MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కథా మధురాలు
లక్షాధిపతులు
తమిళ మూలం: జయకాంతన్
అనువాదం: రంగన్ సుందరేశన్
జయకాంతన్ గారు 1966 లో రాసిన ఈ కథ "ఆనంద వికటన్" పత్రికలో ప్రచురించబడింది. అన్ని వర్గాల పాఠకులలో అనూహ్యరీతిలో చర్చాంశమయిన ఈ కథని జయకాంతన్ గారు 1977 లో వచ్చిన తన నవలలో చేర్చారు.
ఈ కథని మన అనువాదకులు - రంగన్ సుందరేశన్ గారు 2000 లో ఆంగ్లంలో అనువాదం చేసారు. ఈ కథల సంపుటి "TRIAL BY FIRE" పుస్తకాన్ని జయకాంతన్ గారే స్వయంగా జులై 2, 2000 న టంపా, ఫ్లోరిడాలో ఆవిష్కరించారు.
ఇవాళ, ఆరు గంటల వరకూ, అతనొక లక్షాధిపతి.
సరిగ్గా, ఆరుగంటలు కొట్టి పదిహేను నిమిషాలకి, మిస్టర్ అయ్యంగార్ - అతని వకీలు, ఆర్ధిక సలహదారి - నుదుటమీద పెద్ద నామంతో దర్శనమిచ్చాడు; ఇంటిలో కాలుపెట్టగానే అతని కళ్ళు కిందకి జారాయి.
ఆ సమయం ఆ ఇంటి యజమానుడు - యువకుడు - బాగా మత్తెక్కి ఉన్నాడు. గత రెండు రోజులుగా అతను తన గదిలో తలుపు మూసుకొని రోజంతా తాగుతున్నాడు. అప్పుడప్పుడు తనలో తనే మాటాడుకుంటూ, పెద్ద గొంతుకతో అర్ధంలేని పిచ్చిమాటలు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నాడు.
ఈ రెండుమూడు రోజుల్లోనూ అతను స్నానం చెయ్యడానికిగాని, భోజనానికిగాని, తన గదిని వదలి బయటకి రాలేదు. అతన్ని అడగడానికి కాని, చెప్పడానికి గాని బంధువులో, మిత్రులో ఆ ఇంటిలో లేరు.
ఇక అతనొక భర్తయో, తండ్రియో కాదు, పిల్లలెవరూ లేరు. అతను ఆ ఇంటికి యజమాని, అంతే. ఇంటిలో ఉండేది అతని నౌకర్లు మాత్రమే. అందువలన ఒక భార్యలాగ అతను ఎది చెప్పితే అది చెయ్యడానికి వాళ్ళు సిద్ధంగావున్నారు.
అప్పుడప్పుడు ఆ ఇంటిలోని ముసలి సేవకుడు చిన్నదొర గది బయట నిలబడి, తడుముకుంటూ “తమ్ముడూ . . . తమ్ముడూ . . . ” అని పిలిచాడు; జవాబేమీ రాకపోవడంతో తన యజమానుడి చిరాకు, ఆగ్రహం గ్రహించి చివాలున పాదం వెనక్కి తీసాడు.
యువకుని మిత్రులు, ఎప్పుడూ అతనిచుట్టూ తిరిగే గుంపు, ఇప్పుడు రావడం మానేసారు.
ఇంట్లోవున్న నౌకరులు రోజంతా తమ యజమానుని గురించి ఏమోమో కబుర్లు చెప్పుకుంటున్నారు.
ఇవాళ సాయంకాలం యువకుడు కొత్తబట్టలతో తన గదినుంచి బయటకి వచ్చి తన వకీలుని కలుసుకోవడానికి గేటుదగ్గరకి వచ్చాడు. అతన్ని చూస్తే జాలి వేస్తోంది. ఆసుపత్రినుంచి వచ్చిన రోగిలాగ కనిపించాడు.
మిస్టర్ అయ్యంగార్ యువకుని గదిలో ప్రవేశించిన వెంటనే గది తలుపులు మూసుకున్నాయి.
కొంత సమయం ముందు ఆ ముసలి నౌకరు వచ్చిన అతిథికి కాఫీ ఇవ్వడానికి గదిలోపల వెళ్ళినప్పుడు ఒక మేజామీద చెదిరిన పత్రాలూ, కాగితాలూ చూసాడు. కూర్చోడానికి ఇష్టంలేక యజమానుడు గదిలో ఈ చివరనుండి ఆ చివరకు నడుస్తున్నాడు.
ఆఖరికి వకీలు వచ్చిన పని ముగించుకొని వెళ్తున్నప్పుడు ఒక పాతకాలపు మిత్రుడని విడిచిపోతున్నట్లు భావించాడు. యువకుని భుజాన్ని తట్టుతూ అతను మాట్లాడాడు. కళ్ళద్దాలు తీసేసి, పొంగివస్తున్న దుఃఖంతో యువకుడ్ని ఒదార్చాడు:
“ఇదేమో ధనవంతుల జీవితంలో ఒక సర్వసాధారణమైన సంఘటన; నా ఉద్యోగంలో ఇది నాకేం కొత్త కాదు. కాని మీ నాన్నగారి యోగ్యత, నిష్కళంకమైన అతని హృదయం తలుచుకుంటే ఇటువంటి దుర్ఘటన అతని కుటుంబంలో ఎవ్వరూ, ముఖ్యంగా అతని పిల్లలు, అనుభవించకూడదు. ఇదంతా ఆ భగవంతుని లీల. నువ్వు ధైర్యంగా ఉండు.”
ఆ మాటలు యువకుని మతిలో, జ్ఞానంలో ప్రవేశించడానికి కొంత సమయం పట్టింది. ఏదో భ్రమలో కోల్పోయినట్టు అతని దృష్టి అంతా లోకప్పులో ఎక్కడోవుంది. వకీలు శెలవు తీసుకొని వెళ్ళిపోయిన తరువాతకూడా చాలాసేపు యువకుడు విగ్రహంలాగ ఇంటి గేటు పక్కనే నిలబడిపోయాడు.
తిరిగి ఇంట్లోకి ప్రవేశించినప్పుడే అతను తన నౌకరులను చూసాడు. అంతవరకూ వాళ్ళందరూ ఇంటి వెనుగ భాగంలో ఏదో స్తంభమో లేక తలుపు దగ్గర దాక్కొని చాటుగా తమ యజమానుడు చేష్టలు చూస్తున్నారు; ఇప్పుడు అతను ఉన్నపాటున తమ్మల్ని చూడగానే కొందమంది అతని దృష్టినుంచి తప్పించుకోవాలని గభాలున దూకి తమ తమ చోట్లకి పరుగెత్తారు; మరికొందరు ఏమీ తెలియనట్టు తమ తమ పనుల్లో మునిగియున్నట్లు నటించారు. ఇది చూసి ఆ చిన్నదొరకి విపరీతమైన కోపం వచ్చింది.
అతను వాళ్ళని నీచమైన బాషలో, పచ్చి బూతులతో తిట్టాడు. చివరికి ఇలా ముగించాడు: “మీరందరూ మురికిపట్టిన కుక్కలు! ఇంకాబతుకుతారేం, చచ్చిపోండి! తక్కినవారి డబ్బుతో బతకడమే మీ పని, పోండి, నేను పోతే మీకు ఇంకొకడు దొరుకుతాడు!” చివరికి ఆ ముసలి నౌకరును గుర్తుచేసుకొని “ఓ ముసలాడా! నేను చెప్పేది నీకు కూడాను!” అని అరిచాడు.
అలా పచ్చిబూతులూ, కేకలూ పెట్టుకుంటూ అతను మళ్ళీ తన గదిలోకి ప్రవేశించి తలుపు మూసుకున్నాడు. గదిలో ప్రవేశించగానే అతనికి గోడమీద వేలాడుతున్న తన తండ్రి ఛాయాచిత్రం కనిపించింది; వెంటనే యువకుడు సిగ్గుతో తలవంచుకున్నాడు. ఒక మంచి కుటుంబంలో పుట్టిపెరిగిన తనకి ఇటువంటి చెడ్డ ప్రవర్తన ఏమాత్రం కూడదని కుంగిపోయాడు.
ఇక తను ఏంచెయ్యీలి? అతనికి దారేం తోచలేదు. ప్రస్తుతం తన అవస్థ చూస్తే, తన దగ్గర డబ్బేమీ లేదని తెలిసిన తరువాత, అతనికి తనమీదే జాలి కలిగింది; తన నౌకరులకంటే తన గతి విషాదకరమైనదని అతనికి బాగా బోధపడింది. ఏమైనా పనిచేసి సంపాదించగలడా? అదేం వీలుకాదు. అతనికి డబ్బు ఖర్చుపెట్టడమే తెలుసు; అప్పుడుకూడా ఇంకొకరు అతని అదుపులేని ఖర్చులకి కాపలా కాయాలి.
ఒకానొకప్పుడు అతనికి పిత్రార్జితమైన ఆస్తి లభించింది. అతను తాగుడు, రంకుతనంలాంటి దురలవాటులతో దుర్వినియోగం చేసిన తరువాతకూడా వంశపారంపర్యంగా తన కుటుంబంతోనూ, నౌకరులతోనూ, జీవించడానికి కావలసిన ధనం అతని దగ్గర ఉండేది; అతను అదంతా పోగొట్టుకున్నాడు. అందుకు ఒకటే కారణం, అతని బలహీనత: పేరాశ!
అతనికి డబ్బంటే అత్యాశ; అందుకు కారణముంది.
పది సంవత్సరాలముందు అతని భార్య అతన్ని తిరస్కరించింది. తన భర్త చేస్తున్న వివేకంలేని ఖర్చులు, అతని మొండితనం తాళలేక అతన్ని విడిచి వెళ్ళిపోయింది. ఆమె ఒక మంచి, చదువుకున్న అమ్మాయి. భర్త ఇల్లు వదలిపెట్టి వెళ్ళినప్పుడు ఆమె ఆడిపోసిన మాటలు ఇప్పుడు ఆ భర్త హృదయాన్ని పొడిచాయి:
“ఏం మనిషివయ్యా నువ్వు? అన్యుల సొమ్ముతో కులుకుతున్నావ్! నీ ధనం పెరగడం లేదు; ఇంకా చెప్పాలంటే అదికూడా, నీకు తెలియకుండా, కరిగిపోతోంది! చూడు, కొన్నిరోజుల్లో నువ్వు అన్నీ పోగొట్టుకొని బికారిగా ఊరులో తిరుగుతావ్!”
ఆమె అంత నిష్టూరంగా అతన్ని నిందించడానికి కారణం ఆమె ఎంత ప్రయత్నం చేసినా ఆ భర్తలో మార్పు రాకపోవడమే; అన్ని ప్రయత్నాలు చేసిన తరువాతనే ఆమె అతన్ని విడిచి వెళ్ళిపోయింది. తానొక భర్త అనే అహంకారంతో అతను ఆమె మొరలను అలాగే తోసిపారేసాడు.
“నీకేం తెలుసు? చూడు, నేనెలాగ ధనం వృద్ధిచేస్తానో?” అని అతను గప్పాలుగట్టాడు. అనుమానస్పదమైన బేరాలూ, పెట్టుబడులూ చేసి చివరకి నష్టబోయాడు.
ఇప్పుడు అతను తనలో గొణుక్కున్నాడు: ‘అది నిజంగానే ఒక ధర్మపత్ని! అది చెప్పినదంతా ఎంత నిజం! ఊరిలో తిరగడమా? అది మాత్రం జరగదు!”
హలులో ఒక నౌకరు తన మిత్రులకి చెప్తున్నాడు: “మన చిన్నదొరగారు దివాలా తీసుకున్నారు!”
అది విని ఆ ముసలి నౌకరు తలవంచుకున్నాడు.
**
కొన్ని గంటల తరువాత, అర్ధ రాత్రిలో - ఇంకా తెల్లవారలేదు - యువకుడు మనసులో ఏదో నిర్ణయం చేసుకొని తన గదిలోనుంచి బయటికి నడిచాడు. ఇంట్లోనున్న నలుగురు నౌకరులు హాలులోనూ, వసారాలోనూ నిద్రపోతున్నారు.
యువకుడు ఇంకా మైకంలోనేవున్నాడు. చీకట్లో తడుముకుంటూ ద్వారం దగ్గరకి వచ్చేసరికి అతని కాలు జారింది. అప్పుడు ఆ ముసలి నౌకరు పరుగెత్తుకొనివచ్చి యజమానుడు చెయి పట్టుకొని “తమ్ముడూ, ఎక్కడకి వెళ్తున్నావ్?” అని అభిమానంతో అడిగాడు.
“నువ్వింకా నిద్ర పోలా?” అని యువకుడు అతన్ని ఎగతాళి చేసాడు. “ఈ ముసలితనంలో నీకు చావంటే భయంగా ఉందా? మరెందుకీ జాగరం?” అని అర్ధంలేని నవ్వుతో ఇగిలించాడు; అతని గర్జన ఆ మౌనరాత్రిని చెదరగొట్టింది.
అలా నవ్వుతూ. యువకుడు కారు గరాజు ఇనుప తలుపులు తెరిచాడు; పెద్ద ధ్వనితో అవి తెరుచుకున్నాయి. అతను కారు డ్రైవరు సీటులో దూకి, ఇంజను స్టార్ట్ చేసి, కారుని రివర్సులో నడిపి, బయట రోడ్డు మధ్య ఆపాడు.
దీనమైన ఆ యువకుడు కారులో ప్రయాణం చెయ్యడంచూసి ముసలి నౌకరు నివ్వెరపోయాడు; కలవరపడుతూ కారువైపు పరుగెడుతూ, చిన్నదొరతో బతిమాలాడు: “ఇప్పుడు వద్దు బాబూ! కావాలంటే పగటివేళ వెళ్ళండి, బాబూ!”
“పగటివేళా?” యువకుడు నిట్టూర్పుతో జవాబు చెప్పాడు; అతను రాత్రీ, పగలు అనే భేదం మరిచిపోయి చాలాకాలమైంది. నవ్వుతూనే, కారు కిటికీనుంచి ఆ పెద్ద గృహాన్ని, తను పుట్టి పెరిగి, తల్లిదండ్రులతో నివసించిన ఆ ఇంటిని చూసాడు. రెప్పవాల్చకుండా కొన్నినిమిషాలు అతని చూపు ఆ మేడింటి మీద పడింది. ఇదే తను దాన్ని ఆఖరుసారిగా చూడడం అని గుర్తుచేసుకొని ఇంకొకసారి బాగా చూసుకున్నాడు. తరువాత కన్నులు మూసుకోని ముసలి నౌకరికి “ఇక వాళ్లు వచ్చి మిమ్మల్ని వెళ్ళగొట్టడానికి ముందే మీరందరూ ఇల్లు ఖాళీ చేసేయండి!” అని అంటూనే తన షర్టు పాకెట్ నుంచి పర్సు బయటకి తీసాడు.
పర్సులోవున్న డబ్బు తనకెక్కువే అని యువనికి అనిపించింది; అసలు డబ్బే తనకి అనావశ్యమని అతను గుర్తుచేసుకున్నాడు.
“ఇదిగో, ఇది తీసుకో . . . ఇందులో ఏమున్నా నువ్వూ, అందరూ పంచుకోండి!” అని ఆ పర్సుని అతనిమీద విసిరాడు.
“తమ్ముడూ . . . ” అని ఆ ముసలివాడు ఏడుస్తూ, తన రెండు చేతులూ పైకెత్తి ఏదో చెప్పడానికి ముందే ఆ కారు ధూళి రేపుతూ స్మశానంలో అంత్యకర్మలో మన్ను పోస్తున్నట్లు త్వరగా వెళ్ళిపోయింది.
ఆ కారు రోడ్డుమీద దూసుకుపోవడం చూసి ఆ ముసలి నౌకరకి అర్ధమైనదంతా ఒకటే; ఆ కారు గురి అంతా చావులోనోవుంది. ఇక తను ఏడవక మరేం చేస్తాడు?
**
హెడ్ లైట్లు అంధకారాన్ని చీల్చుకుంటూ, దారీ, తెన్నూ, గమ్యం ఏవీ లక్ష్యం చెయ్యక తనకిష్టం వచ్చినట్టు ఆ కారు ప్రయాణం చేస్తోంది.
యువకుడు కారుని త్వరగా నడిపాడు. అతని గమ్యం ఏదో దిక్కుమాలిన ప్రదేశం. అక్కడ శిధిలావస్థలో తన కారుని, తన శవాన్ని ఎవరూ కనుక్కోలేరు. ఇప్పుడు అతని తాపత్రయమంతా తన బ్రతుకు గురించి కాదు; చావు గురించే.
గత సంవత్సరం ఈ కారుని తోలుతూ ఒక కొండలమయమైన రోడ్డులో, ఒక ఇరుకైన మలుపులో, తటాలున, హెచ్చరిక లేకుండా ఒక ఘోరమైన అపాయం నుంచి చలాకీగా చాలామందిని తను కాపాడిన సంఘటన అతనికి ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఆ నాడు, కొంత సమయం తరువాత, ఒక మెట్ట భూమిలో నిలబడి, యువకుడు కింద పల్లంలో, బండరాళ్ళనూ, ఎదిగిన వృక్షాలనూ చూసాడు; కారులోని ప్రయాణికులు, ఒక్కరు తప్పకుండా, భగవంతుని దయవల్ల చచ్చి బతికామని గ్రహంచి గడ్డకట్టిపోయారు. యువకుడు గురి తప్పి, క్షణాల్లో కారు దొర్లిపడి పల్లంలో పడివుంటే ఎటువంటి ఘోరానికి అందరూ బలియై వుంటారని తలచినమాత్రం కలవరపడ్డాడు. కాని ఇప్పుడు ఆ ఘోరాన్ని తను నిజంగా నెరవేర్చబోతున్నానని ఆనందిస్తున్నాడు. కారుని ఇంగా వేగంగా నడిపాడు. అతను ఇల్లు వదలిన కొన్ని గంటలలోనే ఆ కారు వందమైళ్ళకి పైగా ప్రయాణం చేసింది.
‘టైము ఎంత?’ అని యువకుడు తనలో తనే అడుక్కున్నాడు. ఇంటినుంచి బయలుదేరినప్పుడు అతను తన వాచీ మరిచిపోయాడు. కారులోని టైమరు పనిచెయ్యలేదు; దానికి రెండుమూడు రోజులుగా కీ ఇవ్వలేదు.
‘ఎంత టైమైతే మాత్రం ఏమిటి?’ అని గొణుక్కుంటూ యువకుడు కారుని ఇంకా వేగంగా నడిపాడు. శీతలమైన గాలులు బలంతో కారుని అన్ని దిశాల్లో బాదాయి; ఆ రాజబాటలోని పొడుగాటి చెట్లు అంతులేని వరుసగా కనిపించాయి.
కారుని అతను కుడిపక్క తిప్పగానే దిగంతంలో ఒక రేఖ కనిపించింది. ఆ రహదారిలో, దూరంలో, ఒక నల్లని మచ్చ; ఒక మనిషి తన రెండు చేతులూ పక్కవాటుగా చాచి ఆ వస్తున్న కారుని ఆపడానికి సిద్ధమైనట్లు కనిపించింది.
మనుషులకి ఎంత నమ్మకం! ఆ ఒంటరి మనిషికి ఈ కారు ఆపగలనని ఎంత పొగరు! ‘నేను ఇప్పుడు ఆత్మహత్యకి సిద్ధంగా ఉన్నాను; ఇంకొక చావుగురించి నాకేం కలత?’ అని యపకుడు గొణుక్కున్నాడు. ‘ఈ మనిషెవ్వరో నా కారుముందు పడి చావల్సిందే! దీనికి ఏం పేరు? హత్య? ఇంతవరకూ నేనెవరినీ హత్యచెయ్యలేదు. కాని ఇప్పుడు నా చావుకి అడ్డమొచ్చేవారు - ఎవరైనా సరే - నాతోపాటు నా గమ్యంకి రావడానికి నాకు అభ్యంతరం లేదు!’
కళ్ళు బాగా తెరిచి చూడగా ఆ రాజబాటలో తను చూస్తున్న ఆశావాది ఒక ముసలమ్మ అని అతనికి తెలిసింది. ఆమె చావుకు తను కారణమౌతానా అనే బెంగ అతనికి లేదు. దుర్బలురాలైన ఒక స్త్రీ ఒంటరిగా ఆ రాజబాటలో ఒక చేతికఱ్ఱతో సైగచేస్తూ ఒక వేగమైన యంత్రాన్ని ఆపడానికి సిద్ధంగావుంది. ఆమె నమ్మకమంతా ఆ కారు నడిపే వ్యక్తిమీదే . . .
సరళమైన ఆమె నమ్మకాన్ని వమ్ముచేయడానికి అతనికి మనసు రాలేదు. అదీకాక, ఇప్పుడు ఆమె చావు వలన తనకేం లాభం? తను ఆత్మహత్య చేసుకోడం తప్పదు; ఈ ముసలమ్మ కోసం కారుని ఆపితే ఏం నష్టం? యువకుడు కోపంతో బ్రేకుమీద కాలువేసాడు; కారు తటాలున రోడ్డుమధ్య కులికి, చక్రాల ఈడ్పు వలన కొన్ని అడుగులు ప్రయాణం చేసి, చివరకి ముసలమ్మ సమీపంలో వచ్చి ఆగింది.
యువకుడు కారు కిటికీనుంచి తొంగిచూసి ఆమెను తిట్టడానికి ముందే ముసలమ్మ అతనికొక దండంపెట్టి, ఒక చెయితో తన వెనుకన దూరంలోవున్న ఒక గుడిశెని చూపి కన్నడంలో ఏమో చెప్పింది; అతను ఆమెను వింతగా చూడగానే అతనికి తన బాష తెలియదని గుర్తించి ఒక చెయితో కృంగించిన తన పొట్టను చూపించింది.
యువకుడు కారునుంచి బయటకి వచ్చాడు. ముసలమ్మ అతని చెయి పట్టుకొని గుడిశెకి దారితీసింది.
యువకుని వాటం, ఆకారం చూసి ముసలమ్మకి భయమేమీ కలగలేదు కాబోలు. అతనితో ఏదో బేరం చేస్తున్నట్టు తన చీర కొంగు అందుకొని తను జాగ్రత్తగా దాచిపెట్టిన ఒక రెండురూపాయలనోటుని తీసి - అది ఎనిమిది మడతలతో ఉంది - అతనికి అందిస్తూ అతని దగ్గర ఏతో ఉపకారం కోరుతున్నట్టు అతని గడ్డాన్ని ప్రేమతో తాకింది. ఆమె చేష్ట యువనికి విడ్డూరంగా కనిపించింది; నవ్వాలనికూడా అనిపించింది.
“సరే, ఈ తమాషా ఏదో చూద్దాం!” అని అతను ఆ రెండు రూపాయలనోటుని పుచ్చుకున్నాడు.
‘ఈ ముసలమ్మకి ఎంత వయస్సుంటుంది?’ అని యువకుడు తనలో తనే అడుక్కున్నాడు. ఇంత వయస్సులో అతను ఎవరినీ ఇంతకుముందు చూసివుండలేదు. బాగా నెఱసిన కనురెప్పలు; దృఢమైన ఎముకలతో నిక్కబొడుచుకున్న దేహం; ఆమె నడకలో మంచి పట్టు ఉంది.
ముసలమ్మ ముందుగా తన చేతికఱ్ఱను ఆనుకుంటూ దారంతా భగవంతుని వేడుకుంటూ అప్ఫుడప్పుడు వెనక్కి తిరిగి యువకునితో మాటాడుతూ నడుస్తూంటే అతను ఆమెను వెంబడించాడు.
అక్కడ ఒక గుడిశెలో ఒక స్త్రీ ప్రసవవేదనలో బాధపడుతోంది. పక్కన ఏ మొగవాడూ లేడనే నమ్మకంతో తన రెండు కాళ్ళనూ యధాలాపంగా విడదీసి, నేలమీద బోర్లపడివుంది. ఆమె దేహంనుంచి బొట్టు బొట్టుగా రక్తమూ, నీరూ కారుతున్నాయి.
ముసలమ్మ తన్నెందుకు ఆ గుడిశెకి రమ్మని చెప్పిందని ఇప్పుడు అతనికి బోధపడింది: నిశ్చయంగా ఆ స్త్రీ ఆ ముసలమ్మ కూతురుగాని, మనవరాలుగాని కాదు; వారిద్దరి సంబాషణ వింటే ఇద్దరికీ ఎటువంటి రక్తసంబంధం లేదని తెలిసింది. యువనికి ముసలమ్మ వైఖరిలో బోధపడిన సారాంశం ఇంతే: ఈ మాత్రం సహాయం చెయ్యడానికి మనసు రాకపోతే మానవజీవితానికి ఏమైనా అర్ధముందా?
యువకుడూ, ముసలమ్మ ఆ స్త్రీని తమ చేతులతో పట్టుకొని కారుకి దారితీసారు. కొంత దూరం నడచిన తరువాత అదేం లాభంలేదని యువకుడు ఆ స్త్రీన్ని తన రెండు చేతులతో ఒక బిడ్డలాగ పుంజుకొని కారుదగ్గరకి నడిచాడు. ముసలమ్మ అతనికి ముందే కారుని చేరుకొని స్త్రీకి కారువెనుక సీటులో కూర్చోబెట్టడానికి సిద్ధం చేసింది. ఇక ఆసుపత్రి ఏ దిశలోవుందని తెలియక యువకుడు ఆలోచనలో పడ్డాడు.
అతని కలతని అర్ధం చేసుకొని ముసలమ్మ తన చేతికఱ్ఱని కారు వెనుకవైపు చూపింది.
యువకుడు మళ్ళీ ఆలోచించాడు: ‘ఈ స్త్రీలకి సహాయం చెయ్యడంవలన నేను కారు దిక్కు మార్చినాకూడా, నా ఆత్మహత్య తలపుని నేను మానుకోలేదు.’ కొంత సమయంముందు చావుకోసం ప్రయాణం చేసిన ఆ కారు ఇప్పుడు దిక్కు మార్చి, కొన్ని అడుగులు వెనక్కి తిరిగి వేగంగా ముందుకు దూకింది.
ఊరూ పేరూ తెలియని ఒక గవర్ణమెంటు ఆసుపత్రిని ఆ కారు చేరుకున్నప్పుడు బాగా తెల్లవారైపోయింది.
యువకునికి తన అవస్థ తలుచుకుంటే విచిత్రంగావుంది. తను ఎదురుచూసినది చావు. కాని ఇప్పుడు చూడబోయేది ఒక కొత్త జన్మ! ‘సరే, ఈ తమాషా ఏదో చూడవలసిందే!’ అని అనుకుంటూ అతను కారుసీటులో నడుం వాల్చాడు. చాలా రోజులుగా విశ్రాంతి, భోజనం, నిశ్చలమైన మనస్సు లేకపోవడం వలన అతని దేహం బాగా అలిసిపోయింది; కన్నురెప్పలు మూసుకున్నాయి; ప్రాతఃకాల పిట్టల కూతలు అతనికి జోలపాటలు పాడాయి; అతనలాగే నిద్రపోయాడు.
గభీమని అతను లేచాడు; అదేం బిడ్డ ఏడ్పా లేక ముసలమ్మ పిలుస్తోందా? ముసలమ్మ కొత్తబిడ్డని చూడమని అతన్ని పిలిచింది. నిగనిగలాడే సూర్యకాంతిలో కన్నులు చిలికించుకుంటూ యువకుడు ఒక నూతన ప్రపంచం దర్శించాడు. అతని చెయిపట్టుకొని ముసలమ్మ ఆసుపత్రి ప్రవేశించింది. ప్రసూతిశాలలో నడుస్తూ, ప్రతీ మంచం దగ్గర ఒక పెద్ద పూల కుండీలాగ ఒక బిడ్డను అతను గమనించాడు.
ముసలమ్మ బిడ్డను దాని తల్లి రొమ్మునించి విడదీసి యువకునికి అప్పగించింది. ఆ బిడ్డను చూసి యువకుడు తనలో చెప్పుకున్నాడు: ‘ఈ బిడ్డ లక్షాధిపతి కాదు. అంతమాత్రాన దీనికి ఈ ప్రపంచంలో జీనించడానికి అర్హత లేదా?’ బిడ్డని తన మొహంకి తీసుకొని అతను ఆశీస్సులు చెప్కూంటే ముసలమ్మ ఇంకొకసారి అతనికి తన కృతజ్ఞత చెప్పుకుంది.
యవకుడు బిడ్డని ముసలమ్మకి అప్పగించి ఆసుపత్రి బయటకి వచ్చాడు. ఉన్నపాటున అతనికి ఏడవాలనిపించింది, కాని ఆపుకున్నాడు. అతనికి ఇప్పుడు మంచి ఆకలి; చాలా రోజులుగా తనేమీ తినలేదని జ్ఞాపకం వచ్చింది. పాకెట్టునుంచి ఆ రెండురూపాయలనోటు - ఆ ముసలమ్మ ఇచ్చినది - బయటకి తీసి ఆసుపత్రి పక్కనవుండే కొట్టుకి వెళ్ళాడు. అతని ఆకలి కొంతసేపట్లో తీరింది. ఇక ఆ బిడ్డ జన్మదినం మనసులో పెట్టుకొని కొన్ని మిఠాయలు కొన్నాడు.
తిరిగి ప్రసూతిశాలకి వెళ్ళి అక్కడున్న లేడీ డాక్టరు, నర్సు, ముసలమ్మ, ఆ నూతన తల్లి - అందరికీ మిఠాయిలు పంచాడు. మిగిలిన చిల్లరతో ఆసుపత్రి ఎదుటవున్న టీ దుకాణంకి వెళ్శాడు.
ఇప్పుడే మొట్టమొదటిసారి అతను సామాన్యులతో, వారిమధ్య కూర్చుండి, టీ తాగుతున్నాడు. వారందరి ముఖాలు బాగా గమనించాడు. ఆ సామాన్య ప్రజలు - ఆడవారూ, మగవారు - సంతోషంగానే ఉన్నారు.
‘వీరందరిలో ఎవరూ లక్షాధిపతులు కారు!’ ఆ తలపే అతనికి ఊరటగా ఉంది; అందువలనే వాళ్ళు సంతోషంగా ఉన్నారు కాబోలు!
గడచిన కొన్ని గంటలలో జరిగిన సంఘటనలలో తను కలుసుకున్న మనుషులు అతనికి జ్ఞాపకంలో వచ్చారు: ఆ మసలమ్మ; ఆమె పోషణలో ప్రసవించిన ఆ స్త్రీ; ఇక ఈ ప్రపంచంలో నమ్మకంతోనూ, విశ్వాసంతోనూ జీవించబోయే ఆ శిసువు; మానవజీవితమనేది ఎటువంటి సామాన్యమైన గ్రామీణుల, పామరుల మధ్య వెలుగుతోందని యువకుడు అర్ధం చేసుకున్నాడు.
‘ఇక నాకూ, వీళ్ళకి భేదం ఏమిటి?’ అని అతను తనలో అడుక్కున్నాడు. అకస్మాత్తుగా, జీవితమనే ప్రవాహం తన్ను తన సొంతభూమినుంచి పెళ్ళగించి వేరే పరాయి భూమిలో నాటి ఒక కొత్త మనుగడకి దారి చూపిస్తున్నట్లు అతను భావించాడు.
టీ తాగి లేచినప్పుడు అతను ఎదుటవున్న తన కారుని చూసాడు. ఎవడో గ్రామస్తుడు కారుదగ్గర నిలబడి డ్రైవరు సీటులో తన్ను వెదుకుతున్నట్లు అతనికి అనిపించింది; ఇంతలో ఇంకొక మనిషి ఆ గ్రామస్తుని చేరుకొని తన చెయితో మన యువకుని చూపాడు.
‘ఏమిటి సంగతి?’ అని అనుకుంటూ యువకుడు త్వరగా తన కారుదగ్గరకి వెళ్ళాడు.
ఆ గ్రామస్తుడు - ఆ ఖాదీ వస్త్రాల మనిషి - కారుపక్కన నిలబడి కన్నడంలో ఏదో చెప్తున్నాడు. యువకునికి భాష అర్ధం కాలేదని తెలుసుకొని ఇంకొకతను అతనికి తమిళంలో చెప్పాడు:
“ఇతను నర్సాపురం - ఇక్కడనుంచి పదిమైళ్ళ దూరంలో ఉంది - వెళ్ళాలంటున్నాడు. ఒక పేషంటు - ఆవిడకి పొట్టలో ఆపరేషన్ అయింది - ప్రయాణం చెయ్యాలి. చాలా జాగ్రత్తగా ఊరు చేరాలి. ఎంత కావాలి?”
యువకునికి ఏమీ బోధపడలేదు; అతని ముఖంలో కలతని చూసి ఆ గ్రామస్తుడు వెంటనే కొన్ని పదిరూపాయల నోట్లని యువకుని చెయిలో పడేసి ఆసుపత్రిలోకి మాయమయ్యాడు.
కొంత సమయం తరువాత ఆ గ్రామస్తుడు, మరొక యువతి - అమెకే ఆపరేషన్ ఐంది - కారులో ప్రయాణంకి సిద్ధమైయ్యారు. ఆ కారు డ్రైవరు కారుని నిదానంగా, అతి బాగ్రత్తగా నడపడం చూసినవారికి ఆ కారు ఒక నూతన జీవితంలో అడుగుపెట్టిందని అర్ధమౌతుంది.
అది ఆ యువకునికి బోధపడి చాలా సేపయింది."
*****