top of page
adannamaata.png

సంపుటి  5   సంచిక  3

Website Published &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా​ మధురాలు

మేడ్ పాజిబుల్ బై

 

తాడికొండ కె. శివకుమార శర్మ

Siva Kumar Tadikonda

 “ఆకుపచ్చ గడ్డి మార్గం!” నువ్వు మీ వీధి పేరుని తెలుగువాళ్లకి అర్థ మయ్యేలా ఆంగ్లం నించీ అనువాదం చేసి చెబుతావు మీ అపార్ట్‌మెంట్ చిరునామాని ఇస్తున్నప్పుడు. “ఆకుపచ్చ గడ్డికి మార్గం కూడా!” అంటారు మీ ఇంటికి వచ్చినవాళ్లు చుట్టూ చూసి నవ్వుతూ.

మెయిన్ రోడ్డు నించీ గ్రీన్ గ్రాస్ వే లోకి తిరగ్గానే రెండుపక్కలా పార్క్ చేసివున్న కార్లు తప్ప అక్కడ నరసంచారం కనిపించేది తక్కువేనని నీకెప్పుడో తెలుసు. అపార్ట్‌మెంట్ నుంచీ బయట పడి పార్క్ చేసి వున్న మీ కారు వద్దకు నడుస్తున్నప్పుడూ, తిరిగి వచ్చిన తరువాత కారు పార్క్ చేసి కిందకు అడుగు పెట్టకుండానే చుట్టూ కలయజూసినప్పుడూ అక్కడ ఇంటిని అద్దెకు తీసుకోవడం గూర్చి నీ భార్య ఫిర్యాదు చేస్తూనే వుంటుంది. ఒక ఏడాది అక్కడ గడిపిన తరువాత ఇంకొక ఏడాదికి లీజ్ పత్రం మీద మళ్లీ సంతకం పెట్టడానికి ఆమె అభ్యంతరం చూపనందువల్ల ఆ ఇంటికీ, ఆ వీధికీ తను అలవాటయిందనుకుని నువ్వు పొరబడతావు. ఆమెలో మొలకలేస్తున్న ‘రిసెంట్‌మెంట్’ పూత పూసి కాయలు కాయడందాకా రావడానికి అది నాంది పలుకుతుంది.

మూడంతస్తులూ, ఆరు ద్వారాలూ ఉండి, ఒక్కో ద్వారమూ ఆరు అపార్ట్‌మెంట్ల తలుపులకి దారి తీసేలా వున్న ఆ భవంతిలో ముఫ్ఫయ్యారు కుటుంబాలు కాపురం ఉండడంవల్ల, వాటిల్లో ప్రతి బెడ్రూము కిటికీ ఆ వీధివైపు ఉండడంవల్ల ఎవరో ఒకళ్లు ఎప్పుడూ వీధివైపు ఒక కన్నేసి వుంటారంటావు నువ్వు. నీ లాజిక్‌లో తప్పు తరువాత ఆమె ఎత్తి చూపితే గానీ నీకు అర్థం కాదు.

“ఎవరూ చూడకపోవడం మాట అటుంచి, పార్క్ చేసి వున్న నీ కారుని ఇంకో కారు గుద్దేసి వెళ్లినప్పుడు, ఆ శబ్ధం కూడా ఎవరికీ వినిపించలేదు! దాని మాటేమిటి?” అని నిలదీస్తుంది నీ భార్య.

“ఇన్స్యూరెన్స్ కంపెనీ రిపేర్‌కి డబ్బులిచ్చింది గదా!” అంటావు నువ్వు. డిడక్టిబుల్ కింద నీ చేతిలోంచి అయిదువందల  డాలర్లు వదిలెయ్ అన్న సంగతి నువ్వామెకు చెప్పవు. చెబితే, ‘ఎవడో గుద్దిపోయాట్ట, దానికి చేతిలోంచి అయిన ఖర్చుని పట్టించుకోట్ట! ఆ డబ్బు నేను ఖర్చుపెడితే మాత్రం గింజుకుంటావు!’ అని ఆమె అంటుందని నీకు తెలుసు.

“ఇల్లు కొనుక్కుని ఇక్కడినించీ వెడితే గానీ ప్రశాంతత దొరకదు!” అంటూనే ఉన్నదామె కొన్ని నెలలుగా.

“హెచ్-1 వీసా మీద ఉన్నంతవరకు వద్దు,” అంటూనే ఉన్నావు నువ్వు.

కొన్ని నెలల తరువాత –

***

మొదటి కారు ఆకుపచ్చ గడ్డి మార్గం లోకి తిరిగిన తరువాత దాని డ్రైవర్ కారుని తొంభై డిగ్రీలు తిప్పి తన పార్కింగ్ స్పాట్‌లో నిలపకుండా బ్రేక్ వేసి రోడ్డు మీదే ఆగివున్న కొన్ని కార్ల వెనుక ఒక పక్కగా ఆపుతాడు. దానికి కారణం దాదాపు రెండు మైళ్ల దూరం నించీ ఒక కారు తనని వెన్నంటి రావడమే కాక ఆ వీధిలోకి తిరగడం కూడా అతను గమనించడం. తన కారుని పక్కగా ఆపినప్పుడు, ఆ వెనక వచ్చిన కారు తనని దాటి వెళ్లేలా చోటు వదిలింది అందుకే. తరువాత వచ్చిన పోలీసులకే గాక చూసేవాళ్లకెవరికయినా గానీ ఆ రెండవ కారు సర్రున అక్కణ్ణించీ వెళ్లిపోయిందని రోడ్డుమీద అది వదిలిన టైర్ల గుర్తులవల్ల తెలుస్తుంది.

మొదటి కారు ఆగినప్పటి నించీ ఆ రెండవ కారు వెళ్లేదాకా మధ్యలో వున్న క్షణాల్లో జరిగిన సంఘటన ఆ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ లో నివసిస్తున్నవాళ్లకి ఎంతో కాలం గుర్తుండకపోవచ్చు గానీ, దాని ప్రభావం మాత్రం ముగ్గురిని – నిన్నూ, నీ భార్యనీ, హోసేనీ – వెంటాడుతుంది.

నువ్వక్కడ లేవు గనుక ఆ సంఘటన గూర్చి నీకు ఎలా తెలుస్తుందంటావా? హోసే వల్ల. అదే, కారు పార్క్ చేసి మీ బిల్డింగ్ ప్రవేశద్వారం గుండా లోపలికి అడుగుపెట్టి మెట్లు దిగిన తరువాత లాండింగ్ కి కుడి పక్క అపార్ట్‌మెంట్ మీదయితే, ఆ ఎడమ పక్కవైపున్న దానిలో ఉంటాడూ, మీరు వెకేషన్ కి వెళ్లినప్పుడు మీ ఇంటి తాళం చెవి ఇచ్చి చెట్లల్లో నీళ్లు పోయామని కూడా అడిగావూ, ఆ హోసే!

వెన్నాడిన ఆ కారు, తన వెనక ఆగడాన్ని రేర్‌వ్యూ మిర్రర్లో చూసిన తరువాత, కిందకు దిగాలా వద్దా అని హోసే ఒక్క క్షణం ఆలోచిస్తాడు గానీ, మెక్సికోలో పెరిగినప్పుడు రౌడీ గ్యాంగులు కలుగజేసిన భయమూ, వాళ్లతో తలపడడం నేర్పిన తెగింపూ కలబడి అతని తరువాతి చర్యకు దారితీస్తాయి.

భయమెందుకంటే, ఇల్లు చూపించడం, తరువాత ఆ వెనుకతను చీకట్లో వచ్చి ప్రతీకారం తీర్చుకునే అవకాశానికి దారి తీస్తుందని.

పాపం, దాదాపు తన అపార్ట్‌మెంటు ముందరే ఆగి ఉన్నా గానీ కారులోంచి కిందకు అడుగుపెట్టి నిలుచుంటే అది స్థానబలిమి వల్ల అని హోసే ఏ మాత్రం అనుకోడు. పైగా, సహాయానికి ఎవరయినా వస్తారని కూడా అతని ఆలోచనల్లో ఏమాత్రం లేదు. మెక్సికోలో అయితే రౌడీ గ్యాంగు ఒక ఇంట్లో జొరబడితే ఆ ఇంటి చుట్టుపక్కలవాళ్లు తలుపులు వేసుకుంటారు. ఈ సబర్బ్ లో పగటిపూట కూడా రోడ్ల మీద మనుషులే కనిపించరు!

లైసెన్స్ ప్లేట్ నంబర్ ముందతనికి కనబడకూడదన్న ఆలోచనవల్ల కాకపోయినా అతని వెనక బంపర్‌లని ముద్దు పెట్టుకునేటంత దగ్గరగా ఆపిన కారు డ్రైవర్ మాత్రం ఎక్కడయినా గానీ తన బలిమిని చూపడానికి ముందుంటాడు.

అమెరికాలో గన్ వాడకాల గూర్చీ, రోడ్ రేజ్‌ల గూర్చీ హోసే విని వుంటాడు గానీ పట్టపగలే కదా అన్న ఆలోచన అతనికి ధైర్యాన్నిస్తుంది.

అయితే, హోసే కారు పార్క్ చెయ్యడమూ, బిల్డింగులో ఏ ప్రవేశద్వారం ద్వారా లోపలకు వెడతాడో గమనించడమూ, తరువాత తలుపుతట్టి బెదిరించడమూ చెయ్యాలని ఆ వెనక కారు డ్రైవర్ అనుకోడు. అతను తరువాతి చర్య గూర్చి ఆలోచించకుండా హోసేని అనుసరించాడంతే.

కానీ, అతనలా ఆలోచించడం వల్లనే తన వెనక ఆగివున్నాడని పూర్వానుభవం వల్ల హోసే ఊహిస్తాడు. అందుకే కారుని అపార్ట్‌మెంట్ నంబర్ వేసివున్న తన రిజర్వ్‌డ్ స్పాట్‌లో పార్క్ చెయ్యనిది. వెనక వచ్చిన కారు తనని దాటి వెళ్లకపోవడం పరిస్థితిని హోసేకి స్పష్టం చేస్తుంది. అందుకే, కారులో కొన్ని అనంతమైన క్షణాలపాటు అసహనంగా కూర్చున్న తరువాత ఇంజన్‌ని ఆపకుండానే కారు దిగి, దానికి ఆనుకుని నిలబడతాడు.

 

ఆ వెనక డ్రైవర్‌కి హోసే జాతీయత స్పష్టమవుతుంది. పైగా, కిందకు దిగి, ‘ఏం పీక్కుంటావు?’ అన్నట్టు హోసే నిలబడడాన్ని అతను ఛాలెంజ్‌గా తీసుకుంటాడు. కారు తలుపు తీసి, దాన్ని విసురుగా మూసి, ఎర్ర క్యాప్‌ని చేత్తో సర్దుకుంటూ నిలబడతాడు. దాని మీద ట్రంప్ బ్రాండ్ MAGA అక్షరాలూ, ఆ క్యాప్ కింద అతని తెల్లదనమూ, భారీదనమూ హోసేకి స్పష్టంగా తెలియడానికి క్షణం కూడా పట్టదు. ఆరడుగుల పొడుగుకి అరడుగు ఇటుగా తను, అటుగా అతను. నూట నలభై పౌండ్లు దాటని తను, రెండొందలు దాటిన అతను.

తను డేవిడూ అతను గొలయత్! అయితే, ఏ దేవుడూ అడ్డం పడకపోతే ఎవరి దారిన వాళ్లు వెళ్లే పరిస్థితి ఏమాత్రం లేదని హోసేకి అర్థమవుతుంది. దానితో బాటే, వెనక్కు అడుగు వేసే అవకాశం దాటిపోయిందని కూడా. అయితే, అతని చేతిలో గన్ లేకపోవడం హోసేకి ధైర్యాన్నిస్తుంది.

అతను హోసే వైపు రెండడుగులు వేస్తాడు.

తానేమీ తీసిపోడన్నట్లు హోసే అతనివైపు రెండడుగులు కదులుతాడు.

అతను మరో రెండడుగులు వేసి, “యూ కట్ మీ ఆఫ్!” అంటాడు చాచిన చేత్తో హోసే ఛాతీమీద చూపుడు వేలితో పొడుస్తూ. కోపం మొహంలో కనిపిస్తుండగా.

కావాలని చెయ్యలేదని, తన ముందువాడు సడన్ బ్రేక్ వెయ్యడంతో అలా చెయ్యవలసి వచ్చిందనీ తరువాత హోసే నీకు చెబుతాడు గానీ ఆ క్షణంలో మాత్రం అవతలివాడు తన ఛాతీ మీద పొడవడం అతనికి కోపం కలిగించి, అతని చేత “సో?” అని ప్రశ్నింప జేస్తుంది.

జవాబుగా అతను చేత్తో హోసేని వెనక్కి నెడతాడు.

“డోంట్ డూ దట్!” అంటాడు హోసే తప్పిన బాలెన్స్‌ని తిరిగి తెచ్చుకోవడానికి వెనక్కి అడుగేస్తూ. కొద్దిగా భయంతో కూడిన కోపం అతనిలో చోటుచేసుకుంటుంది.

“ఏం చేస్తావ్?” అంటాడతను హోసేని మళ్లీ వెనక్కు తోస్తూ.

“డోంట్ టచ్ మీ!” అంటాడు హోసే ధైర్యం కోల్పోలేదని అతనికి సూచించడానికి ప్రయత్నిస్తూ.

అతను హోసేని మళ్లీ వెనక్కు తోస్తాడు. హోసేకి లోపల రాజుకున్న కోపం బయటి కొస్తుంది. ఒక చేత్తో అతని చేతిని పక్కకు తోసి గొర్రెపొట్టేలులాగా తలతో పొట్ట మీద కుమ్మి అతని చేత రెండడుగులు వెనక్కి వేయించ గలుగుతాడు. ఈ పరిణామానికి ప్రతిద్వంద్వి ముందు ఆశ్చర్యపోయినా అది అతని కోపాన్ని ఇనుమడింపజేస్తుంది. తెగింపు ఇచ్చిన బలంతో హోసే రెండడుగులు వెనక్కు వేసి మళ్లీ అలాగే ముందుకు దూకుతాడు. ఈసారి అతను తయారుగా ఉండి మోకాళ్లని కొద్దిగా వంచి మోచేత్తో హోసే తలమీద గుద్దుతాడు. దిమ్మ తిరిగినట్టయి హోసే కింద పడే లోగా అతను హోసే మొహం మీద మోకాలితో తన్ని తలని పైకి లేపి దాన్ని ఒక చంక కిందకు ఒడిసిపట్టి అతణ్ణి అపార్ట్‌మెంట్ బిల్డింగ్ వైపుకు ఈడ్చు కెడతాడు. రెండు చేతులతోనూ హోసేని పైకెత్తి, నేల బారున వున్న ఒక కిటికీ వైపు అతణ్ణి విసురుతాడు. విసిరేటప్పుడు “గో బ్యాక్ టు యువర్ కంట్రీ!” అని అతను అనడం హోసేకి జీవితాంతం గుర్తుంటుంది. కిటికీ అద్దం భళ్లున పగిలి హోసే ఆ అపార్ట్‌మెంట్ లోపల పడతాడు. అతను తన కారుని రివర్స్ చేసుకుని వేగంగా అక్కణ్ణించీ వెళ్లిపోతాడు.

తరువాత కొంతసేపటికి ఎవరో కుక్కని నడిపించుకుంటూ ఆ బిల్డింగ్ ముందరి ఫుట్‌పాత్ మీద వెడుతున్నప్పుడు పగిలిన కిటికీనీ, కొంచెం భయం కలగలిపిన కుతూహలంతో లోపలికి తొంగిచూసి అక్కడ గాజు ముక్కల మధ్యలో మనిషి పడివుండడాన్నీ గమనించి 911కి ఫోన్ చేస్తారు. ఆంబులెన్స్ ముందు వచ్చినా గానీ పోలీసులు వచ్చేదాకా ఏమీ చెయ్యకుండా నిలబడడానికి కారణం వాళ్లు ఆ అపార్ట్‌మెంట్ తలుపు కొడితే ఎవరూ పలకకపోవడం. పోలీసులు తాళం బద్దలుగొట్టి లోపలకు వస్తారు. హోసేకి ప్రథమ చికిత్స చేసి హాస్పిటల్‌కి పట్టుకెడతారు. ఈ వివరాలు నీకు తరువాత తెలుస్తాయి.

ఎలాగంటావా? ముందుగా కొంత నీ భార్యవల్ల.

నీకంటే ముందుగా ఆఫీస్ నించీ ఇంటికొచ్చిన నీ భార్య మీ అపార్ట్‌మెంట్ కిటికీ పగిలి వుండడాన్నీ, చుట్టూ ‘డు నాట్ ఎంటర్’ అని రాసివున్న పోలీసుల యెల్లో టేపునీ గమనించి, గగ్గోలుపెడుతూ నీకు ఫోన్ చేస్తుంది.

నీకు ఇంటికి చేరడానికి ఇంకొక గంట పడుతుం దని చెబుతావు దూరాన్నీ, రష్ అవర్ ట్రాఫిక్‌నీ గుర్తుచేస్తూ.

“అప్పటిదాకా నేనిక్కడ రోడ్డు మీద నిలబడాలా, అందరికీ కనపడే ప్రదర్శన వస్తువులాగా?” అని ఆవిడ అరుస్తుంది.

“పోనీ, కారులో కూర్చో!” అని చెబుతావు.

“గంటసేపు కారులో కూర్చోవాలట! నేను కూర్చోను!” అంటుందావిడ. “నీ ఖర్మ!” అని మనసులో అనుకుంటావు.

“ఇండియన్లు లేని చోట తెచ్చిపడేశావు! పక్కన ఇండియన్లుంటే వాళ్లింటి కెళ్లేదాన్ని!” అంటుందామె.

“పోనీ, సీతగారింటికి వెళ్లరాదూ?” అంటావు.

“నువ్వొచ్చేదాకా నేనిక్కడే కూర్చుంటాను. ఎక్కడికీ వెళ్లను!” అంటుందావిడ. “అరె! అయిదు మైళ్ల దూరంలో అపార్ట్‌మెంట్ కాంప్లెక్సులో ఎంతమంది ఇండియన్లు! అక్కడ కాకుండా నీకు ఇల్లు ఇక్కడే దొరకాలీ?” అని ఆమె ఆక్రోశాన్ని రంగరించి జతచేస్తుంది.

“నేను వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల అద్దెకు దొరికింది ఇదొక్కటే అని ఎన్నిసార్లు చెప్పాను?” అని విసుక్కుంటావు.

“ఆఁ. చెబుతూనే వుంటావు. అందరూ ఇళ్లు కొంటుంటే ఈయన అద్దెకు తీసుకుని, పైగా సాకొకటి!” నీ వివరణని తీసిపారేస్తూ అంటుందామె.

“గ్రీన్‌కార్డ్ రాకుండా ఇల్లు కొనడం రిస్కీ అని ఎన్నిసార్లు చెప్పాను?” అంటావు. ఎన్నోసారో నీకే గుర్తుండదు మరి! “ఇవన్నీ తుమ్మితే ఊడే ముక్కులాంటి ఉద్యోగాలు!” పునరుద్ఘాటిస్తావు.

“వాళ్లెవరికీ అనిపించని రిస్కు నీకే కనిపిస్తుంది! వాళ్లు నీలాగా ఐదేళ్ల పాటు ఉద్యోగం చేసి కూడా కాదు,” ఆమెకా పట్టింపు ఉండదు. ఎన్నిసార్లయినా అదే జవాబిస్తుంది. ఉద్యోగంలో చేరగానే పెళ్లి చేసుకోలేదనీ, డౌన్‌పేమెంటుకి కావలసిన నాలుగు డాలరాళ్లు వెనకేసుకున్నావనీ ఆమెకు తెలుసు మరి!

“’మీ ఆయనలాగా కాకుండా మా వారు తొందరపడి ఇల్లు కొన్నారు. అందుకని నాకు ఉద్యోగం తప్పట్లేదు. ఇటుపక్క ఈ పిల్లలూ!’ అని ఇల్లు కొనడానికి ఆగడమే మంచిదని ఆ సరోజగారు అన్నదని నువ్వే అన్నావు!” గుర్తుచేస్తావు.

“ఎప్పుడో ఒకసారి నోరు జారితే అన్నీ గుర్తుపెట్టుకుంటాడు. అవసరం లేనివన్నీ గుర్తుంటయ్. తొందరగా రా!” అని ఆమె తిరిగి విసుక్కుంటుంది.

“ఆ పనిలోనే వున్నా,” అంటావు మీ ఆఫీసు పై అంతస్తు నించీ లిఫ్టులో కిందకు దిగుతూ.

బిల్డింగ్ బేస్‌మెంట్‌లో పార్క్ చేసిన కారులో బయట రోడ్డుమీదకు రాగానే ఆమె నించీ ఫోన్ వస్తుంది “కాల్ కట్ చేశావేమిటి?” అంటూ.

ఎలివేటర్ లోనూ, తరువాత బేస్‌మెంట్‌లోనూ రిసెప్షన్ లేనందువల్ల అది జరిగిందనీ, అందులో నీ తప్పేమీ లేదనీ చెబుతావు.

“తప్పంతా నాదే!” అంటుందామె.

అనవసరంగా తప్పు – ఫాల్ట్ – అన్న పదాన్ని వాడినందుకు స్టీరింగ్ వీల్‌ని వదిలేసి రెండు చేతులతోనూ చెంప లేసుకుంటావు.

“ఓకె, ఫోన్ పెట్టెయ్యవచ్చా?” అనడుగుతావు. “కారులో బ్లూ టూత్ ఉన్నదిగా, మాట్లాడుతూనే వుండు!” అంటుందామె.

“ఏం మాట్లాడమంటావు?’ అనడుగుతావు.

“నేను భయపడినంతా జరిగింది,” అంటుందామె.

“ఇంట్లోకి దొంగతనం చెయ్యడంకోసం ఎవరూ కిటికీ అద్దం పగలగొట్టి లోపలి రాలేదు కదా?” అని రేషనల్ మైండ్ నీచేత పలికిస్తుంది.

“అలా పగలగొట్టి దూరినా ఎవరికీ తెలియదని కదా నేను మొత్తుకున్నది?” అని ఆమె గుర్తుచేస్తుంది. “కనీసం ఒక అంతస్తు పైన వున్నా బావుండేది!” అని ఆమె వాపోతుంది కూడా.

“ఆ పై అంతస్తులో ఉన్నవాళ్లకి మన కున్నంత ఎత్తయిన సీలింగ్ లేదు. మనది విశాలమైన పేటియో. వాళ్లది సన్న బాల్కనీ. మనకి లివింగ్‌రూమ్‌లో దాదాపు పధ్నాలుగు అడుగుల ఎత్తు, పధ్ధెనిమిది అడుగుల పొడుగూ, అదే ఎత్తు డైనింగ్ రూమ్ ఇంకో పన్నెండు అడుగుల వెడల్పూ కలిపి ఉన్న గాజుగోడ వెనక నున్న చెట్టుచేమలని ప్రస్ఫుటంగా చూపిస్తుంది. పైవాళ్లకి కూడా గాజుగోడ ఉన్నా, కనిపించే భాగంలో మూడడుగులని పిట్టగోడ తినేస్తుంది. లేళ్లూ, కుందేళ్లూ వెనక గాజు గోడదాకా రావడం చూసి మనింటి కొచ్చినవాళ్లంతా అడవిని చూడడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు మీకు, అదే మీ యింటి వెనక్కొచ్చింది అనలేదూ?” అని గుర్తుచేస్తావు.

“అంటారు. వాళ్లకేం? వాళ్లు కాదు గదా ఇక్కడ అనుభవించాల్సింది?” నీకు ఆమె విసురు తగులుతుంది. “ఏమిటనుభవించేది?” అని నువ్వు అనవు. అనకపోయినా జవాబొస్తుందని నీకు తెలుసు.

“ఆ అద్దాన్ని పగలగొట్టి లోపలకి ఎవరు వచ్చినా బయటివాళ్లకి తెలుస్తుందా? పైగా ఇంటి ముందు ఇంకా వెలుతురు ఉండగానే వెనక పూర్తి చీకటి. చెట్ల మధ్యలో కాలిబాట ఉన్నా అడవిలాగా ఉండడంవల్ల వీధి దీపాలే ఉండవు. ఆ కాలిబాట మన ఇంటి వెనక మహా అయితే ఇరవై గజాల దూరంలో ఉంటుంది. బ్లైండ్స్ వెయ్యకుండా ఇంట్లో లైట్లు వేస్తే ఆ అక్కడ నడిచేవాళ్లకి ఇంట్లో ఏం సామాన్లున్నదీ, మనం ఏం చేస్తున్నదీ కనిపిస్తూంటుంది. ఇప్పుడు కూడా ఆ అద్దం పగిలిన శబ్దానికి ఎవరూ బయటికి రాలేదు!” హోసే అపార్ట్‌మెంటులో ఎలా పడ్డాడో చూసినవాళ్లు లేరని ఆమెకు పోలీసులు తెలియజేస్తారు గనుక ఆమె మంటలో ఉంటుంది. “అసలు బెడ్రూం కిటికీ నేలబారున ఉండడ మేమిటీ? ఏనాడన్నా కిటికీ కర్టెన్ తీసి బయట వెలుతురుని చూడగలిగామా? బయటివాళ్లకి కనిపిస్తుందేమోనని రాత్రిపూట కూడా కావలసినప్పుడు తప్ప ఎక్కువసేపు లోపల లైటు వేసుకోలేని పరిస్థితికూడా!” అంటుంది.

వీధిలోంచి బిల్డింగ్ లోకి అడుగు పెట్టిన తరువాత మీ అపార్ట్‌మెంట్ తలుపుని చేరడానికి ఏడు మెట్లు కిందకు దిగాలి. లోపలికి ప్రవేశించిన తరువాత ఆ లాండింగ్ ప్రదేశం నించీ బెడ్రూం లెవెల్‌కి చేరడానికి అక్కణ్ణించీ మూడు మెట్లు పైకెక్కాలి. అయినా గానీ, బెడ్రూం నేల కిటికీ బయటి నేలకి మూడడుగుల కిందే ఉంటుంది. అందుకే ఆ కిటికీ బయటనించీ చూస్తే  నేలబారున ఉన్నట్లు కనబడడం. అపార్ట్‌మెంట్ లోకి అడుగిడిన తరువాత ఆ లాండింగ్ ప్రదేశం నించీ లివింగ్ రూమ్, కిచెన్ ఉన్న లెవెల్‌ని చేరుకోవడానికి నాలుగు మెట్లు కిందకు దిగాలి. అందువల్లే వెనక పేటియో గ్లాస్ డోర్ స్లైడ్ చేసిన తరువాత బయట నేల బారున అడుగుపడే వీలవుతుంది. అదే, లివింగ్ రూమ్ లోనూ, కిచెన్ లోనూ అంత ఎత్తయిన వాల్టెడ్ సీలింగ్ ఉండడానికి కారణం.

ఎత్తుపల్లాలున్న స్థలంలో వాటిని ఉపయోగించుకుంటూ ఆ బిల్డింగ్ కట్టిన తీరు నీకు బాగా నచ్చుతుంది. ఈ విషయాలన్నీ నువ్వు ఆమెతోనూ, మీ ఇంటికి వచ్చినవాళ్లతోనూ పంచుకున్నావు. ఇదంతా నీకు గుర్తొస్తుంటే -

నువ్వు అంతకు ముందు అన్న మాటలు ఆమెకు గుర్తొస్తాయ్. “ఇన్ని అపార్ట్‌మెంట్లున్నయ్ గదా, ఎవరో ఒకళ్లు రోడ్డు మీద ఏం జరుగుతోందో చూస్తూనే ఉంటారు అని కదా అన్నావ్? అన్నింటిలోనూ బెడ్రూములు బాబూ వీధి వైపు ఫేస్ చేసి వుండేవి! పగలు ఎవరూ బయటకు చూస్తూ బెడ్రూముల్లో కూర్చోరు. లివింగ్ రూముల్లో కూర్చుని టీవీలు చూసుకుంటూ ఉంటారు!” అని ఆగి ఊపిరి తీసుకుని, “ఇంక ఒక్క క్షణం కూడా నేనీ అపార్ట్‌మెంటులో ఉండను!” తన నిర్ణయాన్ని ఆమె తెలియజేస్తుంది.

“ఇవాళ ఉండలేములే, ఆ కిటికీ రిపేరయ్యేదాకా వేరేచోట ఉండక తప్పదు!” అంటావు నువ్వు ‘రెండు కిటికీల అవతల అయితే హోసే తన అపార్ట్‌మెంట్లో పడేవాడు, నాకీ తిప్పలుండేవి కాదు!’ అని లోపలే నిట్టూరుస్తూ.

“రిపేరయిన తరువాత కూడా ఇక్కడ ఉండేది లేదు! ఈ ఇంట్లోకి అడుగుపెట్టేది లోపల సామాన్లని తెచ్చుకోవడానికే!” ఆమె తీర్మానిస్తుంది.

“ఇంకా ఆర్నెల్ల లీజ్ ఉన్నది. ఈ క్షణాన ఇల్లు ఖాళీ చేస్తానంటే ఆ ఆర్నెల్ల అద్దెనీ కక్కి మరీ కదలమంటారు!” అంటావు నువ్వు ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ.

“మన మేమన్నా అరికాల్లో దురద పుట్టి వెడతామంటున్నామా? ఎందుకు వెడతామంటున్నామో ఆ మాత్రం నోరు విప్పి చెప్పలేవా?” ఆమె సవాల్ చేస్తుంది. నీ మౌనాన్ని జవాబుగా ఒప్పుకోని ఆమె, “నేను లీజుని పెనాల్టీ లేకుండా కాన్సిల్ చేయిస్తే నువ్వు ఆ ఆర్నెల్ల అద్దెనీ నాకిస్తావా?” ఛాలెంజ్ విసురుతుంది.

‘భవిష్యత్తులో వచ్చే జీతంలో నుంచీ కదా ఈ కట్! మళ్లీ కట్టే ఇంటి అద్దె కూడా అక్కణ్ణించే కదా రావలసినది? తేడా అల్లా ఆ అద్దె డబ్బు ఆమెకు చేరితే అది ఏ నగ రూపంలోనో ఆమె వంటిమీదకు చేరి, ఇంట్లోనే వుంటుంది!’ అని ఆలోచించి,  కొనే ఇంటికి డౌన్‌పేమెంటుకి జతచెయ్యడానికి ఒప్పుకుంటుందేమోనని ఆశపడి, “సరే, కానీ!” అంటావు. ఆ జవాబుకు తృప్తిపడిందని అపోహపడి, “సరే, ఫోన్ పెట్టేస్తున్నా” నంటావు.

“ఆగు! ఎవరితోనూ మాట్లాడకపోతే నాకు పిచ్చెక్కుతుంది,” అంటూ ఆమె నిన్నాపుతుంది.

“నీ స్నేహితులున్నారు గదా, వాళ్లకి కాల్ చెయ్యి,” సలహా యిస్తావు.

“మరే! ఆఫీసు నించీ వచ్చే సమయం అందరికీ. వాళ్లని పనులు మానుకుని నాతో మాట్లాడ మంటావా?” అని ఆమె రిటార్ట్ చేస్తుంది.

“పోనీ ఇండియాకి ఫోన్ చేసి మాట్లాడు!” అంటావు.

“ఇప్పుడక్కడ టైమెంతో తెలుసా? తెల్లవారుజామున మూడు గంటలు. వాళ్లని నిద్ర లేపల్లా భయపెట్టమంటావా?” అర్థ రహితంగా మాట్లాడావని ఆమె కోపగించుకుంటుంది.

ఇంక మినిట్ బై మినిట్ రిపోర్టింగ్ ఆపేస్తాలే. ముందు జరగబోతున్నదిదీ:

“గ్రీన్‌కార్డ్ వచ్చిన తరువాత కానీ ఇల్లు కొననన్నావు గదా?” అని ఫోన్లో ఇండియా నించీ అన్న మీ అమ్మగారికి, “నువ్వే అంటావు గదా, రాసిపెట్టినట్టు జరుగుతుందని!” అని నువ్వు జవాబిచ్చే రోజు కొద్ది నెలలలో వస్తుంది.

హోసే హాస్పిటల్ నించీ తిరిగి వచ్చి, కోలుకుని నడవడం మొదలుపెట్టిన తరువాత, ఇల్లు కొనడానికి పట్టిన సమయంలో తప్పక మీరు ఆ అపార్ట్‌మెంటులోనే ఉంటున్నప్పుడు, ‘గో బ్యాక్ టు యువర్ కంట్రీ!’తో సహా ఆ సంఘటన వివరాలని చెప్పి, లైసెన్స్ ప్లేట్ నంబర్ చూడగలిగినా సాక్షులు ఎవరూ లేకపోవడంవల్ల ఫలిత మేమీ ఉండేది కాదనీ, తనేమీ ఇల్లీగల్ ఇమ్మిగ్రంట్ కాదనీ, అయివుంటే పోలీసులు హాస్పిటల్ తరువాతో లేదా ముందరేనో అటునించీ అటే దేశం బోర్డర్ దాటించేవాళ్లనీ, తన ప్రమేయం లేకుండా మీ అపార్ట్‌మెంటులో ప్రవేశించడంవల్లనయినా గానీ మీకు కలిగించిన అసౌకర్యానికి చింతిస్తున్నాననీ మీ ఇంటి తలుపు తట్టల్లా వచ్చి చెబుతాడు.

 ‘గ్రీన్ గ్రాస్ వే’ మీంచి ‘నీడిల్ పాయింట్ వే’ లోకి మీ చిరునామా మార్పు జరుగుతుంది. మీరు కొనే ఇల్లు ఆ  వీధిలోనేగా ఉండేది మరి! 

తెలుగువాళ్లకి మీ ఇంటి అడ్రస్ ఫోనులో చెప్పేటప్పుడు ‘సూది మొన మార్గం’ అని చెబుతావు. ఆ పదాలు అర్ధంకానివాళ్లకి ఎన్ ఈ ఈ డి ఎల్ ఈ అంటూ స్పెల్లింగుతో చెబుతావు.

ఆకుపచ్చ గడ్డి మార్గం మీది ఇంట్లో మీరున్నప్పుడు ‘మెత్తని పచ్చగడ్డి మీద నడిచిన అనుభవం ఏదీ?’ అని నువ్వెప్పుడూ ఆలోచించలేదు గానీ, ఈ ఇంట్లో ఉన్నన్నాళ్లూ మాత్రం సూది మొన మీద నడిచిన అనుభవం మాత్రం కావాలని మాత్రం కోరుకోవు.

కోరుకోకపోయినా గానీ –

పగిలిన కిటికీ చరిత్ర తెలిసిన మీ స్నేహితులలో ఒకరు గృహప్రవేశానికి వచ్చినప్పుడు తమాషా చేస్తూ నీ భార్యని, ‘వెనక స్లైడింగ్ గ్లాస్ డోర్‌కి ఇండియాలోలాగా ఇనప షట్టర్‌ని వేయిస్తున్నారా?’ అని అడిగితే ఆమె చూపుల సూదిమొనలు ఆ అడిగినవాళ్లకి గాక నీ మొహం మీదెందుకు గుచ్చుకుంటున్నాయో మాత్రం నీకు అర్థంకాదు.

“అది జరక్కపోయివుంటే ఆ గ్రీన్‌కార్డ్ ఎప్పుడొచ్చేదో, ఈయన ఇల్లెప్పుడు కొనేవాడో ఆ దేవుడికే తెలియాలి,” అంటుందామె ‘దాని’ గూర్చి తెలిసిన స్నేహితులతోనూ, చుట్టపక్కాలతోనూ.

“హోసేని గృహప్రవేశానికి పిలిచుంటే ‘మేడ్ పాజిబుల్ బై’ అంటూ అతన్ని పరిచయం చేసివుండేవాళ్లు కదా!” అంటాడు ఇందాకటి ఆ స్నేహితుడే.

తెల్లమొహం వేసి చూస్తావతన్ని.

*****

bottom of page