడేం చెయ్యాలి? ఇందాక దాక్కున్న పొదల వెనుక మళ్లీ దాక్కున్నా, వాళ్లు సులువుగా వెతికి పట్టుకుంటారు. పైగా, పాపా తనూ ఇద్దరూ ఒకేసారి దొరికిపోతారు' ఆలోచిస్తూనే  చేతిలో బ్యాటరీ లైట్ తో నాలుగు పక్కలా పరికించి చూసింది.


వాళ్ల కోసమే అన్నట్టుగా, పాత నీళ్ల డ్రమ్ ఒకటి రోడ్డుకి రెండో వైపున కనిపించింది  వేగంగా పాప చెయ్యి పట్టుకుని అటు వైపు లాక్కెళ్లింది కల్పన. డ్రమ్ లోపల ఓసారి పరీక్ష చేసి ఖాళీగానే ఉందని నిర్ధారించుకుని దాన్ని పక్కకి దొర్లించి వేగంగా పాపని అందులోకి నెట్టేసింది.

 

విషయం అర్థమయిందేమో, ఎందుకూ ఏమిటని అడక్కుండా  పాప కూడా డ్రమ్ లోకి దూరి కూర్చుంది. పక్కనే కనిపించిన పాత గుడ్డని ఆ డ్రమ్ కి మూతలా కప్పి, తాను మళ్ళీ వేగంగా ఇందాకటి పొదల మాటుకి చేరుకుందామె. మరు నిమిషంలోనే కారొచ్చి  బస్ షెల్టర్ ముందాగింది. ఆ రౌడీలిద్దరూ కంగారుగా కార్లోంచి దిగి చుట్టుపక్కల వెతకడం మొదలుపెట్టారు. కల్పన గుండె చిక్కబట్టుకుని కదలకుండా అలానే కూర్చుంది. వాళ్లలో ఒకడు పొదలవైపుకి రాబోతుండగా డ్రమ్ దగ్గరనించి శబ్దం వినిపించింది. దాంతో ఇంకో పక్కన వెతుకుతున్న రెండోవ్యక్తి కూడా ఎలర్ట్ అయ్యాడు.  ఇద్దరూ కలిసి డ్రమ్ వైపుకి పరుగుతీసారు. 


'దేవుడా! పాప మళ్లీ వీళ్లకి దొరికిపోయేలా ఉందే' అనుకుంటుంటే కల్పనకి దుఃఖం ముంచుకొచ్చింది.  ఎందుకో స్రవంతి, సాత్విక్ లు గుర్తొచ్చారు. పెద్దవాళ్లే తల్లడిల్లిపోయే ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఏమైపోతారు! 

ఇప్పుడామెకి తొందర తొందరగా ఎంచుకోవాల్సిన రెండు మార్గాలు కళ్లముందు కన్పిస్తున్నాయి. అలానే కదలకుండా  ఉండిపోయి, పాపని వాళ్లు లాక్కెళ్లిపోతుంటే  నిస్సహాయంగా చూస్తుండిపోవడం, లేదా తనే వాళ్ళకి దొరికిపోవడం. ఆలోచించే సమయం కూడా లేదు. నిర్ణయం వెంటనే తీసేసుకుని గట్టిగా చేతి గాజులు చప్పుడు చేస్తూ లేచి నిలబడింది. ఆ రౌడీలిద్దరూ వెనక్కి తిరిగి చూడగానే రోడ్డెక్కి  పరుగు తీయడం ప్రారంభించింది. వాళ్లు తన వైపుకి  రావడం కళ్ల చివరల్నించి గమనిస్తూనే శక్తి మేరకు పరుగుతీయసాగింది. కానీ ఎంతో సేపు గడవకుండానే వాళ్లలో ఒకడొచ్చి ఆమెని పట్టుకోవడం, రెండోవాడు డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న కార్లోకి ఎక్కించడం వెంట వెంటనే జరిగిపోయాయి. కల్పన బలం కొద్దీ గింజుకుందే తప్ప అరిచే ప్రయత్నం చెయ్యలేదు. ఎందుకంటే పాపకి ఆ కేకలు వినిపించి బయటకి వస్తే తను చేసిందంతా వృధా అవుతుంది మరి.

ఒకడు కార్ డ్రైవ్ చేస్తుంటే రెండోవాడు కల్పన పక్కన చాకు పట్టుకుని కూర్చున్నాడు. వాళ్లేమీ మాట్లాడుకోవడం లేదు. ఆమెనేమీ అడిగే ప్రయత్నం చెయ్యలేదు. బహుశా నోరు విప్పితే తనకి వాళ్ల వివరాలు తెలిసిపోతాయనేమో. ఎవరో ప్రొఫెషనల్స్ లానే ఉన్నారు. 'ఇంతకీ ఇప్పుడు వీళ్ళు తనని ఎక్కడికి తీసుకెళ్తున్నారు. తన దగ్గర నగలు తీసుకునో, తన్నేమైనా చేసో  చంపి పడేస్తారా? లేకపోతే ఎక్కడైనా అమ్మేస్తారా?' కల్పనకి భయంతో పాటుగా అయోమయం కూడా పెరిగిపోతోంది.

అయినా తను తీసుకున్నది సరైన నిర్ణయమేనా? తన పిల్లలు... తన పిల్లలు ఏమైపోతారు? ఇంత వయసొచ్చినా ఇప్పటికీ అమ్మ మీద తనెంతగా ఆధారపడుతుంది! అటువంటిది తన పిల్లలు చిన్నవాళ్లే, తను లేకుండా ఎలా బ్రతుకుతారు? వాళ్ల అవసరాలన్నీ ఎవరు తీరుస్తారు? మాధవ్ కూడా తన కోసం బాధ పడతాడు, కానీ ఏమో, కొన్ని రోజులు పోయాకా తన్ని మరిచిపోయి మరో పెళ్లి చేసుకోవచ్చు. అప్పుడు తన పిల్లల పరిస్థితేమిటి?వాళ్లు ఎవరెవరిమీదో ఆధారపడి, ఎంత హీనమైన జీవితాన్ని గడపాల్సి వస్తుందోనన్న ఆలోచనతో ఆమె కళ్లు గబ గబా నిండిపోసాగాయి. మనసు విపరీతమైన బాధతో మెలి తిరిగిపోతోంది.

 
'లేదు, అలా జరక్కూడదు. తనెలా అయినా వీళ్ల చెరలోంచి తప్పించుకోవాలి.' కంగారుగా అనుకుంది. సాయమడగటానికి ఎవరైనా కనిపిస్తారేమోనని కారు అద్దాల్లోంచి బయటకి చూడసాగింది. ఎటు చూసినా చిక్కటి చీకటి. అక్కడక్కడా వీధి లైట్ల వెలుగు వేగంగా వెనక్కి  దాటుకెళ్లిపోతోంది. పెద్దగా వాహనాలేవీ కూడా కనిపించడంలేదు. 'ఎటు తీసుకుపోతున్నారో ఏంటో' అనుకుంది కల్పన మరింత దిగులుగా.

 

ఇంతలో హఠాత్తుగా రోడ్డుకడ్డంగా ఎవరో నిలబడి ఉన్నట్టు గమనించిందామె. అరిచే అవకాశం కూడా లేదు. అలానే మూలుగుతూ గుంజుకుంది. రోడ్డు మీద ఎవరో ఉన్న విషయాన్ని కారు డ్రైవ్ చేస్తున్నరౌడీ కూడా గమనించినట్టున్నాడు. సడెన్ బ్రేక్ వేసాడు.  కానీ అప్పటికే ఆలస్యమయిందో ఏమో. చిన్నపాటి శబ్దం వచ్చింది.  బాధతో కల్పన గట్టిగా కళ్లు మూసుకుంది. 

ఒక్క నిమిషం పాటు అంతా నిశ్శబ్దం. ఎటువంటి అలికిడీ లేకపోయేసరికి  నెమ్మదిగా కళ్లు తెరిచి చూసింది. విచిత్రంగా రోడ్డు మీద ఎవరూ కనబడలేదు. రౌడీలిద్దరూ స్పృహ తప్పి పడి ఉన్నారు. 'ఏమైంది వీళ్ళకి? యాక్సిడెంట్ కూడా కాదే! ఏది ఏమైనా తను తప్పించుకు పారిపోవడానికి ఇదే సరైన సమయం' అనుకుంటూ శక్తినంతా కూడదీసుకుని డోర్ వైపుకు జరగసాగింది  కల్పన.

 
ఇంతలో మెల్లగా డోర్ తెరుచుకుంది. ఎదురుగా లీలగా పాప ఆకారం కనబడిందామెకి. ఆ మసక చీకట్లో పాపని పోల్చుకోగానే ఒకింత ఆశ్చర్యం కలిగింది కల్పనకి. పాపని వదిలేసి ఒక కిలోమీటరు దూరమైనా  ముందుకు వచ్చేసి ఉంటారు వీళ్లీపాటికి. మరి పాపెలా ఇంత తొందరగా ఇక్కడికి చేరుకుంది! ఎవరైనా సహాయం చేసుంటారని అనుకుంటూ చుట్టూ చూసింది. పాప తప్ప ఎవరూ కనిపించలేదు. ఇంతలోనే పాప ఆమె నోట్లోనించి  క్లాత్ ని తొలగించి చేతులకున్న కట్లు విప్పసాగింది. 
"ఎవరు తీసుకొచ్చారమ్మా? ఎలా వచ్చావు?" అంది కల్పన ఆరిపోయి ఉన్న పెదవుల్ని తడి చేసుకుంటూ. 


పాప నవ్వింది. ఆ నవ్వు  కొత్తగా, మిస్టిక్ గా అనిపించింది కల్పనకి. 'అయినా ఇద్దరం కలిసాక ఇదేగా పాప నవ్వడం! కొత్త విషయం కొత్తగా కాక ఎలా ఉంటుంది'. అని సరిపెట్టుకుని కారు దిగింది.

 
"ఆంటీ, చెడిపోయిన మీ కారు ఇక్కడికి దగ్గరలోనే ఉంది కదా.  అక్కడికి వెళదాం పదండి." అంది పాప ఆమె ప్రశ్నకి సమాధానం చెప్పకుండా.  
తన కారు ఎక్కడ చెడిపోయిందో పాపకెలా తెలిసిందా అన్న సందేహం కలిగినా ముందుగా అడగాల్సినవి ఇంకా చాలా ఉన్నాయిగా అనుకుంటూ "ముందు నాకిది చెప్పు. ఎవరు నిన్నిక్కడికి తీసుకొచ్చారు. ఏరీ వాళ్ళు ?" అనడిగింది కల్పన  
పాప ఈసారి మరింత వింతగా నవ్వింది."నేనే నడిచొచ్చాను". 
కల్పనకెందుకో కొంచెం భయమేసింది. ఆ విషయం పాప గమనించినట్టుంది. 
"భయపడకండి, నేనేమీ దెయ్యాన్ని కాదు. పదండి, మీ కారున్న చోటికి వెళ్తూ మాట్లాడుకుందాం" అని ముందుకు దారి తీసింది.

కల్పన అనేక సందేహాలు నిండిన మనసుతో పాపతో పాటుగా నడవడం మొదలుపెట్టింది. ఆమె వెనక్కి  వెనక్కి  తిరిగి చూస్తూ నడవటం చూసి, "కంగారుపడక్కర్లేదు. వాళ్లిప్పుడప్పుడే లేవరు" అంది పాప. ఏంటో అంతా మిస్టరీలా ఉంది కల్పనకి. 
పాప చేతిలో ఉన్న చిన్న రాయిలాంటి వస్తువు వెలుగులో దారి స్పష్టం కనిపిస్తోంది. పాప కల్పన వైపు తిరిగి మెరుస్తున్న కళ్లతో నవ్వింది. 
"సరే, నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది ముందు మీరు ప్రశాంతంగా వినండి. వింటారా మరి?" అంది పెద్ద ఆరిందాలా. 
సరేనన్నట్టుగా తలూపింది కల్పన. అంతకంటే చెయ్యగలిగింది మాత్రం ఏముంది? 

"నేను మీ భూమికి చెందిన ప్రాణిని కాదు. మాది ఇక్కడికి చాలా దూరంలో ఉన్న వేరే నక్షత్రానికి చెందిన గ్రహం. మా గ్రహం పేరుని మీకు తెల్సిన భాషలోకి అనువదించి చెప్పాలంటే 'బ్రైట్ స్టోన్' అనే అర్థం వస్తుంది. మా గ్రహం మీది వాతావరణ పరిస్థితులు కూడా ఇంచుమించు భూమ్మీదున్నట్టే ఉంటాయి " అని ఆగింది పాప. 

చిన్నగా నెర్వస్ గా నవ్వింది కల్పన. "ఏంటి పాపా? ఈ టైంలో జోక్స్ ! అయినా నా కారు చెడిపోయింది కదా . అక్కడికి వెళ్లినా ఉపయోగం లేదు పక్కన ఏదో ఇల్లు కనిపిస్తోంది. వెళ్లి సాయం అడుగుదాం పద. అంటూ రోడ్డు పక్కకి దిగబోయింది. 
పాప ఆమె చెయ్యి పట్టుకుని ఆపింది. "లేదు మీ  కారు పనిచేస్తుంది. నేను జోక్ చెయ్యడం లేదు. నిజమే చెప్తున్నాను. లేకపోతే ఇందాక ఇంతవేగంగా ఇక్కడికెలా వచ్చి ఉంటాను? మీరే ఆలోచించండి" అంది. 


కల్పనకి ఏమీ పాలుపోవడంలేదు. సరే, ఇంకా ఏం చెప్తుందో విందామని నిర్ణయించుకుని మళ్ళీ  అడుగు ముందుకు వెయ్యసాగింది. 
పాప కొనసాగించింది. "భూమి కంటే మా గ్రహం చాలా పురాతనమైనది. చాలా ఎడ్వాన్స్డ్  కూడా.  మీకు తెలియని, మీరర్థం కూడా చేసుకోలేనంత అధునాతనమైన టెక్నాలజీ మా దగ్గరుంది. మీ భూమి పుట్టినప్పటినుండీ, దాని మీద జీవం మొదలైనప్పటి నుండీ జరుగుతున్న మార్పులన్నీ మేం జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నాం. మాకున్న ఇంటెలిజెన్సీకి  కొంతైనా సరిపోలగల బుద్ధిజీవులు భూమ్మీద పుట్టే అవకాశాలున్నాయని మొదట్లోనే మా సైంటిస్ట్ లు అంచనా వేశారు. అందుకే భూమిని గమనిస్తూ ఉండాలని నిర్ణయించుకున్నాం. 


మీ కాలమానం ప్రకారం పాతికేళ్లకొకసారి నాలాంటి ఏజెంట్లు కొందరు భూమినీ, ఇక్కడి ప్రాణుల్నీ పరిశీలించడానికి వస్తారు. ఈ పని చెయ్యడానికి మా గ్రహంలో ఒక ప్రత్యేకమైన వ్యవస్థే ఉంది." పాప చెబుతుండగానే రోడ్డు పక్కన ఆగిపోయిన తన కారు కనిపించింది కల్పనకి. పాప కూడా చూసినట్టుంది. అటువైపుకి నడిచింది. 

"మా బ్యూరో చెయ్యాల్సిన పనల్లా భూమిని అన్ని రకాలుగా పరిశీలించడం. ఇక్కడి వాతావరణం, కాలుష్యం, వనరులు, మనుషుల మనస్థితి, ఇతర జంతువుల, ప్రాణుల వివరాలు అన్నీ పరిశీలించి రిపోర్ట్ తయారుచేసుకుంటాం. మా సంస్థలో  చాలా మంది ఏజెంట్స్  ఉన్నారు. చాలా డిపార్ట్మెంట్ లున్నాయి. అందులో మా డిపార్ట్మెంట్ పని, మనుషుల్లోని మానవత్వపు రేటుని కొలవడం. మానవత్వమనే లక్షణం మనుషుల్లో క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చి, అంతరించిపోయే దశలో ఉందని మా స్టేటస్టిక్స్  చెప్తున్నాయి. అందుకే ఈసారి చేస్తున్న సర్వేని చాలా కీలకంగా భావిస్తోంది మా గ్రహం. నాలాంటి ఏజెంట్లంతా ఇచ్చిన రిపోర్ట్ల ఆధారంగా ముఖ్యంగా పొల్యూషన్, హ్యుమానిటీ అనే రెండు అంశాల్ని బట్టి, భూమి భవిష్యత్తు నిర్ణయించబోతున్నారు మావాళ్లు" కారు పక్కన నిలబడి చెప్తున్నదల్లా ఆగింది పాప. 

"మీరు నమ్మడం లేదు కదా. సరే, నేను మీ కారును రెండు సెకన్లలో బాగు చెయ్యగలను. అప్పుడైనా నమ్ముతారా?" అంది. 

కల్పనకసలే అయోమయంగా ఉంది . పాప ఈ సైన్స్ ఫిక్షన్ లాంటి కథ చెప్తున్నంతసేపూ  తనని తాను గిల్లుకునీ, తల గట్టిగా విదుల్చుకునీ అసలు తను నిద్రలో ఉందో మెలకువలో ఉందో చాలా సార్లు పరీక్షించుకుంది కూడా.  "సరే, చెయ్యి  చూద్దాం" అంది చివరికెలాగో గొంతు పెగుల్చుకుని. 

పాప కారుని తాకనైనా తాకలేదు. కారు వైపు తీక్షణంగా చూసింది.  ఏవో వెలుగు కిరణాలు కారు చుట్టూ అలుముకున్నాయి రెండే రెండే సెకన్ల పాటు.. "ఇప్పుడు చూడండి. స్టార్ట్ అవుతుంది" అంది. 

కల్పన బెరుకు బెరుగ్గా కారుని సమీపించింది. వణుకుతున్న చేతుల్తో లాక్ తీసి, సీట్లో కూర్చుని ఇగ్నిషన్ తిప్పింది  అంతకుముందు అదిక్కడ ఆయిపోయినప్పుడు అరగంట పాటు ఎన్ని ప్రయత్నాలు చేసినా స్టార్ట్ కానిది, ఇప్పుడు వెంటనే స్టార్టయింది. అంటే పాప నిజమే చెప్తోందా అనిపించింది ఒక్క క్షణం కల్పనకి.  అంతలోనే 'ఇదేదైనా రియాలిటీ షో అయి ఉండవచ్చన్న' సందేహం సడన్ గా కలిగిందామెకి.

"అంటీ, మేం ఈ విషయాలన్నీ భూలోకవాసులతో చర్చించకూడదు. కానీ నన్ను రక్షించడానికి మీ ప్రాణాల్ని పణంగా పెట్టిన మీ గొప్ప హృదయాన్ని చూసి నేను ఇదంతా మీకు చెప్తున్నాను. లేకపోతే, ఏం జరిగిందో అర్థంకాని అయోమయంతో, మా టెస్ట్ ల కారణంగా పిచ్చిక్కిన వాళ్ళు  కూడా మీ చరిత్రలో ఉన్నారు. సరే నే చెప్పేది పూర్తి చేస్తాను" అంటూ చెప్పసాగింది… 

"ఇలా ఇప్పుడు పదుల సంఖ్యలో నాలాంటి ఏజెంట్లు భూమ్మీద ఇటువంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మేం పంపే రిపోర్ట్లలో ఎక్కువశాతం ప్రతికూలంగా ఉంటే, భూమిని నాశనం చెయ్యడమొక్కటే మార్గమని నిర్ణయించుకుంది మా ప్రభుత్వం. ఎందుకంటే మీరు మా ఉనికిని తెలుసుకునే సమయం అతి దగ్గరలో ఉందని మాకర్థమయింది. అదే గనక జరిగితే మీరు, అంటే మనుషులు మా గ్రహాన్ని కూడా భూమిలానే తయారుచేస్తారని మా భయం"
 
కల్పన దీర్ఘంగా నిట్టూర్పు విడిచి, "మరి ఆ రౌడీలు కూడా మీ వాళ్లేనా" అనడిగింది. ఆలోచిస్తున్నకొద్దీ రియాలిటీ షో ఐడియానే కరెక్టని ఆమెకి బలంగా అనిపిస్తోంది. 

"కాదు లెండి. నేను ముందుగా మిమ్మల్ని నా పరీక్షకోసమని ఎంచుకున్నాను. ర్యాండమ్ పికప్ అంతే. అప్పట్నుంచీ దాదాపుగా  రెండు నెలలుగా మిమ్మల్ని అబ్జర్వ్  చేస్తున్నాను. ఈ రోజు మీ కారాగిపోవడం, మీరా బస్ షెల్టర్ కి నడుచుకుంటూ వెళ్లి అక్కడ నిలబడటం గమనించాను. నా టెస్ట్ కోసం ఇదే సరైన సమయమని అనిపించింది. అందుకే కావాలనే  కొంచెం దూరంలో రోడ్డు పక్కన పడి తాగుతున్న ఆ తాగుబోతుల దగ్గరికి వెళ్ళాను. వాళ్ల వృత్తి కిడ్నాపింగ్ అని నాకు తెలుసు. అంతేకాదు, వాళ్ల కారు, బస్ షెల్టర్ దగ్గర ఆగిపోయేలా చేసింది నేనే.  ఇంకా ఇందాక రోడ్డుకి అడ్డంగా నిలబడిందీ, వాళ్ళకి స్పృహ తప్పేలా చేసిందీ కూడా నేనే " అంది పాప. 

"అంటే, నువ్విలా మనిషి రూపంలో మా స్రవంతి వయసు పాపలా కనిపించడం కూడా నీ ప్లాన్ లో భాగమేనా, లేకపోతే మీ గ్రహవాసులు కూడా మనుషుల్లానే ఉంటారా?" అంది కల్పన, తను కూడా పాప మాటల్ని నమ్మినట్టుగానే నటించి చూద్దామనుకుంటూ. ఇదంతా గేమ్ అనుకునేసరికి ఆమెలో తెలియని ఉత్సాహం కలిగింది. 

"లేదాంటీ, చూడ్డానికి మేము మనుషుల్లా ఉండము. నేను కావాలనే ఈ వేషంలో వచ్చాను. మీ గురించో మీ పిల్లలగురించో మాత్రమే ఆలోచించుకుంటారా లేక ముక్కూ మొహం తెలియని ఎవరి కన్నబిడ్డనో కాపాడే త్యాగం చేస్తారా అన్నది తెలుసుకోవాలని నా ప్రయత్నం. మీరీ టెస్ట్ లో వందకి వంద శాతం మార్కులతో పాసయ్యారు. ఒకరకంగా మీరు మీ భూమి నాశనం కాకుండా కాపాడుకున్నారు ." అంటుంటే పాప కళ్లు వింతగా మెరిసాయి. 


"సరే ఆంటీ, నేను ఇక బయలేరాల్సిన సమయం వచ్చింది. ఇదిగో నా గుర్తుగా ఇది మీ దగ్గర ఉంచుకోండి. " అంటూ అప్పటివరకు తమకి దారి చూపించిన, వెలిగే వింతరాయిని ఆమె చేతిలో పెట్టింది. సంశయిస్తూనే తీసుకుంది కల్పన. "అంతా బాగానే ఉంది గానీ ఈ విషయాలన్నీ నాకు చెప్పేసావు కదా. నేనందరికీ చెప్పేస్తే ఏం చేస్తావ్?" పాపని ఇంకొంచెం ఆట పట్టిద్దామని అడిగింది. 


పాప ఈ సారి గట్టిగా నవ్వింది. "మీరు చెప్తే మాత్రం ఎవరు నమ్ముతారు? మీ దగ్గరున్న రాయిని అందుకు సాక్ష్యంగా చూపిద్దామని మాత్రం అనుకోకండి . దాన్ని చూసి మీరు చెప్పిన కథంతా నమ్మేవాళ్లెవరూ ఉండరని మీక్కూడా తెల్సు."
ఈసారి కల్పన కూడా నవ్వింది. ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోవడం కూడా ఆమెకి ఇష్టం లేదు. గండం గట్టెక్కింది కదా. అంతే చాలు. ఒక వేళ ఇది రియాలిటీ షోనే అయితే తొందరలో తనకెలానూ తెలుస్తుంది. ఇప్పటికే బాగా ఆలస్యమయిపోయింది. ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో ఏమిటో!
"సరే రా, నువెక్కడికెళ్లాలో దింపుతాను" అంది పాపతో. 


పాప చిన్నగా నవ్వింది.  "మీదెంత పెద్ద కారైనా, నే వెళ్లాల్సిన చోటుకి తీసుకెళ్లలేదు. కానీ, మీరు క్షేమంగా ఇంటికి చేరండి."
'ఇదంతా గేమ్ అయితే గనుక ఆ కారు, రౌడీలు అంతా నాటకమే అయి ఉంటుంది కదా. పాపకి బ్యాక్ అప్ ఎవరో ఇక్కడే చుట్టుపక్కలే ఉండుంటారు. తను పాపకోసం టెన్షన్ పడాల్సిన అవసరంలేదు.' అనుకుంటూ కాస్సేపలాగే పాప వైపు చూసి, ఆ లేత బుగ్గల్నోసారి ఆపేక్షగా నిమిరింది. 
"హే, ఆ కారు చుట్టూ మెరుపొచ్చిన మ్యాజిక్ ట్రిక్ భలే ఉంది" అంది తమాషాగా కళ్లెగరెస్తూ. 


పాప ఒక్క క్షణం అర్థంకానట్టుగా చూసింది. తర్వాత అర్థమయిందన్నట్టుగా తలూపుతూ "పోనీ, అలానే అనుకోండి" అంటూ భుజాల్ని విచిత్రంగా కదిపింది. .  
"సరే, జాగ్రత్త" బై చెప్తూ కల్పన కారుని ముందుకు నడిపించింది. పక్క సీట్లో పాప కానుకగా ఇచ్చిన వింతరాయి కాంతులీనుతూ మెరుస్తోంది, జరిగిన సంఘటనకీ, జరగబోయే సంఘటనలకీ సాక్షీభూతంలా.

 

.

oooo

Bio

భవానీ ఫణి

భవానీ ఫణి: గృహిణి. చదువుకున్నది బీఎస్సీ , బీఎడ్. జన్మస్థలం తూర్పు గోదావరి జిల్లా లక్ష్మీ పోలవరం. కథలూ, కవితలూ చదవడం, వ్రాయడం ఇష్టం.

***

Bhavani Phani
Comments
bottom of page