MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
మార్క్సిజాన్ని కధాసాహిత్యంలో ప్రవేశపెట్టిన చాగంటి సోమయాజులు (చాసో)
డా. చాగంటి కృష్ణ కుమారి
చాసో స్వయంగా తను మార్క్సిష్టు దృక్పధంతోనే కధలు రాసాననీ దానికే మొదటినుండీ కట్టుబడి వున్నాననీ చెప్పేవారు. ఈ దృక్పధం వారికి ఎప్పుడు, ఎలా అలవడిందో దానిని కధలలోవారు ప్రవేశపెట్టిన తీరెలా వుందో పరిశీలించి చూద్దాము.
కధా శిల్పిగా పేరు పొందిన చాసో 1915 జనవరి 17వ తెదీన ఉత్తరాంధ్రా శ్రీకాకుళం లో పుట్టి 1994 జనవరి 2 న చెన్నైలో చనిపోయారు. వీరి బాల్య, కౌమార దశలలోని ప్రాపంచిక, దేశీయ పరిస్థితులను పరిశీలించి చూస్తే 1930- 1940 దశకం అతర్జాతీయంగా ఆకొన్న దశకం(Hungry decade). భారతదేశం ఆంగ్లేయుల పాలనలో ఉంది. ఆనాడు ప్రాపంచవ్యాప్తంగా నెలకొని వున్న కల్లోల పరిస్థితులకు అప్పటి మేధావివర్గం తీవ్రంగా స్పందించింది. సమకాలీన సంఘటనలకు రచయితలు స్పందింస్తూ సాహిత్య సృజన చేయాల్సిన అవసరం వుందని భావించింది. 1935లో పారిస్ లో ప్రపంచ రచయితల సదస్సు జరిగింది. లండన్ లో నున్న భారతీయ విద్యార్ధులకు ప్రతినిధిగా సజ్జాద్ జహీర్ హాజర్ అయ్యారు. వీరు ఉర్దు రచయిత, ముఖ్య కమ్యూనిస్టు నేత, భారతీయ కమ్యూనిష్ట్ పార్టి సభ్యుడు. ఇది జరిగిన తరువాత విదేశాలలోనున్న భారతీయ విధ్యార్ధులు ‘ భారత అభ్యుదయ రచయితల సంఘం (Indian Progressive Writers Association) ఏర్పరచి ప్రణాళికను రూపొందించారు. ఆనాడు ప్రధానంగా వున్నఆకలి, దరిద్రం,సాంఘిక అసమానత, రాజకీయ పరాధీనత వంటి సమస్యల మీద కొత్త రచనలు చేయాలనే ప్రధాన ఆశయంతో తీర్మాణాలు చేసారు.
1930-32 సంవత్సరాలలో చాసో విజయనగరం మహారాజా కాలేజీలో ఎప్. ఏ చదువుకొంటున్న విధ్యార్ధి. వయసు 15-17 సంవత్సరాలు. ఆ కళాశాల గ్రంధాలయానికి ప్రతీ వారం వచ్చే టైమ్స్ లిటరరీ సప్లిమెంట్, ‘మెర్క్యురి ‘, టి . యస్ .ఇలియట్ సంపాదకత్వంలో వచ్చే ‘క్రైటీరియన్’ మాసపత్రికలను, కొత్తగా వెలువడిన పుస్తకాలన్నింటి పై విమర్శనాత్మక రచనలతో వచ్చే‘ బుక్ మన్’ పత్రికను చాసో చదివేవారు. గ్రంధాలయానికి వచ్చే పత్రికలలో ఆడెన్ గ్రూపు కవుల గురించి , వారి రచనల మీద వచ్చిన వ్యాసాలను చదివేవారు. ఆడెన్ (W. H. Auden (1907-1973) ముప్పయవ దశకపు తీవ్ర ఆర్థిక మాంద్యంలో వామ పక్షానికి నాయకునిగా పేరుపొందిన ఇంగ్లీషు కవి. వీరూ వీరితో పాటూ లూయీస్ మెక్ నీస(Louis MacNeice), సి.డె లివిస్ (Cecil Day-Lewis) స్టీవెన్ స్పండర్(Stephen Spender), క్రిస్టఫర్ ఇషర్వుడ్(Christopher Isherwood) అయిదుగురు కవుల బృందం ఆడెన్ గ్రూపు కవులుగా గుర్తింపు పొందారు. వామపక్షానికి చెందిన వీరి రచనల గురించి చాసో, అదే కళాశాలలో బి .యే. చదువుకొంటున్న శ్రీ రోణంకి అప్పలస్వామిగారితో కలసి చర్చిస్తూ వుండేవారు. ఈ రచనల ప్రభావంలో పడి కౌమారంలోనున్న చాసో వామపక్ష భావాల వైపుకి మొగ్గేరు. మార్క్సిజమే తన జీవిత దృక్పధంగా చేసుకొన్నారు. సాహిత్యాన్ని చారిత్రక దృక్పధంతో చూడడాన్ని అలవాటు చేసుకొని 1940ల నాటికి కవితలను, కధలను రాయడం మొదలెట్టారు. కొడవంటిగంటి కుటుంబరావు, మాగోఖలే , సెట్టి ఈశ్వరరావు, తెన్నేటి సూరి, మహీధర రామమోహనరావు వంటివారు కూడా రచనలు చేస్తున్న కాలమది.
అభ్యుధయ భావాలు కల రచయితలు, కవులు తెలుగునాట అభ్యుధయ రచయితల సంఘం ఏర్పాటు చేయాలని, దానిని ‘అఖిల భారత అభ్యుధయ రచయితల సంఘానికి అనుబంధంగా చేయాలని సంకల్పించారు. ఫలితంగా 1943 ఫిబ్రవరిలో తెనాలిలో ఆంధ్ర అభ్యుధయ రచయితల సంఘం ఏర్పడింది. దీనికి కార్యవర్గ సభ్యునిగా చాసో ఎన్నికయ్యారు. ఆ తొలి సభకి అద్యక్షత వహించిన తాపీ ధర్మారావుగారు పూర్వపు సాహిత్యం మూడు గాలిమూటలని కట్టి జనసామన్యానికి ద్రోహం చేస్తొందని చెపుతూ, ఆమూటలలో ఒకటి దేముడు, రెండు ప్రణయం, మూడు కర్మ , ఇవి సంఘానికి వేరు పురుగులు అంటూ వీటి మీద ధ్వజం ఎత్తవలసిన బాధ్యత రచయితల మీద ఉందని ఉద్ఘాటించారు. ఇటువంటి నేపధ్యంలో ఎదుగుతున్న చాసో సహజంగానే నిరీశ్వరవాదిగా, మార్క్సిజమే తన జీవిత దృక్పధంగా సాహిత్యాన్ని చారిత్రక దృక్పధంతో చూస్తూ తానూ సాహిత్య సృజన చేయాలని నిశ్చయించుకొన్నారు.
చాసో రచించిన ‘ధర్మక్షేత్రం’ కవిత 1941 జూన్ భారతి మాస పత్రికలో, ‘చిన్నాజీ’ 1942 భారతి మాసపత్రిక, మే నెల లోనూ అదే సంవత్సరం సెప్టెంబర్ మాసంలో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ‘ కర్మ సిధ్ధాంతం’ కధ ఆసరికే అచ్చులో రాగా, 1943 ఫిబ్రవరి నెలలొ అరసం తొలి సభ ప్రత్యేక సంచికలో వారు రాసిన సుప్రసిధ్ధ కధలలో ఒకటైన ‘కుంకుడాకు’ కధ అచ్చు అయింది. వీరి ఈ కవితను, కర్మ సిద్దాంతము, కుంకుడాకు కధలను పరిశీలనాత్మకంగా చదివి చూస్తే చాసో ఏ చారిత్రిక నేపధ్యంలో, ఎటువంటి భావ ప్రాతిపదికన రచనలు చేయడం ప్రారంభించారో సులువుగానే తెలుసుకోవచ్చు.
'ధర్మక్షేత్రం’ కవితలో రెండవ ప్రపంచ యుద్ద భీభత్సాన్ని వర్ణించారు. కర్మ సిధ్దాంతంలో సాంస్కృతీ పరమైన దోపిడిని ఎత్తిచూపారు. కుంకుడాకు కధ పొడుగునా గవిరి కంటే కాస్త ఉన్నవారి తోటి పిల్ల ద్వారా ఆర్ధిక ఎగుడుదీగుడులను చూపుతూ కధ చివరకి అన్యాయంగా చేయని దొంగతనాన్ని గవిరికి బుగత అంటగడితే ఆచిన్నది చాలా తీవ్రంగా తిరగబడి బుగతని “ఓరి లంజకొడుకో...... అంటూ బూతులు తిడుతుంది. ఆకలిగొన్న ఆ పిల్లను శోష వచ్చి పడిపోయేలా తన్నడంలోని బుగత స్వభావాన్ని చాసో ఎత్తి చూపుతారు ఈ తొలి రచనలలోనే చాసో దేనిని అసహ్యించుకొంటున్నాడో దేనిని కోరుకొంటున్నాడొ సునిశిత పాఠకుడు గ్రహించగలడు.
వీరి తొలి కధల సంపుటి – “ చిన్నాజీ ( కధలు)” 1945లో వచ్చింది. దీనిలో 7 కధలను చాసో చేర్చారు. చిన్నాజీ(1942) ఎందుకు పారేస్తాను నాన్నా?(1944) ఊహాఊర్వశి(1944 ) ఎంపు(1945 ) ఏలూరెళ్లాలి(1943) కర్మ సిద్దాంతం(1942 ) మొక్కుబడి(1944) . ఆతరువాత 1968లో వచ్చిన “ చాసోకధలు” తొలి సంపుటిలో 23 కధలను మాత్రమే చేర్చారు. దీని రెండవ సంపుటిలో 40 కధలున్నాయి. వీరి కవితల సంపుటి 1996లో వెలువడింది.
“కళ కళకోసమే అన్నది తప్పుడు సిధ్ధాంతం,కానీ, కధ ఒక ప్రయోజనం కోసం -అంటే-- కళను వదిలేయమని కాదుకదా! ప్రయోజనం కోసం కళని ఉపయోగించాలి” అని నమ్మకంగా చెప్పే చాసో కధా శిల్పానికి ప్రాధాన్యత ఇస్తూ,శిల్పపరంగా తనకు తృప్తినిచ్చేదాకా కధలను తిరగరాసి చూసుకొనేవాణ్ణని చెప్పేవారు. కధలలో మాక్క్సి జమ్ అంతర్లీనమై ప్రాధాన్యతను సంతరించుకొనేలా కృషి చేసారు. వారిది ప్రభోదాత్మకంగా, విప్లవాత్మక మార్పులు తేవాలని అరచి చెప్పే నినాద సాహిత్యం కాదు.
బూర్జువా సమాజంలోనున్న అన్యాయాలూ, దోపిడీ, లంచగొండితనం, మూఢనమ్మకాలు, మనుషుల ప్రవర్తనపై డబ్బు ప్రభావాన్ని, డబ్బు మానవత్వాన్ని మంటగలుపుతున్న తీరునీ, ధర్మాగ్రహంతో అన్యాయానికి ఎదురుతిరిగే సామాన్యులు వెళ్ళగక్కిన ఆక్రోశాన్ని అత్యంత సహజతీరులో, విమర్శనాత్మక వాస్తవికతో వీరి కధలు చిత్రీకరిస్తాయి. అందుకు ఆవెత, కుంకుడాకు, ఎంపు, బండపాటు, కుక్కుటేశ్వరం, చెప్పకు చెప్పకు, కొన్నిఉదాహరణలు మాత్రమే.
వారి ఈ దృక్పధం ప్రత్యక్షంగానూ వాచ్యంగానూ కాక ఎంచుకొన్న కధాస్తువులోనూ, పాత్రల సంభాషణలద్వారా వ్యక్తమయ్యే వారి వారి స్వభావాలలోనూ, సన్నివేశ కల్పనలోనూ కధను పూర్తిగా చదివిన మీదట ఆలోచనలో పడిన పాఠకుని మేధకు తడుతుంది. అసమానతలున్న సమాజిక పరిస్థితులకు ఎదురెడ్డి పోరాడుతూ బతుకులు వేల్లదీసుకొనే అభాగ్యులు కండమాంసాలతో మనకు దర్శనమిస్తారు. విమర్శనాత్మక వాస్తవికతను వీరి కధలన్నింటిలో చూడగలం .
బొండు మల్లెలు, బూర్జువాకుక్క, కుక్కుటేశ్వరం కధలలో దోపిడీ, శ్రమ , పీడన బాగా వాచ్యంగా కనిపిస్తాయి. ఉత్తమ పురుషలో రాసిన బొండుమల్లెలు కధలో “ దోపిడీ చేస్తున్న వాళ్ళకి బొండు మల్లెలమ్మి దోపిడీ చేస్తున్నానను కొన్నాను కానీ తాతని పెద్దదోపిడీ నేనే చేసాను ... దొడ్డి నాది ఫలితం కష్ట పడ్డవాడికి కాకుండాపోయింది“ అనే వాక్యాలతో కధను ముగిస్తూ ఆపాత్రలో కలిగిన భావావేశంగా శ్రమ దోపిడీని వాచ్యం చేసారు.
ఒక బాగాడబ్బున్న స్నేహితుడు ప్రియురాలితో “కధ నడపడానికి” ఆమెను ఊటీ తీసికెళితే అక్కడ ఆ ప్రియురాలు తనతో కూడా తెచ్చుకొన్న ఐరోపా జాతి కుక్క బొర్జొవా( Borzoi) చచ్చిపోతే ఆమె దుఖాన్ని ఖాతరు చేయకుండా తన అమానవీయ ప్రవర్తనను స్వయంగానే వెల్లడిస్తాడు. ఆపాత్రకు ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేవు. ఉన్నదంతా డబ్బు వల్ల వచ్చిన మదమే! అటువంటి పాత్ర ఓ రచతయితకి స్నేహితుడు. ఆ రచయితే మనకి కధ చెపుతూ, ఆవృత్తాంతంపై కధ రాసాననని చెపుతాడు. “ఆ వర్గ జీవితాన్ని దులపవలసిన రీతిగా దులిపి దులిపి రాసాను” అని చివరన అంటాడు. చాసో అంతటితో సరిపుచ్చుకోలేదు కధకి ‘బూర్జువా కుక్క’ అని పేరు పెట్టారు.
‘బండపాటు’ జ్యోతి దీపావళి ప్రత్యేక సంచిక (1968) ‘జంక్షన్ లో బడ్డి’ జ్యోతి మాస పత్రిక (1969) ‘వజ్రహస్తం’ ఆంధ్ర జ్యోతి సచిత్ర వార పత్రిక (1974) కధలు ఇంజనీర్లు కంట్రాక్టర్లు, ఆఫీసర్లు అవనీతితో దోచుకొంటున్న సామాజిక వ్యవస్థకు ప్రతీకలు. కొండగెడ్డ, ఆహాహా (1969) -కధలలొ కొండ ప్రాంతాలలో ప్రోజెక్టుల నిర్మాణంలో ప్రజల సొమ్ము దోచుకొనే యంత్రాంగం , అప్పటి ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి పాఠకుని దృష్టికి అందుతాయి
మానవ జీవితాన్ని సర్వతో ముఖంగా దర్శిస్తూ, మధిస్తూ సమాజంలో మార్పురావాలని కోరుకొంటున్న చాసో --స్త్రీలు అక్రమ సంబంధాలకు లోబడిన వైనాలను వైవిధ్యంగల 5 కధలలో కళాత్మకంగా ఎత్తిచూపారు .
1. ఏలూరెళ్లాలి (1943)లో భార్యాభర్తల మధ్య వయోబేధము, స్త్రీకి ఆస్థి హక్కు లేకపోవడంవల్ల, సంతాన ప్రాప్తికి.
2. లేడీ కరుణాకరం(1944)లో ఆర్ధిక కారణాలవల్ల వ్యభిచారానికి తల్లితండ్రులే ప్రోత్సహించగా, అది అలవాటు కాగా, విలాసాలపైన మోజు పెరిగి, పైపైకి ఎదగడానికి భర్తను ఒప్పించిన స్త్రీ, అందుకు లొంగిపోయిన పురుషుడు.
3. బదిలీ(1945)లో పురుషాధిక్యానికి బలైపోకుండా తననుతాను సంస్కరించుకొని సంసారాన్నినిలబెట్టుకొన్న స్త్రీ.
4. ఆవెత(1952)లో తనకు ఇష్టం లేకుండా బలవంతంగా అప్పుతీర్చడానికి తన తల్లే వ్యభిచారంలోకి దింపగా తన హృదయ వేదనను అత్యంత అధ్బతంగా వెల్లడి చేసిన స్త్రీ రత్నము.
5. చెప్పకు చెప్పకు (1978). ప్రధమ పురుషలో నడిపిన ఈ కధలో ఒక పిల్లల తల్లి మొగుడు చచ్చిపోయాక బ్రతుకును ఓ గాడీలో పెట్టడానికి తన జీవన విధానాన్నీ దృష్టికోణాన్నీ మార్చుకొన్న వైనాన్ని ఎత్తి చూపుతాడు. ఆ తల్లే ఒకప్పుడెప్పుడో తాను పోయిన కోటీశ్వరుడికి – వాడు ఏభై ఏళ్లకు పైబడ్డవాడైనా- తనకూతురును రెండు లక్షలకి అప్పచెపుతుంది. ఆపిల్ల అందుకు సిద్దపడుతుంది. ధనస్వామ్యంలో డబ్బు కోసం ప్రలోభపడి ఆమె ఈ విధంగా ప్రవర్తించింది. బూర్జువా సమజంలో డబ్బుకున్న ఆధిక్యతను బట్టి ఆమె అలా సంచరించిందని చాసో సోమసుందరంగారికి ఈ కధను వివరిస్తూ చెప్పారు.“ ఈ వ్యక్తులు వ్యక్తుల వల్ల మారరు. వ్యవస్థ మారాలి” అంటూ అమె కొడుకు సత్యం నోటితో పలికించిన చాసో తన దృక్పధాన్ని వాచ్యం చేసిన మరొక సందర్భంగా మనం చెప్పుకోవచ్చు.
లేడీ కరుణాకరం(1944) నుండి చెప్పకు చెప్పకు (1978) వరకూ అప్పటినుండి ఈ ఇరవైఒకటవ శతాబ్దంలో అసాధారణ స్థాయిలో జనాలలొ డబ్బుపై పెరిగిన మోజును సమాజంలో చూస్తున్నాము. ఫలితంగా మనుషుల ప్రవర్తనలలో మార్పునూ చూస్తూనే వున్నాము.
అధికారం, అధిక సంపదగల వ్యక్తులు సమాజాన్ని ప్రభావితం చేయగా, ఆ సామాజిక పరిస్థితులు సామాన్యుల జీవితాలపై, ప్రవర్తనపై, జీవితంపట్ల వారి దృష్టి కోణాలపై ప్రభావాన్ని చూపుతూ ఉన్న సందర్భాలను చాసో కధలు ఎత్తిచూపుతాయి. లేమి ఒక పండితుని సైతం పిచ్చివానిగా చేయగల వైనాన్నిపరబ్రహ్మం కధ చెపుతుంది. .
ఉత్తమ పురుషలో రచించిన ఆవెత కధలో చిట్టచివరిగా చాకలి స్త్రీ తన ఆక్రోశాన్నీ కోపాన్నీ వెళ్ళగక్కుతూ శాపనార్ధాలతో తిట్టిపోసిన తీరులో చాసో దేనికి పెద్దపీఠ వేస్తారో దేనిని నిరసిస్తారో అవగాహనకు వస్తుంది .
వాయులీనంలో రాజ్యం, మొక్కుబడి లో అంకి, బొమ్మల పెళ్లి లోని తవ్వ, కర్మ సిధ్ధంతం లోని అత్తాకోడళ్ళు , పోన్తినులో ఓ కొడుకును కన్న గుడిసేటి గున్నమ్మ వంటి పాత్రలు కూడా చాసో కధలలొ చోటు చేసుకొన్నాయి. తన కాలం నాటి మానవజీవితాన్ని సర్వతోముఖంగా దర్శించిన చాసో, వైవిధ్య భరితమైన కధల, పాత్రల సృజనశీలి.
ఏలూరెళ్లలి, బదిలి, లేడి కరుణాకరం కధలను తనకు తోచిన విధాన విశ్లేషిస్తూ “చాసో కథల” ని అభ్యుదయ సాహిత్యంలో భాగం చెయ్యడంలో ఏదో పొరపాటుందని నా అనుమానం” అన్నారు వెల్చేరు నారాయణరావుగారు. డెవిడ్ షుల్మన్ తో కలసి వారు చేసిన చాసో కధల ఆంగ్లానువాదం ‘డాల్స్ వెడ్డింగ్ అండ్ అదర్ స్టోరీస్ ముందు మాటలో చాసోకధలలో మార్క్సిజం లేదని ఖరాఖండీగా తేల్చిచెప్పారు.
“కొంతమంది విమర్శకులు చాసోకు వక్ర భాష్యాలు చెప్పి తీవ్రమైన అన్యాయం చేసారు. అతడు రాసిన చిన్నాజీ అన్న కధను తీసికొని కళాసృష్టి, కావ్య సృష్టి కంటే అచ్చంగా జీవించడంలోనే క్షణం క్షణం మారే అస్థిత్వంలోనే ఆనందం ఉందని ఆయన తేట తెల్లం చేసారు అన్నారంటూ” - వల్లంపాటి వెంకటసుబ్బయ్యగారు “ ఒక రచయిత ప్రాపంచిక దృక్పధాన్ని నిర్ణయించడానికి అతని ప్రాతినిధ్య రచన ఏదో నిజాయితీగా జాగ్రత్తగా నిర్ణయించాలి. “ చేదు పాట “ శ్రీ శ్రీ ప్రాతినిధ్య రచన కానట్టే చిన్నాజీ చాసో ప్రాతినిధ్య రచన కాదు. చిన్నజీ అతని ప్రాతినిధ్య రచన అయిఉంటే ఆ తరువాత అతడు ‘బండపాటు’, కుక్కుటేశ్వరం, కుంకుడాకు లాంటి ఎన్నో కధలు రాసి ఉండేవారు కాదు. చిన్నాజీలో కనిపించేది అయిదేళ్ల కూతురి పట్ల వున్న ప్రేమ. అలాంటి వ్యక్తి నిష్ట సంవేదనలు అందరిలోనూ వుంటాయి” అన్నారు. చాసో రాసిన “భల్లూక స్వప్నం” వ్యంగ్యాత్మక కధను ఉదహరిస్తూ.... “ -మార్క్సిజాన్ని కధాసాహిత్యంలో ప్రవేశపెట్టింది నేనేనని” చాసో సగర్వంగా చెప్పుకొన్నారు కూడా” – చాసోలో సామాజిక చేతన్యమూ అభ్యుదయ దృక్ఫధము ఉన్నాయని... అంగీకరించడానికి మనం ఇంతగా బాధ పడవలసిన పనిలేద” న్నారు.
చాసో 14-04-1993లో కొత్తగూడెం ఆకాశవాణికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిన్నాజీ కధ గురించిన తన భావాన్ని స్పష్టం చేస్తూ “చిన్నాజీతో అయిదు నిముషాలు షేక్స్పియర్ అయిదంకాల కంటే గొప్పవి” అనే భ్రమను కల్పించాను. సామాన్యుడికి ఆ మధుర క్షణాలు అయిదు నిముషాలే అయినా గొప్పవే. కానీ సాహిత్య వేత్తకి కాకపోవచ్చు. ఆ పిల్ల మీద వున్న అనురాగాన్ని వ్యక్తం చేయడానికి అలా చెప్పబడ్డాది. అది యదార్ధమా అంటే ముమ్మాటికీ కాదు” అంటూ వివరించారు.
నిజానికి ఏ సంబంధమూ లేని నాలుగైదేళ్ల పిల్లల మాటలనూ చేష్టలనూ వింటూ, చూస్తూ ఆనందించని సామాన్యులు చాలా అరుదుగా ఉంటారేమో. ఎందుకంటే ఆ ఆకర్షణ ఆ వయసు పిల్లల్లో సహజంగా వుంటుంది. ఆపిల్ల తన పిల్లే అయిన సందర్భంలో ఆ తండ్రి లేదా తల్లి మంచి రచయిత అయితే ఆ పసిదాని పట్ల ఉన్న అనురాగంతో ఆ చేష్టలను కళాత్మకంగా వ్యక్తీకరించవచ్చు.
“చిన్నాజీ చదివినప్పుడు నాకు Charles Lamb ( 1775-1834) రాసిన Dream children గుర్తుకు వచ్చింది. గొప్పరచనగా దానిని ఇంగ్లీషు వాళ్లు ఈనాటికీ మెచ్చుకుంటారు. కాకపోతే అతను వ్యాస రచయిత కనుక దానిని వ్యాస సంపుటిలో చేర్చినందున అది వ్యాసంగా పరిగణించబడుతున్నది. అతను కధారచయిత అయి ఉంటే అది కధా సంపుటంలో చేరి కధగా చెలామణి అయ్యేది. సులభంగా రచించినట్లు అనిపించినా నిజానికి అలాంటివి రచించడం సులభమేమీకాదు, కావాలంటే ఎవరైనా సరే చిన్నాజి లాంటిది రాయడానికి ప్రయత్నించి చూడండి తెలుస్తుంది “ అన్నారు రాచమల్లు రామచంద్రారెడ్డిగారు. కధాశిల్పిగా పేరుపడ్డ చాసో తొలి కధలోనే సాధించిన కళాసృష్టిగా మనం ఈ కధను చెప్పుకోవలసి వుంది. చిన్నాజీ కధ స్వీయానుభవపు వ్యక్తీకరణ కాగా, మాతృధర్మం ప్రకృతిలో పునరుక్తి ధర్మం - ఒక కత్తెరపిట్ట కధ. ఈ రెండు కధలు మినహాయించి మిగిలిన కధలన్నిటిలో చాసో దృక్పధం కొన్నింటిలో స్పష్టంగానూ చాలా కధలలో అంతర్లీనంగానూ కనిపిస్తుంది.
“నా కధలు నేరుగా ప్రజల దగ్గరకు పోలేవు, సమాజిక వ్యవస్థలో మార్పుతీసుకురావాలన్న ఆలోచనలను రేకెత్తించి కార్యకర్తలను ప్రేరేపిస్తే అది కధకునిగా నేను సాధించిన విజయంగా భావిస్తాను" అన్నారు చాసో. తొలి కవిత ధర్మక్షే త్రం (1941), కర్మ సిద్దాంతం కధ(1942 ) మొదలుకొని ఆఖరికధ వఱపు (1988) వరకూ చాసో తన దృక్పధాన్ని, భౌతిక వాదాన్ని మార్చుకోకుండా కట్టు బడి ఉన్నారు. సమసమాజం ఏర్పడిననాడు అన్ని రకాల పీడనలు తొలగిపోతాయని వారి విశ్వాసము. అలా జరగాలని ఆశించారు. ఎప్పటికైనాసరే, అది జరుగుతుందనే ఆశావహంతో బతికారు. మరణానంతరం తన కళ్లను దానం చేయాలని, శరీరాన్ని వైద్య పరిశోధనకు ఇవ్వాలని ఆశించి, నెరవేర్చుకోగలిగిన ధన్యుడు చాసో.
***