
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ రచనల పోటీ
దొంగ పారిపోయాడు

సీతాదేవి గుర్రం
అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ & శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబిల్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన కధల పోటీలో రెండవ బహుమతి పొందిన పద్యకథ
1.సీ।
ఒక్క చీకటి వేళ చక్కని చుక్క దా
వంట జేయుచునుండ నొంటరిగను
తలుపు దట్టగ విని తలుపుదీయ యువకు
డొకడింట దూరినా డొడుపుగాను
కత్తిని జూపించి ఖైదీని తానని
యరచిన చంపుదు ననగ వినియు
బెదరక నవ్వుచు వెనుదిరిగి రమణి
వంటయింటి కరిగి వానినచట
తే.గీ.
కూరుచుండగ బెట్టి దా కూరదరిగి
కంట నీరుజార మిగుల కలతనొందె
నరయ కారణమేమని యడిగినట్టి
ఖైది కిట్లనెను రమణి కథనమల్లి
2.ఉ.మా
పూర్వము నాదు సోదరుడు పోరగ నొక్కనితో చెఱన్ బడె
న్నోర్వక జైలుజీవనము నొక్కదినంబున పారిపోవగా
చర్వితచర్వణమ్మయిన చందము నేరము రెండురెట్లునై
పర్వులు వెట్టుచున్ దుదకు ప్రాణము గోల్పడె రైలుక్రిందనన్
3.తే.గీ.
కథను ముగియించి కాంతయె ఖైది కంత
సంశయము వలదని జెప్పి చాపవేసి
మంచిమాటలతోడను కంచమునను
మాపటన్నము వడ్డించి మాటగలిపె
4.ఆ.వె.
చూడబోవ మంచివాడవై గన్పట్ట
దేల జైలుబడితి వేమిజేసి?
తనగ నిట్లు నుడివె దనదు గాథ, చదువు
రాక పనుల జేయరాక తుదకు
5.కం
ఆకలి బాధకు నోర్వక
వేకువఝామున నడకకు వెడలెడి సతులన్
దూకుడు తనమున గొలుసుల
చాకును జూపుచు హరించ జైలున బడితిన్
6.తే.గీ.
యనిన వినియామె యాదొంగ నార్తితోడ
నిప్పుడెందుకు పారితి జెప్పుమనగ
బండచాకిరి జేయంగ బద్ధకించి
జైలు కూడును దినలేక చనితిననెను
7.ఉ.మా.
తప్పును జేయగా గలిగె దండన, మిప్పుడు పారిపోవగా
ముప్పును మీదకెత్తితివి మూర్ఖుడ! మీకును జైలునందునన్
చప్పున నేర్వగాగలుగు చక్కని వృత్తుల నేర్పగా విధిన్
మెప్పును బొందగా దగిన మెల్కువ తోడను నేర్చియుండినన్
8.తే.గీ.
నక్కరకు రాదె నీకును నక్కజమగు
రీతి ,సంఘమందున చాల నీతిగాను
బ్రతుకు సాగుటకనువైన బాటచూప!
దారి తప్పితివి దుడుకుతనము వలన
9.సీ।
తెలివిదెల్సిన దొంగ తెల్లబోయి బెదరి
నేమి దారియనుచు నేడ్వగాను
తల్లివోలె దగిన దారినిజూపెను
తానుగా జైలుకు దరలివెడలి
శిక్షపెరిగినను స్వీకరించి దగిన
జీవిక నేర్వగా ఠీవిగాను
వల్లెయని రహిని చెల్లిని దీవించి
వెడలిపోయెను దొంగ వేగముగను
తే.గీ.
కొంత తడవు పిదప స్వంత తండ్రివచ్చె
జైలు యధికారియగుటను జాగు నరయ
చోరుడొక్కడు చెఱనుండి పారిపోగ
వెతకగ భటుల నియమించ వేళమించె
10.చం.మా
చురుకగు కూతురప్పుడనె చోరుడు మీకిక జాగుచేయకే
దొరకును దానుగా, నికను దోషము చేయడు ,మారెనేటికిన్
కరకగు శిక్షకంటెను సకారణమౌ దయ దోషులన్ దగన్
మరలగ జేయవచ్చునుగ మంచి మనుష్యులుగాను పృధ్వినిన్
పద్య తాత్పర్యము
1. ఒకరోజు చీకటిపడే వేళకు ఒక అమ్మాయి వంటజేస్తూ ఉండగా వాకిలితలుపు చప్పుడైతే వెళ్ళి తలుపుతీయగా, ఒక యువకుడు నేర్పుగా ఆమెనుతప్పించి లోపలికి వచ్చి, కత్తి చూపించి, తాను ఖైదీనని, అరచిన చంపివేస్తాననీబెదిరించగా
ఆమె భయపడక నవ్వుతూ వంటయింటిలోకి వెళ్ళి, అతనిని అక్కడకూర్చుండమని, కూరతరుగుతూ, కంటనీరు పెట్టుకున్నది. తానేమి చేయకనేఆమె దుఃఖించుట జూచి ఆశ్చర్యపడి, అందుకు కారణ మడుగగా, ఆమె ఒకకథనల్లి ఈ విధంగా చెప్పింది.
2. పూర్వము మా అన్నఒకడు కొందరితో గొడవపడి జైలుకువెళ్ళాడు.జైలుజీవితం నచ్చక పారిపోయివచ్చాడు. ఒక తప్పుకు మరొకతప్పు తోడై,రక్షకభటులు తరుమగా పరుగులు తీస్తూ ప్రమాదవశాత్తు రైలుక్రందపడిచనిపోయాడు. అది గుర్తువచ్చి యేడుస్తున్నానని చెప్తుంది.
3. కథను ముగించి ఆ అమ్మాయి, దొంగను, సందేహించకుండా భోజనంచేయమని, కంచములో అన్నం వడ్డించి, మాటలు కలిపింది.
4.చూడబోతే మంచివాడివిగా కన్పిస్తున్నావు. యేమి నేరం చేసి జైలుకువెళ్ళావు అని అడుగగా, చదువురాకపోవడము, పనులు చేయడం రాకపోవడమువలన
5. ఆకలిబాధకు తాళలేక ప్రొద్దున నడకకు వెళ్ళే మహిళల మెడలోగొలుసులను కత్తిచూపి బెదిరించి లాక్కోవడం వల్ల జైలులో పడ్డానని చెబుతాడు.
6. దానికామె బాధపడుతూ, మరిప్పుడెందుకు పారిపోయి వచ్చావని యడుగగా,జైలులో కష్టమైన పనులు చేయలేక పోవడము, భోజనము సహించక పోవడమనిచెబుతాడు.
7. అప్పుడామె, ఒకసారి తప్పుచేసినందుకు శిక్షపడింది, మళ్ళీయిప్పుడుమరొకతప్పుజేసి ముప్పును గొనితెచ్చుకొన్నావు. ముర్ఖుడా! జైలులో మీకుతొందరగా నేర్చుకోగలిగే తేలికైన పనులను నేర్పిస్తారుకదా, వాటిని శ్రద్ధగా నేర్పుతో నేర్చుకుని ఉంటే నీవు జైలునుండి బయటకు వచ్చాక, సంఘములో గౌరవప్రదముగా బతకడానికి పనికి వచ్చేదికదా! తెలివితక్కువగా ప్రవర్తించి సమస్యలో చిక్కుకున్నావని చెప్పింది
8. తనతప్పు తెలుసుకొన్న దొంగ తెల్లబోయి, భయపడి నాకేదిదారి యనియేడ్వగా, తల్లిలాగ ధైర్యం చెప్పి దారి చూపించింది. తనంతట తానుగాజైలుకువెళ్ళి లొంగిపొమ్మని, శిక్ష యెక్కువైనా స్వీకరించి, తగిన శిక్షణపొంది, శిక్షాకాలము పూర్తిఅయ్యాక సంఘములోగౌరవంగా బ్రతకమని సూచించింది. దొంగ సంతోషించి, ఆమెను చెల్లిలాదీవించి, కృతజ్ఞతలు తెలిపి వేగంగా వెళ్ళిపోతాడు.
9. కొంత సమయమయ్యాక, జైలు అధికారియైన యామెతండ్రి రాగా,ఆలస్యమైనదేమని కూతురు అడగుతుంది. దానికాతడు, దొంగ ఒకడుజైలునుండి తప్పించుకోవడం వల్ల, వెతకడానికి రక్షకభటులనునియమించేందుకు ఆలస్యమయినదని తెలుపుతాడు.
10. అప్పుడు చురుకైన జైలు అధికారి కూతురు, దొంగ మీకు తొందరగానే,తనంతతానే దొరుకుతాడులెండి, అతనిప్పుడు మారిపోయాడు, యింక తప్పులుచేయడు అని విషయమంతాచెప్పి యిలా అంటుంది.- దోషులను కఠినంగా శిక్షించడము కన్న, ప్రేమతో, మంచిమాటలతోమంచివారిగా మార్చవచ్చను.
*****