top of page

కథా​ మధురాలు

నరాసురులు !

 

జయంతి ప్రకాశ శర్మ

Jayathi Prakash Sarma.PNG


"ఆపద్భాంధవా! అనాధ రక్షకా!! పాహిమాం! పాహిమాం!!" అంటూ తన  చుట్టూ చేరిన ముక్కోటి దేవతలను చూసి ఆశ్చర్యపోయాడు శ్రీమహావిష్ణువు.

 

పాలసముద్రంలో శేషతల్పం మీద పవళిస్తూ, లక్ష్మీదేవితో  లోకాభిరామాయణ సంభాషణ సాగిస్తున్న సమయంలో, ఆకస్మికంగా ఇంతమంది దేవతలు ఒక్కసారిగా రావడం శ్రీమహావిష్ణువుకి ఒకింత ఆశ్చర్యం కలిగించింది.


"ఏమి నా భాగ్యము! ముక్కోటి దేవతల దర్శన భాగ్యము ఒకేసారి కలిగినది!" అంటూ మందహాసముతో వారిని పలకరించాడు శ్రీమహావిష్ణువు.


"స్వామీ! అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ! మీరే మమ్మల్ని కాపాడాలి!" అంటూ దేవతలందరూ ఏకకంఠంతో చేతులు జోడించారు.


"శరణమా? ఏమైనది?" శ్రీమహావిష్ణువు మందహాసంతో వారి వైపు చూస్తూ అన్నాడు.


ఆ దేవతా సందోహంలో కలియుగ మహాపురుషుడు కూడా కనిపించడంతో ఆశ్చర్యపోయాడు శ్రీమహావిష్ణువు!


"ఏమి షిరిడీశైలవాసా? మీరు కూడా!" అంటూ చిరునవ్వు నవ్వేడు.


"ఈ దేవతలకే తప్పలేదు, నేనెంత ప్రభూ!" బాబా చిరునవ్వుతోనే అన్నారు.


"ఇంతకీ ఎల్లరూ సుఖులే కదా!" అంటూ మహావిష్ణువు అందరి వైపు చూసాడు.


"మా ప్రాణాలకే ముప్పు వాటిల్లినది, ఇక సుఖము ఎక్కడ మహాప్రభు! ఈ విపత్కర పరిస్థితుల నుండి కాపాడగలవారు మీరే కదా. ఆ విషయమే విన్నవించుకోడానికి వచ్చితిమి!"  వినాయకుడు వినయంగా అన్నాడు.


"అదేమి. లోకకళ్యాణం కోసం తపించే మీకే ఆపద వచ్చినదా?" కించిత్ ఆశ్చర్యపోతూ అడిగాడు శ్రీమహావిష్ణువు.
 
"అలనాడు భస్మాసురుడుకి ఓ వరం ఇచ్చి, పీకల వరకు పరిస్ధితిని తెచ్చుకుంటిరి. అయితే ఆ  రోజు, మా తండ్రిగారి ఒక్కరికే ఆపద సంభవించినది.  కాని, ఈ రోజు యావత్తూ మా దేవతలందరికి అలాంటి ప్రమాదమే ముంచుకొచ్చినది ప్రభు!" వినాయకుడు వినయంగా అన్నాడు.


"ఏమీ? ప్రమాదమా! భూలోకమున నేడు ఆధ్యాత్మిక పెరిగి, భూలోకవాసులు మీ నామస్మరణ చేస్తూ, వీధికో దేవాలయమును నిర్మించి మిమ్మల్నే నమ్ముకున్నారు కదా. అలాంటిది మీకు ప్రమాదమా? విచిత్రముగా నున్నది! వివరముగా విశదీకరించుము!"  ఆశ్చర్యపోతూ అన్నాడు శ్రీ మహావిష్ణువు.

"దేవాలయముల వరకునూ బాగుగానే యున్నది. ధూప నైవేద్యములు లేకుండనూ, తల దాచుకుని కాలక్షేపం చేయుచుంటిమి! మా భూములను ఆక్రమించుకుని, అన్యాక్రాంతం చేస్తున్నప్పటికీ ఊరుకొంటిమి!"


"ఇంకా సర్దుబాట్లా? ఏమవి?"

"అవును ప్రభూ! ఆ ప్రజానాయకులు వారిలో వారికి సర్దుబాట్లు, పొరపాట్లు, వలస బాటలు, గ్రహపాట్లు ఎన్ని ఉన్ననూ, వారిలో విపరీత ధోరణి ఈ మధ్య కాలంలో మెండుగా వచ్చి యున్నది. వారిలో వారు వైరములు పెంచుకుని, మా మీద పడుతున్నారు ప్రభు!"


"అంటే..?"


"ఏమున్నది ప్రభు! ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు,  ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, బురదలు జల్లుకుంటూ, తిరిగి మా మీద ప్రమాణాలు చేయుచున్నారు! మరి ఆ ప్రమాణాలు మా ముప్పుకు దారి తీయ్యవా?"


"అందులో ముప్పు ఏమున్నది? న్యాయస్థానము నందు భగవద్గీత మీద హస్తం వేసి ప్రమాణం చేయుట లేదా? అటులనే ఇప్పుడు మీ మీద ప్రమాణం చేయుటలో ఇబ్బంది ఏమి ఉన్నది?  మీకు గౌరవము ఇచ్చినట్డే కదా!"  చిద్విలాసంగా అన్నాడు శ్రీమహావిష్ణువు.

"నిజమే ప్రభు! న్యాయస్థానమునందు, ఆ గీత మీద ప్రమాణములు చేసి, అబద్దాలు చెప్పుచుంటిరి. ఆ ప్రభావంతో  జీవితసారమును, మనో ధైర్యమును ప్రభోదించే ఆ భగవద్గీత, నేడు భూలోకమున మరణములు సంభవించిన సమయమున మననము చేసుకునే గీతంగా గుర్తింపబడింది.  మహాప్రస్థాన వాహనములందు, ప్రార్థివ దేహ సమీపములలోనూ ఆ గీతాగానమును వినిపించుచున్నారు.  ఈ కాలమునందు ఎచట నుండైనా ఆ గానం వినిపించిన యెడల ఏదో మరణము సంభవించినదనే సూచన గోచరించుచున్నది. ఆ గీతమునకు న్యాయస్థానములనందు చోటు లేక, హరిశ్చంద్రుని దగ్గర తల దాచుకునే స్ధితికి చేరినది!" 

వినాయకుని మాటల్ని మధ్యలో త్రుంచి "తమరే మాట్లాడుతూ ఉన్నారు.‌ మరెవరూ మాట్లాడరా?" అంటూ శ్రీమహావిష్ణువు అందరి వైపు చూసారు.

"లేదు ప్రభూ. నాయకుడని ఆయన నామదేయంలోనే పొందుపరిచి యున్నది.  అందుకే మా తరపున సమస్యని విన్నవించుకునేందుకని మా నాయకునిగా ఆయన్నే ఎన్నుకున్నాం!" దేవతల్లోంచి ఓ కంఠం వినబడింది.


"ఓహో.. అలాగా!  భూలోకావాసులైన తరువాత మీలో కూడా బాగానే మార్పు వచ్చినది!" అంటూ, ముసిముసితో వినాయకుని వైపు చూస్తూ "అయితే- మీకొచ్చిన ముప్పు ఏమిటి నాయనా?" అడిగాడు  శ్రీమహావిష్ణువు.

"ప్రభూ, తరతరాలుగా ఒట్టు, సరస్వతి తోడు అంటూ వారికిష్టులైన వారి మీద ప్రమాణాలు చేసి, చెప్పే ప్రతీ మాట నిజమని, అలా కాని పక్షంలో ఆ ఇష్టులు మరణించురనే గట్టి నమ్మకం ప్రజలలో ఉన్నది!" 

"అవును. మంచి నమ్మకమే కదా!"

"మరదే కదా, ఈనాడు ప్రమాద గూళికలను మ్రోగించుచున్నది. అలనాటి భస్మాసుర హస్తం ఉదంతం తమకు తెలియనదా మహాప్రభు!" వినాయకుని మాటలకు అక్కడ అందరిలో నవ్వులు విరజిల్లాయి.

ఆ సంఘటనలు గుర్తుకు వచ్చి, శ్రీమహావిష్ణువు కూడా ఆ నవ్వులతో శృతి కలిపాడు.

"అదే మా భయం మహాశయా! మా బ్రతుకులను మమ్మల్ని బ్రతకనీయకుండా లోకంలోని ఈ ప్రజాసురులు మా మీద పడుతున్నారు!  ఈ రోజు దేశంలో ఉన్న ప్రజా నాయకులు, పోటాపోటీగా మా ప్రాంగణాలకి వచ్చి, మా మీద వారి హస్తాలను ఉంచి, ప్రమాణాలను చేయుచున్నారు. నేతిబీరకాయలో నెయ్యి ఎంత ఉన్నదో, ఆ ప్రమాణాలలో సత్యము కూడా అంతే ఉండును కదా. అది మీకు తెలియని విషయమా ప్రభు! ఈ ప్రమాణాలు మా ఉనికికే ప్రమాదం కాదా?  అందుకే తమ దగ్గరకి వచ్చితిమి. తమరే మరోసారి మోహినీ అవతారము ఎత్తి, ఈ భూలోక నరాసురుల హస్తముల నుండి మా దేవలోకులుని కాపాడండి ప్రభు! అపద్బాంధవా! అనాథ రక్షక!! శరణం శరణం!" అంటూ రెండు చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేసాడు వినాయకుడు.

ఒక్కసారి ఆలోచనల్లో పడిపోయాడు శ్రీమహావిష్ణువు.చాలా జటిలమైన సమస్య.  ఒక్కసారిగా శేషతల్పంపై లేచి కూర్చుని, లక్ష్మీదేవి వైపు చూసాడు. 
"యుగయుగాలుగా దర్మాన్ని కాపాడుతూ, చెడుని సంహరిస్తూ ప్రజలని కాపాడుతున్న మీకు, ఇదో సమస్యా పతిదేవా?" లక్ష్మీదేవి చిరునవ్వుతో అన్నది.

"నిజమే సతి! కాని నైతిక విలువలను పూర్తిగా విసర్జించి, రాజ్యాలు ఏలుతున్న ఈ ప్రజా ప్రతినిధులు ఏ రోజు ఎలా ఉంటారో, ఏ మతము మారుస్తారో,  ఏ పంచన చేరుతారో,  ఏమి మాటలాడుతారో ఆ బ్రహ్మ కూడా నుదుట మీద రాయలేకపోయాడు. అదే ఈ రోజు భస్మాసుర హస్తంగా మారినది.  వినాశకాలే విపరీతబుద్ది చందాన పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అయిననూ మనమూ మానవుల వలే ప్రవర్తించ కూడదు!  అయిననూ -" 

శ్రీమహావిష్ణువు మాటలను మధ్యలో కలగ చేసుకుంటూ, పక్కనే ఉన్న శంకరుడు "కిం కర్తవ్యము?" అంటూ అందోళనగా చూసాడు.మోహినీ భస్మాసుర ఉదంతం జ్ఞప్తికి తెచ్చుకుంటూ!

"భయము వలదు శంకరా! ఇలలో అలా ప్రమాణాలు చేయడం మానవులకున్న ఓ నమ్మకం!  ఆ నమ్మకాన్ని ఇన్నాళ్ళు వారే గౌరవించితిరి.  ఈ రోజు మానవ సమాజంలో నైతిక విలువలకు, నీతి నిజాయితీలకు వారు తిలోదకాలు ఎలా పలికారో, ఈ నమ్మకాలకు కూడా ఆ దారే చూపుతున్నారు. పెరుగుట విరుగుట కొరకే కదా! అంతేగాని, వారు చేసే ఆ తప్పుడు పనుల వలన మీకు జరిగే హాని ఏమియూ లేదు. ధర్మాన్ని రక్షించలేని పాలకులకు ధర్మమే బుద్ది చెపుతుంది!” అంటూ మహావిష్ణువు అందరి వైపు చూశాడు. 


ఎవరికి అర్ధం అయినట్టు కనబడలేదు. బిత్తర చూపులు చూస్తున్నారు.
 
“ఓహో। తమరెవరికి నా మాటలు అర్ధం అయినట్టు లేదు.  భూలోకమున  న్యూటన్ మహాశయుడు ఈ మాటని తనదైన రీతిలో 'ప్రతి చర్యకు సమానమైన ప్రతి చర్య వ్యతిరేక దిశ నుండి వచ్చును' అని శాస్త్రీయంగా ఎప్పుడో కనుగొనియున్నాడు. అంటే మనం మంచి చేస్తే, మనకి తిరిగి మంచే జరుగుతుంది. మనం చెడు చేస్తే, ఆ చెడే తిరిగి మనకి జరుగుతుంది. ఈరోజు భూలోకమున ఈ నరాసురులను శిక్షించడానికి  నేను తిరిగి మోహినీ భస్మాసుర వేషము వేయనక్కర్లేదు. పూర్వకాలములో కంటే నేడు భూలోకమున పాపభీతి ఎక్కువగానే ఉన్నది. వారి అసత్యప్రమాణాల వెనుక ఉండెడి పాపమే వారి పాలిట భస్మాసుర హస్తముగా పని చేయగలదు. దానినే న్యూటన్ మహాశయుడు ఆ విధంగా నిర్వచించినాడు! మీరు నిశ్చింతగా వుండండి!" అంటూ తిరిగి శేషతల్పం మీద తనువు వాల్చాడు శ్రీమహావిష్ణువు.

ఆ మాటల అర్ధం అయినట్టు తలలు ఆడిస్తూ, "అంతా విష్ణుమాయ" అని అనుకుని, జేజేలు పలుకుతూ ముక్కోటి దేవతలు వారి వారి గమ్యస్థానాల వైపు దారితీసిరి.

****
 

bottom of page